సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1739వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • సరైన సమయం వచ్చిందంటే బాబా అనుగ్రహించడానికి సెకన్లు చాలు - పనులన్నీ వాటికవే చకచకా అయిపోతాయి

ఓం నమో సాయినాథాయ!!! సాయి బంధువులకు నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. మేము కొన్ని కారణాల వల్ల ఇదివరకు మా ఫ్లాట్‌లో అద్దెకు ఉంటున్నవాళ్ళని 2 నెలల సమయమిచ్చి ఖాళీ చేయమని చెప్పాము. కానీ ఫ్లాట్ ఖాళీ అవుతుందంటే నాకు చాలా టెన్షన్‌గా ఉంటుంది. ఎందుకంటే, ఇల్లు ఖాళీ అయినప్పుడల్లా వాళ్ళు పాడుచేసినవి సరి చేయించాడనికి చాలా పెట్టుబడి పెట్టాలి. అదికాక మేము దూరంగా ఉండడం వల్ల మరమ్మత్తులు చేయించడం చాలా కష్టం(మా తమ్ముడు ఆ పనులు బాధ్యతగా చేయిస్తాడు కానీ, అస్తమానూ తనని ఇబ్బందిపెట్టడం నాకు ఇష్టముండదు). పైగా ఇల్లుకోసం అందరూ ఫోన్లు చేయడం, వాళ్ళకి సమాధానాలు చెప్పడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇవన్నీ కాకుండా జనరేటర్ సౌకర్యం లేనందున ఒక్కోసారి ప్లాట్ చాలా నెలలు ఖాళీగా ఉండిపోతుంటుంది. గతసారి ప్లాట్ 5 నెలలు ఖాళీగా ఉండిపోవడంతో చివరికి విసిగిపోయి అదివరకు ఉన్నవాళ్లకి ప్లాట్ ఇచ్చేశాను. ఏదేమైనా బాబా దయవల్ల వాళ్ళు చెప్పిన సమయానికి 2023, నవంబర్ 1న మా ఫ్లాట్ ఖాళీ చేశారు. దాంతో నాకు టెన్షన్ మొదలై టెన్షన్ పడుతూనే వాళ్ళు పాడుచేసినవన్నీ సరిచేయించి, శుభ్రం చేయించి టూలేట్ బోర్డు పెట్టి, "అద్దెకు మంచివాళ్ళు వచ్చేలా చూడమ"ని బాబాపై భారమేసి రోజూ, "ఎవరైనా సరే వచ్చిన వాళ్ళకి మా ఫ్లాట్ ఇవ్వడం మంచిదైతేనే ఆ వ్యవహారాన్ని ముందుకు తీసుకెళ్ళమ"ని బాబాను ప్రార్ధిస్తూ ఉండేదాన్ని. కానీ దగ్గర దగ్గర నెల అవుతున్నా అద్దెకు ఎవరూ కుదరలేదు. అసలు ఈసారి ఇల్లు అద్దెకు ఉందా అని విచారించేవాళ్ళు బాగా తగ్గిపోయారు. ఆ ఇల్లు అద్దె మాటేమో కానీ, ఆ విషయం వచ్చినప్పుడల్లా బాబా అనుగ్రహానికి దూరంగా ఉన్నామేమో అనే భావం నన్ను ఇంకా బాధపెట్టేది.


ఇలా నడుస్తుండగా ఒకరోజు OLXలో ఎవరో మెసేజ్ పెట్టారు. తర్వాత అతను తాను రైల్వే ఉద్యోగినని, భార్య, తల్లి, చిన్నపాప ఉంటామని హిందీలో మాట్లాడారు. నాకు హిందీ సరిగ్గా రాకపోవడం వల్ల నా భర్తతో మాట్లాడించాను. అతను అత్యవసరంగా ఇల్లు మారాల్సి ఉన్నందున వచ్చి చూసుకునే సమయం లేదని, ఫోటోలు, వీడియోలు పంపితే చూసి కన్ఫర్మ్ చేస్తానని చెప్పారు. సరేనని మేము ఫోటోలు, వీడియోలు పంపితే చూసి, మరుసటిరోజు పొద్దున్న ఒకే చేసి, అడ్వాన్స్ తన సుపీరియర్ ఆఫీసరుతో వేయిస్తానని, ఎంత పంపాలో మెసేజ్ పెట్టమని అన్నారు. మేము అలాగే చేసాము. తర్వాత అతను గూగుల్ పే ఓపెన్ చేయమంటే మావారు ఓపెన్ చేసారు. అతను నా పేరు మొదలైనవి కన్ఫర్మ్ చేసుకుని ట్రాన్స్‌యాక్షన్ పేజీలోకి వెళ్ళమన్నాడు. అప్పటిదాక ఏదో ట్రాన్స్‌లో ఉన్న నన్ను ఒక్కసారిగా బాబా చెళ్ళున చరిచినట్టు అనిపించి స్పృహలోకి వచ్చి, నా భర్తని ఆగమని చెప్పాను. అప్పుడు అతను మాకు డబ్బులు పంపడానికి బదులుగా మమ్మల్ని ఏదో చేయమని ఎందుకు చెప్తున్నాడనిపించి, ఏదో తేడాగా ఉందని, "మేము ఏమీ చేయము. మీరే ఒక రూపాయి మాకు పంపండి. మాకు వస్తే కన్ఫర్మ్ చేస్తామ"ని చెప్పేశాము. అందుకతను, డిఫెన్స్ వాళ్ళం అవడం వల్ల మాకు ఆ సౌలభ్యం ఉండదని, ఏదో రివర్స్ ట్రాన్స్‌యాక్షన్ చేయాలని ఏవో కహానీలు చెప్పాడు. కానీ మేము అనుమానంతో అతను చెప్పినట్లు చేయకుండా 'నో' చెప్పేశాం. తర్వాత ఒక 5 నిమషాలవుతూనే ఏదో అనుమానమొచ్చి అతను మాకు పెట్టిన జాబ్ ఐడి, ఆధార్ కార్డులు సేవ్ చేద్దామని చూస్తే, అప్పటికే అతను వాటిని డిలీట్ చేసేసాడు. అప్పుడుగానీ మాకు అది పక్కా మోసమని అర్దం కాలేదు. దాంతో  'బాబా ఎంత పెద్ద ప్రమాదం నుంచి మమ్మల్ని బయటపడేసారో' అని మనసులోనే బాబాకు కొన్ని వందల థాంక్స్ చెప్పుకున్నాను.


కొన్నాళ్లకు OLXలో మేము పెట్టిన యాడ్ ఎక్స్పైరీ అయింది. మళ్ళీ యాడ్ పోస్ట్ చేయాలంటే డబ్బులు కట్టాలి. ఒకవేళ కడదామన్నా ప్లాట్‌కోసం సరిగా కాల్స్ రావట్లేదు. పోనీ, యాడ్ హైలైట్‌లో కనపడేలా చేద్దామంటే ఇంకా ఎక్కువ డబ్బులు చెల్లించాలి. మాకు ఏమి చెయ్యాలో అర్దంకాక ఏమి చేయాలో తెలుపమని చీటీలు వేసి బాబాని అడిగితే, మళ్ళీ యాడ్ ఇవ్వమని వచ్చింది. నేను వెంటనే ఆ పని చేయబోతుంటే మావారు, "గురువారం చేద్దాంలే" అన్నారు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, 'మా ఫ్లాట్‌లోకి ఎవరైనా అద్దెకు తొందరగా వస్తే, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను. అలాగే 5 వారాలు సాయి దివ్యపూజ చేస్తాన'ని అనుకుని అప్పటికే ఒక వారం పూజ చేశాను. రెండో వారం అంటే మరుసటి గురువారం ఒక ఫంక్షన్‌కోసం మేము మా సొంతూరు వెళ్ళాము. మా ఫ్లాట్ అక్కడికి దగ్గర్లోనే ఉన్నందున ఫంక్షన్ అయ్యాక ఎలా ఉందో చూద్దామని మా ఫ్లాట్‌కి వెళ్ళాము. అక్కడ అంతా చూసాక నాకు, నా భర్తకు ఒకే భావన కలిగింది: 'అమ్మేద్దామ'ని. ఎందుకంటే, మేము ఎంత బాగా చేయించుకొని, అద్దంలా చూసుకుంటున్నా ప్రతిసారీ ఇల్లు చెత్తగా తయారవడం, మళ్ళీ బాగు చేయించుకోవడం, నెలల తరబడి అద్దెకు కుదరకపోవడం వంటి వాటితో తలనొప్పి అయిపోయింది. బాగా నీరసం వచ్చేసింది. సరే, అదేరోజు మేము ఇంటికి రాగానే ఇల్లు అమ్మడం గురించి బాబాని చీటీలు వేసి అడిగితే, 'అమ్మేయమ'ని వచ్చింది. దాంతో నేను OLX యాడ్ పోస్ట్ చేయొద్దని అనుకున్నాను. కానీ మావారు, "ప్రస్తుతానికి యాడ్ పోస్ట్ చేయి. బాబా చేయమని చెప్పారు కదా! అదీకాక ప్లాట్ అమ్మకం వెంటనే అయిపోయే పని కూడా కాదు కదా!" అని అన్నారు. దాంతో నేను బహుశా శనివారం అనుకుంటా యాడ్ పోస్ట్ చేసే పని మొదలుపెట్టాను. ఇక బాబా లీల చూడండి!


నేను యాడ్ క్రియేట్ చేసి, దాన్ని హైలైట్‌లో పెట్టడానికి డబ్బులు కడదామని చూస్తే, ట్రాన్స్‌యాక్షన్ ఫెయిల్ అయి కేవలం యాడ్ మాత్రమే పోస్ట్ అయింది. అప్పుడు, 'సరేలే ఎలాగూ 2, 3 రోజులు యాడ్ టాప్‌లోనే కనిపిస్తుంది. ఈలోపే బాబా మన పని పూర్తయ్యేలా చేసి డబ్బులు వృధాగా పోకుండా చేస్తారేమో!' అనిపించి ఊరుకున్నాను. నేను యాడ్ పోస్ట్ చేసిన 2 గంటల్లో FCI ఎంప్లాయ్ ఒకతను మమ్మల్ని సంప్రదించారు. అతను చెన్నై నుంచి బదిలీ మీద మా ఊరికి దగ్గర్లో ఉన్న ఒక ఊరికి వచ్చారు. అతను అక్కడికి దగ్గర్లో ఉన్న టౌన్‌లో ఉందామని నిశ్చయించుకున్నారు. నేను అతనికి మా ఫ్లాట్ చూపించమని మా తమ్ముడుతో చెప్పాను. మా తమ్ముడు చెన్నైలో చదువుకోవడం వల్ల తనకి తమిళం వచ్చు. కాబట్టి తమిళియన్ అయిన అతనితో మాట్లాడటానికి భాష ఇబ్బంది కాలేదు. అతను మా ఫ్లాట్ చూసుకొని అదేరోజు సాయంత్రం కల్లా అతను, అతని భార్య ఫోన్‌లో మాట్లాడి మా ప్లాట్ అద్దెకు తీసుకుంటామని కన్ఫర్మ్ చేసి, కొద్దిగా అడ్వాన్స్ ఇచ్చి డిసెంబర్ 15, శుక్రవారం ఫ్లాట్‌లో దిగుతామని, ఈలోపు శుభ్రం చేయించి పెట్టమని చెప్పారు. మేము సరేనన్నాం. బాబా దయవల్ల అన్నీ చకచకా జరిగిపోయాయి. 


తర్వాత డిసెంబర్ 13న అతను, "గురువారమే మంచిదన్నారు. వీలైతే ఒకరోజు ముందే ఇవ్వగలరా?" అని అడిగారు. బాబా రోజైన గురువారమే నాకు ఏ పనైనా చేయడం అలవాటు. వాళ్ళు కూడా గురువారం దిగుతామని చెప్పేసరికి సంతోషంగా సరేనని డిసెంబర్ 14న ప్లాట్ శుభ్రపరచమని ఒకరికి పని పురమాయించాను. వాళ్ళు తెల్లవారుజామునే వచ్చి ఉదయానికల్లా పని పూర్తిచేశారు. నేను ఫ్లాట్ అద్దెకు తీసుకుంటామన్న అతనికి ఫోన్ చేసి ఫ్లాట్ రెడీ అని చెప్పాను. అతను సాయంత్రం తాళాలు తీసుకుంటాను, మిగతా అడ్వాన్స్ డబ్బులు కూడా పంపిస్తానని చెప్పారు. మరుసటిరోజు డిసెంబర్ 15, గురువారంనాడు నేను 2వ వారం దివ్యపూజ పూర్తిచేసి లేచేటప్పటికి అతను అడ్వాన్స్ మొత్తం వేసినట్టు స్క్రీన్ షాట్ నా ఫోన్‌కి సెండ్ చేసి ఉంది. అడ్వాన్స్ పంపడం, ఫ్లాట్‌లో దిగడం గురువారమే జరిగినందుకు నాకు ఎంతో ఆనందంగా అనిపించింది. ఆ విధంగా 2వ వారమే సాయి దివ్యపూజ ఫలితాన్ని ఇచ్చింది. మొక్కుకున్న ప్రకారం బాబా గుడికి వెళ్ళి 108 ప్రదక్షిణలు చేసి ఇంటికి వచ్చి ఈ అనుభవాన్ని బ్లాగుకి పంపాను. 


ఒక్కోసారి(మన కర్మల ప్రభావం వల్ల) సాయి అనుగ్రహం అలస్యమవుతున్నట్టు అనిపిస్తుంది(గతంలో మా ఫ్లాట్ 5నెలలు ఖాళీగా ఉన్నట్టు). కానీ సరైన సమయం వచ్చిందంటే బాబా అనుగ్రహించడానికి సెకన్లు చాలు. పనులన్నీ వాటికవే చకచకా అయిపోతాయి. అందుకే బాబా చెప్పిన శ్రద్ధ-సబూరీలను మనం ఎప్పుడూ కలిగి ఉండాలి. "ధన్యవాదాలు బాబా. మాకు, మా ఇంట్లో అద్దెకు దిగినవాళ్ళకి ఎటువంటి ఇబ్బందీ రాకుండా చూడు తండ్రీ. నా మనసులో ఎప్పటినుంచో మిమ్మల్ని వేడుకుంటున్న కోరిక విషయంలో మీరు అనుగ్రహించదలచిన ప్రకారమే జరిగేలా చూడు స్వామి. ఎలాంటి పరిస్థితిలోనూ మా కుటుంబం మీ పాదాలు వదలకుండా, మీ అనుగ్రహం అనే చెట్టు నీడలో మా ప్రతి క్రియ జరిగేటట్లు చూడు స్వామి".


ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!!


17 comments:

  1. Baba Kalyan ki marriage chai thandri pl meku satha koti vandanalu urgent ga chai thandri pl bless him

    ReplyDelete
  2. ఓం సాయిరామ్

    ReplyDelete
  3. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏

    ReplyDelete
  4. Baba, provide peace and wellness to my parents 🙏🙏

    ReplyDelete
  5. Baba, take care of my son 💐💐💐💐

    ReplyDelete
  6. Om Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏🙏🙏

    ReplyDelete
  7. గురుబ్రహ్మ పరమాత్మ సాయినాథ నాలోన సకల కొట్టి రోగాలు సకల కోటి దోషాలతో తొలగించి నేను నా భర్త కలసి కాపురం యేసయ్య అబద్ధాలు లేకుండా నా భర్త మనసు మార్చుకొని నన్ను అర్థం చేసుకొని భార్యగా స్వీకరించి కాపురానికి తీసుకెళ్ళిన చూడు బాబా సాయి

    ReplyDelete
  8. Om Sri Sai Raksha 🙏🙏🙏

    ReplyDelete
  9. Om Sai Ram you wrote very well.your experience of baba is nice.when we have Sraddha and Saburi.Sai take care of us.we can slow problems with his blessings

    ReplyDelete
  10. ఓం శ్రీ సాయి రామ్

    ReplyDelete
  11. Baba ,Mee anugraham valla intha duram vacham .... migathavi kuda mere nadipinchandi twaraga ayyela chudandi baba.... anugrahinchandi baba ee tension thattukolekapothunna

    ReplyDelete
  12. Omsaisri Sai Jai Sai 🙏🙏🙏🙏 kapadu Tandri 🙏🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  13. sai madava bharam antha meede baba

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo