1. బాబా దయతో విదేశీ ప్రయాణం
2. దసరా పండగకు నెలసరి అడ్డులేకుండా అనుగ్రహించిన బాబా
బాబా దయతో విదేశీ ప్రయాణం
నేను ఒక సాయిభక్తుడిని. ఒకానొక వయసులో ప్రతిరోజూ బాబా చరిత్ర చదివే అలవాటు నాకు ఉండేది. అయితే వయసు, ఉద్యోగంలో హోదా పెరిగే కొలదీ బాబా చరిత్ర చదవడం మానేసాను. బహుశా బాబా నన్ను పరీక్షించదలిచారేమో! పెళ్ళైన కొన్నాళ్ళకి నా స్వకర్మల వల్ల, చేసిన పాపాల వల్ల కొంచెంకొంచెంగా నేను సమస్యల సుడిగుండంలోకి నెట్టివేయబడి అన్నీ రకాలుగా నష్టపోయాను. 'కష్టాలు వచ్చినప్పుడే మనం దేవుడిని గుర్తు చేసుకుంటామ'ని బాబా చరిత్రలో చెప్పినట్టు నేను మరల బాబా చరిత్ర నిత్య పారాయణ మొదలుపెట్టాను. కొంతకాలానికి నేను, నా భార్య, మా అమ్మాయి విదేశాలకు వెళ్లాలని అనుకున్నాం. అయితే నా భార్య తనకు నచ్చిన దేశమైతేనే వస్తానని అంది. సరేనని, బాబా మీద భారమేసి తనకు నచ్చిన దేశానికి వెళ్లే ప్రయత్నం చేద్దామనుకున్నాం. అందుకోసం మా బావ ఒకరు మార్గం చెప్పారు. అదే సమయంలో మంచి, చెడు చెప్పే ఒక గురువుగారు బాబా దయవల్ల నాకు కలిశారు. ఆయన అనుమతితో ముందుగా నా భార్య ఆ దేశానికి వెళ్లేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాం. అయితే రెండుసార్లు మా ప్రయత్నాలు విఫలమయ్యాయి. తర్వాత ఒక కార్తీక సోమవారం శివాలయంలో దీపారాధన చేసి ఇంటికొచ్చి మా విదేశ ప్రయాణం గురించి మాట్లాడుకుంటూ పడుకున్నాం. మరుసటిరోజు ఉదయం 6గంటలకు మా ప్రయత్నంలో మొదటి భాగం ఫలించింది. అంటే మేము కోరుకున్న దేశానికి వెళ్ళటానికి మొదటి ద్వారం తెరుచుకుంది. అన్నీ అర్హతలు ఉన్నట్టు, వీసా అప్లై చేసేందుకు అర్హులమన్నట్లు మాకు మెయిల్ వచ్చింది. నా భార్యకి వీసా వచ్చిన తర్వాత తను ఏ క్షణమైనా మమ్మల్ని వదిలి ఉద్యోగం కోసం ఆ దేశం వెళ్లాల్సి ఉంటుంది. తను వెళ్లిన తర్వాత నేను, నా కూతురు కూడా వెళ్లాల్సి ఉండగా ఈ లోపల మిగిలిన పనులు చూసుకోవడానికి, మా ఇతర కుటుంబసభ్యులతో గడపటానికి, ముఖ్యంగా నా భార్యతో సమయం గడపటానికి నేను ఉద్యోగం మానేయాల్సి వచ్చి, మా విదేశీ ప్రయాణ ప్రయత్నాలు ఫలిస్తాయన్న నమ్మకంతో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసాను. కానీ తర్వాత వ్యవహారమంతా పరమపద సోపాన పటంలో ఒక నిచ్చెన ఎక్కితే, రెండు పాములు కాటేసినట్టు సాగుతుండేది. కొన్నాళ్ళకి వీసా ఇంటర్వ్యూకి వెళ్లే సమయం వచ్చినప్పటికీ అది సవ్యంగా జరగలేదు. ఆ రోజు నా భార్య చాలా ఇబ్బందులు పడి ఎంతో బాధ అనుభవించి, "ఇక ఆ దేశం వెళ్ళాలన్న ఆలోచననే వదిలేద్దామ"ని అంది. అయ్యో.. ఇలా జరిగిందేమిటని అని చాలా బాధపడ్డాము. అంతలో మళ్ళీ కార్తీకమాసం వచ్చింది. బాబా చరిత్రలో, ‘ఇష్ట దైవాన్ని మనసారా ఆరాధిస్తే, ఆ దైవమే సరైన మార్గం చూపిస్తాడ’ని చెప్పబడింది. అనుకోకుండా నేను ఒక గురువారం మా ఇంటికి దగ్గర్లో ఉన్న సాయిబాబా గుడికి వెళ్ళాను. ఆ సమయంలో అక్కడ అన్నదానం జరుగుతుంది, ఆ గుడివాళ్ళు నన్ను భోజనం చేసి వెళ్ళమన్నారు. కానీ కార్తీక ఉపవాస దీక్ష వల్ల నేను ప్రసాదం స్వీకరించలేక మనసులో, "బాబా! నా భార్యకి వీసా వస్తే, ఈ గుడిలో అన్నదానం చేస్తాన"ని బాబాకి నమస్కారం చేసుకున్నాను. అంతే, బాబా దయ చూపారు. సరిగ్గా నెలరోజులకు నా భార్యకి వీసా వచ్చింది. ఇక అప్పటినుండి మాకు, మా కుటుంబానికి ఏ మంచి జరగాలన్న బాబా సప్తాహ పారాయణ చేయటం, కోరిక తీరిన వెంటనే బాబా గుడిలో అన్నదానం చేయటం అలవాటు చేసుకున్నాం. బాబా గుడిలో పల్లకి ఇద్దామని కూడా అనుకొని, బాబా దయతో గురుపౌర్ణమినాడు ఎంతో అంగరంగ వైభవంగా పల్లకి ఉత్సవం జరిపి పల్లకిని బాబాకి సమర్పించుకున్నాము. తర్వాత 2023, ఫిబ్రవరిలో నా భార్య తను కోరుకున్న దేశానికి వెళ్ళింది. ఆ తర్వాత నేను, నా కూతురు నా భార్య దగ్గరకు వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తే అప్పుడు కూడా ఏవేవో అడ్డంకులు వచ్చాయి. అప్పుడు నేను ఈ బ్లాగులోని తోటి భక్తుల అనుభవాలు చూసి, 'నా కోరిక నెరవేరితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన'ని అనుకున్నాను. బాబా దయతో అడ్డంకులు తొలగి మేము నా భార్య దగ్గరకి వెళ్ళడానికి మార్గం సుగమమై నేను, నా కూతురు సెప్టెంబర్‌లో క్షేమంగా ఆ దేశం చేరుకున్నాము. "మీకు చాలా చాలా ధన్యవాదాలు సమర్ధ సాయినాథా! మాకు తల్లి, తండ్రి, గురువు, అన్నీ మీరే అయి మమ్మల్ని సదా కాపాడు స్వామి. మీ నుండి, మీ పాదాల నుండి మా దృష్టి ఎప్పటికీ మరలకుండా చూడు స్వామి".
శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.

