1. అడుగడుగునా బాబా సహాయం
2. సర్టిఫికెట్ రెన్యూవల్ చేయించిన బాబా
3. సాయితండ్రిని అర్థిస్తే, ఎటువంటి సహాయమైన చేస్తారు
అడుగడుగునా బాబా సహాయం
అందరికీ నమస్తే. నా పేరు భావన. మేము కెనడాలో నివాసముంటున్నాము. నేను ఇంతకుముందు మా వీసా అప్లికేషన్ ప్రాసెసింగ్ మొదలయ్యేలా బాబా ఎలా ఆశీర్వదించారో 'సాయి భక్తుల అనుభవమాలిక 722వ భాగంలో' పంచుకున్నాను. ఇప్పుడు నా వీసా అప్లికేషన్ ప్రాసెసింగ్ పూర్తవడం, ఆపై కెనడా వచ్చిన తరువాత అడుగడుగునా బాబా నాకు ఎలా సహాయం చేస్తున్నారో మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. 2021, ఫిబ్రవరిలో నా వీసా అప్లికేషన్ ప్రాసెసింగ్ మొదలుపెట్టి బ్యాక్ గ్రౌండ్ చెక్ కోసం అప్లికేషన్ని ఢిల్లీ ఆఫీసుకి పంపారు. ఢిల్లీ ఆఫీసులో పని బాగా ఆలస్యంగా జరుగుతుంది. మాతో అప్లై చేసిన వాళ్ళలో చాలామందివి చివరి దశకు వచ్చాయి కానీ, సెప్టెంబర్ నెల వచ్చినా కూడా మా వీసా ప్రాసెసింగ్‍లో ఎలాంటి అప్డేట్ జరగలేదు. అదలా ఉంటే, నా భర్త పెళ్ళై సంవత్సరం దాటినందువల్ల అప్లికేషన్ ప్రాసెసింగ్ పూర్తయ్యేదాకా నాతో ఉందామని తన ఆఫీసులో మూడు నెలలు సెలవు పెట్టి ఆగస్టులో ఇండియాకి వచ్చారు. ఆయన అక్టోబర్ నెల చివరిలో తిరిగి వెళ్ళిపోవాల్సి ఉంది. అందువల్ల నేను, "బాబా! ఇప్పటికే నేను చాలా నెలలుగా మావారికి దూరంగా ఉన్నాను. ఎలాగైనా మావారితో పాటు తిరిగి వెళ్లేలా అనుగ్రహించండి బాబా" అని బాబాను ఎంతగానో ప్రార్థించాను. వినాయకచవితి ముందురోజు అంటే సెప్టెంబర్ 9న ఒక కాగితం మీద 'విజయదశమి లోపల వీసా అప్లికేషన్ ప్రాసెసింగ్ పూర్తయ్యేలా చేసి, మేము ఇద్దరమూ కలిసి కెనడా వెళ్ళేలా ఆశీర్వదించమ'ని మా కోరికను రాసి, బాబా ముందు పెట్టి నవగురువార వ్రతం మొదలుపెట్టాము. అద్భుతం! మరుసటిరోజు శుక్రవారం అప్లికేషన్ బ్యాక్ గ్రౌండ్ చెకింగ్ పూర్తయి ఆఖరి దశకు వచ్చినట్లుగా మాకు తెలిసింది. సరిగ్గా అక్టోబర్ 15, విజయదశమి (బాబా పుణ్యతిథి) రోజున పాస్పోర్ట్ స్టాంపింగ్ పూర్తయ్యి నా చేతికి వచ్చింది. అంటే 9 వారాలు పూర్తయ్యేలోపే బాబా దయవల్ల నా పాస్పోర్ట్ స్టాంపింగ్ పూర్తయింది. నవంబరు 4, దీపావళి రోజున వ్రతంలో ఆఖరివారం ఉద్యాపన పూర్తిచేసి నవంబర్ 6న నేను మా వారితో కలిసి కెనడాకి బయలుదేరాను. బాబా ఆశీస్సులతో నవంబరు 8న మేము క్షేమంగా కెనడాకి చేరుకున్నాము.
2021, నవంబర్ 13న మావారు పని మీద బయటకు వెళ్తున్నప్పుడు నా మనసుకి ఏదో కంగారుగా అనిపించి, "బాబాకి దణ్ణం పెట్టుకుని, జాగ్రత్తగా వెళ్లి, రండి" అని మావారితో అన్నాను. ఆయన నేను చెప్పినట్లే బాబాకి దణ్ణం పెట్టుకుని వెళ్లారు. అలా వెళ్లిన ఆయన ఒక సిగ్నల్ దగ్గర లెఫ్ట్ తీసుకోవడానికి ఆగినప్పుడు ఒక ట్రక్ వచ్చి ఒక కారుని గుద్దింది. ఆ ఫోర్స్ కి ఆ కారు మావారి కారు వైపు రావడం గమనించిన మావారు ఏం చేయాలని ఆలోచించేలోపే అది మా కారుని గుద్ధింది. కారుకి ఉన్న ఫ్రేమ్ అంతా డామేజ్ అయ్యింది. డ్రైవింగ్ సీటు వైపు ఉన్న డోర్ కూడా పాడైంది. ఇంకాస్త బలంగా గుద్ది ఉంటే మావారి మోకాలికి పెద్ద దెబ్బ తగిలి ఉండేది. బాబా అనుగ్రహం వలన తనకి ఏమీ జరగలేదు. చిన్నగా గీరుకుపోవడం కూడా కాలేదు. పెళ్ళైన ఒకటిన్నర సంవత్సరం తరువాత మావారి దగ్గరకొచ్చి జీవితం మొదలుపెడుతున్నాననుకున్న వారానికే ఇలా జరిగేసరికి నాకు చాలా భయం వేసింది. కానీ 'బాబానే నాకు ఈ సంబంధాన్ని కుదిర్చారని, వీసా ఇచ్చి మావారి దగ్గరకి చేర్చి, మేము కలిసి ఉండేలా అనుగ్రహించార'ని గుర్తుకు రాగానే, 'ఆయన మాకు ఏమీ కాకుండా ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటార'ని సంతోషం వేసింది. నిజానికి నాకు ఆక్సిడెంట్స్ అంటే చాలా భయం. అందుచేత నేనెప్పుడూ బాబాను, "మావారితో ఉండి, తనని సదా కాపాడుతూ ఉండమ"ని అడుగుతుండేదాన్ని. నా ప్రార్థనను మన్నించి, బాబా మావారికెదురుగా ఉండి(మా పెళ్ళైన తరువాత మేము శిరిడీ వెళ్ళినప్పుడు కారులో పెట్టుకోవడానికి ఒక చిన్న బాబా విగ్రహాన్ని తీసుకున్నాము. ఆ బాబా విగ్రహాన్ని మావారు కెనడా వెళ్ళగానే తన కారులో స్టీరింగ్ ఎదురుగా పెట్టుకున్నారు.) ఆ ప్రమాదం నుండి తనని కాపాడారు. ధన్యవాదాలు బాబా.
ఆ తర్వాత ఇన్స్యూరెన్స్ కంపెనీ వాళ్ళు కారు మరామత్తు చేయంచలేమని చెప్పి, కారు విలువకి తగట్టు డబ్బులు చెక్ రూపంలో పంపారు. ఆ చెక్కుని మేము బ్యాంకులో ఇచ్చాము. చెక్ క్లియరై ఐదురోజుల్లో డబ్బులు ఎలాగూ వస్తాయని, ఆ లోపల కారు లేకుంటే కష్టంగా ఉంటుందని, వాతావరణం కూడా చల్లగా అవుతుందని కొత్త కారు తీసుకున్నాము. కొత్త కారుకి డౌన్ పేమెంట్ క్రింద క్రెడిట్ కార్డు ద్వారా డబ్బులు కట్టి, క్రెడిట్ కార్డు బిల్లు వచ్చే లోపల చెక్కు క్లియర్ అయిపోతుందని అనుకున్నాము. కానీ ఐదురోజుల్లో క్లియర్ అవ్వాల్సిన చెక్కు మూడు వారాలైనా కాలేదు. బ్యాంకుకి వెళ్లి అడిగితే, "చెక్కు మిస్సయింది. మళ్ళీ డిపార్ట్మెంట్‍కి పంపామ"ని ఏదేదో చెప్పారు. ఈలోగా క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించాల్సిన తేదీ దాటిపోయినా ఇల్లు మారడం వల్ల ఇతరత్రా ఆర్థిక ఇబ్బందులు తోడై క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేకపోయాము. అందువల్ల ఇంట్రెస్ట్ పడుతుందని మా వారు చాలా టెన్షన్ పడ్డారు. ఒక గురువారం బ్యాంకుకి వెళ్ళాల్సి ఉండగా నేను బాబాకి దణ్ణం పెట్టుకుని పారాయణ మొదలుపెట్టి, "ఎలాగైనా వచ్చే గురువారానికి డబ్బు వచ్చేలా కరుణించమని, అలా జరిగితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాని ప్రార్థించాను. బాబా దయ చూపారు. మరుసటి గురువారం ఉదయం బ్యాంకు అకౌంటు ఓపెన్ చేసి చూస్తే, ఆ ముందు రోజు(బుధవారం) సాయంత్రమే చెక్కు క్లియరై అకౌంటులో డబ్బులు పడినట్లు ఉంది. దాంతో వెంటనే క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టేసాము.
మేము కెనడా వచ్చిన వెంటనే తాత్కాలికంగా ఉండేందుకు బాబా మాకు ఒక అపార్ట్మెంట్‍ని చూపించారు. ఆ ఆపార్ట్మెంట్ గడువు నవంబర్ 28తో ముగుస్తుందనగా మేము ఎంత వెతికినా మా బడ్జెట్లో అపార్ట్మెంట్ దొరకలేదు. మావారు మూడు నెలలు సెలవు పెట్టడం వల్ల, శాలరీ స్లిప్స్ లేకపోవడం వల్ల అపార్ట్మెంట్ దొరకటంలో సమస్య అయింది. నాకు బాబా మీద చాలా నమ్మకం. నేను ప్రతిరోజు బాబాను, "మంచి ఏరియాలో, బస్సు స్టాప్ దగ్గరగా ఉండేలా మంచి అపార్ట్మెంట్ దొరికేలా అనుగ్రహించమ"ని ప్రార్థిస్తూ ఉండేదాన్ని. అపార్ట్మెంట్ టెన్షన్, కారు ఆక్సిడెంట్, ఆర్థిక ఇబ్బందుల వల్ల చాలా బాధపడుతున్నప్పటికీ 'బాబా ఉన్నారు' అనే ధైర్యంతో ఓపికగా ఉండేవాళ్ళం. నవంబర్ 18న ఒక అపార్ట్మెంట్ చూడడానికి వెళ్ళాము. ఆరోజు గురువారం అయినందున ఖచ్చితంగా ఆ అపార్ట్మెంట్ కన్ఫర్మ్ అవుతుందని అనుకున్నాను. కానీ అందులో పార్కింగ్ లేకపోవడం వల్ల ఏం చేయాలో అర్థంకాక రోడ్డు పక్కన వేచి ఉన్న సమయంలో ఆ ఏరియాలో ఇంకా ఏమైనా అపార్ట్మెంట్స్ ఉన్నాయేమో అని వెతికితే రెండు వీధుల తర్వాత ఒక అపార్ట్మెంట్ ఖాళీగా ఉండటం కనిపించింది. వెంటనే వెళ్లి ఆ అపార్ట్మెంట్ చూసాము. మేము అంతకుముందు చూసిన అపార్టుమెంట్ల కంటే ఆ అపార్ట్మెంట్ పెద్దది, పైగా నేను అనుకున్నట్లు బస్టాప్ ఎదురుగా ఉంది. వెంటనే ఆ అపార్ట్మెంట్‍కి అప్లై చేశాము. బాబా దయవల్ల అప్లై చేసిన మూడుగంటల్లోనే మా అప్లికేషన్ ఆమోదం పొందింది. సహజంగా ఇక్కడ రెండు నెలల రెంటు తీసుకుంటారు. అలాంటిది మాకు మొదటి నెల రెంట్ లేకుండా రెండో నెల రెంటు మాత్రమే డిపాజిట్‍గా తీసుకున్నారు. మొదటి నెల ఫ్రీ రాకపోయి ఉంటే మాకు చాలా కష్టమయ్యేది, అప్పు చేయాల్సి వచ్చేది. ఆ బాధలేవీ లేకుండా బాబా మమ్మల్ని కాపాడారు. అలా అపార్ట్మెంట్ చూపించడమే కాకుండా ఆర్థికంగా మాకు సహాయం చేశారు బాబా. బాబా మమ్మల్ని ఇంతలా అనుగ్రహిస్తూ, ఇంత ప్రేమ మా మీద చూపిస్తున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. "ధన్యవాదాలు బాబా".
ఓం శ్రీ సాయినాథాయ నమః!!!
సర్టిఫికెట్ రెన్యూవల్ చేయించిన బాబా
సాయిభక్తులందరికీ నమస్కారం. నా పేరు హేమచంద్రుడు. బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. నేను ఫార్మసీ చేశాను. నా ఫార్మసీ సర్టిఫికెట్ రెన్యూవల్ 2020, డిసెంబరులో చేయాల్సి ఉండగా కరోనా విషమ పరిస్థితుల్లో ఎలా చేయించుకోవాలో నాకు తెలియలేదు. రెన్యూవల్ చేసుకోకుండానే ఆరునెలలు గడిచిపోయాయి. అప్పటికీ నాకు రెన్యూవల్ ఎలా చేసుకోవాలో తెలియక మా తమ్ముణ్ణి(పిన్నికొడుకు) అడిగితే, "ఆన్లైన్‍లో చేసుకోవచ్చు" అని చెప్పాడు. అప్పుడు నేను ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి వెళ్లి నా సర్టిఫికేట్ నెంబరు ఎంటర్ చేస్తుంటే, నా పేరుకు బదులు వేరే వాళ్ళ పేరు రాసాగింది. నాకు ఏమి చేయాలో తెలియలేదు. అలా ఇంకో రెండు నెలలు గడిచిపోయాయి. మళ్ళీ మా తమ్ముణ్ణి అడిగితే, "రెన్యూవల్ సమయం దాటిపోయి 8 నెలలు అయినందున ఫార్మసీ బోర్డు వాళ్ళు సర్టిఫికెట్‍ను బ్లాక్ చేసారేమో! కనుక వెంటనే బయలుదేరి గుంటూరులోని కార్యాలయానికి వెళ్ళు అన్న" అని చెప్పాడు. అయితే నాకు ఏమీ తెలియదు. అందుచేత మా తమ్ముడే అడ్రెస్స్ మొదలుకుని అన్ని విషయాలు చెప్పి గుంటూరు ఎలా వెళ్లాలో కూడా చెప్పాడు. అంతే, నేను బాబా మీద భారంవేసి బయలుదేరాను. ఇక బాబా మహిమ చూడండి. నేను రైల్వేస్టేషన్‍కి వెళ్లి టికెట్ కోసం టికెట్ కౌంటరు దగ్గరకి వెళితే, "టిక్కెట్లు మాన్యువల్‍గా ఇవ్వడం లేదు, ఆన్లైన్లో తీసుకోవాలి" అని చెప్పారు. దాంతో ఇప్పుడెలా అనుకుంటూ బాబా నామస్మరణ చేస్తూ రైల్వేస్టేషన్ లోపలికి వెళ్ళాను. ఒక పది నిమిషాల తర్వాత నాకు దగ్గరగా నిలబడి ఉన్న వాళ్ళు, "10 మందికి రిజర్వేషన్ చేసుకుంటే ఆరుగురు వచ్చారు. మిగతా నలుగురు రావడం లేదు. వాళ్ళకోసం తీసిన టికెట్లు వేస్టు అవుతున్నాయి" అని మాట్లాడుకుంటున్నారు. నేను వాళ్ళ దగ్గరకి వెళ్లి, "నేను మీతో గుంటూరు వరకు వస్తాను" అంటే, రమ్మని గుంటూరు వరకే టికెట్ డబ్బులు తీసుకున్నారు. ఇక నేను గూంటూరు చేరిన తర్వాత స్నానం చేసి స్టేషన్ బయటకొచ్చి కొంచెం దూరం వెళ్లేసరికి బాబా గుడి కనిపించింది. వెంటనే ఆ గుడికి వెళ్లి బాబా దర్శనం చేసుకున్నాను. తరువాత బయటకి వచ్చి ఆటో ఎక్కి నేను వెళ్లాల్సిన ఆఫీసుకు వెళ్లాను. బయట ఆఫీసుకెదురుగా 'ఇక్కడ ఆన్లైన్లో ఫార్మసీ సర్టిఫికెట్లు రెన్యూవల్ చేయబడును' అని ఉంది. అక్కడికి వెళ్లి అడిగితే, చెక్ చేసి, "వేరే పేరు వస్తుంది. ఆఫీసుకు వెళ్లి అడగండి. అయితే పని ఈ రోజు లేదు రేపు అవుతుంది" అని చెప్పారు. దాంతో ఆఫీసుకి వెళ్లి లోపల బాబా నామస్మరణ చేస్తూ కూర్చున్నాను. అంతలో అక్కడున్న సార్లు పిలిస్తే, వెళ్లి విషయం చెప్పాను. అప్పుడు వాళ్ళు, "ఒక అరగంట వేచి ఉండండి. పిలుస్తాం" అని అన్నారు. అయితే ఒక గంటైనా పిలవలేదు. దాంతో లోపలికి వెలితే పదినిమిషాలు నిరీక్షింపజేసి ఆన్లైన్లో చెక్ చేసి నా సర్టిఫికెట్లు సరిచేసి, "మీ పని అయిపోయింది. ఇక వెళ్ళండి. మీరు ఇప్పుడు ఆన్లైన్లో రెన్యూవల్‍కి అప్లై చేసుకుంటే సరిపోతుంది" అని చెప్పారు. నేను అక్కడి నుండి వచ్చేసి ఆన్లైన్లో అప్లై చేశాను. అందరికీ రెన్యూవల్ కావడానికి రెండు నుండి మూడునెలలు పడితే నాకు మాత్రం నెలరోజుల్లోనే రెన్యూవల్ అయి సర్టిఫికెట్ వచ్చేసింది. అంతా బాబా దయ అనుకున్నాను. "ధన్యవాదాలు బాబా. నేను ప్రారంభించిన ఎలక్ట్రికల్స్ షాపు సరిగా నడవడం లేదు. షాపు బాగా నడిచి అభివృద్ధిలోకి వచ్చేలా అనుగ్రహించండి బాబా". నా షాపు గురించి బాబాని ప్రార్థించమని సాయిభక్తులందరికీ కూడా విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
సాయితండ్రిని అర్థిస్తే, ఎటువంటి సహాయమైన చేస్తారు
ఓం సాయినాథాయ నమః!!! సాయిభక్తులందరికీ నా నమస్సుమాంజలి. బ్లాగు నిర్వహిస్తూ సాయిభక్తుల అనుభవాలను అందరికీ అందిస్తున్న బ్లాగు నిర్వాహకులకు నా ధన్యవాదాలు. నాపేరు చంద్రకళ. నేను ఇదివరకు ఈ బ్లాగులో కొన్ని అనుభవాలు పంచుకున్నాను. ఇప్పుడు మరొక అనుభవాన్ని పంచుకుంటున్నాను. 2021, నవంబర్ నెలలో మేము ఊరు వెళుతూ తులసిమొక్కకి నీళ్లు పోయమని మా పక్కింటివాళ్ళకి చెప్పాము. రోజూ వర్షం పడుతున్నా వాళ్ళు నీళ్లు పోయడంతో మేము వచ్చేసరికి నీళ్ళు ఎక్కువై తొట్టిలో బురదలా అయిపోయి, మొక్క ఆకులు రాలిపోయి, మొక్క అంతా ఎండిపోయినట్లు అయిపోయింది. నాకు చాలా బాధేసింది. క్రొత్త మొక్కకోసం అపార్టుమెంటులో తులసిమొక్క ఉన్న వాళ్ళ ఇళ్లలో చూసాను కానీ, ఎక్కడా దొరకలేదు. నాకు ఏమి చేయాలో తెలియక బుధవారం అంతా చాలా బాధపడ్డాను. ఆరోజు రాత్రి కూడా బాధపడుతూ బాబాని తలుచుకుంటూ పడుకున్నాను. మరుసటిరోజు గురువారం తెల్లవారుఝామున నాకొక కల వచ్చింది. ఆ కలలో మా తొట్టిలో పచ్చని తులసిమొక్కలు ఉన్నట్లు కనిపించింది. దాంతో నా మనసుకి ఏదోవిధంగా బాబా తులసి మొక్క వచ్చేటట్లు చేస్తారనిపించి లేచి నా పనులు చేసుకున్నాను. మధ్యాహ్నం 2గంటల సమయంలో మా క్రింది ఇంటి ఆవిడ నాకు ఫోన్ చేసి, "మా ఫ్రెండ్ ఇంటి నుండి తులసిమొక్కలు తెచ్చాను. వచ్చి తీసుకెళ్లండి" అని చెప్పింది. అది విన్న నా సంతోషానికి హద్దులు లేవు. వాళ్ళింటికి వెళ్లి చూస్తే, ఆ మొక్కలు నాకు కలలో కనిపించిన మొక్కల్లానే ఉన్నాయి. భగవాన్ సాయితండ్రిని అర్థిస్తే, ఎటువంటి సహాయమైన చేస్తారు. మా అత్తమామల విషయంలో కూడ బాబా నాకు ఎంతో సహాయం చేసి భాద్యతలు నిర్వర్తించడానికి కావలసిన శక్తినిచ్చారు. "ధన్యవాదాలు బాబా".
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై!!!
Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������
ReplyDeleteOm sai ram ��
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Jaisairam bless amma for her eye operation recovery and bless me for my health and wealth of happiness and happiness in the world of yours Jaisairam
ReplyDeleteOm sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDeleteOm sai ram baba ma arogya samasyalani teerchu thandri sainatha pleaseeee
ReplyDeleteOm sai ram om sai ram omsairam
ReplyDelete