బాబా వల్ల ప్రాపంచిక విషయాలలో నానాకు చేకూరిన ప్రయోజనాలు కేవలం అతనికి, అతని కుటుంబానికి మాత్రమే కాకుండా అతనితో అనుబంధం ఉన్న వ్యక్తులకు కూడా అందాయి. బాబా ఎవరైతే అడువులలో, కొండగుట్టలపై నానా ఆకలిదప్పికలను తీర్చి ఆదుకున్నారో ఆయన తన శిష్యుడు ప్రాణాపాయంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా వదిలిపెట్టరు. 1912లో ఒకరోజు నానాసాహెబ్ చందోర్కర్, లేలేశాస్త్రి పూణే నుంచి టాంగాలో బయలుదేరినప్పుడు తటస్థించింది. వాళ్ళు పూణే నుండి కొన్ని మైళ్ళ దూరం ప్రయాణం చేసాక అకస్మాత్తుగా గుర్రం వెనుక కాళ్లపై నిలబడటంతో టాంగా బోల్తా పడింది. సాధారణంగా అటువంటి ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళ ప్రాణాలకు ముప్పు వాటిల్లడంగాని, తీవ్రమైన గాయాల పాలవడంగాని జరుగుతుంది. పైగా టాంగాలో ఉన్న ఇద్దరూ స్థూలకాయులు, వయసుపైబడిన వాళ్లు. అంటే అదెంతో ప్రమాదకరమైన పరిస్థితి. అయితే నానా ఎక్కడికి వెళ్ళినా అతనిని గమనిస్తూ ఉండే బాబా అక్కడ ఆ ప్రమాదం జరిగిన క్షణంలోనే తమ చేతులు శంఖు ఆకృతిలో నోటి దగ్గర పెట్టి 'బం బం'(మరణ సంకేతం) అని శబ్దం వచ్చేలా చేసి, "అయ్యో! నానా చావనున్నాడు. కానీ, నేను అతనిని చావనిస్తానా?" అని అన్నారు. మరుక్షణంలో అక్కడ కిందపడ్డ నానా, లేలేశాస్త్రిలు వాళ్ళంతట వాళ్లే లేచి తమకు ఎలాంటి గాయాలు కాలేదని గుర్తించారు. ఎనిమిది రోజుల తర్వాత వాళ్ళు ఇరువురూ శిరిడీ చేరుకొని తాము ప్రమాదంలో పడ్డ సమయంలోనే బాబా పైమాటలని తమ ప్రాణాలు కాపాడారని తెలుసుకున్నారు. నానా ఆనందంతో ఉబ్బితబ్బిబై కృతజ్ఞతాపూర్వకముగా బాబాకు నమస్కారాలు అర్పించాడు. బాబా తమ భక్తులు ఎక్కడ ఉన్న వారిని ఎల్లవేళలా ఎంతో శ్రద్ధగా కనిపెట్టుకొని ఉంటారు. వారికి స్థలం, కాలం వంటి పరిమితులు లేవు. ‘పూలమాలలోని దారం పూల పరిమళాన్ని అరువు తెచ్చుకుంటుంద’ని ఒక సామెత. అదేవిధంగా బాబాకి దృఢమైన భక్తుడుకాని లేలేశాస్త్రి నానా చందోర్కర్‌తో సహవాసం వల్ల రక్షణను పొందాడు. బాబా ఈ లీల ద్వారా "భక్తుడు పడి(పతనమై)పోతుంటే నేను నా చేతులు చాచి, ఒకేసారి నా నాలుగు చేతులతో అతనికి మద్దతునిస్తాను. నేను అతన్ని పడిపోనివ్వను(పతనం కానివ్వను)" అన్న తమ మాటలు సత్యమని నిరూపించారు.
మొదట ఎవరి దగ్గరా ఎట్టి దక్షిణాలూ స్వీకరించని బాబా, ఒకప్పుడు భక్తులు సమర్పించిన దానిలో అతిస్వల్పంగా మాత్రమే తీసుకోనారంభించారు. భక్తులసంఖ్య పెరిగేకొద్దీ వారినుండి ఆయన దక్షిణ అడిగి తీసుకుంటుండేవారు. నానాను గూడ తరచుగా దక్షిణ అడిగి తీసుకొనేవారు. అదీకాక బాబా కొంతమంది వ్యక్తులు మరియు మార్వాడీల వద్ద నుంచి డబ్బు తెచ్చి దానం చేయడానికి లేదా తమ భక్తులు అడిగినవి ఇవ్వడానికి ఖర్చు పెట్టేవారు. తర్వాత నానాసాహెబ్ శిరిడీ వచ్చినప్పుడు ఆ మొత్తాన్ని ఆయా వ్యక్తులకు ఇవ్వమని అతనితో చెప్పేవారు. అతను సణుగుకోకుండా, ఒక్క మాటైనా మాటాడకుండా తాను మునుపు వచ్చి, వెళ్లినప్పటి నుండి బాబా ఎవరెవరి దగ్గర ఎంత మొత్తం తీసుకున్నారో లెక్కగట్టి, ఎవరి డబ్బులు వాళ్ళకి తిరిగిచ్చి రశీదులు తీసుకొని, వాటిని బాబా పాదాల చెంత సమర్పించేవాడు. ఆ సందర్భంలో బాబా అతనికి పలు రకాల ఉపదేశాలు చేసి అనేక అనుభవాలను ప్రసాదించేవారు. అతను శిరిడీ సందర్శించినప్పుడల్లా తనతో పాటు పెద్ద మొత్తంలో(300 లేదా 400) డబ్బులు తెచ్చి బాబాకోసం, శిరిడీకోసం ఎంతో మక్కువతో, అపరిమితమైన ప్రేమతో ఖర్చు పెట్టేవాడు. ఆ విధంగా అతను కనీసం పది వేల రూపాయల దాకా ఖర్చు పెట్టాడు. అలా తరచూ బాబాకు డబ్బు ఇవ్వడం సహజంగానే సంపదపట్ల అతనికున్న అనుబంధాన్ని తగ్గిస్తుంది. కానీ నానా, ‘బాబాకు కావాల్సినవన్నీ సమకూరుస్తున్నానని, సహాయం చేస్తున్నానని, ఆయన ధనం కోసం తనపై ఆధారపడుతున్నారన్న’ భ్రమలో పడ్డాడు. అతనికున్న ఆ భ్రమను బాబా తీసేయాలి. అందుకోసం ఆయన M.B.రేగే అనే భక్తుని ఒక మిషగా ఉపయోగించుకున్నారు.
1912లో రేగే జేబులో వంద రూపాయలతో శిరిడీ వెళ్లి బాబాను దర్శించుకున్నాడు. అప్పుడు బాబా అతనిని రూ.40/- దక్షిణ అడిగారు. అతను వెంటనే సమర్పించాడు. కొంతసేపైన తరువాత మరలా రూ.40/- దక్షిణ అడిగారు బాబా. అతను ఆనందంగా సమర్పించాడు. చివరికి బాబా అతని వద్ద మిగిలిన రూ.20/-లను కూడా దక్షిణగా అడిగారు. అతను ఎటువంటి సంకోచం లేకుండా దానిని కూడా బాబాకు సమర్పించుకున్నాడు. తన వద్ద ఒక్క పైసా కూడా లేకపోయినప్పటికీ, డబ్బంతా బాబాకు దక్షిణగా సమర్పించినందుకు అతను చాలా సంతోషించాడు. కాసేపటికి బాబా మరలా అతనిని పిలిచి దక్షిణ అడిగారు. "నా దగ్గర ఇచ్చేందుకు ఏమీలేద"ని చెప్పాడు రేగే. "నీ వద్ద డబ్బు లేకుంటే ఎవరినైనా అడిగి తెచ్చివ్వు" అని అన్నారు బాబా. అందుకతను అంగీకరించి, "ఎవరి వద్దకు వెళ్ళమంటారో చెప్పండి బాబా. సంతోషంగా వెళ్ళి, వారిని అడుగుతాను" అని అన్నాడు. "షామా వద్దకు వెళ్ళమ"ని చెప్పారు బాబా. దాంతో అతను శ్యామా వద్దకు వెళ్ళి మసీదులో జరిగిన విషయమంతా చెప్పి డబ్బు అడిగాడు. పేదవాడైన షామా అతనితో, “నీవు బాబాను సరిగా అర్థం చేసుకోలేదు. బాబాకు డబ్బు గడ్డిపోచతో సమానం. నీ మనస్సు, బుద్ధి, సమయం, ఆత్మలను బాబాకు సమర్పించాలని వారి ఉద్దేశ్యం" అని తన నమస్కారాలర్పించాడు. రేగే మసీదుకు తిరిగి వెళ్లి శ్యామా చెప్పినదంతా బాబాకు వివరించాడు. బాబా చిరునవ్వు నవ్వి, “దీక్షిత్ దగ్గరకు వెళ్ళి అతన్ని అడుగు” అని అన్నారు. అతను దీక్షిత్ వద్దకు వెళ్లి జరిగిన విషయాన్ని, బాబా ఆదేశాన్ని తెలిపాడు. ఆ సమయంలో దీక్షిత్ వద్ద డబ్బు లేదు. అతను, "బాబా మిమ్మల్ని నా దగ్గరకు ఎందుకు పంపించారోనన్నది పరిస్థితుల దృష్ట్యా అర్థం చేసుకుని దాన్ని మీరొక ఉపదేశంగా తీసుకోవాలి" అని అంటూ, "డబ్బు లేకపోవడం, డబ్బు లేదా మరేదైనా యాచించవలసిరావడం అవమానంగా తలచరాదు. యాచించాల్సివస్తే తనకు తాను గొప్పవాడినన్న భావన రాకూడదు" అని చెప్పాడు. రేగే బాబా వద్దకు వెళ్ళి దీక్షిత్ చెప్పినదంతా వివరంగా చెప్పాడు. బాబా చిరునవ్వు నవ్వి, "నానా వద్దకు వెళ్లి అప్పుగా అడిగి డబ్బులు తీసుకురమ్మ"ని చెప్పారు. వెంటనే నానాసాహెబ్ చందోర్కర్ కోసం ఖండోబా ఆలయానికి వెళ్ళాడు రేగే. అక్కడ ఉపాసనీశాస్త్రితో కలిసి ఆధ్యాత్మిక గ్రంథాల పారాయణ చేస్తున్నాడు నానాసాహెబ్. రేగే మసీదులో జరిగినదంతా నానాతో చెప్పి, బాబా ఆదేశానుసారం డబ్బుకోసం వచ్చినట్లు చెప్పాడు. అంతా విన్న నానాసాహెబ్ లౌక్యంగా, “బాబా దక్షిణ అడిగినప్పుడు మన దగ్గర డబ్బు లేకుంటే ఎంత బాధగా ఉంటుందో నేను ఊహించగలను. అందుకే నేను శిరిడీ వచ్చేటప్పుడు సగం డబ్బు కోపర్గాఁవ్‌లో దాచి ఉంచుతాను. ఇప్పుడు కూడా అలాగే చేశాను. ఇంటినుండి రెండువందల రూపాయలు తీసుకొచ్చి, వంద రూపాయలు కోపర్గాఁవ్‌లో ఉంచి వంద రూపాయలతో శిరిడీ వచ్చాను. బాబా అడిగినప్పుడల్లా దక్షిణ సమర్పిస్తూ, చేతిలో డబ్బు అయిపోగానే కోపర్గాఁవ్ నుండి మిగిలిన డబ్బు తెప్పించుకుంటాను. నువ్వు కూడా ఇలాగే చేస్తుండు" అని చెప్పాడు. రేగే మశీదుకు వెళ్ళి నానా చెప్పినదంతా బాబాతో చెప్పి అక్కడే కూర్చున్నాడు. నానాకు కబురు పంపించారు బాబా. అతను రాగానే రూ.40/- దక్షిణ అడిగారు. అతను సంతోషంగా బాబా అడిగిన దక్షిణ సమర్పించి వెళ్ళిపోయాడు. మరలా బాబా అతనికి కబురు పంపించి మరో రూ.40/- దక్షిణ అడిగి తీసుకున్నారు. కొద్దిసేపట్లోనే మళ్ళీ అతనిని మసీదుకు పిలిపించి అతని వద్ద మిగిలిన మొత్తాన్ని కూడా దక్షిణగా అడిగి తీసుకున్నారు. నానాసాహెబ్ వెంటనే కోపర్గాఁవ్‌లో దాచిపెట్టిన డబ్బు తీసుకురమ్మని ఒక మనిషిని పంపించాడు. ఆ డబ్బు వచ్చేలోగానే నానాను మళ్ళీ దక్షిణ అడిగారు బాబా. ఇక తన వద్ద డబ్బు లేదని చెప్పవలసివచ్చినందుకు నానా చిన్నబుచ్చుకున్నాడు. అతని మొహానికి పెద్ద దెబ్బ తగిలింది. ఈ సంఘటన ద్వారా, ‘బాబా అవసరాలన్నీ తీర్చగలమని, వారడిగినవన్నీ ఇవ్వగలమని’ ఎవరైనా అనుకుంటే అది కేవలం భ్రమేనని నానాసాహెబ్‌కి, రేగేకి, ఇంకా అక్కడున్న అందరికీ తెలియజేశారు బాబా. అంతేకాదు, దక్షిణ అడగటాన్ని ఒక్కో భక్తుడు ఒక్కో విధంగా ఎలా అర్థం చేసుకుంటాడో కూడా బాబా ఆ విధంగా తెలియజేశారు.
ఒకసారి బాంద్రా పట్టణంలో ఉండగా ఒక భక్తునికి వేరే ఊరిలో ఉన్న తన కుమార్తె గ్రంథి జ్వరంతో బాధపడుతుందని తెలిసింది. అకస్మాత్తుగా ఆ వార్త చేరేసరికి అతను తన వద్ద ఊదీ లేనందున ఏం చేయాలని చింతించసాగాడు. చివరికి ఒక వ్యక్తి ద్వారా నానాకు, "మీరు బాబాను ప్రార్థించి నా బిడ్డ దుఃఖాన్ని దూరం చేయండి. ఊదీ ప్రసాదాన్ని పంపండి" అని వేడుకుంటూ కబురు పంపండి. ఆ కబురు తీసుకుని వెళ్లిన వ్యక్తికి నానా దారిలోనే ఠాణా స్టేషను వద్ద కలిసాడు. అప్పుడు నానా తన భార్యతో కళ్యాణ్ వెళుతున్నాడు. ఆ సమయంలో అతని వద్ద ఊదీ లేకపోవడంతో నేలపై మట్టిని తీసుకొని అక్కడే నిలబడి, సాయి సమర్థుని ప్రార్థించి, వెనుకకు తిరిగి తన భార్య నొసటన ఒక చిటికెడు రాశాడు. ఇక్కడ ఆ భక్తుడు తన కుమార్తె ఉన్న ఊరికి వెళ్లగా ఆమె మూడురోజులుగా అత్యంత తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ బాగా నీరసించిపోయిందని, ఆ ముందురోజే కొంచెం నయమైందని తెలిసింది. చూడగా నానా బాబాను ప్రార్థించి మట్టిని ఊదీగా భావించి తన భార్య నొసటన అద్దినప్పటినుండే తన కుమార్తెకు నయమైందని తెలిసి అతను చాలా ఆనందించి బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాడు.
1913-14లో నానాసాహెబ్ చందోర్కర్ అస్వస్థతకు గురై దీర్ఘకాలం సెలవు పెట్టి ఒక సంవత్సరం పాటు తన కుటుంబంతో శిరిడీలో గడిపాడు.
సాధారణంగా బాబా వద్దకు వచ్చే వారిలో కొద్దిమంది మాత్రమే కోరికలు లేనివారు. మిగిలిన వాళ్ళు కోరికలను త్యాజించలేకపోయారు. ఆ విషయం గురించి బాబా తమాషాగా నానాతో, "నానా! వీళ్ళలో ఒక్క హంస కూడా లేదు? అందరూ కాకులే!" అని అన్నారు. బహుశా తమ భక్తులు కోరికలకు ఎంతవరకు లోబడి ఉన్నారో పరీక్షించడానికే బాబా దక్షిణ అడగనారంభించారు. ఆయన డబ్బు లేని భక్తులను కూడా దక్షిణ అడిగి వాళ్ళను ఆ మొత్తాన్ని భాగ్‌చంద్ మార్వాడి దగ్గర అప్పుగా తీసుకొని రమ్మనేవారు.
ఒకసారి ఒక వ్యక్తి బాబాను దర్శించి, "బ్రహ్మము యొక్క స్వభావం ఏమిటి?" అని అడిగాడు. అందుకు బాబా నేరుగా సమాధానమివ్వకుండా “భాగ్‌చంద్ మర్వాడీని అడిగి 100 రూపాయలు దక్షిణగా సమర్పించమ”ని అన్నారు. ఆ వ్యక్తి భాగ్‌చంద్ మార్వాడీ వద్దకి వెళితే, అతను డబ్బు ఇవ్వడానికి బదులు తన నమస్కారాలే బాబాకు సమర్పించమని చెప్పాడు. అదే విషయం ఆ వ్యక్తి బాబాకు చెప్పగా బాబా ఆ వ్యక్తిని దక్షిణ తీసుకురావటానికి వేరొక స్థలానికి పంపించారు. వాళ్ళు కూడా అలానే బదులు చెప్పారు. అందువలన అక్కడనుండి కూడా ఆ వ్యక్తి ఖాళీ చేతులతోనే తిరిగి వచ్చాడు. చివరిగా బాబా నానాసాహెబ్ చందోర్కర్‌ను భాగ్‌చంద్ మార్వాడీ వద్ద నుండి 100 రూపాయలు తెమ్మని చెప్పారు. నానాసాహెబ్ స్వయంగా వెళ్ళకుండా భాగ్‌చంద్ మార్వాడీకి ఒక చీటీ వ్రాసి పంపాడు. అది అందిన వెంటనే 100 రూపాయలు పంపించాడు భాగ్‌చంద్ మార్వాడీ. అప్పుడు బాబా, "ఈ ప్రపంచంలో అంతా ఇలానే ఉంటుంది" అన్నారు. జరిగినదంతా గమనిస్తున్న ఆ వ్యక్తికి అందులోని అంతరార్థం ఏమిటో తెలియక దాసగణు మహరాజ్‌ని వివరం అడిగాడు. అప్పుడు దాసగణు, "చూసావా? ఇతరులు డబ్బు అడిగినప్పుడు వారు దాన్ని పొందలేకపోయారు. కానీ నానాసాహెబ్ స్వయంగా వెళ్లకుండా కేవలం చీటీ వ్రాసి పంపి డబ్బు పొందగలిగాడు. అలా పొందగలిగే శక్తి, సామర్థ్యం, అధికారం అతనికి ఉన్నాయి. నువ్వు కేవలం ఉత్సుకతతో బ్రహ్మం గురించి అడిగావుగాని, నీకు నిజంగా దానిపట్ల ఆసక్తి లేదు. అలాంటి పనికిమాలిన విచారణను సంతృప్తి పరుచుకోవడానికే అయితే నువ్వు వారి నుండి సమాధానాన్ని ఎలా ఆశించగలవు?" అని చెప్పాడు.
బాబా అనేక బోధలు చేసినప్పటికీ భక్తులు ప్రాపంచిక విషయాల వైపే ఆకర్షితులతుండేవారు. అది చూసి బాబా నిరాశ చెందారు. ఒకసారి ఆయన కన్నీళ్లు పెట్టుకొని నానాతో, "నానా! నా భక్తులకు చాలా ముఖ్యమైనది ఇవ్వడానికి నేను ఇక్కడ ఉన్నాను. కానీ నేను దేనినైతే విస్తారంగా ఇవ్వదలచానో దానిని తీసుకునేవారే లేరు. నేను ఇవ్వలేనటువంటిదే వారు కోరుతున్నారు!".
ఇంకొక సందర్భంలో బాబా కాకాసాహెబ్, నానాసాహెబ్‌లతో, "నేను ఇప్పుడు వెళ్లి, నాకు ఎనిమిదేళ్ల వయసున్నప్పుడు తిరిగి వస్తాను" అని అన్నారు. "గురువు అలాంటి రహస్య సంకేతాలను అర్హత గల శిష్యులకు మాత్రమే చెప్తారు" అని బాలాసాహెబ్ దేవ్ అన్నారు.
1916వ సంవత్సరంలో బాబా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆ సమయంలో నానాసాహెబ్ బాబా చెంతనే ఉన్నాడు. అతను బాబా ఆరోగ్యం గురించి, ఆయన ఆ అనార్యోగం నుంచి క్షేమంగా బయటపడే అవకాశాలు గురించి ఆందోళన చెంది ప్రముఖ భక్తులందరికీ సమాచారం పంపి, వాళ్ళను శిరిడీకి రప్పించాడు. వాళ్ళు బాబా ఆరోగ్యం మెరుగుపడాలని జప అనుష్ఠానాలు, వేదమంత్ర పఠనాలు, లఘు రుద్రం, చండీ హవనం వంటి వివిధ మతపరమైన కార్యక్రమాలు మొదలుపెట్టారు. అంత చేస్తున్నప్పటికీ ఒకరోజు బాబా పరిస్థితి విషమించింది. దాంతో బాబా తమని విడిచి వెళ్లిపోతారని అందరూ భావించారు. కాకాసాహెబ్ దీక్షిత్, మాధవరావు దేశ్‌పాండే, బాలాసాహెబ్ బాటే, బాపుసాహెబ్ జోగు, తాత్యాపాటిల్ వంటి భక్తులు దీక్షిత్ వాడాలో సమావేశమయ్యారు. వాళ్లలో కొందరు ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించడం మొదలుపెట్టారు. వాళ్లలో కొంతమంది బాబా భౌతికదేహాన్ని ఎక్కడ ఉంచాలన్న విషయం గురించి బాబా అభిప్రాయం తప్పనిసరిగా తీసుకోవాలని, బాబా స్పష్టమైన దిశానిర్దేశం లేకపోతే హిందూ, ముస్లింల మధ్య పెద్ద ఘర్షణ జరుగుతుందని వాళ్ళు అభిప్రాయపడ్డారు. కానీ అలాంటి విషయం గురించి బాబాని ఎవరు అడుగుతారు? ఆఖరికి ఆ కష్టమైన పని నానాసాహెబ్ మీద పడింది. కానీ అతను కూడా అలాంటి సున్నితం, ఇబ్బందికరం అయినా విషయం గురించి బాబాని అడగడానికి ఇష్టపడలేదు. సరిగ్గా అప్పుడే ఒక ఆశ్చర్యకర సంఘటన జరిగింది. వాళ్లంతా సమావేశమైన దీక్షిత్ వాడాకి ఒక అపరిచిత వ్యక్తి వచ్చి నానాసాహెబ్‌ని, "మీరు నానాసాహెబా? బాబా మీకు ఒక సందేశం పంపారు" అని ఇలా చెప్పాడు: "నా మరణం గురించి ఇంత త్వరగా చర్చించుకోకండి. నేను ఇప్పుడే మరణించట్లేదు. కానీ మీరు ప్రారంభించిన మతపరమైన అనుష్ఠానాలను కొనసాగించండి. చింతించకండి, నేను ఎక్కడికి వెళ్తాను?" అని. అది విని భక్తులందరూ తమ పరిమిత జ్ఞానానికి, స్వల్ప మేధస్సుకి జాలిపడ్డారు. వాళ్ళ కళ్ళు ప్రేమ, ఆప్యాయతలతో కన్నీటి పర్యంతమయ్యాయి.
నానాసాహెబ్ ద్వారా బాలాసాహెబ్ దేవ్ సందేహనివృత్తి
బాలాసాహెబ్ దేవ్ బాబాకి అనన్య భక్తుడు. సాయితో తనకు గల అనుభవాలను వర్ణించేటప్పుడు అతని శరీరం రోమాంచితమయ్యేది. అలాగే నానాసాహెబ్ గురించి మాట్లాడేటప్పుడు అతను ఆనందంతో ఉప్పొంగిపోయేవాడు. ఎందుకంటే, అతను బాబా వైపు ఆకర్షితుడవ్వడంలో నానాసాహెబ్ కీలక పాత్ర పోషించాడు. అందుచేతనే అతనికి నానాసాహెబ్ అంటే చాలా గౌరవం. అతను నానాసాహెబ్ గురించిన తన ఆలోచనలను, అనుభవాలను చాలా విస్తారంగా వ్రాశాడు. దేవ్‌కు తొలిసారి బాబాను దర్శించే అవకాశం రావడానికి పూర్వం అతనికి ఒక అందమైన కల వచ్చింది. ఆ కలలో అతను ఇద్దరు వ్యక్తులను చూసాడు. అతను శిరిడీ వచ్చిన తర్వాత తనకి కలలో కనిపించిన ఇద్దరు వ్యక్తులు మరెవరోకాదు బాబా, నానాసాహెబ్‌లని గ్రహించాడు. ఆ క్షణం నుండి అతను నానాపట్ల ప్రేమ, ఆప్యాయత, గౌరవాలను, స్నేహబంధాన్ని పెంచుకొని తరచూ నానాను కలవడానికి కళ్యాణ్ వెళ్తుండేవాడు. వేదాంతం మరియు దైనందిన జీవితాన్ని అనుసరించి కలలు భ్రాంతిపూరితమైనవని దేవ్‌కి తెలుసు. కానీ అతనికొచ్చే చాలా కలలు అలా లేవు. అవి తరువాత నిజాలయ్యాయి. అందుచేత తనకొచ్చే కలల విషయంలో దేవ్‌కి సందిగ్ధత ఉండేది. ఆ విషయం గురించి ఒకసారి దేవ్ కళ్యాణ్‌లోని నానాసాహెబ్‌ను అతని స్వగృహమందు కలిసినప్పుడు అడిగాడు. దానికి నానా, "మామూలుగా నాకు అలాంటి కలలు రావు. నాకు వచ్చే కలలను నిద్రలేచాక నేను గుర్తు తెచ్చుకోలేను, ఒకవేళ గుర్తుతెచ్చుకున్నా అవి వాస్తవమవ్వడం గురించి నాకు ఎలాంటి అనుభవాలు లేవు. కానీ నీకు జరిగిన అటువంటి అనుభవాల గురించి మనం భోజనం చేసిన తరువాత విచారిద్దాం" అని అన్నాడు. తర్వాత వాళ్లిద్దరూ భోజనం చేసి, అనంతరం మొదటి అంతస్తులో ఉన్న పడకగదికి వెళ్ళారు. ఆ గదిలో ఒక టేబుల్ మీద పెద్ద బాబా ఫోటో ఉంది. దాని ముందు దీపం వెలుగుతుంది. "బాబా మీ ప్రశ్నకు ఎలా సమాధానమిస్తారో చూద్దాం. అందాక మనం నిద్రపోదాం" అని అన్నాడు నానాసాహెబ్. తరువాత ఇద్దరూ తమ తమ పడకలపై నిద్రపోయారు. తెల్లవారుజామున 4 - 4:30 ప్రాంతంలో నానాసాహెబ్ మేల్కొని, "బాలాసాహెబ్! నీ ప్రశ్నకు సమాధానం దొరికింది. బాబా నాకు స్వప్న దర్శనమిచ్చి, 'ఇందులో అంత కష్టం ఏముంది? అడవిలో రకరకాల చెట్లు ఉంటాయి. కానీ వాటిలో ఎక్కువ భాగం కేవలం అడవి చెట్లే - వాటికి సువాసన గల పువ్వులు లేదా పండ్లు ఉండవు. అయితే, ఆ అడవి చెట్ల మధ్య కూడా కొన్ని మినహాయింపులు ఉంటాయి. అవి సువాసన వెదజల్లె పువ్వులు, పండ్లు ఇస్తాయి. అదేవిధంగా చాలా కలలు కేవలం కలలు మాత్రమే. కొన్ని మాత్రమే వాస్తవాలవుతాయి. కానీ అవి మినహాయింపుల'ని చెప్పారు" అని అన్నాడు.
నానాసాహెబ్ తన జీవితాంతం బాబా సేవ చేసి 1921, ఆగస్టు 21న శ్రావణమాసంలో కళ్యాణ్‌లోని తమ స్వగృహమందు శ్రీసాయి చరణాలలో ఐక్యమయ్యాడు. అతని చిన్న కుమారుడు బాపూరావు 1936లో బి.వి.నరసింహస్వామితో ఇలా చెప్పాడు: 1913-14లో మా నాన్న అనారోగ్య కారణంగా చాలాకాలం సెలవుపెట్టారు. నాన్న ఆ సెలవులు శిరిడీలో గడిపారు. మా అమ్మ కూడా నాన్నతో పాటు ఉంది. ఒకసారి వాళ్ళిద్దరు బాబా ముందు కూర్చొని ఉన్నారు. నేను బాబాను పూజిస్తున్నాను. అప్పుడు బాబా "నేనిప్పుడు వెళ్ళిపోయి బాపూ బిడ్డగా జన్మిస్తాను. అప్పుడు నానా మెడ ఇలా వణుకుతూ ఉంటుంది! (మీ అతాఁ జాఈన్ బాపూచే పోరీఁ జన్మ ఘేఈన్! త్యావేళీ నానాచీ మాన్ (ఘట్) ఆషి ఆషి హలత్ అసేల్)" అని చెప్పి, ముసలివాళ్ళ తల ఎలా వణుకుతూ ఉంటుందో అలా తమ చేతిని ఊపి చూపించారు. ఇది విని మా నాన్న, నాకు కొడుకు పుట్టేవరకు తాను జీవించి ఉంటానని తలచాడు. కానీ దురదృష్టవశాత్తు మా నాన్న 1921లోనే మరణించాడు. నాన్న మరణించడానికి ముందు తీవ్ర అనారోగ్యంతో ఉన్నప్పుడు, బాబా అంతకుముందు చెప్పిన విషయం నాకు గుర్తొచ్చి మా నాన్న కోలుకుంటారని అనుకున్నాను. ఎందుకంటే, నాకు అప్పటికింకా వివాహం కాలేదు. కొడుకు పుట్టలేదు. కానీ విధి నిర్ణయం మరోలా ఉంది. మా నాన్న మరణించారు. తర్వాత 1922లో నాకు వివాహమయ్యింది. మా నాన్న తల ఎన్నడూ వణకలేదు.(కానీ, నానా చేయి మాత్రం వణుకుతుండేది - బి.వి.నరసింహస్వామి.)
Ok sai ram
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my father 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, take care of my son 🙏🙏🙏🙏
ReplyDeleteOmsaisri Sai Jai Jai Sai 🙏🙏🙏🙏 kapadu Tandri 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ReplyDelete