1. అనారోగ్యం ముదరకుండా కాపాడిన బాబా
2. బాబా ఉండగా భయం లేదు
3. అగరుబత్తి పొడితో విపరీతమైన దగ్గు నివారించిన బాబా
అనారోగ్యం ముదరకుండా కాపాడిన బాబా
అందరికీ హాయ్. నేను ఒక సాయి భక్తురాలిని. నాకు ఇప్పుడు 29 సంవత్సరాలు. నేను నా 21వ ఏట నుండి బాబా భక్తురాలిని. నేను బాబాని నా తల్లిలా భావిస్తాను. ఆయన నన్ను ఎంతగానో ప్రేమిస్తూ అన్ని విధాలా మార్గనిర్దేశం చేస్తూ, రక్షణనిస్తూ నేను కోరుకున్నవన్నీ ఇచ్చారు. ఆయన నా జీవితంలో చూపిన లీలలకు అంతులేదు. నేనిప్పుడు 2023, అక్టోబర్ నెల మొదటి వారంలో బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. బాబా నాకు కవల పిల్లల్ని ప్రసాదించారు. వాళ్ళని సాధారణంగా నేను, మా అత్తగారు జాగ్రతగా చూసుకుంటుండేవాళ్ళం. అయితే పిల్లలకి 11 నెలల వయసప్పుడు అత్తయ్య అనారోగ్యం పాలై హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది. ఆవిడ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయి వచ్చాక పిల్లలని చూసుకోవడానికి మేము ఒక ఆయాను ఏర్పాటు నియమించాము. కొన్నిరోజులకి ఆమె సెలవు తీసుకొని తన స్వగ్రామానికి వెళ్ళింది. అదే సమయంలో అకస్మాత్తుగా నాకు జలుబు, ఒళ్లునొప్పులు, జ్వరం వచ్చాయి. వాటితో నేను పూర్తిగా అనారోగ్యం పాలైతే పిల్లల్ని చూసుకోవడానికి ఎవరూ లేరని నాకు భయమేసి బాబాను, "బాబా! నేను అనారోగ్యం పాలుకాకుండా సహాయం చేయండి" అని ప్రార్థించి ఊదీ పెట్టుకున్నాను. అద్భుతం జరిగింది. బాబా దయవల్ల నేను నెమ్మదిగా కోలుకోనారంభించాను. నా ద్వారా పిల్లలకి జలుబు వ్యాప్తి చెందినప్పటికీ పెద్దగా ప్రభావం చూపలేదు. ఇది అందరికీ చిన్న విషయం అనిపించవచ్చు కానీ, ఒక తల్లిగా నా చంటి బిడ్డలిద్దరినీ చూసుకోవడం చాలా కష్టమైన విషయం. అయినా చిన్న విషయాలలో సైతం బాబాపట్ల విశ్వాసం పెంపొందడానికి సహాయపడుతుందన్న ఉదేశ్యంతో నేను ఈ అనుభవాన్ని మీ అందరితో పంచుకున్నాను. "చాలా చాలా ధన్యవాదాలు బాబా". సాయిరాముడు అందరికీ మంచి ఆరోగ్యాన్ని, దీర్ఘాయుస్సును ప్రసాదించుగాక!
బాబా ఉండగా భయం లేదు
నా పేరు లలిత. మా పెరట్లో ఒక పెద్ద సంపెంగ పూల చెట్టు ఉంది. దానికి పువ్వులు చాలా పైకి పూస్తుండటం వల్ల ఒక పెద్ద కర్ర సహాయంతో మేము రోజూ పువ్వులు తీస్తుంటాం. అలా ఒకరోజు నేను కర్రతో పువ్వులు తీస్తున్నప్పుడు చేజారి ఆ కర్ర గోడకి అవతలి వైపు పడిపోయింది. మాది ఉమ్మడి కుటుంబం. కర్ర పడేశానని తెలిస్తే ఎవరు ఏమంటారో అని నాకు భయమేసింది. కానీ గోడకు అవతలవైపు చాలా లోతుగా ఉంటుంది. అందువల్ల నాకు ఆ కర్రను ఎలా తీయాలో అర్థం కాలేదు. అప్పుడు నేను, "బాబా! ఏదో విధంగా ఆ కర్ర తేగలిగేలా నాకు సహాయం చేయండి తండ్రీ" అని బాబాకి దణ్ణం పెట్టుకున్నాను. తర్వాత విషయం మా పనిమనిషికి చెప్పాను. ఆమె, "మా దగ్గర చాలా పెద్ద గెడకర్ర వుంది. దాని సహాయంతో తీద్దాం" అని అంది. కానీ వారం రోజులైనా ఆమె ఆ పని చేయకుండా ఏదో ఒక షాకు చెప్తుండేది. అప్పుడు నేను, "బాబా! ఆమె గెడకర్ర తెచ్చి మా కర్రను తీస్తే, మీ అనుగ్రహం బ్లాగు ద్వారా తోటి సాయి భక్తులతో పంచుకుంటాను" అని బాబాకి దణ్ణం పెట్టాను, బాబా దయవలన ఆమె మరో ఇద్దరితో కలిసి గెడకర్ర తీసుకొచ్చి మా కర్రను తీసింది. వెంటనే నేను బాబాకు ధన్యవాదాలు తెలుపుకున్నాను.
మరొక చిన్న విషయం. ఈమధ్య మేము తిరుపతి, విజయవాడ వెళ్ళాము. ఆ సమయంలో మా పెద్దపాపకి నెలసరి వచ్చింది. దాంతో మేము తనని విజయవాడ అమ్మవారి దర్శనానికి తీసుకొని వెళ్ళలేక రూములో ఉంచి వెళ్లాలనుకున్నాము. కాని తను ఒక్కతే ఎలా ఉంటుందని భయపడ్డాము. అయితే మేము రూమ్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ క్యాలెండర్ మీద పసుపురంగు వస్త్రాలలో సాయిబాబా దర్శనం ఇచ్చారు. ఆయన 'భయం లేకుండా ప్రశాంతంగా వెళ్ళు, పాపకి నేను తోడు ఉంటాన'ని చెప్తున్నట్లు నా మనసుకి అనిపించింది. ఇక మేము పాపని గదిలో ఉంచి ప్రశాంతంగా అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చాము. పాప మేము వచ్చేవరకు ఒక్కతే భయం లేకుండా ఉంది. బాబా ఉండగా మనకు భయం లేదు. అన్నీ ఆయనే చూసుకుంటారు. "థాంక్యూ సాయితండ్రీ. నేను నిన్నే నమ్ముకున్నాను. నన్ను ఎన్నడూ విడువకు తండ్రీ"
ఓంసాయి శ్రీసాయి జయిసాయిసాయి.
జై సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.

