సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

మాధవ్ ఫస్లే


మాధవ్ ఫస్లే బాబా సేవకుడు. బాబా అతనిని ప్రేమగా 'ఘోడేవాలా' అని పిలిచేవారు. శిరిడీలో అందరూ అతన్ని ‘మధు’ అని పిలిచేవారు. అతడు తన చిన్ననాటినుంచే బాబాపట్ల ఆకర్షితుడయ్యాడు. యుక్తవయస్సు వచ్చాక బాబాతోనే ఉంటూ పగలు, రాత్రి ఆయన సేవలో నిమగ్నమై ఉండేవాడు. ద్వారకామాయిని తుడవడం, బాబా కఫ్నీని ఉతకడం, బాబా కూర్చునే ఆసనాన్ని(చాపను) శుభ్రపరచడం, మశీదు మెట్ల వద్ద ఉన్న తొట్టెను నీటితో నింపడం, బాబా స్నానానికి గోరువెచ్చని నీరు ఉంచడం, ఆయన స్నానం పూర్తిచేసేవరకు వేచివుండి ఆయన ఒళ్ళు తుడవడం, మసీదు, చావడిలలో ఉన్న దీపపు ప్రమిదలను శుభ్రం చేయడం, దీపాలు వెలిగించడంలో అబ్దుల్‌బాబాకు సహాయం చేయడం, బాబా గుఱ్ఱం శ్యామకర్ణను చూసుకోవడం వంటి పనులను అతను చేసేవాడు.

ధుని పక్కనే ఒక గది ఉండేది. దానిని కట్టెలు నిల్వ చేయడానికి ఉపయోగించేవారు. ఆ గది యొక్క ఒక గోడలో దాదాపు మూడువంతుల భాగాన్ని బాబా తమ స్వహస్తాలతో నిర్మించారు. ఆ సమయంలో మాధవ్ మట్టి మిశ్రమాన్ని తయారుచేసి బాబాకు సహాయం చేశాడు. బాబా ఇటుకలను పేర్చి ఆ మట్టి మిశ్రమంతో పూతవేశారు.

బాబా సమాధి చెందినప్పుడు బాబా ఉపయోగించిన చిలింను, సట్కాను బాపూసాహెబ్ జోగ్‌కు ఇచ్చాడు మాధవ్. వాటిని జోగ్ తన పూజామందిరంలో భద్రపరుచుకున్నాడు. తరువాత కొంతకాలానికి జోగ్ తన నివాసాన్ని సకోరిలోని ఉపాసనీ ఆశ్రమానికి మార్చాడు. అప్పుడు తనతోపాటు పవిత్రమైన ఆ వస్తువులను కూడా తీసుకువెళ్లాడు. కాలక్రమంలో అవి సాయి సంస్థాన్‌లో భద్రపరచబడ్డాయి.

బాబా సమాధి చెందడానికి కొద్దిరోజుల ముందు బాబా భిక్షకు వెళ్ళారు. వారు తమ గురుప్రసాదమని ప్రాణప్రదంగా చూచుకొనే ఇటుక మశీదులో నేలపై నున్నది. నిత్యమూ దానికి మహల్సాపతి, కాశీరామ్ షింపీలు అభిషేకము, పూజచేసి ధుని దగ్గరనున్న స్తంభం ప్రక్కన పెట్టేవారు. ఆనాడు మాధవ్ ఫస్లే మశీదు చిమ్ముతూ, దాని పై దుమ్ముపడకుండా చేతిలోకి తీసుకోగానే, అది జారి క్రిందపడి విరిగిపోయింది. సాయి కోపిస్తారని ఫస్లే భయంతో వణికిపోయాడు. కొద్దిసేపట్లో సాయి రానేవచ్చారు. విరిగిన యిటుక చూచి కోపించలేదు. దానిని చెక్కిలికి ఆనించుకొని కన్నీరు కారుస్తూ, “విరిగినది ఇటుక కాదు, నా ప్రారబ్దం. ఇది నా జీవిత సహచరి, ప్రాణానికి ప్రాణం. దాని సహాయంతోనే నేను ఆత్మను ధ్యానించేది. అది విరిగిపోయింది, ఇక నేనెక్కువ కాలం జీవించను” అన్నారు. అప్పుడు బాబా అనుమతిస్తే ఆ రెండు ముక్కలనూ వెండి తీగతోగాని, లేక బంగారు తీగతోగాని కలిపి గట్టిగా చుట్టించి యిస్తానన్నాడు బూటీ. కాని బాబా అందుకు అంగీకరించలేదు.

1936లో ఒకరోజు రాత్రి ముస్లింభక్తుడు చోటేఖాన్, మాధవ్ ఫస్లే మసీదులో నిద్రిస్తున్నారు. మధ్యరాత్రిలో, “అరే మధూ, లే! నేను మూత్రవిసర్జన చేయాలి” అన్న బాబా మాటలు చోటేఖాన్ విన్నాడు. కానీ, మాధవ్ గాఢనిద్రలో ఉండి లేవలేదు. మరుసటిరోజు ఉదయం బాబా కూర్చునే ప్రదేశంలో నీళ్ళు మడుగుకట్టి ఉండటాన్ని, ఆ నీళ్ళు సువాసనలు వెదజల్లుతుండటాన్ని గమనించి వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోయారు.

ఒకసారి మాధవ్‌ని కాశీయాత్రకు వెళ్ళమని ఆదేశించారు బాబా. అందుకతడు వెనుకాడుతూ, “బాబా! నాకు అక్కడికి ఎలా వెళ్ళాలో తెలియదు” అన్నాడు. బాబా, “శిరిడీ నుండి పైఠాన్, జాల్నా, బాలాజీ, దేవల్‌గాఁవ్, ఓంకార్, అజ్మీర్, నీముచ్ చివరిగా కాశీ వెళ్ళు” అని చెప్పి, దారిఖర్చుల కోసం పదిరూపాయలు ఇచ్చారు. అతనికి బాబాపై అపారమైన నమ్మకం. అడుగడుగునా ఆయన తనను చూసుకుంటారని అతనికి తెలుసు కాబట్టి బాబా ఇచ్చిన పదిరూపాయలను, పాత కఫ్నీ రూపంలో బాబా ఆశీస్సులను వెంటబెట్టుకుని తీర్థయాత్రకు బయలుదేరాడు.

మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల మీదుగా 1,400 మైళ్ళకు పైగా సాగే ప్రయాణమది. మాధవ్ ఎటువంటి ఇబ్బంది లేకుండా పైఠాన్ వరకు నడిచి, అక్కడ నందూపాటిల్‌ని కలుసుకున్నాడు. నందూ అతనిని, "ఎక్కడి వరకు వెళ్తున్నావు?" అని అడిగాడు. అందుకతడు, "బాబా కాశీ వెళ్ళమని చెప్పారు. ఆ ప్రయాణంలోనే ఉన్నాన"ని చెప్పాడు. నందూ అతన్ని తన ఇంటికి ఆహ్వానించి నాలుగురోజులు ఆతిథ్యమిచ్చాడు. బాబా దైవత్వం గురించి, తాను పొందిన అనుభవాల గురించి నందూతో పంచుకున్నాడు మాధవ్. తరువాత నందూ తన గుఱ్ఱపుబండిపై మాధవ్‌ని జాల్నా వరకు తీసుకుని వెళ్లి అక్కడ వదిలిపెట్టాడు. 

అక్కడినుండి మాధవ్ బాలాజీ దేవల్‌గాఁవ్ వరకు నడిచి వెళ్లి, అక్కడ రంగనాథ్ మహరాజ్‌ను కలిశాడు. అతనిని చూస్తూనే సర్వజ్ఞుడైన రంగనాథ్ మహరాజ్, "ఆధ్యాత్మికంగా వెలుగొందుతున్న శిరిడీలో జీవించడం నీ అదృష్టమ"ని అన్నారు. తరువాత మాధవ్ తన ప్రయాణాన్ని కొనసాగించాడు. అతడు తన ప్రయాణాన్ని నిలిపిన ప్రతిసారీ ఎవరో ఒకరు అతనికి సహాయం చేస్తుండేవారు. కాలినడకన అతడు ఓంకారేశ్వర్‌ చేరుకుని, అక్కడ ఆలయంలో రెండురోజులు ఉండిపోయాడు. ఆలయ పూజారి అతనికి ఆహారమిచ్చి, విశ్రాంతి తీసుకోవడానికి ఒక స్థలాన్ని చూపించాడు. 

అతని తదుపరి గమ్యం అజ్మీర్. మార్గంలో అతనికి తినడానికి చాలా ఖర్జూరాలు లభించాయి. ఒక నదీ ప్రవాహం దగ్గర అతను అలసటతో కూర్చుని బాబాను స్మరించుకున్నాడు. అకస్మాత్తుగా ఆకుపచ్చ కఫ్నీ ధరించిన ఒక ఫకీరు తన ముందు కనిపించి, "ఎక్కడికి వెళ్తున్నావు?" అని అడుగుతూ, "ఈ ప్రాంతంలో కొట్లాటలు, ఆందోళనలు జరుగుతున్నాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండమ"ని హెచ్చరించి పెద్ద మొత్తంలో డ్రై ఫ్రూట్స్ ఇచ్చాడు. తరువాత ఇద్దరూ కలిసి చిలిం త్రాగారు. ఇక తన ప్రయాణాన్ని ముందుకు సాగించాలని మాధవ్ నిర్ణయించుకున్నప్పుడు ఆ ఫకీరు భోపాల్‌కు రైలు టికెట్ కొని అతనికిచ్చాడు. తరువాత వీడ్కోలు చెప్పే సమయంలో ఆ ఫకీరు మాధవ్‌తో, “మార్గంలో ఎవరైనా నీకు తినడానికి చపాతీలు ఇస్తే సందేహించకుండా తిను. లేకపోతే వేపాకులు తిను” అని చెప్పాడు. ఆ తరువాత మాధవ్ మధ్యప్రదేశ్‌లోకి ప్రవేశించాడు.

మాధవ్ భోపాల్ నుండి ఆగ్రాకి కాలినడకన వెళ్తుండగా ఒకరోజు ఏకాదశి వచ్చింది. ఒకవైపు అలసట, మరోవైపు ఆకలితో ఇబ్బందిపడుతూ అతనొక రైల్వేస్టేషన్ లోపలికి వెళ్లి ఒక బెంచి మీద నిద్రపోయాడు. అంతలో ఒక భిల్లుడు (గిరిజన కులస్థుడు) అతని వద్దకు వచ్చి కొద్దిగా 'చట్టు' (జావ, అంబలి వంటిది) ఇచ్చాడు. అతను తక్కువ కులస్థుడన్న అనుమానంతో, ఆరోజు ఏకాదశి కావడం వల్ల తాను దానిని స్వీకరించలేనని చెప్పాడు మాధవ్. అప్పుడతను "ఇది వండని పిండి కావడంతో ఉపవాసం ఉన్నప్పుడు తినడానికి అనుకూలమైనద"ని హామీ ఇచ్చాడు. దాంతో మాధవ్ అది తిని తన ప్రయాణాన్ని కొనసాగించాడు.

తరువాత మాధవ్ ఆగ్రా చేరుకున్నాడు. అక్కడ అజ్మీర్‌ మార్గంలో తనని కలిసిన అదే ఫకీరు మళ్ళీ కలిసి, "బిడ్డా! ఇప్పుడు మధుర, బృందావన్ వెళ్ళు. కానీ మార్గంలో ఎవరితోనూ స్నేహం చేయవద్దు" అని చెప్పి మధురకు రైలు టికెట్ కొనిచ్చాడు. అలా సౌకర్యంగా మధుర చేరుకున్నాడు మాధవ్. అక్కడతను టీ ఎస్టేట్‌లో పనిచేయడానికి కార్మికులను చేర్చుకుంటున్న ఒక వ్యక్తిని కలిశాడు. అతను కూడా కూలీగా ఆ పనిలో చేరి, ఆకలి తీర్చుకోవడానికి తనవద్ద ఏమీలేవని చెప్పాడు. ఆ వ్యక్తి అతనికి డబ్బులిచ్చి, ఏదైనా హోటల్లో భోజనం చేయమని చెప్పాడు. అలా ఆ వ్యక్తి వరుసగా 8 రోజులు అతనికి డబ్బిచ్చాక హఠాత్తుగా మాధవ్‌కి ఫకీరు మాటలు గుర్తొచ్చి అక్కడినుండి కాన్పూర్ వైపు నడక సాగించాడు. దారిపొడుగునా అతనికి తినడానికి చపాతీలు లభించాయి. తరువాత మళ్ళీ అదే ఫకీరు మాధవ్‌ని కలిసి తినడానికి ‘చట్టు’ ఇచ్చి, లక్నో మీదుగా అయోధ్యకు వెళ్ళమని సలహా ఇచ్చాడు. అంతేకాదు, సౌకర్యవంతమైన ప్రయాణంకోసం అవసరమైన సమాచారమంతా ఇచ్చి, ఎక్కడ ఉండాలో, ఏమి తినాలో కూడా చెప్పాడు ఆ ఫకీరు. ఆవిధంగానే తన ప్రయాణాన్ని సాగించి చివరికి కాశీ చేరుకున్నాడు మాధవ్. అక్కడ మోహన్ పాండ్య అనే వ్యక్తి మాధవ్‌ని కలిసి తనింటికి తీసుకెళ్ళి 5 రోజులపాటు ఎంతో బాగా చూసుకున్నాడు. మాధవ్ కాశీలో సుప్రసిద్ధ విశ్వనాథుని ఆలయాన్ని, గంగానది వెంబడి ఉన్న అనేక దేవాలయాలను సందర్శించాడు. తరువాత గంగానదిలో స్నానమాచరించి, ఆ తరువాత  రైలులో ప్రయాగ వెళ్లి త్రివేణిసంగమంలో స్నానం చేశాడు.

అక్కడ అదే ఫకీరు మళ్ళీ మాధవ్‌ని కలిసి మన్మాడుకి టికెట్ కొనిచ్చి ఇంటికి వెళ్ళమని చెప్పాడు. మాధవ్ మన్మాడ్ చేరుకుని అక్కడినుండి నడుచుకుంటూ శిరిడీ వెళ్లి నేరుగా బాబా దర్శనానికి వెళ్ళాడు. బాబా అతనిని చూస్తూనే, "నీ ప్రయాణమంతా నేను నీతోనే ఉన్నాను. ఈ 3 నెలల్లో నేను నిన్ను చాలా సందర్భాలలో రక్షించాను” అంటూ స్వాగతించారు. ఆ మాటలు విని అతడు ఆనందపరవశుడై బాబా పాదాలకు నమస్కరించుకున్నాడు. బాబా చేసిన సహాయానికి కృతజ్ఞతగా అతడు తనతోపాటు తెచ్చుకున్న గంగాజలాన్ని ప్రతిరోజూ బాబా త్రాగే నీటిలో, స్నానం చేసే నీటిలో కలుపుతుండేవాడు.

మూలం: రామలింగస్వామి రచించిన ఆంబ్రోసియా ఇన్ శిరిడీ 
సాయి లీలామృతం.

4 comments:

  1. Om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya jaya sai🙏🙏🙏🙏

    ReplyDelete
  2. 🙏💐🙏నమో సాయినథాయ నమః🙏💐🙏

    ReplyDelete
  3. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo