1. బాబా మనల్ని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటారు
2. అండగా ఉన్నామని నమ్మకాన్ని కలిగించిన బాబా3.చిటికెలో భారమంతా తొలగించిన బాబా
బాబా మనల్ని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటారు
నేను ఒక సాయిభక్తురాలిని. ముందుగా సాయిబంధువులందరికీ నమస్కారాలు. రోజూ బ్లాగులోని భక్తుల అనుభవాలు చదవడం వలన ఎంతో మనశ్శాంతి, దైర్యం, నమ్మకం కలుగుతున్నాయి. నేను డిగ్రీ చదివేటప్పుడు నాకు బాబాపట్ల నమ్మకం ఏర్పండింది. నేను ఏ దైవాన్ని చూసినా వారిలో బాబాను చూస్తాను. నేనిప్పుడు బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను మీతో పంచుకుంటాను. 2022 నూతన సంవత్సరం ఆరంభంలో నేను నా ఉద్యోగవిధులలో చూపిన కొద్దిపాటి అలసత్వం కారణంగా పైఅధికారుల కోపానికి గురయ్యే పరిస్థితి వచ్చింది. సమస్య కాస్త పెద్దదైనందున నేను చాలా భయపడి, "బాబా! నా సమస్య పరిష్కారమయ్యేలా చూడండి" అని బాబాని వేడుకొని ఈ బ్లాగు ఓపెన్ చేసాను. ఆరోజు(2022, జనవరి 10) సాయిభక్తుల అనుభవమాలికలో ముఖ్యంగా 'పెద్ద సమస్య నుండి సురక్షితంగా బయటపడేసిన బాబా' అన్న టైటిల్‌తో ఉన్న మురళిమోహన్‍గారి అనుభవం చూడగానే బాబా నాకు ధైర్యం చెప్తున్నారని నాకు ధైర్యం వచ్చింది. అంతే!భయపడకుండా నేను ఆఫీసుకు వెళ్ళాను. అక్కడ నేను అనుకున్నట్లు అంత పెద్ద ప్రమాదమేమీ లేదు. ఇలా బాబా నన్ను ఎల్లప్పుడూ కాపాడుతున్నారు.
కొంతకాలం క్రిందట నేను నోటి దురుసుతనం వల్ల మా బంధువులతో వాళ్ల మనసు కష్టపడేలా మాట్లాడాను. దాంతో వాళ్ళు కోపగించుకుని నాకు శాపనార్థాలు పెట్టారు. ఆ విషయం గుర్తుకు వచ్చినప్పుడల్లా నాకు భయంగా, బాధగా ఉండి, 'సాయి చూపించిన సూచనలను అర్థం చేసుకోకుండా తప్పు చేసాన'ని అనుకుంటూ ఉంటాను. దాంతో నా మనస్సుకు స్థిమితంలేక దుఃఖం, అనాసక్తి నన్ను ఆవరిస్తూ ఉంటాయి. అందుచేత నేను సాయితో, "ఎలాగైనా నేను ఈ పాపం నుండి విముక్తి పొందాలి" అని చెప్పుకుని బ్లాగులోని అనుభవాలు చదివాను. ఆరోజు(2022, జనవరి 9, ఆదివారం) బ్లాగులో ప్రచురించిన అనుభవాలలో ఒక భక్తుడు తన అనుభవంలో భాగంగా నామస్మరణ గురించి బాబా చెప్పిన ఈ క్రింది సందేశాన్ని పంచుకున్నారు.
నామస్మరణ - బాబా సందేశం: "నామం పాపాలనే పర్వతాలను పగలగొట్టుతుంది. నామం శరీర బంధనాలను విడగొట్టుతుంది. నామం కోటి చెడు వాసనలను సమూలంగా పెరికి వేస్తుంది. నామం కాలుని మెడను విరిచేస్తుంది. నామం జననమరణ చక్రాన్ని తప్పిస్తుంది. ప్రయత్నపూర్వకంగా నామాన్ని స్మరిస్తే మంచిది. అప్రయత్నంగా నామజపం చేసినా చెడు కలుగదు. తెలియకుండా నోటితో ఉచ్చరించినా నామ ప్రభావం ప్రకటమౌతుంది. అంతఃకరణాన్ని పరిశుద్ధపరచడానికి నామం కంటే సులభమైన మరో సాధనం లేదు. నామం జిహ్వకు భూషణం. నామం పరమార్థాన్ని పోషిస్తుంది. నామజపానికి స్నానం చేయాల్సిన అవసరం లేదు. అట్లే నామానికి విధి విధానాలేవీ లేవు. నామ సంకీర్తనలో సకల పాపాలు నశించిపోతాయి. నామం ఎల్లప్పుడూ పావనమైనది. అనవరతం నా నామాన్ని స్మరించేవారు తీరానికి చేరుకుంటారు. ఇతరసాధనలేవీ అవసరం లేకుండానే మోక్షం హస్తగతమవుతుంది. నా నామాన్ని ఎల్లప్పుడూ జపించేవారి పాపాలు క్షాళనమవుతాయి. మెల్లగా లోలోపల నా నామాన్ని జపించేవారు ఉత్తమ గుణ సంపన్నులకంటే ఉత్తములు".
పై సందేశం చదివగానే నామస్మరణ చేయటం వలన పాపాలు పటాపంచలవుతాయని తెలిసి నా మనసుకి ఎంతో శాంతి చేకూరింది. బాబా నా సమస్యకు మార్గం చూపారని అప్పటినుండి నేను నామజపం చేస్తున్నాను.
చాలా సంవత్సరాల క్రితం నేను బాబాను తామరపువ్వులతో పూజిస్తున్నట్లు ఊహించుకునేదాన్ని. తర్వాత నేను శిరిడీ సమాధి మందిరంలోని బాబా ఫోటోలను చూస్తుంటే, బాబాను తామరపూలతో అలకంరించినట్లు ఉంది. అలా అంతకుముందు ఎప్పుడూ తామరపూలతో అలంకరించిన బాబా ఫోటోలను నేను చూడలేదు. నేను తామరపూలతో బాబాను పూజించినట్లు ఊహించుకున్న తర్వాతే బాబా నాకు అలా దర్శనమివ్వడంతో బాబా నా కోరికను మన్నించారని నాకు చాలా సంతోషంగా అనిపించింది. నా అనుభవాల ద్వారా నాకు తెలిసింది ఏమిటంటే, 'మనకు తెలియకుండానే బాబా మనల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటార'ని. నేను నా పిల్లలకి, "నా తదనంతరం మీకు ఏదైనా సమస్య వస్తే, బాబాకి దణ్ణం పెట్టుకోండి. బాబా వెంటనే మీకు పరిష్కారం చూపిస్తారు" అని చెప్తూ ఉంటాను. నేను కూడా ఆ సాయినాథునితో నా పిల్లల క్షేమం గురించి మొరపెట్టుకుంటూ ఉంటాను. "ధన్యవాదాలు బాబా. అందరినీ చల్లగా అనుగ్రహించండి".
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి!!!
అండగా ఉన్నామని నమ్మకాన్ని కలిగించిన బాబా
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
సమస్త సాయిబంధువులకు వందనాలు. నా పేరు అనూజ. మాది నిజామాబాద్. 2022, జనవరి 8న మావారికి విపరీతమైన జ్వరం వచ్చింది. అసలెప్పుడూ జ్వరం రాని ఆయనకి జ్వరం వచ్చేసరికి నాకు చాలా భయమేసి, "బాబా! ఉదయానికల్లా మావారికి జ్వరం తగ్గిపోయేలా అనుగ్రహించండి" అని బాబాకి మొర పెట్టుకున్నాను. తరువాత మావారికి డోలో 650 టాబ్లెట్ వేసి, బాబా ఊదీ వేసిన నీళ్ళు త్రాగించాను. అంతే, జ్వరం నెమ్మదిగా తగ్గనారభించి తెల్లారేసరికి పూర్తిగా తగ్గిపోయింది. మళ్ళీ తిరిగి రాలేదు. ఆ రోజు బాబా వాట్సప్ గ్రూపులో అనుకూలమైన సందేశం ఇచ్చారు బాబా. అది చూసాక బాబా నాకు అండగా ఉన్నారని నమ్మకం కుదిరింది. ఇకపోతే జ్వరం తగ్గిందికానీ, మావారు బాగా నీరసించిపోయారు. బాబా దయవల్ల తర్వాత నార్మల్ అయ్యారు. "ధన్యవాదాలు బాబా అందరినీ చల్లగా చూడు తండ్రి. మా అందరికీ మీ ఆశీస్సులు సదా ఉండాలని కోరుకుంటున్నాను బాబా. శతకోటి వందనాలు బాబా".
చిటికెలో భారమంతా తొలగించిన బాబా
సాయి బంధువులందరికీ నా నమస్కారాలు. నా పేరు వాణి. మాది విజయవాడ. 2022, జనవరి మూడో వారంలో రెండు రోజులపాటు మా బాబుకి జలుబు, జ్వరం ఉండటంతో తను భయపడుతూ, "నాకు కోవిడ్ ఏమోనని అనుమానంగా ఉంది" అని అన్నాడు. నేను కూడా అదే భయంతో ఉన్నాను. ఎందుకంటే, అంతకుముందు మా వారికి కూడా ఇలాగే జలుబు, జ్వరం ఉండేవి. వెంటనే నేను బాబాకి నమస్కరించుకుని, "బాబుకి నయమయ్యేలా దయ చూపండ"ని వేడుకున్నాను. బాబా దయవలన వెంటనే బాబుకి తగ్గింది. తరువాత 2022, జనవరి 17న బాబు మెడికల్ కిట్ తెచ్చుకుని కోవిడ్ టెస్టు చేసుకుందామని అనుకున్నాడు. నేను మాత్రం ఏ రిజల్టు వస్తుందోనని ఒకటే భయపడి, "నెగిటివ్ రిజల్టు రావాల"ని అనుకున్నాను. తరువాత బాబు టెస్టు చేసుకుంటే, నెగిటివ్ అని వచ్చింది. చిటికెలో నా భారమంతా తొలగించారు బాబా. ఇది చిన్న విషయమే కావచ్చు కాని, నాకు ఎంతో భయం వేసింది. కోవిడ్ వల్ల మా అమ్మగారిని కోల్పోయాను. అందుకే నాకు ఈ భయం. "ధన్యవాదాలు బాబా. మావెంట ఉండి మా అందరినీ ఇలాగే కాపాడు తండ్రి".
