సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

లక్ష్మణరావు కులకర్ణి రత్నపార్ఖీ


'లక్ష్మణ్‌మామా'గా సాయిభక్తులకు పరిచయస్థుడైన లక్ష్మణరావు కులకర్ణి రత్నపార్ఖీ శిరిడీ గ్రామస్తుడు. ఇతను మాధవరావు దేశ్‌పాండే(షామా)కి మేనమామ. ఆ కారణం చేతనే అందరూ అతనిని లక్ష్మణ్‌మామా అని పిలిచేవారు. అతని పూర్వీకులు పేష్వా రాజవంశీయుల కాలంలో రత్నాల(వజ్రాలు మొదలైన) విలువను అంచనా వేయడంలో నిపుణులు. అందువలనే వారిని రత్నపార్ఖీ అనే ఇంటిపేరుతో పిలిచేవారు. వాళ్ళు బ్రాహ్మణ కులస్థులు. వృత్తిపరంగా పూజారులుగా ఉండేవారు. వాళ్ళు శిరిడీకి వలస వచ్చి, శిరిడీనే తమ నివాసంగా చేసుకున్నారు. విఠల మందిర ప్రాంగణంలో ఎడమవైపున మెట్లు ఉన్నాయి. వాటిమీదుగా వెళితే అక్కడ కొన్ని ఇళ్ళు ఉన్నాయి. వాటిలోనే రత్నపార్ఖీ కుటుంబం నివసిస్తుంది.

సనాతన బ్రాహ్మణుడైన లక్ష్మణ్‌మామా ఆచార వ్యవహారాలలో నిష్ఠాగరిష్ఠుడిగా ఉంటూ, అంటరానితనం వంటి వాటిని చాలా కఠినంగా అనుసరిస్తుండేవాడు. 1886 ప్రాంతంలో, అతను గ్రామ పూజారిగా, జ్యోతిష్కునిగా, తరువాతికాలంలో శిరిడీ గ్రామ జోషీ, వతన్‌దారు కులకర్ణిగా వ్యవహరించేవాడు. వాటన్నింటివలనో ఏమోగానీ అతను అహంభావిగా ఉండేవాడు. మొదట్లో అతనికి శిరిడీలో బాబా యొక్క అసాధారణమైన జీవన విధానం నచ్చేది కాదు. అతను బాబాను విశ్వసించకపోవడమే కాదు, పూర్తిగా వ్యతిరేకిస్తుండేవాడు. భక్తులంతా బాబా చేసే లీలలను అద్భుతంగా కీర్తిస్తుంటే, ఇతడు మాత్రం వాటన్నిటికీ దూరంగా ఉండేవాడు.

ఒకానొక సమయంలో లక్ష్మణ్‌మామా నయంకాని అనారోగ్యానికి గురయ్యాడు. ఎన్ని రకాల చికిత్సలు చేసినా, మందులు వాడినా అతని బాధకు అంతులేకుండాపోయింది. ఇక ఆఖరి పరిష్కారంగా అతడు మసీదుకు వెళ్లి బాబా ముందు నిలిచాడు. బాబా ప్రసన్నంగా అతనివైపు చూసి, అతని శరీరాన్ని తమ చేతితో స్పృశిస్తూ, "వెళ్ళు! అల్లా అంతా సరి చేస్తాడు" అని అన్నారు. నిజానికి మసీదులో అడుగుపెడుతూనే లక్ష్మణ్‌మామాలో అద్భుతమైన మార్పు వచ్చింది. పైగా ఇప్పుడు బాబా దీవెనలు పొందాడు. అంతే! ఆ క్షణం నుండి అతను బాబా భక్తుడయ్యాడు. త్వరలోనే అతను పూర్తి ఆరోగ్యవంతుడయ్యాడు.

అయితే కొన్నిరోజులకి లక్ష్మణ్‌మామాకి బాబా మరో పరీక్ష పెట్టారు. యుక్తవయస్సులో ఉన్న అతని ఒక్కగానొక్క కొడుకు బప్పాజీ అనారోగ్యం పాలయ్యాడు. బాబాపై విశ్వాసమున్న లక్ష్మణ్‌మామా ప్రతిరోజూ మసీదుకు వెళ్లి, బాబా తమ స్వహస్తాలతో ఇచ్చే ఊదీని తీసురావడం మొదలుపెట్టాడు. ఆ ఊదీని నీళ్లలో కలిపి, ఇతర చికిత్సలతోపాటు తన కొడుకుకి ఇస్తూండేవాడు. కానీ మృత్యుఘడియలు రానే వచ్చాయి. ఆ కుర్రవాడు ఇక తుదిశ్వాస విడుస్తాడని ప్రజలంతా అనుకోసాగారు. ఆ స్థితిలో లక్ష్మణ్‌మామా పరుగున మసీదుకు వెళ్లి బాబా పాదాల చెంత సాష్టాంగపడి, "బాబా! నా కొడుకుని రక్షించు! ఓ నా దేవా! నేను మీకు మోకరిల్లుతున్నాను, దయచూపు" అని దీనంగా విలపించాడు. కానీ బాబా, "దూరంగా పో!" అని అరచి, అతనిపై తిట్లవర్షం కురిపించారు. బాబా ప్రవర్తనకు అతడు భయకంపితుడయ్యాడు. ఆ వింత ప్రవర్తన అతనికి ఏ మాత్రం అర్థం కాలేదు. వాస్తవానికి అతనికి బాబాపై నమ్మకం ఉన్నప్పటికీ అతనిలో పాత లక్షణాలు పూర్తిగా తొలగిపోలేదు. అతనిలో అహం ఛాయలు ఇంకా మిగిలే ఉన్నాయి. కొన్ని సందేహాలు అతని మనసులో సమయానుసారంగా తలెత్తుతూనే ఉండేవి. అందుచేత బాబా అలా ప్రవర్తించేసరికి వికలమైన మనస్సుతో అతను తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటికి బాబా తమ ఆసనంపై నుండి లేచి, మసీదు మెట్లు దిగి నేరుగా లక్ష్మణ్‌మామా ఇంటికి వెళ్లారు. ఆయన ఆప్యాయంగా ప్రేమతో బప్పాజీ దేహాన్ని తమ అమృతహస్తాలతో స్పృశించి వెంటనే వెనక్కి తిరిగి వెళ్లిపోయారు. ఆ క్షణం నుండి బప్పాజీకి వ్యాధి నుండి ఉపశమనం లభించింది.

అప్పటినుండి లక్ష్మణ్‌మామాకు బాబా భగవంతుని అవతారమని నమ్మకం కుదిరి, ఏ పని చేస్తున్నా బాబా తలంపులో ఉండాలని నిర్ణయించుకున్నాడు. ప్రతిరోజూ అతను వేకువఝామునే నిద్రలేచి స్నాన-సంధ్యాదులు ముగించుకుని బాబా దర్శనం కోసం మసీదుకు వెళ్ళేవాడు. బాబా పాదాలు కడిగి గంధాక్షతలతో అర్చించి, తిలకం పెట్టి, పువ్వులు, తులసీదళాలతో పూజించి, ధూప, దీప, నైవేద్యాలు సమర్పించేవాడు. చివరిగా బాబాకు దక్షిణ ఇచ్చి, ఆయన ముందు సాష్టాంగపడి ఆశీస్సులు అందుకునేవాడు. తరువాత అక్కడున్నవారికి ప్రసాదం పంచిపెట్టేవాడు. ఆపై బాబా వద్ద సెలవు తీసుకుని గ్రామంలోని ఇతర దేవీదేవతలను పూజించేందుకు వెళ్ళేవాడు. ఇది అతని రోజువారీ కార్యక్రమంగా మారిపోయింది. తన తుదిశ్వాస వరకు ఈవిధంగా గొప్ప భక్తివిశ్వాసాలతో బాబాను సేవించుకున్నాడు.

బాబా ప్రియభక్తుడైన మేఘ ప్రతిరోజూ సకలోపచారాలతో బాబాకు పూజ, ఆరతులు నిర్వర్తించేవాడు. అతని మరణానంతరం బాపూసాహెబ్ జోగ్ ఆ కార్యక్రమాన్ని కొనసాగించాడు. 1918, అక్టోబర్ 15, పవిత్రమైన విజయదశమిరోజున మధ్యాహ్న సమయంలో బాబా మహాసమాధి చెందారు. మరుసటిరోజు ఉదయాన లక్ష్మణ్‌మామాకు కలలో బాబా కనిపించి, "నేను చనిపోయానని తలచి బాపూసాహెబ్ జోగ్ ఈరోజు కాకడ ఆరతి చేయటానికి రాడు. కానీ నేను ఎక్కడికీ పోలేదు, సజీవంగా ఉన్నాను. నువ్వు వచ్చి కాకడ ఆరతి చేయి" అని చెప్పారు. బాబా నిర్యాణంతో అందరూ శోకసంద్రంలో మునిగివుండగా, స్వప్నంలో బాబా ఇచ్చిన ఆదేశం ప్రకారం లక్ష్మణ్‌మామా ఆరతి చేయడానికి పూర్తి సన్నాహాలతో మసీదుకు వచ్చాడు. అక్కడ ఎవరు వారించినా లెక్కచేయకుండా బాబా ముందు సాష్టాంగపడి, బాబా ముఖంపై కప్పబడి ఉన్న వస్త్రాన్ని తొలగించి పూజ నిర్వహించాడు. ఆ సమయంలో అక్కడున్నవాళ్లలో చాలామంది బాబా చేతులు కదులుతుండటం చూశారు. బాబాను ఆ స్థితిలో చూస్తూ లక్ష్మణ్‌మామా కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. అతని శరీరం వణికిపోసాగింది. బాబాకు ఆరతి ఇచ్చి, ఆయన పిడికిలి తెరచి, అందులో దక్షిణ పెట్టి, మళ్ళీ పిడికిలి మూశాడు. సమాధి చెందిన సుమారు 15 గంటల తర్వాత కూడా బాబా చేతివేళ్ళు సులువుగా తెరిస్తే తెరుచుకున్నాయి, మూస్తే మూసుకున్నాయి. తరువాత చివరిసారిగా అతను బాబా ముఖాన్ని చూసి, తన్నుకొస్తున్న దుఃఖాన్ని అణుచుకుంటూ ఆయన శరీరంపై వస్త్రాన్ని కప్పి అక్కడినుండి ఇంటికి బయలుదేరాడు. ఈ విధంగా బాబా తమ మరణానంతరం మొదటి ఆరతి నిర్వహించే భాగ్యాన్ని లక్ష్మణ్‌మామాకు కల్పించి అతనిపై తమ ఆశీస్సులు కురిపించారు.

తరువాయిభాగంలో లక్ష్మణ్‌మామా కుమారుడు బప్పాజీ గురించి.

 Source: సాయిలీల పత్రిక మార్చి - ఏప్రిల్ 2007, సాయిపథం ప్రథమ సంపుటము, Baba’s Anurag & Baba’s Runanaubandh by Vinny Chitluri.

3 comments:

  1. ఓం సాయిరాం🙏💐🙏

    ReplyDelete
  2. ఓం సాయి రామ్ 🙏🏻🕉️

    ReplyDelete
  3. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo