సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

శ్రీనానాసాహెబ్ చందోర్కర్ - ఎనిమిదవ భాగం



ఒకసారి నానాసాహెబ్ తుంటిపై గడ్డతో చాలా బాధను అనుభవించాడు. ఆ గడ్డ ఇబ్బందికరమైన ప్రదేశంలో వుండి విపరీతమైన నొప్పితో అతనిని చాలా కలవరపెట్టింది. అతను చాలా మంది వైద్యులను సంప్రదించాడు కానీ, ప్రయోజనం లేకపోయింది. అయినా నానా 'ప్రతి చిన్న విషయానికి బాబాని ప్రార్థించడం నాకు తగదు. అలా చేసి నేను ఆయనకు భారం కాకూడదు. కాబట్టి నేను ఈసారి ఆయనని ఇబ్బంది పెట్టకూడదు' అని మనసులో దృఢంగా నిశ్చయించుకొని ఆ బాధను అనుభవించడానికే మొగ్గుచూపాడుగానీ తనను ఆదుకోమని బాబాను ప్రార్థించలేదు. చివరికి ఒక డాక్టరు ముంబయిలో శస్త్రచికిత్స ద్వారా ఆ కురుపును తొలగించాలని అతనికి సలహా ఇచ్చి శస్త్రచికిత్సకోసం ఒక తేదీని నిర్ణయించాడు. ఆ రోజుకి నానా ముంబయిలోని హాస్పిటల్‌కి చేరుకున్నాడు. డాక్టరు రావడానికి ముందు అతను ఒక గదిలోని మంచం మీద పడుకుని ఉండగా నొప్పి చాలా తీవ్రమైంది. ఎంతలా అంటే, ఆ కష్టం నుంచి తను ప్రాణాలతో బయటపడలేననని అతనికి అనిపించింది. ఆ స్థితిలో అతను తన దిండు వద్ద బాబా ఫోటో పెట్టుకొని డాక్టర్ రాకకోసం ఎదురు చూడసాగాడు. డాక్టర్ రావడానికి ఇంకా 10-15 నిమిషాలు మాత్రమే మిగిలి ఉందనగా ఒక ఊహించని సంఘటన జరిగింది. నానా బోర్లా పడుకొని ఉండగా పైకప్పు నుండి ఒక పెంకు ముక్క సరిగ్గా అతని కురుపు మీద పడి కురుపు చిట్లింది. నెమ్మదిగా ఆ కురుపు నుండి చీము బయటకు వచ్చి నొప్పి తగ్గడం మొదలైంది. కొద్దిసేపట్లో సర్జన్ వచ్చి జరిగింది తెలుసుకొని ఆశ్చర్యపోయి, "ఇక శస్త్రచికిత్స అవసరం లేద"ని ధ్రువీకరించాడు. కొన్నిరోజుల తర్వాత నానా శిరిడీ వెళ్ళినప్పుడు బాబా, "నన్ను ఇబ్బందిపెట్టకూడని ఒకరు నిర్ణయించుకున్నా సరే చివరికి నేను నా స్వహస్తాలతో గడ్డని పగలగొట్టాల్సి వచ్చింది" అని అన్నారు.


ఇంకోసారి నానాసాహెబ్ చందోర్కర్ కడుపులో తీవ్రమైన నొప్పితో బాధపడ్డాడు. ఆ కారణంగా నిద్ర కూడా పోలేకపోయాడు. అప్పుడు సాయిబాబా అతనిచేత నేతి బార్ఫీ ముక్క తినిపించారు. అంతటితో అతనికి నయమైంది.

పరుల సేవలో పరమార్థం

నానాసాహెబ్ బాబా వద్దకు రాకముందు బాబా సత్పురుషులన్న విషయం ఎవరికీ తెలియదు. గ్రామస్థులు, బయట గ్రామస్థులు ఆయనను అంతగా పట్టించుకునేవారు కాదు. ఎక్కడ చూసినా చెత్త చెదారంతో నిండిపోయి శిథిలావస్థలో ఉన్న మసీదులో కూర్చుని పగలనక, రాత్రనక చిలుము పీలుస్తూ, కడుపు నింపుకోవడానికి గ్రామంలో ప్రత్యేకించి ఒక 3-4 ఇళ్ల వద్ద సద్ది రొట్టె ముక్కలు భిక్షగా స్వీకరిస్తూ, చింకి గుడ్డలు ధరించే ఫకీరు సమర్ధత, ఐశ్వర్యం గురించి ఎవరికి తెలుస్తుంది? ఆయనను నిర్గుణ పరమాత్మ యొక్క సగుణావతారమని ఎవరనుకుంటారు? కొన్నిసార్లు రహస్యంగా, కొన్నిసార్లు ముళ్ల పొదలలో వసించే పిచ్చి ఫకీర్‌ వద్దకి ఎవరు వస్తారు? ఆయన్ని నిశితంగా ఎవరు గమనిస్తారు? శ్రీ గంగాగీర్ బువా మరియు ఆనందనాథ్ మహారాజ్‌లు శిరిడీ వచ్చినప్పుడు వారు స్పష్టమైన స్వరంతో, "అరే, ఈయన ఈ చెత్తకుప్పపై పడి ఉన్న అమూల్య రత్నం. మీ అపార భాగ్యం వలన ఇది మీకు లభించింది" అని ప్రజలతో చెప్పినప్పటికీ ఆ మాటలపై ఎవరు శ్రద్ధ వహిస్తారు? కొంతకాలం తర్వాత నీంగావ్‌కు చెందిన నానాసాహెబ్ డెంగ్లే మరియు నిమోన్‌కు చెందిన నానాసాహెబ్(దేశ్‌పాండే) నిమోన్కర్ బాబా వద్దకు రావడం ప్రారంభించారు. విద్యావంతులలో మొదటగా సిన్నార్ మామలతదారు శ్రీచిదంబర్రావు గాడ్గిల్, స్కూల్ అకౌంట్ హెడ్ రావుసాహెబ్ సీతారాం విశ్వనాథ్ పట్వర్ధన్, బి.ఎ., స్పెషల్ జడ్జి రావుసాహెబ్ వామన్‌రావ్ బోడస్ బాబా దర్శనానికి వచ్చారు. ఆ తర్వాత నానాసాహెబ్‌ను బాబా స్వయంగా తమ చెంతకు రప్పించుకున్నారు. అతను మొదట్లో బాబాను ముస్లిం ఫకీరుగా భావించేవాడు. కానీ బాబాతో సాన్నిహిత్యం పెరుగుతున్నకొద్దీ వారిని నిశితంగా పరిశీలించిన మీదట అతని అభిప్రాయం పూర్తిగా మారి బాబా హిందూ బ్రాహ్మణులని, సత్పురుషులని పూర్తి విశ్వాసంతో చివరి వరకు వారి అంకిత భక్తుడిగా కొనసాగాడు. ఒకసారి బాబా నానాతో "నువ్వు నన్ను ప్రాపంచిక సంపదలు కావాలని అడిగితే, నేను వాటిని నీకు ఇవ్వలేను. నీ పూర్వజన్మలలో చేసిన కర్మలననుసరించి నువ్వు వాటిని పొందుతావు. కానీ నేను నిన్ను పరమార్థ మార్గంలో నడిపించాలని కోరుకున్నట్లయితే, అది చేస్తాను" అని అన్నారు. అందుకు నానా చాలా సంతోషంగా అంగీకరించి తనని తాను పరుల సేవకి అంకితం చేస్తానని, తద్వారా ఆత్మోన్నతి సాధిస్తానని ప్రమాణం చేసాడు. దీన్నే భాగవత ధర్మం అంటారు. దానిని బాబా ఎల్లప్పుడూ చెప్పేవారు.

బాబా ద్వారా తరచుగా అనుభవాలు రావడం మొదలయ్యాక నానాసాహెబ్‌ తనకు తెలిసిన చాలామంది బాగా చదువుకున్న స్నేహితులు మరియు అధికారులను ప్రేమగా అర్థించి తనతో బాబా వద్దకు వచ్చి ప్రాపంచిక, పారమార్థిక ప్రయోజనాలను పొందామని పట్టుబట్టేవాడు. తన స్వానుభవాలను మరియు ఇతర భక్తుల విషయంలో బాబా చేసిన అపురూపమైన లీలలను ఎంతోమందికి చెప్పి వాళ్ళ మనసులను బాబా వైపుకు మళ్లించేవాడు. నెమ్మదిగానే అయినా కానీ తక్కువ సమయంలోనే ఆ భక్తులు సమర్ద సద్గురు సాయినాథుని వద్దకు వెళ్లడం ప్రారంభించారు. ముఖ్యంగా ఈ మధురమైన సత్సంగాలు బాబా పవిత్ర ధామం శిరిడీలో మొదటి కొన్ని సంవత్సరాలు క్రిస్మస్ సెలవుల్లో జరిగేవి.

శిరిడీలో సాఠేవాడ నిర్మాణం జరగడానికి ముందు బాబా దర్శనార్థం వచ్చే భక్తులకు అరకొర సౌకర్యాలే అందుబాటులో ఉండేవి. అందుచేత నానాసాహెబ్ తన సొంత ధనాన్ని ఖర్చు పెట్టి పెద్ద పెద్ద గుడారాల వేయంచి భక్తులకు వసతి సౌకర్యాలు కల్పించేవాడు. అలాగే తన జేబులో డబ్బులు తీసి వాళ్ళకోసం భోజన ఏర్పాట్లు కూడా చేయించేవాడు. ఈ విషయాలలో సహాయం కోసం తన మేనల్లుడు బాలాభావుని శిరిడీకి రప్పించి అతను ఉండటానికి ఒక చిన్న ఇల్లు, ఒక టాంగా కూడా ఏర్పాటు చేశాడు. అతను తన కుటుంబంతో శిరిడీలో ఉంటూ బయట ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు వసతి, భోజన సదుపాయాలు కల్పించడంలో నానాసాహెబ్‌కు సహాయం చేస్తుండేవాడు(1911 సంవత్సరంలో భక్తులకోసం ప్రారంభింపబడ్డ మొట్టమొదటి హోటల్ బహుశా యిదే). ఈ వివరాల గురించి బాలాసాహెబ్ దేవ్ తన వ్యాసాలలో పొందుపరచిన ఈ క్రింది వివరాలు ఎంతైనా ఇక్కడ ప్రస్తావనార్హం. 

బాలాసాహెబ్ దేవ్ తన వ్యాసాలలో నానాసాహెబ్ భక్తులకు చేసిన అద్వితీయ సేవల గురించి పదేపదే ప్రశంసలు కురిపించేవాడు. అతను ఇలా వ్రాశాడు: “బాబా నిజతత్త్వం, విశేష అధికారాలు, అద్భుత శక్తులు, రోజువారీ జీవితంలో అనుసరించాల్సిన పద్ధతులకు సంబంధించిన వారి అమూల్యమైన బోధనలు మొదలైనవాటి గురించి ప్రజలకు మొట్టమొదట పరిచయం చేసి, ఒప్పించింది నానాసాహెబ్ చందోర్కర్ అంటే ఎవరైనా అంగీకరించాల్సిందే! తన సద్గురువైన బాబా మహిమలను వివరించినప్పుడల్లా అతని కళ్ళ నుండి ఎడతెగని కన్నీటి ప్రవాహం మొదలయ్యేది. అతనెప్పుడూ తనలాగే ఇతరులు కూడా బాబా అనుగ్రహాన్ని పొందాలని తపించేవాడు. అతను బాబా గురించి, వారి మహిమాలు, బోధనలు గురించి వివిధ ప్రాంతాల్లో ముఖ్యంగా పూణే, ముంబయి వంటి నగరాలలో పెద్ద ఎత్తున ప్రచారం చేసాడు. ఆ కారణంగా సమాజంలోని వివిధ మతాలు, కులాలు, సంప్రదాయాలకు, వర్గాలకు, ఆర్థిక స్థితిగతులకు చెందిన ప్రజలు బాబా దర్బారుకి వచ్చి, బాబాను దర్శించి వారి దివ్యశక్తులకు సంబంధించిన అనుభవాలను పొందారు. వాళ్లలో చాలామంది జీవనాధారాన్ని బాబా ద్వారా పొంది తమకు బాబాను పరిచయం చేసిన నానాసాహెబ్‌ను ఆశీర్వదించారు. మరికొంతమంది బాబాకు అత్యంత ప్రముఖ భక్తులయ్యారు. వాళ్లలో రాధాకృష్ణఆయీ, తాత్యాసాహెబ్ నూల్కర్, రావుబహదూర్ విశ్వనాథ్ ప్రధాన్, కాకాసాహెబ్ దీక్షిత్, అన్నాసాహెబ్ దభోల్కర్, బాబాసాహెబ్ సహస్రబుద్దే, దాసగణు మహారాజ్, మాధవరావు అడ్కర్, వినాయకరావు ఠాకూర్, కాశీబాయి కనిత్కర్, ఛాన్సలర్ చింతామణి వైద్య, ఇంకా అనేకమంది సుప్రసిద్ధులు”. అతను ఇంకా ఇలా వ్రాసారు: "తరువాత కాలంలో చాలా వాడాలు నిర్మింపబడ్డాయి. అవి భక్తుల వసతి సమస్యను పరిష్కరించడంలో సహాయపడ్డాయన్నది నిజం. అయితే అంతకుముందు సంవత్సరాలలో వసతి సౌకర్యాలు కల్పించడంలో నానాసాహెబ్ కీలకపాత్ర పోషించారు. ఆ మంచి పనుల కారణంగా అతను వేలాదిమంది భక్తుల దీవెనలు పొందాడు".

ఆడంబరాలు ప్రదర్శనపై తీవ్ర వ్యతిరేకత

బాబా దర్శనార్థం శిరిడీ వచ్చే భక్తుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండేది. వాళ్ళలో కొంత మందితో పాటు బాబా చుట్టూ ఉండే మరికొంతమంది భక్తుల అతి ఉత్సాహంతో బాబా పాదాల వద్ద వివిధ వస్తువులను సమర్పించసాగారు. మరికొన్ని వస్తువులను బాబాకు సమీప భక్తులు బయట ప్రాంతాల నుండి తెప్పించేవారు. ముఖ్యంగా రాధాకృష్ణఆయీ ధనిక భక్తులని బాబాకోసం ఖరీదైన వస్తువులు కొనమని అడిగి, వాటిని ఉపయోగించమని బాబాను బలవంతపెట్టేది. అయితే బాబా అందుకు విముఖత చూపేవారు. ఆ విషయం గురించి బాబా నానాతో, "నానా! ఒక గుడ్డ పీలిక, ఒక కౌపీనం, ఒక కఫనీ, ఒక మట్టికుండ, ఒక రేకు డబ్బా ఇవే నిజంగా నాకున్న వస్తువులు. కానీ వీళ్ళని చూడు, అనవసరంగా నన్ను వేధిస్తున్నారు. వాళ్ళు బలవంతంగా వస్తువులను నాకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇదేమి ప్రవర్తన?" అని అన్నారు. కానీ ఆ భక్తులు బాబా గడిపే సాధారణ జీవన విధానాన్ని, అలాగే అలాంటి వస్తువులతో ఆయనకు అవసరం లేదనే విషయాన్ని పూర్తిగా మర్చిపోయారు. వాళ్ళ చొరవ వల్ల క్రమేణా శిరిడీ ఒక సంస్థానంగా రూపుదిద్దుకోనారభించింది. ఈ మార్పు పరమార్థ మార్గానికి హానికరమని నానాకు తెలుసు. అందువల్ల అతను సాధారణమైన పూజ, హారతులను ఆడంబరమైన ప్రదర్శనగా మార్చడం వల్ల చాలా కలవరపడ్డాడు. 

నానాసాహెబ్, తాత్యాసాహెబ్ నూల్కర్‌‌లు ఉత్తరప్రత్యుత్తరాల ద్వారా చాలా విషయాలను ఒకరితోఒకరు పంచుకునేవారు(నూల్కర్‌ని బాబా వద్దకు తీసుకురావడంలో నానాసాహెబ్ చాలా కీలక పాత్ర పోషించాడు. అందువల్ల నూల్కర్ అతనిపట్ల తనకు నిత్యమూ ఉండే కృతజ్ఞతా భావాన్ని తన ఉత్తరాలలో పదేపదే వ్యక్తపరుస్తుండేవాడు). 1910, డిసెంబర్ 16న ఒక లేఖలో నానాసాహెబ్ తన ఆవేదనను నూల్కర్‌‌తో ఇలా పంచుకున్నాడు: 'ప్రియమైన తాత్యాసాహెబ్! గురుదేవులైన సాయిమావూళి(తల్లి)కి, బాపుసాహెబ్ జోగు మరియు ఇద్దరు మాధవరావులకు(షామా&అడ్కర్) నా సాష్టాంగ నమస్కారాలు. రోజువారీ పూజలో మొర్చేల్(నెమలి ఈకల చామరం), చావరి(సాధారణ చామరం), కర్ర మొదలైన వస్తువుల ఉపయోగమేమిటని నేను విస్మయం చెందుతున్నాను. పూజ నిస్వార్థ భక్తితో చేయాలి. శ్రీ(సాయిబాబా) అయిష్టంగానే తమ అనుమతినిస్తారన్నది నిజం. కానీ భక్తులమైన మనం ఇలాంటి ఆచారాల వల్ల చాలా నష్టపోతున్నాము. అలాంటి పనికిమాలిన విషయాలకి బాబా ఆశీస్సులు వృధా అవుతున్నాయి. ఆయన కల్పతరువు(ఏ కోరికనైనా తీర్చే వృక్షం). తమ పాదాలను ఆశ్రయించే వారి కోరికలను ఆయన తీరుస్తారు. కానీ కోరికలు తీర్చుకోవాలనే ఏకైక ఉద్దేశ్యంతో ఆయనకు భక్తులవ్వడం సరికాదు. తమ కోరికలు నెరవేర్చుకోవాలన్న ఉద్దేశంతో ఖరీదైన బహుమానాలు ఇచ్చేవాళ్ళు అటువంటి కానుకలు ఇవ్వలేని భక్తుల మనసులలో చెడు భావనలు కలిగిస్తున్నారు. శ్రీ(సాయిబాబా)కి అలాంటి సంపద ప్రదర్శన అవసరం లేదు. తులసీ వివాహం రోజున శ్రీ(సాయిబాబా) ఉగ్రరూపం దాల్చారు. ఆయన అలాంటి వాటిని ఇష్టపడరనడానికి అది స్పష్టమైన సూచన. నేను ఇతరులను పట్టించుకోను. కానీ నువ్వు నా సన్నిహిత మిత్రుడివి కాబట్టి, అలాంటి ఆచారవ్యవహారాలలో పాల్గొనే విషయంలో మిమ్మల్ని హెచ్చరించే స్వేచ్ఛను తీసుకుంటున్నాను. మిగతా విషయాలు మనం కలిసినప్పుడు మాట్లాడుకుందాం".

అయితే కారణం ఏమిటో తెలియదు గానీ తర్వాత అతని ఆలోచనలో మార్పు వచ్చింది కాబోలు! ఖపర్డే తన డైరీలో 18-2-1912న ఇలా వ్రాసుకున్నారు:పెళ్ళి మొదలైన శుభకార్యాలలో వాడే 'చంద్రుడితో ఉండే కృత్రిమమైన తోట'ను నానాసాహెబ్ తీసుకువచ్చాడు. దాన్ని తెమ్మని రాధాకృష్ణఆయీ కోరింది”.

మసీదు పునరుద్ధరణ:

కోపర్‌గాఁవ్‌‌లో సర్కిల్ ఇన్స్పెక్టర్‌గా పనిచేసిన గోపాలరావు గుండుకు మూడు వివాహాలు చేసుకున్నా పుత్రసంతానం కలగలేదు. ఒకనాడు నానాసాహెబ్ డేంగ్లే, "బాబా దర్శనం చేసుకో! వారి ఆశీస్సులతో నీకు పుత్రసంతానం కలుగుతుంది" అని అతనికి సలహా ఇచ్చాడు. దాంతో అతను శిరిడీ వెళ్లి బాబా ఆశీస్సులు పొందాడు. త్వరలోనే అతనికి ఒక కుమారుడు జన్మించాడు. అతని ఆనందానికి అవధులు లేవు. బాబా అనుగ్రహం వలనే తనకు పుత్రుడు జన్మించాడని అందుకు కృతజ్ఞతగా అతను శిరిడీలో ఉరుసు ఉత్సవం జరిపించ తలచి బాబా ఆశీస్సులు తీసుకొని తాను అనుకున్నట్లు ఉత్సవం జరిపించాడు. అతను శిథిలమైన మసీదును మరమ్మత్తు చేసి, పునరుద్ధరించాలని కూడా అనుకొని అందుకోసం అవసరమైన రాళ్ళను, ఇతర సామగ్రిని సేకరించడం మొదలుపెట్టాడు. అయితే, బాబా ఆ పనిని నానాసాహెబ్ చందోర్కర్‌కి అప్పగించాలని అనుకున్నారు. అందువల్ల ఆ పని చేయడానికి ఆయన గోపాలరావుకు అనుమతినివ్వక, అతను సేకరించిన సామాగ్రిని శని మందిరం, దాని చుట్టుపక్కల ఉన్న ఇతర దేవాలయాల పునరుద్ధరణకు, పునర్నిర్మాణానికి ఉపయోగించమని ఆదేశించారు. అందుకతను ఎంతో సంతోషించి బాబా సూచనల మేరకు వెంటనే ఆ పని మొదలుపెట్టి పూర్తి చేసాడు. కొంతకాలానికి శిథిలావస్థలో ఉన్న మసీదును పునర్నిర్మించాలని నానాసాహెబ్ చందోర్కర్‌కి సంకల్పం కలిగి బాబా అనుమతిని అర్థిస్తే, ఆయన మొదట ఒప్పుకోలేదు. అయినా అతను తన సంకల్పాన్ని విడువక బాబా అనుమతికోసం ఎదురుచూశాడు. అటువంటి సమయంలో ఒకరోజు చందోర్కర్ మసీదు బయట ఉండగా మహల్సాపతి మసీదుకి వచ్చాడు. బాబా అతన్ని తమ దగ్గరకు పిలిచి, "భగత్, బయట నిలుచున్న ఆ వ్యక్తి ఎవరు?" అని అడిగారు. అందుకు మహల్సాపతి, "అతను నానాసాహెబ్" అని బదులిచ్చి, చిలిం వెలిగించి బాబాకు అందించాడు. అప్పుడు బాబా, "అరే భగత్, నేను నిన్ను ఒక విషయం అడగాలనుకుంటున్నాను. బయట నిలబడివున్న ఈ నానా మసీదును క్రొత్తగా పునర్మిస్తానని అంటున్నాడు. నువ్వేమనుకుంటున్నావు? మనం క్రొత్త మసీదు నిర్మించాలా? లేక మనకు ఈ పాత భవనం సరిపోతుందా? అసలు క్రొత్తది ఎందుకు నిర్మించాలి?" అని అడిగారు. అందుకు మహల్సాపతి సౌమ్యంగా పరిహాసమాడుతూ, "అతన్ని క్రొత్తది నిర్మించనివ్వండి. అది మనిద్దరికీ కూర్చోవడానికి, పడుకోవడానికి సౌకర్యంగా ఉంటుంది" అని అన్నాడు. ఈ విధంగా చిలిం త్రాగుతూ వారివురి మధ్య సంభాషణ జరిగాక బాబా మసీదు పునరుద్ధరించడానికి అనుమతిని ఇచ్చారు. తరువాత బాబా ఆదేశం మేరకు మహల్సాపతి నానాను పిలిచి కొబ్బరికాయ కొట్టి పని ప్రారంభించాడు. ఆ తర్వాత నానాసాహెబ్ మహల్సాపతి, నిమోన్కర్‌ల సహాయంతో మశీదు పునరుద్ధరణ 1912లో పూర్తి చేశాడు.

తరువాయి భాగం త్వరలో..


source: లైఫ్ ఆఫ్ సాయిబాబా(రచన: శ్రీబి.వి.నరసింహస్వామి)
 సాయిలీల మ్యాగజైన్స్  - 1986 మరియు 2009.
సాయిబాబా(రచన: శ్రీసాయి శరణానంద)

బాబాస్ వాణి, బాబాస్ అనురాగ్(రచన: విన్నీ చిట్లురి).


  

 


ముందు భాగం కోసం
బాబా పాదుకలు తాకండి.




 

నిర్ధిష్టమైన భాగం కోసం పైన నెంబర్లను తాకితే, ఆ నెంబరుకి సంబంధించిన భాగం ఓపెన్ అవుతుంది.

 


తరువాయి భాగం కోసం
బాబా పాదాలు తాకండి.

 



12 comments:

  1. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏

    ReplyDelete
  2. Baba, provide peace and wellness to my father 🙏🙏🙏🙏

    ReplyDelete
  3. Baba, take care of my son 🙏🙏🙏🙏

    ReplyDelete
  4. ఓం సాయిరామ్

    ReplyDelete
  5. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  6. Omsaisri Sai Jai Jai Sai 🙏🙏🙏🙏 kapadu Tandri 🙏🙏🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  7. Sai baba please baba always be with us

    ReplyDelete
  8. 🌺🌺🙏🙏 Om Sai Ram 🙏🙏🌺🌺

    ReplyDelete
  9. Baba sai madava bharam anta meede baba

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo