సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 334వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. నన్ను, నా కుటుంబాన్ని శిరిడీ సందర్శించేలా చేశారు బాబా
  2. బాబా నా కొడుకును తన ఒడిలో తీసుకున్నారు

నన్ను, నా కుటుంబాన్ని శిరిడీ సందర్శించేలా చేశారు బాబా

ఆస్ట్రేలియా నుండి ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

నేను సాయిబాబా భక్తుల కుటుంబంలో జన్మించాను. బాల్యంనుండే బాబా మహిమను చవిచూస్తున్న అదృష్టవంతురాలిని. నేను ఎప్పుడూ ఆయన సంరక్షణలో ఉన్నాను. ఆయన దయ నా కుటుంబసభ్యులపై సదా ఉంది. నేనిప్పుడు మీతో పంచుకోబోయే అనుభవం శిరిడీ సందర్శించాలని త్రికరణశుద్ధిగా కోరుకుంటే ఆ కోరిక నెరవేరడానికి బాబా ఎలా సహాయం చేస్తారో తెలియజేస్తుంది.

బాబా ఆశీస్సులతో నేను 2015, సెప్టెంబరులో ఒక మగబిడ్డకు జన్మనిచ్చాను. బాబుకి రెండున్నర నెలల వయసు వచ్చేవరకు నేను నా తల్లిదండ్రుల ఇంట్లోనే ఉన్నాను. ఒకరోజు మా నాన్న ఇంట్లో బొద్దింకలను నిర్మూలన చేసే ప్రయత్నంలో ఇల్లంతా హిట్ స్ప్రే చేశారు. దురదృష్టవశాత్తు, ఆయన మోతాదుకు మించి స్ప్రే చేసేశారు. ఇల్లంతా విషపూరిత పొగలతో నిండిపోయింది. మా అందరికీ ఊపిరి పీల్చుకోవడం చాలా కష్టంగా మారింది. మా పరిస్థితే ఇలా ఉంటే చిన్నవాడైన నా బిడ్డ పరిస్థితి ఏమిటని నాలో భయం చోటుచేసుకుని చాలా ఆందోళనపడ్డాను. నేను కళ్ళు మూసుకుని, "నా బిడ్డను కాపాడమ"ని బాబాను వేడుకుంటూ, "కుటుంబంలో ఎవరికీ ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా ఉంటే, నా బిడ్డతోపాటు శిరిడీ సందర్శిస్తాన"ని బాబాకు మాట ఇచ్చాను. ఎప్పుడూ మా సంరక్షకుడిగా నిలిచే బాబా క్షణాల్లో పరిస్థితిని చక్కబరిచారు. అయితే నేను నా వాగ్దానాన్ని ఎలా నెరవేరుస్తానో అనే ఆత్రుతలో పడ్డాను. ఎందుకంటే, "నా బిడ్డతో శిరిడీ వెళ్ళడానికి బాబాపట్ల నమ్మకం లేని నా భర్త ఎప్పటికైనా అంగీకరిస్తారా?" అని భయపడ్డాను. కానీ చేసేదిలేక నా చింతను బాబాకు వదిలేసి, "శిరిడీయాత్ర చేసేలా ఎలాగైనా మీరే చేయండి" అని ప్రార్థించాను.

రోజులు గడుస్తూ 2016 ఆగస్టు వచ్చింది. దురదృష్టవశాత్తూ అనుకోకుండా నా కొడుకు చాలా అనారోగ్యానికి గురయ్యాడు. తను డీహైడ్రేషన్ (నిర్జలీకరణ)కి గురయ్యాడు. దానితోపాటు జ్వరంకూడా వచ్చింది. సమయం గడుస్తున్నా జ్వరం తగ్గే సూచనలు కనపడలేదు. చివరికి తనని ఆసుపత్రిలో చేర్పించాల్సి వచ్చింది. తను కోలుకోవడానికి సుమారు 2 రోజులు పట్టింది. నేను, నా భర్త మా బాబు గురించి చాలా ఆందోళనపడుతూ మా ఇష్టదేవతలను ప్రార్థిస్తూనే ఉన్నామని ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. బాబా నా బిడ్డని చల్లగా చూసుకున్నారు. ఆయన అనుగ్రహం వలన 4 రోజుల్లో మునుపటిలా తను చురుకుగా, ఉల్లాసంగా తయారై ఇంటికి తిరిగి వచ్చాడు. మా బాబు ఆసుపత్రిలో ఉన్న సమయంలో ఒకసారి మేము బయటికి వచ్చినప్పుడు నా భర్త నాతో, "మనం శిరిడీ వెళ్ళాలి" అని అన్నారు. నా భర్త  మాటలు విని నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే మా పెళ్ళైన కొన్ని సంవత్సరాల తరువాత 2012లో మేము శిరిడీ సందర్శించినప్పుడు ఆయన నాతో, "ఈ మందిరం నుండి నాకు సానుకూలమైన వైబ్రేషన్స్ (సంకేతాలు) రాలేదు, కాబట్టి నేను మళ్ళీ ఎప్పటికీ ఈ మందిరాన్ని సందర్శించడానికి రాను" అని గట్టిగా చెప్పారు. అందువలన నేను, 'ఆకస్మికంగా ఈ మార్పుకు కారణమేమిట'ని ఆయనను అడిగాను. అందుకాయన, "నేను మన బిడ్డ ఆరోగ్యం విషయంలో చాలా బాధపడ్డాను. తను కోలుకుంటే శిరిడీ సందర్శిస్తానని బాబాకు మాట ఇచ్చాను" అని చెప్పారు. ఆ మాటలు వింటూనే నా ఆనందానికి అవధుల్లేవు. తరువాత మేము శిరిడీ వెళ్లి మా వాగ్దానాలను మేము నెరవేర్చగలిగాము. బాబా మమ్మల్ని చక్కటి దర్శనంతో అనుగ్రహించారు. "బాబా! మీ దయకు, ఆశీర్వాదాలకు చాలా చాలా ధన్యవాదాలు. నా బిడ్డను సదా రక్షిస్తున్నందుకు, మా జీవితాలలో చేస్తున్న ప్రతిదానికీ నా ధన్యవాదాలు".

బాబా నా కొడుకును తన ఒడిలో తీసుకున్నారు

ఇప్పుడు ఇంకో అనుభవాన్ని పంచుకుంటాను.

నేను కడుపుతో ఉన్న సమయంలో దాదాపు ప్రతి వారాంతంలో మా ఇంటి సమీపంలో ఉన్న వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని మేము సందర్శిస్తుండేవాళ్ళము. బిడ్డ జన్మించాక తనని వెంకటేశ్వరునికి చూపించాలని నేను చాలా ఆసక్తిగా ఉండేదాన్ని. అందువల్ల నా కొడుకుకి నెలల వయస్సున్నప్పుడు నేను, నా భర్త తనని తీసుకుని మొదటిసారి ఆలయానికి తీసుకువెళ్ళాము. నేను నా కొడుకును ఆలయ పూజారి చేతికందించి స్వామి పాదాల చెంత పెట్టించాలని ఆశపడ్డాను. కానీ దురదృష్టవశాత్తు నా భర్త అందుకు అంగీకరించలేదు. నేను చాలా నిరాశచెందాను. కానీ ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోయాను.

కొన్నివారాల తరువాత నూతన సంవత్సర సందర్భంగా అలవాటు ప్రకారం నా తల్లిదండ్రులు హైదరాబాదులోని దిల్‌షుఖ్‌నగర్ సాయిబాబా మందిరానికి వెళ్ళారు. వాళ్లతోపాటు నేను నా 3 నెలల కొడుకుతో వెళ్ళాను. ఆలయం చాలా రద్దీగా ఉంది. ఆ జనసందోహానికి నా కొడుకు ఎక్కడ ఇబ్బందిపడి ఏడుస్తాడోనని నేను భయపడ్డాను. కానీ అలా జరగలేదు. వాడు పండుగ వాతావరణాన్ని చక్కగా ఆస్వాదిస్తున్నాడు. అక్కడ ఉండటం చాలా సంతోషంగా అనిపించింది. ఈలోగా బాబాను దర్శిస్తూ పాదుకలకు నమస్కరించుకోవడానికి నావంతు వచ్చింది. హఠాత్తుగా అక్కడి పూజారి నా చేతుల్లోనుండి నా కొడుకును తీసుకుని బాబా ఒడిలో ఉంచాడు. నా కొడుకు బాబావైపు చూసిన తీరును నేను ఎప్పటికీ మరచిపోలేను. ఆ ఆనందకరమైన క్షణాలను నేనెప్పటికీ మరువలేను. నాకు ఒక్కసారిగా వెంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన సంఘటన జ్ఞాపకం వచ్చింది. అక్కడ నెరవేరని నా కోరికను ఇక్కడ ఇలా అనూహ్యరీతిలో నెరవేర్చి తమకు వెంకటేశ్వరుడికి భేదం లేదని బాబా నిరూపించారు. ఆరోజునుండి నా కొడుకు దేవాలయాలు సందర్శించే సమయంలో చాలా సంతోషంగా ఉంటున్నాడు. తను చూపించే భక్తి చాలా స్వచ్ఛమైనది, నేను కూడా అదేవిధమైన భక్తిని కలిగి ఉండాలని ఆశపడుతున్నాను. "బాబా! దయచేసి నా బిడ్డ జీవితాంతం ఈ స్వచ్ఛమైన భక్తిని కలిగివుండాలని ఆశీర్వదించండి. తనని మీ ఒడిలోకి తీసుకున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. నా కోరికలను ఎప్పుడూ వింటున్నందుకు మీకు నా కృతజ్ఞతలు బాబా!".

రేపటి భాగంలో నా అనుభవాలు మరికొన్ని పంచుకుంటాను ....


7 comments:

  1. Talli , evaro chala adrustavanturalu .
    Got the blessings of sai baba
    Baba, i am also undergoing a tough phase of my life, pl help me
    🙏🙏🙏

    ReplyDelete
  2. ఓం సాయిరాం🌷🙏🌷

    ReplyDelete
  3. This comment has been removed by the author.

    ReplyDelete
  4. This comment has been removed by the author.

    ReplyDelete
  5. Om sai ram!🙏🙏🙏🙏🌹🌹🌺🌺🌺🌺🌺🌺🌺

    ReplyDelete
  6. ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo