సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

శాంతారాం బల్వంత్ నాచ్నే- రెండవ భాగం


1914వ సంవత్సరంలో నాచ్నే శిరిడీలో డాక్టర్ సామంత్‌ను కలిశాడు. ఇద్దరూ సాయిభక్తులు కావడంతో ఒకరి సాహచర్యాన్ని మరొకరు చాలా ఆనందించారు. అప్పట్లో నాచ్నే కుర్లాలో ఉద్యోగం చేస్తూ కుటుంబంతో పాటు అక్కడే నివాసముండేవాడు. కుటుంబం కుర్లాలో ఉన్నంతవరకు నాచ్నే తన కుటుంబసభ్యులతో కలిసి క్రమంతప్పకుండా తరచూ డాక్టర్ సామంత్ ఇంటికి వెళ్తుండేవాడు. అందరూ డాక్టర్ సామంత్‌ని 'డాక్టర్ భావూ' అని పిలిచేవారు. అతను గణేశుని గొప్ప భక్తుడు. అతనింట్లో గణేశుని ఫోటో ఒకటి, శ్రీసాయిబాబా ఫోటో ఒకటి ఉండేవి. అతను ప్రతి గురువారం తనింటిలో పూజలు నిర్వహిస్తుండేవాడు. నాచ్నే కుటుంబసభ్యులంతా ఆరోజున అతనింటికి వెళ్లి సాయిబాబా పూజలో పాల్గొని ఎంతో ఆనందిస్తూండేవారు. భావూ నాచ్నేను ఎంతో గౌరవించేవాడు. డాక్టర్ అన్నాసాహెబ్ గవాంకర్, శ్రీమాధవరావు దేశ్‌పాండే, దేవి, డాక్టర్ భావూ, నాచ్నే కలిసి కూర్చుని ముచ్చటించుకుంటూ ఆనందకరమైన సమయాన్ని గడిపేవారు.

ఒకసారి నాచ్నేతో పాటు పక్కింట్లో నివసించే శ్రీఆనందరావు కృష్ణచౌబాల్ తన తల్లిని తీసుకుని శిరిడీ వచ్చాడు. చౌబాల్ తల్లి చాలా సమర్థురాలు, తెలివైనది. ఆమె బాబాకు ఎనిమిది అణాలు (50 పైసలు) దక్షిణ ఇద్దామని అనుకొని తన కుమారుడితో ఒక రూపాయికి చిల్లర తెప్పించింది. అతను 50 పైసల నాణెమొకటి, 25 పైసల నాణేలు రెండు తీసుకొచ్చి ఆమెకి ఇచ్చాడు. అయితే ఆమె బాబా దగ్గరకు వెళ్ళినప్పుడు ఒక్క పావలా కాసు మాత్రం బాబాకిచ్చి వెనక్కు మళ్ళింది. బాబా ఆమెను వెనక్కి పిలిచి, "మిగతా ఆ పావలా ఇవ్వకుండా ఎందుకమ్మా ఈ పేద బ్రాహ్మణుణ్ణి  మోసగిస్తావ్?” అని అన్నారు. ఆమె సిగ్గుపడి మిగతా దక్షిణ కూడా సమర్పించింది.

1915, మార్చి 31న నాచ్నేపట్ల బాబాకున్న దయ, ఆయన రక్షణ తెలియజేసే మరొక సంఘటన జరిగింది. ఆరోజు రాత్రి నాచ్నే, శాంతారామ్ మోరేశ్వర్ ఫన్సే, మరికొంతమంది రాన్‌షెట్ కనుమ సమీపంలో ఉన్న దట్టమైన అటవీప్రాంతంలో ఎడ్లబండిలో ప్రయాణిస్తున్నారు. అది పులులు సంచరించే ప్రాంతమని అంటారు. ఒకచోటుకు రాగానే అకస్మాత్తుగా ఎద్దులు భయంతో వెనుకకు నడవసాగాయి. అదృష్టవశాత్తూ ఆ ఇరుకైన రహదారిలో అవి బండిని ప్రక్కకి లాగలేదు. ఒకవేళ అలా జరిగి ఉంటే బండితో సహా అందరూ అగాధమైన లోయలో పడి చనిపోయేవారు. అంతలో ఎదురుగా పొంచి ఉన్న ప్రమాదాన్ని శాంతారామ్ చూపించాడు. వాళ్ళ బండి ఎదురుగా కాస్త దూరంలో రోడ్డు మీద ఒక పులి పడుకుని వాళ్ళ వైపు చూస్తోంది. చీకటిలో దాని కళ్ళు మెరుస్తూ ఉన్నాయి. అప్పుడు వాళ్ళకి ఎద్దులు ఎందుకు వెనక్కి వెళ్తున్నాయో అర్థమైంది. ఫన్సే బండి లోయలో పడిపోకుండా కాపాడాలని అనుకున్నాడు. అందువల్ల అతడు నెమ్మదిగా కిందకి దిగి బండి చక్రాలకు అడ్డంగా పెద్ద రాయిగానీ, కర్రగానీ పెట్టాలన్న తలంపుతో ఎద్దుల పగ్గాలు పట్టుకోమని నాచ్నేతో చెప్పాడు. నాచ్నే పగ్గాలు పట్టుకుని, "సాయిబాబా! పరుగున వచ్చి మమ్మల్ని కాపాడండి" అని ఎలుగెత్తి అరిచాడు. బండిలోని మిగతావాళ్ళు కూడా అలాగే సాయిబాబాను ప్రార్థిస్తూ పెద్దగా అరిచారు. ఆ శబ్దానికి ఆ పులి భయపడి బండి ప్రక్కనుండి పారిపోయింది. ఆవిధంగా సాయిబాబా వారందరినీ పులి బారినుండి కాపాడారు. బాబాపట్ల వారికున్న విశ్వాసమే వారిని ఆ ప్రమాదం నుండి రక్షించింది.

1915లో మరోసారి నాచ్నే శిరిడీ వెళ్తున్నప్పుడు అతని స్నేహితుడు సామంత్ అతనికి ఒక కొబ్బరికాయ, రెండు అణాలు ఇచ్చి, ఆ రెండు అణాలతో కలకండ కొని బాబాకు సమర్పించమని చెప్పాడు. నాచ్నే శిరిడీ వెళ్లి సాయిబాబా దర్శనం చేసుకుని, ఆయనకు కొబ్బరికాయ సమర్పించాడు. కానీ, రెండణాల విషయం పూర్తిగా మరచిపోయాడు. తరువాత అతను ఇంటికి తిరిగి వెళ్లడానికి బాబా అనుమతి కోరినప్పుడు, "అలాగే, చితలీ మీదుగా వెళ్ళు. కానీ ఆ పేద బ్రాహ్మణుడిచ్చిన రెండు అణాలు నీ దగ్గరే ఎందుకు పెట్టుకున్నావు?" అని అడిగారు బాబా. వెంటనే సామంత్ ఇచ్చిన రెండు అణాల సంగతి అతనికి గుర్తుకొచ్చి వాటిని బాబాకు సమర్పించాడు. అప్పుడు బాబా, "ఏ పనైనా చేస్తానని ఒప్పుకుంటే దాన్ని బాధ్యతాయుతంగా చేయి, లేదంటే ఒప్పుకోకు" అని అన్నారు. ఇది ప్రతి ఒక్కరి జీవితంలోని అన్ని అంశాలకు వర్తించే చాలా విలువైన సూచన.

ఒకసారి నాచ్నే స్నేహితుడైన శంకరరావు తల్లి ముందుగా శిరిడీ దర్శించి తరువాత పండరీపురం వెళ్లాలనుకున్నది. అనుకున్నట్లుగానే శిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకుంది. బాబా ఆమెకు ఊదీ ఇచ్చి, ఇంటికి తిరిగి వెళ్ళమని చెప్పారు. దాంతో ఆమె తన పండరి ప్రయాణాన్ని మానుకుని తిరిగి ఇంటికి చేరుకుంది. ఇంట్లోవారికి బాబా ప్రసాదం పంచుదామని, పెట్టె తీసి ఊదీ పొట్లం విప్పేసరికి ఆ పొట్లంలో ఊదీ లేదు! దానికి బదులు పండరి క్షేత్రంలో ప్రసాదంగా ఇచ్చే సువాసనతో కూడిన 'బుక్కా' ఉంది. ఆ పొడిని చూసి ఆమె ఆశ్చర్యపోతుంటే నాచ్నే, "అమ్మా! నువ్వు పండరిపురం సందర్శించాలని అనుకున్నావు కదా, కాబట్టి బాబా నీకు సరైన ప్రసాదమే ఇచ్చారు" అని అన్నాడు.

బాబా త్రికాలజ్ఞతకు అద్దంపట్టే మరో సంఘటన గురించి తెలుసుకుందాం... 

ఒకసారి శంకరరావు బాలకృష్ణ వైద్యతో కలిసి శిరిడీ వెళ్ళాడు నాచ్నే. బాబా వైద్యను 16 రూపాయల దక్షిణ అడిగారు. అందుకతను తనవద్ద డబ్బు లేదని చెప్పాడు. కాసేపాగి ఆయన మళ్ళీ అతనిని రూ.32 దక్షిణ అడిగారు. అతడు మళ్ళీ అదే సమాధానం ఇచ్చాడు. మరి కాసేపాగి ఆయన మళ్ళీ 64 రూపాయల దక్షిణ ఇమ్మని అడిగారు. అప్పుడతను, "బాబా! మేమంత ధనవంతులం కాదు. అంత పెద్ద మొత్తం మా దగ్గర ఎలా ఉంటుంది?" అని అన్నాడు. "అయితే ఆ మొత్తాన్ని వసూలు చేసి ఇవ్వండి" అన్నారు బాబా. కొంతకాలం తరువాత 1916వ సంవత్సరంలో బాబా అనారోగ్యానికి గురయ్యారు. బాబాకు ఆరోగ్యం చేకూరాలని భక్తులు పెద్ద ఎత్తున నామసప్తాహం ఏర్పాటు చేసి, ఆ కార్యక్రమానికి వచ్చే భక్తులందరికీ అన్నసంతర్పణ కూడా చేయాలని సంకల్పించారు. అందుకు చందాలు సేకరించాల్సి వచ్చింది. దభోల్కర్ ఆదేశానుసారం వైద్య, నాచ్నేలు కూడా చందాలు వసూలు చేశారు. వాళ్ళు సేకరించి శిరిడీ పంపిన మొత్తం సరిగ్గా 64 రూపాయలే!

ఒకప్పుడు రాయ్ అనే గ్రామంలో ఉన్న నాచ్నే స్నేహితుడు రావూజీ సఖారాం వైద్య కుమారుడు 'మోరు' ప్లేగుతో అనారోగ్యం పాలయ్యాడు. నాచ్నే సఖారాం వైద్యకు బాబా ఊదీని ఇచ్చి, అతని కుమారునికి పెట్టమని చెప్పాడు. బాబా మహిమతో అతను పూర్తిగా కోలుకున్నాడు.

దహనులో పరశురామ్ అప్పాజీ నాచ్నే తలాఠీగా(గ్రామ ముఖ్యాధికారి) ఉండేవాడు. అతను శిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకున్నాడు. అతనొక వ్యాధితో దీర్ఘకాలికంగా బాధపడుతుండేవాడు. కాస్త వైద్య పరిజ్ఞానమున్న నాచ్నే తండ్రి, మరికొందరు వైద్యులు చేసిన చికిత్సలు విఫలమయ్యాయి. అతని మనుగడపై వైద్యులు ఆశ వదులుకున్నారు. ఆ పరిస్థితుల్లో అతను ప్రతిరోజూ బాబా పటం ముందు అఖండ నేతి దీపం, అగరుబత్తీలు వెలిగించి బాబాను ప్రార్థిస్తూ ఉండేవాడు. కొన్నిరోజుల్లో అతనికి ఆ వ్యాధి పూర్తిగా నయమైంది. మరోసారి అతను తీవ్రమైన కీళ్లనొప్పులతో అనారోగ్యం పాలయ్యాడు. చికిత్సలేవీ పనిచేయలేదు. అతను తన తల్లితో బాబా పటం ముందు దీపం, అగరుబత్తీలు వెలిగించి, ఆయనను ప్రార్థించమని చెప్పాడు. ఆమె బాబాను హృదయపూర్వకంగా ప్రార్థించి, తన కొడుకుకు నయమైతే ఖచ్చితంగా శిరిడీ వస్తానని వాగ్దానం చేసింది. త్వరలోనే అతను పూర్తిగా కోలుకున్నాడు.

1915లో నాచ్నే, ఎస్.బి.వైద్య బాబా దర్శనానికి వెళ్లారు. వైద్య తనతోపాటు వెండిపాదుకలను తీసుకెళ్లాడు. వాటిని బాబాకు సమర్పించి, వారి చేతుల మీదుగా తిరిగి తీసుకుని పూజించుకోవాలని అతని ఉద్దేశ్యం. కానీ బాబా వాటిని నాచ్నేకు బహుకరించారు. వాటిని వైద్యకు ఇవ్వడమే సరైనదనిపించి అతనికే ఇచ్చేశాడు నాచ్నే. కానీ మాధవరావు దేశ్‌పాండే జోక్యంతో అవి తిరిగి మళ్లీ నాచ్నే వద్దకే వచ్చాయి. వైద్య వద్ద మరో జత వెండిపాదుకలు కూడా ఉన్నాయి. బాబా వాటిని స్వయంగా అడిగి తీసుకుని వాటిని కూడా నాచ్నేకి బహూకరించి, “వీటిని నీవద్ద ఉంచుకుని పూజించుకో” అని అన్నారు. "బాబా! ఇవి వైద్య చేయించినవి. అవి అతనికే చెందాలి" అని అన్నాడు నాచ్నే. అప్పుడు బాబా, "ప్రస్తుతానికి ఇవి నీ దగ్గర ఉంచుకో, తరువాత అతనికి ఇవ్వవచ్చు" అని అన్నారు. నాచ్నే కొంతకాలం వాటిని తన దగ్గర ఉంచుకున్న తరువాత ఒక జతను వైద్యకు ఇచ్చాడు.
బాబా తమ భక్తుల ఛాందస భావాలను నిరసించేవారు. అందరినీ సమదృష్టితో చూసేవారు. బాబా చెంత అందరికీ ఒకే న్యాయమని తెలియజేసే ఒక సంఘటన ఇది.

1915, మే నెలలో నాచ్నే తన అత్తగారిని తీసుకుని మరికొంతమందితో కలిసి శిరిడీ వెళ్ళాడు. వాళ్ళు సాఠేవాడాలో (తరువాత కాలంలో అది చేతులు మారి నవాల్కర్ వాడాగా మారింది) బస చేశారు. ఆ వాడాలోని ఒక భాగంలో దాదాకేల్కర్ నివాసముంటున్నారు. ఒకరోజు నాచ్నే అత్తగారు వంటచేస్తూ ఉల్లిపాయలు తరుగుతున్నారు. సనాతన బ్రాహ్మణుడైన దాదాకేల్కర్ ఉల్లిపాయలపట్ల అసహ్యతతో ఆమెను దూషించాడు. అతని మాటలకు ఆమె మనస్సు నొచ్చుకుంది. కొన్ని గంటల తరువాత దాదాకేల్కర్ మనవరాలు తీవ్రమైన కళ్ళనొప్పితో ఏడవసాగింది. కేల్కర్ బాబా దగ్గరకు వెళ్లి, తన మనవరాలికి ఆ బాధ నుండి ఉపశమనం కలిగించమని ఆయనను వేడుకున్నాడు. అప్పుడు బాబా "ఉల్లిపాయతో కాపడం పెట్టు" అని అన్నారు. అందుకతను, "ఉల్లిపాయను నేను ఎక్కడనుండి తెచ్చేది?" అని అడిగాడు. బాబా వద్ద ఎల్లప్పుడూ ఉల్లిపాయలుంటాయి గనక వారే వాటిని ఇస్తారని అతని ఉద్దేశ్యం. కానీ బాబా ఆంతర్యం మరో విధంగా ఉంది. ఆయన తమ కఫ్నీ చేతులు పైకెత్తి నాచ్నే అత్తగారిని చూపిస్తూ అతనితో, "ఈ ఆయి(తల్లి) వద్ద నుండి తీసుకో" అని అన్నారు. చెడుకి బదులుగా మంచి చేయడం అనే గొప్ప ప్రతీకార చర్యతో ఆమె తన మనస్సులో అణిచిపెట్టుకున్న బాధనుండి ఉపశమనం పొందే అవకాశాన్ని బాబా ఇస్తున్నారు. 

ఆమె బాబాతో, "ఈరోజు ఉదయం నేను భోజనం ఏర్పాట్లు చేస్తూ ఉల్లిపాయలు తరుగుతుంటే దాదా నన్ను దూషించాడు. అందుకే అతనికేదీ ఇవ్వాలని లేదు. కానీ అతనికి ఉల్లిపాయలు ఇవ్వమని మీ ఆదేశమైనట్లయితే అలానే చేస్తాను" అని చెప్పింది. అప్పుడు బాబా ఇవ్వమని ఆదేశించడంతో ఆమె కేల్కర్‌కు ఉల్లిపాయలిచ్చింది.

నాచ్నే దంపతులకు పిల్లలు లేరు. పిల్లలు పుట్టినప్పటికీ కొద్దిమంది పురిటిలో, మరికొంతమంది చాలా చిన్న వయస్సులోనే మరణించారు.  అందువల్ల వారికి సంతానం ప్రసాదించమని నాచ్నే అత్తగారు బాబాను వేడుకున్నది. ఆమె కోరిక మేరకు మాధవరావు దేశ్‌పాండే నాచ్నే భార్యను బాబా వద్దకు తీసుకెళ్ళి, ఒక కొబ్బరికాయను ఆమె చీర చెంగులో వేయమని బాబాను అభ్యర్థించాడు. బాబా ఆమెకు కొబ్బరికాయ ఇస్తున్నప్పడు ఆయన కళ్ళు చెమ్మగిల్లాయి. తరువాత బాబా నాచ్నేను తమ వద్ద కూర్చుని, తమ పాదాలొత్తమని ఆదేశించారు.  వారి ఆదేశం మేరకు నాచ్నే బాబా పాదాలొత్తుతుండగా బాబా అతని వీపుపై ప్రేమగా నిమిరారు. బాబా తనపై చూపుతున్న కరుణకు అతడు కృతజ్ఞతలు తెలుపుతూ, "నన్ను చంపడానికి పిచ్చివాడు వచ్చినప్పుడు ఫోటో రూపంలో మీరు నా దగ్గర ఉన్నందువల్లే నేను రక్షింపబడ్డాను బాబా" అని అన్నాడు. బాబా, “భగవంతుడే యజమాని (అల్లాహ్ మాలిక్ హై). అన్నీ వారి ఆజ్ఞ ప్రకారమే జరుగుతాయి" అని అతనిని ఆలింగనం చేసుకున్నారు.

బాబా తమ భక్తులందరిపట్ల ఎంతో ఆదరణ చూపేవారు. అంతేగాక ఒక భక్తుడు తమకు చేసే సేవలో మరొకరు జోక్యం చేసుకోవడం వారికి బొత్తిగా నచ్చేది కాదు. ఇప్పుడు చెప్పబోయే సంఘటనే అందుకు నిదర్శనం. ఒకరోజు బాబా తమకు కడుపునొప్పిగా ఉందని చెప్పారు. మావ్‌సీబాయి  ఒక ఇటుకను ఎర్రగా కాల్చి బాబా పొత్తికడుపుపై పెట్టింది. పది నిమిషాలపాటు దానినలాగే ఉంచి తరువాత తీసివేసింది. ఆ సమయంలో బాబా కాళ్ళు మర్దన చేస్తున్న నాచ్నే ఆమె చేస్తున్నది క్రూరమైన చికిత్స అనుకున్నాడు. ఆమె ఇటుక తీసిన తరువాత తన శక్తినంతా ఉపయోగించి బాబా కడుపును నొక్కసాగింది. అది చూసి నాచ్నే తట్టుకోలేక, "కాస్త నెమ్మదిగా ఒత్తు, బాబాకు బాధ కలుగుతుంది" అని ఆమెతో చెప్పాడు. వెంటనే బాబా "ఫో అవతలకి" అంటూ అతనిపై కోప్పడ్డారు. దాంతో అతను అక్కడినుండి వెళ్ళిపోయాడు.

ఆరోజు రాత్రి సుమారు 8 గంటల ప్రాంతంలో నాచ్నే మసీదుకి వెళ్లి తనకు ఉపదేశమిమ్మని బాబాను ప్రార్థిస్తూ, "ఏ జపం చేసుకోమంటారు?" అని అడిగాడు. అందుకు బాబా, "దేవపూర్ (కోపర్‌గాఁవ్ నుండి 20 మైళ్ళ దూరంలో ఉన్న ఒక గ్రామం) వెళ్లి, అక్కడ మీ పూర్వీకులచే పూజింపబడిన శిలలను పూజించుకో" అని అన్నారు.

అతను శిరిడీ నుండి  దహనులోని తన ఇంటికి చేరుకున్న తరువాత తన తండ్రిని బాబా మాటలకు అర్థమేమిటని అడిగాడు. అప్పుడు అతని తండ్రి దేవ్‌పూర్‌లో తమ పూర్వీకులు కొన్ని విగ్రహాలను పూజించేవారని దాని వివరాలు ఇలా చెప్పాడు: "ఐదు తరాల ముందు మా పూర్వీకుడైన బాబాప్రయాగ్‌కు 60 సంవత్సరాల వయస్సు వరకు సంతానం లేదు. ఏకనాథ్ మహారాజ్ శిష్యుడైన బాబాభగవత్ అనే మహాత్ముని కృపతో కొంతమందికి సంతానం కలిగిందని, వారు అరుదుగా త్రయంబకంలోని నివృత్తినాథ్ ఆలయానికి వస్తుంటారని ఆయనకి తెలిసింది. అలా వచ్చినప్పుడు బాబాప్రయాగ్ సంతానం కొరకు ఆ మహాత్ముని దర్శించాడు. ఆయన ఆశీర్వదించి కొబ్బరికాయను ప్రసాదించారు. తరువాత 61 సంవత్సరాల వయస్సులో బాబాప్రయాగ్‌కు ఒక మగబిడ్డ జన్మించాడు. ఆ బిడ్డకు కృష్ణారావు అని నామకరణం చేశారు. ఏడాది వయస్సున్నప్పుడు ఆ బిడ్డను బాబాభగవత్ దేవ్‌పూర్ తీసుకెళ్లి జ్ఞానేశ్వరి వ్రాతప్రతిని ఇచ్చి ఆశీర్వదించారు. ఆ వ్రాతప్రతి ఎంత మహిమగలదంటే దాన్ని బయటకు తీసినప్పుడల్లా కొన్ని శుభసంకేతాలు కనిపిస్తాయి. అప్పటినుండి మా కుటుంబీకులు బాబాభగవత్ గురుపరంపరలోని వారి వద్ద నుండి ఉపదేశం తీసుకుంటుండేవారు".

ఒకసారి నాచ్నే, గణేష్ వైద్యలు సాయిబాబా గురించి ముచ్చటించుకుంటున్నారు. ఆ సమయంలో గణేష్ వైద్య తన సొంత అనుభవాలు చెప్తున్నాడు. ఒకప్పుడు అతను పెళ్ళీడుకొచ్చిన తన చిన్న కుమార్తెకు తగిన వరునికోసం ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ ఎటువంటి ప్రయోజనం కనపడక అతడు దిగులుగా ఉన్న సమయంలో ఒకరోజు బాబా అతని కలలో కనిపించి"నువ్వు ఎందుకు ఆత్రుత పడుతున్నావు? కేశవ్ దీక్షిత్ కుమారుడు ఉన్నాడు" అని చెప్పి, ఆ అబ్బాయి ఫోటో కూడా చూపించారు. వెంటనే అతనికి మెలకువ వచ్చింది. కానీ అతనెప్పుడూ కేశవ్ దీక్షిత్ గురించి వినలేదు. అంతేకాదు, కలలో బాబా చూపించిన అబ్బాయిని ఎక్కడా చూసినట్లు కూడా అతనికి అనిపించలేదు. అతను ఆ పేరుగల వ్యక్తికోసం వెతకడం ప్రారంభించాడు. ఒకరోజు అతను తన కుమారునితో తనకు వచ్చిన కల గురించి చెప్పగా, అతడు తన కార్యాలయంలో ఆ లక్షణాలతో దీక్షిత్ అనే అబ్బాయి ఉన్నాడని, అతని తండ్రి పేరు కేశవ్ అని చెప్పాడు. ఆ అబ్బాయి అచ్చం కలలో బాబా చూపించినట్లే ఉన్నాడు. తరువాత వైద్య అతని గురించి పూర్తి విచారణ చేసి తన కుమార్తెనిచ్చి ఆ అబ్బాయితో వివాహం జరిపించారు. ఆవిధంగా బాబా అతని కుమార్తె పెళ్లి సమస్యను పరిష్కరించారు.

1916లో నాచ్నే బాబా అనుగ్రహంతో జలసమాధి కాకుండా రక్షింపబడ్డాడు. నాచ్నే రోజూ తన ఆఫీసుకు వెళ్లేందుకు ఒక సముద్రపుపాయను దాటవలసి వచ్చేది. ఒకరోజు అతను తన ఆఫీసు నుండి చాలా ఆలస్యంగా బయలుదేరాడు. ఆ సమయంలో పాయను దాటడానికి పడవ ఏదీ లేదు. అందువల్ల ఒక పిల్లవాడు తెడ్డు వేస్తుండగా అతను దోనెలో ఆ సముద్రపుపాయను దాటుతున్నాడు. నాచ్నే ఒక వైపుకు ఒరగడంతో ఆ దోనె తలక్రిందులైంది. దానితో ఇద్దరూ నీటిలో పడిపోయారు. నాచ్నే తనని కాపాడమని సాయిబాబాను ఆర్తిగా ప్రార్థించాడు. ఆ పిల్లవాడు గజ ఈతగాడు, చురుకైనవాడు. అతను నీటిపై తేలుతున్న తాడును (దూరంగా ఉన్న ఓడ యొక్క లంగరు వేసే తాడు) పట్టుకోమని నాచ్నేతో చెప్పాడు. నాచ్నే వెంటనే ఆ తాడు అందుకున్నాడు. దాని సహాయంతో అతడు తన తల నీటిలో మునగకుండా కాపాడుకోగలిగాడు. అంతలో ఆ పిల్లవాడు ఓడ వద్దకు వెళ్లి వారి సహాయం అర్థించాడు. వాళ్ళు ఒక పడవను పంపి నాచ్నేను కాపాడారు. అలా బాబా అతనికి జీవితాన్నిచ్చారు.

source:  Personal Interview with Shri.Ravindra Shantaram Nachane Son of Late Shri.Shantaram Balavant Nachane, and Akhanda Shree Sai Krupa Marathi Book written and published by Shri.Ravindra Shantaram Nachane)
devotees experiences of saibaba by b.v. narasimha swamy.

 


ముందు భాగం కోసం

బాబా పాదుకలు తాకండి.



నిర్ధిష్టమైన భాగం కోసం పైన నెంబర్లను తాకితే, ఆ నెంబరుకి సంబంధించిన భాగం ఓపెన్ అవుతుంది.

 


తరువాయి భాగం కోసం

బాబా పాదాలు తాకండి.

8 comments:

  1. Om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya Jaya sai,on sai sri sai Jaya Jaya sai.om sai sri sai Jaya Jaya sai🙏🙏🙏🙏

    ReplyDelete
  2. ఓం సాయిరాం🌷🙏🌷

    ReplyDelete
  3. Reading Sai Satchritra is a blessing to everyone to know the history of pure soul. the people who wants to live a happy life must read Sai Satcharitra, its a precious lesson to everyone.
    Regards,

    Chanting Hanuman chalisa daily brings positive vibes to your life, be a dedicated followers of hanuman to get his blessings everyday.
    Regards,
    Reading Sai Satchritra is a blessing to everyone to know the history of pure soul. the people who wants to live a happy life must read Sai Satcharitra, its a precious lesson to everyone.
    Regards,

    sai baba answers
    Sai Baba Quotes
    sai baba live darshan
    sai satcharitra
    Sai Satcharitra in Tamil
    Sai Satcharitra in Telugu
    Sai Satcharitra in Marathi
    Sai Satcharitra in Gujarati

    ReplyDelete
  4. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete
  5. 🙏ఓం సాయి రామ్ 🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo