సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1056వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. అర్ధరాత్రివేళ భయంకరమైన తలనొప్పి నుండి రెండుసార్లు కాపాడిన సాయిబాబా
2. అందరినీ రక్షించేవాడు ఆ బాబానే
3. శ్రీసాయి అనుగ్రహ వీచికలు

అర్ధరాత్రివేళ భయంకరమైన తలనొప్పి నుండి రెండుసార్లు కాపాడిన సాయిబాబా


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


నా పేరు కుమార్. నేను హైదరాబాద్ నివాసిని. నాకు సాయిబాబాతో చాలా అనుభవాలున్నాయి. అవన్నీ పంచుకోవాలంటే ఒక పెద్ద పుస్తకమే అవుతుంది. నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. 2022 ఆరంభంలో కరోనా పరిస్థితుల కారణంగా నేను ఇంటినుంచే పని చేస్తుండేవాడిని. ఒక ఆదివారం నాడు ఉదయం నేను 'ఆదివారం ఆఫీసు పనేమీ ఉండద'ని చాలా ఆలస్యంగా నిద్రలేచాను. నిద్రలేస్తూనే నాకు కొంచెం తలనొప్పిగా అనిపించింది. బహుశా ఎక్కువసేపు నిద్రపోవడం వలన తలనొప్పిగా అనిపిస్తుంది కాబోలు, కొద్దిసేపటిలో తగ్గిపోద్దిలే అనుకుని నా నిత్యక్రమం సాగించాను. అయితే రోజు గడిచేకొద్ది తలనొప్పి బాగా ఎక్కువై రాత్రి పడుకునే సమయానికి మరింత ఎక్కువ అయింది. రాత్రి 12:00 గంటలయ్యేసరికి చాలా చాలా ఎక్కువ అయిపోయి, అసలు పడుకోలేకపోయాను. మెడలోని నరాలన్నీ లాగేస్తూ తల బద్దలైపోతున్నట్లనిపించింది. దాంతో ఈ స్థితిలో నేను ఈ రాత్రి నిద్రపోవడం అసాధ్యం అనుకున్నాను. పోనీ ఆ రాత్రివేళ ఏదైనా టాబ్లెట్ తెచ్చుకోవడం కోసం బయటకి వెళదామంటే బయట విపరీతమైన చలిగా ఉంది. ఆ చలికి తలనొప్పి ఇంకా ఎక్కువ అవుతుందని భయపడి ఆగిపోయాను. తరువాత తలనొప్పి బాద భరించలేక నా తండ్రి సాయినాథుని పటం ముందు నిల్చొని, రెండు చేతులు జోడించి, "బాబా! తట్టుకోలేకపోతున్నాను. ఈ తలనొప్పిని, భరించలేకపోతున్నాను. దయచేసి ఈ బాధ నుండి నన్ను రక్షించండి. ఈ అర్ధరాత్రి వేళ మీరు మాత్రమే నన్ను ఈ బాధ నుండి కాపాడగలరు" అని ఆర్తిగా వేడుకుని ఊదీ తీసుకుని కొంచెం నీటిలో కలుపుకుని త్రాగి, మరి కొంచెం తలకి పూసుకున్నాను. సరిగ్గా పది నిమిషాల తరువాత కొంచెం తగ్గినట్లుగా అనిపించి వెళ్ళి పడుకున్నాను. ఆ తరువాత ఏమి జరిగిందో నాకు తెలియదు. మరుసటిరోజు ఉదయం నిద్రలేచాకగాని 'అంత అర్ధరాత్రి ఏ మందులూ వేసుకోకపోయినా పదేపది నిమిషాల్లో తలనొప్పి తగ్గి ప్రశాంతంగా నిద్రపోగలిగానంటే అది కేవలం దయగల మా సాయితండ్రి మహిమ' అని నాకు తెలియలేదు. వెంటనే సాయినాథుని పటం ముందు నిల్చొని, అర్ధరాత్రివేళ ఏ హాస్పిటల్‌కి వెళ్లకుండా, ఏ మందులు వేసుకోకుండానే నా తలనొప్పి తగ్గించినందుకు కన్నీళ్ళతో కృతజ్ఞతలు తెలుపుకున్నాను. సరిగ్గా అప్పటికి 5 సంవత్సరాల క్రితం కూడా ఇలాగే అర్ధరాత్రి నాకు తలనొప్పి తీవ్రంగా ఉంటే భరించలేక నేను నా తండ్రి సాయిబాబా పటం ముందు నిల్చొని, "తలనొప్పిని తగ్గించమ"ని ఆర్తితో వేడుకున్నాను. అప్పుడు కూడా సరిగ్గా ఇలాగే పది నిమిషాలలో తలనొప్పి పూర్తిగా తగ్గిపోయి ప్రశాంతంగా నిద్రపోయాను. "ధన్యవాదాలు బాబా! మీరే గనుక లేకుంటే మా బ్రతుకులు ఎలా ఉండేవో ఊహించుకోవడానికి కూడా మాకు ధైర్యం చాలడం లేదు. ఏ జన్మలో మేము ఏ పుణ్యం చేసుకున్నామోగాని, ఆ పుణ్యఫలం ఈ జన్మలో మీ రూపంలో మాకు దొరికింది. మా మనస్సులో ఎల్లప్పుడూ మీ నామస్మరణ జరిగేలా దీవించి ఈ భవసాగరాన్ని దాటించండి ప్రభు".


అఖిలాండకోటి అనంతకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై జై జై!!!


అందరినీ రక్షించేవాడు ఆ బాబానే


సమర్ధ సద్గురు శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై!!! నా పేరు లక్ష్మి. నా వయస్సు డబ్భైయ్యేళ్ళకు పైనే ఉంటుంది. నేను బెంగుళూరు నివాసిని. ముందుగా బాబాకు నమస్కారాలు. 2021, జులైలో నాకు రోజూ జ్వరం వస్తుండేది. క్రోసిన్ టాబ్లెట్ వేసుకొంటే తగ్గి, మళ్ళీ వచ్చేది. కొన్నిరోజులకి తగ్గినా మళ్ళీ ఆగష్టు 16న 104 డిగ్రీల జ్వరమొచ్చి హాస్పిటల్లో చేరాను. అప్పుడంతా బాబానే తలుచుకుని, ఊదీ పెట్టుకుంటూ ఉండేదాన్ని. పది రోజులకు జ్వరం తగ్గి ఇంటికి వచ్చాను. అయితే వారం తిరిగేసరికి మళ్ళీ జ్వరం, వాంతులు మొదలవడంతో మళ్ళీ హాస్పిటల్లో చేరాను. వాంతులు ఎక్కువై నీరసించి నడవలేకపోయాను. ఇంకా నాకు ఏమీ తెలిసేది కాదు, ఎవరినీ గుర్తు పట్టలేకపోయేదాన్ని. అటువంటి స్థితిలో నన్ను ఐ.సి.యులో ఉంచి ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. నేను ఆ బాబానే నమ్ముకుని, ఆయన మీదే భారం వేసాను. స్పృహ లేకపోయినా నేను నా మనసులో, "నా పిల్లలను ఇబ్బంది పెట్టొద్ద"ని బాబాను ప్రార్థిస్తుండేదాన్ని. డాక్టర్లు, 'నా పెద్దప్రేగులలో సమస్య  ఉందని, పరిస్థితి విషమంగా ఉందని' చెప్పి నన్ను వెంటిలేషన్‌ ఉంచి, ట్రీట్మెంటు ఇవ్వసాగారు. మా వాళ్లంతా బాబానే నమ్మకుని ఆయన నామస్మరణలో ఉండేవారు. ఆ సమయంలో నా గొంతు పనిచేసేది కాదు, మాట్లాడలేకపోయేదాన్ని. మా వాళ్ళు నా వద్దకి వచ్చినప్పుడు నాకు ఊదీ పెట్టి, సచ్చరిత్ర పారాయణ చేస్తుండేవారు. ఇంకా మొబైల్లో సాయి సందేశాలు  వినిపిస్తూ శిరిడీ లైవ్ దర్శనం చూపిస్తుండేవారు. ఒక నెల తర్వాత నన్ను ఐ.సి.యు నుంచి వార్డుకి మార్చారు. అప్పటికీ నేను చేతులు కదల్చలేని స్థితిలోనే ఉన్నాను. బాబా దయవలన నెమ్మదిగా నా ఆరోగ్యం మెరుగుపడుతుండటంతో 15 రోజుల తర్వాత ఇంటికొచ్చాను. నిదానంగా అన్నీ సర్దుకున్నాయి. ఇప్పుడు కొంచెం ఫరవాలేదు. నేను బాబాను, "నాకు పూర్తి ఆరోగ్యం చేకూరి హాయిగా, ప్రశాంతంగా ఉండేలా అనుగ్రహించమ"ని కోరుకుంటూ ప్రతిరోజూ నీళ్లలో ఊదీ వేసుకుని రెండు పూటలా తాగుతున్నాను. ఆ సాయినాథుని దయవలన కొద్దిరోజులలో నాకు పూర్తిగా తగ్గుతుందని అనుకుంటున్నాను. అందరినీ రక్షించేవాడు ఆ బాబానే. ఆయనకు సర్వస్వశరణగాతి చేస్తే మన బాగోగులు ఆయనే చూసుకుంటారని నా నమ్మకం. బాబా దయవల్ల నా మనవడి పెళ్ళి కుదిరింది. "ఈ కరోనా కాలంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా పెళ్ళి జరగాల"ని బాబాను ప్రార్ధిస్తున్నాను.


ఓం సాయి శ్రీసాయి జయ జయ సాయి!!!

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!!!


శ్రీసాయి అనుగ్రహ వీచికలు


ఈ బ్లాగుని ప్రతిరోజు చదువుతున్న వారికి నా నమస్కారాలు. నేను ఒక సాయిభక్తురాలిని. మేము యూరప్‌లో నివాసముంటున్నాము. మాకు రెండు సంవత్సరాల ఐదు నెలల బాబు ఉన్నాడు. ఒకరోజు తను ఆడుకుంటూ బాత్రూం డోర్ క్లోజ్ చేసి లోపలి నుండి లాక్ చేసేసుకున్నాడు. చిన్నవాడైన తనకి మళ్ళీ లాక్ తీయడానికి రాక ఏడవసాగాడు. వేరే తాళంచెవి కూడా లేకపోవడంతో మాకు ఏం చేయాలో అర్ధం కాక చాలా భయమేసింది. ఏదో విధంగా డోర్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించాం, కానీ ప్రయోజనం లేకపోయింది. అయితే కొంతసేపటికి ఏం జరిగిందో తెలియదుగాని బాబు తనంతటతానే బయటికి వచ్చాడు. మాకు చాలా ఆశ్చర్యమేసింది. నేను అయితే బాబానే ఆ డోర్ తీశారు అనుకున్నాను. ఎందుకంటే వేసిన లాక్ తీయడం తెలియని చిన్నబాబు ఎలా డోర్ ఓపెన్ చేసుకుని బయటకి రాగలడు? బాబాని నమ్ముకున్న వారి అవసరాలన్నీ ఆయనే చూసుకుంటారు. "బాబా! మీకు ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే. మేము మీకు ఎప్పుడూ ఋణపడి ఉంటాము సాయి".


సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo