సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 277వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. బాబా ఆశీర్వాదాలు
  2. బాబా నా ప్రార్థన మన్నించి టెన్షన్ తీసేశారు

బాబా ఆశీర్వాదాలు

USA నుండి ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

నేను బాబాకు అంకిత భక్తురాలిని. నేను ఆయనను చాలా చాలా ప్రేమిస్తున్నాను. నేను ఆయనను ప్రార్థిస్తాను. నా ఆనందాన్ని, దుఃఖాన్ని ఆయనతో పంచుకుంటాను. బాబా నాకు తెలియకపోతే నా జీవితం ఎలా ఉండేదో నాకు తెలియదుకానీ, ఆయనే నా జీవితానికి ఆశ. 'సొరంగం చివర్లో కాంతి ఉంటుంది' అని ప్రజలు అంటారు. ఆ కాంతి బాబానే అని నమ్మకం కలిగించే అనుభవాలు నాకు చాలా ఉన్నాయి. వాటిలో రెండు అనుభవాలను నేనిప్పుడు మీతో పంచుకుంటాను. బ్లాగును తయారుచేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయిభక్తులకు బాబా ఇచ్చిన దివ్య అనుభవాలను చేరుస్తున్నవారికి నా కృతజ్ఞతలు. ముఖ్యంగా బ్లాగు నాకెంతో ఆనందాన్నిస్తోంది.

మొదటి అనుభవం:

హఠాత్తుగా ఒక రాత్రి నాకు 'పల్సేటింగ్ టిన్నిటస్' (చెవులలో ఒకరకమైన పెద్ద శబ్దం, నా విషయంలో ఒక చెవిలో) సమస్య వచ్చింది. ఆ అసౌకర్యం కారణంగా నేను నిద్రనుండి మేల్కొన్నాను. దానికి తోడు కాస్త మెడనొప్పి కూడా ఉంది. నేను చాలా ఇబ్బందిపడ్డాను. ఆ లక్షణాలు గురించి గూగుల్‌లో గుండె, మెడ, మెదడుకు సంబంధించిన చాలా తీవ్రమైన పరిస్థితుల కారణంగా చెవిలో విపరీతమైన శబ్దాన్ని కలిగిస్తుందని చదివాను. దాంతో నేను కొంచెం ఆందోళన చెందాను. కానీ మరీ ఎక్కువగా ఆందోళన చెందకూడదని అనుకున్నాను. యు.ఎస్‌.లో నివసిస్తున్నందున నాకు ఊదీ దొరికే అవకాశం లేదు. కాబట్టి ఒక షాపులో బూడిద కొని బాబా ఫోటో దగ్గర ఉంచుతాను. ఆ బూడిదను ఆశీర్వదించి పవిత్రమైన ఊదీగా చేయమని నేనెప్పుడూ బాబాను ప్రార్థిస్తూ ఉంటాను. ఉదయం నేను పూజగదిలోకి వెళ్లి నాకొచ్చిన కష్టం గురించి బాబాను ప్రార్థించాను. ఆ ఊదీ తీసుకుని కొంచెం నా చెవిలో, మెడపై, ఛాతీపై రాసుకుని, నుదుటన కూడా పెట్టుకున్నాను. అద్భుతం! గంటలో పల్సేటింగ్ శబ్దం ఆగిపోయింది. పూర్తి ఉపశమనం లభించింది. నా ఆనందానికి అవధులులేవు. బాబాకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలియదు. కానీ, నేను మీకు భరోసా ఇస్తున్నాను, మీరు ఆయనను విశ్వసించి, హృదయపూర్వకంగా ఆయనను ప్రార్థిస్తే, ఆయన ఖచ్చితంగా మీకు సహాయం అందిస్తారు.

మరొక అనుభవం:

కొంతమంది బాబా విగ్రహం లేదా బాబా ఫోటోనుండి ఊదీ వచ్చే అద్భుతాలను చెప్తూ ఉంటారు. "మరి నాకెందుకు అటువంటి అనుభవం జరగదు? అలా జరిగితే వాటిని బాబా ఇచ్చిన అమూల్యమైన కానుకగా దాచుకుంటాను కదా!" అనిపిస్తూ ఉంటుంది. మరికొందరు గణేష్ విగ్రహాలు లేదా ఇతర వస్తువులు అద్భుతంగా పొందుతారని నేను కొన్ని పుస్తకాలలో చదివాను. అందువలన నేను బాబా నుండి ఏదైనా విలువైన వస్తువు కానుకగా పొందాలని అనుకున్నాను. అలాంటి అనుభవం నేనెప్పుడు పొందుతానో అని ఆలోచనలో పడ్డాను. ఆ మరుసటిరోజు శుక్రవారం. నాకు కొన్ని కారణాల వల్ల కాలిఫోర్నియాలోని సన్నీవేల్‌ లోని బాబా ఆలయానికి వెళ్లాలని అనిపించింది. నేను అక్కడికి చేరుకునేసరికే దాదాపు మధ్యాహ్న ఆరతి సమయమైంది. నేను ఆలయంలోకి అడుగుపెడుతూనే ఒక మహిళ నా దగ్గరకు వచ్చి నా నుదుటిపై చందనం పెట్టి, ఒక పెద్ద ప్యాకెట్ నా చేతికిచ్చింది. నేను ఆమెకు కృతజ్ఞతలు చెప్పాను. అంతకుముందెప్పుడూ నాకలాంటి అనుభవం జరగలేదు. తరువాత స్వయంగా నా చేతులతో తమకు ఆరతి ఇచ్చే అవకాశాన్ని కూడా బాబా ఇచ్చారు. నా మనసంతా ఆనందంతో నిండిపోయింది. ఆ మహిళ ఇచ్చిన ప్యాకెట్‌లో పెద్ద స్వీట్ బాక్స్, అరటిపండు, గాజులు, ఒక పట్టువస్త్రం, పసుపు, కుంకుమ ఉన్నాయి. ఆశ్చర్యమేమిటంటే, ఆమె ఇచ్చిన గాజులు నా చేతికి సరిగ్గా సరిపోయాయి. ఆమె ఇచ్చిన ప్రసాదం ఎంతో రుచికరంగా ఉంది. ఆ విషయాన్ని, ఆమె ఇచ్చిన కానుక నాకెంత ఆనందాన్నిచ్చాయో ఆమెకు చెప్పే అవకాశం నాకు రాలేదు. ఆమె నన్ను మళ్ళీ కలవలేదు. నా అభ్యర్థనను బాబా విన్నారని, నేను అడిగిన దానికంటే ఎక్కువే ఇచ్చారని నేను గట్టిగా నమ్ముతున్నాను. మీకున్న ప్రతి అనుభవం మిమ్మల్ని బాబా దగ్గరికి చేరుస్తుంది. ఆయనకు శరణు పొందండి.

బాబా నా ప్రార్థన మన్నించి టెన్షన్ తీసేశారు

విశాఖపట్నం నుంచి సాయిభక్తురాలు వల్లి తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు: 

నా పేరు వల్లి. నేను విశాఖపట్నం నివాసిని. ముందుగా ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా ప్రణామాలు. బాబా నా జీవితంలో ఎన్నో అనుభవాలను ప్రసాదించారు. వాటిలో కొన్నింటిని ఈ బ్లాగ్ ద్వారా ఇంతకుముందు మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరొక అనుభవాన్ని మన సాయి బంధువులందరితో పంచుకోవాలనుకుంటున్నాను. 

ఈమధ్య మా అమ్మగారి ఊరిలో రామాలయ నిర్మాణం ప్రారంభించారు. ఆ ఆలయ నిర్మాణానికి చందాలు వసూలు చేస్తున్నారు. నేను ఊరికి వెళ్ళినప్పుడు నన్ను కూడా చందా ఇవ్వమని అడిగారు. మా అక్కాచెల్లెళ్ళు అందరం తలా పదివేల రూపాయలు చందాగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాము. అయితే మా అక్కాచెల్లెళ్ళు ఎవరికీ ఎటువంటి ఇబ్బందీ లేదు, వాళ్ళు ఎప్పుడైనా ఇవ్వగలరు. కానీ, నేను మాత్రం ఆర్థికపరంగా డబ్బు ఇవ్వగలిగే స్థితిలో ఉన్నప్పటికీ మా అత్తగారు, మామగారు ఎప్పుడిస్తే అప్పుడే వాళ్ళకి ఇవ్వగలను. కనుక నేను చందా ఇవ్వడం ఆలస్యం అవుతుందేమోనని టెన్షన్ పడ్డాను. అందువల్ల నేను, "బాబా! నేను కూడా మా అక్కాచెల్లెళ్ళతో పాటుగా చందా ఇవ్వగలిగేలా అనుగ్రహించండి" అని బాబాను ప్రార్థించాను. బాబా నా ప్రార్థన మన్నించి అందరికంటే ముందుగానే మా మామగారు గుడి అకౌంట్లో డబ్బులు వేసేలా చేశారు. బాబా అలా నా టెన్షన్ మొత్తం తీసేశారు. "థాంక్యూ బాబా! మీ ప్రేమ ఎప్పటికీ ఇలాగే మాపై ఉండాలని మనసారా కోరుకుంటున్నాను". 

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!

3 comments:

  1. OM SAI NATHAYA NAMAHA
    PUNDALIKA VARADHA , HARI VITALA
    SARVAM SAI NATHRPANAM

    ReplyDelete
  2. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo