సాయి వచనం:-
'ఈ సద్బ్రాహ్మణుడు లక్షలాదిమందిని శుభ్రమార్గంలో గమ్యం చేరుస్తాడు.'

'బాబా నిరసించిన వ్యర్థ ఆచారాల్లో ఉపవాసం ఒకటి. ఉపవాసమంటే - మనస్సును, వ్యర్థమైన విషయాలతో నింపక, ఖాళీగా ఉంచుకొని, అందులో మన ఉపాసనాదైవాన్ని ప్రతిష్ఠించుకొని, ఆయనకు అంతరంగంలో దగ్గరవడం అన్నమాట. ఉపవాసం అనే పదానికి అర్థం: 'ఉప' అంటే దగ్గరగా లేదా సమీపంలో, 'వాసము' అంటే ఉండటం. ఇష్టదైవానికి దగ్గరగా ఉండటం. కానీ ఆ అసలైన అర్థం పోయి ఉపవాసమంటే నిరాహారంగా ఉండటంగా మారింది' - శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1053వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా దయ ఉంటే చాలు - ఏదీ కష్టమనిపించదు
2. శ్రీసాయి దివ్యాశీస్సులు

బాబా దయ ఉంటే చాలు - ఏదీ కష్టమనిపించదు


అందరికి నమస్తే. నా పేరు అంజలి. 2017లో నేను శిరిడీ వెళ్లి, తిరిగి వచ్చేటప్పుడు, "మీ కృపతో మేమొక ఇల్లు కొన్నాకే నేను మళ్ళీ శిరిడీ వస్తాను బాబా" అని అనుకుంటూ వచ్చాను. బాబా నా కోరికను మన్నించారు(.ఇటీవలే బాబా మాకు ఒక ఇంటిని అనుగ్రహించిన అనుభవాన్ని నేను ఈ బ్లాగులో పంచుకున్నాను). తరువాత నేను ఫ్లైట్‌లో శిరిడీ వెళ్లాలనుకున్నాను. కానీ మేమున్న ఆర్థిక పరిస్థితుల్లో అది సాధ్యం కాదని ఊరుకున్నాను. అంతలో నా భర్త తన ఫ్రెండ్ కొత్త కారు తీసుకుని ఆ కారులో అందరమూ కలిసి 2021, డిసెంబర్ 25న శిరిడీ వెళదామన్నారు. కానీ 2022, ఫిబ్రవరి 22న నేను శిరిడీ వెళ్లాల్సి ఉన్నందున తక్కువ వ్యవధిలో రెండుసార్లు ఆఫీసులో సెలువు దొరకడం కష్టమవుతుంది. పోనీ మావారి ఫ్రెండ్‌ని ఫిబ్రవరిలో వెళదామని అడుగుదామంటే, వాళ్ళు గత 11 సంవత్సరాలుగా శిరిడీ వెళ్లాలని నిరీక్షిస్తున్నారు. అందుచేత వాళ్ళని నిరుత్సాహపరచడం ఇష్టం లేదు. పైగా ఇంకో సమస్య ఉంది. నాకు, నా భర్త మాత్రమే వాళ్ళ కుటుంబంతో వెళ్లేందుకు అవకాశముంది. ఎందుకంటే, అంతకుమించి కారు సరిపోదు. అంటే పిల్లలని వదిలేసి వెళ్ళాలి. అలా వెళ్ళడానికి ఇంట్లో పిల్లలని చూసుకునేవాళ్ళు ఎవరూ లేరు. కాబట్టి నా భర్తని మాత్రమే తన ఫ్రెండ్‌తో డిసెంబర్ 25న పంపి, నేను ఫిబ్రవరిలో వెళ్లాలనుకున్నాను. కానీ మావారిని ఒక్కరినే పంపడానికి నా మనసు సమ్మతించలేదు. ఆయన వెళ్లకపోతే డ్రైవింగ్ సరిగా రాని తన ఫ్రెండ్ ప్రయాణం కూడా ఆగిపోతుంది. అందువలన అమ్మవాళ్లను పిలిపించి పిల్లలని వాళ్ళ దగ్గర ఉంచి నేను, నా భర్త వెళదామనుకున్నాను. అయితే ప్రయాణానికి రెండురోజుల ముందు అమ్మకి ఆరోగ్యం బాగాలేదు. దాంతో నాకు ఏమి చేయాలో అర్థంకాక, 'నేను శిరిడీ వెళ్లాలా, వద్దా' అని ఆలోచిస్తుంటే 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో "ఏం భయం వద్దు. నా దగ్గరకు రా" అన్న బాబా సందేశం కనిపించింది. అంతే నేను శిరిడీ వెళ్లాలని నిర్ణయించుకుని బాబా మీద భారం వేసి అమ్మవాళ్ళను మా ఇంటికి పిలిపించాను.


తరువాత డిసెంబర్ 24న మేము మావారి ఫ్రెండ్‌తో కలిసి కారులో శిరిడీ బయలుదేరాము. షోలాపూర్ చేరుకోవడానికి ముందు ఒక చోట టీ త్రాగడానికి ఆగాము. అక్కడివాళ్లు "ఇక్కడి నుండి శిరిడీకి షార్ట్ కట్ రూటు ఉంద"ని చెప్పారు. దాంతో మేము షోలాపూర్ వెళ్లకుండా వాళ్ళు చెప్పిన రూటులో వెళ్ళాము. ఇక మాకు కష్టాలు మొదలై అనవసరంగా ఈ మార్గంలోకి వచ్చామా అనిపించింది. ఏదేమైనా బాబా మీద భారం వేసి మా ప్రయాణాన్ని సాగించి భూమ్ అనే ప్రదేశానికి చేరుకున్నాము. అక్కడినుండి శిరిడీ తక్కువ దూరంలోనే ఉంది. కానీ శిరిడీ వెళ్లే మార్గంలో మరమ్మత్తు పనులు జరుగుతున్నందున అక్కడివాళ్లు, "ఈ రూటులో శిరిడీ వెళ్లడం కష్టం. పది గంటల సమయం పడుతుంద"ని చెప్పారు. ఇక అంతే మేము వెనక్కి వెళ్లి, హైవే ఎక్కి బీడ్ అనే ప్రాంతానికి చేరుకున్నాము. అక్కడినుండి అహ్మద్‌నగర్ వెళ్తే శిరిడీ సమీపానికి చేరుకుంటాము. అయితే బీడ్ నుండి అహ్మద్‌నగర్ వెళ్లే 140 కిలోమీటర్ల మార్గమంతా ఘాట్ రోడ్డు మార్గం. సాయంత్రం ఆరుగంటల నుండి పదిగంటల వరకు మా ప్రయాణం ఆ ఘాట్ రోడ్డులో సాగింది. ఆ మార్గంలో ఒక్క వెహికల్ కానీ, ఒక్క ఊరు కానీ మాకు కనిపించలేదు. అందుచేత కారులో ఉన్న అందరూ భయపడినప్పటికీ నేను కొంచెం కూడా భయపడలేదు. నాకు అడుగడుగునా బాబా కనిపిస్తూనే ఉన్నారు. కారులో ఉన్న మా దగ్గర నాలుగు ఫోన్లు ఉన్నాయి. అందరి నెట్వర్క్ ఒకటే అయినప్పటికీ బాబా దయవల్ల నా ఫోన్‌లో మాత్రమే gps పని చేసింది. అది పనిచేయకుంటే ఆ కఠిన మార్గంలో ఎక్కడ ఏ మలుపు తీసుకోవాలో తెలియక మేము చాలా ఇబ్బందిపడేవాళ్ళం. అది బాబా చేసిన అద్భుతం. ఇంకో అద్భుతం ఏంటంటే, డ్రైవింగ్ చేసి చేసి నా భర్త అలసిపోయినందున తప్పనిసరై సరిగా డ్రైవింగ్ రాని మావారి ఫ్రెండ్ కష్టతరమైన ఆ ఘాట్ రోడ్డు మార్గమంతా డ్రైవ్ చేశారు. నిజంగా బాబానే అతనితో డ్రైవ్ చేయించారు. మొత్తానికి బాబా దయవల్ల మేము క్షేమంగా అహ్మద్‌నగర్ చేరుకున్నాము. తరువాత 3 గంటలు ప్రయాణం చేసి రాత్రి ఒంటిగంటకు శిరిడీ చేరుకున్నాము. ఆ రాత్రి శిరిడీలో రూమ్ తీసుకుని డిసెంబర్ 25 ఉదయం బాబా దర్శనం చేసుకున్నాము. తరువాత నాకు సాయంత్రం మరోసారి బాబా దర్శనం చేసుకుంటే బాగుంటుందనిపించింది. కానీ నా భర్త, ఇంకా మిగిలిన అందరము బాగా అలిసిపోయాము, విశ్రాంతి తీసుకోవాలన్నారు. సరేనని ఊరుకున్నాను. మధ్యాహ్నం బాబా దయవల్ల మొదటిసారి ప్రసాదాలయంలో బాబా ప్రసాదం తిన్నాము. బాబా ప్రసాదం చాలా చాలా బాగుండడమే కాకుండా నాకు అత్యంత ఆనందాన్నిచ్చింది. సాయంత్రం నేను, మావారి ఫ్రెండ్ భార్య కలిసి బాబా దర్శనానికి వెళ్ళాము. బాబా దర్శనంతో చాలా బాగా అనిపించింది.


ఆరోజు రాత్రి శిరిడీలోనే నిద్రచేసి డిసెంబర్ 26 ఉదయం శిరిడీ నుండి తిరుగు ప్రయాణమయ్యాము. బాబా దయవల్ల తిరుగు ప్రయాణంలో చాలా ఎంజాయ్ చేస్తూ క్షేమంగా రాత్రి 11 గంటలకి నల్గొండ చేరుకున్నాము. కానీ శిరిడీ వెళ్ళేటప్పటి ప్రయాణాన్ని తలుచుకుంటే ఒక  సాహసవంతమైన ప్రయాణమనిపిస్తుంది. బాబానే అటువంటి మా ప్రయాణాన్ని పూర్తిచేయించి మమ్మల్ని క్షేమంగా తీసుకెళ్లారు. బాబా దయ ఉంటే చాలు, మనకు ఏదీ కష్టమనిపించదు. చివరిగా ఒక విషయం, మావారి ఫ్రెండ్ భార్య అంత దూర ప్రయాణమెప్పుడూ చేయలేదు. ఆమెకి ప్రయాణంలో వాంతులవుతాయట. అలాంటిది ప్రయాణంలో ఆమెకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా బాబా చూసారు.


శిరిడీ నుండి వచ్చిన వెంటనే నేను ఆఫీసుకి వెళ్ళాను. అప్పటికీ బాగానే ఉన్న నా ఆరోగ్యం రెండురోజుల తరువాత కాస్త చెడింది. అప్పుడు నేను, "నా ఆరోగ్యాన్ని సరిచేయమ"ని బాబాను వేడుకున్నాను. ఆయన దయవల్ల మరుసటిరోజుకి నా ఆరోగ్యం నార్మల్ అయింది.


2022, జనవరి 1న మేము యాదాద్రి వెళ్లి శ్రీలక్ష్మినర్సింహస్వామి వారి దర్శనం చేసుకున్నాం. ఆరోజు మధ్యాహ్నం భోజనం చేసి వచ్చినప్పటినుండి హఠాత్తుగా నా ఆరోగ్యం పాడైంది. జలుబు, దగ్గు మొదలవడంతోపాటు గొంతు కూడా బొంగురుపోయింది. వెంటనే నేను, "బాబా! ఎలాగైనా నా ఆరోగ్యం సాధారణ స్థితికి వచ్చేలా చేయండి" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల కేవలం సగం రోజు గడిచేసరికి నా ఆరోగ్యం సాధారణమైంది. ఆఫీసుకి కూడా వెళ్లగలిగాను.


ఒకరోజు మా బాబు స్కూలు నుండి వచ్చేటప్పుడు వాడి కుడికన్ను ఎర్రగా ఉంది. అది చూసిన నాకు చాలా భయమేసింది. ఎందుకంటే, ఆరేళ్ళ క్రితం వాడి కన్నుకి పెన్సిల్ గుచ్చుకున్నందువల్ల సర్జరీ జరిగింది. అందుచేత నేను, "బాబా! ఎలాగైనా బాబు కన్ను ఎరుపుదనం తగ్గించు తండ్రి" అని బాబాను వేడుకున్నాను. దయగల తండ్రి తెల్లారేసరికి బాబు కన్ను ఎరుపుదనం తగ్గించారు. తద్వారా నా టెన్షన్ కూడా తగ్గించారు బాబా. "నా పిల్లలపైనా ఇంకా అందరిమీద మీ దయ ఇలాగే ఉండాలి బాబా".


2021, డిసెంబర్ 8న మా బాబు పుట్టినరోజు. ఆ సందర్భంగా మేము బాబుకి ఒక బ్లూ రంగు టి-షర్ట్ తీసుకున్నాము. ఆ టి-షర్ట్ కోసం 2022, జనవరి 7 రాత్రి చూస్తే, అది కనిపించలేదు. చాలా ఖరీదైనది, పైగా ఒక్కసారే బాబు వేసుకున్న టి-షర్ట్ కనపడకపోయేసరికి నాకు బాధగా అనిపించింది. వెంటనే, "బాబా! ఎలాగైనా ఆ టి-షర్ట్ కనపడేలా అనుగ్రహించండి" అని బాబాతో చెప్పుకున్నాను. మరుసటిరోజు 2022, జనవరి 8 ఉదయం సోఫా కుర్చీలో చాలా డ్రెస్సెస్ ఉంటే అందులో వెతికాను. బాబా దయవల్ల ఆ టి-షర్ట్ కనిపించింది. అయితే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే, మా బాబు ఆ టి-షర్ట్ పుట్టినరోజునాడు మాత్రమే వేసుకున్నాడు. అంటే ఆ షర్ట్ వేసుకుని నెల రోజులు అయింది. అలాంటిది రీసెంట్‌గా బాబు వేసుకున్న బట్టలు ఉన్న కూర్చీలోకి ఆ టి-షర్ట్ ఎలా వచ్చిందో నాకిప్పటికీ అర్థం కాలేదు. అంతా బాబా దయ. ఆయన తన బిడ్డలను కొంచెం కూడా బాధపడనివ్వరు.  "ధన్యవాదాలు బాబా. మీ ఋణం తీర్చుకోవడానికి మీ నామస్మరణ చేయటం తప్ప మేము ఏం చేయగలం? లవ్ యు సో మచ్ బాబా. మీ దయ ఇలాగే ఎప్పుడూ మాపై ఉండాలి. మా చేయిని ఎన్నడూ వీడకు తండ్రీ. అందరినీ కాపాడండి. ఎల్లప్పుడూ మీ నీడలో మమ్మల్ని చల్లగా ఉండేలా అనుగ్రహించండి బాబా".


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు శ్రీ సాయినాథ్ మహరాజ్ కి జై!!!


శ్రీసాయి దివ్యాశీస్సులు


సాయి బంధువులందరికీ నా నమస్కారాలు. నా పేరు గోష్టేశ్వరి. ఒకప్పుడు మా పాపకి రెండు అరచేతుల బొటనవేలు కిందగా మణికట్టు వద్ద పెద్ద బొడిపెలా ఉండేది. నొప్పి ఉండేది కాదుగాని వాపు ఉండేది. మేము పాపని బోన్ స్పెషలిస్ట్‌కి చూపించాము. ఆయన టెస్టు చేసి, "ప్రమాదమేమీ లేదు. కానీ పాప కొంచం పెద్దయ్యాక కూడా తగ్గకపోతే అప్పుడు ఆపరేషన్ చేద్దాం" అని అన్నారు. నాకు భయమేసి, "బాబా! మీ దయతో పాపకి తగ్గిపోవాలి" అని బాబాను ప్రార్థించి ప్రతిరోజూ రాత్రి పడుకోబోయే ముందు ఆ బొడిపెల మీద చేయిపెట్టి, 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అనే మంత్రాన్ని జపించేదాన్ని. బాబా దయవల్ల మందులు వాడకుండానే ఆ వాపు తగ్గి నార్మల్ అయింది. "ధన్యవాదాలు తండ్రి!".


ఒకసారి మా పాప టివి రిమోట్ ఎక్కడో పెట్టి మర్చిపోయింది. మేము దానికోసం వెతికి వెతికి కనపడకపోయేసరికి ఊరుకున్నాం. మా పాప మాత్రం, "బాబా! టివి రిమోట్ దొరకాలి" అని బాబాని వేడుకుంది. బాబా దయవల్ల మరుసటిరోజు రిమోట్ దొరికింది. "ధన్యవాదాలు బాబా".


ఒకసారి మా పాపకి తరచూ జ్వరం వస్తుండేది. బాబాను ప్రార్థించినంతనే తగ్గేది. కానీ నేను, "ఏమిటి బాబా, పాపకిలా తరచూ జ్వరం వస్తుంది" అని అనుకున్నాను. బాబా దయవలన నెలరోజులైనా జ్వరం మళ్ళీ రాలేదు.


నేను ఎమ్.ఏ. పూర్తి చేశాను. ఒ.డి(ఒరిజినల్ డిగ్రీ) సర్టిఫికెట్ కోసం నేను, మావారు, మాపాప కారులో వైజాగ్ వెళ్ళాం. అక్కడ కొన్ని ఆటంకాలు ఎదురైనా బాబా దయవల్ల మేము వెళ్లిన పని పూర్తయింది. కానీ అది కరోనా సమయం అయినందున ప్రయాణం అంటే భయమేసి, "నేను, మావారు, మాపాప, మాతోపాటు వచ్చిన డ్రైవరుతో సహా అందరమూ బాగుండాల"ని బాబాను ప్రార్థించాను. బాబా దయవల్ల అందరమూ క్షేమంగా ఉన్నాం.


ఒకసారి మా అమ్మకి ఛాతిలో నొప్పి వచ్చింది. అప్పుడు అమ్మ నొప్పి ఉన్న చోట ఊదీ రాసుకుని, రెండుపూటలా ఊదీ కలిపిన నీళ్లు త్రాగింది. రెండురోజుల్లో అమ్మ ఛాతినొప్పి తగ్గిపోయింది. అంతా బాబా దయ. "ధన్యవాదాలు బాబా. ఎటువంటి పరిస్థితుల్లోనైనా మీరే మాకు రక్ష. నేను, అమ్మ అనుభవిస్తున్న మానసిక ఆందోళన నుండి మమ్మల్ని మీరు ఎప్పుడు బయటపడేస్తారని ఎదురు చూస్తూ మీకు సర్వదా శరణాగతి చేస్తున్నాము తండ్రి. పాహిమాం సాయినాథా పాహిమాం".


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై!!!



6 comments:

  1. Omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam

    ReplyDelete
  2. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������

    ReplyDelete
  3. Jaisairam bless amma for her eye operation recovery and bless me for my health and wealth of happiness and happiness in the world of yours Jaisairam

    ReplyDelete
  4. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  5. Om sai ram baba ma arogya samasyalani teerchu thandri sainatha pleaseeee

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers


Blog Logo