సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1064వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. అసాధ్యాన్ని సాధ్యం చేసి చూపించే బాబా తండ్రి
2. బాబా చల్లని కరుణ

అసాధ్యాన్ని సాధ్యం చేసి చూపించే బాబా తండ్రి


"అఖిలాండకోటి బ్రహ్మాండనాయక శ్రీసాయినాథ మహాప్రభూ మీకు కోటానుకోట్ల పాదాభివందనాలు. అనుదినం, ప్రతీ అడుగూ మీ సహాయంతో వేసే భక్తులం మేము నాయనా. ఒక్క క్షణం కూడా మీ కృపావీక్షణాలు మాపై నుండి మరల్చవద్దు. మమ్మల్ని మాయ శిక్షించకుండా కాపాడు తండ్రి". నేను సాయి భక్తురాలిని. ముందుగా సాయి బంధువులందరికీ నమస్కారం. ఈ బ్లాగు నిర్వహించడం ద్వారా ఆ సాయినాథుని కృపాకటాక్ష వీక్షణాలు మా అందరిపై ప్రసరింపజేయుచున్న సాయికి కృతజ్ఞతలు. మీ వల్ల, ఈ బ్లాగు వల్ల మేము ఎంతో భక్తిశ్రద్ధలతో ప్రతిరోజూ ఆ సాయినాథుని మనసారా కొలుచుకుంటున్నాము. ఈ బ్లాగులోని తోటి భక్తుల అనుభవాల ద్వారా మా సమస్యలకు సమాధానాలు లభిస్తున్నాయి అనడంలో సందేహమే లేదు. ఇక నా అనుభవాలలోకి వెళదాం.


నేను, నాతోపాటు మరో ఇద్దరు టీచర్లం దూరప్రాంతంలో పని చేస్తూ ప్రతీరోజూ బస్సులో ప్రయాణం చేస్తుంటాము. రోజూ బస్సు ప్రయాణమంటే విసుగుపుట్టి ఒకరోజు నేను, "బాబా! కారు ఏదైనా పంపొచ్చు కదా. మీ దయవల్ల సుఖంగా వెళ్లిపోతాం" అనుకున్నాను. సరిగ్గా అలా అనుకున్న 3 నిమిషాల్లో మా ముందుగా ఒక కారు స్లో చేస్తున్నట్లు అనిపిస్తే, ఆపి "మమ్మల్ని వైజాగ్‍లో దింపాలి" అని అడిగాము. వెంటనే ఆ కారు నడుపుతున్న అతను, "తప్పకుండా! నేను కూడా వైజాగ్ వెళ్తున్నాను. రండమ్మా!" అని మాకు లిఫ్ట్ ఇచ్చారు. అంతేకాదు ఎన్నో చక్కని విషయాలు తెలియజేశారు. దారిలో మాతో ఉన్న నివేదిత అనే ఆర్.సి.ఎమ్ చర్చికి వెళ్లే క్రిస్టియన్ టీచరు నా దగ్గర సాయి సచ్చరిత్ర చదివింది. అందులోని విషయాల గురించి మేము చర్చించుకున్నాము. అది విన్న కారు నడుపుతున్న అతను, 'సాయి సచ్చరిత్ర పఠనం, అది చేయడం వల్ల కలిగే సాయి అనుగ్రహం గురించి' మాకు చాలా విపులంగా చెప్పారు. దీనినిబట్టి నిజంగా బాబాయే ఆ కారుని పంపారనడంలో నాకు ఏ సందేహమూ లేదు.


అప్పట్లో నేను రోజూ నా బ్యాగులో సాయినాథుని జీవితచరిత్ర పుస్తకాన్ని పెట్టుకుని ప్రయాణంలో చదువుకుంటుండేదాన్ని. అది చూసిన నా సహోపాధ్యాయిని, "ఆ పుస్తకం ఏమిటి?" అని అడుగగా నేను ఆమెతో సాయినాథుని గూర్చి చెప్పాను. ఆమె సంతానం లేక ఎన్నో దెప్పిపొడుపులకు గురవుతూ ఎంతో బాధని అనుభవిస్తుంది. అటువంటి తనకి నేను బాబా గురించి పదేపదే చెప్పడం వల్ల మరియు మా స్కూలులో పనిచేస్తున్న పూజ్య గురుదేవులు అమ్ముల సాంబశివరావుగారి శిష్యులు కూడా పదేపదే బాబా గొప్పతనం గురించి ఆమెతో చెప్పడం వల్ల ఆమె బాబాని కొలవడం మొదలుపెట్టింది. సంతాన విషయంగా వాళ్ల ప్రయత్నాలు వృధా అవుతుంటే ఒకరోజు నేను ఆమెతో, "సంతానం కలిగే వరకూ మీకిష్టమైన పదార్థాన్ని తినడం మానేస్తానని మ్రొక్కుకొమ్మ"ని సలహా ఇచ్చాను. ఆమె వెంటనే, "నా కోరిక తీరితే, శిరిడీ వచ్చి మీ దర్శనం చేసుకునేంత వరకు మాంసాహారం ముట్టన"ని బాబాకి ప్రమాణం చేసింది. అంతే, అత్యంత విచిత్ర రీతిలో ఆమె ఇంట పండంటి బాబు తిరుగాడేలా బాబా ఆశీర్వదించారు. నిజంగా అది ఎంత ఆశ్చర్యకరమైన రీతిలో జరిగిందో చెప్పడం నా వల్ల కాదు, ఆ సర్వాంతర్యామికే ఎఱుక. నేను ఆయన లీలకు ఆశ్చర్యపోతూ ఆయనపట్ల మరింత భక్తిని ధృడపరచుకున్నాను.


ఉద్యోగస్థురాలినైన నేను అన్ని సమయానికి అందుబాటులో ఉండాలని పాత రెఫ్రిజిరేటర్ ఇచ్చేసి సైడ్ బై సైడ్ డోర్స్ ఉండే పెద్ద రెఫ్రిజిరేటర్ తీసుకోవాలని ఎంతగానో అనుకున్నాను. అయితే కొన్ని కారణాల వల్ల నా కోరిక సంవత్సరంపాటు వాయిదాపడుతూ వచ్చింది. చివరికి మా ఇంట్లో వాళ్ళని ఒప్పించగా 2021, డిసెంబర్ 30న కొత్త రెఫ్రిజిరేటర్ మా ఇంటికి వచ్చింది. అయితే నా సంతోషం ఎక్కువసేపు నిలవలేదు. రెఫ్రెజిటర్‍ను వంటగదిలోకి తీసుకు వెళ్తుంటే ఒక ఆర్చి అడ్డం వచ్చింది. దాన్ని తీసుకొచ్చిన వాళ్ళు, "వంటగదిలో ఫ్రిడ్జ్ పెట్టాల్సిన చోట కొత్త రెఫ్రెజిటర్ పెట్టడం అసాధ్యమ"ని చెప్పేశారు. దాంతో, "ఇప్పుడు ఎలా? దీన్ని హాల్లో పెట్టుకోలేము. ముందు వెనుకా చూసుకోవా? ఇవ్వన్నీ ఆలోచించవా?" అని మావారి కోపం. నాకు ఏం చేయ్యాలో తోచలేదు. షాపు అతనికి ఫోన్ చేస్తే, "డోర్స్ విడదీసి, ఫ్రిడ్జ్ ను వంటగదిలోకి తీసుకెళ్లిన తరువాత తిరిగి బిగించొచ్చు" అని చెప్పి డిసెంబర్ 31న ఎల్.జి కంపెనీ టెక్నీషియన్‍ని పంపారు. ఆ టెక్నీషియన్ ఒక డోర్ విప్పినా రెఫ్రిజిరేటర్ వంటగదిలోకి వెళ్ళలేదు. దాంతో అతను కూడా "ఇది మీ వంటగదిలోకి వెళ్లడం అసాధ్యం" అని చెప్పి వెళ్లిపోయాడు. నాకు 'అసాధ్యాలను సుసాధ్యం చేసే మన సాయినాథుడు ఉండగా వేరే వాళ్లని నేను ఎందుకు అడగాలి?' అనిపించి బాబాకి పాద నమస్కారం చేసుకుని, "టెన్షన్ పెట్టకండి బాబా.  రెఫ్రెజిటర్ ఎలాగైనా దాని స్థానానికి వెళ్లేలా చేయండి. అది జరిగితే నేను నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకుని ఆదివారం అని కూడా చూడకుండా  షాపు అతనికి మళ్ళీ ఫోన్ చేశాను. అతను ఏసీ సర్వీసింగ్ చేసే ఇద్దరు టెక్నిషియన్‍లను పంపారు. ఈలోపు నేను బాబా ఊదీ ఫ్రిడ్జ్ లోపల, బయట వ్రాసి సచ్చరిత్ర పుస్తకాన్ని ఫ్రిడ్జ్ పైన పెట్టి చాలా గట్టిగా బాబాను ప్రార్ధించి, 'శ్రీసాయి మార్గబాంధవే నమః' అనే నామం చెప్పుకున్నాను. ఆశ్చర్యం! వచ్చిన టెక్నీషియన్‍లు 20 నిమిషాల్లో ఫ్రిడ్జ్ రెండు తలుపులు విప్పి, దాన్ని వంటగదిలోకి తీసుకెళ్లి డోర్స్ మళ్ళీ బిగించి దాని స్థానంలో దాన్ని నిలిపి వెళ్లిపోయారు. అంతే మూడు రోజుల నా టెన్షన్ ఒక్కసారిగా ఎగిరిపోయింది. అది నా సాయినాథుని మహిమ. ముందు రెండు రోజుల్లో వచ్చిన వారంతా అసాధ్యమని చెప్పి వెళ్లిపోయినా బాబా ఊదీ రాసి, మనసారా ప్రార్థిస్తే మార్గం చూపి అసాధ్యాన్ని సాధ్యం చేసి చూపించారు బాబా తండ్రి. "మీకు శతకోటి పాదాభివందనాలు బాబా. గుర్తొచ్చినవన్నీ ఈసారి బ్లాగులో వ్రాయాలని అనుకుంటూ ఉంటాను. కానీ చిన్నా, పెద్దా ఎన్ని అనుభవాలని వ్రాయగలం తండ్రీ? నన్ను వేధిస్తున్న సమస్యలకు సమాధానం చూపి మరలా నా అనుభవాలు బ్లాగులో పంచుకునేలా ఆశీర్వదించు తండ్రి".


బాబా చల్లని కరుణ


శ్రీసాయినాథాయ నమః!!! ముందుగా 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు నిర్వహిస్తూ సాయి లీలలను భక్తులకు అందజేస్తున్న బ్లాగు నిర్వాహక బృందానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ఒక సాయి భక్తుడిని. నాకు పెళ్ళై సంవత్సరంన్నర అవుతుంది. ఒకసారి నా భార్య గర్భవతి అయిన మూడవ నెలలో గర్భం పోయింది. ఆ తరువాత చాలా నెలల వరకు తను గర్భం దాల్చలేదు. నేను శిరిడీ వెళదామని అనుకున్నప్పటికీ కరోనా వల్ల వెళ్లలేకపోయాను. కనీసం బాబా ఊదీ అయినా దొరికితే బాగుండేదని మనసులో అనుకున్నాను. సరిగా అదే సమయంలో నాకు పరిచయమున్న ఒకతను శిరిడీ వెళ్లొచ్చి నేను అడగకుండానే నాకు బాబా ఊదీ ఇచ్చారు. మనసులో అనుకున్నంతనే ఊదీ ప్రసాదించిన ఆ సాయినాథుని కరుణకు చాలా సంతోషించాను. ఆ ఊదీని ఇంటికి తీసుకెళ్లి సాయినాథుని తలుచుకుని నేను పెట్టుకుని, నా భార్యకి కూడా పెట్టాను. ఆ నెల నా భార్యకు రావాల్సిన నెలసరి రాలేదు. టెస్ట్ చేయిస్తే, ఆ సాయి భగవానుని అనుగ్రహం వల్ల ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది. వెంటనే డాక్టరు దగ్గరికి వెళ్లి స్కానింగ్ చేయించాము. డాక్టరు నా భార్య ప్రెగ్నెంట్ అని నిర్థిరించారు. కాని బేబీ వీక్‍గా ఉందని, హర్ట్ బీట్ కూడా తెలియట్లేదని కొన్ని మందులు రాసి, వాటిని వాడి 15 రోజుల తరువాత రమ్మన్నారు. మేము ప్రతిరోజూ బాబాని తలుచుకుంటూ ఆ 15 రోజులు గడిపాము. 15 రోజుల తరువాత సాయినాథునికి నమస్కరించి హాస్పిటల్‍కి వెళ్ళాం. డాక్టరుని కలిసాక, ఆవిడ "స్కానింగ్ చేయాలి. ఒకవేళ బేబీ గ్రోత్ ఉంటే పర్వాలేదు, లేదంటే కష్టం" అని అన్నారు. వెంటనే నేను సాయిబాబాకి నమస్కరించి, "రిపోర్టు సానుకూలంగా వస్తే, మీ 'సాయి మహారాజ్ సన్నిధి'  బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. నమ్మిన వారిని బాబా ఎల్లప్పుడూ కంటికి రెప్పల కాపాడుతుంటారు కదా! ఆ తండ్రి దయవల్ల బేబీ గుండె స్పందన తెలిసింది. అప్పుడు డాక్టరు "అంతా బాగుంది" అని చెప్పగానే మేము ఊపిరి పీల్చుకున్నాం. కానీ, "స్కానింగ్‍లో చిన్న సిస్ట్ కనిపించింది. 3 ఇంజెక్షన్స్ వేస్తే, అది నయమైపోతుంది. కంగారుపడాల్సిందేమీ లేదు" అని డాక్టర్ చెప్పారు. తరువాత 2022, జనవరి నెల చివరి వారంలో మేము సాయి భగవానుని ప్రార్థించి మళ్ళీ హాస్పిటల్‍కి వెళ్ళాం. డాక్టరు స్కాన్ చేసి, "సిస్ట్ చాలావరకు నయమైంది. బిడ్డ ఆరోగ్యం ఇప్పుడు బాగుంది. ఈసారి వచ్చినప్పుడు బిడ్డ పరిస్థితిని చూద్దాం. బాగుంటే ఇంజెక్షన్ అవసరం ఉండదు" అని చెప్పారు. ఇదంతా సాయిబాబా మా మీద చూపించిన ప్రేమ. బాబా దయవల్ల ఈసారి డాక్టరుని సంప్రదించినప్పటికీ ఆ సమస్య పూర్తిగా సమసిపోవాలని కోరుకుంటున్నాను. అలా జరిగితే, బ్లాగులో పంచుకుంటాను. ఆ సాయినాథుని ఆశీస్సులు భక్తులందరిపై ఉండాలని కోరుకుంటున్నాను. "ధన్యవాదాలు బాబా".


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై!!!



సాయిభక్తుల అనుభవమాలిక 1063వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా అనుగ్రహంతో ప్రతి సమస్యా పరిష్కారమవుతుంది
2. కోరిక తీర్చిన బాబా
3. బాబాకి దక్షిణ సమర్పణ

బాబా అనుగ్రహంతో ప్రతి సమస్యా పరిష్కారమవుతుంది


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీసచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


ముందుగా ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయికి, సాయిబంధువులకు నమస్కారాలు. బ్లాగులోని భక్తులందరి అనుభవాలు చదువుతుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది, బాబాకు దగ్గరగా ఉన్న అనుభూతి కలుగుతుంది. ఇంకా ఏదైనా సమస్య వచ్చినప్పుడు బాబా లీలలను మననం చేసుకుంటే, ఆ సమస్య నుండి బయటపడేందుకు పరిష్కారం లభిస్తుంది. నాపేరు చైతన్య. నేను చాలాసార్లు నా అనుభవాలు మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలను పంచుకోవాలనుకుంటున్నాను. ఒకరోజు మావారు, మా అత్తయ్య, మామయ్య ఊరు వెళ్లారు. వాళ్ళు అక్కడి నుండి తిరిగి బయలుదేరేటప్పుడు నాకు ఫోన్ కాంటాక్ట్ లో ఉన్నారు. కానీ మరో గంటలో విజయవాడలో మా ఇంటికి చేరుకుంటారనగా మావారు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. నేను చాలాసార్లు ఫోన్ చేశాను. ఆయన ఫోన్ రింగ్ అవుతుంది కానీ, లిఫ్ట్ చెయ్యట్లేదు. మా అత్తయ్య, మామయ్యల ఫోన్ స్విచ్చాఫ్ వస్తుంది. ఇక నాకు చాలా భయమేసి, "బాబా! వాళ్లకి ఏమీ కాకూడదు. వాళ్ళు క్షేమంగా ఇంటికి చేరుకునేలా మీరే చూడండి బాబా. వాళ్ళు క్షేమంగా తిరిగి వస్తే 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. అరగంట తర్వాత మావారు ఫోన్ చేసి, "ఫోన్ సైలెంట్‍లో ఉండిపోయింది, నేను చూసుకోలేదు. మేము సిటీలోకి వచ్చేసాము" అని చెప్పారు. నాకు చాలా సంతోషంగా అనిపించి బాబాకు ధన్యవాదాలు తెలుపుకున్నాను. మనకి ఏ సమస్య వచ్చినా సరే బాబా మీద భారం వేసి, శ్రద్ధ, సబూరీలతో ఉంటే ఆయన మనల్ని, మన కుటుంబాన్ని ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటారు.


ఒకరోజు మా కారుని శుభ్రపరుస్తుంటే బ్యాటరీలోకి నీళ్లు చేరి బ్యాటరీ డౌన్ అయింది. అందుచేత కారు స్టార్ట్ అవ్వలేదు. అప్పుడు నేను, "బాబా! కారు స్టార్ట్ అయ్యేటట్టు చూడండి. మాకు అర్జెంటుగా కారు అవసరం ఉంది" అని బాబాకి చెప్పుకున్నాను. కొద్దిసేపటికి దగ్గరలో ఉన్న ఒక మెకానిక్ వచ్చి బ్యాటరీ బాగుచేయడంతో ఒక గంటలో కారు బాగైంది. అదేరోజు మా ఇంటిలో ఉన్న గీజర్ పనిచేస్తూ చేస్తూ హఠాత్తుగా ఆగిపోయింది. అప్పుడు కూడా నేను బాబాని తలచుకుని, "బాబా! గీజర్ పని చేసేలా చూడండి" అని వేడుకున్నాను. తరువాత మెకానిక్ చూసి, "గీజర్ ప్రాబ్లం ఏమీ లేదు. పవర్ కనెక్షన్ లూజవ్వటం వల్ల పని చేయడం లేద"ని చెప్పి సరిచేసాడు. దాంతో గీజర్ మంచిగా పని చేసింది. అంతా బాబా దయ.


2022, సంక్రాంతికి మా కుటుంబమంతా కలిసి మా ఊరు వెళదామని అనుకున్నాము. కానీ మా పెద్దబాబుకి పరీక్షలు ఉండటం వల్ల వెళ్లలేని పరిస్థితి వచ్చింది. అక్కడ చూస్తే మా అత్తయ్యవాళ్ళు మేము వస్తామని నెలరోజులుగా ఎదురు చూస్తున్నారు. ఆ స్థితిలో మాకు ఏం చేయాలో అర్థం కాలేదు. చివరికి నేను మా వారితో, చిన్నబాబుతో, "మీరు వెళ్ళండి. మేమిద్దరం ఇక్కడ  ఉంటాము" అని చెప్పాను. కానీ నన్ను వదిలి ఎక్కడికీ వెళ్లని మా చిన్నబాబు, "నువ్వు రావాలి. నువ్వు వస్తేనే నేను వెళ్తానమ్మ. లేదంటే నేను వెళ్ళను, ఇక్కడే ఉంటాను" అని అన్నాడు.


సాయిభక్తుడు కాకాసాహెబ్ దీక్షిత్ బాబా దేహత్యాగం చేసిన తరువాత వారి అనుమతి తీసుకోవడానికి చీటీలు వేసి నిర్ణయం తీసుకునే వారని మనం శ్రీసాయి సచ్చరిత్రలో చదువుకున్నాము కదా! మేము కూడా ఏదైనా పని చేయాలా, వద్దా అనుకున్నప్పుడుగానీ, ఎక్కడికైనా వెళ్లాలా, వద్దా అన్నప్పుడుగానీ నిర్ణయం తీసుకునే ముందు చీటీలు వేసి బాబా నిర్ణయం తెలుసుకుని దాదాపు తదనుగుణంగా నడుచుకుంటాము. మా పిల్లలకి కూడా నేను అదే అలవాటు చేశాను. అలా చేయడం వల్ల ఆటంకాలు లేకుండా పనులు సక్రమంగా జరుగుతాయి. సరే, మా బాబు ఊరు వెళ్లాలా, వద్దా అనే విషయంలో కూడా నేను బాబా నిర్ణయం కోసం చీటీలు వేసాను. అప్పుడు బాబా సమాధానం 'వెళ్ళమ'ని వచ్చింది. కానీ బాబు ఏమంటాడో ఏమిటోనని నేను, "బాబా! చిన్నబాబు ఊరికి వెళితే, 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. బాబా అద్భుతం చేసారు. ముందురోజు వెళ్లనంటే వెళ్లానని అల్లరి చేసిన చినబాబు మరుసటిరోజు ఉదయం లేచాక, "నేను వెళతాను. బాబా చెప్పారు కదా" అని చెప్పి సంతోషంగా వెళ్ళాడు. "ధన్యవాదాలు బాబా. అందరినీ కరోనా మహమ్మారి నుండి రక్షించండి బాబా".


కోరిక తీర్చిన బాబా


సాయి బంధువులందరికీ నమస్కారం. ఈ బ్లాగు నిర్వహిస్తున్న వాళ్ళకు బాబా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. నేను ఒక సాయి భక్తురాలిని. మేము హైదరాబాద్‍లోని ఎల్.బి.నగర్‍లో నివాసముంటున్నాము. ఏడు నెలల క్రితం మా అమ్మాయి తన ఆఫీసుకు దగ్గర అని కూకట్‍పల్లిలో ఉంటుండేది. తనకి ఆఫీసులోని తన బాస్ వలన టార్చర్ ఎక్కువగా ఉండడం వల్ల తను వేరే ఉద్యోగం కోసం ప్రయత్నిసుండేది. అయితే తనకి హైదరాబాదులోనే ఉద్యోగం చేయాలని చాలా ఆశ. అందువలన తను హైదరాబాదులో చాలా ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసింది. కాని  ఎంత ప్రయత్నించినా తనకి హైదరాబాదులో కాకుండా బెంగుళూరులో ఉద్యోగం వచ్చింది. మా అమ్మాయి వచ్చిన ఉద్యోగాన్ని వదులుకోలేక, మరోపక్క మా అందరినీ వదలివెళ్లలేక నరకం చూసింది. కానీ తప్పనిసరై తను బెంగుళూరు వెళ్ళడానికి సిద్ధమైంది. తను కూకట్‍పల్లి నుండి బయలుదేరడానికి ముందురోజు, "నీ దగ్గరికి వస్తామ"ని మేము ఎంత చెప్పినా తను, "వద్దు" అని ఖండితంగా చెప్పింది. ఎందుకంటే, మమ్మల్నందరినీ వదిలి వెళ్ళటం తనకి అస్సలు ఇష్టం లేదు. అలాంటిది మేము తన దగ్గరికి వెళితే, తనకున్న బాధ ఇంకా ఎక్కువ అవుతుంది. అందుకే మమ్మల్ని రావద్దని అంత ఖండితంగా చెప్పింది. అందుకని మేమెవరమూ తన దగ్గరికి వెళ్ళలేదు. మా అమ్మాయి బెంగుళూరు వెళ్ళిపోయింది. ఆ ముందురోజు రాత్రంతా తను విపరీతంగా ఏడ్చిందని తన స్నేహితుల ద్వారా మాకు తరువాత తెలిసింది. తను అంతలా బాధపడటానికి కారణం లేకపోలేదు. మా అమ్మాయి చదువు రిత్యా మాకు దూరంగా కొంతకాలం లక్నోలో ఉంది. చదువు అయిపోయిన తర్వాత తనకి బెంగుళూరులో ఉద్యోగం వచ్చింది. అక్కడినుండి తను బదిలీ మీద పూణే వెళ్ళింది. తరువాత హైదరాబాదు వచ్చి తల్లిదండ్రుల దగ్గరే ఉండాలని ఇక్కడే వేరే ఉద్యోగం చూసుకుంది. 'చదువు, ఉద్యోగం అంటూ ఇన్ని రోజులు దూరంగా ఉన్నాను. ఇప్పుడైనా హైదరాబాదులో కుటుంబంతో  ఉండాలన్నది' తన కోరిక.


మా అమ్మాయి అంతలా బాధపడిందని తెలిసాక మా అమ్మాయిని తలుచుకుని నేను చాలా బాధపడేదాన్ని. ఒకరోజు బాబాకి పూజచేస్తూ బాగా ఏడ్చాను. తరువాత బాబాకి దణ్ణం పెట్టుకుంటూ, "బాబా! మా అమ్మాయికి మంచి ఉద్యోగాన్ని ఇచ్చావు కానీ, బెంగుళూరుకి పంపేసావు. 5, 6 సంవత్సరాల నుండి అమ్మాయికోసం పెళ్ళి ప్రయత్నాలు చేస్తున్నాము. కానీ సంబంధాలు కుదరటం లేదు. తనకి పెళ్ళి అవ్వడం లేదని, ఇష్టం లేకున్నా దూరంగా ఉంటుందని మేము చాలా బాధపడుతున్నాము. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. తొందరగా అమ్మాయి హైదరాబాదుకి తిరిగి వచ్చేలా చేయండి. బెంగుళూరు నుంచి హైదరాబాదుకి ట్రాన్స్ ఫర్ అయ్యేలా చేయండి, లేదా వేరే ఏ ఉద్యోగమైనా హైదరాబాదులో ఇప్పించండి" అని బాబాకి మొరపెట్టుకుని చాలా ఏడ్చాను. తరువాత saileelas.com వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నప్పుడు "బాబా! నా సమస్యకి సమాధానం సాయి వచనంలో రావాలి"  అని బాబాకి దణ్ణం పెట్టుకున్నాను. అప్పుడు సైటులో "నీ కోరిక త్వరలో తీరుతుంది" అని వచ్చింది. సరిగ్గా మా అమ్మాయి బెంగుళూరు వెళ్ళిన 7 నెలలకి 2022, జనవరి 20న తనకి 'స్టార్ మా'లో మంచి ప్యాకేజీతో హైదరాబాదులో ఉద్యోగం వచ్చిందని తెలిసి నేను పట్టలేని ఆనందంతో ఏడ్చేసాను. "ధన్యవాదాలు బాబా. మా ఇద్దరమ్మాయిలకి పెళ్లి చేయాలని 5, 6 సంవత్సరాల నుండి సంబంధాలు చూస్తున్నాము. ఈ విషయంలో మీరు తప్ప ఎవ్వరూ సహాయం చేయలేరు బాబా. మీ సహాయం కోసం కంటతడితో ఎదురు చూస్తున్నాను తండ్రి. పెళ్ళి పరంగా అయినా, ఉద్యోగపరంగా అయినా పిల్లలిద్దరినీ హైదరాబాదులోనే స్థిరపరచండి. పిల్లల బాధ నేను చూడులేను సాయి". ఆనంద భాష్పాలతో మరోసారి నా తండ్రి సాయికి కృతజ్ఞలు చెప్పుకుంటూ... సెలవు తీసుకుంటున్నాను.


బాబాకి దక్షిణ సమర్పణ


సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!! నా పేరు తిరుమల కృష్ణ. నేను చిన్నప్పటి నుండి బాబానే నమ్ముకున్నాను. నేను, నా కుటుంబం సంతోషంగా ఉన్నామన్నా, నాలుగు ముద్దలు మా నోట్లోకి వెళ్తున్నాయన్నా అదంతా సాయిబాబా దయే. ఆ బాబా దయ అందరి మీదా ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. నేను ప్రతి గురువారం గుడికి వెళ్లి బాబాకి 11/- దక్షిణ సమర్పించుకుంటూ ఉంటాను. ఎప్పుడైనా గుడికి వెళ్ళడానికి కుదరక బయట ఉన్నప్పుడు నన్ను ఎవరైనా భిక్ష అడిగితే, నా చేతికి ఎంత వేస్తే అంత వాళ్ళకి ఇచ్చి బాబాకే ఇచ్చినట్లు భావిస్తాను. ఎందుకంటే, ఆయా వ్యక్తుల రూపంలో బాబానే ఉన్నారన్నది నా ప్రగాఢ విశ్వాసం. 2021, డిసెంబర్ 30 గురువారంనాడు నేను టెంపుల్‌కి వెళ్లాల్సి ఉండగా అనుకోకుండా నా బైక్ సర్వీసింగ్ కోసం వెళ్లాల్సి వచ్చింది. నేను సర్వీసింగ్ షాప్ దగ్గర ఉండగా ఒకరు బిక్షకోసం వస్తే, నేను 5 రూపాయలిచ్చి, 'బాబాకి 5 రూపాయలు ఇచ్చేశాను. ఇంకా 6 రూపాయలు ఇవ్వాలి' అని అనుకున్నాను. కొంతసేపటి తరువాత నా పక్కనే నా స్నేహితుడు, షాప్ యజమాని ఉన్నప్పటికీ ఒక ఆమె నేరుగా నా దగ్గరకే వచ్చి డబ్బులు కావాలన్నట్లు చేయి చాచింది. నేను మారు మాట్లాడకుండా ఎంత చేతికి వస్తే, అంత ఇచ్చేద్దామని జేబులో చేయిపెడితే 5 రూపాయలు వచ్చాయి. ఆ డబ్బులిస్తే ఆమె మాటైనా మాటాడకుండా వడివడిగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. అప్పుడు, 'సాయే ఆమె రూపంలో వచ్చి దక్షిణ స్వీకరించార'ని నాకు సంతోషంగా అనిపించి, "బాబా! నేను ఈరోజు మీకు ఇవ్వాల్సిన దక్షిణను సమర్పించుకున్నాను" అని అనుకున్నాను.



సాయిభక్తుల అనుభవమాలిక 1062వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. అద్భుతంగా ఇంట్లోనే అనుగ్రహించిన బాబా
2. బాబా ఆశీర్వాదం ఉంటే చాలు ఏ సమస్యా ఉండదు
3. బాబా ఉండగా ఎలాంటి లోటూ ఉండదు

అద్భుతంగా ఇంట్లోనే అనుగ్రహించిన బాబా


నాపేరు మాధవి. మేము భువనేశ్వర్‌లో నివాసముంటున్నాము. నేను చాలా రోజుల నుంచి బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని వ్రాయాలనుకుంటూ కూడా సమయం లేక వ్రాయలేకపోయాను. కానీ నా మనసుకి, "నా లీలలు అంటే నీకు అంత చులకనా, నా పిల్లలతో పంచుకోవా?" అని బాబా అంటున్నట్లుగా అనిపించి సమయం చేసుకుని మరీ ఈ అనుభవాన్ని వ్రాస్తున్నాను. అందరూ చదివి బాబా దివ్యత్వానికి ఆనందిస్తారని నా నమ్మకం. 2021 చివరిలో నాకు ఢిల్లీకి చెందిన సీమ అనే అమ్మాయితో పరిచయమైంది. ఆమె కూడా బాబా భక్తురాలు. తను బాబాకోసం డ్రెస్సు కుట్టి శిరిడీకి పంపుతుందట. ఈ మధ్య శిరిడీ సంస్థాన్‍‍లో నిబంధలనలు మారాయి. వాటి ప్రకారం మనం బాబాకి డ్రెస్సు ఇవ్వాలంటే శిరిడీలోని డొనేషన్ కౌంటరులో ఆ డ్రెస్సు ఇవ్వాలి. వాళ్ళు మనమిచ్చే డ్రెస్సుకు ఒక ధరని నిర్ణయించి మనకి బిల్ ఇస్తారు. ప్రతినెల 25వ తేదీన లక్కీ డ్రా తీస్తారు. ఉదాహరణకు జనవరి నెలలో ఏ రోజు, ఏ ఆరతికి, ఏ భక్తులు పంపిన డ్రెస్సు బాబా వేసుకోవాలన్నది ముందు నెల అంటే డిసెంబర్ 25న లక్కీ డ్రా ద్వారా నిర్ణయిస్తారన్నమాట. నాకు ఈ విషయాలన్నీ సీమనే చెప్పింది. అంతా విన్న నేను సీమతో, "నా తరపున నువ్వే ఒక డ్రెస్సు కుట్టి శిరిడీకి పంపు" అని చెప్పాను. శిరిడీలోని బాబాకు మూడు మీటర్లు, సమాధికోసం మూడు మీటర్లు అంటే మొత్తం ఆరు మీటర్ల వస్త్రం తీసుకోవాల్సి ఉండగా అదనంగా మరో అర మీటరు కూడా తీసుకోమని నేను సీమతో చెప్పాను. అలా ఎందుకు చెప్పానో నాకే తెలీదు. బహుశా బాబానే నాతో అలా చెప్పించి ఉంటారు. సరే, సీమ నేను చెప్పినట్లే ఢిల్లీలో ఒక వస్త్రం కొని దాన్ని చక్కగా కుట్టి శిరిడీకి పంపింది. తను నాతో, "ఆంటీ, బాబా మీ డ్రెస్సు జనవరి 1న కాకడ ఆరతికి వేసుకుంటారు" అని అంటుండేది. అదే నా మనసులో పడిపోయింది. నేను ఎంతో ఆనందపడుతూ చాలా ఆశ పెట్టుకుని, ఖచ్చితంగా లక్కీ డ్రాలో నేను పంపే డ్రెస్సు ఆరోజుకి ఎంపిక అవుతుందని అనుకునేదాన్ని. నేను ఎంత పిచ్చిదాన్నో తరువాతకానీ, నాకు తెలీలేదు. ఇకపోతే, సీమ పంపిన డ్రెస్ డిసెంబర్ 15కి శిరిడీ చేరింది. నాకు తెలిసిన ఒక అతను ఆ డ్రెస్సుని డొనేషన్ కౌంటరులో ఇచ్చాడు. ఇంకా డిసెంబర్ 25 ఎప్పుడు వస్తుందా! అని నేను ఎదురుచూసాను. చివరికి ఆరోజు రానే వచ్చింది. తీరా చూస్తే నేను పంపిన డ్రెస్సు అస్సలు ఎంపిక కాలేదు. నాకు ఆ విషయం డిసెంబర్ 29న తెలిసింది. ఇంక నా దుఃఖం వర్ణణాతీతం. నాలాంటి వాళ్ళు ఎక్కువ ఆశపెట్టుకుంటారు, జరగకపోతే అతిగా దుఖఃపడతారు. ఎన్నోసార్లు సాయిచరిత్ర చదువుతాము. అయినా ఆయన అడిగిన రెండు పైసలలో ఒకటైన 'శ్రద్ధ'నిస్తాం కానీ 'సబూరీ' అనే రెండో పైసాను ఇవ్వము. ఓపిక ఉండదు, ఆయన అనుగ్రహం కోసం అస్సలు ఎదురుచూడము. సరే, బాబా ఎంత చక్కగా అనుగ్రహించారో చూడండి!.  


2021, డిసెంబర్ 29 ఉదయం నేను సీమకి ఫోన్ చేసి "నా డ్రెస్సు ఎంపిక కాలేద"ని చెప్పాను. ఆ అమ్మాయి, "అయ్యో! అవునా ఆంటీ? అవుతుంది అనుకున్నాను" అని మౌనంగా ఉండిపోయింది. ఆరోజు మధ్యాహ్నం ఆమెకు, "నీ దగ్గర అదనంగా తీసిన అరమీటరు వస్త్రం ఉంది కదా! శిరిడీలో ఎలా ఇచ్చావో, అదేవిధంగా ఆ వస్త్రాన్ని కుట్టి పంపు" అని ఎవరో తన చెవిలో చెప్తున్నట్లు అనిపించిందట. వెంటనే ఆ అమ్మాయి ఆ అరమీటరు వస్త్రంతో మా ఇంట్లో ఉన్న బాబాకోసం శిరిడీకి పంపిన డ్రెస్సులానే కుట్టి 2021, డిసెంబర్ 30న భువనేశ్వర్‌కు పంపింది. అక్కడి పోస్టుమ్యాన్ జనవరి 2 లేదా 3 తారీఖులలో చేరుతుంది అని చెప్పారట. కానీ డిసెంబర్ 31 సాయంత్రానికే ఆ డ్రెస్సు భువనేశ్వర్ చేరింది. అంటే కేవలం ఒక్కరోజులో వచ్చేసింది. నేను ఆఫీసు నుండి ఇంటికెళ్లి చూస్తే, బాబా డ్రెస్సు మా ఇంట్లో ఉంది . ఇంకా నా ఆనందానికి అవధులు లేవు. కళ్ళ నుండి నీళ్ళు కారిపోయాయి. జనవరి 1న నేను ఇచ్చిన డ్రెస్సు బాబా వేసుకోవాలన్న నా కోరికను బాబా విన్నారు. కాకపోతే శిరిడీలో కాదు. మా ఇంట్లో నా చేతుల మీదుగా నా డ్రెస్సు వేసుకుని నన్ను కృతార్థురాలిని చేశారు బాబా. నేనిచ్చిన డ్రెస్సు ఆయన శిరిడీలో వేసుకుని ఉంటే, నేను నేరుగా చూడలేకపోయేదాన్ని. ఇప్పుడు మా ఇంట్లోనే బాబాను ఆ డ్రెస్సులో ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను చూసుకోవచ్చు. "నేను శిరిడీలోనే లేను. నా విగ్రహం, నా ఫోటో ఎక్కడ ఉంటే, నేను అక్కడ ఉంటానని తెలుసుకో" అని బాబా స్వయంగా చెప్పిన మాటను ఈ లీల ద్వారా నాకు ఋజువు చేసారు. నేను పంపిన డ్రెస్సు ఎంపిక కాలేదన్న నా దుఃఖాన్ని బాబా చూడలేకపోయారు. ఆ అమ్మాయికి ప్రేరణనిచ్చి సరైన సమయానికి మా ఇంటికి చేరుకున్నారు. కరోనా కాలంలో మేము శిరిడీ పోలేకుండా ఉన్నందుకు ఆయనే మా ఇంటికి వచ్చి నన్ను సంతోషపెట్టారు. 'సహస్రశీర్షం వేదం, విశ్వాక్షం విశ్వసంభవం' అని వేదంలో చెప్పినట్లు ఆయన విశ్వమంతా వ్యాపించి ఉన్నారు. ఇంతకన్నా నా సంతోషాన్ని ఎలా పంచుకోను? బాబా కృపను తెలియపరచడానికి నాకు పదాలు కరువవుతున్నాయి.


బాబా ఆశీర్వాదం ఉంటే చాలు ఏ సమస్యా ఉండదు


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీసమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


సాయి బంధువులకు మరియు 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు నిర్వహిస్తున్న సాయికి నా నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. సాయి కల్పవృక్షము, పిలిస్తే పలికే దైవం. బాబా ఎప్పుడూ నా వెంటే ఉన్నట్టు అనిపిస్తుంది. బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. రెండు సంవత్సరాలుగా నా నెలసరి విషయంలో కొంచం సమస్య ఉంది. డాక్టర్ల చుట్టూ తిరుగుతున్నాను కాని, ఆ సమస్య పరిష్కారం కావట్లేదు. ఇక బాబానే ఆ సమస్యకి పరిష్కారం చూపాలి. ఇకపోతే 2021, డిసెంబర్ నెలలో నేను ధనుర్మాసం పూజ చేయాలని అనుకున్నాను. కానీ నెలసరి సమస్య వలన నాకు నెలలో వారం, పది రోజులకి మించి పూజచేసే అవకాశం ఉండట్లేదు. అందువలన నేను బాబాను, "బాబా! ఈ ధనుర్మాసంలోనైనా వీలైనన్ని ఎక్కువ రోజులు పూజ చేసుకునే అవకాశాన్ని ప్రసాదించండి" అని వేడుకున్నాను. బాబా నాపై చాలా దయ చూపారు. నేను మొత్తం 18 రోజులు పూర్తి చేసుకోగలిగాను. "ధన్యవాదాలు సాయి. మీ ఆశీస్సులు ఉంటేనే ఎవరైనా ఏదైనా చేయగలరు బాబా".


మా పెద్దపాప రెండు నెలల నుండి నెలసరి వచ్చినప్పుడు ఐదురోజులపాటు వెన్నునొప్పితో బాధపడుతుంది. దాని వలన తనకి చదువుకోవడం కష్టంగా ఉంటుంది. 2022 జనవరిలో కూడా ఆ సమస్య మొదలైంది. అప్పుడు నేను, "బాబా! ఎలాగైనా పాపకి వెన్నునొప్పి రాకుండా చూసే భారం మీదే తండ్రి" అని బాబాను ప్రార్థించాను. తెల్లవారేసరికి పాపకి నొప్పి లేదు. మిగిలిన నాలుగు రోజులు కూడా ఎటువంటి నొప్పి రాలేదు. "థాంక్యూ బాబా. ఎప్పటికీ పాపకు నొప్పి రాకుండా దీవించండి బాబా".


2022, జనవరిలో ఒకరోజు నా భర్త తనకి జలుబు చాలా ఎక్కువగా ఉందని చాలా భయపడ్డారు. ఇంకా కోవిడ్ టెస్టు చేసుకోవాలని కిట్టు తెచ్చుకున్నారు. అప్పుడు నేను, "ఎలాగైనా సరే కోవిడ్ నెగిటివ్ వచ్చేలా చూడు సాయి" అని బాబాను వేడుకున్నాను. ఆయన దయవల్ల రిపోర్టు నెగిటివ్ వచ్చింది. "ధన్యవాదాలు బాబా".


ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!!


బాబా ఉండగా ఎలాంటి లోటూ ఉండదు


సాయినాథునికి నా నమస్కారాలు. ఈ బ్లాగుని ఇంత చక్కగా నడిపిస్తున్న వారికి, బ్లాగును ఆదరిస్తున్న వారికి నా కృతజ్ఞతలు. నేను సాయి భక్తురాలిని. నేను తొమ్మిదోసారి నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటున్నాను. మా ఇంట్లో ఎప్పుడూ పూజ చేసే చనిపోయిన మా నాన్నగారి ఫోటో ఒకరోజు అనుకోకుండా పగిలిపోతే అమ్మ దాన్ని ఎక్కడో దాచారు. ఆ పోటో కాకుండా అదే సైజ్ ఫ్రేమ్ కట్టని కొత్త ఫోటో ఇంకొకటి కూడా ఇంట్లో ఉంది. ఒకరోజు నేను నాన్న ఫోటోను ఫ్రేమ్ కట్టించడానికి తీసుకెళ్తూ ఎప్పుడూ పూజించే ఫోటోను కాకుండా కొత్త ఫోటోను తీసుకెళ్ళాను. సంక్రాంతి వచ్చేవరకు నేను ఆ విషయం గుర్తించలేదు. తీరా రేపు సంక్రాంతి అనగా ముందురోజు గ్రహించి అమ్మని అడిగితే, పాత ఫోటోకోసం చాలాసేపు వెతికింది. కానీ, ఆ ఫోటో కనిపించలేదు. అది కనిపిస్తుందనే నమ్మకం కూడా లేదు. ఎందుకంటే, ఒకసారి ఇంట్లో ఏదో గొడవ జరిగినప్పుడు ఆ ఫోటోని పగలగొట్టే పరిస్థితి వచ్చింది. అటువంటి సమయంలో ఆ ఫోటోను తీసి ఎక్కడ పెట్టామో ఎవరికీ గుర్తులేదు. మేము ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ రోజు నాన్నగారిని పూజిస్తాం. ఆరోజు ఉదయం 'ఫోటో లేకుండా పండగ రోజు పూజ ఎలా?' అని నాకు చాలా బాధేసింది. పోనీ, వెళ్లి ఫ్రేమ్ కిచ్చిన ఫోటో తెచ్చుకుందామంటే పండగ రోజు షాపు ఓపెన్ చేస్తారో, లేదో తెలియదు. అయినా అసలు వెళ్ళే పరిస్థితి కూడా లేదు. "ఇప్పుడు ఎలా బాబా? ఫోటో దొరికితే బ్లాగులో పంచుకుంటాను" అని మనసులో అనుకున్నాను. అంతే, నేను స్నానం చేసి వచ్చేలోపు అమ్మ ఫోటో పెట్టి పూజ చేస్తూ ఫోటో దొరికింది అన్నారు. ఎక్కడ అని నేను అమ్మని అడగలేదు. ఎందుకంటే, మనకి బాబా ఉండగా ఎలాంటి లోటూ ఉండదు. అన్నీ బాబా చూసుకుంటారు. మనం చేయాల్సింది అంతా బాబా మీద నమ్మకముంచి ఆయన చెప్పింది చేయడమే. "థాంక్యూ బాబా. మా నాన్నగారి ఆత్మకు శాంతిని ప్రసాదించండి".



సాయిభక్తుల అనుభవమాలిక 1061వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. తొందరగా అనుగ్రహించే దైవం సాయిబాబా
2. శ్రీ సాయినాథుని దీవెనలు
3. బాబా దయతో కుదుటపడిన నాన్న ఆరోగ్యం

తొందరగా అనుగ్రహించే దైవం సాయిబాబా


నేను ఒక సాయి భక్తుడిని. నేనిప్పుడు బాబా అనుగ్రహించిన కొన్ని అనుభవాలను మీతో పంచుకుంటాను. అవి చిన్న అనుభూతులే కావచ్చు కానీ, వాటిని 'బ్లాగులో పంచుకుంటాన'ని సాయికి మాటిచ్చాను. నాకు మొదట్లో సాయిబాబా చరిత్ర పారాయణ గురించికానీ, ఆయన బోధనల గురించికానీ ఏమీ తెలియదు. ఏదో ఆ సద్గురుమూర్తికి నమస్కారం చేసేవాడిని అంతే. అలాంటి నేను సాయి సచ్చరిత్ర పుస్తకాన్ని మొట్టమొదటిసారి చదివేటప్పుడు మంచం మీద పడుకుని రోజుకి ఒక అధ్యాయం చొప్పున చదివాను. సాయి సచ్చరిత్ర ద్వారా నాకు పారాయణ అంటే ఏమిటో తెలిసింది. తరువాత రోజుల్లో స్నానం చేసి, పూజ చేసి, విడిగా కూర్చుని సచ్చరిత్ర పారాయణ చేయసాగాను. ఒకసారి నేను నా కంపెనీ పని పూర్తి చేసిన తర్వాత పూజ చేసి పారాయణ మొదలుపెట్టాను. నేను చదువుతూ ఉండగా ఒక అధ్యాయంలో "నా భక్తుని ఇంట్లో అన్నవస్త్రాలకు లోటుండదు" అని ఉంది. నేను అక్కడ ఆగి, 'నాకేమైనా లోటు ఉందా?' అని కొద్దిసేపు ఆలోచనలో పడ్డాను. నా చిన్నతనంలోనే మా అమ్మానాన్నలు విడిపోవడం వల్ల మా నాన్న మమ్మల్ని పట్టించుకునేవారు కాదు. అందువలన మేము పేదరికం అనుభవించేవాళ్ళం. తిండికి కూడా లోటుగా ఉండేది. అయితే నేను ఎప్పుడూ ఖాళీగా ఉండకపోవడం వల్ల, జులాయిగా తిరగకపోవడం వల్ల, నిరంతరం శ్రమను నమ్ముకోవడం వల్ల మా పరిస్థితి కొంచం మెరుగుపడింది. తిండికి లోటుండేది కాదు కానీ, వస్త్రాలకు కొంచం ఇబ్బందిగా ఉండేది. నాకు షర్టులు ఎక్కువగా ఉన్నా ప్యాంట్లు మాత్రం నాలుగైదే ఉండేవి. వాటిలో కూడా ఒకదానికి జిప్ ఉండేది కాదు, మరొకటి బాగా పాతది, అది వేసుకుంటే కింద కూర్చోవడం కష్టంగా ఉండేది. ఇవన్నీ నా మదిలో మెదిలాక, "నా భక్తుని ఇంట్లో అన్నవస్త్రాలకు లోటుండదు" అని సాయి చెప్తున్నారు. కానీ 'నాకు ప్యాంట్లు కొరతగా ఉన్నాయి కాబట్టి, నేను ఆయనకి భక్తుణ్ణి కాదేమో! ఒకవేళ నేను సాయి భక్తుణ్ణి అయితే నాకు ఎందుకు లోటు ఉంది?' అని అనిపించింది. అదే ఆలోచిస్తూ ఆ రాత్రి నిద్రపోయాను. నాది కేవలం ఆలోచన మాత్రమే. ఏ విధమైన ప్రార్థనగానీ, అభ్యర్థనగానీ బాబాకు చేయలేదు. మరుసటిరోజు ఉదయం నేను యథావిధిగా నేను కంపెనీకి వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చాను. ఇంట్లో చూస్తే 8 ప్యాంట్లు ఉన్నాయి. వాటి విషయం అమ్మని అడిగితే, "పట్టణంలో ఒక పెద్దాయన ఇచ్చారు. అవి నీకే, తీసుకో!" అని అమ్మ చెప్పింది. ఆయనెవరో నాకు తెలీదుకానీ అప్పటినుంచి నాకున్న వస్త్రాల లోటు కూడా నన్ను పూర్తిగా వదిలేసింది. ఈరోజు నేను ఇతరులకి వస్త్రాలు ఇవ్వగలిగే స్థితిలో ఉన్నాను. మన మనసు పొరల్లో వచ్చే చిన్న ఆలోచన కూడా సాయికి తెలుస్తుంది. నిజంగా మనకు అవసరమైన వాటిని ఆయన తప్పక చే(ఇ)స్తారు. సాయి సచ్చరిత్ర పారాయణ నా జీవితాన్ని సమూలంగా మార్చివేసింది. ఒకప్పుడు నేను 'నాకు మంచి-చెడు చెప్పేవారు లేర'ని బాధపడేవాణ్ణి. అలాంటి నేను ఇప్పుడు ఎవరికైనా, ఎలాంటి సమస్యకైనా ధైర్యం చెప్పగలగుతున్నాను. ఇది నాకు సాయిసచ్చరిత్ర పారాయణ వలన, గురుస్మరణ వలనే సాధ్యమైంది. నేను కొత్తగా మహా పారాయణలో కూడా చేరి అందులో సభ్యునిగా కొనసాగుతున్నాను.


ఒకసారి నేను విపరీతమైన కడుపునొప్పితో బాధపడ్డాను. సరిగా అప్పుడే ఈ బ్లాగులో ఒక భక్తురాలు 'ఊదీతో తనకున్న బాధ తగ్గింద'ని పంచుకున్న అనుభవం చదివాను. వెంటనే నేను కూడా ఊదీ నీళ్లలో కలుపుకుని త్రాగి, "బాబా! కడుపునొప్పి తగ్గితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి మాటిచ్చాను. అంతే, రెండు రోజులుగా వేదిస్తున్న కడుపునొప్పి నిమిషాల వ్యవధిలో తగ్గిపోయింది. తొందరగా అనుగ్రహించే దైవం సాయిబాబా.


ప్రస్తుతం నేను ఒక ఇంటి నిర్మాణం చేపట్టాను. ప్లాస్టింగ్ వర్క్ జరగాల్సి వుంది. అయితే రెండు లక్షల అప్పు ఉంది. బాబా దయతో ఏ ఇబ్బంది లేకుండా ఇంటి నిర్మాణం పూర్తవుతుంది. నేను నా ఇంటికి 'సాయి నిలయం' అని పేరు పెట్టుకుంటాను. సాయి తండ్రి నా ఇబ్బందులను అర్థం చేసుకుని త్వరగా ఇంటి నిర్మాణం పూర్తి చేస్తారని ఆశిస్తున్నాను. అప్పుడెప్పుడో తెలియక పట్టుకున్న బాబా పాదుకలు ఇప్పుడు తెలిసి పట్టుకోవాలని నా మనసు ఎంతగానో ఉబలాటపడుతుంది. కానీ కరోనా నిబంధనల వల్ల కుదరడం లేదు. "బాబా! మీ కృపకోసం ఎదురుచూస్తున్నాను. త్వరగా నాపై దయ చూపండి బాబా. మీకు చాలా చాలా ధన్యవాదాలు". చివరిగా ఓపికగా నా అనుభవాన్ని చదివిన మీ అందరికీ ధన్యవాదాలు. మరొక అనుభవంతో మళ్లీ వస్తాను.


శ్రీ సాయినాథుని దీవెనలు


అనంతకోటి బ్రహ్మాండనాయక శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!!


నేను ఒక సాయి భక్తురాలిని. బాబా ఇటీవల నాకు ప్రసాదించిన అనుభవాలను నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. 2021, డిసెంబరు నెలలో నా చేతికున్న ఉంగరం ఎక్కడో పోయింది. అది చిన్న ఉంగరమే అయినా నాకు ఏదో తెలియని భయం, బాధ కలిగాయి. కారణం, మేమున్న పరిస్థితుల వల్ల, ఆర్థిక ఇబ్బందుల వల్ల చిన్నదాన్ని కూడా తట్టుకునే పరిస్థితి నాకు తగ్గిపోయింది. సరే, ఏ కష్టమొచ్చినా మన బాబాని శరణు వేడటం సాయి భక్తులందరికీ అలవాటే కదా! నేను కూడా బాబా దగ్గరకి వెళ్లి, "తండ్రీ! వెంటనే నా ఉంగరం దొరికితే, మీ బ్లాగులో నా అనుభవాన్ని పంచుకుంటాను బాబా" అని వేడుకున్నాను. అలా చాలాసార్లు బాబాను ప్రార్థిస్తూ ఒక రోజంతా ఆ ఉంగరం కోసం అన్ని చోట్ల వెతుకుతూనే ఉన్నాము. కానీ ఎంత వెతికినా ఉంగరం కనపడలేదు. 'ఇంక ఆ ఉంగరం పోయినట్లే' అని అనుకున్నాను కూడా. కానీ నా మనసుకి నేను సర్దిచెప్పుకోలేకపోయాను. మరుసటిరోజు పూజలో కూర్చుని కూడా ఆ ఉంగరం గురించే ఆలోచిస్తూ, దొరికితే బాగుండు అనుకుంటున్నాను. అంతలో మా పనమ్మాయి బట్టల దగ్గర  ఉంగరం దొరికిందని తెచ్చి ఇచ్చింది. నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే, నేను అదే చోట ఒకటి కాదు, రెండు కాదు చాలాసార్లు వెతికాను. అంతెందుకు పూజలో కూర్చోడానికి ముందు కూడా అక్కడ వెతికి వచ్చాను. అలాంటిది అక్కడే ఉంగరం దొరికిందంటే అది బాబా చేసిన అద్భుతం అనిపిస్తుంది నాకు. "ధన్యవాదాలు బాబా. ఉంగరం దొరికిన వెంటనే బ్లాగులో పంచుకోవాలని అనుకున్నప్పటికీ ఆలస్యమైంది. నన్ను క్షమించండి బాబా. మమ్మల్ని ఇలానే దయతో కాపాడు తండ్రి. మా ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగించి మాకు ఒక మంచి దారి చూపించు సాయినాథా. కష్టాలు తీరి మా కుటుంబమంతా హాయిగా ఉండేలా అనుగ్రహించు స్వామి. మా భారమంతా మీదే బాబా".


2021, డిసెంబర్ 25న శిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించారు మన తండ్రి బాబా. మేము వెళ్ళే సమయానికి భక్తులు ఆరతులకు హాజరయ్యే అవకాశం రద్దు చేశారని తెలిసి, "అయ్యో బాబా! మీ ఆరతి దర్శనం మాకు దొరికితే బాగుంటుంది" అనుకున్నాము. మన బాబా ఎంత బాగా అనుగ్రహించారో చూడండి. మాతోపాటు వచ్చిన మా స్నేహితులిద్దరు డొనేషన్ కట్టారు. ఆ కారణంగా ఆరతులకు, దర్శనాలకు ఉచితంగా వెళ్ళే అవకాశం బాబా మాకు ప్రసాదించారు. అలా ఆరతికి హజరైనప్పుడు బాబాకి ఎదురుగా కూర్చుని, తనివితీరా వారిని దర్శించుకునే అదృష్టం మాకు దక్కింది. అలా మేము ఉన్న 4 రోజులలో ప్రతి పూటా తమ దర్శనానికి, ఆరతులకు హాజరయ్యే భాగ్యాన్ని కలిగించారు ఆ సాయితండ్రి. అయితే ఎన్నిసార్లు దర్శనం చేసుకున్నా కూడా మరోసారి దర్శించగలిగితే బాగుంటుందన్న ఆలోచనే మా అందరి మదిలోన. ఏదేమైనా అంతటి అవకాశమిచ్చిన బాబాకు ఎన్ని వేల నమస్కారాలు సమర్పించుకున్నా తక్కువే.


ఇకపోతే మా ప్లాన్‍లోగానీ, ఆలోచనలోగానీ లేని వణిలోని శ్రీ సప్తశృంగిదేవి దర్శనానికి మార్గం చూపి, మాచేత ఆ దేవి దర్శనం చేయించారు బాబా. అక్కడి నుండి నాసిక్ వెళ్లి, ఆ తరవాత శ్రీత్రయంబకేశ్వరుని దర్శనం, అపై ఘంటా గణపతి దర్శనం చేసుకున్నాము. ఇవన్నీ ఆ సాయినాథుని దీవెనలే మాకు. ఆ చల్లని దీవెనలతో తిరిగి మేము మా ఊరు క్షేమంగా చేరుకున్నాము. "తండ్రీ! నీ లీలలు ఏమని చెప్పనయ్యా. మళ్ళీ త్వరగా మీ దర్శన భాగ్యాన్ని మాకు కలిగించండి. కోవిడ్ మహమ్మారి నుండి ఈ లోకాన్ని రక్షించండి సాయినాథా. మీ బిడ్డలమైన మమ్మల్నందరినీ సర్వదా కాపాడు తండ్రి. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండలా ఆశీర్వదించండి బాబా".


బాబా దయతో కుదుటపడిన నాన్న ఆరోగ్యం


శ్రీసచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై.

సద్గురు శ్రీసాయినాథుని శరత్ బాబూజీ కీ జై.


నా పేరు మాధురి. ముందుగా సాయి బంధువులకు, ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయికి నా నమస్కారాలు. నేను ఇంతకు ముందు కొన్ని అనుభవాలు ఈ బ్లాగు ద్వారా మీ అందరితో పంచుకున్నాను. ఇప్పుడు మరో అనుభవం పంచుకుంటున్నాను. మా నాన్నగారి వయస్సు 85 సంవత్సరాలు. ఈ మధ్య ఒకరోజు రాత్రంతా ఆయనకు విపరీతంగా నీళ్ళ విరోచనాలు అయ్యాయి. రాత్రంతా యాంటీబయోటిక్స్, సెలైన్లు ఎక్కించారు. ఉదయానికి విరోచనాలు కొంచెం తగ్గినా మధ్యాహ్నానికి మళ్ళీ మొదలై అలా అవుతూనే ఉన్నాయి. రాత్రి పదిగంటలప్పుడు ఐదు నిమిషాల్లో మూడుసార్లు విరోచనాలు అయ్యాయి. ఆయన బాగా నీరసించిపోయారు. మాకు చాలా భయమేసి హాస్పిటల్లో అడ్మిట్ చెయ్యాలని అనుకున్నాము. హాస్పిటల్‍కి వెళ్లేముందు నేను, "బాబా! ఈ కరోనా కాలంలో హాస్పిటల్ సురక్షితం కాదు. కానీ తప్పట్లేదు. నాన్న క్షేమంగా ఇంటికి తిరిగి రావాలి. ఆయన క్షేమంగా వస్తే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. మేము మూడురోజులు హాస్పిటల్లో ఉన్నాము. బాబా దయవలన నాన్న ఆరోగ్యం బాగవడంతో గురువారంనాడు ఆయనని డిశ్చార్జ్ చేసారు. ఆయన క్షేమంగా ఇంటికి తిరిగి రావడం బాబా దయ, ఆయన కృప. "ధన్యవాదాలు బాబా. ఈ అనుభవాన్ని కొంచెం ఆలస్యంగా పంచుకుంటున్నందుకు నన్ను క్షమించండి బాబా. మేమందరమూ మీ పాదాలను ఎల్లప్పుడూ మర్చిపోకుండా ఉండేలా మమ్మల్ని అనుగ్రహించండి. మీ అనుగ్రహం అందరిపై ఉండాలి బాబా".


సాయిభక్తుల అనుభవమాలిక 1060వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. అత్యంత అద్భుతమైన బాబా అనుగ్రహం
2. 'ఊదీ'యే దివ్య ఔషధం
3. బాబాకు మ్రొక్కుకున్నంతనే దొరికిన ఉంగరం

అత్యంత అద్భుతమైన బాబా అనుగ్రహం


ఓం శ్రీసాయినాథాయ నమః!!! 'సాయి మహరాజు'కు నా శతకోటి వందనాలు. సాయి బంధువులకు నా నమస్కారాలు. ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయికి నా కృతజ్ఞతలు. నేను ఒక సాయి భక్తుడిని. బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను నేను ఇదివరకు 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు ద్వారా మీ అందరితో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలు పంచుకోబోతున్నాను. నేను నా కుటుంబంతో కలిసి శిరిడీ వెళ్లి సాయినాథుని దర్శించుకోవాలని గత రెండు సంవత్సరాలుగా ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నాను. కాని కరోనా కారణంగా మా ఆశ నెరవేరలేదు. ఆఖరికి 2021లో మా పిల్లల సంక్రాంతి సెలవుల్లో ఎలాగైనా శిరిడీ వెళ్ళాలని అనుకున్నాము. అయితే మహారాష్ట్రలో కరోనా ప్రభావముందని తెలిసి కాస్త భయమేసినప్పటికీ 'బాబా ఉన్నారు. ఆయన మనకి తోడుగా ఉంటారు' అనుకున్నాము. ఇకపోతే మేము ఆరతి సమయంలో బాబా సమక్షంలో ఉండాలని ఆశపడ్డాము. అయితే దర్శనం మరియు ఆరతి టికెట్లు ఆన్లైన్‌లోనే బుక్ చేసుకోవాల్సి ఉండటంతో నేను శిరిడీ సంస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆరతికి టికెట్లు బుక్ చేద్దామని ప్రయత్నించాను. కానీ టికెట్ స్లాట్లు అయిపోయాయని వచ్చింది. మూడు రోజులు ప్రయత్నించినా అలాగే జరిగింది. దాంతో నాకు చాలా బాధేసినప్పటికీ, 'పోనిలే, బాబా మనకు దర్శనం ఇస్తారు' అని దర్శనం టిక్కెట్లు బుక్ చేసుకుని శిరిడీకి బయలుదేరాము. అక్కడికి చేరుకున్నాక సాయి మాకు తమ మహత్యం చూపారు. మేము ముందుగా అనుకున్నట్లు డొనేషన్ కౌంటరుకి వెళ్లి అన్నదానానికి డొనేషన్ కట్టాము. ఆ కౌంటరులో ఉన్న అతని రూపంలో సాయి మాకు ఎంత చల్లని వార్త చెప్పారంటే, అది విని మేము ఎంతో సంభ్రమాశ్చర్యాలకి లోనయ్యాము. అసలు విషయమేమిటంటే, 'డొనేషన్ కట్టే వాళ్ళకి రెండు ఆరతులకు మరియు దర్శనానికి అనుమతిస్తారట'. మాకు ఎంతమాత్రం తెలియని విషయం ఇది. ఆన్లైన్‌లో ఎంత ప్రయత్నించినా దొరకని ఆరతి టికెట్లు బాబా సన్నిధిలోకి రాగానే ఒక ఆరతి కాదు రెండు ఆరతులకు, దర్శనానికి అవకాశం ఇవ్వడం బాబా మాపై కురిపించిన గొప్ప అనుగ్రహమని, మాకు ఎంతటి భాగ్యం దక్కిందని మేము ఎంతో సంతోషించాము. బాబా లీలలు అత్యంత అద్భుతంగా ఉంటాయనడానికి ప్రత్యక్ష నిదర్శనమిది. మనకు ఏది అవసరమో ముందే తెలిసిన బాబా సరైన సమయంలో మనల్ని అనుగ్రహిస్తారు. "నేను ఆశపడిన దానిని మాకిచ్చిన మీకు చాలా చాలా ధన్యవాదాలు సాయితండ్రి".


తరువాత మధ్యాహ్న ఆరతికి వెళ్ళినప్పుడు సమాధి మందిరంలో ఒక అద్భుతం జరిగింది. ఆ అద్భుతాన్ని నేనిప్పుడు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మేము ఆరతి సమయానికి లైన్‍లో వెళ్ళి బాబా ముందు నిల్చున్నాము. ఇంకా ఆరతి మొదలు కాలేదు. మేమంతా తదేకంగా బాబాను చూస్తుండగా కొన్ని క్షణాల్లో ఆరతి మొదలైంది. అందరూ తన్మయత్వంతో ఆరతి పాడుతున్నారు. నేను కూడా బాబాను చూస్తూ ఆరతి పాడుతున్నాను. అప్పుడే ఒక అద్భుతం జరిగింది. బాబా మూర్తి యొక్క స్థానంలో బాబా ఒరిజినల్ రూపంతో నాకు దర్శనం ఇచ్చారు. ఒక్కసారిగా బాబా ముఖం పెద్దదై, నా వైపే చూస్తూ తమ స్థానంలో నుంచి లేస్తూ కనిపించారు. నేను అయోమయంగా ఒకసారి కనులు మూసి, తెరిచి మళ్ళీ బాబాను చూశాను. బాబా ఎప్పటిలానే మామూలుగా ఉన్నారు. కానీ బాబా దర్శనం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. "దన్యవాదాలు బాబా. మీరు మీ సమాధి నుండి సమాధానం ఇస్తానని అన్నారు. అది అక్షరాలా నిజం".


మేము శిరిడీ నుండి ఇంటికి వచ్చాక నాకు అలసటగా అనిపించి పడుకున్నాను. మరుసటిరోజు ఉదయానికి జ్వరం కూడా ఉంటే, 'ఇది మామూలు జ్వరమే' అని ఒక టాబ్లెట్ వేసుకున్నాను. కానీ జ్వరం తగ్గలేదు. పైగా హెచ్చుతగ్గులు అవుతుంది. దానికి తోడు వాసన కూడా తెలియలేదు. అసలే కరోనా సమయం కదా! నాకు భయమేసి, "బాబా! నాకు వాసన తెలియటం లేదు. నాకు ఏమి కాకూడదు. అన్నిటికి మీరే మాకు దిక్కు" అని బాబాను ప్రార్థించి నా కారు వాష్ చేయించడానికి తీసుకుని వెళ్లి అక్కడ ఒక ప్రక్క కూర్చున్నాను. అప్పటివరకు ఏ వాసన తెలియని నాకు ఉన్నటుండి రెండు సెకన్ల పాటు ఏదో అగరుబత్తి వాసన వచ్చింది. "నీకు నేను ఉన్నాను. నీకు ఏమీ కాదు" అని సాయి నాకు సూచన ఇస్తున్నారనిపించింది. నేను ఇంటికి తిరిగి వచ్చాక బాబా ఊదీ నీళ్ళలో కలుపుకుని మూడు పూటలా త్రాగాను. రెండు రోజుల్లో జ్వరం తగ్గి వాసన కూడా తెలిసింది. ఆ సాయినాథుడు మనకు తోడు ఉండగా మనకేమీ కాదని నాకు అర్ధమైంది. నాకు జ్వరం తగ్గితే బ్లాగులో పంచుకుంటానని సాయికి మాటిచ్చినట్లు ఇప్పుడిలా మీ అందరితో పంచుకున్నాను. "ధన్యవాదాలు బాబా".


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!!!


'ఊదీ'యే దివ్య ఔషధం


ఓం శ్రీసాయినాథాయ నమః!!! 'సాయీ' అని పిలిస్తే 'ఓయీ' అని పలికే దైవం మన సాయితండ్రి. ఆయన ప్రతిక్షణమూ తమ బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుతుంటారు. అణువణువునా అంతటా వ్యాపించివున్న ఆ బ్రహ్మాండనాయకుడికి నా హృదయపూర్వక నమస్కారాలు. సాయి బందువులందరికీ మరియు 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు నిర్వాహకులకు కూడా నా నమస్కారాలు. నా పేరు శ్రీదేవి. నాకు ఏ సమస్య వచ్చినా బాబాకు విన్నవించుకోవడం, ఆయన నన్ను అనుగ్రహించడం, ఆపై నా అనుభవాన్ని ఈ బ్లాగు ద్వారా మీ అందరితో పంచుకోవడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈ బ్లాగ్ చదువుతున్నప్పటి నుండి 'బాబా' నాకు ప్రసాదించిన ఎన్నో అనుభవాలను మీ అందరితో పంచుకున్నాను. ఇప్పుడు మరో రెండు అనుభవాలను పంచుకుంటున్నాను. మా నాన్నగారికి నాలుగు సంవత్సరాల నుండి భుజం దగ్గర ఒక గడ్డ ఉంది. అయితే నొప్పి లేకపోవటం వల్ల నాన్న ఆ గడ్డ గురించి పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఈ మధ్య ఆ గడ్డ లోపలి భాగంలో ఇన్ఫెక్షన్‍లా అయి నాన్న నొప్పిని భరించలేకపోయారు. అప్పుడు నేను, "బాబా! నాన్నకి వచ్చిన గడ్డ తగ్గితే బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించాను. నాన్న ఆ గడ్డపై బాబా ఊదీ రాస్తూ డాక్టరు ఇచ్చిన మందులు వేసుకోసాగారు. బాబా దయవల్ల కొన్నిరోజులకి ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గిపోయింది.


మా అమ్మాయి ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతుంది. తనకి పరీక్షల సమయంలో బాగా 'స్కిన్ అలర్జీ' వచ్చింది. తనని ఇంటికి పంపమని అడిగితే కాలేజీవాళ్ళు, "పరీక్షలు జరుగుతున్నందున ఇప్పుడు పంపమ"ని ఖచ్చితంగా చెప్పారు. అప్పుడు నేను, "బాబా! మా అమ్మాయి చాలా కష్టపడి చదువుతుంది. తనకి పరీక్షల సమయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసి, చక్కగా పరీక్షలు వ్రాసేలా అనుగ్రహించండి. తనకి త్వరగా అలర్జీ తగ్గితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" బాబాను వేడుకున్నాను. బాబా దయవలన వారి ఊదీతో త్వరగానే అమ్మాయికొచ్చిన అలర్జి తగ్గిపోయింది. నా తండ్రి దయ ఉంటే సాధ్యం కానిదేముంది. "ధన్యవాదాలు బాబా. మీ ఆశీస్సులు మీ భక్తులమైన మా అందరిపై సదా ఉండాలని కోరుకుంటున్నాను తండ్రి".


బాబాకు మ్రొక్కుకున్నంతనే దొరికిన ఉంగరం


శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!

ఓం శ్రీసాయినాథాయ నమః!!!


సాయిభక్తులందరికీ నమస్కారం. ఈ బ్లాగు నిర్వాహకులకు అభినందనలు. నేను ఒక సాయి భక్తురాలిని. నేను ఇదివరకు పంచుకున్న అనుభవంలో మా ఇంటిలోకి మంచి అద్దెదారులు రావాలని బాబాను కోరుకున్నాను. ఆయన దయవల్ల మంచి అద్దెదారులు వచ్చారు. ఇకపోతే నేను సాధారణంగా ఇంటి పనులు పూర్తయ్యాక నా వేలికి ఉంగరం పెట్టుకుంటాను. 2022, జనవరిలో ముక్కోటి ఏకాదశి రోజున కూడా అలానే పెట్టుకున్నాను. తరువాత పారాయణ పుస్తకాల కోసం అట్టపెట్టెలో వెతికి పారాయణ మొదలుపెట్టాను. కాసేపటికి పారాయణ చేస్తూ నా చేతికి ఉంగరం లేదని గమనించాను. వెంటనే అట్టపెట్టెలో వెతికాను కానీ, ఉంగరం కనిపించలేదు. దాంతో ఇంట్లో గిన్నెలు తోముకునే చోట పడిపోయిందేమోనని అక్కడంతా వెతికాను. అయినా ఉంగరం కనిపించలేదు. వెంటనే ఈ బ్లాగులో చాలామంది భక్తులు పంచుకున్న అనుభవాలు గుర్తొచ్చి సాయిబాబాకు నమస్కరించుకుని, "ఉంగరం దొరికితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. తరువాత, 'ఓం శ్రీసాయి సూక్ష్మాయ నమః' అనుకుంటూ మళ్లీ అట్టపెట్టెలో వెతికాను. అద్భుతం! ముందు వెతికినప్పుడు కనబడని ఉంగరం ఈసారి కనపించింది. అంతే అప్పటివరకు నేను పడిన బాధంతా పోయింది. బ్లాగులో పంచుకుంటామని మనసులో అనుకుంటే వెంటనే కోరికలు నెరవేరుతాయి. అలా నాకు ఇప్పటికి ఐదు, ఆరు అనుభవాలు జరిగాయి. అవన్నీ గతంలో నేను మీ అందరితోనూ ఈ బ్లాగు ద్వారా పంచుకున్నాను. ప్రస్తుతం మేము మా ఊళ్ళో ఉన్న స్థలంలో ఇల్లు కట్టుకోవాలని ప్రయత్నాలు ప్రారంభించాము. కానీ ఆ స్థలం తాలూకు వాస్తు గురించి సరిగా చెప్పేవారు దొరకడం లేదు. బాబా దయతో త్వరలోనే వాస్తు, ఇంటి ప్లాన్ సరిగ్గా చెప్పేవారు దొరుకుతారని నమ్ముతున్నాను. ఇంటి నిర్మాణ విషయంలో బాబా అనుగ్రహం లభించిన వెంటనే నేను బ్లాగులో నా అనుభవాన్ని పంచుకుంటాను.


చివరిగా ఒక మాట: 'ఏది చేస్తే మంచి జరుగుతుందో బాబా అది చేస్తారని, సరైన మార్గం చూపిస్తారని మనం నమ్మకంగా అనుకుంటే చాలు. అంతా శుభం జరిగేలా ఆ సాయినాథుడు అనుగ్రహిస్తారు'.



సాయిభక్తుల అనుభవమాలిక 1059వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా మనల్ని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటారు
2. అండగా ఉన్నామని నమ్మకాన్ని కలిగించిన బాబా
3.చిటికెలో భారమంతా తొలగించిన బాబా

బాబా మనల్ని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటారు

నేను ఒక సాయిభక్తురాలిని. ముందుగా సాయిబంధువులందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఎంతో శ్రద్ధాభక్తులతో ఈ బ్లాగు నడుపుతున్న వారికి నా కృతజ్ఞతలు. రోజూ బ్లాగులోని భక్తుల అనుభవాలు చదవడం వలన ఎంతో మనశ్శాంతి, దైర్యం, నమ్మకం కలుగుతున్నాయి. నేను డిగ్రీ చదివేటప్పుడు నాకు బాబాపట్ల నమ్మకం ఏర్పండింది. నేను ఏ దైవాన్ని చూసినా వారిలో బాబాను చూస్తాను. నేనిప్పుడు బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను మీతో పంచుకుంటాను. 2022 నూతన సంవత్సరం ఆరంభంలో నేను నా ఉద్యోగవిధులలో చూపిన కొద్దిపాటి అలసత్వం కారణంగా పై అధికారుల కోపానికి గురయ్యే పరిస్థితి వచ్చింది. సమస్య కాస్త పెద్దదైనందున నేను చాలా భయపడి, "బాబా! నా సమస్య పరిష్కారమైతే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకుని బ్లాగు ఓపెన్ చేసాను. ఆరోజు(2022, జనవరి 10) సాయిభక్తుల అనుభవమాలికలో ముఖ్యంగా 'పెద్ద సమస్య నుండి సురక్షితంగా బయటపడేసిన బాబా' అన్న టైటిల్‌తో ఉన్న మురళిమోహన్‍గారి అనుభవం చూడగానే బాబా నాకు ధైర్యం చెప్తున్నారని నాకు ధైర్యం వచ్చింది. అంతే!భయపడకుండా నేను ఆఫీసుకు వెళ్ళాను. అక్కడ నేను అనుకున్నట్లు అంత పెద్ద ప్రమాదమేమీ లేదు. ఇలా బాబా నన్ను ఎల్లప్పుడూ కాపాడుతున్నారు.

కొంతకాలం క్రిందట నేను నోటి దురుసుతనం వల్ల మా బంధువులతో వాళ్ల మనసు కష్టపడేలా మాట్లాడాను. దాంతో వాళ్ళు కోపగించుకుని నాకు శాపనార్థాలు పెట్టారు. ఆ విషయం గుర్తుకు వచ్చినప్పుడల్లా నాకు భయంగా, బాధగా ఉండి, 'సాయి చూపించిన సూచనలను అర్థం చేసుకోకుండా తప్పు చేసాన'ని అనుకుంటూ ఉంటాను. దాంతో నా మనస్సుకు స్థిమితంలేక దుఃఖం, అనాసక్తి నన్ను ఆవరిస్తూ ఉంటాయి. అందుచేత నేను సాయితో, "ఎలాగైనా నేను ఈ పాపం నుండి విముక్తి పొందాలి" అని చెప్పుకుని బ్లాగులోని అనుభవాలు చదివాను. ఆరోజు(2022, జనవరి 9, ఆదివారం) బ్లాగులో ప్రచురించిన అనుభవాలలో ఒక భక్తుడు తన అనుభవంలో భాగంగా నామస్మరణ గురించి బాబా చెప్పిన ఈ క్రింది సందేశాన్ని పంచుకున్నారు. 

నామస్మరణ - బాబా సందేశం: "నామం పాపాలనే పర్వతాలను పగలగొట్టుతుంది. నామం శరీర బంధనాలను విడగొట్టుతుంది. నామం కోటి చెడు వాసనలను సమూలంగా పెరికి వేస్తుంది. నామం కాలుని మెడను విరిచేస్తుంది. నామం జననమరణ చక్రాన్ని తప్పిస్తుంది. ప్రయత్నపూర్వకంగా నామాన్ని స్మరిస్తే మంచిది. అప్రయత్నంగా నామజపం చేసినా చెడు కలుగదు. తెలియకుండా నోటితో ఉచ్చరించినా నామ ప్రభావం ప్రకటమౌతుంది. అంతఃకరణాన్ని పరిశుద్ధపరచడానికి నామం కంటే సులభమైన మరో సాధనం లేదు. నామం జిహ్వకు భూషణం. నామం పరమార్థాన్ని పోషిస్తుంది. నామజపానికి స్నానం చేయాల్సిన అవసరం లేదు. అట్లే నామానికి విధి విధానాలేవీ లేవు. నామ సంకీర్తనలో సకల పాపాలు నశించిపోతాయి. నామం ఎల్లప్పుడూ పావనమైనది. అనవరతం నా నామాన్ని స్మరించేవారు తీరానికి చేరుకుంటారు. ఇతరసాధనలేవీ అవసరం లేకుండానే మోక్షం హస్తగతమవుతుంది. నా నామాన్ని ఎల్లప్పుడూ జపించేవారి పాపాలు క్షాళనమవుతాయి. మెల్లగా లోలోపల నా నామాన్ని జపించేవారు ఉత్తమ గుణ సంపన్నులకంటే ఉత్తములు".

పై సందేశం చదివగానే నామస్మరణ చేయటం వలన పాపాలు పటాపంచలవుతాయని తెలిసి నా మనసుకి ఎంతో శాంతి చేకూరింది. బాబా నా సమస్యకు మార్గం చూపారని అప్పటినుండి నేను నామజపం చేస్తున్నాను.

చాలా సంవత్సరాల క్రితం నేను బాబాను తామరపువ్వులతో పూజిస్తున్నట్లు ఊహించుకునేదాన్ని. తర్వాత నేను శిరిడీ సమాధి మందిరంలోని బాబా ఫోటోలను చూస్తుంటే, బాబాను తామరపూలతో అలకంరించినట్లు ఉంది. అలా అంతకుముందు ఎప్పుడూ తామరపూలతో అలంకరించిన బాబా ఫోటోలను నేను చూడలేదు. నేను తామరపూలతో బాబాను పూజించినట్లు ఊహించుకున్న తర్వాతే బాబా నాకు అలా దర్శనమివ్వడంతో బాబా నా కోరికను మన్నించారని నాకు చాలా సంతోషంగా అనిపించింది. నా అనుభవాల ద్వారా నాకు తెలిసింది ఏమిటంటే, 'మనకు తెలియకుండానే బాబా మనల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటార'ని. నేను నా పిల్లలకి, "నా తదనంతరం మీకు ఏదైనా సమస్య వస్తే, బాబాకి దణ్ణం పెట్టుకోండి. బాబా వెంటనే మీకు పరిష్కారం చూపిస్తారు" అని చెప్తూ ఉంటాను. నేను కూడా ఆ సాయినాథునితో నా పిల్లల క్షేమం గురించి మొరపెట్టుకుంటూ ఉంటాను. "ధన్యవాదాలు బాబా. అందరినీ చల్లగా అనుగ్రహించండి".

ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి!!!

అండగా ఉన్నామని నమ్మకాన్ని కలిగించిన బాబా

అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!

సమస్త సాయిబంధువులకు మరియు బ్లాగు నిర్వహిస్తున్న సాయికి వందనాలు. నా పేరు అనూజ. మాది నిజామాబాద్. 2022, జనవరి 8న మావారికి విపరీతమైన జ్వరం వచ్చింది. అసలెప్పుడూ జ్వరం రాని ఆయనకి జ్వరం వచ్చేసరికి నాకు చాలా భయమేసి, "బాబా! ఉదయానికల్లా మావారికి జ్వరం తగ్గితే, 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. తరువాత మావారికి డోలో 650 టాబ్లెట్ వేసి, బాబా ఊదీ వేసిన నీళ్ళు త్రాగించాను. అంతే, జ్వరం నెమ్మదిగా తగ్గనారభించి తెల్లారేసరికి పూర్తిగా తగ్గిపోయింది. మళ్ళీ తిరిగి రాలేదు. ఆ రోజు బాబా వాట్సప్ గ్రూపులో అనుకూలమైన సందేశం ఇచ్చారు బాబా. అది చూసాక బాబా నాకు అండగా ఉన్నారని నమ్మకం కుదిరింది. ఇకపోతే జ్వరం తగ్గిందికానీ, మావారు బాగా నీరసించిపోయారు. బాబా దయవల్ల ఇప్పుడు నార్మల్ అయ్యారు. "ధన్యవాదాలు బాబా. కానీ నాకు జ్వరం వచ్చినందు వల్ల మీకు మాటిచ్చినట్లు వెంటనే నా అనుభవాన్ని పంచుకోలేకపోయాను. కాస్త ఆలస్యం అయ్యింది. నన్ను క్షమించండి బాబా".

ఇంకోసారి మా బాబుకి జ్వరం, జలుబు, దగ్గు ఎక్కువగా ఉంటే కరోనా ఏమోనని నాకు భయమేసింది. బాబుకి కరోనా టెస్టు చేయించే ముందు నేను, "బాబా! బాబు రిపోర్టు నెగిటివ్ వస్తే, బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. బాబా దయవల్ల టెస్టు రిపోర్టు నెగిటివ్ వచ్చింది. "ధన్యవాదాలు బాబా. మీకు మ్రొక్కుకున్నట్లు నా అనుభవం పంచుకున్నాను తండ్రి. అందరినీ చల్లగా చూడు తండ్రి. మా అందరికీ మీ ఆశీస్సులు సదా ఉండాలని కోరుకుంటున్నాను బాబా. శతకోటి వందనాలు బాబా".

చిటికెలో భారమంతా తొలగించిన బాబా

సాయి బంధువులందరికీ నా నమస్కారాలు. ఈ బ్లాగు నిర్వహిస్తున్న వారికి ధన్యవాదాలు. నా పేరు వాణి. మాది విజయవాడ. నేను ఇంతకుముందు రెండుసార్లు నా అనుభవాలు పంచుకున్నాను. ఇప్పుడు మూడోసారి నా అనుభవాన్ని పంచుకుంటున్నాను. 2022, జనవరి మూడో వారంలో రెండు రోజులపాటు మా బాబుకి జలుబు, జ్వరం ఉండటంతో తను భయపడుతూ, "నాకు కోవిడ్ ఏమోనని అనుమానంగా ఉంది" అని అన్నాడు. నేను కూడా అదే భయంతో ఉన్నాను. ఎందుకంటే, అంతకుముందు మా వారికి కూడా ఇలాగే జలుబు, జ్వరం ఉండేవి. వెంటనే నేను బాబాకి నమస్కరించుకుని, "బాబుకి నయమైతే బ్లాగులో పంచుకుంటాన"ని మొక్కుకున్నాను. బాబా దయవలన వెంటనే బాబుకి తగ్గింది. తరువాత 2022. జనవరి 17న బాబు మెడికల్ కిట్ తెచ్చుకుని కోవిడ్ టెస్టు చేసుకుందామని అనుకున్నాడు. నేను మాత్రం ఏ రిజల్టు వస్తుందోనని ఒకటే భయపడి, "నెగిటివ్ రిజల్టు వస్తే బ్లాగులో పంచుకుంటాన"ని అనుకున్నాను. తరువాత బాబు టెస్టు చేసుకుంటే, నెగిటివ్ అని వచ్చింది. చిటికెలో నా భారమంతా తొలగించారు బాబా. ఇది చిన్న విషయమే కావచ్చు కాని, నాకు ఎంతో భయం వేసింది. కోవిడ్ వల్ల మా అమ్మగారిని కోల్పోయాను. అందుకే నాకు ఈ భయం. "ధన్యవాదాలు బాబా. మావెంట ఉండి మా అందరినీ ఇలాగే కాపాడు తండ్రి. త్వరగా ఈ కరోనాను నిర్మూలించండి తండ్రి. ఇంకొక కోరిక కూడా మీకు విన్నవించుకున్నాను తండ్రి. అది కూడా నెరవేర్చండి బాబా. ఆ అనుభవాన్ని కూడా బ్లాగులో పంచుకుంటాను".


సాయిభక్తుల అనుభవమాలిక 1058వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా అనుగ్రహంతో యు.కే.లో అడ్మిషన్
2. బాబాకి మాటిచ్చి అలక్ష్యం చేయకూడదు
3. సాయి భగవానుని నమ్ముకుంటే ఎటువంటి సమస్యల నుండైనా కాపాడుతారు

బాబా అనుగ్రహంతో యు.కే.లో అడ్మిషన్

ముందుగా సాయిభక్తులకు నమస్కారం. నా పేరు ఆదిత్య. నా వయసు 31 సంవత్సరాలు. నేను చిన్నప్పటినుండి బాబాని ఆరాధిస్తున్నాము. బాబా ఎప్పుడూ నాతో ఉన్నారని నేను నమ్ముతాను. ఆయన నాకు ఎన్నో మహిమలు చూపించారు, ప్రతి విషయంలోనూ ముందుండి నన్ను నడిపించారు. నేను ఈ బ్లాగులోని సాయిభక్తుల అనుభవాలు చదివి నా అనుభవాలను కూడా తోటి భక్తులతో పంచుకోవాలని నిశ్చయించుకుని ఈ మధ్య కాలంలో కొన్ని అనుభవాలు పంచుకున్నాను. ఇప్పుడు 2022, జనవరి రెండో వారంలో బాబా అనుగ్రహించిన ఒక అనుభవాన్ని పంచుకుంటున్నాను. "బాబా! నా అనుభవాలు పంచుకోవడంలో కొంచెం ఆలస్యమైనందుకు నన్ను క్షమించండి".

నేను యు.కే. వెళ్లి అక్కడ చదువుకోవాలనుకుని అందుకు కావాల్సిన ప్రయత్నాలను 2021 జూలైలో మొదలుపెట్టాను. నా ప్రయత్నాలు ఫలించి అక్టోబరులో నేను యు.కే. వెళ్ళవలసి ఉండగా అనుకోకుండా కొన్ని కారణాల వలన యూనివర్సిటీలో నా అడ్మిషన్ క్యాన్సిల్ అయ్యింది. దాంతో నేను చాలా నిరాశ చెందాను. కానీ 'బాబా నాకు మంచి చేస్తార'ని నాకు ఆయన మీద నమ్మకం ఉన్నందువల్ల మళ్ళీ ప్రయత్నాలు మొదలుపెట్టాను. ఈసారి చాలా కన్సల్టెన్సీలను సంప్రదించి ఎక్కువ యూనివర్సిటీలకు అప్లై చేశాను. అనుకోకుండా ఒకరోజు నాకు ఒక కన్సల్టెన్సీ నుండి కాల్ వచ్చింది. నిజానికి నేను ఆ కన్సల్టెన్సీని అదివరకెప్పుడూ నేరుగా కలవలేదు, కనీసం ఫోన్లో కూడా మాట్లాడలేదు. అందువల్ల నేను వాళ్ళని, "నా నెంబర్ మీ దగ్గరకి ఎలా వచ్చింది?" అని అడిగాను. అందుకువాళ్ళు, "మీరు యు.కే.లో స్టడీస్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు మాకు తెలిసి మీకు కాల్ చేసాము" అన్నారు. అది విన్న నాకు బాబాయే వాళ్లకి నా నెంబర్ ఇచ్చుంటారు అనిపించింది. వాళ్లతో మాట్లాడిన తరువాత వాళ్లు చెప్పిన యూనివర్సిటీకి అప్లై చేశాను. నేను అంతకుముందు అప్లై చేసిన ఏ యూనివర్సిటీ నుండి సరైన స్పందన రాకపోయినా బాబా చూపించిన ఆ యూనివర్సిటీలో నాకు అడ్మిషన్ వచ్చింది. బాబా అనుగ్రహంగా ముందుకు ప్రొసీడ్ అయిపోయాను. బాబా దయవల్ల అంతా సవ్యంగా జరిగింది. వీసాకి అప్లై చేసి, "ఏ ఇబ్బందీ లేకుండా వీసా వచ్చేలా చూడమ"ని బాబాను వేడుకున్నాను. బాబా చూపించిన దారిలోనే నేను వెళ్తున్నాని నాకు అర్థమయ్యేలా వీసా వచ్చింది. ఇప్పుడు నేను ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాను. 2022, జనవరి 23న యు.కే కి నా ప్రయాణం. ఇలా ఎన్నని చెప్పాలి? నా ఈ జీవితం అంతా బాబా మహిమలతో నిండి ఉంది. "ధన్యవాదాలు బాబా. ఎప్పుడూ నాతో ఉంటూ నన్ను మంచి మార్గంలో ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను తండ్రి". బాబా కృపాదృష్టి ఎల్లవేళలా మా మీద, భక్తులందరీ మీద ఉండాలి, ఉంటుందని నా నమ్మకం. చివరిగా ఇలా మీ అందరితో నా అనుభవాలు పంచుకోగలిగినందుకు బాబాకు, ఈ బ్లాగు సభ్యులకు నా నమస్కారాలు.

బాబాకి మాటిచ్చి అలక్ష్యం చేయకూడదు

సాయిభక్తులందరికీ నమస్తే. బాబా భక్తురాలినైన నా పేరు సునీత. మేము వైజాగ్‌ నివాసస్థులం. ఇటీవల బాబా నాకు ప్రసాదించిన అనుభవాలను నేనిప్పుడు మీతో పంచుకుంటాను. నేను ఒక బ్యూటీషియన్‌ని. నేను సొంతంగా ఒక బ్యూటీపార్లర్ నడుపుతున్నాను. ఈమధ్య ఒకరోజు నేను ఒక క్లయింట్‌కి ఫేషియల్ చేస్తుంటే, తన చెవిరింగు కనిపించలేదు. వెంటనే షాపు అంతా వెతికాము కానీ, ఆ రింగు కనిపించలేదు. దాంతో ఆ క్లయింట్ బాగా నిరాశ చెందింది. అప్పుడు నేను బాబాకి దణ్ణం పెట్టుకుని, "సహాయం చేయండి బాబా. క్లయింట్ చెవిరింగు దొరికితే, నా అనుభవం బ్లాగులో పంచుకుంటాను. ఈ విధంగా చాలామంది తమ వస్తువులు దొరికితే బ్లాగులో పంచుకుంటామని అనుకుంటే వాళ్ళవాళ్ళ వస్తువులు దొరుకుతున్నాయి కదా! అలాగే మాకు చెవిరింగు దొరికేటట్టు చేయండి బాబా. మీ అనుగ్రహాన్ని పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించాను. బాబా దయవలన వెంటనే ఆ చెవిరింగు దొరికింది. దాంతో క్లయింట్ చాలా హ్యాపీ ఫీల్ అయింది. నేను కూడా చాలా సంతోషించాను. అయితే ఏ రోజుకారోజు నేను నా అనుభవాన్ని బ్లాగుకి పంపిస్తాను అనుకుంటూ వారం రోజులపాటు అలక్ష్యం చేశాను. అప్పటికీ నేను 'ఇలా పంచుకుంటానని చెప్పి నిర్లక్ష్యం చేస్తే, బాబా ఊరుకోరు' అని అనుకుంటూనే ఉన్నాను. అంతలో 2022, జనవరి 11న ఒక క్లయింట్ ముక్కుపుడక షాపులో ఎక్కడో పడిపోయింది. తను ఎంత వెతికినా అది దొరకకపోవడంతో నేను కూడా 'బాబా బాబా' అనుకుంటూ వెతకడం మొదలుపెట్టాను. మాతోపాటు షాపుకి వచ్చిన క్లయింట్లు అందరూ వెతకసాగారు. అలా చాలాసేపు వెతికాముకానీ ముక్కుపుడక దొరకలేదు. దాంతో ముక్కుపుడక పోగొట్టుకున్న ఆ క్లయింట్ చాలా నిరాశకు గురైంది. అప్పుడు నేను, "బాబా! మొన్న ఇలాగే జరిగితే, నా అనుభవం పంచుకుంటానని మీతో చెప్పుకుని పంచుకోకుండా నిర్లక్ష్యం చేశాను. కానీ ఈరోజు వెంటనే ముక్కుపుడక దొరికినట్లైతే, ఆలస్యం చేయకుండా రెండు అనుభవాలూ బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకుంటూ ఉన్నాను. అంతలోనే అద్భుతం జరిగినట్లు ఆ ముక్కుపుడక దొరికింది. ఆనందంగా బాబాకి కృతజ్ఞతలు చెప్పుకుని మళ్ళీ అలక్ష్యం చేయకుండా నా అనుభవాన్ని బ్లాగుకి పంపాను. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".

సాయి భగవానుని నమ్ముకుంటే ఎటువంటి సమస్యల నుండైనా కాపాడుతారు

సాయి భక్తులకు నమస్కారం. నా పేరు శారద చంద్రశేఖర్. నేను సాయిభక్తురాలిని. సాయి భగవానుని నమ్ముకుంటే ఎటువంటి సమస్యల నుండైనా కాపాడుతారు. ఇది నా ప్రత్యక్ష అనుభవం. నేనిప్పుడు బాబా నాకు ఇటీవల ప్రసాదించిన ఒక అనుభవాన్ని పంచుకుంటాను. నేను, మా పాప విజయవాడ నుండి బయలుదేరి 2022, జనవరి 8, ఉదయం 5 గంటలకు హైదరాబాద్ చేరుకున్నాము. బస్సు దిగి ఆటోలో ఇంటికి వెళ్ళాము. మూడుగంటల తరువాత మాకు ఆటో వెనక భాగంలో పెట్టిన బ్యాగును ఆటోలోనే మరిచిపోయామని గుర్తు వచ్చింది. ఆ బ్యాగులో రెండు లాప్టాప్‌లు, సెల్‌ఫోన్ చార్జర్లు, మా పాప కాలేజీ ఐడి కార్డు ఉన్నాయి. వెంటనే మా పాప, వాళ్ళ నాన్నగారు ఆటో నెంబర్ కోసం సి.సి. కెమెరాలో చూశారు. కానీ అందులో ఆటో నెంబర్ కనిపించలేదు. సరేనని, మేము వచ్చిన దారిలో ఉన్న సి.సి. కెమెరాలలో చూద్దామని ప్రయత్నించారు కానీ అవేవీ పనిచేయడం లేదు. చివరికి మేము ఆటో ఎక్కిన చోట ఉన్న కెమెరాలో చూద్దామని పోలీసు స్టేషన్‌లో అడిగితే, "ఆ కెమెరాలు పదిరోజుల నుండి పనిచేయటం లేద"ని చెప్పి, "బ్యాగు మీ ఇంటి దగ్గర పోయినట్టు కాబట్టి, ఆ పరిధి పోలీసు స్టేషన్‌లో కంప్లైంట్ చేయండి" అని అన్నారు. దాంతో మా ఏరియాలో ఉన్న పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లైంట్ ఇస్తే, "ఆటో నెంబర్ తెలియదు కనుక ఏమీ చేయలేము" అన్నారు. ఇక చేసేదిలేక నేను, "సాయీ! ఇక మీదే భారం" అని చెప్పుకున్నాను. కొద్దిసేపటికి మా పరిచయస్తులు కొందరు వాళ్లకి తెలిసిన ట్రాఫిక్ కానిస్టేబుల్‌ని, కొంతమంది ఆటో యూనియన్ లీడర్లని సంప్రదించారు. వాళ్ల సలహా మేరకు మరునాడు ఉదయం ముందురోజు మేము ఆటో ఎక్కిన చోటికి వెళ్ళాము. అక్కడ కొంతమంది ఆటోడ్రైవర్లను కలిసి విషయం తెలిపితే, వెంటనే అక్కడే ఉన్న ఒకరు, "అవును, నా ఆటోలోనే మీరు మరచిపోయారు. రేపు మీరు వస్తారని వాటిని నా ఇంటిలోనే ఉంచాను. ఒకవేళ మీరు రాకపోతే పోలీస్ స్టేషన్‌లో అప్పగిద్దామని అనుకున్నాను" అని చెప్పారు. వెంటనే తన ఆటోలో మమ్మల్ని తన ఇంటికి తీసుకెళ్లి, మా బ్యాగు మాకిచ్చి, తిరిగి ఆటో స్టాండుకి చేర్చారు. అంత తేలికగా మా బ్యాగు మాకు తిరిగి దొరుకుతుందని మేము అస్సలు ఊహించలేదు. అంతా సాయి కృప అని అనిపించింది. వెంటనే సాయి మందిరానికి వెళ్ళి, బాబా దర్శనం చేసుకుని వచ్చాము. "ధన్యవాదాలు బాబా".

జై సాయినాథ్!!!


సాయిభక్తుల అనుభవమాలిక 1057వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

   1. బాబా కృపవలన పదిరోజుల తరువాత దొరికిన గోల్డ్ చైన్
2. బాబా కృపతో దొరికిన చెవి కమ్మ
3. బాబా అనుగ్రహంతో వివాహం


బాబా కృపవలన పదిరోజుల తరువాత దొరికిన గోల్డ్ చైన్


ముందుగా ఈ బ్లాగు నిర్వహిస్తున్న వారికి ధన్యవాదాలు. వారికి సాయినాథుని కరుణాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. నేనిప్పుడు బాబా నాకు ప్రసాదించిన అనుభావాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. "బాబా! మీరు నాకు ప్రసాదించిన అనుభవాన్ని ఆలస్యంగా బ్లాగులో పంచుకుంటున్నందుకు ముందుగా మీకు క్షమాపణలు చెప్పుకుంటున్నాను సాయితండ్రి".


2021, ఆగస్టు నెలలో మావారు పనిమీద తన స్నేహితులతో కలిసి హైదరాబాద్ వెళ్ళారు. అక్కడ వాళ్ళు ఒక హోటల్లో రూమ్ తీసుకుని, పని పూర్తి చేసుకుని రెండు రోజుల తర్వాత ఇంటికి తిరిగి వచ్చారు. అయితే మావారు తిరిగి వచ్చేటప్పుడు తన డ్రెస్సు ఒకటి హోటల్లో మర్చిపోయి వచ్చేసారు. సరే, 'బట్టలే కదా!' అని మేము పెద్దగా పట్టించుకోలేదు. అందువల్ల హైదరాబాదులో మా బంధువులు ఉన్నప్పటికీ ఆ డ్రెస్సు తెప్పించుకునే ప్రయత్నం కూడా చేయలేదు. పదిరోజుల తర్వాత మావారు తన గోల్డ్ చైన్ ఇవ్వమని నన్ను అడిగారు. నేను ఆ చైన్ కోసం సాధారణంగా ఎప్పుడూ పెట్టే చోట చూసాను. కానీ అది అక్కడ లేదు. దాంతో నేను, మా వారు ఇద్దరం కలిసి ఇంట్లో అన్ని చోట్లా వెతకసాగాము. అంతలో నేను చివరిసారి మావారు ఆ చైన్ ఎప్పుడు వేసుకున్నారో గుర్తుచేసుకుని ఆయనతో, "మీరు హైదరాబాదు వెళ్ళినప్పుడు చైన్ వేసుకుని వెళ్ళారు. అక్కడినుండి తిరిగి వచ్చిన తర్వాత మీరు నాకు ఆ చైన్ తిరిగి ఇవ్వలేదు. కాబట్టి మీరు చైన్ ఎక్కడ పెట్టారో గుర్తుతెచ్చుకోండి" అని అన్నాను. అయితే ఆయనకేమీ గుర్తు రాలేదు. ఇల్లంతా వెతికినా కానీ ఆ చైన్ దొరకలేదు. ఇప్పుడు ఉన్న బంగారం ధరను బట్టి ఆ చైన్ విలువ లక్షరూపాయలకు పైనే ఉంటుంది. తరువాత మావారు బయటకు వెళ్ళారు. నేను మాత్రం ఆ చైన్ గురించే ఆలోచిస్తూ, "చైన్ దొరికేలా చేయమ"ని బాబాను నిరంతరాయంగా ప్రార్థించసాగాను. కొంతసేపటి తర్వాత బాబా ప్రేరణవల్ల నాకు 'పదిరోజుల క్రితం మావారు హైదరాబాదు వెళ్ళినప్పుడు అక్కడ హోటల్లో తన డ్రెస్సు మరిచిపోయి వచ్చారు కదా, ఒకవేళ ఆ డ్రెస్సులో చైన్ ఉందేమో!" అని అనుమానం వచ్చింది. మావారు వచ్చిన తరువాత నాకొచ్చిన అనుమానం ఆయనతో చెప్పాను. దాంతో మావారు కూడా ఆలోచించడం మొదలుపెట్టారు. నేను బాబా ముందు కూర్చుని, "బాబా! మీరే ఇప్పుడు మాకు సహాయం చేయాలి. మీ కృపాదృష్టి మాపై వర్షించి ఆ చైన్ దొరికేలా చేయండి. అదే జరిగితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను. ఇంకా సచ్చరిత్ర పారాయణ చేస్తాను" అని బాబాతో చెప్పుకున్నాను. కాని నా మనస్సులో 'అసలు అలా జరుగుతుందా? పదిరోజుల ముందు వదిలి వచ్చిన బట్టలు ఇంకా అక్కడ ఉంటాయా? ఒకవేళ ఆ బట్టలు అక్కడే ఉన్నా, ఆ హోటల్లోని వర్కర్లు ఆ బట్టలను రిసెప్షన్లో ఇచ్చినా వాటిలో ఉన్న చైన్ ఎవరూ తీయకుండా ఉంటారా? ఈ కాలంలో దొరికిన వాటిని, అందులోనూ బంగారాన్ని తిరిగి ఇచ్చేవారు ఉంటారా?' అని పరిపరివిధాల ఆలోచనలు రావడంతో, "బాబా! మీకు అసాధ్యమైనది ఏమీ లేదు కదా! మీ కృపాదృష్టి మాపై ఉంటే మా చైన్ మాకు దొరుకుతుంది. దయచేసి మాకు సహాయం చేయండి సాయితండ్రి" అని బాబాకు చెప్పుకున్నాను. తర్వాత ఏం జరిగిందో ఎవరైనా ఊహించగలరా? నా బాబా అద్భుతం చేసారు.


మావారు తన ఫ్రెండ్‍తో జరిగిన విషయం చెప్పి, "ఒకసారి ఆ హోటల్‍కి వెళ్ళి డ్రెస్సు గురించి అడిగిరా" అని అన్నారు. అతను ఆ హోటల్‍కి వెళ్ళి, మావారి పేరు చెప్పి, "పదిరోజుల క్రితం ఇతను తన స్నేహితులతో మీ హోటల్లో రెండురోజులు ఉన్నారు. వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు రూమ్ కప్ బోర్డులో ఒక డ్రస్ మర్చిపోయి వెళ్లిపోయారు. అవి ఉన్నాయా?" అని మేనేజరుని అడిగారు. వెంటనే అతను, "హా హా సార్. వాళ్ళ బట్టలు ఉన్నాయి" అని చెప్పి వాటిని తెచ్చి మావారి ఫ్రెండ్‍కిచ్చారు. వెంటనే మావారి ఫ్రెండ్ ఆ డ్రెస్సు జేబులో చూస్తే, మా చైన్ అందులో ఉంది. అతను వెంటనే మా వారికి ఫోన్ చేసి చైన్ ఉందని చెప్పారు. మావారు వెంటనే నాకు ఫోన్ చేసి, "మిస్ అయిన చైన్ హోటల్లో మర్చిపోయిన డ్రెస్సులో ఉంద"ని చెప్పారు. అవధులు లేని నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. ఇదంతా కలా, నిజమా అనిపించగా బాబా ముందు కూర్చుని, "బాబా! ఈరోజు మీరు మా మీద ఇంతటి దయ చూపించినందుకు ధన్యవాదాలు తండ్రి. మీరు ఎల్లప్పుడూ ఇలాగే మాపై, మీ బిడ్డలందరిపై మీ దయాదృష్టిని వర్షిస్తూ ఎల్లవేళలా అందరికీ తోడుగా  ఉండమని మమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రార్ధిస్తున్నాను. మీకు మాటిచ్చినట్లుగానే నా అనుభవాన్ని బ్లాగులో సాయిబిడ్డలందరితో పంచుకుంటున్నాను. మీరు నాకు ప్రసాదించిన ఈ చక్కటి అనుభవాన్ని వ్రాసేటప్పుడు ఏమైనా తప్పులు దొర్లి ఉంటే మీ బిడ్డను క్షమించండి తండ్రి".


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజాధిరాజ యోగిరాజ సమర్ధ సద్గురు శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


బాబా కృపతో దొరికిన చెవి కమ్మ


ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి!!! సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. ఇంత మంచి బ్లాగును ఏర్పాటు చేసిన బ్లాగు నిర్వాహకులకు నా ధన్యవాదాలు. నా పేరు సుజాత. నేను ఇదివరకు బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలు పంచుకున్నాను. ఇప్పుడు బాబా అనుగ్రహంతో మరికొన్ని అనుభవాలను పంచుకుంటున్నాను. ముందుగా ఆలస్యంగా పంచుకుంటున్నందుకు బాబాకి క్షమాపణలు చెప్పుకుంటున్నాను. ఒకసారి నా బంగారపు చెవి కమ్మ కనపడకుండా పోయింది. ఎంత వెతికినా దొరకలేదు. ఇక నేను కన్నీళ్లు పెట్టుకుని, "బాబా! నా చెవి కమ్మ ఎలాగైనా దొరికేలా అనుగ్రహించండి. మీ దయతో నా చెవి కమ్మ దొరికినట్లైతే నా అనుభవాలను తోటి భక్తులతో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. అలా బాబాకి మ్రొక్కిన రెండు నెలల తరువాత ఒక గురువారంనాడు నా చెవి కమ్మ మెట్ల దగ్గర దొరికింది. దాన్ని చూడగానే నా కళ్ళలో ఆనందభాష్పాలు నిండిపోగా బాబాకి కృజ్ఞతలు చెప్పుకుని ఆ చెవి కమ్మను తీసుకున్నాను, మా ఇంట్లో ఎవరికైనా జ్వరం వచ్చినా, ఇంకేవిధమైన ఆరోగ్య సమస్య వచ్చినా మేము బాబాకి చెప్పుకుని, ఆయన ఊదీ పెట్టుకుంటాము. 5 నిమిషాల్లో ఫలితం కనిపిస్తుంది. ఈ కరోనా కాలంలో బాబా మమ్మల్ని ఎంతగానో రక్షించారు. "సాయినాథా! నువ్వే నా తండ్రివి. జన్మజన్మలకు నేను మీకే భక్తురాలిగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను దేవా. నాకు ఇంకా కొన్ని సమస్యలున్నాయి. మీ కృపతో అతి త్వరలోనే అవి తొలగిపోవాలని మీ పాదాలకు కన్నీటితో విన్నవించుకుంటున్నాను బాబా".


బాబా అనుగ్రహంతో వివాహం


ఈ బ్లాగు నిర్వాహకులకు నా ధన్యవాదాలు. బ్లాగు చదువుతూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. నేను ఒక సాయి భక్తురాలిని. సాయిబాబా నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశారు. నేను ఇప్పుడు నా పెళ్ళికి సంబందించిన అనుభవాన్ని పంచుకుంటాను. నాకు చాలా సంబంధాలు వచ్చాయి. కానీ ఏవీ కుదిరేవి కాదు. నేను బాబానే నమ్ముకున్నాను. బాబా ఆన్లైన్‍లో మెసేజ్ల ద్వారా నాకు తగిన సలహాలు/సూచనలు ఇస్తుండేవారు. బాబా చెప్పినట్టే జరుగుతుండేవి. చివరికి బాబా ఆశీస్సులతో నాకు మంచి సంబంధం కుదిరింది. నేను అందరితో కలిసి, అందరి మధ్య సంతోషంగా నిశ్చితార్థం, పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. కానీ కరోనా వల్ల పెళ్లికి సంబంధించి అన్నీ ఎలా జరుగుతాయో అని చాలా భయపడ్డాను. అప్పుడు కూడా బాబాని ప్రార్థిస్తూ ఆయన మీదే నమ్మకం ఉంచాను. బాబా దయవల్ల నిశ్చితార్థం, పెళ్లి సమయానికి కరోనా ఉధృతి లేకపోవడం వల్ల అన్నీ బాగా జరిగాయి. "థాంక్యూ సో మచ్ బాబా. ఇలాగే సదా మీ అనుగ్రహం మాపై కురిపించు తండ్రి".



సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo