సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 320వ భాగం....


ఈ భాగంలో అనుభవం:
  • అనారోగ్య సమస్యలతో పోరాడుతున్న మావారిపై బాబా అనుగ్రహం

యు.ఎ.ఇ నుండి సాయిభక్తురాలు లక్ష్మి తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

నా పేరు లక్ష్మి. నా స్వస్థలం కేరళ. ప్రస్తుతం నా భర్తతో కలిసి యు.ఎ.ఇ లో నివాసముంటున్నాను. నేను ఇంతకుముందు రెండు అనుభవాలను మీతో పంచుకున్నాను. మునుపటి అనుభవంలో నా భర్త మూత్రపిండాల మార్పిడి గురించి తెలియజేశాను. ఆ మూత్రపిండాల మార్పిడి జరిగిన తరువాత బాబా దయవలన 8 నెలలు బాగా నడిచాయి. 2019, మే రెండవవారంలో మావారు తన నెలవారీ చెకప్ కోసం ఇండియా వెళ్లి, ఎటువంటి సమస్యలు లేకుండా తిరిగి వచ్చారు. కానీ తరువాత వారంలో మావారి బిపిలో చాలా హెచ్చుతగ్గులు చోటుచేసుకున్నాయి. దాని ప్రభావం రాత్రుళ్ళు చాలా ఎక్కువగా ఉండేది. రాత్రంతా పదేపదే బిపి చెక్ చేస్తూ, మాటిమాటికీ మందులు మారుస్తూ అస్సలు నిద్ర ఉండేదికాదు. ఉదయం చూస్తే, బాగా లో-బిపి, రాత్రిళ్ళు చాలా హై-బిపి ఉండటం ప్రారంభమైంది. మేము చాలా ఆందోళనపడేవాళ్ళం.

ఈ పరిస్థితుల్లో మావారు విశ్రాంతి తీసుకుందామని రెండురోజులు ఆఫీసుకు సెలవు పెట్టారు. మొదటిరోజు, నేను ఆఫీసుకు వెళ్తూ మార్గమధ్యలో ఉండగా ఆయన ఫోన్ చేసి, తన ఆరోగ్యం బాగోలేదని చెప్పి నన్ను వెంటనే వెనక్కి రమ్మని చెప్పారు. నేను చాలా భయపడుతూ గంటలో ఇంటికి చేరుకున్నాను. చూస్తే, ఆయన లో-బిపితో, చాలా తక్కువ హార్ట్‌బీట్‌తో చాలా అలసటగా కనపడ్డారు. వెంటనే మేము స్థానిక ఆసుపత్రిలో అపాయింట్‌మెంట్ తీసుకుని డాక్టర్ని సంప్రదించాము. అక్కడ అన్నిరకాల రక్తపరీక్షలు చేశారు. బాబా దయవలన మూత్రపిండాల పనితీరు కొంతవరకు బాగానే ఉంది. అయితే క్రియేటినిన్ లెవెల్స్ బాగా తగ్గిపోయాయి. మేము చాలా ఆందోళన చెందాము. సరైన కారణాలు గుర్తించబడనందున వచ్చేవారం మరికొన్ని పరీక్షలు చేయిద్దామని డాక్టర్ అన్నారు. బిపి ఇంకా తగ్గలేదు. ఆ స్థితిలో మేము భారతదేశానికి వెళ్లాలా, వద్దా అని ఆలోచిస్తున్నాము. ఎందుకంటే అప్పటికే చాలారోజులు సెలవు తీసుకున్నందున మళ్ళీ సెలవు తీసుకోవడానికి మావారు ఇష్టపడలేదు. పైగా రాబోయే వారంలో 'ఈద్' సెలవులు ఉన్నాయి కాబట్టి ఆ సెలవుదినాలను ఉపయోగించుకోవచ్చని అనుకున్నాను. మేము నిరంతరం సాయిని ప్రార్థిస్తూ, "ఆరోగ్య సమస్యలతో 5 సంవత్సరాలు నలిగిపోయిన తర్వాత కూడా  మమ్మల్ని మళ్లీమళ్లీ ఎందుకు పరీక్షిస్తున్నార"ని బాబాని అడుగుతూ ఉండేవాళ్ళం.

చివరగా నా భర్త ఈద్ సెలవుల్లో టికెట్లు బుక్ చేసుకుని తనకు మూత్రపిండాలు మార్పిడి చేసిన డాక్టర్ని సంప్రదించడానికి ఒంటరిగా ఇండియా వెళ్ళారు. డాక్టర్ కొన్ని ప్రాథమిక చెకప్ లు చేశాక, ఏవైనా సమస్యలున్నాయేమో తెలుసుకోవడానికి 'కిడ్నీ డాప్లర్' చేయించమని సూచించారు. మా దురదృష్టంకొద్దీ ఆ టెస్టులో, వంపు కారణంగా మార్పిడి చేసిన మూత్రపిండాలను అనుసంధానించే ధమనిలో ఒక బ్లాక్ ఉందని తేలింది. వందమంది రోగులలో అయిదుగురికి మాత్రమే ఈ రకమైన బ్లాక్‌లు వస్తాయని డాక్టర్ చెప్పి, పూర్తి నిర్ధారణకోసం యాంజియోగ్రఫీ చేయించమని చెప్పారు. ఒకవేళ ఆ బ్లాక్ తీవ్రత ఎక్కువగా ఉంటే, యాంజియోప్లాస్టీ చేయించాల్సి ఉంటుందని కూడా డాక్టర్ చెప్పారు. మళ్ళీ క్రొత్త సమస్యతో మేము షాక్ అయ్యాము. ఆ సమయంలో యు.ఎ.ఇ.లో ఉన్న నేను శిరిడీ లైవ్ దర్శన్ చూస్తూ రోజంతా బాబాని కన్నీళ్లతో ప్రార్థిస్తూ, మళ్ళీ మా విషయంలో ఎందుకిలా చేస్తున్నారని అడుగుతూ, శస్త్రచికిత్స అవసరం లేకుండా చూడమని ప్రాధేయపడుతూ ఉన్నాను.

మరుసటిరోజు బుధవారం మావారు తిరిగి రావాల్సి ఉంది. కానీ, అదేరోజు యాంజియోగ్రఫీ ఉండటంతో నేను ఆయన తిరుగు ప్రయాణ టిక్కెట్లు రద్దు చేశాను. ముందుగా మేము ఆయన బుధవారం వస్తే, గురువారం సాయి మందిరాన్ని సందర్శించే ప్రణాళిక వేసుకున్నాము. అదే విషయం నేను బాబాతో మాట్లాడుతూ, "మావారు రాలేదు కాబట్టి నేను మీ దర్శనానికి రాలేను" అని చెప్పుకున్నాను. దిగులుతో ఆ రాత్రి నేను నిద్రపోలేకపోయాను. బుధవారం ఉదయం నా స్నేహితురాలు తను సాయి మందిరానికి వెళ్తూ నాకు ఫోన్ చేసి, "నువ్వు ఏదైనా బాబాకి ఇవ్వాలనుకుంటున్నావా?" అని అడిగింది. మొదట నేను తనకేమీ చెప్పలేదు. కానీ తరువాత నేను ఆమెకు ఫోన్ చేసి, "నేను బాబాకి కొబ్బరికాయ, నిమ్మకాయ సమర్పించాలని అనుకుంటున్నాను. నన్ను కూడా నీతో మందిరానికి తీసుకుని వెళ్లగలవా?" అని అడిగాను. నేను గురువారం మందిరానికి వెళ్ళటానికి బాబానే ఈ మార్గంలో నాకు సహాయం చేస్తున్నారని నాకనిపించింది. ఇలా బాబా మాతో ఉన్నారని తెలియజేస్తున్నారు కాబట్టి నా భర్తకు ఏమీ జరగదని నాకు నమ్మకం కలిగింది. అయినప్పటికీ నా భర్త పడుతున్న బాధవలన భయపడ్డాను. నేను మందిరానికి వెళ్లేముందు ఇంట్లో సాయి ఫోటోముందు నిలబడి, “బాబా! నా చింత మీకు తెలుసు. అది మీరు తప్ప మరెవరూ పరిష్కరించలేరు. ఇప్పుడు నేను మీ దగ్గరకు వస్తున్నాను. మీరు నాతోనే ఉన్నారని నాకు కొన్ని ఆధారాలు చూపించండి" అని ప్రార్థించాను. ముందుగా మేము మధ్యాహ్న ఆరతి సమయానికి మందిరం చేరుకుంటామని అనుకున్నాము. కానీ, మేము ఆరతి ముగిసిన తరువాతే చేరుకోగలిగాము. ఆరతి పూర్తయిపోయింది కాబట్టి నేను తీసుకెళ్లిన పువ్వులు, కొబ్బరికాయ, నిమ్మకాయలను బాబాకి సమర్పించే అవకాశం లేదని అనుకున్నాను. అందుచేత నేను మౌనంగా నిలబడి బాబాని ప్రార్థిస్తున్నాను. అంతలో పూజారి నా వద్దకు వచ్చి కొబ్బరికాయ, నిమ్మకాయలను తీసుకుని బాబాకి సమర్పించారు. నేను చాలా సంతోషించాను. తరువాత పూజారి మరో కుటుంబంతో మాట్లాడుతూ బిజీగా ఉన్నారు. దాంతో నేను బాబా ప్రసాదం పొందలేనని అనుకున్నాను. తరువాత బాబా మూర్తిపై ఉన్న గులాబీలలో ఒకటి క్రింద పడిపోయినా లేదా కనీసం కదిలినా నా భర్త విషయంలో బాబా ఇచ్చే భరోసాగా తీసుకుంటానని అనుకున్నాను. బాబా మార్గాలు భిన్నమైనవి. అకస్మాత్తుగా, పూజారి బాబా వద్దనుండి గులాబీలు తీసుకుని నాకిచ్చారు. ఆనందంతో నాకు కన్నీళ్లు వచ్చేసాయి. నేను అక్కడే నిలబడి చాలాసేపు బాబాని ప్రార్థించాను. కొంతసేపటికి మళ్ళీ  పూజారి వచ్చి బాబాకు సమర్పించిన నైవేద్యాల నుండి రెండు పండ్లు తీసి నాకు ఇచ్చారు. తరువాత మళ్ళీ అతను బాబా వద్దకు వెళ్లి అక్కడున్న పిల్లలకి రెండు గులాబీలు ఇస్తూ, నాకు కూడా ఒక గులాబీ ఇచ్చారు. నేను ఒక గులాబీ కదిలితే చాలు అనుకున్నాను. అలాంటిది బాబా నాకు నాలుగు గులాబీలు ఇవ్వడంతో నేను భావోద్వేగాలకు లోనయ్యాను. నా స్నేహితురాలి తండ్రి వస్తారని మేము అక్కడే ఎదురుచూస్తూ ఉన్నాము. నేను దూరంగా ఒక మూల నిలబడి బాబాని ప్రార్థిస్తూ ఉన్నాను. కాసేపటికి పూజారి బాబాకు వేసిన పూలమాలలు తొలగించడం ప్రారంభించి, దూరాన ఉన్న నన్ను పిలిచి పొడవైన మల్లెల మాల నాకిచ్చారు. బాబా నాపై చూపుతున్న శ్రద్ధకు నేను మూగబోయాను. అంతకుముందు నేను ఇదే మందిరానికి వచ్చినప్పుడెప్పుడూ నాకు ఒక్క ఆకు కూడా లభించలేదు. ఈరోజు బాబా చాలా బహుమతులతో నాకు భరోసా ఇస్తూ నన్ను సంతోషపరుస్తున్నారు. తరువాత ఇంటికి తిరిగి వస్తూ, భోజనం చేయడానికి ఒక హోటల్‌కి వెళ్ళాం. అక్కడ లెండీతోటకి వెళ్తున్న బాబా ఫోటోతో బాబా మళ్ళీ తన ఉనికిని తెలియజేశారు. బాబా ఇచ్చిన ఇన్ని నిదర్శనాలతో నేను నా భర్త స్కానింగ్ రిపోర్టు సానుకూలంగా వస్తుందని ఆశించాను.

అయితే యాంజియోప్లాస్టీ ఎప్పుడు చేయబోతున్నారన్నది ఇంకా నిర్ధారించబడలేదు. బహుశా అది గురువారం ఉండొచ్చనుకొని నేను అదేరోజు టికెట్ బుక్ చేసుకుందామని అనుకున్నాను. సాధారణంగా అయితే ఈద్ సెలవులు కారణంగా అప్పటికప్పుడు అదేరోజు సాయంత్రానికి టికెట్ దొరకడం చాలా కష్టం. నేను ఆన్‌లైన్‌లో చూసినప్పుడు  ఆశ్చర్యకరంగా ఆరోజు రాత్రికి ఒకే ఒక్క టికెట్ అందుబాటులో ఉంది. సాయి దయతో నేను దాన్ని బుక్ చేసుకున్నాను. మరుసటిరోజు ఉదయం 5 గంటలకు నేను హాస్పిటల్‌కు చేరుకున్నాను. అక్కడికి వెళ్ళాక అదేరోజు ఉదయం 9 గంటలకి యాంజియోప్లాస్టీ ఉందని తెలుసుకున్నాను. నేను బాబా ప్రసాదాన్ని నా భర్తకు ఇచ్చాను. యాంజియోప్లాస్టీ చేయడానికి ముందే మావారికి ప్రసాదాన్ని అందించేలా చేసినందుకు నేను చాలా సంతోషించాను. తరువాత యాంజియోప్లాస్టీ జరుగుతున్నంతసేపు నేను సచ్చరిత్ర పారాయణ చేస్తూ ఉన్నాను. నిజానికి ఆ ముందురోజే నేను సచ్చరిత్ర సప్తాహ పారాయణ మొదలుపెట్టాను. చివరికి డాక్టర్ బయటకు వచ్చి, "అంతా బాగా జరిగింది. ధమనిలో స్టెంట్ వేసి తనకి యాంజియోప్లాస్టీ చేశాము. ఇకపై అంతా బాగుంటుంది. ఒకరోజు పరిశీలన నిమిత్తం ఐసియుకు మార్చాము" అని చెప్పారు. నేను నా సప్తాహ పారాయణ పూర్తి చేసిన మరుసటిరోజు అంటే 2019, జూన్ 14న మావారు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పుడు ఆయన బాబా దయవలన బాగున్నారు.

మొదట్లో మాకేమీ అర్థం కాలేదు. కానీ మూత్రపిండాల మార్పిడి చేసినప్పటి నుండే సమస్య ఉందని, అప్పట్లో అది పెద్దసమస్య కానందున, ఏమీ కాలేదని తరువాత మాకు అర్థమైంది. సరైన సమయానికి మావారు ఇండియా వెళ్లకపోయుంటే సమస్య తెలిసేదికాదు. చాపకిందనీరులా అది మూత్రపిండాలపై చాలా ప్రభావం చూపి ఉండేది. సరైన సమయానికి సరైన నిర్ణయాలు తీసుకునేలా మార్గనిర్దేశం చేయడంలో బాబా ఎల్లప్పుడూ మాతోనే ఉన్నారు. "బాబా! చాలా చాలా ధన్యవాదాలు. మీరు ఎల్లప్పుడూ మా హృదయంలో కొలువై ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. నాకు అర్థం కానిదల్లా ఒక్కటే, మళ్లీ మళ్లీ మమ్మల్ని ఎందుకు పరీక్షిస్తున్నారో!?". ఐదేళ్లుగా మావారి ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్నా మేము బాబానే నమ్ముకున్నాము. ఆయన ఆశీస్సులతో మా ఈ పోరాటాలు ఇక్కడితో ముగిసిపోతాయని నేను ఆశిస్తున్నాను.


5 comments:

  1. Om sai ram,sai will never leave u, everything will come and go according to your karma,baba will always save us all from all our calamities,surely your husband will be alright.have sradda and saburi in your hard days.baba ways are different he will definitely bring u out from this situation.om sai ram love u Deva.

    ReplyDelete
  2. Saibaba Lord of miracles surely saves your family...Om Sairam

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo