సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

హరి వినాయక్ సాఠే - రెండవ భాగం


1936లో బి.వి.నరసింహస్వామిగారు చేసిన ఇంటర్వ్యూలో సాఠే పంచుకున్న మరికొన్ని అనుభవాలు:

సాఠేవాడా నిర్మాణం జరిగిన తరువాత నేను శిరిడీ వెళ్ళి కొంతకాలం అక్కడ నివసించాను. నేను బాబా వద్దకు వెళ్ళిన మొదట్లో, ఒక్కొక్కసారి వారిని పూజించడానికి అనుమతించేవారు, ఒక్కొక్కసారి నిరాకరించేవారు. అప్పుడు రోజూ బాబాకు పూజ చేసి, ఆరతివ్వడం జరుగుతుండేది. అయితే తర్వాత కొన్ని రోజులకుగానీ గురుపూర్ణిమ రోజున బాబాకు ప్రత్యేక పూజలు ఉత్సవంగా చేసుకోవడం మొదలవలేదు. ఒక గురుపూర్ణిమ రోజున బాబా మా మామగారిని (దాదాకేల్కర్) పిలిచి, "ఈరోజు గురుపూర్ణిమని నీకు తెలియదా? పూజాసామాగ్రిని తెచ్చి, గురుపూజ చేసుకో" అని ఆదేశించారు. మేమందరం ఆరోజు గురుపూజ చేసుకున్నాము. అప్పటినుండి గురుపూర్ణిమ రోజున భక్తులందరూ బాబాను పూజించడం మొదలయింది. అది ఈనాటికీ కొనసాగుతోంది.

మా మామగారి సోదరుడి కొడుకైన బాబు అంటే బాబాకు అమిత ప్రేమ. నేను యవలా మరియు కోపర్‌గాఁవ్‌ల రెవెన్యూ సర్వే విభాగంలో సహాయక సూపరింటెండెంటుగా పని చేస్తున్నపుడు నా అసిస్టెంట్ లిమాయే వద్ద బాబు సర్వేయరుగా ఉద్యోగం చేస్తుండేవాడు. అతడు తన ఉద్యోగంపై శ్రద్ధ పెట్టకుండా శిరిడీ వెళ్ళి బాబా సేవ చేసుకుంటూ ఉండేవాడు. బాబు ఉద్యోగాన్ని నిర్లక్ష్యం చేసి తరచూ శిరిడీ వెళ్తున్నాడని లిమాయే నాకు ఫిర్యాదు చేశాడు. నేను ఈ విషయాన్ని మా మామగారికి చెప్తే, “ఏం చేద్దాం? అతను బాబా ఆజ్ఞానుసారం నడుచుకుంటున్నాడు” అన్నారు. బాబుకు త్వరలో ఏం జరగబోతుందో తెలిసిన బాబా "ఉద్యోగం పోతేపోనీ, వాడిని నా సేవ చేసుకోనివ్వండి" అని అన్నారు. అందువల్ల బాబును అతని ఇష్టప్రకారమే చేయనివ్వసాగాడు లిమాయే. బాబు ఎల్లప్పుడూ బాబా చెంతనే ఉంటూ చేతనైనంత సేవ చేసుకుంటుండేవాడు. అందుబాటులో ఉన్నప్పుడల్లా బాబా అతనికి చక్కని రుచికరమైన పదార్థాలు ఇస్తుండేవారు. బాబు తనకిష్టమైన మామిడిపండ్లు (1910 నుండి భక్తులు బాబాకు మామిడిపండ్లు ఎక్కువగా సమర్పించేవారు) ఎక్కువగా తింటుండేవాడు. 1910లో అతని చివరిరోజులు సమీపించాయి. ఒకరోజు బాబా మా మామగారితో, "బాబు విషయంలో జాగ్రత్త తీసుకో! (బాబు కడే లక్ష్య రేవా)" అని హెచ్చరించారు. తరువాత కొద్దిరోజులకు బాబుకు తీవ్రమైన జ్వరంవచ్చి, మృత్యువుకు చేరువయ్యాడు. అప్పుడు బాబా మా మామగారితో "అతనింకా బ్రతికే ఉన్నాడా?" (అరేతో ఆహే కాయ్?) అన్నారు. కొన్నిరోజుల తరువాత బాబు 22 సంవత్సరాల వయస్సులో తుదిశ్వాస విడిచాడు.

బాబా తమ బిడ్డలు తమ కనుసన్నల్లో ఉన్నా, లేక వేరెక్కడ ఉన్నా వారి చర్యలను జాగరూకతతో గమనిస్తుంటారు. ఒకసారి నేను కోపావేశానికి లోనుకాకుండా, ఎటువంటి క్రూరచర్యలకు పాల్పడకుండా బాబా కాపాడారు. మా మామగారు శిరిడీ సమీపంలో 20 ఎకరాల వ్యవసాయ భూమిని కొనమని సలహా ఇచ్చారు. నేను ఆయనకు 1200 రూపాయలు పంపించాను. దానితో ఆయన ఆ 20 ఎకరాల భూమిని కొన్నాడు. ఒకరోజు నేను శిరిడీలో ఉన్నప్పుడు ఆ భూమిని చూడాలని అనుకున్నాను. కానీ మా మామగారు నాతో కలిసి రాకుండా ఏవేవో సాకులు చెబుతూ వాయిదా వేస్తూ వచ్చారు. బాబు చనిపోవడంతో, బాబు భార్య వాళ్ళతోనే ఉంది. ఆమెకు ఈ పొలం విషయం తెలిస్తే దానిలో భాగం అడుగుతుందని ఆయన భయం. కానీ నేను ఆ భూమిని చూడాలనే పట్టువీడలేదు. ఒకరోజు భూమిని చూడాలని నిర్ణయించుకుని తాత్యాపాటిల్ దగ్గరనుండి బండిని తెప్పించి, నా భార్యను నాతో రమ్మన్నాను. ఆమె మొదట వస్తానని చెప్పింది కానీ, చివరి నిమిషంలో తన తండ్రి మాటలకు తలొగ్గి రానని చెప్పింది. ఆమె నా మాట కాదన్నదన్న కోపంతో నేను బండివాని వద్ద నుండి కొరడా లాక్కొని, ఆమెను కొట్టబోయాను. హఠాత్తుగా మేఘుడు పరుగెత్తుకుంటూ వాడాకు వచ్చి, "బాబా మిమ్మల్ని వెంటనే మసీదుకు రమ్మంటున్నార"ని చెప్పాడు. నేను వెంటనే మశీదుకు వెళ్ళాను. బాబా నన్ను చూస్తూనే, “ఏంటి విషయం? ఏమి జరిగింది?” అని అడిగారు. అంతేకాదు, నా భార్య, మామగారు ఎందుకలా చేయాల్సి వచ్చిందో నాకు అర్థమయ్యేలా “నీ పొలం అక్కడే ఉంటుంది. వెళ్లి చూడవలసిన అవసరమేముంది?” అని మందలించారు. ఆయనకన్నీ తెలుసని గ్రహించి నా అనవసర కోపానికి, తొందరపాటుకు సిగ్గుపడ్డాను. నా ప్రవర్తనను, శ్రేయస్సును బాబా ఎంతలా గమనిస్తున్నారో!

ఒకసారి నేను శిరిడీలో ఉన్నప్పుడు కుతూహలం కొద్దీ మొదటిసారిగా ఒక భక్తురాలి ఇంటికి వెళ్ళాలని అనుకున్నాను. అక్కడికి వెళ్లేముందు బాబా నాతో, “నువ్వు ఫలానా చోటుకి వెళ్ళావా?” అని అడిగారు. అక్కడి ప్రదేశాల గురించి నాకు అంతగా తెలియనందున బాబా అడిగిన ప్రశ్నలో మర్మమేమిటో నాకు అర్థంకాక మౌనంగా ఉండిపోయాను. బాబా కూడా ఇంకేమీ మాట్లాడలేదు. తరువాత నేను ఆ స్త్రీ ఇంటికి వెళ్లి ఆమెతో మాట్లాడుతుండగా చెడు ఆలోచనలు నా మనస్సుపై దాడిచేయడం మొదలుపెట్టాయి. అంతలో అకస్మాత్తుగా ఆ ఇంటి గుమ్మం వద్ద బాబా ప్రత్యక్షమై, మూసి ఉన్న తలుపులను తోసి, "ఎంత గొప్ప కార్యానికి పూనుకోబోతున్నావు?” అనే అర్థం వచ్చే రీతిలో ఏవో సైగలు చేసి అంతర్థానమయ్యారు. ఆ చెడు ఆలోచనలు నా మనస్సులో స్థిరపడి వాటిని ఆచరణలో పెట్టకముందే బాబా సమయానికి నన్ను హెచ్చరించారు. నా తప్పు తెలుసుకుని వెంటనే అక్కడినుండి వెనుతిరిగి వచ్చేసాను. తిరిగి ఆ ఛాయలకు వెళ్ళలేదు. తరువాత నేను వెళ్లిన చోటుకు స్థానికంగా ఉన్న పేరు, బాబా ఆరోజు ప్రస్తావించిన పేరు ఒకటేనని తెలిసి ఆశ్చర్యపోయాను. ఇలా బాబా తరచూ నన్ను ఆడంబరాలకు, గర్వానికి, చెడుకు సంబంధించిన ఆలోచనలకు, చర్యలకు దూరంగా ఉంచడం ద్వారా ఆధ్యాత్మికంగా కూడా సహాయం చేశారు.

నా భార్యతో, మామగారితో నేను ఎలా మెలగాలో అన్న విషయంలో బాబా నాకు చేసిన సూచనలు మీకు ముందే చెప్పాను. 

నా కుటుంబ వ్యవహారంలో బాబా ఎంత శ్రద్ధ కనబరిచేవారో తెలియజేసే మరో సంఘటన వివరిస్తాను. నేను రిటైరైన తరువాత కొంతకాలానికి నా ఆర్థిక పరిస్థితులు క్షీణించసాగాయి. అలాంటి ఒక సమయంలో నేను నా భార్య నగ ఒకటి అమ్మాను. అప్పుడు, "ఆ తెలివితక్కువ సాహెబ్ నా కూతురి నగను ఎందుకమ్మాడు?” అని బాబా మా మామగారితో అన్నారు.

ఒకసారి బాబా నా స్వభావం గురించి చెబుతూ, “సాహెబ్ కల్లాకపటంలేని మనిషి” అన్నారు. ఆయన ఇతర భక్తులను కొట్టినప్పటికీ, తిట్టినప్పటికీ నన్నెప్పుడూ కొట్టలేదు, తిట్టలేదు. ఒకసారి మాత్రం కొడతానని నన్ను బెదిరించారు. దానికి కారణం నేను చేసిన పొరపాటేనని నాకు తెలుసు. ఆ సమయంలో నాకు నా మామగారికి మధ్య ఏర్పడిన మనస్పర్థల కారణంగా నేను శిరిడీలో వేరుగా ఉంటున్నాను. నా బసలో ధనుర్మాస వేడుకలను జరుపదలచి అందరినీ ఆహ్వానించాను కానీ, నా మామగారిని ఆహ్వానించలేదు. నేను బాబాను ఆహ్వానించడానికి మసీదుకు వెళ్ళాను. అప్పుడు బాబా, "ఆ కర్రనిలా తీసుకురా” అని ఒక భక్తుణ్ణి ఆదేశించారు. నేను మౌనంగా నిలబడిపోయాను. వెంటనే బాబా మనస్థితి మారి, “సరేలే! నేను వస్తాను” అన్నారు. ఆరోజు నేను చేసిన మరో తప్పు కూడా వారి కోపానికి కారణం. ఆరోజు ఉదయం నేనొక మార్వాడీకి సంబంధించిన తగాదాలలో అనవసరంగా తలదూర్చాను. అది బాబాకు నచ్చలేదు.

ఒకసారి నేను, "బాబా చేతిలో దెబ్బలు తిననివాడిని నేనొక్కడినే" అని ప్రగల్భాలు పలికాను. ఆ విషయాన్ని మాధవరావు దేశ్‌పాండే నా సమక్షంలోనే బాబాకు తెలియజేసి, దానికి కారణమేమిటని అడిగాడు. అందుకు బాబా, "నేనెందుకు అతన్ని కొట్టాలి? అతన్ని కొట్టడానికి అతని మామ ఉన్నాడు" అన్నారు. నా మామ తరచూ మితిమీరిన కోరికలు, డబ్బులు అడుగుతూ వేధించడాన్నే బాబా కొట్టడంగా అభివర్ణించారు.

బాబా నన్నెప్పుడూ 'హరిబా' మొదలైన పేర్లతో పిలిచేవారు కాదు. వారు ఎప్పుడూ నన్ను 'సాహెబ్' అనే పిలిచేవారు. నేను, మరికొందరు భక్తులు బాబా చెంతనుండగా - దేవుని తత్త్వం గురించి సాధనా చతుష్టయం , వివేక వైరాగ్యాలు, సమాధి స్థితి, ముముక్షుత్వం, బ్రహ్మము, సచ్చిదానందము మొదలైనవాటి గురించి బాబా సుదీర్ఘంగా ప్రసంగించినట్లు సంత్ కథామృత్ గ్రంథంలో వ్రాసి ఉంది. అది సత్యదూరం. బాబా నా దగ్గర ఇలాంటి విషయాల గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. ఇతరుల దగ్గర మాట్లాడారో లేదో నేనెరుగను. తరువాత భక్తలీలామృతం గ్రంథంలోని 31వ అధ్యాయంలో (219-236) నా వివాహాన్ని గూర్చి వ్రాయబడిన విషయం వాస్తవం కాదు. దానిని నన్ను సంప్రదించకుండానే వ్రాసారు. వ్రాసిన తరువాత కూడా నాకు చూపించలేదు.

ఐహిక విషయాలలోగానీ, ఆధ్యాత్మిక విషయాలలోగానీ బాబాను సంప్రదించనిదే ఏ పనీ చేసేవాడిని కాదు. మా మామగారి ద్వారాగానీ లేక మరెవరి ద్వారానైనాగానీ వారి అనుమతి పొందేవాడిని. బాబా ఎవ్వరికీ ఏదీ ఉపదేశించినట్లు నేనెరుగను. అందువల్ల ఉపదేశం కోసం నేనెప్పుడూ వారి నాశ్రయించలేదు. కానీ ఎంతోమంది ఎన్నో సందర్భాలలో ఉపదేశిస్తామని నన్ను పిలిచేవారు. ఉదాహరణకు 1915 లేక 1917లో ఉపాసనీబాబా ఖరగ్ పూర్, మీరజ్ యాత్రలు ముగించుకుని శిరిడీ వచ్చిన తరువాత పంచదశిలోని విషయాలను బోధపరుస్తానని, తమ దగ్గరికి రమ్మని ఆహ్వానించారు. ఆ సమయంలో ఖరగ్ పూర్, నాగపూర్ నుండి భక్తులు వచ్చి వారి దగ్గర ఉపదేశం తీసుకుని వెళ్తుండేవారు. నేను కూడా వారివద్ద ఉపదేశం తీసుకోవాలా వద్దా అన్న సందిగ్ధంలో పడ్డాను. సంగోలాలో 'అతాబాయి' అను మహాత్మురాలు ఉండేది. ఆమె నా మొదటి భార్యకి ఉపదేశం ఇచ్చింది. ఉపదేశం కోసం ఆమె వద్దకు వెళ్లాలా అన్న ఆలోచన కూడా నాకు వచ్చింది. మోరేగాఁవ్‌లో శ్రీవినాయక్ పాఠక్ మహరాజ్ అనే గణపతి ఉపాసకులు ఉండేవారు. ఆయన కూడా నాకు ఉపదేశమిస్తామని ఆహ్వానించారు. ఈ మూడు సందర్భాలలోనూ నేను సాయిబాబా అనుమతి కోరగా వారు నిరాకరించారు. (మొదటిసారి నేనే స్వయంగా బాబాను అడిగాను. తరువాత రెండుసార్లు మా మామగారి చేత అడిగించాను.) అయితే బాబా నాకు ప్రత్యేకించి ఏదీ ఉపదేశించకపోయినా నేను అనన్యచింతనతో వారి యందు దృష్టి నిలపాలని వారి ఉద్దేశ్యం. తమ అపారమైన మహిమతో నా ప్రాపంచిక, ఆధ్యాత్మిక అవసరాలు తీర్చేందుకు వారు సదా సంసిద్ధులై ఉండేవారు.

బాబాను శివునిగా భావించి ఒక శివరాత్రినాడు అర్థరాత్రి సమయంలో వారిని పూజించేందుకు అనుమతించమని బాబాను కోరాను. కానీ వారు నిరాకరించారు. ఆరోజు శివాలయాలన్నింటిలో అర్థరాత్రి పూజలు నిర్వహిస్తారు. అదేవిధంగా బాబాను పూజించాలని నేనూ, మేఘుడు అనుకున్నాము. దాంతో చందనం, బిల్వపత్రాలు తీసుకుని వెళ్లి అర్థరాత్రి రహస్యంగా మసీదు మెట్ల వద్ద పూజ చేద్దామని తలచాము. అనుకున్నట్లుగానే ఆ రాత్రి మేము మశీదు వద్దకు వెళ్ళాము. మేము రావడం గమనించిన తాత్యా లోపలినుంచే మమ్మల్ని వెళ్ళిపొమ్మని చేతులతో సైగ చేశాడు. బాబా నిద్రిస్తున్నట్లు కనిపించడంతో మేము ధైర్యంగా మసీదు మెట్లపై చందనం పూసి, బిల్వపత్రాలు వేశాము. వెంటనే బాబా మేల్కొని ఎవరినీ ఉద్దేశించినట్లు కాకున్నా పెద్దగా కప్పులెగిరిపోయేట్టు తిట్టడం ప్రారంభించారు. వారి అరుపులకు తిట్లకు గ్రామస్థులందరూ మేల్కొని మసీదు చేరారు. బాబా నిరాకరించిన తరువాత కూడా రహస్యంగా పూజను నిర్వహించి ఎవరికీ దక్కని పుణ్యం పొందేందుకు ప్రయత్నం చేయడం తప్పని గ్రామస్థులు మమ్మల్ని నిందించారు.

1916 ప్రాంతంలో అనుకుంటాను, ఉద్యోగరీత్యా పూణే సమీపంలోనున్న కోత్రుడ్ అనే ప్రదేశానికి వెళ్ళాను. నా వసతి కొరకు మంగులు (కడజాతివారు) పవిత్రమైన ఔదుంబర వృక్షాన్ని తాకి, ఆ చెట్టుకు తాళ్లు కట్టి, ఆ చెట్టు నీడన గుడారం వేశారు. నాకు ఆ విషయం తెలియదు. తరువాత నాకు దురదృష్టకర సంఘటనలెన్నో జరుగుతుంటే, ఎందుకు ఇలా జరుగుతున్నాయని విచారించినప్పుడు నాకు అసలు విషయం తెలిసింది. అప్పుడు నేను సహాయం చేయమని బాబాను ప్రార్థించాను. బాబా నా కలలో కన్పించి, మొదట ఒక బ్రాహ్మణుణ్ణి పిలిపించి ఆ చెట్టును శుద్ధి చేసేందుకు పూజలు జరిపించమన్నారు. తరువాత అక్కడ దత్త పాదుకలు ప్రతిష్టించమని చెప్పారు. నేను బాబా చెప్పినట్లుగానే చేసి, ఒక పూజారిని నియమించి, రోజుకు రెండుసార్లు పాదుకలను పూజించే ఏర్పాటు చేశాను.

ధోపేశ్వర్‌కు చెందిన కాకామహరాజ్

బాబా నేను ఇతరులనుండి ఉపదేశాన్ని తీసుకోవాలనుకోనప్పటికీ, సాధుసత్పురుషులను గౌరవించి ఆదరించాలని మాత్రం అభిలషించేవారు. అంతేకాదు, ఒక సత్పురుషుడు స్వయంగా మా ఇంటికి వచ్చేలా బాబా చేశారు. రాజాపూర్‌కు సమీపంలో ఉన్న ధోపేశ్వర్‌లో కాకామహరాజ్ అనే గొప్ప సిద్ధపురుషుడుండేవారు. వారొకసారి పూణే వచ్చి దేవ్లే అను వానింట్లో బస చేశారు. భక్తులెందరో వారిని దర్శించి తమ ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించమని కోరుతుండేవారు. నేను కూడా ఒకరోజు ఉదయాన వారిని దర్శించి మా ఇంటికి రమ్మని ఆహ్వానించాను. వారు రాలేమని చెప్పారు. ఆరోజు మధ్యాహ్నం నేను ఆఫీసులో ఉండగా కాకామహరాజ్ మా ఇంటికి వస్తారన్న కబురందుకుని ఆశ్చర్యపోయాను. నేను వెంటనే వారికి టాంగా పంపి, వారిని ఆహ్వానించడానికి ఇంటికి వెళ్ళాను. కాసేపటికి మహరాజ్ వచ్చారు. నేను వారిని, "ఉదయం రాలేనని చెప్పారు కదా, ఇంతలోనే మనస్సు మార్చుకోవడానికి కారణమేమిట"ని అడిగాను. వారు సాయిబాబా ఫోటోను చూపిస్తూ, “నేను ఇక్కడికి వచ్చి నిన్ను చూసేదాకా వారు నన్ను నిలువనీయలేదు” అన్నారు.

కాకామహరాజ్ తమ దేహత్యాగానికి ముందు నా అల్లుని సోదరుడు హరి గంగాధర్ జోషీ(ప్లీడరు, థానా)ని, అతని స్నేహితుడిని సాయిబాబాను దర్శించి పూజించమని ఆదేశించారు. మహరాజ్ నిర్యాణం చెందిన తరువాత వీరు శిరిడీ బయలుదేరారు. వీరు మసీదు చేరేటప్పటికి బాబా పట్టరాని కోపావేశాలతో ఊగిపోతున్నారు. కానీ వీళ్ళిద్దరూ బయట నిలబడి ఉండడం గమనించిన వెంటనే బాబా వాళ్ళను లోనికి తీసుకురమ్మన్నారు. వీళ్ళు వెళ్ళేటప్పటికి బాబా కాస్త శాంతించడంతో వీరిద్దరూ ఎటువంటి ఇబ్బందీ లేకుండా బాబా దర్శనం చేసుకున్నారు. ఆ తరువాత బాబా భిక్షకు బయలుదేరుతూ వీరితో, "ఆ వృద్ధుణ్ణి (కాకామహరాజ్) చంపి ఇక్కడికొచ్చారా?" అన్నారు. ఈ విధంగా బాబా తమ సర్వజ్ఞతను, కాకామహరాజ్ పట్ల తమ సోదరభావాన్ని తెలిపారు.

నా అల్లుడు జోషీకి బాబా చూపిన చమత్కారమొకటి ఉంది. అతను శిరిడీ వెళ్ళి బాబాను దర్శించి, ఊదీ అడిగాడు. అతనికి ఊదీ తరువాత ఇవ్వబడుతుందని బాబా చెప్పి పంపారు. తరువాత జోషీ రైలులో ప్రయాణిస్తున్నప్పుడు, ఒక తోటి ప్రయాణికుడు బాబా ఇచ్చిన ఊదీ అతనికి ఇచ్చాడు. (వామనరావుపటేల్ రచించిన “గురుస్మృతి" నుండి)

బాబా మరియు ఇతర మహాత్ములు - వారి అంతర్‌జ్ఞానం.

ఒకరోజు నేను శిరిడీలో ఉన్నపుడు, మామూలుగా లెండీకి వెళ్లే సమయమైనా బాబా బయలుదేరలేదు. ఆయన మసీదు గోడకానుకుని పడుకున్నారు. అలా ఒక గంట గడిచిన తరువాత మేము, 'మీరు లెండీకి వెళ్లే సమయం దాటింది. మీరెందుకు వెళ్ళలేద"ని బాబాను అడిగాము. అందుకు బాబా, "అరే! నా గజానన్ వెళ్ళిపోయాడు (అరే మాఝా గజానన్ గేలా)" అని జవాబిచ్చారు. ఒక భక్తుడు గజానన్ మహరాజ్ గారి కుశలమడుగుతూ శిరిడీ నుండి షేగాంకు జాబు వ్రాసాడు. బాబా చెప్పిన రోజే వారు సిద్ధిపొందినట్లు జవాబు వచ్చింది.

బాబా దూరదృష్టి

1917లో ఒకసారి బాబా "తిలక్ ఇక్కడికి వస్తున్నాడు" అని అన్నారు. ఏ కారణం చేతనూ లోకమాన్య బాలగంగాధర్ తిలక్ శిరిడీ వచ్చే అవకాశం లేదని, బహుశా బాబా చెప్పింది వామన్ మహరాజ్ తిలక్ గురించని నేను తలచాను. కానీ, త్వరలోనే అంటే, 19.5.1917 తారీఖున లోకమాన్య తిలక్ శిరిడీ వచ్చి బాబాను దర్శించాడు.

బాబా లీలలు

మామూలుగా బాబా తమ భక్తులకు చేసిన ఉపకారాలు, అద్భుతకార్యాలు భగవంతుడు చేసినట్లుగా చెప్పి ఆ గొప్పతనాన్ని భగవంతునికే ఆపాదిస్తారు. అది బాబా వినమ్రత కావచ్చు లేదా ఆయన పద్ధతి కావచ్చు. కానీ కొన్ని విషయాలలో మాత్రం తామే చేసినట్లుగా తెలియజేశారు. మొదటిది, నా పింఛను మంజూరు విషయంలో అధికారులపై ఒత్తిడి తెచ్చి నా పూర్తి పింఛను మంజూరు చేయిస్తానని చెప్పారు. రెండవది, దాజీ హరిలేలే జీతం పెంపు విషయంలో! నాశిక్‌లో లాండ్ రికార్డ్స్ ఇన్‌స్పెక్టరుగా పని చేసిన దాజీ హరిలేలే బాబా దర్శనార్థం శిరిడీ బయలుదేరాడు. మార్గంలో అతను కోపర్‌గాఁవ్‌లో ఆగి లైబ్రరీకెళ్ళి గెజిట్ చూశాడు. అందులో అతని జీతం 125 రూపాయల నుండి 150 రూపాయలకు పెరిగినట్లు ఉంది. తరువాత అతను శిరిడీ వచ్చి బాబాను దర్శించుకుని ఆయనకు నమస్కరించుకున్నాడు. బాబా అతనిని 15 రూపాయల దక్షిణ అడిగారు. అందుకతను తన వద్ద డబ్బు లేదని చెప్పాడు. బాబా "నిన్ననే నీకు 25 రూపాయలు ఇచ్చాను. వెళ్ళి డబ్బు తీసుకురా” అని ఆదేశించారు. లేలే వాడాకొచ్చి జరిగిన విషయమంతా నాకు చెప్పి 15 రూపాయలు అప్పు తీసుకుని బాబాకు సమర్పించాడు.

బాబా ఉవాచ

1. నేను పిల్లవానిగా ఉన్నప్పుడు శాలువాలు నేసేవాడిని. ఒకసారి నా తండ్రి నా పనితనానికి మెచ్చి నాకు 5 రూపాయలు బహుకరించారు.
2. నేనొకప్పుడు కోరమండల్ తీరంలో నివసిస్తూ ఉండేవాడిని.
3. అక్బర్ పాదుషా పసిబిడ్డగా ఉన్నప్పుడు అతనిని కాపాడాను. అతను నాపట్ల భయభక్తులతో ఉండేవాడు.
4. పైఠాన్‌కు చెందిన ఆ బ్రాహ్మణుణ్ణి (ఏకనాథ్ మహరాజ్) నేనెరుగుదును. అంతటి శ్రేష్ఠమైన బ్రాహ్మణులు ఈ రోజుల్లో కనిపించటం లేదు.
5. చాంద్‌భాయ్ పాటిల్ నా దగ్గరకొచ్చి "నా గుఱ్ఱాన్ని ఎక్కడికి తోలేశావు?" అనడిగాడు. నేను, “నన్నెందుకడుగుతావు? నీ గుఱ్ఱం ఆ కట్ట ప్రక్కనే మేస్తూ ఉంటుంది, వెళ్ళి చూడు" అన్నాను.

బాబా నోటిగుండా వెలువడిన మాటలు ఇంతమాత్రమే. ఆ మాటలకు నా ఊహాగానంతో కల్పన చేసి, కథలు అల్లి "సాయికథాకరండకా" అను గ్రంథాన్ని వ్రాసాను. దీనిని వ్రాసే ముందు బాబాకు చెప్పలేదు. వారి అనుమతి కూడా తీసుకోలేదు. బాబా చెప్పే విషయాలు చాలా క్లుప్తంగా ఉండేవి. వారు కథలు కూడా చెబుతూండేవారు. కానీ చాలాసార్లు కథలను అర్ధాంతరంగా ఆపేసేవారు.

శిరిడీకి వీడ్కోలు

బాబా సర్వరాజలాంఛనాలతో వైభవంగా మసీదు నుండి చావడికి వెళ్ళేటప్పుడు, నేను బాబా దర్బారు యొక్క రాజదండాన్ని (చిహ్నాన్ని) పట్టుకుని బాబా ముందు నడిచేవాడిని. అంతటి విశిష్టమైన సేవ నాకు లభించిందని చాలామందికి నాపై అసూయగా ఉండేది. వాళ్ళు, మరికొందరు గ్రామస్తులు కలిసి నానావలీని నాపై ఉసిగొల్పి, నన్ను బాధించి అవమానించడం ద్వారా శిరిడీ నుండి తరిమేయాలని కుట్రపన్నారు. ఒకసారి నేను రాజదండాన్ని పట్టుకుని బాబా ముందు నడుస్తున్నాను. హఠాత్తుగా నానావలీ నా మీద పడి ఒక గాజుపెంకుతో నా తల వెనుక భాగంలో గాయపరిచాడు. ఆత్మరక్షణార్థం నేను అతణ్ణి రోడ్డు ప్రక్కనే పడివున్న ఒక కట్టెల మోపుపై త్రోసి కదలకుండా అదిమిపట్టాను. అది చూసి బాబా "సాహెబ్! అట్లా చెయ్యొద్దు" అని కేక వేశారు. దాంతో శిరిడీలో గాలి నాకు ప్రతికూలంగా ఉందని గ్రహించి చాలా జాగ్రత్తగా మెలగడం మొదలెట్టాను. ఒకరోజు నేనొక పర్యటనకు వెళ్లాల్సి ఉన్నందున నిర్ణీత సమయానికన్నా ముందుగా మసీదుకు వెళ్లి బాబాకు నైవేద్యం సమర్పించాలనుకున్నాను. ఇంతలో మా మామగారు (దాదాకేల్కర్) పరుగు పరుగున వచ్చి, "మసీదుకు వెళ్ళవద్దు, అక్కడ మసీదు ద్వారం వద్ద నానావలీ ఒక గొడ్డలి చేతబట్టుకుని నిన్ను చంపే ఉద్దేశ్యంతో నిలబడి ఉన్నాడు" అని చెప్పాడు. అంతే, నేను బాబా వద్ద సెలవు కూడా తీసుకోకుండా శిరిడీ విడిచి వెళ్ళిపోయాను. నిజానికి బాబా నన్ను శిరిడీలో ఉంచదలచుకోలేదని అనిపించింది. బాబా నన్ను నానావలీ బారినుండి కాపాడలేకపోయారు కాబట్టి బాబాను విశ్వసించవద్దని నాకు కొంతమంది చెప్పారు. అప్పుడు నేను విఠలుని భక్తుడు, గాయక్‌వాడి ప్లీడరైన గంగాధరశాస్త్రి తన శత్రువుల బారి నుండి పారిపోయి విఠలుని గుడిలో తలదాచుకున్నప్పుడు అతని శత్రువులు విఠలుని ముందే అతనిని చంపివేసిన ఉదంతాన్ని వాళ్ళకు గుర్తుచేశాను. నేను శిరిడీ విడిచిపెట్టడం, పూణేలో స్థిరపడడం నా మంచి కోసమే జరిగింది. సాయిబాబా శిరిడీలో ఉన్నప్పుడు రక్షించినట్లే పూణేలో కూడా నన్ను సదా కాపాడుతున్నారు.

దక్షిణభిక్ష సంస్థ

డిసెంబరు 1915లో, నేను పూణేలో ఉన్నప్పుడు బాబా నుండి నాకొక ఆదేశం వచ్చింది. వారి ఆదేశం మేరకు 'దక్షిణ భిక్ష సంస్థ'ను ఏర్పాటు చేయడంలో నేను సహాయం చేశాను. నన్ను దానికి అధ్యక్షుడిని చేశారు. ఈ సంస్థ అధికార అంగంగా "సాయినాథ ప్రభ" అనే పత్రికను నడిపేవాళ్ళము. ఈ పత్రిక సంపాదకునిగా సుందరరావు నారాయణ్ వ్యవహరించాడు. మొదటిభాగంలో నీతివాక్యాలను, పత్రిక ఆశయాలను 'రామ్ గిర్' అను కలంపేరుతో రచించినది ఇతనే. ఇప్పుడతను ఎక్కడున్నాడో, ఏమయ్యాడో కూడా నాకు తెలియదు. పత్రికలో ప్రచురింపబడ్డ విషయాలు బాబాకు చదివి వినిపించడం గాని, ముద్రణకు ముందు వారి అనుమతి తీసుకోవడం గాని జరగలేదు. ఈ పత్రిక బహు స్వల్పకాలం మాత్రమే నడిచింది. ఈ పత్రిక కాపీలు కూడా లభ్యం కావడంలేదు. అందుబాటులో ఉన్న ఒకటి రెండు భాగాలలో 1915-1917, 1918లలో శిరిడీ సంస్థాన్ స్థితిగతులు వివరించబడి ఉన్నాయి.

దక్షిణ భిక్ష సంస్థ స్థాపించబడిన పదకొండు నెలలకు రాధాకృష్ణఆయీ మరణించింది. సాయి సంస్థాన్‌కు చెందిన వస్తువులన్నీ ఆమె అధీనంలో ఉండేవి. విల్లు రాయకుండా చనిపోయిన బ్రాహ్మణ వితంతువు అయినందున, ఆమెకు ఎవరూ వారసులు లేనందున పోలీసులు వచ్చి ఆమె అధీనంలో ఉన్న ఆస్తులన్నీ స్వాధీనం చేసుకున్నారు. మేము 'సభ' (ద.భి.స) పేరున కేసును దాఖలు చేసి, మహజర్లు కూడా సమర్పించి, కోపర్‌గాఁవ్ మేజిస్ట్రేటు నుండి ఉత్తర్వులు (MERI N2 1916) తెప్పించి, సంస్థాన్ ఆస్తులన్నింటిని సంస్థాన్ తరఫున 'సభ' (ద.భి.స) పరం చేశాము. కానీ ఆర్థిక వ్యవహారాలన్నీ నా అజమాయిషీలో ఉండడంతో నా మీద అందరికీ వ్యతిరేకత పెరిగి, నానావలీ ద్వారా నన్ను శిరిడీ నుండి తరిమివేసి ఆపై నాకు కోర్టుద్వారా నోటీసులు ఇవ్వడం దాకా వెళ్ళింది. తప్పుదారి పట్టిన కొందరు భక్తులు, దొంగిలించబడిన వెండి అలంకరణ వస్తువుల (సంస్థాన్ గుఱ్ఱానికి సంబంధించినవి) వంటి చిన్న విషయాన్ని అడ్డం పెట్టుకుని నాపై కేసు మోపి లాయరు ద్వారా 1918 జనవరిలో నాకు నోటీసు ఇప్పించారు. నేను బాబాను సంప్రదించాను. బాబా నన్ను జవాబు ఇవ్వమని, ఏ విధంగా జవాబు వ్రాయాలో కూడా చెప్పి నన్ను కాపాడతానని, కేసు విచారణకు రాకుండా చేస్తానని హామీ ఇచ్చారు. నేను బాబా చెప్పినట్లుగా జవాబు వ్రాసి పంపాను. బాబా చెప్పినట్లే జరిగింది. నామీద గానీ, 'సభ' (ద.భి.స) మీద గానీ ఎటువంటి విచారణా జరగలేదు.

ముందు భాగం కోసం బాబా పాదుకలు తాకండి. 

devotees experiences of saibaba by b.v. narasimha swamy.

3 comments:

  1. Om sai sri sai Jaya Jaya sai om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya jaya sai🙏🙏🙏🙏

    ReplyDelete
  2. Om sai
    Sri sai
    Jaya jaya sai🙏🙏🙏

    ReplyDelete
  3. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo