సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 293వ భాగం....


ఈ భాగంలో అనుభవం:
  • క్షయవ్యాధి భయాన్ని తీసేసిన బాబా

జర్మనీ నుండి ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

అందరికీ నమస్కారం. సాయిభక్తులందరి విశ్వాసాన్ని పెంచే ఈ గొప్ప వేదిక(బ్లాగు) వెనుక ఉన్నవారికి ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కఠినమైన సమయాన్ని ఎదుర్కొంటున్న వారికి విశ్వాసం పెరుగుతుందన్నదే నా అనుభవం వ్రాయడంలో ముఖ్య ఉద్దేశ్యం. ఇక నా అనుభవానికి వస్తే....

నేను సాయిభక్తురాలిని. నేను ప్రస్తుతం జర్మనీలో మాస్టర్స్ చేస్తున్నాను. నా చదువు ముగింపు దశలో ఉంది. నా కోర్సులోని చివరి పరీక్ష చాలా కష్టమైంది. అందులో ఉత్తీర్ణత సాధించడం చాలా కష్టం. ఒక నెల కన్నా ఎక్కువకాలంగా నేను పరీక్ష కోసం సిద్ధమవుతున్నప్పటికీ నేను చాలా భయపడుతున్నాను. ఇదిలా ఉంటే ఒకరోజు మధ్యాహ్నం నేను బయటనుండి ఇంటికి తిరిగి వచ్చాను. అప్పటికి కొన్నిరోజుల ముందునుండి నా పోస్ట్‌బాక్స్ తనిఖీ చేసుకోని నేను ఎందుకో ఆరోజు పోస్ట్‌బాక్స్ తెరచి చూశాను. అందులో నగర ఆరోగ్యశాఖ నుండి వచ్చిన ఒక లేఖ ఉంది. అది చూసి నేను కాస్త భయపడ్డాను. ఎందుకంటే అలాంటి లేఖలు రావడం చాలా అరుదు. ఆ లేఖలో, “మీరు క్షయవ్యాధి(టిబి)తో బాధపడుతున్న వ్యక్తితో పరిచయం కలిగి ఉన్నారు. అందువలన ఆ వ్యాధి మీమీద కూడా ప్రభావం చూపుతుందని మేము అనుమానిస్తున్నాము. కాబట్టి దయచేసి వచ్చి ఎక్స్-రే, రక్తపరీక్షలు చేయించుకోండి. చట్టప్రకారం మీరు దీనికి సహకరించాలి” అని ఉంది. అది చదివాక నాకు వణుకుతో నోటమాట రాలేదు. నేను అస్సలు నమ్మలేకపోయాను. వెంటనే నేను హెల్త్ డిపార్టుమెంటుకి ఫోన్ చేశాను. కానీ ఎవరూ లిఫ్ట్ చేయలేదు. ఆరోజు శుక్రవారం కావడంతో ఆఫీస్ త్వరగా మూసివేసినట్లున్నారని అనుకున్నాను. వారాంతం కాబట్టి ఏ సమాచారం తెలుసుకోవాలన్నా సోమవారం వరకు వేచి ఉండడం తప్ప నాకు వేరే మార్గం లేదు.

నా మాస్టర్స్ కి సంబంధించిన పరీక్ష రాబోయే గురువారం ఉంది. ఈ హెల్త్ పరీక్ష కూడా అదే సమయంలో ఉండటంతో నాకేమి చేయాలో తెలియలేదు. ఈ సమస్య వలన నేను చాలా ప్రభావితమై, టెన్షన్‌లో ఏడవడం మొదలుపెట్టాను. మరే వ్యక్తికైనా రెండు పరీక్షలు చేయించుకోవడం పెద్ద విషయం కాదు, కానీ నాకు 'నోసోకోమ్ ఫోబియా' (హాస్పిటల్స్ అంటే భయం) ఉంది. అంటే నేను చిన్న విషయంగానైనా హాస్పిటల్‌కి వెళ్లాల్సి వస్తే చచ్చేంత భయపడతాను. ఆ టెన్షన్‌లో పూర్తి ప్రతికూల ఆలోచనలతో నా మనస్సంతా నిండిపోయి అస్సలు చదువు మీద దృష్టి పెట్టలేకపోయాను. 'నా పరీక్షకు ముందు ఈ లేఖను నేను స్వీకరించేలా బాబా ఎందుకు చేశారా?' అని ఆలోచిస్తూ పరీక్షను రద్దు చేసుకోవాలని అనుకున్నాను.

తరువాత నేను నెట్‌లో టిబి లక్షణాల గురించి శోధించాను. అక్కడ పేర్కొన్న లక్షణాలేవీ నాకు లేవు. కానీ నాకు టెన్షన్ పోలేదు. నా ఈ భయాన్ని నా తల్లిదండ్రులతో పంచుకోలేను. ఎందుకంటే నేను వారినుండి దూరంగా ఉన్నందున వారు చాలా ఆందోళన చెందుతారు. కాబట్టి బాబానే నమ్ముకున్నాను. నేను, "బాబా! దీనివలన నాకు ఏ సమస్య లేనట్లయితే, ఇండియాలో ఉన్న నా తల్లిదండ్రులు ఏ మందిరం నుండైనా ప్రసాదం అందుకోవాలి" అని మనస్సులోనే బాబాను ప్రార్థించాను. తరువాత కూడా, "నాకు సహాయం చేయమ"ని బాబాను ప్రార్థిస్తూ ప్రతిక్షణం గడిపాను. మరుసటిరోజు మా అమ్మ ఫోన్ చేసి, "మంత్రాలయ రాఘవేంద్రస్వామి ఆలయం నుండి ప్రసాదం వచ్చింది" అని చెప్పింది. నేను ఆశ్చర్యపోయాను. కాస్త ఉపశమనం చేకూరి, శుక్రవారం నుండి ఏమీ చదువుకోని నేను పరీక్షకోసం చదవడం మొదలుపెట్టాను. కానీ ఎక్కడో నా మనస్సులో ఉన్న భయం నన్ను చంపుతోంది. మరుసటిరోజు అమ్మ మళ్ళీ ఫోన్ చేసి, "స్నేహితుల ద్వారా మరలా రాఘవేంద్రస్వామి ప్రసాదం వచ్చింద"ని చెప్పింది. నేను ఆశ్చర్యపోతూ, ప్రసాదం వరుసగా రెండురోజులు రావడంతో, 'ఏమి జరిగినా సాయి నాతోనే ఉన్నార'ని ధృవీకరించుకొని పూర్తిగా పరీక్షపై దృష్టి పెట్టాను. అయితే ఆ రాత్రి చెడు కలల కారణంగా నేను నిద్రపోలేకపోయాను. ఆ ప్రభావం నామీద పడుతున్నప్పటికీ ఏదో ఒకవిధంగా చదువుతున్నాను. మరుసటిరోజు ఉదయాన్నే అమ్మ ఫోన్ చేసి, "శిరిడీ నుండి ప్రసాదం వచ్చింది" అని చెప్పింది. నేను అస్సలు నమ్మలేకపోయాను. నా సాయి తన ఆశీర్వాదాలను ఇంత బాగా అందిస్తూ, ఖచ్చితంగా నాతో ఉన్నానని చూపిస్తున్నారని అర్థం చేసుకుని నేను ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాను. ఆయనపై పెట్టుకున్న విశ్వాసానికి ప్రతిఫలంగా మనకు లభించే ఆశీర్వాదం అది.

ఇక నేను ఆ సమస్య గురించి చింతించడం పూర్తిగా మానేసి పరీక్షకు ప్రిపేర్ అయ్యాను. బాబా కృపతో నేను గురువారం ఉదయం పరీక్ష బాగా వ్రాసాను. పరీక్ష తర్వాత మధ్యాహ్నం నేను నాకొచ్చిన లేఖను తీసుకుని హెల్త్ డిపార్టుమెంటుకి వెళ్లి, వాళ్ళని వివరాలు అడిగాను. నేను యూలాజీ హాస్పిటల్లో ఉన్న ఒక టిబి రోగితో పరిచయం కలిగి ఉన్నానని వాళ్ళు నాతో చెప్పారు. ఆ ఆసుపత్రిని ఎప్పుడూ నేను సందర్శించనందున పూర్తిగా అయోమయంలో పడ్డాను. నేను వాళ్లతో, "ఏదో గందరగోళం జరిగింది. నేను ఆ హాస్పిటల్ని సందర్శించలేద"ని చెప్పాను. మొదట వాళ్ళు నేను చెప్పేదానికి అంగీకరించక, నేను పరీక్షలు చేయించుకోవలసిందేనని అన్నారు. నేను కూడా రికార్డు చూపించి ఋజువు చేయాల్సిందేనని పట్టుబట్టాను. దాంతో వాళ్ళు ఋజువు చూపించారు. అక్కడే పెద్ద తప్పు జరిగింది. నా చివరి పేరు మరొక వ్యక్తి చివరి పేరు ఒకటే కావడంతో హెల్త్ డిపార్టుమెంట్ వాళ్ళు పొరపాటున నాకు లేఖను పంపారు. దాంతో వాళ్ళు నాకు క్షమాపణలు చెప్పారు. ఇక నా ఆనందానికి హద్దులు లేవు.

ఈ సంఘటన నా జీవితంలో ఇప్పటివరకు జరిగిన అతి పెద్ద అనుభవం. పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నా, అస్సలు ఆశలేకపోయినా బాబాపై పూర్తి విశ్వాసం కలిగి ఉండటంవలన మొత్తం పరిస్థితి రెప్పపాటుకాలంలో మలుపు తిరగగలదని నేను పాఠం నేర్చుకున్నాను. ఈ అనుభవం బాబాపట్ల నాకున్న ప్రేమను, భక్తిని పెంచింది. ఆయన తన అద్భుత లీలలతో తన భక్తులను ఆకర్షిస్తుంటారని నేను చాలాసార్లు చదివాను. నేను కూడా అటువంటి వారిలో ఒకరిగా అయినందుకు ధన్యురాలినయ్యాను. "చాలా చాలా ధన్యవాదాలు బాబా!"

source: http://www.shirdisaibabaexperiences.org/2019/10/shirdi-sai-baba-miracles-part-2520.html


1 comment:

  1. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo