ఈ భాగంలో అనుభవాలు:
1. బాధలను తీర్చే బాబా
2. శరణాగతి నేర్పిస్తున్న బాబా
బాధలను తీర్చే బాబా
నా పేరు పుష్పలత. నేను ఉపాధ్యాయురాలుగా పనిచేసి రిటైరయ్యాను, బాబాతో నాకు ఉన్న పరిచయం ఇప్పటిది కాదు. సుమారు 30 సంవత్సరాల క్రితం జనవరి 1న మా పాఠశాల విద్యార్థులు బాబా ఫోటో ఉన్న గ్రీటింగ్ కార్డు నాకు ఇచ్చారు. అప్పుడు మొదలైన బాబాతో నా అనుబంధం ఇప్పటివరకు కొనసాగుతూనే ఉంది. నా జీవితాంతం కొనసాగుతూనే ఉంటుంది. బాబా నాపై చూపిన కరుణ, దయ ఇంతని చెప్పలేను. కొద్దిరోజుల క్రితం నాకు ఒక అనారోగ్య సమస్య వచ్చింది. హఠాత్తుగా వైట్ డిశ్చార్జ్ అవ్వడం మొదలైంది. 'సాయీ' అనగానే 'ఓయ్' అని మన బాధలను తీర్చే బాబా తప్ప మనకి దిక్కు ఎవరు? ఆయన్నే తలుచుకొని 'నాకీ వయసులో ఇదేంటి బాబా?' అని నేను ఎంతో బాధపడ్డాను, భయపడ్డాను. మనసులో బాబాని తలుచుకొని ఊదీ మంచినీళ్లలో వేసుకొని, బాబాకి దణ్ణం పెట్టుకొని ఆ తీర్థం తాగి, కొంత ఊదీ నా పొట్టకి రాసుకున్నాను. అనూహ్యంగా నాకొచ్చిన సమస్య తొలగిపోయింది.
నేను యుఎస్ఏలో ఉన్న మా పాప దగ్గరకు వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు అక్కడ ఇమ్మిగ్రేషన్‌వాళ్ళు అడిగిన ప్రశ్న నాకు అర్థంకాక నేనేమీ సమాధానం చెప్పలేకపోయాను. దాంతో వాళ్ళు నన్ను కాసేపు పక్కన ఉండమన్నారు. నాకు చాలా భయమేసి పక్కన కూర్చొని అక్కడ ఉన్నంతసేపూ, "బాబా! నన్ను ఎలాగైనా ఈ ఇబ్బందుల నుంచి బయటపడేయండి" అని బాబాకి దణ్ణం పెట్టుకొని ఆయన నామస్మరణ చేశాను. కాసేపటికి వాళ్ళు నన్ను 'ఓకే' చేసి ఫ్లైట్ దగ్గరకి పంపించారు. బాబా దయవలన నా ప్రయాణం నిర్విఘ్నంగా సాగి క్షేమంగా ఇండియాకి వచ్చాను. ఇలా అడుగడుగునా నాకు అండగా ఉంటూ నా బాధలు, ఇక్కట్లు తొలగిస్తూ నన్ను గట్టెక్కిస్తున్న సాయినాథునికి నేను ఎంతగానో ఋణపడి ఉన్నాను. ఇలా బాబా నాపై చూపిన ప్రేమ, కరుణలను మీతో పంచుకున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాను.
"బాబా! నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ నీవే. ఇదేవిధంగా కరుణించి నన్ను, సాయి బంధువులందరినీ ప్రేమతో కాపాడుతూ అందరూ క్షేమంగా ఉండేలా తండ్రీ. ఎల్లవేళలా నా అండ నుండి నన్ను నడిపించు మీకు శతకోటి వందనాలు".
సర్వం శ్రీ సాయినాథ చరణారవిందార్పణమస్తు.
శరణాగతి నేర్పిస్తున్న బాబా
నేను ఒక సాయి భక్తురాలిని. మా అబ్బాయి చదువులో చాలా చురుకుగా ఉంటాడు. అలాంటి తను ఈమద్య ఎందుకో సరిగా చదవట్లేదు, శ్రద్ధ పెట్టట్లేదు. వాడు చదివేది చిన్న క్లాసే అయినా చాలాసార్లు నెమ్మదిగా చెప్పాను. కానీ వాళ్ళ నాన్న తనని తిడుతుంటే ఒక తల్లిగా తట్టుకోలేకపోయేదాన్ని. ఒకసారైతే చాలా బాధగా అనిపించింది. ఎందుకంటే, అప్పటికే నా మూడ్ బాగాలేదు. సరే కాసేపు బాబా ప్రత్యక్ష ప్రసారం చూద్దాం, ఆయనే సమాధానమిస్తారని బాబా ప్రత్యక్ష దర్శనం ఓపెన్ చేసి మనసులో, "మా అబ్బాయి భవిష్యత్తులో మంచిగా ఉంటాడా, వెనకపడిపోతాడా? తను బాగుంటాడు అంటే మీ మూర్తి మీద నుండి ఒక పువ్వు కిందకి పడేలా చేయండి బాబా" అని అనుకున్నాను. అయితే బాబా నుండి సమాధానం ఎంతకీ రాలేదు. ఒక 3 రోజులు దాని గురించే ఆలోచించుకుంటూ కాస్త కోపంగా చాలా చిరాకుగా వుంటూ బాగా బాధపడ్డాను. బాబాని పూజించడం మాత్రం మానలేదు. ఎందుకో బాబా నన్ను పరీక్షిస్తున్నారనిపించింది. తర్వాత గురువారంనాడు బాబా ప్రత్యక్ష దర్శనం తెరిచి కాకడ ఆరతి, మంగళస్నానం చూస్తుండగా నా మనసుకెందుకో 'బాబా నాకు శరణాగతి చేయడం నేర్పిస్తున్నారు' అనిపించి, "సరే అదే నిజమైతే, ఇప్పుడు బాబా పసుపు లేదా నీలి రంగు వస్త్రాలు ధరించాలి" అని అనుకున్నాను. అద్భుతం! కాసేపటికి బాబా ఆ 2 రంగుల వస్త్రాల్లో(పసుపు రంగు వస్త్రం, నీలి రంగు కండువా) దర్శనం ఇచ్చారు. అంతటితో నా మనసులో ఉన్నా బాధంతా పటాపంచలైపోయింది. ఇప్పుడు నా మనసుకెంత ప్రశాంతం ఉందో చెప్పలేను. నేను రోజూ బాబాకి మీకు శరణగతి చేస్తున్నానని పూజ చేస్తాను. కానీ నిజంగా ఆలోచిస్తే బాధలో ఉన్నప్పుడు బాబాని రకరకాల ప్రశ్నలు వేస్తుంటాను. మనుషలం కదా! ఎప్పుడూ అది కావాలి, ఇది కావాలని కోరుతుంటాం. అది నిజమైన శరణాగతి కాదని బాబా నాకు నిరూపించారు. "కోటి కోటి ధన్యవాదాలు బాబా. మీరే నా తల్లి, తండ్రి, గురువు. ఎప్పుడు మిమ్మల్ని చూసిన నాకు మా తాతయ్య గుర్తుకు వస్తారు. నేను మీ మనవరాలినన్న బావనతోనే మిమ్మల్ని స్మరిస్తాను. ఎంత బాధ కలిగినా, సంతోషమొచ్చిన అంతా మీ దయ అనే ఆలోచన మాకు వచ్చేలా చేయండి తండ్రీ".
