సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 287వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. అడిగిందే తడవుగా ప్రేమతో అనుగ్రహించిన బాబా
  2. భక్తులపాలిట సంరక్షకుడు శ్రీసాయిబాబా

అడిగిందే తడవుగా ప్రేమతో అనుగ్రహించిన బాబా

పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు తనకి ఇటీవల జరిగిన ఒక అనుభవాన్ని మనతో ఇలా పంచుకుంటున్నారు:

3వ తరగతి చదువుతున్నప్పటి నుండి నాకు బాబా తెలుసు. అయితే కొద్ది సంవత్సరాల నుంచి నాకు బాబాతో సాన్నిహిత్యం ప్రారంభమైంది. ఆయన లేకుండా నేను లేను. బాబానే నా స్నేహితుడు, సహాయకుడు, సంరక్షకుడు. అసలివన్నీ కాదు, నాకు సర్వమూ బాబానే.

కొన్నేళ్ల క్రితం మా నాన్నగారు మారుతి ఎస్టీమ్ కారు కొన్నారు. అప్పుడు నేను కారు డ్రైవింగ్ నేర్చుకున్నాను. కానీ కారు నడపడానికి నాన్న నన్ను అస్సలు అనుమతించలేదు. అందువలన నేను నేర్చుకున్నదంతా వృధా అయిపోయింది. అదలా ఉంటే, ఈ సంవత్సరం నేను, మావారు ఒక కొత్త కారు కొన్నాము. మా అమ్మ మళ్ళీ డ్రైవింగ్ నేర్చుకోమని నన్ను ప్రోత్సహించడం ప్రారంభించింది. దాంతో నేను మళ్ళీ కారు డ్రైవింగ్ నేర్చుకున్నాను. కానీ కొత్త కారు నడిపే ధైర్యం చేయలేక పాత కారులో బాగా డ్రైవింగ్ నేర్చుకున్నాక కొత్త కారు నడుపుదామని అనుకున్నాను. అయితే అసలు సమస్య ఏమిటంటే, నాన్న పాత ఎస్టీమ్ కారు మూవింగ్ కండిషన్‌లో లేదు. అది కేవలం ఒక దిష్టిబొమ్మలా ఇంటిముందు ఉందంతే. పోనీ ఆ పాతకారును అమ్మేసి వేరే సెకండ్ హ్యాండ్ కారు తీసుకుందామంటే ఆ కారుతో నాన్న మానసికంగా బాగా కనెక్ట్ అయివున్నారు. ఆయన దానిని అమ్మడానికి అస్సలు ఇష్టపడేవారు కాదు. అందువలన నేను, 'నాన్న కారు అమ్మడానికి ఇష్టపడేలా చేయమని, అది కూడా పాత కారు అమ్మగా వచ్చిన మొత్తానికి కేవలం పదివేల రూపాయల అదనపు చెల్లింపుతో సెకండ్ హ్యాండ్ కారు లభించేలా అనుగ్రహించమ'ని బాబాను ప్రార్థించాను. బాబా నా ప్రార్థన విని అనుగ్రహించారు. బాబా ఆశీస్సులతో నాన్న కారు అమ్మడానికి ఒప్పుకోవడమే కాదు, కేవలం ఐదువేల రూపాయల అదనపు చెల్లింపుతో ఇంకొక కారు తీసుకోగలిగాము. "బాబా! అడిగిందే తడవుగా ప్రేమతో అనుగ్రహించిన మీకు చాలా చాలా ధన్యవాదాలు. దయచేసి నన్ను, నా కుటుంబాన్ని పుష్కలంగా ఆశీర్వదించండి. నేను మీకు చేసిన వాగ్దానం ప్రకారం నా అనుభవాన్ని ఈ బ్లాగులో పంచుకుంటున్నాను".

భక్తులపాలిట సంరక్షకుడు శ్రీసాయిబాబా

1978, మే 25, గురువారం నాకు, నా స్నేహితుడికి ఎప్పటికీ గుర్తుండిపోతుంది.ఎందుకంటే, ఆరోజున మేమిద్దరం శ్రీసాయి కృపను చవిచూశాము. ఆయన మా ఇద్దరినీ ఘోరమైన ప్రమాదం నుండి రక్షించారు. ఆరోజు మేము మా భోజనానంతరం అలవాటు ప్రకారం అరటిపండు తినడం కోసం ఫోర్ట్ మార్కెట్ సమీపంలో ఉన్న ఓ ప్రదేశానికి వెళ్ళాము. అరటిపండ్లు తిన్న తరువాత మేము తిరిగి కార్యాలయానికి వెళ్తున్నాము. సగం దూరం వచ్చాక రోడ్డు దాటి అవతలివైపు ఉన్న ఫుట్‌పాత్ పైకి వెళ్లాల్సి ఉంది. అయితే రహదారిపై ఉన్న రెడ్ సిగ్నల్ గమనించకుండా మేము రోడ్డును దాటుతున్నాము. హఠాత్తుగా ఒక ట్యాక్సీ, దాని వెనుక ఒక టెంపో వచ్చాయి. టెంపో వేగాన్ని గమనించిన నా స్నేహితుడు నేను ముందుకు వెళ్లకుండా నిరోధించడానికి నన్ను పట్టుకున్నాడు. అయితే ఒక్కసారిగా టెంపోను చూడటంవలన కలిగిన కంగారులో ముందున్న ట్యాక్సీని కూడా గమనించకుండా నేను నా స్నేహితుడిని వదిలేసి ట్యాక్సీకి, టెంపోకి మధ్య సందుగుండా వేగంగా రోడ్డు దాటడానికి పరుగెత్తాను. నిజానికి టెంపో ఉన్న వేగానికి ముందున్న ట్యాక్సీ బంపర్ కి, టెంపోకి మధ్య నా కాలు నలిగి చూర్ణమైపోయేది. కానీ ఏదో ఒక అదృశ్యశక్తి నన్ను ముందుకు తోసింది. 'ఆ అదృశ్యశక్తి మరేదో కాదు, అది ఖచ్చితంగా శ్రీసాయిబాబా' అని నా విశ్వాసం. ఆయన అనివార్యమైన మరణం నుండి నన్ను బయటపడేశారు. నా ఆకస్మికచర్య కారణంగా నా స్నేహితుడు కూడా అప్రమత్తుడై రోడ్డు దాటడానికి తగు జాగ్రత్త తీసుకున్నాడు. మా ప్రాణాలను కాపాడటం ద్వారా తన భక్తుల వెనుక తానుండగా ఏ శక్తీ ఏ హానీ కలిగించదన్న గొప్ప సత్యాన్ని తెలియజేశారు శ్రీసాయిబాబా.

-ఎన్.బి.సంతాని,
బొంబాయి-400037.
(మూలం శ్రీ సాయిలీల - డిసెంబర్ 1978)

3 comments:

  1. sai ram nenu yemi cheyalo ardam kavadam ledu
    ee naatakalu adaleka pothunnanu
    edo okati chei baba
    yevariki cheppukoleka kuli kuli pothunnanu
    nevu thappa naaku adukoni dikku ledu sai
    pls. sai
    always be with me.

    OM SAI RAM , OM SAI RAM, OM SAI RAM, OM SAI RAM , OM SAI RAM , OM SAI RAM

    ReplyDelete
  2. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo