సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1050వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. సర్వాంతర్యామి సాయి అనుగ్రహం
2. ఏమి లేకపోయినా బాబా దయుంటే చాలు
3. సాయినాథుని దయ

సర్వాంతర్యామి సాయి అనుగ్రహం


ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి!!! ముందుగా శ్రీసాయినాథుని దివ్యపాదాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు నిర్వహిస్తున్న సాయికి మరియు సాయిబంధువులకు వందనాలు. నూతన సంవత్సరం(2022)లో బాబా ఆశీస్సుల అనుగ్రహవర్షం సాయిబంధువులందరిసై కుండపోతగా కురవాలని సాయిబాబాను మనఃపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. నా పేరు సంధ్య. బాబా నాకు ఇటీవల ప్రసాదించిన కొన్ని అనుభవాలను నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. హాస్టల్లో ఉండి చదువుకుంటున్న మా అమ్మాయి ఒకరోజు రాత్రి కాలు బెణికి క్రిందపడిపోయి, లేచి, నిలబడే ప్రయత్నం చేస్తుంటే మళ్ళీ క్రిందపడిపోయింది. తరువాత మా అమ్మాయి మాకు ఫోన్ చేసి, "కాలు వాచి ఎర్రగా, నల్లగా అయిపోయింది" అని చెప్తూ ఏడ్చేసింది. దాంతో మేము హాస్టల్‍కి వెళ్ళి పాపని ఇంటికి తీసుకుని వచ్చాము. నిజంగానే కాలు చాలా వాచిపోయింది. డాక్టర్ ఖచ్చితంగా ఎక్స్ రే తీయమంటారు అనుకున్నాము. అమ్మాయి కాలుకి ఊదీ రాస్తూ హాస్పటల్‍కి వెళదామంటే తను, "మమ్మీ, తగ్గిపోతుందేమో! కావాలంటే హాస్పిటల్‍కి రేపు వెళదాము" అని చెప్పింది. దాంతో సరేనని, మర్నాడు హాస్పిటల్‍కి వెళదామని ఊరుకున్నాము. నేను బాబా ఆశీస్సులు కోరుతూ అమ్మాయి కాలుకి ఊదీ రాస్తూ, ఊదీ తీర్దాన్ని ఇస్తూ వచ్చాను. అద్భుతం! హాస్పిటల్‍కి వెళ్ళే అవసరం లేకుండా బాబా దయతో కాలు వాపు తగ్గి అమ్మాయి చక్కగా నడవగలిగింది. రెండురోజులలో పూర్తిగా కాలునొప్పి తగ్గి చక్కగా మళ్లీ హాస్టల్‌కి వెళ్ళింది. తను బాబా మీద విశ్వాసంతో ఆయన తనని కాపాడతారని ఊదీ రాయించుకోవడం, పైగా ఊదీ రాశాక కొద్దిగా విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతుందని మాకు ధైర్యాన్ని చెప్పడం బాబా ఆశీర్వాదమే. "ధన్యవాదాలు సాయితండ్రీ!".


ఒకరోజు నాకు మెడనొప్పి చాలా ఎక్కువగా వచ్చింది. దాంతోపాటు శ్వాస తీసుకోవడం కూడా కష్టమైంది. అప్పుడు నేను, "బాబా! ఈ మెడనొప్పి నుండి నాకు ఉపశమనం కలిగించండి" అని బాబాను ప్రార్ధించి ఆయన అనుగ్రహాన్ని కోరుతూ ఊదీ రాసుకున్నాను. దయామూర్తి అయిన బాబా హాస్పటల్‌కి వెళ్ళే పని లేకుండా త్వరగా నాకు నయం చేశారు. అలాగే ఒకసారి నా కాళ్ళు విపరీతంగా లాగుతుండటం వల్ల వారం రోజులు ఆ నొప్పిని భరించలేకపోయాను. చివరికి ఆ బాధ తట్టుకోలేక, ఇంట్లో పనులు చేసుకోలేక, "బాబా! నా కాళ్ళు ఎందుకు ఇంతలా బాధిస్తున్నాయి. సాయితండ్రీ! నా ఈ కాళ్ళ నొప్పులు త్వరగా తగ్గించి నన్ను రక్షించు తండ్రీ. అపారమైన మీ ప్రేమను 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను ప్రార్ధించి, ఊదీ తీర్థాన్ని తీసుకున్నాను. ఆయన ఆశీస్సులతో నా కాళ్ళనొప్పులు తగ్గిపోయాయి. అంతేకాదు నా కాళ్ళు అంతలా లాగడానికి, నొప్పులు రావడానికి గల కారణం కూడా తెలిసేలా చేసారు బాబా. "ధన్యవాదాలు సాయీశ్వరా!".


ఒకరోజు నేను, మా పిల్లలు షాపింగ్‌కని బయలుదేరాం. షాపింగ్ చేస్తున్నంతసేపు 'ఇంటికి తాళం వేసాము. ఇంట్లో ఎవరూ లేరు' అని నా ధ్యాసంతా ఇంటిపైనే ఉండి, నా మనసంతా చాలా చంచలంగా ఉంది. అందుచేత సరిగా షాపింగ్ చేయకుండానే ఇంటికి తిరిగి వచ్చాము. ఇల్లు ఎప్పటిలాగే చక్కగా ఉంది. అప్పుడు 'సర్వాంతర్యామి అయిన సాయిబాబా ఉండగా నా మనసు ఎందుకు చంచలంగా ఉంది?' అని బాధపడ్డాను. మరొకరోజు బయటకు వెళ్ళినపుడు కూడా 'ఇంటికి తాళం వేసి అందరం బయటకు వచ్చాము' అని పదేపదే ఆలోచిస్తూ నా మనసు చాలా చంచలంగా ఉంది. బహుశా నన్ను మాయ ఆవరించింది. నేను మాయలో పడిపోయాను. అప్పుడు, "నన్ను మరచిన వారిని మాయ శిక్షిస్తుంది" అన్న బాబా మాటలను స్మరణకు తెచ్చుకుని మనసులోనే బాబాను ప్రార్థించసాగాను. అప్పుడు రోడ్డు పొడవునా వచ్చిపోయే వాహనాలపై బాబా దర్శనం ఇచ్చారు. దాంతో నా మనసు కుదుటపడి, "బాబా! సర్వాంతర్యామి అయిన మీరు మాకు తోడుగా ఉండి, ఇంటిని కూడా చూసుకోండి. నా మనసులో కలిగిన చంచలత్వన్ని, ఆలోచనలను 'సాయి మహారాజ్ సన్నీధి' బ్లాగులో పంచుకుంటాను తండ్రీ" అని బాబాను ప్రార్థించాను. ఇంకా 'నాకెందుకిలా అనిపిస్తుంద'ని బాబాకి క్షమాపణలు చెప్పుకున్నాను. నిజానికి, "ఏమీ భయపడకు. నేనెప్పుడూ నీ ఇంటికి కాపాలా కాస్తూ ఉన్నాను" అన్న సాయి వచనం నాకెంతో ధైర్యాన్నిస్తుంది. కానీ నా మనసును మాయ ఆవరించి చంచలంగా మారిపోతుంటుంది. 


"బాబా! ఈ అనుభవాలను సాయిబంధువులతో పంచుకుంటానని మీతో చెప్పుకున్నాను. కానీ చాలా ఆలస్యం అయింది. అందుకు నన్ను క్షమించండి బాబా. మీరే నాకు తల్లి, తండ్రీ, గురువు, దైవం, సర్వమూ బాబా. కృపతో శిరిడీ దర్శన భాగ్యం కల్పించండి తండ్రీ. శిరిడీయాత్ర అనుభవాలను, అపారమైన మీ ప్రేమను 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు ద్వారా సాయిబంధువులతో పంచుకుంటాను తండ్రీ! బాబా! సద్గురు సాయినాథా! గతంలో, వర్తమానంలో మీరు మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతూ వస్తున్నారనే సత్యాన్ని మేము ఎల్లపుడూ గుర్తుచేసుకుంటూ మీ నామస్మరణతో, మీ అపార ప్రేమలో మా జీవితాలు ముందుకు సాగిపోవాలి తండ్రీ. సాయీ!!! ఐ లవ్ యు బాబా. సాయీశ్వరా!!! మీకు వేలవేల కృతజ్ఞతలు". 


శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై!!!

సద్గురు చరణం భవభయ హరణం!!!


ఏమి లేకపోయినా బాబా దయుంటే చాలు


ముందుగా ఈ బ్లాగు నిర్వహిస్తున్న వారికి నా ధన్యవాదాలు. తోటి సాయిభక్తులకు నమస్కారం. నేను ఒక సాయిభక్తురాలిని. నేనిప్పుడు బాబా మాకు చేసిన మేలు మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. ఈమధ్య మేము అపార్ట్మెంట్‍లో ఒక ఫ్లాట్ కొనాలని అనుకున్నాము. అందుకోసం లోన్‍కి అప్లై చేసాము. అయితే మావారు ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నందున లోన్ విషయంలో ఎన్నో ఆటంకాలు వచ్చాయి. కానీ ఎలాగైతేనేమి బాబా దయవల్ల 3నెలలకు లోన్ మంజూరైంది. అంతకుముందే బ్యాంకువాళ్ళు "అపార్ట్మెంటు సరిహద్దులు తప్పుగా ఉన్నాయి, సరి చేయించండి" అని చెప్పారు. మేము అడిగితే ఫ్లాట్ అమ్మేవాళ్ళు డాక్యుమెంట్ సరిచేయించి జిరాక్స్ ఇచ్చారు. తరువాత రెండురోజుల్లో రిజిస్ట్రేషన్ అనగా సవరణ చేయించిన ఒరిజినల్ డాక్యుమెంట్ పోయిందని అన్నారు. "ఒరిజినల్ డాక్యుమెంట్ ఉంటేనే రిజిస్ట్రేషన్" అని బ్యాంకువాళ్ళు అన్నందువల్ల నాకు, మావారికి ఏమి చేయాలో తెలియక చాలా భాధగా అనిపించింది. కానీ ఫ్లాట్ అమ్మేవాళ్ళు ఎంత వెదికినా ఆ డాక్యుమెంట్ దొరకలేదు. దాంతో వాళ్ళు, "డాక్యుమెంట్ పోయిందని పోలీసు కంప్లైంట్ ఇచ్చి, నకళ్ళు తీసి ఇస్తాము. 20 రోజుల సమయం పడుతుందని బ్యాంకువాళ్ళని ఒప్పించండి" అని అన్నారు. బ్యాంకువాళ్ళతో మాట్లాడితే వాళ్ళు, "ఏంటండీ, సవరణ చేయించి 20 రోజులు కాలేదు. ఇంతలోనే పోయిందంటే ఎలా? వెదకమనండి. లేదంటే, లోన్ రద్దు చేసుకోండి. నకళ్ళతో రిజిస్ట్రేషన్ కుదరదు" అన్నారు. నేను, మావారు "బాబా! మాకు సహాయం చేయండి. డాక్యుమెంటు దొరికితే బ్లాగులో పంచుకుంటామ"ని బాబా దగ్గర చాలా ఏడ్చాము. తరువాత వారం రోజులు గడిచాయి కానీ, డాక్యుమెంట్ దొరకలేదు. ఆఖరికి మావారు, "ఈరోజు మధ్యాహ్నం వెళ్లి లోన్ రద్దు చేసి వస్తాను. లేకపోతే EMI కట్ అయిపోతుంద"ని బాధపడ్డారు. తరువాత ఆయన డ్యూటీకి వెళ్ళారు. నేను స్త్రవనమంజరి పారాయణ చేసి, "బాబా! భక్తుల అనుభవాలలో చాలామంది కనపడకుండా పోయినవి మీ దయతో కనపడ్డాయని చెప్తున్నారు. అలాగే మాకూ సహాయం చేయండి బాబా. ఇక మీ ఇష్టం. మీరు సహాయం చేయకపోతే మేము ఇల్లు కొనుక్కోలేము" అని బాబా దగ్గర చాలా బాధపడ్డాను  బాబా దయామయుడు. ఆయన నా ప్రార్థన ఆలకించారు. సరిగ్గా 12 గంటలకు మావారు ఫోన్ చేసి, "డాక్యుమెంట్ దొరికిందట. ఇప్పుడే ఫోన్ వచ్చింది" అని చెప్పారు. నాకు చాలా షంతోషమేసి బాబా పాదాలు పట్టుకుని కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఏమి లేకపోయినా బాబా దయ ఉంటే చాలు. ఆయన కృపవలన రిజిస్ట్రేషన్ పూర్తయింది. 2022, ఫిబ్రవరి 10వ తేదీన గృహప్రవేశం చేయడానికి నిశ్చయమైంది. "బాబా! మా అబ్బాయి విషయంలో, ఇల్లు విషయంలో మీరు మాకు ఎంతో సహాయం చేసారు. మీ చల్లని చూపు మా కుటుంబంపై ఎల్లప్పుడూ ఇలాగే ఉంచండి సాయి. మీకు చాలాచాలా ధన్యవాదాలు.  మీకు శతకోటి వందనాలు బాబా. మీకు నమస్కరించడం తప్ప ఏమీ చేయలేని పేదరాలిని. నన్ను క్షమించండి సాయి".


సాయినాథుని దయ


ఓం శ్రీసాయినాథాయ నమః!!! సాయి బంధువులకు, ఈ బ్లాగు నిర్వహిస్తున్న వారికి నా నమస్కారాలు. నేను బాబా భక్తురాలిని. నేను ఇప్పుడు బాబా నాకు ప్రసాదించిన అనుభవాలను మీతో పంచుకోవడం ద్వారా బాబాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. 2021, డిసెంబర్ నెలలో మా అమ్మాయి, అల్లుడు, మనవడు అమెరికా నుండి ఇండియా వచ్చారు. అప్పుడు నేను, "అమెరికా తిరిగి వెళ్ళేవరకు వాళ్లకు ఎటువంటి ఇబ్బందులు, ఆరోగ్యసమస్యలు రాకుండా చూడమ"ని బాబాను వేడుకున్నాను. అయితే ఇక్కడికి వచ్చినప్పటినుంచి మూడేళ్ల మా మనవడు అన్నం తినటం మానేశాడు. సీసా పాలు, అప్పుడప్పుడు బ్రెడ్, చపాతి మాత్రమే తీసుకుంటుండేవాడు. ఇంకా వాడికి మలబద్దకం సమస్య కూడా మొదలైంది. వాడి సంగతి అలా ఉంచితే, బాబా దయతో మేము కొన్ని పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నాము. ఆయన కృపవలన మాకు ఎటువంటి సమస్యలు రాలేదు. కానీ మా అమ్మాయివాళ్ళ తిరుగు ప్రయాణానికి పది రోజుల ముందు మా మనవడికి, అల్లుడికి బాగా జలుబు చేసి జ్వరం వచ్చింది. ఆ సమయములో అలా రావటం వల్ల మాకు చాలా భయమేసింది. అయితే బాబా దయవల్ల జ్వరం తగ్గింది. కానీ జలుబు, దగ్గు ఉన్నాయి. ప్రస్తుత కరోనా పరిస్థితుల దృష్ట్యా ప్రయాణానికి 24 గంటల ముందు కోవిడ్ టెస్టు చేసి, ఆ రిపోర్టు నెగిటివ్ వస్తేనే వాళ్ళు ట్రావెల్ చేసే అవకాశం ఉంటుందని నేను చాలా భయపడి బాబాని శరణువేడాను. ఆయన దయతో నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. దాంతో ఎటువంటి ఆటంకం లేకుండా వాళ్ళు అమెరికా చేరుకున్నారు. నేను సంతోషంగా బాబాకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా అనుభవాన్ని వ్రాసి అందులో చివరన, "బాబా! ఇక్కడికి వచ్చినప్పటినుంచి మనవడు అన్నం తినటం మానేశాడు, మలబద్దకం సమస్య కూడా వచ్చింది. మీ దయతో ఈ సమస్యను కూడా తొలగించి వాడు మంచిగా ఆహారం తీసుకునేలా అనుగ్రహించండి" అని బాబాను వేడుకుంటూ బ్లాగుకి 2022, జనవరి 7 రాత్రి పంపాను. తరువాత ఆ రాత్రి మా అమ్మాయి ఫోన్ చేసి, మనవడికి ఫ్రీ మోషన్(విరోచనం) అయిందని చెప్పింది. "ధన్యవాదాలు బాబా. ఇక బాబు మంచిగా తినేలా చూడండి బాబా".


చివరిగా ఒక మాట: "నాకు ఏ సమస్య వచ్చినా బాబా ఊదీ ధరించి బాబాను వేడుకుంటాను. వెంటనే నాకు మంచి ఫలితం కనపడుతుంది".



4 comments:

  1. Omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam

    ReplyDelete
  2. Jaisairam bless amma for her eye operation recovery and bless me for my health and wealth of happiness and happiness in the world of yours. Jaisairam

    ReplyDelete
  3. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete
  4. Om sai ram baba ma arogya samasyalani teerchu thandri sainatha pleaseeee

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo