సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1688వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. పిలిచిన వెంటనే పలికే దైవం సాయి
2. నోరు తెరిచి అడగకపోయినా ఆదుకున్న బాబా

పిలిచిన వెంటనే పలికే దైవం సాయి

నేను ఒక సాయిభక్తురాలిని. 2022 ఏప్రిల్‌లో నేను యూరిన్ ఇన్ఫెక్షన్‌తో చాలా ఇబ్బందిపడ్డాను. ఎన్ని హాస్పిటల్‌కి వెళ్లినా, ఎన్ని మందులు వాడినా ఇన్ఫెక్షన్ తగ్గలేదు. అటువంటి సమయంలో ఈ బ్లాగు నా కంటపడింది. బ్లాగులోని ఒక భక్తుని అనుభవం చదివిన వెంటనే నేను అందులో చెప్పినట్లు ఊదీ నీళ్లలో కలుపుకుని తాగి, "బాబా! నాకు యూరిన్ ఇన్ఫెక్షన్ బాధ నుండి ఉపశమనం కలిగించండి" అని బాబాను ప్రార్థించాను. నిజంగా బాబా అద్భుతం చేసారు. అప్పటినుండి ఇప్పటివరకు నేను మళ్ళీ ఇన్ఫెక్షన్‌తో అస్సలు బాధపడలేదు. "చాలా ధన్యవాదాలు బాబా".

ఒకరోజు రాత్రి ఒంటిగంటప్పుడు మా పాపకి బాగా కడుపులో నొప్పి వచ్చింది. అప్పుడు మావారు లేరు. నాకు ఏం చేయాలో అర్ధం కాలేదు. వెంటనే బాబాని చూస్తూ, "బాబా! పాపకి కడుపునొప్పి తగ్గించండి. నాకు మీరే దిక్కు. ప్లీజ్ బాబా" అని వేడుకొని ఊదీ నీళ్లలో కలిపి పాప చేత తాగించాను. బాబా దయవల్ల ఒక్క 15 నిమషాల్లో కడుపునొప్పి తగ్గి పాప హాయిగా నిద్రపోయింది.

ఒకసారి ఒక సంస్థ నుండి డబ్బులు రావాల్సి ఉండగా అందరికీ వచ్చినా నాకు మాత్రం రాలేదు. నేను ఆ డబ్బుల కోసం రెండు నెలలు ఎదురుచూసాను. అయినా రాలేదు. నాకు డబ్బు అత్యంత అవసరమైనప్పటికీ ఏం చేయాలో అర్ధంకాని పరిస్థితి. రోజూ బాబాని వేడుకుంటూ ఉండేదాన్ని. అయినా డబ్బులు రాలేదు. అలాంటి సమయంలో బ్లాగులో ఒకరు, 'సప్తాహ పారాయణ చేసాము. అవ్వాల్సిన పని అయింది' అని పంచుకున్నారు. బాబా నన్ను అలా చేయమని చెప్తున్నారని నా మనసుకి అనిపించి నేను కూడా సప్తాహ పారాయణ మొదలుపెట్టాను. చివరిరోజు పారాయణ 5.45కి పూర్తి అయింది. బాబా చేసిన అద్భుతం చూడండి. 6 గంటలకి నా అకౌంటులో డబ్బులు పడ్డాయి. దాంతో నా ఆనందానికి అవధులు లేవు. "థాంక్యూ సో మచ్ బాబా. లవ్ యు బాబా. మా అందరి అవసరాలు మీకు తెలుసు. అందరినీ ఇలానే కాపాడండి బాబా".


నోరు తెరిచి అడగకపోయినా ఆదుకున్న బాబా

నేను ఒక సాయిభక్తురాలిని. మాది హైదరాబాద్. నేను, నా స్నేహితురాలు మాకు కుదురినప్పుడల్లా గురువారంనాడు సాయిబాబా గుడిలో సాయంకాలం హారతికి వెళుతుండేవాళ్ళం. అలా ఒక చలికాలంలో సంధ్య హారతికి వెళ్ళినపుడు హారతి ముగిసేసరికి బాగా ఆలస్యం అయింది. చలికాలం కావడం వలన 6:30కే బాగా చీకటి పడిపోయింది. ఇంటికి తిరిగి ఆటోలో వెళ్లడానికి మా దగ్గర డబ్బులు లేక నడిచే వెళ్దామని బయలుదేరాము. మా ఇల్లు నడక దూరంలోనే ఉంటుంది. కానీ ఆ దారంతా నిర్మానుష్యంగా ఉంది. మా వెనక కొంచెం దూరంలో పది, పదిహేను మంది అబ్బాయిలు నడిచి వస్తున్నారు. వాళ్ళు చూడటానికి రౌడీల్లా ఉన్నందువల్ల మా ఇద్దరికీ చాలా భయమేసింది. వాళ్ళు మమ్మల్ని సమీపిస్తూండేసరికి మా గుండెల్లో రాయి పడినట్లు అయింది. కళ్ళ నుండి నీళ్లు రావడం ఒక్కటే తక్కువ. వాళ్ళు కొంచెం వెకిలిగా మాట్లాడుతూ మాకు అతి దగ్గరగా వస్తుంటే, భయంతో, 'సాయిబాబా నువ్వే దిక్కు తండ్రీ' అని మనసులో అనుకున్నానో, లేదో గుర్తులేదుగాని మేము కాస్త వేగంగా అడుగులు వేయసాగాము. అంతలో అనుకోకుండా మేము ఏమాత్రం ఊహించిన సంఘటన జరింగింది. నాకు తెలిసిన ఒక ఆటో అన్నయ్య ఆటో నడుపుకుంటూ మా దగ్గరకి వచ్చి ఆగి, "ఇంటికేగా వెళ్తున్నారు. రండి, నేను దింపుతాను" అని మమ్మిల్ని ఆటో ఎక్కించుకొని మా ఇంటి దగ్గర దింపాడు. సాయిబాబానే అలా మమ్మల్ని ఆదుకున్నారని నాకు తెలుసు. అందులో నాకు ఏ సందేహము లేదు. ఇది నాకు ఒక అద్భుతమైన అనుభవం. ఇలా ఎన్నో ఎన్నెన్నో అనుభవాలు బాబా నాకు ప్రసాదించారు. ఇలా మీతో పంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. "ధన్యవాదాలు బాబా".

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo