సాయిభక్తుడు శ్రీకాశీరాంషింపీ దయార్ద్రహృదయుడు, సున్నితమనస్కుడు, ఆధ్యాత్మిక భావాలు మెండుగా కలిగినవాడు. మహల్సాపతి, అప్పాజోగ్లే కూడా అటువంటి మనస్తత్వమే కలిగివుండేవారు. కాబట్టి ముగ్గురూ మంచి స్నేహితులుగా మెలుగుతూ, గ్రామంలోకి వచ్చే సాధువులకు, సత్పురుషులకు, బైరాగులకు, ఫకీరులకు తమ శక్త్యానుసారం సేవ చేసి వారి అవసరాలు తీరుస్తూ వారి సంక్షేమాన్ని చూస్తుండేవారు. ఖండోబా ఆలయం వద్ద ‘సాయీ’ అంటూ శ్రీసాయిబాబాను స్వాగతించిన మహల్సాపతి ఆయనను గ్రామంలోకి తీసుకువచ్చి తన మిత్రులైన కాశీరాంషింపీ, అప్పాజోగ్లేలకు పరిచయం చేశాడు. ఈ ముగ్గురూ బాబాపట్ల అంకితభావంతో వారి కొద్దిపాటి అవసరాలను చూసుకుంటుండేవారు. గ్రామస్తులు కాశీరాంని “షింపీ” అని పిలిచేవారు. బాబా కూడా అతనిని అలాగే పిలిచేవారు. ‘షింపీ’ అనే మరాఠీ పదానికి అర్థం ‘దర్జీ’ అని. అది అతని కులానికి సంకేతం. దాన్నే ఇంటిపేరుగా వ్యవహరించేవారు. అయితే ప్రస్తుతం అతని వారసులు “మిరానే” అనే పదాన్ని కూడా చేర్చి, “మిరానే షింపీ”ని తమ ఇంటిపేరుగా వ్యవహరిస్తున్నారు.
కాశీరాంషింపీ వస్త్రవ్యాపారి. అతను తనకున్న కొద్దిపాటి ఆస్తిపాస్తులతో స్థిరమైన జీవితాన్ని సాగిస్తుండేవాడు. అతను బాబాను ఎంతగానో ప్రేమిస్తూ తను, మన, ధన, ప్రాణాలతో వారి సేవను అత్యుత్తమంగా చేశాడు. బాబా కఫ్నీ తొలినాళ్లలో కాషాయం లేదా తెల్లని రంగులో ఉండేది. ఒకసారి కాశీరాం ప్రేమతో బాబా కోసం ఒక ఆకుపచ్చని కఫ్నీ, అదే రంగు తలపాగాను కుట్టి వారికి బహూకరించాడు. బాబా కొన్నిరోజులు దాన్ని ధరించిన తరువాత మునుపటివలె తెల్లని కఫ్నీ ధరించసాగారు. కానీ, అతనిచ్చిన ఆ ఆకుపచ్చని కఫ్నీని తాము సమాధి చెందేవరకు ఒక మూటలో జాగ్రత్తగా దాచుకున్నారు. బాబా ఆ మూటను ఎవరినీ ముట్టుకోనిచ్చేవారు కాదు. బాబా సమాధి చెందాక భక్తులు ఆ మూటను కూడా వారి సమాధిలో భద్రపరిచారు.
బాబా చిలిం కోసం పొగాకును, ధుని కోసం కట్టెలను సమకూర్చేవాడు కాశీరాంషింపీ. ప్రతి ఉదయం అతను బాబా దర్శనం చేసుకొని వారి పాదాల వద్ద రెండు పైసలు ఉంచేవాడు. నిజానికి బాబా తొలిరోజుల్లో భక్తుల వద్దనుండి ధనం స్వీకరించేవారు కాదు. కానీ కాశీరాంషింపీ వద్ద ఒక పైసానో, రెండు పైసలో తరచూ తీసుకొనేవారు. ఎందుకంటే, తన దగ్గరనుండి బాబా దక్షిణ తీసుకోవాలని కాశీరాంకు తీవ్రమైన కోరిక ఉండేది. ఎప్పుడైనా బాబా దక్షిణ తీసుకోకపోతే అతనికి చాలా బాధ కలిగి కళ్లనుండి నీరు కారేది. ఇది అతనికి బాబాపట్ల ఉన్న ప్రేమకు, భక్తికి నిదర్శనం. అయితే, ఇలా బాధపడటం కూడా పరమార్థంలో మంచిది కాదు. కారణం, అందులో ‘నాకు ఇచ్చే శక్తి ఉంది’ అన్న అహంభావం ప్రవేశిస్తుంది. అందువల్ల భక్తుని పరమార్థ ప్రగతికి ఘాతుకమైన విషయాన్ని పెరికిపారవేయటం గురువు యొక్క నిత్య సంకల్పం. కాశీరాం విషయంలో అదే జరిగింది.
తరువాతి రోజుల్లో కాశీరాంషింపీ తాను ప్రతిరోజూ సంపాదించే నగదు మొత్తాన్ని తీసుకొచ్చి బాబా పాదాల చెంత ఉంచి, వారికి ఇష్టమొచ్చినంత తీసుకోమని అని అర్థించేవాడు. బాబా తమకు తోచినంత ఉంచుకొని, మిగిలిన మొత్తాన్ని అతనికి తిరిగి ఇచ్చేవారు. ఇలా చాలారోజులు నడిచింది. క్రమంగా అతని మనసులో ‘నా గురువైన బాబాకు దక్షిణ ఇవ్వగల సామర్థ్యం నాకుంది, నేను ఆయన అవసరాలు తీరుస్తున్నాను’ అన్న అహంకార బీజం నాటుకుంది. బాబాకు తమ భక్తులపై అమితమైన ప్రేమ. వారు సర్వజ్ఞులు. భక్తుల మనస్సు, వారి ఆలోచన సర్వమూ బాబాకి తెలుసు. అందువల్ల కాశీరాంని అనేకమార్లు దక్షిణ అడగటం ప్రారంభించారు బాబా. కొంతకాలానికి అతనికి డబ్బుకు సంబంధించిన కష్టం ఏర్పడి బాబాకు కొద్దిపాటి దక్షిణ కూడా సమర్పించలేని స్థితికి చేరుకున్నాడు. తన వద్ద డబ్బు లేదని ఎంతో బాధగా విన్నవించుకునేవాడు. అయినా బాబా, “వ్యాపారి వద్ద అప్పుగా తెచ్చి తమకివ్వమ”ని చెప్పేవారు. కొన్నిరోజులు అతను అలాగే చేశాడు. రోజురోజుకీ అప్పు పెరిగిపోయింది. దాంతో వ్యాపారులు అతనికి డబ్బివ్వడం మానేశారు. చివరికి అతనిని తమ ఇంటిగుమ్మం ముందు నిలబడటానికి కూడా గ్రామస్తులు అనుమతించేవారు కాదు. ఇదంతా బాబా లీల. ఈ లీలంతా అతని అహంభావాన్ని తొలగించటానికే, వారి అవసరాలు తీర్చే శక్తి అతనికి లేదని తెలియజేయడానికే. ఎప్పుడైతే ఆ సత్యాన్ని అతను గ్రహించాడో ఆ క్షణం నుండి అతని ఆర్థిక పరిస్థితి మెరుగుపడసాగింది. మునవటిపలే అతను సుఖంగా ఉండసాగాడు. బాబా రోజూ తన వద్దనుండి దక్షిణ తీసుకోవాలి అనే అతని తపన కూడా తొలగిపోయింది.
వ్యాపారరీత్యా కాశీరాంషింపీ వివిధ గ్రామాలు తిరుగుతూ ఆయా గ్రామాల్లో సంత జరిగే రోజున అంగడి పెట్టుకొని వస్త్రవ్యాపారం చేస్తుండేవాడు. ఒకసారి నావూర్ సంతనుండి అతను గుర్రపుస్వారీ చేసుకుంటూ ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు దోపిడీ దొంగల ముఠా ఒకటి తటస్థపడింది. మొదట ఆ దొంగలముఠా అతనిపై దాడి చేయలేదు. అతని వెనుక ఉన్నవారిని దోచుకున్న తరువాత వారి దృష్టి కాశీరాంషింపీపై పడింది. వెంటనే ఆ ముఠా అతనిపై దాడిచేయనారంభించారు. కాశీరాం వారిని అడ్డగించలేదు. తరువాత ఆ దొంగల దృష్టి అతని వద్దనున్న ఒక చిన్న మూటపై పడింది. అందులో ధనమో లేదా విలువైనదేమైనా ఉండవచ్చనే అనుమానంతో వాళ్ళు దానిని దోచుకునే ప్రయత్నం చేశారు. కానీ నిజానికి అందులో ఉన్నది కేవలం పంచదార పొడి. జానకీదాస్ అనే పేరుగల ఒక సత్పురుషుడు, ‘చీమలకు పంచదార వేయాల’ని బోధించినప్పటినుండి కాశీరాం పంచదారను తన దగ్గరుంచుకునేవాడు. ఆ చిన్నమూట అతనికి అత్యంత ప్రియమైనది, తన ప్రాణం కంటే విలువైనది. ఏమైనాగానీ ఆ మూటను మాత్రం ఇవ్వకూడదని అతడు నిశ్చయించుకున్నాడు. ఆ మూటకోసం దొంగలు అతనిని తీవ్రంగా గాయపరిచారు. అంతలో సమీపంలో పడివున్న కత్తి ఒకటి కాశీరాం కంటపడింది. వెంటనే అతను ఆ కత్తిని అందుకొని ఎదురుదాడి చేసి ఇద్దరు దొంగలను హతమార్చాడు. ఇంతలో మూడవ దొంగ వెనుకనుంచి వచ్చి గొడ్డలితో కాశీరాం తలపై కొట్టాడు. దాంతో తీవ్రంగా రక్తస్రావమై కాశీరాం స్పృహతప్పి పడిపోయాడు. మిగిలిన దొంగలు అతను చనిపోయాడని తలచి అక్కడినుండి వెళ్ళిపోయారు. కానీ నిజానికి అతనికి ప్రాణం పోలేదు. కొంతసేపటికి అతనికి తెలివి వచ్చింది. బాబాపట్ల అమితమైన భక్తిశ్రద్ధలు ఉన్న అతను తనకు సహాయం చేయడానికి వచ్చినవారితో, తాను ఆసుపత్రికి పోననీ, తనను శిరిడీకి తీసుకెళ్ళమనీ కోరాడు. అట్లే, వాళ్ళు అతనిని శిరిడీకి తీసుకొని వచ్చారు. బాబా అతనికి ఔషధోపచారాలు చేయమని మాధవరావు దేశ్‌పాండేతో చెప్పారు. కొద్దిరోజుల్లో బాబా కృపతో కాశీరాం ఆరోగ్యం బాగుపడింది.
నిజానికి కాశీరాంపై చాలామంది దోపిడీ దొంగలు ఆయుధాలతో దాడి చేశారు. అయినప్పటికీ, ఎదురుదాడి చేసి వారిని నివారించి, అతను సజీవంగా బయటపడ్డాడంటే అది కేవలం శ్రీసాయి కృపే. ముఖ్యమైన విషయమేమిటంటే, సరిగ్గా అతనక్కడ దొంగలపై ఎదురుదాడి చేస్తున్న సమయంలో ఇక్కడ శిరిడీ ద్వారకామాయిలో కూర్చొని ఉన్న బాబా ఉన్నట్టుండి ఆగ్రహావేశాలతో సట్కా ఝుళిపిస్తూ ఒకటే కేకలు, బొబ్బలు, తిట్లు, శాపాలు వగైరాలతో గొడవ చేశారు. బాబా చర్యలను గమనిస్తున్న భక్తులు, “ఎవరో ప్రియమైన భక్తునిపై పెద్ద కష్టమొచ్చి పడివుండవచ్చు. ఆ భక్తుని రక్షించటానికే బాబా ఇలా చేస్తున్నారు” అనుకున్నారు. వారు ఊహించినట్లే దొంగల దాడినుండి బాబా తమ భక్తుణ్ణి రక్షించారు. అతని వీరకృత్యానికి బొంబాయి ప్రభుత్వం కాశీరాంకు ఒక కరవాలాన్ని బహూకరించింది.
పై ఘటన తరువాత కాశీరాం మరికొన్నేళ్ళు జీవించి, శ.సం॥1830 (1908) చైత్రశుద్ధ ఏకాదశి రోజున మరణించాడు. అతని వారసులు ఇప్పటికీ అదే ఇంట్లో నివసిస్తున్నారు. వారంతా బాబాకు అంకితభక్తులుగా ఉంటూ వారసత్వంగా బాబా సేవను కొనసాగిస్తున్నారు.
కాశీరాంషింపీ మునిమనుమడైన శాంతారాం రంగనాథ్ మిరానే షింపీ 1999 నుండి 2004 వరకు శ్రీసాయిబాబా సంస్థాన్ ధర్మకర్తగా బాధ్యతలు నిర్వహించారు. సామూహిక శ్రీసాయిసచ్చరిత్ర పారాయణ అనే పాత సంప్రదాయాన్ని పునరుద్ధరించటంలో అతను ప్రముఖ పాత్ర వహించారు. సామూహిక పారాయణ అనంతరం కీర్తనలు నిర్వహించే పద్ధతిని కూడా అతను తిరిగి ప్రవేశపెట్టాడు. అంతేకాదు, ‘గురుపథ్ భజన్’ (1903లో శ్రీదాసగణు మహరాజ్ స్వరపరిచిన 25 అభంగాల కీర్తన) అనే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించాడు. అది పూర్తవుతూనే భక్తులు తమ జీవితంలో జరిగిన అనుభవాలు మరియు అద్భుతాల గురించి మాట్లాడుతారు.
సమాప్తం.....
రిఫరెన్స్: సాయి ప్రసాద్ పత్రిక, 1995 దీపావళి సంచిక.
సోర్స్: బాబాస్ డివైన్ సింఫనీ.
🙏🙏🙏 Om srisairam Om srisairam Om srisairam thankyou sister.
ReplyDeleteOm sai ram very nice leela about dhashina
ReplyDeleteOm Sairam
ReplyDelete🙏💐🙏ఓం సాయిరాం🙏💐🙏
ReplyDeleteఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
ReplyDeleteఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏
OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
🌺🌺🙏🙏 Om Sai Ram 🙏🙏🌺🌺
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Baba Kalyan ki marriage chai thandri pl meku satha koti vandanalu vadini bless cheyandi house construction complete cheyandi pl manchivarini rent ki pampandi naku unna e problem solve cheyandi pl
ReplyDelete