1. సమయానికి స్ఫురణ కలిగించిన బాబా2. కరోనా నెగిటివ్ వచ్చేలా అనుగ్రహించిన బాబా
సమయానికి స్ఫురణ కలిగించిన బాబా
శ్రీసమర్ధ సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై!!! నాపేరు రాధాకృష్ణ. మాది రాజమండ్రి. సాయి లీలలను ఎన్నిసార్లు వివరించినా కలిగే ఆనందానుభూతి భగవంతుని సాన్నిహిత్యాన్ని ప్రసాదిస్తుంది. 2022లో మా మనవడి మొదటి పుట్టినరోజు చెన్నైలో జరుప నిశ్చయించిన కారణంగా మా అబ్బాయి, కోడలు, వాళ్ళ చిన్నపాప ముందురోజు చెన్నై వెళ్ళడానికి బయలుదేరారు. వాళ్ళు బయలుదేరే సమయానికే మా అబ్బాయికి నోటిపూత ఉన్నందున 'జెల్' రాసుకుని తగ్గిపోతుందిలే' అని ప్రయాణమయ్యాడు. అయితే అక్కడికి వెళ్ళాక నోటిపూత ఎక్కువ అవ్వడంతో మా అబ్బాయి పుట్టినరోజు వేడుకకి ఎలా హాజరవ్వాలని మధనపడుతూ నాకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. నేను వెంటనే ఆ సాయినాథుని, "ఈరోజు రాత్రికల్లా అబ్బాయికి తగ్గేలా అనుగ్రహించి, మనవడి పుట్టినరోజు వేడుకలో ఆనందంగా ఉండేలా చూడండి బాబా" అని వేడుకున్నాను. ఆ సాయినాథుని దయవల్ల ENT స్పెషలిస్ట్ అయిన మా బంధువు ఒకరు గుర్తు వచ్చి, ఆమెకి వీడియో కాల్ చేసి నోటిపూతని చూపిస్తే, ఆమె కొన్ని మందులు సూచించారు. అవి వాడినంతనే అబ్బాయికి నోటిపూత తగ్గింది. సమయానికి మా బంధువైన డాక్టరు స్ఫురణకు రావడం, మా అబ్బాయి నోటిపూత తగ్గడం, పుట్టినరోజు వేడుక వైభవంగా జరగడం అంతా ఆ సాయినాథుని లీలకాక మరేమిటి?. "ధన్యవాదాలు బాబా".
కరోనా నెగిటివ్ వచ్చేలా అనుగ్రహించిన బాబా
సమర్థ సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!! నా పేరు శ్రీకాంత్. మాది నాగర్ కర్నూలు జిల్లా. సాయినాథుని కృపాకటాక్షాల వలన నేను, నా కుటుంబం ఎలాంటి అనారోగ్యం లేకుండా ఆరోగ్యంగా ఉన్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. 2022లో నేను పనిచేసే పాఠశాలలో ఒక కుటుంబానికి కరోనా పాజిటివ్ వచ్చింది. నేను ఆ కుటుంబంతో సన్నిహితంగా ఉన్న కారణంగా పాఠశాలలోని చాలామంది కరోనా ప్రభావం నా మీద కూడా ఉంటుందని అనడంతో నేను తీవ్ర ఒత్తిడికి లోనయ్యాను. చాలామంది కరోనా పరీక్షలు చేయించుకోమని సూచించారు. నాకు కూడా తలనొప్పిగా ఉండడం, కాస్త జ్వరంగా అనిపించడంతో అనుమానానికి దారితీసింది. దాంతో నేను ఆ సద్గురు సాయినాథుని మనసులో తలచుకుని, "నాకు కరోనా పాజిటివ్ రాకుండా చూడండి బాబా" అని కరోనా పరీక్ష చేయించుకున్నాను. ఆ సాయినాథుని కృపాకటాక్షాల వలన కరోనా పరీక్ష నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. అవధులు లేని ఆనందంతో నేను నమ్మిన నా సద్గురు సాయికి సాష్టాంగ నమస్కారాలు తెలియజేసుకుంటూ నా అనుభవాన్నిలా బ్లాగులో పంచుకున్నాను.
సద్గురు శ్రీ సాయినాథ్ మహరాజ్ కి జై!!!
