సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1755వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. అంతా బాబా మహిమ
2. బాబాకి చెప్పుకున్నాక చేకూరిన ఆరోగ్యం

అంతా బాబా మహిమ


నేను ఒక సాయిభక్తురాలిని. 2013లో నేను బిటెక్ పూర్తిచేస్తే 2021లో నాకు ఒక MNC కంపెనీలో ఉద్యోగం వచ్చింది. అప్పుడు నేను 2013 నుండి 2021 వరకు ఉన్న గ్యాప్‌ని కవర్ చేయడానికి ఫేక్ ఎక్స్పీరియన్స్ (ఉద్యోగ అనుభవం లేకపోయినప్పటికీ ఉన్నట్టుగా) పెట్టాను. అలా చేయడం తప్పని నాకు తెలుసు. అయినా నా కుటుంబ ఆర్థిక పరిస్థితులననుసరించి అలా చేయక తప్పలేదు. అప్పటికీ బాబాతో నాకంత అనుబంధం కూడా లేదు. 2023, జనవరి 18న మా నాన్నగారు కాలం చేసారు. నేను ఆ బాధ నుండి బాబా కృపావల్లనే బయటపడ్డాను. అప్పటినుండి నాకు ఏ కష్టమొచ్చినా బాబాకే చెప్పుకుంటున్నాను. ఆయన నాకు ప్రతి విషయంలో సహాయం చేస్తున్నారు. 2023, సెప్టెంబర్‌లో నేను అప్పటివరకు చేసిన ప్రాజెక్ట్ వేరే వెండర్‌కి తరలించబడటంతో నన్ను అదే కంపెనీలోని వేరే ప్రాజెక్ట్‌లో నియమించారు. ఆ కొత్త ప్రాజెక్ట్ క్లయింట్ నా BGV(బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్) చేయడం ప్రారంభించారు. ఆ క్రమంలో BGV వెండర్ నన్ను నా మునుపటి కంపెనీ బ్యాంకు స్టేట్‌మెంట్ ఇచ్చి వెరిఫికేషన్‌కి సహకరించమని అన్నారు. కానీ నేను ఆ పని చేయలేను. ఎందుకంటే, నేను పెట్టింది ఫేక్ సర్టిఫికెట్. కాబట్టి బ్యాంకు స్టేట్మెంట్ వెరిఫై చేస్తే, BGV రెడ్ వస్తుంది. అందుకని నేను నా ఉద్యోగానికి రాజీనామా ఇచ్చాను. అయినా 90 రోజుల నోటీసు పీరియడ్ ఉన్నందున నేను ఉద్యోగంలో కొనసాగుతుండగా 2023, నవంబర్ 23 నాటికీ 45 రోజులు పూర్తయ్యాయి. అప్పుడు హెచ్ఆర్ టీమ్ నా దగ్గరకి వచ్చి, "ఎందుకు బ్యాంకు స్టేట్మెంట్ వెరిఫికేషన్‌కి సహకరించడం లేదు" అని అడిగారు. నాకు ఏం చేయాలో తెలియక చాలా భయపడి, 'ఇప్పుడు నాకు రిలీవింగ్ లెటర్ ఎలా వస్తుంద'ని ఆలోచనలో పడ్డాను. ఇలా నడుస్తుండగా మా వదిన(నా భర్త అక్క)వాళ్లు అరుణాచలం వెళ్లాలని అనుకుంటుంటే, నేను కూడా వస్తానని వాళ్లతో చెప్పాను. కారణమేమిటంటే, ఒకరోజు నేను నా సమస్య గురించి బాబాని అడిగి క్వశ్చన్&ఆన్సర్ సైట్‌లో చూస్తే, 'శివుని పూజించు. అది నాకు చేరుతుంది' అని వచ్చింది. అందువల్ల నేను అరుణాచలం వెళ్లి అక్కడంతా, 'నాకు ఏ ఇబ్బంది లేకుండా మంచిగా రిలీవింగ్ లెటర్ రావాల'ని అని అనుకున్నాను. 


ఇకపోతే, హెచ్ఆర్ టీమ్ నాకు ప్రతివారం మెయిల్ చేస్తుండేది. నేను ఏదో ఒక రిప్లై ఇస్తూ ఉండేదాన్ని. ఇలా ఉండగా ఒకరోజు నా హెచ్ఆర్ స్పాక్(SPOC-single point of contact) నాకు ఫోన్ చేసి, "డిసెంబర్ 15, శుక్రవారం మీ చివరి పనిదినం" అని చెప్పారు. అఫీషియల్ మెయిల్ కూడా పంపారు. ఆ  వెంటనే హెచ్ఆర్ నా BGV రెడ్‌ వచ్చినట్లు మెయిల్ పంపి, మీ హెచ్‌ఆర్ స్పాక్ మిమ్మల్ని సంప్రదిస్తారని అన్నారు. కానీ నా హెచ్‌ఆర్ స్పాక్ నా ఈ మెయిల్‌లో లేరు. ఎందుకో తెలీదుగానీ నా ముందు ప్రాజెక్ట్ స్పాక్‌నే మెయిల్ సీసీలో పెడుతున్నారు. తర్వాత ఆ హెచ్ఆర్ నాకు ఫోన్ చేసి చాలా మాట్లాడక, "నిన్ను ఉద్యోగం నుండి తొలగిస్తారు. ఈరోజే నీ చివరి పనిదినం" అని అంది. నేను తనతో, "నా చివరి పనిదినం డిసెంబర్ 15. ఇది నా హెచ్‌ఆర్ స్పాక్ అప్‌డేట్. అందుకు సంబంధించిన అఫీషియల్ మెయిల్ కూడా నాకు వచ్చింది. మరి మీరు ఎలా అలా చెప్తారు?" అని అన్నాను. అప్పుడు తను, "నేను మెయిల్ చెక్ చేసి మళ్ళీ నిన్ను సంప్రదిస్తాను" అంది. కానీ తను నన్ను మళ్ళీ సంప్రదించలేదు. ఇంతలో నా ఫైనల్ సెటిల్‌మెంట్ మొదలైనట్లు నా పర్సనల్ మెయిల్‌కి మెయిల్ వచ్చింది. నేను చాలా సంతోషించి మళ్లీ అరుణాచలం వెళ్ళొచ్చాను. ఎందుకంటే, మునుపు వెళ్లినప్పుడు అంతా మంచిగా జరిగితే వస్తానని అనుకున్నాను. ఆరోజు శనివారం. మాములుగా శనివారం పనిదినం కాదు, సెలవు దినం. అలాంటిది ఆ రాత్రి 11 తర్వాత నాకు రిలీవింగ్ లెటర్ వచ్చింది. అంతా బాబా మహిమ. నా అసలు హెచ్ఆర్ స్పాక్ మెయిల్ సీసీలో ఉండకవపోవడమేంటో! నన్ను ఉద్యోగం నుండి తొలగించడానికి ఒక గంట ముందే నా చివరి పనిదినం అప్‌డేట్ అవడం ఏంటో! బాబా శివుణ్ణి పూజించు అనడం ఏంటో! అరుణాచలం వెళ్లొచ్చిన రోజే నాకు రిలీవింగ్ లెటర్ రావడం ఏంటో! అదంతా సర్వాంతర్యామి అయిన సాయిబాబాకే తెలియాలి. ఆయన నాకు ఏ సమస్యా లేకుండా రిలీవింగ్ లెటర్ వచ్చేలా చేసారు. “బాబా! మీకు వెలది కృతజ్ఞతలు”.


బాబాకి చెప్పుకున్నాక చేకూరిన ఆరోగ్యం


సాయిభక్తులందరికీ నమస్కారాలు. నా పేరు స్రవంతి. ఈ 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు గురించి ఈ మధ్యనే మావారు నాకు చెప్పారు. అప్పటినుంచి నేను ఈ బ్లాగులోని భక్తుల అనుభవాలు చదువుతున్నాను. మాకు ఇద్దరు సంతానం. మొదట పాప పుట్టింది. తర్వాత 8 సంవత్సరాలకి బాబు పుట్టాడు. ఇద్దరూ బాబా వరప్రసాదమే. బాబుకి 9వ నెలప్పుడు 2023, అక్టోబర్‌లో జ్వరం, జలుబు, దగ్గు వచ్చాయి. డాక్టర్‌ని సంప్రదిస్తే మందులిచ్చారు. రెండు రోజులకి జ్వరం తగ్గింది కానీ, జలుబు, దగ్గు తగ్గలేదు. బాబు చాలా ఇబ్బందిపడుతూ ఆహారం సరిగా తినేవాడు కాదు. దాంతో మళ్ళీ డాక్టర్ వద్దకి వెళితే ఎక్స్-రే తీయించి, "ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉంది. బాబుకి 5 రోజులు నెబ్యులైజర్ పెట్టండి" అని అన్నారు. అయితే బాబు చిన్నవాడైనందున నెబ్యులైజర్ పెడితే ఏడుస్తూండేవాడు. నాకు భయమేసి, "బాబా! మీ దయవల్ల వాడికి తగ్గితే, మీ అనుగ్రహం గురించి మన 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు ద్వారా తోటి భక్తులతో పంచుకుంటాను" అని బాబాకి చెప్పుకున్నాను. బాబా దయవల్ల మూడు రోజులలో బాబుకి పూర్తిగా నయమైపోయింది. "ధన్యవాదాలు సాయి. మొదటిసారి నా అనుభవాన్ని పంచుకున్నాను, తప్పులుంటే క్షమించు సాయి".


సాయిభక్తుల అనుభవమాలిక 1754వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబాని నమ్ముకుంటే ఎటువంటి సమస్య నుండైనా బయటపడేస్తారు
2. ఊదీ మహాత్మ్యము

బాబాని నమ్ముకుంటే ఎటువంటి సమస్య నుండైనా బయటపడేస్తారు


ఓం శ్రీసాయినాథాయ నమః!!! నేను ఒక సాయిభక్తుడిని. 2023, డిసెంబర్ నెలలో మా కుటుంబం, నా భార్య అక్కల కుటుంబాలు కలిసి మూడు రోజులు బెంగుళూరు మరియు కేరళ పర్యటనకి వెళ్లాలని ప్లాన్ చేసి టిక్కెట్లు బుక్ చేసాము. తర్వాత 'ట్రైన్ కాన్సల్' అని, మళ్ళీ రిస్టోర్ అయ్యిందని, మరోసారి యశ్వంతపూర్(బెంగళూరు సిటీలో ఒక రైల్వేస్టేషన్) వరకు ట్రైన్ వెళ్ళదని ముందు స్టేషన్‌లో ఆగిపోతుందని మెసేజ్లు వస్తూ ఉండేవి. కానీ ఆ బాబా దయవల్ల మేము బయలుదేరే రోజు ఆ ట్రైన్ గమ్యస్థానం వరకు పూర్తి జర్నీ చేస్తుందని మెసేజ్ వచ్చింది. ఇకపోతే ఆ రోజు ఉదయం నుంచి నాకు జ్వరం వచ్చినట్లు అనిపించి నీళ్ల విరేచనాలు కూడా అయ్యాయి. అదే సమయంలో కేరళలో కరోనా మళ్ళీ మొదలైందని వార్త వచ్చింది. అప్పుడు నేను  "బాబా! నేను, నా భార్య సంవత్సరం వయసున్న మా బాబుతో కేరళ పర్యటనకు వెళ్తున్నాం. మేము ఇక్కడ నుండి బయలుదేరి తిరిగి వచ్చేవరకు మీరు మాకు తోడుగా ఉండి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడండి తండ్రీ. మీ అనుగ్రహం 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను. అలాగే గురువారం మీ మందిరానికి వచ్చి 101 రూపాయల దక్షిణ సమర్పించి, ఒకరికి అన్నదానం చేస్తాను" అని బాబాను ప్రార్థించాను. మేము టెంపోలో వెళ్తున్నప్పుడు దారంతా ఏదో ఒక వాహనం మీద బాబా దర్శనమిస్తూ 'నేను మీతోనే ఉన్నాను, మిమ్మల్ని ముందుండి నడిపిస్తున్నాను' అని తెలియజేసారు. మేము మా పర్యటనను మైసూరు శ్రీచాముండేశ్వరిదేవి దర్శనంతో మొదలుపెట్టి వయనాడ్‌లో అన్ని ప్రసిద్ధ ప్రదేశాలు చూసాము. తిరిగి వచ్చేటప్పుడు మైసూరులో ప్రదేశాలు చూసుకొని యశ్వంతపూర్‌లో ట్రైన్ ఎక్కి సోలాపూర్ వచ్చాము. అలా మా పర్యటనను పూర్తి చేసాము. ఆ బాబా దయతో మాకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందీ కలగకుండా చూసుకున్నారు. ముఖ్యంగా మా బాబు పెద్దగా అల్లరి చేయలేదు. మా అందరి ఆరోగ్యాలు కూడా బాగానే ఉన్నాయి. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. మీ కృప మీ భక్తులందరిపై ఉండేలా చూడు తండ్రీ".


2024, జనవరి 8న మా ఆఫీసులో GM మరియు ఇతర హై లెవెల్ ఆఫీసర్ల ఇన్స్పెక్షన్ జరిగింది. ఆ ఇన్స్పెక్ష‌న్‌కి మా మెకానికల్ జోనల్ హై లెవెల్ ఆఫీసరు కూడా వచ్చారు. ఆయన చాలా కోపిష్టి. చిన్న చిన్న తప్పులకు కూడా సస్పెండ్ చేయడం, చార్జిషీట్లు ఇవ్వడం వంటివి చేస్తుంటారు. కాబట్టి ఇన్స్పెక్షన్‌లో నా పనిలో ఏదైనా లోపం కనిపించిందంటే నేను ఆయన కోపానికి, పనిష్మెంట్‌కి గురికాక తప్పదు. అందుచేత నేను బాబాను, "బాబా! ఇన్స్పెక్షన్‌లో నా అధీనంలో జరిగే ఏ పనిలోనూ ఎటువంటి సమస్య, లోపం కనపడకుండా చూడండి. ఒకవేళ ఏదైనా సమస్య వచ్చినా అది సమసిపోయేలా చేయండి. అలాగే ఎవరికీ ఎటువంటి సమస్య లేకుండా కాపాడండి" అని ప్రార్థించాను. ఇన్స్పెక్షన్ జరిగే ముందురోజు మా సార్ నాతో, "రేపు ఇన్స్పెక్షన్ జరిగే లొకేషన్‌కి 2 కెమెరాలు స్టాఫ్‌‌తో పంపమ"ని చెప్పారు. అయితే నేను హెవీ వర్క్ వల్ల ఆ విషయం అక్కడికి వెళ్ళే స్టాఫ్‌కి చెప్పడం మర్చిపోయాను. ఇన్స్పెక్షన్ జరిగినరోజు మా డివిజనల్ ఆఫీసరు కెమెరా గురించి మా సార్‌ని అడిగితే, మా సార్ వెంటనే నాకు ఫోన్ చేశారు. నాకు ఏమి చెప్పాలో అర్ధంకాక ఏదో సర్ది చెప్పాను. మా సార్ అదేరోజు సాయంత్రం వేరే కార్యక్రమానికి కూడా కెమెరా ఏర్పాటు చేయమని చెప్పారు. నేను ఒక స్టాఫ్‌కి చెప్పి, “కెమెరా తీసుకెళ్లామ”ని చెప్పాను. కానీ అతను మొబైల్లో ఫొటోలు బాగా వస్తాయని మొబైల్లోనే ఫోటోలు తీయసాగాడు. మా సార్ అది చూసి చాలా కోపమయ్యారు. నన్ను మరుసటిరోజు తమ క్యాబిన్‌కి పిలిచి మందలించి, ఆ స్టాఫ్ మీద రిపోర్ట్ పంపించమని, రెస్పాన్సిబుల్ పర్సన్స్ మీద ఏక్షన్ తీసుకుంటానని అన్నారు. నేను ఒకవేళ ఆ స్టాఫ్ మీద రిపోర్ట్ వ్రాసి పంపితే, ఆ లోపంలో నేను కూడా భాగమే కాబట్టి స్టాఫ్‌‌తోపాటు నాకు కూడా పనిష్మెంట్ పడుతుంది. అందువల్ల నేను, "బాబా! నేను చేసిన తప్పుని క్షమించండి. నాకు గానీ, నా స్టాఫ్‌కి గానీ పనిష్మెంట్ లేదా ఎటువంటి నష్టం రాకుండా కాపాడండి. అలా జరిగితే వచ్చే గురువారం మీ పేరు మీద ఒకరికి అన్నదానం చేసి నా అనుభవాన్ని ‘ఆధునిక సచ్చరిత్ర’గా పిలవబడే 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మొక్కుకున్నాను. బాబా చూపిన దయ చూడండి. మా జోనల్ హై లెవెల్ ఆఫీసరు, నాకు ఇంస్ట్రుక్షన్స్ ఇచ్చిన మా సార్ ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోయారు. దానివల్ల నాకుగానీ, మా స్టాఫ్‌ గానీ ఎటువంటి నష్టం/పనిష్మెంట్ రాలేదు. బాబాని నమ్ముకుంటే ఎటువంటి ఆటంకం నుండైనా బయటపడేస్తారు. భవిష్యత్తులో మరి ఎప్పుడూ ముఖ్యమైన విషయాల్లో నిర్లక్ష్యం వహించకూడదని ఈ అనుభవం వల్ల బాబా నాకు తెలిపారు. ఆయనకి మాటిచ్చినట్లు ఒకరికి అన్నదానం చేశాను. "ధన్యవాదాలు బాబా. ఇలానే నీ కృప నీ భక్తులందరిపై ఉండేలా చూడు తండ్రీ".


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై!!!


ఊదీ మహాత్మ్యము


సాయిబంధువులకు నమస్కారం. నా పేరు శ్రీనివాసరావు. 2023, డిసెంబర్ నెల చివరి వారంలో ఒక మూడు రోజులపాటు నాకు వెన్నుపూస నొప్పి వల్ల వంగడానికి, కూర్చుని లేవడానికి చాలా కష్టంగా ఉండేది. టాబ్లెట్ వేసుకున్నా, ఆయింట్మెంట్ రాసుకున్నా ఫలితం లేకపోయింది. చివరికి నాల్గవ రోజు నడవడానికి కూడా కష్టం అయింది. అప్పుడు నేను బాబా ఊదీ నొప్పి ఉన్న చోట రాసుకొని, "సాయంత్రానికి ఉపశమనం లభిస్తే, మీ అనుగ్రహాన్ని బ్లాగు ద్వారా తోటి సాయి భక్తులతో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల సాయంత్రానికి నొప్పి తగ్గి నేను నడవగాలిగాను. ఇలా కష్టమొచ్చిన ప్రతిసారీ బాబా మమ్మల్ని కాపాడుతున్నారు. "ధన్యవాదాలు బాబా".


ఓం శ్రీ సాయినాథాయ నమః!!!


సాయిభక్తుల అనుభవమాలిక 1753వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. నిజంగా బాబా నామం పలుకుతుంది

2. బాబా అనన్యప్రేమ


నిజంగా బాబా నామం పలుకుతుంది


ఓం శ్రీసాయినాథాయ నమః!!! ముందుగా గురువులకే గురువు పరమ గురువు అయిన సాయి చరణములకు నా అనంతకోటి నమస్కారాలు. నా పేరు శ్రీనివాసరావు. మాది నరసరావుపేట. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్‌ని. నేను నా చిన్నప్పటి నుంచి సాయిబాబా భక్తుడిని. సాయిని చూస్తూ, సాయిని తలుస్తూ, సాయి లీలామృతం చదువుతూ పెరిగాను. ఒకరకంగా చెప్పాలంటే సచ్చరిత్రలో చెప్పినట్టు బాబానే నన్ను పెంచారు. ఏ సమస్య వచ్చినా 'బాబా' అని పిలిచినంతనే ఆ తండ్రి నాకు తోడు-నీడై సహాయం అందిస్తున్నారు. నేనిప్పుడు బాబా మా అన్నయ్య విషయంలో ప్రసాదించిన ఒక ముఖ్యమైన అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. ఆలస్యంగా పంచుకుంటున్నందుకు ముందుగా బాబాకు క్షమాపణలు చెప్పుకుంటున్నాను. అది 2023, జూలై నెల. ఒక రోజు ఉదయం మా అన్నయ్య వద్ద నుంచి నాకు ఫోన్ వచ్చింది. విషయమేమిటంటే, 'ముందురోజు రాత్రి అన్నయ్యకి బాగలేదు, గుండెనొప్పి వస్తే హాస్పిటల్లో చేర్చారు, డాక్టర్ అంజియోగ్రామ్ చేసి, "గుండెలో మల్టీపుల్ బ్లాక్స్ వున్నాయి. సర్జరీ చేయాలి. హై రిస్క్ ఉంది. ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయలేము, మీరు వెంటనే వేరే హాస్పిటల్‌కి వెళ్ళండ"ని చెప్పారు'. అది విని నేను ఏడుస్తూ బాబా గుడికి వెళ్లి, "అన్నయ్యని ఎలాగైనా ఈ అనారోగ్యం నుండి బయటపడేయండి" అని బాబాను ప్రార్ధించాను. అప్పుడే పూజారి ఊదీ, బాబాకి వేసిన పూలమాల నాకిచ్చారు. నేను వాటిని మా అన్నయ్య కోసం కొరియర్ చేశాను. మా ఇంట్లోవాళ్ళు అన్నయ్యని మంగళగిరి NRI హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. ఆ హాస్పిటల్‌వాళ్ళు కూడా సర్జరీ ఎంతో రిస్క్‌తో కూడుకున్నదని చెప్పి, "5 లక్షల వరకు ఖర్చు అవుతుంది. గ్యారంటీ మాత్రం ఇవ్వలేము. రెండు వారాలలోపు సర్జరీ చేయాల"ని చెప్పారు. నేను హైదరాబాద్ నుండి బయలుదేరి మంగళగిరి చేరుకున్నాను. సర్జరీ హై రిస్క్‌తో కొడుకున్నందున సర్జరీ వద్దని మేము అనుకొని అన్నయ్యని హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకొచ్చాము. అంతలో తిరుపతి నుండి మా అక్క, బావ కూడా బయలుదేరి వచ్చారు. వాళ్ళు మెడికల్ ఫీల్డ్‌లో ఉండటం వల్ల చాలామంది డాక్టర్లని కలిసి అంజియోగ్రామ్ వీడియో చూపిస్తే, "ఇది సర్జరీ కేసు. ఒక రెండు వారాల లోపు సర్జరీ చేయించాల"ని చెప్పారు. మా నాన్న, వదిన హైదరాబాద్ వెళ్లి నాలుగు, ఐదు హాస్పిటళ్లు తిరిగారు. అందరూ హై రిస్క్ కేసు అని చెప్పారు. ఆలోపు రెండు వారాలు గడిచిపోయాయి. అది మా జీవితంలో మేము అత్యంత క్లిష్ట పరిస్థితి ఎదుర్కొన్న సమయం. ఆ రెండు వారాలు మేము అన్నయ్య నుదుటన బాబా ఊదీ పెట్టి, మరికొంత ఊదీ నీళ్లలో కలిపి అన్నయ్యకి ఇస్తూ ఇంట్లో అందరమూ బాబాని కన్నీళ్లతో ప్రార్థిస్తుండేవాళ్ళము. 'బాబా తప్పక ఏదో ఒక దారి చూపించి, అన్నయ్యని ఆ ఆనారోగ్య సమస్య నుండి బయటపడేస్తార'ని బాబా మీద నాకు బాగా నమ్మకం. ఎందుకంటే, జీవితంలో అన్ని దారులు మూసుకుపోయినప్పుడు బాబా మనకోసం ఇంకొక దారి తెరుస్తారు. అదే జరిగింది. నేను హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు కిమ్స్ హాస్పిటల్లో కార్డియాలజీ డాక్టర్‌కి అన్నయ్య అంజియోగ్రామ్ వీడియో పంపించి వచ్చాను. మా నాన్న, వదిన కూడా కిమ్స్ హాస్పిటల్‌లోని ఆ డాక్టర్ని కలిసి, అతని ఒపీనియన్ అడిగితే, "రెండు దశల్లో అంటే రెండు రోజుల వ్యవధిలో స్టెంట్లు వేద్దాం" అని చెప్పారు. ఇంకా అప్పుడు అన్నయ్యని హైదరాబాద్ తీసుకుని వెళ్లి కిమ్స్ హాస్పిటల్లో చేర్పించాము. 2023, ఆగష్టు 10న మొదటిసారి స్టెంట్ ప్రక్రియకు తీసుకొని వెళ్లేటప్పుడు మా అన్నయకి ఒక సాధువు కలలో కనపడి నుదుటన ఊదీ పెట్టారు. ఆ ప్రక్రియ పూర్తి కావడానికి రెండు గంటల సమయం పట్టింది. నేను బాబాని, "మీ నామం పలుకుతుందని మీరు చెప్పారు. అందుకు నాకు ఋజువు కావాలి" అని చెప్పి ఆ సమయమంతా మేము అందరమూ బాబా నామాన్ని నిరంతరాయంగా చేసుకున్నాము. నిజంగానే బాబా నామం పలికింది. ఆ రెండు గంటల సమయం పూర్తైయ్యేలోపు రాజమండ్రి సాయిమందిరం నుంచి ఒక యాగానికి సంబంధించి నా వాట్సాప్‌కి ఒక మెసేజ్ వచ్చింది. అదే మొదటిసారి ఆ గుడివాళ్ళు నాకు మెసేజ్ పెట్టడం. నేను ఆశ్చర్యపోయాను. ఇంతలో డాక్టర్ మమల్ని పిలుస్తున్నారని కబురు రావటంతో వెళ్లి డాక్టర్‌ని కలిస్తే, "స్టెంట్ ప్రక్రియ విజయవంతమైంద"ని చెప్పారు. రెండు రోజుల తర్వాత మరోసారి స్టెంట్లు వేసి మా అన్నయ్యను కాపాడారు. ఆ విధంగా బాబా మాపై దయ చూపారు. నాకు తోడు-నీడ అయిన నా సాయితండ్రిని నమ్ముకున్నవారికి తిరుగులేదు. నిజంగా ఆయన నామం పలుకుతుంది. మనం చేయవలసిందల్లా బాబాపై నమ్మకంతో తీవ్రంగా ప్రార్ధించటమే. 'సాయీ' అని పిలిచిన వెంటనే 'ఓయీ' అని పలికే నా తండ్రికి నా కృతజ్ఞతలు.


బాబా అనన్యప్రేమ


నా పేరు రాంబాబు, నేను విజయనగరం నివాసిని. నేను ఒక ఫార్మా కంపెనీలో ఇంచార్జ్‌గా పని చేస్తున్నాను. ఒకసారి నేను పని చేస్తున్న బ్లాక్‌లోని ప్రోడక్ట్ ఔట్పుట్ తక్కువగా రాసాగి, దానివల్ల ప్రోడక్ట్ స్టాకు నెగిటివ్‌లోకి వెళ్లడం మొదలైంది. పరిస్థితి సాధారణ స్థాయికి రావాలంటే రాబోయే ఔట్పుట్ అంతా ఎక్కువగా రావాల్సి ఉంది. కానీ రాబోయే ఔట్పుట్‌లన్నీ చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే, ఆ తర్వాత ప్రొడక్షన్ ప్లాన్ లేదు. అటువంటి పరిస్థితిలో నేను, "బాబా! ఈ సమస్య నుంచి నన్ను బయటపడేయండి. మీ అనుగ్రహం బ్లాగు ద్వారా తోటి భక్తులతో పంచుకుంటాన"ని బాబాని వేడుకున్నాను. బాబా మహిమ చూపించారు. మా బ్లాక్‌లో ఔట్పుట్ తగ్గిపోవడానికి కారణమైన మరొక సమస్య బయటపడి, పరిష్కరింపబడింది. ఇక అప్పటినుండి మా బ్లాక్ ఔట్పుట్ ఎక్కువగా రావడం మొదలై సమస్య పరిష్కారమైంది. కొన్నిరోజులకి అదే సమస్య మరొసారి నాకు ఎదురైంది. అప్పుడు కూడా నేను బాబాని వేడుకోవడంతో ఆ సమస్య నుండి బయటపడ్డాను.  విధంగా బాబా నన్ను ఆ క్లిష్ట పరిస్థితుల నుండి బయటపడేశారు. నా సొంతం అనేవాళ్ళు నా జీవితాంతం నాతో ఉండకపోవచ్చు కానీ, బాబా ఖచ్చితంగా నాతో ఉంటారు. "బాబా! మీ అనన్య ప్రేమకు చాలా చాలా ధన్యవాదాలు. 'ప్రజలందరి నోట సాయినామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి' అన్న శ్రీ సాయినాథుని శరత్‌బాబుజీ ఆశ, మధుర స్వప్నం ఈ బ్లాగు ద్వారా సాఫల్యం కావాలని ప్రార్థిస్తున్నాను".


ఓం శ్రీసాయినాథాయ నమః!!!

సర్వేజనా సుఖినోభవంతు!!!


సాయిభక్తుల అనుభవమాలిక 1752వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. నమ్మినవారికి అన్యాయం చేయరు బాబా
2. బాబా దర్శనంతో చేకూరిన మనోధైర్యం - సర్జరీ సఫలం

నమ్మినవారికి అన్యాయం చేయరు బాబా


ఓం శ్రీసాయినాథాయ నమః!!! సాయి భక్తులకు నమస్కారాలు. నా పేరు జయ. 2023, అక్టోబర్ నెలలో ఒకతను ఎక్కడినుండో వచ్చి  మా ఇంటి ఎదురుగా బత్తాయి జ్యూస్ బండి పెట్టాడు. ఆ జ్యూస్ తాగడానికి వచ్చే కుర్రాళ్ళు మా ఇంటి వైపు చూస్తుండటంతో మాకు ఇబ్బందిగా అనిపించి ఫ్రీగా తిరగలేకపోతుండేవాళ్ళము. మా అబ్బాయి మావారితో, "ఆ బండిని ఇంటికి ఎదురుగా తీయమని చెప్పండి డాడీ" అని అన్నాడు. దాంతో మావారు అతనిని బండి అక్కడినుండి తీయమని చెప్పారు. కానీ అతను ఆ బండి పక్కకు జరపకుండా నాకు చాలా పలుకుబడి ఉందని ఎవరెవరితోనో ఫోన్లో చేయించి మాతో మాట్లాడిస్తుండేవాడు. దాంతో అతను తేడానే అనిపించి నాకు భయమేసింది. నాకు తల్లి, తండ్రి అన్నీ బాబానే. ఏ సమస్య వచ్చినా ఆయనే నాకు దిక్కు. అందువల్ల, "ఇదేమిటి సాయిబాబా తాతయ్యా! ఇప్పటికే ఎన్నో సమస్యలతో చాలా డిస్టర్బ్ అయి వున్నాను. మళ్ళీ ఇదొక సమస్యేమిటి తండ్రీ? నాకు నువ్వే దిక్కు" అని చాలా బాధపడ్డాను. అప్పుడు నేను ఒకసారి ఆ బండి అతనికి చెప్పి చూడాలనిపించింది. అదే విషయం మా అబ్బాయితో, "తమ్ముడూ! ఇంటికి ఎదురుగా నువ్వు బండి పెట్టడం వల్ల మాకు ఇబ్బందిగా ఉంది, కొంచెం అర్థం చేసుకొని అవతలికి పెట్టుకోమ్మా అని చెప్పి  చూస్తాను" అని అన్నాను. అందుకు మా బాబు, "అమ్మా! ఈ విషయం డాడీతో చెప్పాక ఆ అబ్బాయితో మాట్లాడు" అని అన్నాడు. నేను వెంటనే, "మీ నాన్నతో కాదు. నాకు అన్నిటికి బాబాయే దిక్కు. చీటీలు వేసి ఆయన్నే అడుగుతాను. ఆయన ఏది చేయమంటే అదే చేస్తాన"ని చీటీలు వేసాను. బాబా నన్ను ఆ అబ్బాయిని అడగవద్దు అని చెప్పారు. ఆ చీటీ మా బాబుకి చూపించి, "బాబా వద్దన్నారుగా నేను ఆ బండి అబ్బాయిని ఏమీ అడగను. బాబానే చూసుకుంటారు" అని అన్నాను. తరవాత, "బాబా! మీ దయతో మా ఇంటికెదురుగా ఆ బండి తీసేస్తే, మీ అనుగ్రహం గురించి బ్లాగు ద్వారా తోటి భక్తులతో పంచుకుంటాన"ని బాబాని ప్రార్థించాను. మా అబ్బాయి, "డాడీ చెప్పినా తీయడం లేదు గనక కేసు పెడదాం" అని అంటుండేవాడు. ఒకరోజు నేను తనతో, "అలాంటి ఆలోచనేదీ చేయకు. ఈ విషయం గురించి నేను బాబాని చీటీలు వేసి అడిగినప్పుడు బాబా నన్ను అడగవద్దన్నారు. అందువల్ల నేను అడగట్లేదు. నువ్వు కూడా ఎలాంటి ఆలోచన చేయకు. బాబా చూసుకుంటారు. మనకు అన్యాయం చేయరు" అని చెప్పి ఆఫీసుకి వెళ్లాను. నేను ఆ సాయంత్రం ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి మా బాబు, "అమ్మా! నేను ఈ సమస్య గురించి స్పందన అమరావతికి కంప్లైంట్ చేశాను. వాళ్లు పరిష్కరిస్తామన్నారు" అని అన్నాడు. నేను, "అదేంటి? బాబా వద్దన్నారని నీకు చీటీ కూడా చూపించాను కదా! మరి నువ్వు ఎందుకు కంప్లైంట్ చేశావ"ని కోప్పడ్డాను. దానికి మా బాబు, "నిన్ను అడగవద్దన్నారు. నన్ను కాదుగా. ఏమీ పరవాలేదు" అన్నాడు. వెంటనే నాకు 'బాబా తండ్రే ఇలా నడిపిస్తున్నాడు’ అనిపించింది. ఎందుకంటే, మా బాబుకి ధైర్యం తక్కువ. అదీకాక నేను వద్దన్న పని అంతా తేలికగా చేయడు. అందుచేత కంప్లైంట్ చేయడం బాబా ప్రేరణ వలనే జరిగిందని భావించాను. తర్వాత కంప్లైంట్ తీసుకున్న ఆఫీసర్లు మా బాబుకి ఫోన్ చేసి, అన్ని వివరాలు తీసుకొని స్వయంగా వచ్చి మా ఇంటి ముందున్న బత్తాయి బండి ఫోటోలు తీసి, అతని అక్కడినుండి ఖాళీ చేయమని వార్నింగ్ ఇచ్చారు. రెండురోజుల్లో అతను అక్కడినుండి ఖాళీచేసి వెళ్ళిపోయాడు. సాయిబాబా దయవల్ల మేము చాలా తేలికగా ఆ సమస్య నుండి బయటపడ్డాము. సాయిబాబాతండ్రి నమ్మినవారికి అన్యాయం చేయరు. కొన్ని సమస్యల నుండి బయటపడటానికి ఎక్కువ సమయం పడుతుందంటే ఆ సమయంలో మనం అనుభవించే ఆందోళన రూపంలో బాబా మన పాపాలను తొలగిస్తున్నారని అర్థం. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. మా అందరికీ సంపూర్ణ సుఖసంతోషాలు ప్రసాదిస్తావని ఆశిస్తున్నాను తండ్రీ".


ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!!!


బాబా దర్శనంతో చేకూరిన మనోధైర్యం - సర్జరీ సఫలం


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!!! సాయి భక్తులందరికీ నమస్కారం. నేను ఒక సాయి భక్తురాలిని. దాదాపు సంవత్సరంన్నర నుండి నాకు తరచూ కడుపునొప్పి వస్తుండేది. ఇద్దరు డాక్టర్లను సంప్రదిస్తే, వాళ్ళు ఆ నొప్పి గ్యాస్ వల్ల వస్తుందని చెప్పడంతో నేను అందుకు సంబంధించిన మందులు వాడుతూ ఉండేదాన్ని. ఇలా ఉండగా 2023, ఆగస్టులో నేను నెల తప్పాను. కానీ గర్భం నిలబడలేదు. అప్పుడు నాకు లాప్రోస్కోపి చేయాల్సి వచ్చి చేసి, నా గర్భాశయంలో కణిత(ఫైబ్రాయిడ్) ఉందని, దానివల్ల నాకు కడుపునొప్పి వస్తుందని, భవిష్యత్తులో కూడా గర్భం దాల్చినప్పుడు ఇబ్బందులు ఉండొచ్చని నిర్ధారణ చేసి మూడు నెలలు తర్వాత మళ్ళీ స్కానింగ్ తీసి ఫైబ్రాయిడ్ విషయంలో ఏం చేద్దామన్నది ఆలోచిద్దామని డాక్టర్ అన్నారు. తర్వాత నవంబరులో మళ్ళీ స్కానింగ్‌కి వెళితే, "సర్జరీ చేసి ఫైబ్రాయిడ్ తీసేయాలి" అని చెప్పారు. నేను బాబా మీద భారమేసి, 'అంతా బాగా జరిగితే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. అప్పటికే మేము డిసెంబర్ 4, 5 తేదీల్లో శిరిడీ వెళ్ళడానికి టిక్కెట్లు బుక్ చేసుకొని ఉన్నాము. అయినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల డిసెంబర్ 4న సర్జరీ చేయించుకోవాల్సి వుంటుందని అనుకున్నాము. నాకెంతో బాధేసింది. అయితే బాబా దయవల్ల డాక్టరు వేరే పేషంట్లు ఉన్నారని, కాబట్టి డిసెంబర్ 6న చేస్తానని అన్నారు. అప్పుడు మేము, "అయితే మేము శిరిడీ వెళ్ళొస్తామ"ని అన్నాము. అందుకు డాక్టర్, "సంతోషంగా వెళ్లిరండి. వచ్చాక సర్జరీ చేద్దాం" అని అన్నారు. ఆ మాట వినగానే నాకు చాలా సంతోషమేసింది. అలా బాబా అనుగ్రహం వల్ల మేము ముందుగా అనుకున్నట్టు శిరిడీ వెళ్ళి బాబా దర్శనం చేసుకున్నాము. మనం ఎంత దూరంలో ఉన్నా వారిని పిచ్చుక కాలికి దారం కట్టి లాగినట్లు మనల్ని శిరిడీకి లాగి తమ దర్శనాన్ని అనుగ్రహిస్తారు. సర్జరీకి ముందు వారి దర్శనం నాకు కావాల్సినంత మనోధైర్యాన్ని ఇచ్చింది. ఆ ధైర్యంతో శిరిడీ నుండి వచ్చిన మరుసటిరోజు అంటే డిసెంబరు 6న నేను సర్జరీ చేయించుకోవడానికి వెళితే రోబోటిక్ సర్జరీ చేసి పైబ్రాయిడ్ తీసారు. బాబా దయవలన నేను సర్జరీ అయిన రెండో రోజే లేచి నడవగలిగాను. ఇప్పుడు మాములుగా తిరగగలుగుతున్నాను. ఇది అంతా బాబా లీల. "థాంక్యూ బాబా".


సాయిభక్తుల అనుభవమాలిక 1751వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టక సరైన సమయంలో, సరైన మార్గాన్ని చూపే బాబా 
2. మనస్ఫూర్తిగా నమ్మితే, అన్నీ బాబానే చూసుకుంటారు

ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టక సరైన సమయంలో, సరైన మార్గాన్ని చూపే బాబా 

 

సాయిబంధువులకు నమస్కారం. నేను ఒక సాయిభక్తురాలిని. 2023వ సంవత్సరం మధ్యలో నేను నా ఉద్యోగం కోల్పోయి వేరే ఉద్యోగం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాను. మొదట్లో నేను తొందరలోనే నాకు ఉద్యోగం వస్తుందని బాగానే ఉన్నాను. కానీ ఆలస్యం అయ్యేకొద్దీ, 'ఖర్చులకు డబ్బులు ఎలాగ'ని నా ఆర్థిక పరిస్థితి గురించి చాలా ఆందోళన చెందాను. సరిగ్గా ఆలోచించలేక, నిద్రపోలేక దాదాపు మానసికంగా కృంగిపోయిన స్థితిలో ఉండిపోయాను. కొత్త ఉద్యోగం దొరుకుతుందన్న ఆశ పూర్తిగా కోల్పోయి ఉద్యోగాల కోసం దరఖాస్తు చేయడం మానేశాను. కానీ ఈ సమయమంతా నేను సాయి మీద ఏ మాత్రమూ నమ్మకాన్ని కోల్పోలేదు. "నాకు ఒక మంచి ఉద్యోగం ప్రసాదించి నన్ను ఈ పరిస్థితి నుండి విముక్తి చేయమ"ని సాయిని ప్రార్థిస్తూ ఉండేదాన్ని. అలా ఆరు నెలలు గడిచిపోయాయి. దాదాపు ఆశలన్నీ కోల్పోయిన సమయంలో ఒకరోజు నేను అదివరకు దరఖాస్తు చేసుకున్న ఒక ఉద్యోగానికి సంబంధించి నాకు ఒక కాల్ వచ్చింది. అయితే ఆ ఉద్యోగానికి కావాల్సిన అర్హతలు నాకున్న అనుభవానికి సరిపోవు. అందువల్ల మొదట్లో నేను ఈ ఉద్యోగానికి ఎంపిక కాలేనని అనుకున్నాను. అయినప్పటికీ సాయిని తలుచుకొని ముందుకు వెళ్లాలని, ఆయనే మార్గం చూపుతారని, ఆ ప్రక్రియలో ముందుకు రాణించేలా చేస్తారని అనుకుని భారం ఆయన మీద వేసి ముందుకుసాగాను. బాబా దయవల్ల మొత్తం 3 రౌండ్ల ఇంటర్వ్యూకి వెళ్ళాను. అన్నీ రౌండ్లలో నా ప్రతిభను చక్కగా ప్రదర్శించాను. అంతా బాగా జరిగిందని, ఆఫర్‌ లెటర్ వస్తుందని చాలా సానుకూలంగా ఉన్నాను. అయితే 2 వారాలు గడిచినా కంపెనీ నుండి ఎటువంటి ప్రతిస్పందన రాలేదు. అయినా నేను సాయి మీద పూర్తి నమ్మకముంచి సహనంతో కంపెనీ నుండి ప్రతిస్పందన కోసం వేచి చూసాను. చివరికి ఒక మంచి రోజున కంపెనీ నుండి, 'ఒకసారి మీతో సమావేశమవ్వాలని అనుకుంటున్నాము' అని ఇమెయిల్ వచ్చింది. నేను సాయిని తలుచుకొని, 'అంతా ఆయన చూసుకుంటారని' సమావేశానికి నా అంగీకారం తెలిపాను. వాళ్ళు గురువారం రోజు ఫోన్ మీటింగ్ షెడ్యూల్ చేసారు. ఆ మీటింగ్‌లో నాకు ఉద్యోగం ఇస్తున్నామన్న శుభవార్త చెప్పారు. అది విని నేను చాలా ఆనందించాను. అలా సాయి కృపతో నాకు ఉద్యోగం రావడమేకాక నేను ఉద్యోగంలో నిలదొక్కుకోగలిగాను. కేవలం బాబా వల్ల, ఆయన చేసిన అద్భుతం వల్లనే ఆ ఉద్యోగానికి కావాల్సిన అర్హతలు నాకున్న అనుభవానికి సరిపోకపోయినప్పటికీ ఇదంతా సాధ్యమైంది. దాదాపు నా దగ్గరున్న పొదుపు డబ్బులు అయిపోయి ఆర్థిక సహాయం అందాల్సిన స్థితిలో అంటే సరైన సమయంలో బాబా నాకు ఒక మార్గాన్ని చూపించారు. తద్వారా తమ బిడ్డలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టమని, వారికి సరైన మార్గాన్ని చూపుతామని సాయి ఋజువు చేసారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".


మనస్ఫూర్తిగా నమ్మితే, అన్నీ బాబానే చూసుకుంటారు

 

ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై!!! నా పేరు చైతన్య. 2023, డిసెంబర్ 26న నేను ఒక నెలరోజుల సబ్స్క్రిప్షన్ కోసం డబ్బులు కడితే అనుకోకుండా వేరే ఆప్షన్ సెలెక్ట్ అయ్యి ఒక్క గంటలోనే నేను కట్టిన డబ్బులు అయిపోయాయి. దానివల్ల కంపెనీకి 10,000 రూపాయల నష్టం వచ్చే అవకాశముంది. విషయాన్ని మానేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్తే నన్ను ఏమీ అనకపోయినా నా అజాగ్రత్త వల్ల నష్టం వచ్చిందని అనుకుంటారు. అలాగని విషయాన్ని కప్పిపుచ్చాలంటే ఒక నెలంతా విషయాన్ని దాచిపెట్టాలి లేదా ఆ 10,000 రూపాయలు నేను చెల్లించాలి. నా భర్తతో చెప్తే, "చెప్పొద్దు. మనం ఎంతో కొంత డబ్బులు కడదాం" అని అన్నారు. నేను కూడా అలాగే చేద్దామనుకున్నాను. కానీ నాకెందుకో తప్పు చేస్తున్నాననే భావన వల్ల ఇబ్బందిగా అనిపించింది. అయినా తప్పనిసరై, "బాబా! ఈ విషయంలో సహాయం కాదు, మీరు ఏదైనా మిరాకిల్ చేస్తే కానీ నేను ఈ సమస్య నుంచి బయటపడే అవకాశం లేదు. మీరు కనుక నాకు ఈ సహాయం చేస్తే, మీ అనుగ్రహం బ్లాగు ద్వారా తోటి భక్తులతో పంచుకుంటాన"ని అనుకున్నాను. కానీ మనసులో నేను చేసిన తప్పుకి బాబాని పరీక్షిస్తున్నాననిపించింది. అందువల్ల బాబాని మన్నించమని వేడుకున్నాను. తర్వాత చిన్న ఆశతో సదరు కంపెనీవాళ్ళని సంప్రదించాను. అది రాత్రి సమయం. డిసెంబర్ 27, రాత్రి 1:30 వరకు ఆ కంపెనీ నుండి నాకు రిప్లై ఏమీ రాలేదు. అప్పుడింకా నేనే చొరవ తీసుకొని కంపెనీవాళ్లతో కొంతసేపు చాట్ చేశాను. వాళ్ళు సమస్య అర్ధం చేసుకొని అదనంగా డబ్బులు ఏమీ తీసుకోకుండా నెలరోజుల సబ్స్క్రిప్షన్ ఇచ్చారు. నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఆ తరువాత జరిగిన తప్పు గురించి మానేజ్మెంట్‌కి చెప్పాను. వాళ్ళు ఏమీ అనలేదు. అంతా బాబా దయ. మనస్ఫూర్తిగా నమ్మితే, అన్నీ ఆయనే చూసుకుంటారు. "బాబా! మీకు చాలా కృతజ్ఞతలు. మీరు చెప్పిన మార్గంలో నడవడానికి ప్రయత్నిస్తాను బాబా. సదా మమ్మల్ని కాపాడుతూ మేము సన్మార్గంలో నడిచేటట్టు ఆశీర్వదించండి బాబా".


సాయిభక్తుల అనుభవమాలిక 1750వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఎటువంటి సమస్యనైనా సులభంగా పరిష్కరించే బాబా
2. మ్రొక్కిన మొక్కులు మరచినా ఏదో విధంగా గుర్తుచేసి కాపాడే బాబా

ఎటువంటి సమస్యనైనా సులభంగా పరిష్కరించే బాబా

ఓంసాయి శ్రీసాయి జయజయసాయి. ఓం సాయినాథాయ నమః. నా పేరు రమాదేవి. 2023, అక్టోబర్ 1, ఆదివారంనాడు మావారు తన ఆఫీసులో ఒక ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఆ తరువాత మావారి హెడ్ కొన్ని విషయాలు ప్రస్తావించకుండా ఉండాల్సింది అన్నారు. ఆ విషయంగా మాట మాట పెరిగి గొడవ అయింది. దాంతో ఆ హెడ్ మావారి విషయం HRతో మాట్లాడుతాను అన్నారు. మావారు విషయం ఎంతవరకు వెళుతుందో తెలియదని నాతో అన్నారు. మేము గత మూడేళ్లుగా చాలా సమస్యలు అనుభవిస్తూ ఇప్పుడిప్పుడే బాబా దయవల్ల కొద్దిగా కుదుటపడ్డాము. అలాంటిది కొత్త సమస్య వచ్చేసరికి నేను కంగారుపడి, "మళ్ళీ ఏమవుతుంది బాబా?" అని బాధపడ్డాను. తర్వాత క్వశ్చన్&ఆన్సర్ సైట్‌లో చూస్తే, 'సచ్చరిత్ర చదువు సమస్య తొలగిపోతుంది' అని వచ్చింది. నేను ఆ విషయం మావారితో చెప్పానుగానీ ఆయన చదువుతారని అనుకోలేదు. మరుసటిరోజు సోమవారం గాంధీజయంతి కారణంగా సెలవు వచ్చింది. బాబా దయవల్ల ఆరోజు మావారు పారాయణ మొదలుపెట్టి 11 అధ్యాయాలు చదివారు. మరుసటిరోజు ఉదయం 2 అధ్యాయాలు చదివారు. తర్వాత ఆయన ఆఫీసుకి వెళ్తుంటే నేను మావారికి ఊదీపెట్టి, "బాబాను మీటింగ్‌లో కూర్చోమని వేడుకోండి" అని చెప్పాను. ఆయన అలాగే బాబాను వేడుకున్నారు. బాబా చేసిన అద్బుతం చూడండి. మీటింగ్‌లో HR మావారితో, "అలా కోపంగా నీ హెడ్‌తో మాట్లాడకుండా ఉండాల్సింది" అని మాత్రమే అన్నారు. అంతకుమించి ఏమీ అనలేదు. సమస్య అంత సులభంగా పరిష్కారమవుతుందని మేము అస్సలు అనుకోలేదు. అంతా బాబా దయ. ఆయన ప్రత్యక్షంగా ఆ మీటింగ్‌లో ఉన్నారని నా నమ్మకం. "బాబా! మీకు ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పినా తక్కువే తండ్రీ. ఇంతగా కాపాడుతున్న మీకు నేను ఏమి ఇవ్వగలను? మీకు శతకోటి  కృతజ్ఞతలు సాయిదేవా".

2023, అక్టోబర్ నెల రెండో వారంలో రెండురోజులు నాకు నీరసంగా ఉండి కళ్ళు తిరుగుతుంటే హాస్పిటల్‌కి వెళ్ళాను. డాక్టర్ చాలా టెస్టులు వ్రాసారు. అందులో ఈసీజీ కూడా ఉండేసరికి నాకు భయమేసి, "ఇదేంటి బాబా? ఏదో ORS త్రాగితే తగ్గిపోయేదానికి వీళ్ళు ఇన్ని టెస్టులు వ్రాసారు. ఏమైంది నాకు? సరే, రిపోర్టులు నార్మల్ రావాలి బాబా" అని అనుకున్నాను. బాబా దయవలన రిపోర్టులన్నీ నార్మల్ వచ్చాయి. దాంతో "ఏ సమస్యా లేదు. మంచి ఆహారం తీసుకోండి" అని చెప్పి పంపారు. "మీ దయకి ధన్యవాదాలు బాబా".


మ్రొక్కిన మొక్కులు మరచినా ఏదో విధంగా గుర్తుచేసి కాపాడే బాబా

సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు నిర్మల. 2023, అక్టోబర్ నెల రెండో వారం చివరిలో నాకు బాగా నీరసంగా, తల తిరుగుతున్నట్టుగా, ఆహారం ఎంత తిన్నా ఇంకా ఆకలి వేస్తున్నట్లుగా ఉంటుండేది. తగ్గిపోతుందిలే అని బాబాను తలుచుకుంటూ మూడు రోజులు అలానే ఉన్నాను. కానీ తగ్గలేదు. అప్పుడు ఊదీ నీళ్లు త్రాగి, "ఉదయానికి మామూలు అవ్వాలి బాబా. మీ అనుగ్రహం తోటి సాయిభక్తులతో పంచుకుంటాను" అని బాబాకి దణ్ణం పెట్టుకున్నాను. బాబా దయవల్ల ఉదయానికి నా పరిస్థితి సాధారణమైంది. "ధన్యవాదాలు బాబా".

మేము 2023, జనవరిలో కొల్లూరు వెళ్ళాము. ఆ సమయంలో అమ్మవారి రథోత్సవం జరుగుతుంది. అనంతరం అమ్మవారి వద్ద ఉన్న నాణేలు భక్తుల మీదికి విసురుతారని నేను బాబాను, "బాబా! మాకు నాణెం లభిస్తే, మీ అనుగ్రహం 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు ద్వారా తోటి సాయిభక్తులతో పంచుకుంటాను" అని మ్రొక్కుకున్నాను. బాబా దయతో నాకు ఒక నాణెం దొరికింది. అయితే నేను మ్రొక్కుకున్న మొక్కు గురించి మరచిపోయాను. 2023, అక్టోబర్ 15, ఉదయం నేను దేవుడి విగ్రహాలు శుభ్రపరుస్తున్నప్పుడు చూస్తే, బాబా ఆశీర్వాదంతో కొల్లూరు మూకాంబికా గుడిలో లభించిన రెండు రూపాయలు నాణెం కనిపించలేదు. ఎంత వెతికినా దొరకలేదు. అప్పడు నాకు నా మ్రొక్కు గుర్తొచ్చి, "బాబా! ఆ నాణెం దొరికితే ఈ రోజే సాయిభక్తులతో మీ అనుగ్రహం పంచుకుంటాను" అని మొక్కుకున్నాను. అప్పటిదాకా దొరకనిది వెంటనే దొరికింది. "ధన్యవాదాలు బాబా. మేము మా మొక్కులు మరచినా ఏదో విధంగా మాకు గుర్తు చేసి మమ్మల్ని కాపాడుతావు బాబా".


సాయిభక్తుల అనుభవమాలిక 1749వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఊదీ మహిమ
2. వ్యాపారం పెట్టుకోవడంలో బాబా సహకారం

ఊదీ మహిమ


ఓం శ్రీ సాయినాథాయ నమః!!! అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన సాయినాథునికి నా నమస్కారములు. నా పేరు శ్వేత. సాయిదేవుడు అందరికీ తమ దైనందిన జీవితంలోని ఎన్నో విషయాలలో సహాయం చేస్తుంటారు. మనం వాటిని ఒక్కోసారి గుర్తిస్తాము, ఒక్కోసారి గుర్తించము. కానీ బాబా ఎంతటి దయామయుడు అంటే మన చిన్న చిన్న విన్నపాలను సైతం గుర్తుంచుకొని వాటిని నెరవేర్చి మనకి ఆనందాన్ని ప్రసాదిస్తారు. ఒకసారి మా ఇంటిలోని వాషింగ్ మెషిన్ నడుస్తున్నప్పుడు మధ్యలో ఉన్నట్టుండి చాలా పెద్ద శబ్దం వచ్చింది. నేను వెంటనే మెషిన్ ఆపు చేశాను. తర్వాత నాకు వాషింగ్ మెషిన్ రిపేరుకు వచ్చిందనిపించి ఫ్రంట్ లోడ్ మిషన్ రిపేరుకు చాలా ఖర్చు అవుతుందని డబ్బులు లేని సమయంలో ఇలా అయిందని చాలా భయపడ్డాను. కాసేపటికి బాబాను తలుచుకుని ఊదీ వాషింగ్ మెషిన్‌కు పెట్టి ఆన్ చేశాను. బాబా దయవల్ల మెషిన్ నార్మల్గా పని చేసింది. బాబా ఊదీ ఎంతటి మహిమ గలదో కదా!


2023, డిసెంబర్ నెలలో నాకు గుండెలో ఏదో ఒకలాగా అనిపిస్తూ ఉండేది. నొప్పిగా ఉండేది కాదు కానీ, చాలా దడగా ఉండేది. చమటలు పట్టి చాలా టెన్షన్ వచ్చేది. ఇంటిలో ఎలాంటి టెన్షన్లు లేకపోయినా కూడా నాకు చాలా టెన్షన్ అనిపించేది. బాబాను తలుచుకుని ఊదీ గుండెలకు పూసుకొని, అలాగే నూదటన పెట్టుకొని, నోట్లో వేసుకున్నాను. బాబా దయవల్ల గుండెలో ఉన్న ఆ బాధ తగ్గుముఖం పట్టింది. అయినప్పటికీ గుండెకు సంబంధించినది కాబట్టి డాక్టర్ దగ్గర ఒకసారి చూపించుకుందామని వెళ్ళాము. ఈసీజీ చేస్తే అంతా నార్మల్ అని వచ్చింది. అంతా సాయిదేవుని కృప. ‌సాయిదేవుని మహిమలు వర్ణించడానికి మాటలు చాలవని నాకు అనిపిస్తుంది. "ధన్యవాదాలు బాబా. మీకు మాటిచ్చినట్లు ఈ రెండు అనుభవాలను తోటి సాయి భక్తులతో పంచుకున్నాను తండ్రి". చదువరులకు నాదొక మనవి, 'నేను రోజూ బాబాతో విన్నవించుకుంటున్న ఒక విషయాన్ని ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా తీర్చమని నా తరుపున మీరు కూడా ప్రార్థించండి’.


సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


వ్యాపారం పెట్టుకోవడంలో బాబా సహకారం


నేను ఒక సాయిభక్తుడిని. నేను 10వ తరగతి చదువుతున్నప్పటి నుంచి 'శ్రీసాయి లీలామృతం' పారాయణ చేస్తున్నాను. నేను బీటెక్ పూర్తి చేసిన తరువాత రెండు సంవత్సరాలు ఉద్యోగం చేశాను. ఆపై సొంతంగా వ్యాపారం మొదలుపెట్టాను. అయితే చాలావరకు నష్టపోయాను. నా డబ్బులు అన్నీ అయిపోయి అప్పులు మిగిలాయి. అప్పుడు కొందరు నువ్వింకా ఉద్యోగానికి తిరిగి వెళ్లడం మంచిదని సలహా ఇచ్చారు. కానీ నాకు అలా వెళ్లడం ఇష్టం లేక  మరో మంచి వ్యాపారం మొదలుపెట్టి, ఈసారి ఖచ్చితంగా విజయం సాధించాలని అనుకున్నాను. అందుకోసం ఒక మంచి వ్యాపారం చేయడానికి ప్రణాళిక చేశాను. కానీ నాకు దాదాపు 20 లక్షలు కావాలి. నా దగ్గర చూస్తే ఒక్క రూపాయి కూడా లేదు. నా తల్లిదండ్రులకి అంత డబ్బు ఇచ్చే స్తోమత లేదు. అందుకని నేను బాబా మీద భారమేసి డబ్బుకోసం ప్రయత్నాలు మొదలుపెట్టాను. అప్పుడు మా అత్తగారు, "నేను లోన్‌కి అప్లై చేశాను. అది వస్తే అందులో సగం అంటే దాదాపు 5 లక్షలు నీకిస్తాను. నువ్వు పెట్టుబడి కింద వాడుకో" అని చెప్పారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ లోన్ ఆవిడకు రాలేదు. నేను చాలా బాధపడ్డాను. కానీ బాబా నాకు తోడు ఉన్నారనే నమ్మకంతో డబ్బుకోసం ప్రయత్నం చేశాను. బాబా దయవల్ల నా స్నేహితుడు ఒకతను 2 లక్షల రూపాయలు నాకు ఇచ్చి, "నువ్వు పని మొదలుపెట్టుకో. మిగత డబ్బు అదే వస్తుందిలే" అని ధైర్యం చెప్పాడు. నేను ఆ డబ్బుతో పని మొదలుపెట్టాను. కొన్ని నెలలు తర్వాత మా అత్తగారు నాకోసం ఇంకోసారి లోన్‌కి ప్రయత్నాలు చేశారు. అప్పుడు నేను, "బాబా! ఈసారి లోన్ శాంక్షన్ అయితే మీ అనుగ్రహం 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు ద్వారా తోటి గురుబంధువులతో పంచుకుంటాను" అని బాబాకి, భరద్వాజ్ మాస్టర్‌గారికి మొక్కుకున్నాను. బాబా దయవల్ల అనుకున్న దానికంటే ఎక్కువ లోన్ శాంక్షన్ అయింది. తర్వాత కూడా ఎప్పుడు, ఏ కష్టం వచ్చినా బాబా దగ్గర చెప్పుకుంటే వెంటనే అది తొలగిపోయేది. నా వ్యాపారానికి ఏ పేరు పెట్టాలని అనుకున్నప్పుడు కూడా బాబా సన్నిధిలోనే నాకు సమాధానం దొరికింది. ఇలా ప్రతి అడుగులో బాబా, మాస్టర్ గారు నా వెంట ఉండి నన్ను నడిపించారు. వారి దయతో నేనిప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. ఇది అంతా బాబా, మాస్ట‌ర్‌గారి కృప. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".


సాయిభక్తుల అనుభవమాలిక 1748వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. సమస్యలను బాబా వద్దకు తీసుకెళ్లడమే తరువాయి - వెంటనే పరిష్కరిస్తారు
2. బాబా దయ

సమస్యలను బాబా వద్దకు తీసుకెళ్లడమే తరువాయి - వెంటనే పరిష్కరిస్తారు


ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!! నేను ఒక సాయిభక్తురాలిని. మా నాన్నగారు పోయిన తర్వాత నా చేయి పట్టుకుని నన్ను నడిపిస్తూ, ఓదారుస్తూ ముందుకు తీసుకెళ్తుంది నా సాయి మాత్రమే. నాకు కష్టమొచ్చినా, బాధ కలిగినా నాకు తోడుగా ఉండేది ఆయనొక్కరే. నాకెప్పుడు ఆరోగ్యం బాగోకపోయినా నా కళ్ళు వాలిపోతాయి. అలా కళ్ళు వాలిపోయినప్పుడు రెండు, మూడు రోజుల దాకా నేను మనిషిని కాలేను. నీరసంతో ఏదో లోకంలో ఉన్నట్టు ఎటో చూస్తూ, ఎవరైనా, ఏదైనా మాట్లాడినా అస్పష్టంగా సమాధానమిస్తాను. అలా ఈమధ్య నేను ఆరోగ్యం బాగాలేక బాధపడుతున్నప్పుడు కేవలం బాబా ఊదీ కలిపిన నీళ్లు తాగాను. అంతే! సాయి నాకు స్వస్థత చేకూర్చి నన్ను ఆ అనారోగ్య సమస్య నుంచి బయటపడేసారు. ఊదీ అంటే సంజీవని. "థాంక్యూ బాబా. మీరు లేకపోతే నేను ఏమైపోతాను?".


మేము గత కొన్ని సంవత్సరాలుగా సాయి మార్గంలో పయనిస్తూ ఆయన పద్ధతులే అవలంబిస్తున్నాం. మాకు వీధి కుక్కలు అంటే ఎనలేని ప్రేమ. మేము రోజూ దగ్గర దగ్గర 10 నుండి 15 కుక్కలకు అన్నం పెడతాం. ఇది చూసి మా వీధిలో ఉండే వేరే మతానికి చెందిన కొందరు, "మీరు ఒక్కళ్ళే ఉన్నవాళ్ళా? మీకు అన్నం మిగిలితే కాలువలో పారేసుకోండి. కానీ వీధి కుక్కలను పిలిచి, వాటికి మాత్రం పెట్టొద్దు. మీరు అన్నం పెట్టడం వల్ల ఆ కుక్కలు మా పిల్లల్ని రోడ్డు మీద ఆడుకోనివ్వటం లేదు" అని మా మీద గొడవకి వచ్చారు. అప్పుడు నేను ఆ సమస్య గురించి సాయికి చెప్పుకుని, "వీధిలో వాళ్లతో మాకు ఎటువంటి గొడవలు రాకూడదు. వాళ్లు కుక్కలని కొట్టకూడదు" అంటూ ప్రతిరోజూ  విన్నవించుకుంటుండేదాన్ని. బాబా దయవల్ల మా మీద విపరీతమైన కోపంతో ఊగిపోయేటటువంటివాళ్ళు ఎంతో ప్రేమగా, మర్యాదగా మాతో మాట్లాడటం మొదలుపెట్టారు. సాయికి సాధ్యం కానిది ఏదీ లేదు. మనం సమస్యలను ఆయన దాకా తీసుకెళ్లడమే తరువాయి వెంటనే వాటిని పరిష్కరిస్తారు. అలాంటి ఉదాహరణలు నా జీవితంలో ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిని వ్రాసుకుంటూ పోతే ఒక పుస్తకం అవుతుంది. సమస్య ఏదైనా సాయికి చెప్పేసి వదిలేయండి. అన్నీ ఆయన చూసుకుంటారు. ఆయన చేయరేమో అని అపనమ్మకం వద్దు. ఆయన ఖచ్చితంగా చేస్తారు. శ్రద్ధ - సబూరీలతో వేచి ఉండాలంతే!


అనంతకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!!!


బాబా దయ


నా పేరు తేజశ్రీ. మేము యూరప్‌లో నివాసముంటున్నాము. మేము ఇటీవల ఇల్లు మారాం. ఇక్కడ ఇల్లు అద్దెకు ఇవ్వడానికి చాలా నియమనిబంధనలు ఉంటాయి. వాటిని సరిగా పాటిస్తున్నామో, లేదో చూడటానికి ఓనర్లు ఎవరో ఒకరని ప్రతివారమూ పంపిస్తుంటారు. వాళ్ళు ముఖ్యంగా పిల్లల విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా వుంటారు. ఒకరోజు నా భర్త మా చిన్నబాబుని హాస్పిటల్‌కి తీసుకుని వెళ్ళారు. అదే సమయంలో నేను పరీక్షకి వెళ్ళాల్సి ఉంది. అది ఫైనల్ పరీక్ష అవ్వడం వల్ల నేను నిర్ణిత సమయానికల్లా అక్కడుండాలి. అందుచేత నేను నా భర్త త్వరగా వచ్చేస్తారన్న ఉద్దేశ్యంతో మా పెద్దబాబుని ఇంటిలో వదిలిపెట్టి పరీక్షకి వెళ్లిపోయాను. వాడికి 5 సంవత్సరాలు. బాబు అల్లరి ఏమీ చేయకుండా ఇంట్లో ఉన్నాడు. కానీ అదే సమయంలో చెకింగ్ కోసం వచ్చిన అమ్మాయి బాబుని తనతో తీసుకెళ్లి, మావారు వచ్చిన తర్వాత ఆయన్ని బాగా తిట్టింది. ఇంకా మరుసటిరోజు మీటింగ్‌కి మమ్మల్ని రమ్మన్నారు. నాకు, ‘ఏమైనా సమస్య అవుతుందేమో, మమ్మల్ని ఇల్లు ఖాళీ చేసి అక్కడినుండి వెళ్ళిపోమంటారేమోనని’ చాలా భయమేసింది. అప్పుడు నేను, "బాబా! మీ దయవల్ల వాళ్ళు మమ్మల్ని ఏమీ అనకుండా వదిలిస్తే మీ అనుగ్రహం గురించి బ్లాగు ద్వారా తోటి సాయిభక్తులతో పంచుకుంటాను" అని బాబాకి మొక్కుకున్నాను. బాబా దయవల్ల మరుసటిరోజు మీటింగ్‌లో మమ్మల్ని ఏమీ అనలేదు. అలాగే నేను ఫ్రెంచ్ కోర్సులో జాయినై, "మొదటి లెవెల్‌లో పాసైతే, బాబా అనుగ్రహం తోటి భక్తులతో పంచుకుంటాను" అని బాబాకి మొక్కుకున్నాను. బాబా దయవల్ల ఫస్ట్ లెవల్ పాసయ్యాను. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".


సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo