సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక - 329వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. బాబా మిరాకిల్ కాకపోతే ఏమిటి?
  2. అపారమైన సాయి కృప

బాబా మిరాకిల్ కాకపోతే ఏమిటి?

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తనకు ఇటీవల బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

ఓం సాయిరాం! ఈ బ్లాగ్ నిర్వహించే సాయిబంధువులు అందరికీ పేరుపేరునా నా నమస్కారములు. నేను సాయిభక్తురాలిని. ఎంత గొప్ప భక్తురాలిని అనే విషయం మాత్రం బాబానే చెప్పాలి. నాకు అన్న, తండ్రి, స్నేహితుడు, గురువు, దైవం అన్నీ బాబానే. నేను ఏ చిన్న విషయమైనా ఆయననే అడుగుతాను. నిరంతరం ఆయన మాకు తోడుగా ఉంటూ రక్షణనిస్తున్నారు. ఇటీవల పెద్ద విపత్తు నుండి బాబా మమ్మల్ని కాపాడారు. 30.01.2020 తారీఖున మావారికి గుండెకు బైపాస్ సర్జరీ జరిగింది. బాబా దయవల్ల ఆపరేషన్ బాగా జరిగింది. ఇప్పుడు మావారి ఆరోగ్యం కుదుటపడి నెమ్మదిగా కోలుకుంటున్నారు. బాబాకి ఇచ్చిన మాట ప్రకారం ఈ సర్జరీకి ముందు జరిగిన విషయాలను ఈ బ్లాగు ద్వారా సాటి సాయిబంధువులతో పంచుకుంటున్నాను.

మా అమ్మాయి ఒక ఫార్మసిస్ట్. మేము తన దగ్గరనే ఉంటాము. మా అబ్బాయిలు హైదరాబాదులో వుంటున్నారు. ఎప్పుడైనా వాళ్ళ దగ్గరికి వెళ్లినప్పుడు డాక్టరుకి చూపించుకోవటం, ఏవైనా సమస్యలుంటే మందులు వాడటం జరుగుతుండేది. అలాగే సుమారుగా నాలుగైదు నెలల క్రితం చెకప్‌కి వెళ్ళినప్పుడు మావారికి ఆంజియోగ్రామ్ చేయించుకొని రమ్మని డాక్టర్ చెప్పారు. "ఆంజియోగ్రామ్ చేయిస్తే ఏదో ఒకటి చెప్తారు, స్టెంట్లు వెయ్యాలంటారు. ఇప్పుడు నాకు 67 సంవత్సరాలు. మహా ఉంటే ఎన్ని సంవత్సరాలు వుంటాను? దేవుడు ఎంత ఆయుష్షు ఇస్తే అంతే కదా" అంటూ మావారు ఆంజియోగ్రామ్‌ చేయించుకోవడానికి అస్సలు ఒప్పుకునేవారు కాదు. "మందులు వాడితే సరిపోతుంది, ఎంతకాలం బ్రతికితే అంతకాలం బ్రతుకుతా" అంటూ మందులు మాత్రం క్రమంతప్పకుండా వేసుకునేవారు. అటువంటి పరిస్థితుల్లో నాకు బాబా తప్ప దిక్కెవరు? అందువలన అన్నీ ఆయనకే చెప్పుకునేదాన్ని. హార్టులో బ్లాకులు కరుగుతాయని ఎవరు ఎలాంటి చిట్కాలు, ఆయుర్వేద మందులు చెప్పినా వాటన్నిటినీ మావారి చేత త్రాగించేదాన్ని. వాటితో పాటు ఉదయాన్నే వేడినీళ్లలో తేనెతో పాటు బాబా ఊదీని కలిపి ఇస్తుండేదాన్ని. ఇవన్నీ చేస్తూ నిరంతరం బాబాతో, "మీరేమి చేస్తారో నాకు తెలియదు బాబా, మావారు ఆరోగ్యంగా ఉండేలా అనుగ్రహించండి" అని చెప్పుకుంటూండేదాన్ని. సమయం సందర్భం చూసుకొని అప్పుడప్పుడు మావారితో 'ఎక్కడో ఒక దగ్గర ముందు ఆంజియోగ్రామ్ చేయిస్తే కదా హార్టులో ప్రాబ్లెమ్ తెలిసేది' అని చెప్తూండేదాన్ని. కానీ ఎన్నిసార్లు చెప్పినా మావారు వినేవారుకాదు. అలాంటిది బాబా ఊదీ ప్రభావమో లేకుంటే మా ప్రార్థన విని బాబా మావారి మనసు మార్చారో తెలీదుగానీ ఒకరోజు రాత్రి మావారు నిద్ర లేచి నన్ను కూడా నిద్ర లేపి, "అమ్మాయి చెప్పింది కదా ప్రతి గురువారం వైజాగ్ నుండి డాక్టర్స్ ఇక్కడికి వస్తున్నారని. అక్కడికి వెళ్లి చూపించుకుంటాను, తర్వాత సంగతి తరువాత" అన్నారు. అప్పటికి గురువారం రెండు రోజులు వుంది. ఇదే బాబా మిరాకిల్.

23.01.2020, గురువారంనాడు హాస్పిటల్‌కి వెళ్ళాం. ఈసీజీ, 2డి ఎకో చేసి, "రిపోర్టులు అసహజంగా ఉన్నాయి. వెంటనే ఆంజియోగ్రామ్ చేయాలి, రేపు వైజాగ్ వచ్చేయండి" అన్నారు డాక్టర్. మావారు దానికి కూడా ఒప్పుకోలేదు. మా అమ్మాయి గట్టిగా చెప్పి ఒప్పించి మరుసటిరోజు ఉదయాన్నే మమ్మల్ని వైజాగ్ తీసుకెళ్ళింది. అక్కడ మావారికి ఆంజియోగ్రామ్ చేశారు. రిపోర్టు చూసి అందరం నిర్ఘాంతపోయాము. డాక్టర్లు, "ఈయనకి హార్ట్ 40% మాత్రమే పని చేస్తోంది. 5 బ్లాక్స్ వున్నాయి, బైపాస్ సర్జరీ చేయాలి" అని చెప్పి, "ఈయన ఎప్పుడూ తనకి గుండెనొప్పి అని చెప్పలేదా?" అని అడిగారు. "అప్పుడప్పుడు కుడివైపున మంటగా ఉంది అనేవారు. ఎసిడిటీ అనుకొని pantap టాబ్లెట్ వేసుకునేవారు. కొద్ది నిమిషాల్లో సర్దుకునేది" అని చెప్పాను. "ఆ మంటే గుండెనొప్పి" అని డాక్టర్స్ చెప్పేసరికి నేను నిర్ఘాంతపోయాను. సరైన సమయానికి మమ్మల్ని హాస్పిటల్‌కి వెళ్లేలా చేసినందుకు బాబాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాను. ఇది బాబా మిరాకిల్ కాకపోతే ఏమిటి? అంతటి ఆందోళనకరమైన పరిస్థితిలో ఏ అర్థరాత్రో మేము కంగారుపడి వెళ్లకుండా, మాములుగా చెకప్ చేయించుకోటానికి వెళ్లినట్లు వెళ్లేలా చేశారు బాబా.

ఆ విషయాన్నీ మావారికి చెప్పకూడదని మేమనుకుంటే, అప్పటికే డాక్టర్లు బైపాస్ సర్జరీ చేయాలని ఆయనతో చెప్పటం, ఆయన 'స్టెంట్స్ వేస్తే సరిపోదా?' అని అడగటం అన్నీ జరిగిపోయాయి. ఇక ఆరోజు రాత్రికి డిశ్చార్జ్ చేయమని‌, పిల్లలతో మాట్లాడి మళ్ళీ వస్తామని చెప్పాము. "ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సర్జరీ చేస్తే మంచిది" అని చెప్పి డిశ్చార్జ్ చేశారు. ఇంటికి వచ్చాక ఫోన్లో ఆపరేషన్ ఎక్కడ చేయించాలనే విషయం గురించి అందరం చర్చించుకున్నాము. తరువాత 29.01.2020న వైజాగ్ వెళ్లి మావారిని ఆసుపత్రిలో చేర్చాము. 30.01.2020న ఆపరేషన్ నాలుగు గంటల పాటు చేశారు. బాబా అనుగ్రహంతో ఆపరేషన్ విజయవంతమైంది

బాబా తమ కృపావర్షాన్ని ప్రతిరోజూ, ప్రతి చిన్న విషయంలోనూ మాపై కురిపిస్తూనే వున్నారు. ముందు గురువారం డాక్టరుకి చూపించటం, తరువాతి గురువారం ఆపరేషన్ జరిగిపోవటం అంతా చకచకా జరిగిపోయాయి. అసలు టెస్టులే వద్దన్న మనిషి ఇంత పెద్ద ఆపరేషన్ ధైర్యంగా చేయించుకోవడం అనుక్షణం బాబా దగ్గరుండి నడిపించింది కాదా? మేమింకా బాబా మిరాకిల్ నుండి బైటకి రాలేదు. అనుక్షణం బాబా మాకు తోడుగా ఉండి మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. నేను ఏది అడిగితే దానిని అనుగ్రహిస్తున్నారు బాబా. ఆయన నాకు ఎన్నో అనుభవాలను ప్రసాదించారు. నా ఈ జీవితంలో బాబా లేని క్షణం ఏదీ లేదు. నాకు ఏ సమస్య వచ్చినా బాబానే శరణంటాను. "బాబా! మీకు తెలుసు నాకు ఏమి కావాలో, దానిని అనుగ్రహించండి బాబా. మావారు  తొందరగా కోలుకునేలా ఆశీర్వదించండి. సాయిబంధువులందరికీ మీ ఆశీస్సులను ప్రసాదించండి బాబా".

అపారమైన సాయి కృప

హైదరాబాదు నుండి సాయిభక్తురాలు చందన తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

అందరికీ నమస్కారం. నేను ఎన్నో సందర్భాలలో బాబా ఆశీస్సులు పొందాను. ఇటీవల జరిగిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. మేము హైదరాబాదులోని ఒక అపార్ట్‌మెంటులో అద్దెకు ఉంటుండేవాళ్ళం. ఒకరోజు హఠాత్తుగా మా ఇంటి యజమాని నాన్నకు ఫోన్ చేసి, తాము ముంబాయి నుండి హైదరాబాదుకు మారాలని అనుకుంటున్నామని, ఆ కారణంగా ఫ్లాట్ ఖాళీ చేయమని దాదాపు 3 నెలల సమయం ఇచ్చారు. మేము ఒక్కసారిగా షాక్ అయ్యాము. తరువాత ఇల్లు వెతకడం ప్రారంభించాము. అది విద్యాసంవత్సరం ముగిసే సమయం కావడంతో ఎవరూ ఉన్న ఇళ్లను ఖాళీ చేయరు. అందువలన ఇల్లు దొరకడం చాలా కష్టమైంది. వెతికి వెతికి మాకు విసుగు వచ్చింది. ఆ సమయంలో ఒకరోజు ఉదయాన నేను, "బాబా! నేను చాలా అలసిపోయాను, త్వరలో అద్దెకు ఒక క్రొత్త ఇంటిని మాకు ఇవ్వండి" అని బాబాను ప్రార్థించి, క్వశ్చన్&ఆన్సర్ వెబ్‌సైట్‌లో చూశాను. అప్పుడు సమాధానంగా, "త్వరలో మీరు మీ క్రొత్త ఇంట్లోకి వెళతారు. శుభకార్యక్రమం జరుగుతుంది" అని వచ్చింది. నేను క్రొత్త అద్దింట్లోకి వెళ్తామని అనుకున్నాను. దాదాపు ఒక వారం తరువాత మా నాన్న, "ఈ అద్దె ఇండ్లతో విసిగిపోయాము. మనం క్రొత్త ఇంటిని కొనుక్కుందాం" అని అన్నారు. అయితే క్రొత్త ఇల్లు కొనేందుకు తగినంత డబ్బు మావద్ద లేదు. తరువాత ఒక వారంలోనే బాబా ఆశీస్సులతో డబ్బు ఏర్పాటు అయ్యి, క్రొత్త ఇంటిని తీసుకున్నాము. క్రొత్తింటి గృహప్రవేశం చాలా బాగా జరిగింది. అప్పుడు నాకు బాబా మాటలు గుర్తుకు వచ్చాయి. "బాబా! చాలా చాలా ధన్యవాదాలు. దయచేసి నేను పనిచేసే చోట నాకు సహాయం చెయ్యండి. నేను అక్కడ ఇరుక్కుపోయాను. దయచేసి అక్కడినుండి మరొక సంస్థలోకి మారేలా నన్ను ఆశీర్వదించండి".

source:http://www.shirdisaibabaexperiences.org/2019/11/shirdi-sai-baba-miracles-part-2544.html?m=0


3 comments:

  1. Om sai ram! 🙏🌹🌹🌹🌺🌺🌺🌺🌺

    ReplyDelete
  2. ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo