ఈ భాగంలో అనుభవాలు:
1. బాబా మనతో ఉన్నారని నమ్మడానికి ఇది సరిపోదా?
2. బాబాని నమ్ముకుంటే కానిదంటూ ఏదీ ఉండదు
3. అడిగినవన్నీ ఇస్తున్న బాబా
బాబా మనతో ఉన్నారని నమ్మడానికి ఇది సరిపోదా?
నా పేరు చైతన్య. నేను బాబాని నమ్మటం మొదలుపెట్టినప్పటి నుంచి కొన్ని విషయాలు బాబాకే వదిలెయ్యటం చేస్తున్నాను. ఆయన నాకు చాలాసార్లు సహాయం చేసారు. కొన్ని సమస్యలు చదవడానికి చాలా చిన్నవిగా అనిపిస్తాయి కానీ, భరించేవాళ్ళకి అవి చాలా పెద్దవి. నేను పనిచేస్తున్న ఆఫీసులో మాకు ప్రతినెల రావాల్సిన పేమెంట్ కొన్ని కారణాల వల్ల ఆగిపోతుంటుంది. ఇంతకుముందు అలా జరిగినప్పుడు 30 రోజుల లోపు క్లియర్ అయ్యింది. కానీ 2025, ఫిబ్రవరిలో రావాల్సిన పేమెంట్ ఏప్రిల్ నెల చివరివరకు రాలేదు. దాంతో జీతాలు ఇవ్వాలని పరిస్థితి వచ్చి కంపెనీ భవిష్యత్తు ఆలోచనలో పడింది. పేమెంట్ వ్యవహారాలు చూసుకొనేది నేనే అయినందున నాపై చాలా ఒత్తిడి పడింది. ఆ స్థితిలో నేను బాబానే నమ్ముకున్నాను. ఆ సమయంలో మా నాన్న చెన్నై వస్తే, మేము మైలాపూర్‌లో ఉన్న కపాలీశ్వరస్వామి గుడికి వెళ్ళడానికి బయలుదేరాము. నేను దారిలో, "బాబా! ఈరోజు ఎలాగైనా మీరు నాతో ఉన్నారని, పేమెంట్ వస్తుందని నమ్మకాన్ని కలిగించండి" అని బాబాను అడిగాను. గుడిలో దర్శనమయ్యాక మేము టిఫిన్ చేయడానికి హోటల్‌కి వెళ్ళాం. అక్కడ నేను పొంగల్ తింటూ అందులో ఉన్న మిరియాలు తీసి పక్కన పెడుతుంటే, మా నాన్న "మిరియాలు అన్ని తీసేసి తింటున్నావేంటి?" అని అడిగారు. నేను, "నాకు మిరియాలు ఇలా ఉంటే నచ్చదు. మిరియాల పొడి వేస్తే పొంగలి బాగుంటుంది. కానీ ఎక్కడా అలా వేయరు" అని అన్నాను. ఆ తర్వాత నేను ఇక్కడ దగ్గరలో బాబా గుడి కూడా ఉండాలని అక్కడున్న వాళ్ళని అడిగితే, పక్కనే ఉందన్నారు. నేను 'బాబాని నాకు నమ్మకం కలిగించమని అడిగాను కదా!' అని అనుకుంటూ బాబా గుడికి వెళ్ళాను. బాబా దర్శనం చాలా బాగా అయింది. ఆ తండ్రి నాకు పొంగల్ ప్రసాదంతోపాటు ఊదీ ఇచ్చారు. చూస్తే, అది మిరియాల పొడి వేసిన పొంగల్. నేను ఆశ్చర్యపోతూ, "చెన్నైలో ఎక్కడా మిరియాల పొడి వేసిన పొంగల్ చూడలేదు" అని అనుకున్నాను. అలా అనుకున్న కొన్ని నిమిషాలలో బాబా నాకు అద్భుతం చూపించారు. నేను చాలా రోజులనుండి సాయి స్తవనమంజరి చదవాలనుకుంటున్నాను. కానీ ఆ పుస్తకం ఎక్కడా దొరకలేదు. అలాంటిది ఆ గుడిలో నాకు ఒక స్తవనమంజరి పుస్తకం ఇచ్చారు. అక్కడ ఆ ఒక్క పుస్తకమే వుంది. అది కూడా తెలుగులో. 'బాబా నాతో ఉన్నారని నమ్మడానికి ఇది సరిపోదా?' అనిపించింది నాకు. తర్వాత రెండే రోజులకి మా కంపెనీ పేమెంట్ వచ్చింది. బాబాని భక్తితో స్మరిస్తే అన్ని ఆయనే చూసుకుంటారు. మనం మన భారం ఆయన మీద వేసి ఓర్పుతో ఉండాలి, అంతే! ""ధన్యవాదాలు బాబా. నన్ను ఎల్లప్పుడూ ఇలాగె కాపాడుతూ ఉండండి. నేను తెలిసీతెలియక చేసిన తప్పులకు నన్ను క్షమించండి. త్వరలో శిరిడీ దర్శన భాగ్యం కలిగించండి. నా మొక్కులు అన్ని తీర్చుకుంటాను తండ్రీ".
బాబాని నమ్ముకుంటే కానిదంటూ ఏదీ ఉండదు
సాయి భక్తులకు నమస్సులు. నా పేరు సరస్వతి. నేను బాబాకి చిన్న భక్తురాలిని. నేను నమ్ముకున్న బాబా నన్నెప్పుడూ వదిలిపెట్టనని ఋజువు చేస్తూ ఉన్నారు. అందుకు నిదర్ శనం ఈ అనుభవం. 2025, మే 27 రాత్రి హఠాత్తుగా నా 8 సంవత్సరాల పాపకి చలి జ్వరం వచ్చింది. పిల్ల అర్ధరాత్రి చలికి వణుకుతూ నన్ను నిద్రలేపితే, పొద్దున్న చలాకీగా బాగా ఆడుకున్న పిల్ల ఉన్నట్టుండి చలి అనేసరికి ఊరికే అంటుందనుకున్నాను నేను. కానీ తను చాలా వణికిపోతూ తలనొప్పి, తల తిరుగుతుంది, ఇంకా కాళ్ళనొప్పులు అని చెప్పింది. చూస్తే, తన ఒళ్ళంతా వేడిగా వుంది. ఆ రాత్రివేళ నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. బాబా తప్ప ఇంకెవరూ ఆ సమయంలో నాకు గుర్తుకు రాలేదు. నేను నా పర్సులో ఎప్పుడూ శిరిడీ ఊదీ పెట్టుకుంటాను. దాన్ని వెంటనే తీసి పాప నుదిటి మీద పెట్టి, కొంచెం నోట్లో వేసి నీళ్ళు త్రాగించి, "బాబా! తెల్లారేసరికి పాపకి తగ్గేలా చూడు" అని చాలా ఆర్తిగా ప్రార్థించాను. పాపని ఆ స్థితిలో చూడలేక రాత్రంతా, 'ఓం శ్రీసాయినాథాయ నమః' అని 108 సార్లు జపం చేశాను. అలాగే 'ఓంసాయి శ్రీసాయి జయజయసాయి' అని జపిస్తూ ఎప్పుడో నాకు తెలియకుండానే నిద్రలో జారుకున్నాను. తెల్లారి లేచేసరికి పాపకి తగ్గిపోయింది. మా బాబాని నమ్ముకుంటే కానిదంటూ ఏదీ ఉండదు. "ధన్యవాదాలు బాబా. ఎల్లప్పుడూ నన్ను, నా కుటుంబాన్ని ఇలాగే కాపాడండి తండ్రీ".
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.
అడిగినవన్నీ ఇస్తున్న బాబా
ముందుగా అందరికీ నా వందనాలు. నా పేరు గురుప్రసాద్. నేను ఆస్ట్రేలియాలో ఉంటాను. ఇక్కడ నేను, నా బావమరిది ఒకే కంపెనీలో, ఒకే టీమ్‌లో పని చేస్తున్నాము. మా మేనేజర్వాళ్ళు నా బావమరిదిని 'ఇదే టీమ్‌లో ఇంకా కొనసాగించలేము, వేరే టీమ్‌కి పంపాలి' అన్నారు. మా మేనేజర్ హై లెవెల్‌తో మాట్లాడితే, చూద్దామని అన్నారు. నేను బాబాని, "ఎలాగైనా నా బావమరిదిని మా టీమ్‌లో ఉండేలా చేయండి బాబా" అని దృఢంగా బాబాని వేడుకున్నాను. ఒక వారంలో ఎవరైతే అదివరకు నా బావమరిదిని మా టీమ్‌లో వద్దని అన్నారో, వాళ్లే కాల్ చేసి, "తను మీ టీమ్‌లో ఉంటాడు. మీరు అధైర్యపడకండి" అని చెప్పారు. నాకు ఒక్క నిమిషం ఏమీ అర్థం కాలేదు. తర్వాత నా ఫోన్లో బాబాని చూసి, "అంతా మీ దయ" అనుకున్నాను. ఇంతవరకు నేను అడిగినవన్నీ ఇచ్చారు బాబా. "అన్నిటికీ ధన్యవాదాలు బాబా".
Baba Kalyan ki marriage chai thandi meku sathakoti vandanalu vadini bless chaindi house lo problem solve cheyandi pl house rent ki ippinchu thandri pl
ReplyDeleteOmsaisrisaijayajayasai
ReplyDelete