సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1677వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  •  వెన్నంటే ఉండి నడిపిస్తున్న బాబా


నా పేరు స్వరూప. నేను నా భర్త పిల్లలతో యుఎస్ఏలో ఉంటున్నాను. నా జీవితంలోని ప్రతి విషయంలో బాబా నా వెన్నంటే ఉండి నడిపిస్తున్నారు. నాకు ఇప్పుడు 40 సంవత్సరాలు. చిన్నతనంలో తొమ్మిది లేదా పది సంవత్సరాల వయసున్నప్పుడు నేను మొదటిసారి బాబా ఫోటో, పుస్తకం చూశాను. తర్వాత మా ఇంటికి సమీపంలో ఉన్నవాళ్లు ప్రతి గురువారం వాళ్ళింట్లో బాబా భజన చేస్తుంటే, మేము ఆ భజనలకి వెళ్తుండేవాళ్ళం. ఒకరోజు వాళ్ళు ఊదీ పాట పాడినప్పుడు నాకు ఊదీ విలువ తెలిసింది. తర్వాత కొద్దిరోజులకి దాదాపు సాయిబాబాలానే వస్త్రధారణతో, చేతిలో సంచితో ఒక అతను మా ఇంటి గడపలో కూర్చున్నాడు. మా అమ్మ అతనితో మాట్లాడింది. తర్వాత మా నాన్నకి పదోన్నతి వచ్చింది. అప్పట్లో మాకు బాబా లీలలు అంతగా తెలియనందున ఆనాడు మా ఇంటి గడపలో కూర్చుంది బాబానే అని గుర్తించలేదుగానీ ఇప్పుడు ఇదంతా వ్రాస్తుంటే మొదటినుండి బాబా మాకు తోడుగా ఉన్నారని అర్థమవుతుంది.

నాన్నకి పడదోన్నతి వచ్చాక మేము వేరే ఊరు వెళ్ళాము. అక్కడికి వెళ్ళాక నెలలో ఒకటి, రెండుసార్లు బాబా గుడికి వెళ్తుండేవాళ్ళం. అప్పుడు నేను తొమ్మిదో తరగతి చదువుతుండేదాన్ని. నేను ఇంటర్మీడియట్ చివరి సంవత్సరంలో ఉండగా నాన్న అనుకోకుండా మా నానమ్మగారి ఊరులో ఇంటి నిర్మాణం మొదలుపెట్టారు. దాంతో 2000 సంవత్సరంలో మేము మా సొంత ఊరు వెళ్లిపోయాం. అక్కడ మేము మా సొంత ఇంటిలో ఉన్నప్పుడు మా అమ్మ చాలాసార్లు బాబా సచ్చరిత్ర పారాయణ చేసింది. ఆమె పారాయణ అయిపోయిన చివరిరోజు అయిన గురువారం నాడు భోజనానికి అన్నీ సిద్ధం చేసి 'బాబా వస్తారు' అని ఎదురుచూసేది. ఆశ్చర్యం ఏంటంటే, ఎవరినీ పిలవకపోయినా మధ్యాహ్న భోజనానికి ఎవరో ఒకరు వస్తుండేవారు. ముఖ్యంగా అప్పటివరకు మా ఊర్లో ఎప్పుడూ చూడని సాధువులు భోజనానికి వచ్చేవారు. ఒకసారి మధ్యాహ్నం ఒంటిగంట అయినా ఎవరూ రాలేదు. మా అమ్మ, "బాబా వస్తేగానీ, నేను తినను" అంది. అంతలో తెల్లని వస్త్రాలు ధరించిన ఒకతను వచ్చి భోజనం పెట్టమన్నాడు. నిజంగా అతను బాబానే.

నా చదువు పూర్తైన తర్వాత మేము పెద్దగా ప్రయత్నించకపోయినా ఒక మంచి సంబంధం వచ్చి నాకు పెళ్లి నిశ్చయమైంది. మేము ఇస్తామన్న కట్నంలో ఒక 50,000 రూపాయలు సమకూర్చుకోవడానికి చాలా టెన్షన్ పడ్డాము. అప్పుడు నమ్మకంతో బాబాను ప్రార్థిస్తే, అద్భుతం జరిగింది. మా నాన్న స్నేహితుడు ఫోన్ చేసి, "మీ స్థలాన్ని 50 వేల రూపాయలకు అడుగుతున్నారు. అమ్ముతావా?" అని అడిగారు. అది మేము కలలో కూడా ఊహించలేదు. ఎందుకంటే, ఎప్పుడో నాకు ఏడేళ్ల వయసున్నప్పుడు 7,000 రూపాయలు పెట్టి కొన్న స్థలమది. ఎక్కడో మారుమూల ఉన్న ఆ స్థలాన్ని ఎవరైనా కొంటారన్న ఆలోచన కూడా మాకు లేదు. నిజం చెప్పాలంటే ఆ స్థలం ఒక్కటి ఉందన్న సంగతి కూడా మేము మర్చిపోయాం. అలాంటిది బాబా సమయానికి మా నాన్న స్నేహితుని రూపంలో మాకు సహాయాన్ని అందించారు. మేము చాలా సంతోషంగా ఆ స్థలాన్ని వాళ్ళకి అమ్మాము. అలా డబ్బు సమకూరేలా చేసి 2005లో ఒక గురువారంనాడు నా పెళ్లి జరిపించారు బాబా. ఆయన దయవలన నాకు మంచి జీవిత భాగస్వామి దొరికారు. మావారు చాలా సింపుల్‌‌గా ఉంటారు, ఎవరి గురించి చెడు మాట్లాడరు, నన్ను ‘ఇలా ఉండు, ఇది చేయి, అది వద్దు’ అని అనరు. "ధన్యవాదాలు బాబా".

2006, ఏప్రిల్‌‌లో నేను గర్భవతినని తెలిసింది. అయితే ఐదవ నెల మొదలవుతుండగా ఉమ్మనీరు కొద్దికొద్దిగా లీక్ అవ్వ సాగింది. నాకు ఏం జరుగుతుందో తెలియలేదు. మా అమ్మ నా పొట్టకు ఊదీ రాసింది. వెంటనే బెలూన్ పేలినట్లు ఒక్కసారిగా ఉమ్మనీరు అంతా బయటకు వచ్చేసింది. హాస్పిటల్‌‌కి వెళ్తే, బేబీకి పల్స్ లేదని డి&సి చేసి బిడ్డని తీసేసారు. ఆ బిడ్డ మాకు దక్కకపోవడానికి ఏదో బలమైన కారణం ఉంటుందని నా నమ్మకం. భవిష్యత్తులో ఆ బిడ్డతో మేము ఇబ్బందిపడకూడదనే బాబా అలా చేశారని అనుకున్నాం. తర్వాత నాకు హార్మోన్ సమస్యలు ఉన్నందున మేము సంతానం కోసం చాలా సంవత్సరాలు హాస్పిటళ్ళ చుట్టూ తిరిగాము. కానీ ఫలితం లేకపోయింది. ఇంకా ఐవిఫ్ మాత్రమే మిగిలిందని డాక్టర్ అన్నారు. అప్పుడు నేను, "బాబా! నార్మల్గానే నాకు ప్రెగ్నెన్సీ రావాలి" అని బాబాను ప్రార్థించి, "నన్ను శిరిడీకి తీసుకొని వెళ్ళండి. అక్కడికి వెళ్తే చాలు, నాకు ప్రెగ్నెన్సీ నార్మల్గా వస్తుంద"ని మావారితో అన్నాను సరేనని మావారు నన్ను శిరిడీ తీసుకొని వెళ్లారు. అంతే, బాబా కరుణించారు. శిరిడీ నుండి వచ్చిన 15 రోజులకి నేను గర్భవతినని తెలిసింది. ఇది నిజంగా సాయి లీల. 2011లో చక్కని తేజస్సుతో మాకు బాబు పుట్టాడు.

ఒకరోజు నేను 'ఉద్యోగం చేయాలా లేక గృహిణిగా ఉండాలా' అని బాబా దగ్గర చీటీలు వేశాను. 'గృహిణిగా ఉండమ'ని బాబా సమాధానం వచ్చింది. కానీ నేను ఉద్యోగం కోసం వేరే వాళ్ళని అడుగుతుండేదాన్ని. అప్పుడు బాబా స్వప్న దర్శనమిచ్చారు. ఆయన కలలో మా ఇంటి బయట ఉండి, నేను బయటికి వెళ్తుంటే సట్కా పట్టుకుని "లోపలికి పో" అని అన్నారు. దాంతో నేను ఉద్యోగ ప్రయత్నం మానుకున్నాను.

2006లో నా మొదటి గర్భం పోయినప్పుడు అక్టోబర్ 2, విజయదశమినాడు నేను, "బాబా! నేను మళ్ళీ గర్భవతినయ్యేవరకు మాంసాహారం తినడం మానేస్తాను" అని అనుకున్నాను. కానీ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ మళ్ళీ నేను గర్భవతినవ్వడానికి ఆలస్యం అవుతుండటం వల్ల ‘నేను మాంసాహారం తినడం పూర్తిగా మానేస్తాననుకున్నాను’. అయితే అలా అనుకున్నానేగాని పూర్తిగా మానలేకపోయాను. రెండేళ్లు మానడం తర్వాత అప్పుడప్పుడు తినడం, తిన్నప్పుడు 'బాబా క్షమించు' అనుకోవడం చేస్తుండేదాన్ని. ‌‌అలా ఉండగా శిరిడీ వెళ్లి వచ్చాక మాకు బాబు పుట్టాడు. అప్పుడు నేను రెండు సంవత్సరాలు మాంసాహారం తినకుండా జాగ్రత్తగా ఉన్నాను. కానీ తర్వాత మళ్లీ తినడం మొదలుపెట్టాను. ఆ సమయంలో బాబా దయవల్ల ఏ ప్రయత్నం చేయకుండానే నేను రెండోసారి గర్భవతినై ఆడపిల్లకి జన్మనిచ్చాను. పాప ఆరోగ్యంగా పుట్టింది. అప్పుడు నేను ఒక సంవత్సరంన్నర శాకాహారిగా ఉన్నాను. కానీ ఒక సందర్భంలో మళ్ళీ మాంసాహారం తిన్నాను. పాపకి రెండు సంవత్సరాల వయసున్నప్పుడు 2018లో మామూలుగా చెకప్ కోసం పాపని హాస్పిటల్‌‌కి తీసుకెళ్తే పాపకి ‘ఆటిజం’(మానసిక ఎదుగుదల లేకపోవడం) అని తెలిసింది. దాంతో రోజులు చాలా కష్టంగా గడిచాయి. పాపకి మాటలు, పనులు ఎలా నేర్పించాలో తెలియక మనసులో బాధ చాలా ఉండేది. ఆ సమయంలో నేను బాబానే నమ్ముకున్నాను. పాపకు మూడు సంవత్సరాల వయసొచ్చాక స్పెషల్ స్కూల్లో జాయిన్ చేసాము. బాబా దయవల్ల అక్కడి టీచర్ల ద్వారా మంచి సహాయం అందింది. పాపకు నాలుగు సంవత్సరాలు వచ్చేసరికి కొద్దిగా మాటలు, పనులు వచ్చాయి. అప్పుడు నాకు కాస్త ధైర్యం వచ్చింది.

బాబుకి ఏడు సంవత్సరాలు పూర్తై, పాపకి నాలుగు సంవత్సరాలప్పుడు అంతా బాగానే ఉండి జీవితం కొంచెం ప్రశాంతంగా నడుస్తుండగా ఒకరోజు నేను మాంసాహారం తిన్నాను. అదేరోజు మావారి ముఖంలో కుడివైపు సగభాగం మొద్దుబారిపోయింది. ఇంచుమించు స్ట్రోక్ లక్షణాలు కనిపించాయి. హాస్పిటల్‌‌కి వెళ్తే అన్నిరకాల టెస్టులు చేసి సమస్య ఏమీ లేదని అన్నారు. కానీ ఆ సమస్య అప్పుడప్పుడు వస్తుండేది. అలా ఒకటిన్నర, రెండు సంవత్సరాలు గడిచేసరికి ఆ సమస్య ఎందుకు వస్తుందో తెలియక హాస్పిటల్స్, టెస్టులు అంటూ తిరిగాము. కానీ కారణం తెలియలేదు. అప్పుడు నేను మావారి దగ్గర కూర్చొని సాయి సచ్చరిత్ర చదివాను. బాబా దయవల్ల "అది కేవలం ఆందోళనకు సంబంధించినదని, జీవన విధానంలో మార్పుతో తగ్గుతుంద"ని డాక్టరు చెప్పారు. డాక్టరు చెప్పిన మార్పులు చేయడంతో వారానికి పది నుండి పదిహేను సార్లు వచ్చే ఆ సమస్య నెలకోసారి రాసాగింది. 

తర్వాత మేము ఉంటున్న అపార్ట్మెంట్ గాలి, వెలుతురూ రాకుండా మరీ క్లోజుడ్‌గా ఉందని, అలా ఉండటం పిల్లలకి మంచిది కాదని వేరే చోట ఇల్లు అద్దెకు తీసుకోవాలని ఇల్లు కూడా చూసాం. అప్పుడు బాబా దగ్గర 'అద్దె ఇంటికి మారాలా, వద్దా' అని చీటీలు వేస్తే 'మారవద్ద'ని వచ్చింది. నేను బాబా ఆజ్ఞను శిరసావహించి మేము చూసిన ఇల్లు చాలా బాగున్నప్పటికీ ఆ ఇంటికి మారలేదు. సరిగ్గా ఒక నెలలో మూడు అంతస్తుల ఇల్లు మేము కొనుక్కున్నాం. అంతా బాబా లీల. ఆ ఇంటికి మారాక అక్కడి వాతావరణం వల్ల మా పాపకి మాటలు మరింత బాగా వచ్చాయి. కానీ పూర్తిగా భయం పోలేదు. పాపతో బయటికి వెళ్లాలన్నా, ఏదైనా ప్రదేశాలకు వెళ్ళాలన్నా బాగా కష్టమయ్యేది. తను బయట శబ్దాలకు సర్దుకోలేక ఏడ్చేది. అందువల్ల మేము బయటకు ఎక్కువగా వెళ్ళలేకపోయేవాళ్ళం. నేను పాప భవిష్యత్తు గురించి విపరీతంగా ఆలోచిస్తుండేదాన్ని. అలా రోజులు గడుస్తుండగా పాపకు ఎనిమిది సంవత్సరాల వయస్సున్నప్పుడు స్కూల్లో సోషల్ స్కిల్స్ ప్రోగ్రాం అని ఒకటి ప్రారంభించారు. అందులో భాగంలో టీచర్లు పిల్లల్ని ప్రతి శుక్రవారం బయటికి తీసుకువెళ్తుండేవారు. అది నిజంగా బాబా లీలే. ఆయన టీచర్స్ ద్వారా పాపకి తగిన సహాయం చేశారు. ఇప్పుడు పాపకు తొమ్మిది సంవత్సరాలు. ఇప్పుడు పాప భవిష్యత్తు గురించి నాకు ఏ భయం లేదు. ఎందుకంటే, అడుగడుగునా బాబా సహాయం చేస్తున్నారు. 

2023, అక్టోబర్ 1, ఆదివారంనాడు నేను మాంసాహారం తిన్నాను. నేను మాంసాహారం తిన్నప్పుడు మా పాప ప్రవర్తన చాలా పరుషంగా ఉంటుంది. మరుసటిరోజు అక్టోబర్ 2, ఉదయం స్కూలుకి వెళ్లేముందు తను నన్ను చాలా కొట్టింది. అప్పుడు నేను, "బాబా! టీచర్లను గాని, పిల్లల్ని గాని పాప కొట్టకుండా ఉండేలా చూడండి. నేను ఈరోజు నుండి పూర్తిగా మాంసాహారం తినడం మానేస్తాను. స్కూల్లో పాప మంచిగా ఉంటే, మీ అనుగ్రహాన్ని బ్లాగు ద్వారా తోటి సాయిభక్తులతో పంచుకుంటాను" అని బాబాకి మొక్కుకున్నాను. ఆరోజు టీచర్, 'ఈరోజు పాప మంచిగా ఉంద'ని మెసేజ్ పెట్టారు. ముఖ్య విషయమేమిటంటే, నేను మొదటసారి మాంసాహారం మానేస్తానని మొక్కుకున్నది కూడా అక్టోబర్ 2నే(2006). అయితే ఒక్కొక్కసారి నాకు మాంసాహారం తినాలనిపించడం వల్ల గత 17 సంవత్సరాలలో ఒకటి, రెండు సంవత్సరాలు మాంసాహారం తినకుండా ఉండటం, మళ్ళీ అప్పుడప్పుడు తినడం, 'తప్పు చేస్తున్నా'ని మనసుకు ఆందోళనగా ఉన్నప్పటికీ పూర్తిగా మానలేకపోతున్నాను. మా ఇంట్లో అందరూ మాంసాహారం తింటారు కాబట్టి, వాళ్ళకోసం వండటం, ఆపై నన్ను నేను నియంత్రించుకోలేక తినడం జరుగుతుంది. అలాంటప్పుడు కొన్నిసార్లు 'అయినా బాబా మాంసాహారం వండి భక్తులకు పెట్టేవారుగా' అని అనుకునేదాన్ని. అలా ఉండేవి నా ఆలోచనలు. ఏదేమైనా నేను మొక్కుకున్నది సరిగా పాటించాలని బాబా నాకు తెలియజేసారు. అదెలా అంటే ఒకసారి నేను మాంసాహారం తినే విషయంలో, "బాబా! నాకు దారి చూపండి" అని బాబాను ప్రార్థించి బ్లాగు తెరిచి కళ్ళు మూసుకొని కింద ఉన్న 'older posts' బటన్ పై క్లిక్ చేస్తూపోయాను. ఒక దగ్గర ఆగి బాబా ఇది మీ ఆజ్ఞ అనుకోని అక్కడ ఉన్న భక్తుల అనుభవాలు చదవడం మొదలుపెట్టాను. విచిత్రం ఏమిటంటే, శాఖాహారిగా మార్చిన బాబా అన్న టైటిల్‌‌తో అక్కడొక భక్తురాలి అనుభవం ఉంది. ఆమె తాము శాకాహారులం అయినప్పటికీ తన కొడుకు చదువుకొనే రోజుల్లో మాంసాహారిగా మారిపోయాడని, తాను ఎంత ప్రయత్నించినప్పటికీ తన కొడుకు మాంసాహారం తినడం మానలేదని, అప్పుడు తాను శిరిడీ వెళ్లి బాబాకి చెప్పుకుంటే ఆయన అనుగ్రహం వలన కొన్నినెలలకి ఆ అబ్బాయి మాంసాహారం తినడం మానేశాడని, డాక్టరు గుడ్డు తినమని చెప్పినా ఆ అబ్బాయి మనసుకి తప్పుగా అనిపించి పూర్తిగా శాకాహారిగా మారిపోయాడని పంచుకున్నారు. అది చదివాక బాబా నన్ను పూర్తి శాఖాహారిగా మార్చి కోరికలు లేకుండా తమ ఆలోచనలతో, తమ సేవలో ఆధ్యాత్మికంగా ఎదిగేలా ఆశీర్వదిస్తున్నారనిపించింది. ఆలోచిస్తే, ఇన్నాళ్ల నా జీవితంలో కష్టాల ద్వారా బాబా నాకు ఆధ్యాత్మిక ఎదగడానికి సహాయం చేస్తున్నారనిపిస్తుంది. ఇలా ఎందుకు చెబుతున్నానంటే మావారు, పాప ఖరీదైన బట్టలు, వస్తువులు పట్ల ఆసక్తి చూపరు. నాకు ఎప్పుడూ మావారి ఆరోగ్యం, పాప భవిష్యత్తు గురించే ఆలోచన. ఇవి ప్రాపంచికి వస్తువులు, విషయాలు మీద నాకు ఆసక్తి పోయేలా చేశాయి. ఇప్పుడు నేను కోరికలు అన్నిటిని తగ్గించుకొని భారమంతా బాబాదే అని బ్రతుకుతున్నాను. పూర్తిగా ధ్యానం చేస్తూ ఆధ్యాత్మికంగా ఎదగాలన్నదే నా లక్ష్యం. అందుకు తగ్గట్టే ఒకసారి నేను ప్రశ్న వేస్తే బాబా ప్రశ్నలు&సమాధానాలు ద్వారా 'నీవు నా నామం మాత్రమే జపించు. అందరి బాధ్యత నేను చూసుకుంటాను' అని వచ్చింది. అంటే బాబా నాకు ఈజన్మలో ఏదో నేర్పించడానికే ఈ పరిస్థితులు కల్పించి, తద్వారా నా పూర్వకర్మలను క్షయం చేసి నన్ను ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తున్నారు అనిపిస్తుంది. అందువల్ల నేను నా జీవితాన్ని ఆ తండ్రి సేవలో గడుపుతూ ఏది జరిగినా ఆ సాయినాథుడే నడిపిస్తున్నారని భావిస్తున్నాను. అంతా బాబా దయ. "అన్నిటికి ధన్యవాదాలు బాబా".

ఓం శ్రీసాయినాథాయ నమః!!!


15 comments:

  1. Omsaisri Sai Jai Jai Sai 🙏🙏🙏🙏 kapadu Tandri 🙏🙏🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  2. Baba sai ye nindhalu , avamanalu , chadilu , abhadhaalu lekunda na. Samasyani prema tho parishkarinchi dhari chupu sai thandi nine nammi jeevithanni gaduputhunnanu om sairam

    ReplyDelete
  3. ఓం సాయిరామ్

    ReplyDelete
  4. Om sai ram, 🙏🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  5. Baba, bless my children and fulfill their wishes in education.

    ReplyDelete
  6. Baba, please give PG medical MS Mch neurosurgery seat in AIIMS College for my daughter.

    ReplyDelete
  7. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  8. ఓం శ్రీ సాయి రామ్ ఓం శ్రీ సాయి రామ్

    ReplyDelete
  9. Baba pregnancy journey lo thodu vundu baba please baba healthy baby ni ivvu baba please baba BP normal ga vundali thandri please...

    ReplyDelete
  10. Om Sai Ram
    Sai always be with me

    ReplyDelete
  11. ఓం శ్రీ సాయి రామ్ యుఎస్ నుండి రాసిన సాయి లీలలు చాలా బాగున్నాయి.నాకు ఒక సంఘటన బాగా నచ్చింది.కల లో సాయి కనపడి గుమ్మంలో. కూర్చుని సట్కా పట్టుకొని లోపలికి ఫో అనడం నాకు చాలా నవ్వు వచ్చింది.న నన్ను ఆరోగ్య విషయంలో చాలా సహాయం చేసారు.ఆరోగ్యం బాగు అయినది.8నెల లు నరకం అనుభవించాను.సాయి బాబా తండ్రి నీకు శత సహస్ర నమస్కారములు తండ్రీ.నా‌ కుటుంబం అంతా చల్లగా దీవించు తండ్రీ

    ReplyDelete
    Replies
    1. Avunu andi sai ni nammukunte manaki edi manchido ade chestaru . Konni saarlu manaki kastaalu vachina aa sai naadhudu manam anubhavinchavalasina karma phalaaanni taggistaru. Manaku entho pedda problem ravalani raasi petti unte aa tandri daanini taggistaru.
      Om sairam.

      Delete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo