సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 283వ భాగం....


ఈ భాగంలో అనుభవం:
  • సాయి కరుణా వీక్షణాలు

పేరు వెల్లడించని ఒక సాయి భక్తుడు తన అనుభవాలనిలా పంచుకుంటున్నారు:


ముందుగా సాయిభక్తులందరికీ నమస్కారం. ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయిబాబాకు, బ్లాగు చదువుతున్న సాయిబాబాలందరికీ నా నమస్కారములు. నేను ఈ మధ్యనే ఈ బ్లాగులు చదవడం మొదలుపెట్టాను. ఇందులోని లీలలు చదువుతుంటే ఎంతో ఎంతో ఆనందంగా ఉంటుంది. మనసు ఆహ్లాదంగా ఉండి, భగవంతుని పట్ల, ముఖ్యంగా సాయిబాబా పట్ల భక్తి మరింత అధికమవుతోంది. అది ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది.

నేను గత 15, 16 సంవత్సరాల నుంచి సాయిబాబా భక్తుడినైనా, 'భక్తుడు' అని చెప్పుకునేంత పెద్దవాడిని కాను. నేను బాబానే పూజిస్తూ ఉంటాను, బాబానే స్మరిస్తూ ఉంటాను. కాకపోతే మిగతా భక్తులంత కాదు. నేను చాలా చిన్న సాధారణ సాయిభక్తుడిని. నేను చిన్నప్పట్నుంచీ సాయిభక్తుడిని కాదు. కాకపోతే నా భార్య మాత్రం చిన్నప్పటినుండి సాయిబాబా భక్తురాలు.

ఒకసారి ఏమైందంటే, నేను నేను పూజగదిలో కూర్చుని ఉన్నాను. ఆరోజు నా కుడిచేతి చిటికెన వేలు బాగా నొప్పిగా ఉంది. మా అమ్మ ఆ వేలికి నూనెతో మర్దన చేస్తూ ఉంది. ఆ సమయంలో నేను సాయిబాబా ఫోటో చూడడం జరిగింది. అయితే ఆయన మీద అంతగా నమ్మకం లేదు కాబట్టి, మనసులో ఉన్న చిన్న సంశయంతో ఆయనతో ఒక మాట అన్నాను, "మీరు నిజంగా ఉంటే నాకు నొప్పి తగ్గిపోవాలి" అని. అలా అనుకున్న ఐదు నిమిషాల్లో నొప్పి తగ్గిపోయింది. అప్పుడు నేను 'నిజంగా బాబా ఉన్నారు' అనుకున్నాను. బాబా అంటూ ఉంటారు, "నా ఫోటో ఉంటే నేను ఉన్నట్టే, మీ ఇంట్లో ఉండి నిన్ను చూస్తూ ఉంటాను" అని. అది నిజమే అనిపించింది. మనందరినీ బాబా చూస్తూ ఉంటారు. బాబా మనల్ని బాధలపాలు, కష్టాలపాలు కాకుండా చూస్తారని నిజంగా మనసుకి అనిపించింది. ఆరోజు నాకు మొదటిసారిగా బాబా మీద కొంచెం గురి కుదిరింది

ఆ తర్వాత కొంతకాలానికి వృత్తిరీత్యా నాకు పెద్ద సమస్య వచ్చి పడింది. దానినుండి ఎలా బయటపడాలని నా స్నేహితులని అడిగితే, బాబా గుడికి వెళ్ళమని, సాయిసచ్చరిత్ర పారాయణ చేయమని చెప్పారు. అప్పుడే నేను మొట్టమొదటిసారి సచ్చరిత్ర పారాయణ చేశాను. పారాయణ పూర్తయిన తరువాత కూడా నా సమస్య అలాగే ఉండిపోయింది. బాబా మీద నమ్మకం తగ్గిపోయింది. తర్వాత మళ్ళీ పారాయణ చేయలేదు. కానీ కొంతకాలం తర్వాత మళ్లీ ఎందుకో సచ్చరిత్ర పారాయణ చేయాలనిపించింది. బాబా అంటారు కదా, "నా భక్తుడు ఎక్కడున్నా దారం కట్టి అతనిని నావద్దకు లాగుకుంటాను" అని. అందుకే నా మనసులో పారాయణ చేయాలనే సంకల్పం కలిగించి ఉంటారు. దాంతో ఇంకొకసారి సచ్చరిత్ర పారాయణ చేశాను. పారాయణ పూర్తి చేసిన తరువాత నా సమస్య తీరిపోయింది. అప్పటినుంచి నాకు బాబా పట్ల నమ్మకం కుదిరింది. ప్రతి గురువారం బాబా గుడికి వెళ్ళడం ప్రారంభించాను.

ఆ తరువాత 2003లో నేను నా భార్య పిల్లలతో సహా శిరిడీ వెళ్ళి మొదటిసారిగా బాబా దర్శనం చేసుకున్నాను. అప్పటినుంచి నేను సాయిభక్తుడిగా మారిపోయాను. ఇప్పుడు కూడా 'భక్తుడు' అని చెప్పడానికి కొంచెం ఇబ్బందిపడుతూ ఉంటాను, ఎందుకంటే బ్లాగును చూస్తూ ఉంటే 'నేను చాలా చాలా చిన్న భక్తుణ్ణి' అనిపిస్తుంది. 

2008లో నాకు జరిగిన ఒక మంచి అనుభవాన్ని చెప్తాను. దానిని అనుభవం అనేకంటే 'బాబా లీల' అంటే బాగుంటుందేమో! ఒకరోజు తెల్లవారుఝామున 3 గంటలకు నాకు విపరీతంగా కడుపునొప్పి వచ్చింది. కడుపునొప్పికి కారణమేంటో అర్థం కాలేదు. ఏవిధంగా పడుకున్నా కూడా నిద్రపట్టట్లేదు, నొప్పి మరింత ఎక్కువైపోతోంది. అప్పుడనిపించింది, కిడ్నీలో రాళ్ళు ఉండి వుంటాయేమో అని. ఎందుకంటే, నిటారుగా నిలబడటం కూడా కష్టంగా ఉంది. నొప్పి వల్ల వంగి నడుస్తున్నాను. విపరీతమైన నొప్పి వస్తూ ఉంది. ఇక నొప్పి భరించలేక 5 గంటలప్పుడు పొరుగున ఉన్న మిత్రుల్ని లేపి నన్ను డాక్టర్ దగ్గరకి తీసుకెళ్లమని అడిగాను. వాళ్ళు నన్ను హాస్పిటల్‌కి తీసుకువెళ్ళడానికి కారు సిద్ధం చేశారు. హాస్పిటల్‌కి వెళ్ళబోయేముందు ఒకసారి బాబా గదిలోకి వెళ్లి, బాబాకు నమస్కారం చేసుకుని, బాబా ఊదీ కొద్దిగా నోట్లో వేసుకుని, కొంచెం నుదుటన పెట్టుకుని, "కడుపునొప్పి ఎక్కువగా ఉంది బాబా, నొప్పి తగ్గేలా అనుగ్రహించండి" అని ప్రార్థించాను. బాబా ఊదీ నోట్లో వేసుకోగానే ఎందుకో బాత్రూంకి వెళ్లాలని అనిపించింది. సరే, హాస్పిటల్‌కి వెళ్లేముందు ఒక్కసారి బాత్రూంకి వెళ్దామని వెళ్ళాను. అప్పుడు యూరిన్‌తో పాటు ఒక చిన్న రాయి బయటకు వెళ్ళిపోయింది. ఇది నాకు తెలియకుండానే జరిగిపోయింది. బాత్రూం నుండి బయటకు వచ్చాక నాకు ఎంతో ఉపశమనంగా అనిపించింది. అప్పటిదాకా నిటారుగా నిలబడలేకపోయిన వాడిని, బాత్రూంకి వెళ్ళొచ్చాక చక్కగా నిలబడగలిగాను. ఇదంతా ఒకే ఒక్క క్షణంలో జరిగిన మార్పు. తర్వాత నెమ్మదిగా మెట్లు దిగి, కారులో కూర్చున్నాను. నా మిత్రులు నన్ను డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళారు. కారు దిగి మామూలుగానే నడుచుకుంటూ హాస్పిటల్లోకి వెళ్ళాను. డాక్టర్ నన్ను పరీక్షించి, "యూరిన్‌ ద్వారా ఒక రాయి వెళ్ళిపోయినా, మూత్రపిండాలలో ఇంకొక రాయి ఉంది. మందులు వాడండి, తగ్గిపోతుంది" అని చెప్పారు. ఇది జరిగి ఇప్పటికి 9 సంవత్సరాలు అవుతోంది. ఇప్పటికీ ఆ రాయి కడుపులోనే ఉంది, కానీ  ఆ రాయివల్ల ఒక్కసారి కూడా కడుపునొప్పి రాలేదు. ఇదంతా కేవలం సాయిబాబా అనుగ్రహమే. థాంక్యూ! థాంక్యూ సో మచ్ బాబా! ఇలాగే ఎప్పుడూ మాతో ఉండండి బాబా! మీరే మాకు రక్ష, మీరే మాకు దిక్కు. శరణు శరణు సాయీ!"

3 comments:

  1. Akilandakoti brahmandanayaka Sri sachchidananda sadguru sainath maharajuki jai om sai ram

    ReplyDelete
  2. sai sai sai sai sai sai sai sai sai sai sai sai sai

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo