సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

శ్రీరఘువీర్ భాస్కర్ పురందరే - నాలుగవ భాగం


బాబా పూజకు పరిమళాలను వెదజల్లే పువ్వుల కొరత తీర్చిన భక్తుడు పురందరే

శిరిడీలో పరిమళాలను వెదజల్లే పువ్వుల కొరత ఉందని, భక్తులు బాబా పూజకు సాధారణమైన పువ్వులే వాడుతున్నారని గుర్తించిన పురందరే ఎల్లప్పుడూ ఆ విషయమై బాధపడుతుండేవాడు. ఆ పూలమొక్కలను శిరిడీలోనే పెంచినట్లయితే ప్రతిరోజూ పరిమళాలను వెదజల్లే పువ్వులు బాబా పూజకు అందుబాటులో ఉంటాయని అతను అనుకుంటుండేవాడు. ఒకసారి అతను పరిమళాలను వెదజల్లే చిన్న చిన్న పువ్వుల మొక్కలను, మట్టితో చేయబడిన నాలుగు పూలకుండీలను తీసుకొని ముంబాయి నుండి శిరిడీకి బయలుదేరాడు. పురందరేతో పాటు తన స్నేహితులు హెచ్.ఎ.పండిట్, మోరేశ్వర్ పండిట్, దాజీ పాండురంగ వర్తక్‌లు కూడా బయలుదేరారు. వాళ్లంతా కోపర్‌గాఁవ్ రైల్వేస్టేషన్‌లో దిగేసరికి అనుకోకుండా హసన్ తన గుర్రపుబండితో అక్కడ సిద్ధంగా ఉన్నాడు. అతను వాళ్ళని దూరంగా ఉన్న స్టేషన్ నుండి ఊరిలో వరకు తీసుకువచ్చాడు. ఊరిలో ఎద్దుల బండి వంటి వాహనమేదీ అందుబాటులో లేనందువలన తానే స్వయంగా ఆ పూలకుండీలను, మొక్కలను మోసుకుపోవాలని పురందరే నిర్ణయించుకున్నాడు. అతని స్నేహితులు కూడా సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. వాళ్లంతా వాటిని తమ తలపై పెట్టుకొని నడవడం ప్రారంభించారు. వారు గోదావరి నది ఒడ్డుకు చేరుకునేసరికి శిరిడీ నుండి వస్తున్న మూడు గుర్రపుబండ్లను చూశారు. ఆ బండ్లను నడిపేవాళ్ళు పురందరేకు పరిచయస్తులే. వాళ్ళు పురందరేను, అతని స్నేహితులను శిరిడీ చేరుస్తామని అన్నారు. వాళ్లంతా నదిలో స్నానం చేసేసరికి మరో గుర్రపుబండి అక్కడికి వచ్చింది. అందరూ ఆ బండ్లలో రాధాకృష్ణమాయి ఇంటికి చేరుకున్నారు. సామాను అక్కడ దించి, ఆరతికి హాజరయ్యేందుకు అందరూ ద్వారకామాయికి వెళ్ళారు.

బాపూసాహెబ్ జోగ్ ఆరతికి సిద్ధం చేస్తున్నాడు. పురందరేను చూస్తూనే బాబా కోపంగా, "నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? నీ ఆయీ దగ్గరికి వెళ్ళు" అన్నారు. బాబా కోపాన్ని పట్టించుకోకుండా వాళ్లంతా బాబా దర్శనం చేసుకున్నారు. బాబా పురందరేతో, "నువ్వు ఒంటరిగా వచ్చావా? నాలుగైదు రోజులు ఉంటావా? లేక వెంటనే వెళ్తున్నావా?" అని అడిగారు. అతడు, "మీరు నన్ను ఉంచినంత కాలం నేను ఇక్కడే ఉంటాను" అని బదులిచ్చాడు. బాబా, "సరే చూద్దాం, ఇప్పుడు నాకు కొద్దిగా దక్షిణ ఇవ్వు" అని అన్నారు. అంతలో ఆరతి మొదలైంది. ఆరతి ముగిసిన తరువాత, బాబా వారందరికీ ఊదీ ఇచ్చి, పురందరేను కోప్పడుతూ, "నువ్వు ముంబాయిలో ప్రశాంతంగా ఉండలేవా? ఇక్కడకు వచ్చి నన్ను చూడాలని ఎందుకంత ఆరాటపడుతున్నావు?" అని అడిగారు. అందుకు పురందరే సమాధానమేమీ ఇవ్వలేదు. తరువాత బాబా రాధాకృష్ణమాయి వద్దకు వెళ్ళమని వారికి అనుమతి ఇచ్చారు. ఆమె వాళ్లకు భోజనాలు ఏర్పాటు చేసింది. ఆమె పురందరేతో, "భోజనం చేసిన తరువాత నీ సాయితల్లిని మొక్కలు నాటడం గురించి అడిగి, వీలైనంత త్వరగా ఆ పని చేయి, లేదంటే అవి ఎండిపోతాయి" అని చెప్పింది.

ఆమె సూచనను అనుసరించి వారందరూ అనుమతికోసం బాబా వద్దకు వెళ్లారు. ఎప్పటిలాగే బాబా కోపంగా ఉన్నారు. కోపంతో బాబా మొఖం ఎర్రబడిపోయింది. దాదాపు గంటసేపటి వరకు పురందరే ద్వారకామాయి మెట్ల క్రిందే నిలబడి ఉన్నాడు. తరువాత అతను బాబా దగ్గరకి వెళ్లి మృదువుగా, "బాబా, నేను కొన్ని పూలమొక్కలు తెచ్చాను. వాటిని నాటనా? చావడి నుండి సాఠేవాడా వరకు దారికి ఇరువైపులా వాటిని నాటాలని అనుకుంటున్నాను. అవి పెరిగి పెద్దవయ్యాక నీడనిస్తూ ఎండనుండి రక్షణనిస్తాయి. దీని తరువాత నేను లెండీబాగ్ యొక్క వంపుపైన, దానికి సమీపంలో ఉన్న చిన్నతోటలో తీగ మొక్కలను నాటాలని అనుకుంటున్నాను. నిజానికి శిరిడీలో పువ్వులకి కొరత ఉంది. అందుకే నేను ఇవన్నీ చేయాలనుకుంటున్నాను. మీ అనుగ్రహం వలన దేవుహారే మంచి నాణ్యమైన మొక్కలను నాకు ఇచ్చాడు. దయచేసి ఆ పనిలో ముందుకు సాగేందుకు నాకు అనుమతినివ్వండి. అలాగే, త్వరగా పెరిగి బోలెడన్ని సుగంధ పరిమళాలను వెదజల్లే పువ్వులనివ్వాలని ఈ మొక్కలను ఆశీర్వదించండి" అని వేడుకున్నాడు.

బాబా అతను చెప్పినదంతా ప్రశాంతంగానే విన్నప్పటికీ, తరువాత తమ అయిష్టాన్ని ప్రదర్శిస్తూ, "నాకు మొక్కలు, పువ్వులు అవసరం లేదు. నీకు కావాలంటే నీ ఇంటి చుట్టూ తోటని పెంచుకో. నీకు ఇష్టమైనవాళ్ళకి ఆ పువ్వులు ఇచ్చుకో" అని అన్నారు. తరువాత కూడా ఆయన నిరంతరం పురందరేని తిడుతూనే ఉన్నారు. అలా రెండురోజులు గడిచిపోయాయి. ఎవరో బాబాతో, "బాబా, మొక్కలు ఎండిపోతున్నాయి" అని చెప్పారు. "వాటిని దూరంగా పారేయండి" అన్నారు బాబా. మూడవరోజున రాధాకృష్ణమాయి ఇంట్లో ఉన్న పురందరేను పిలుచుకురమ్మని మహదును పంపారు బాబా. మహదు అక్కడకు వెళ్లి బాబా సందేశాన్ని చేరవేశాడు. అతనితో పురందరే, "ఇప్పుడు రాత్రి 8:30 అయ్యింది. ఈ సమయంలో ఎవరూ మసీదుకు వెళ్ళరు. నేను రేపు ఉదయం వస్తాను" అని అన్నాడు. మహదు తిరిగి వెళ్లి బాబాకు పురందరే అన్నది చెప్పాడు. అప్పుడు బాబా, "అతను రావడానికి  సిద్ధంగా లేకుంటే అతన్ని పట్టుకుని, ఇక్కడికి ఈడ్చుకొని రా" అని మహదును ఆదేశించారు.

మహదు మళ్ళీ పురందరే వద్దకు వెళ్ళాడు. అప్పటికే పురంధరే బాధతో కన్నీరు మున్నీరవుతున్నాడు. రాధాకృష్ణమాయి అతన్ని ఓదారుస్తూ, "తాయీ, ఇప్పుడు ఏదో చెప్పి తప్పుకోకు. నీ సాయితల్లి ఎప్పుడూ నీకోసం ఆరాటపడుతూ ఉంటుంది. బాబా నిన్ను తిడతారు, కొడతారు. కానీ ఆయన నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారు. ఏడవవద్దు! నీ తల్లి నీ మొక్కలను చనిపోనివ్వదు. ఒకవేళ అవి ఎండిపోయినప్పటికీ, ఆయన కృపతో అవి వేర్లు నాటుకొని పువ్వులు పూస్తాయి. నీ ఈ మంచిపని కారణంగా అందరూ నిన్ను గుర్తుంచుకుంటారు. రానని చెప్పకు, వెళ్ళు. బాబా ఇంత రాత్రివేళ నిన్ను పిలుస్తున్నారంటే నీకు ఏదో మంచి విషయమే చెప్తారు" అని చెప్పింది.

ఆయీ మాటలతో కాస్త ఊరడిల్లిన పురందరే ద్వారకామాయికి వెళ్లి, మశీదు మెట్లవద్ద నిలుచున్నాడు. దాదాసాహెబ్ కేల్కర్ అక్కడే కూర్చొని ఉన్నాడు. బాబా, "భావూ, పైకి రా! ఏడవకు! నేను నీకేమైనా అపకారం చేశానా? నువ్వు నన్నెందుకు విసిగిస్తున్నావు? నేను నీకు ఎన్నో ఇచ్చాను, ఇంకా చాలా ఇస్తాను. అల్లా నీ కోరికలు నెరవేర్చి సప్త మహాసముద్రాల సంపదకు సమానమైన ఆనందాన్ని ఇస్తాడు. నువ్వెందుకు భయపడతావు?" అని అన్నారు. అతను నిరాశతో, "బాబా, మీ దయ నాపై ఉంది. అది చాలు నేను సంతృప్తిగా ఉండటానికి. కానీ నేను తెచ్చిన పూలమొక్కలు ఎండిపోతున్నాయి, అయినా వాటిని నాటడానికి మీరు నాకు అనుమతి ఇవ్వటం లేదు. ఇక నేను కూడా బ్రతకాలని అనుకోవటం లేదు. ఆ మొక్కలతో నా మృతదేహాన్ని అలంకరించుకోవాలా?" అంటూ తన భావోద్వేగాలను నియంత్రించుకోలేక భోరున ఏడ్చేశాడు. బాబా అతనిని దగ్గరకు రమ్మని పిలిచి, "భావూ, ఏడవకు. ప్రతిరోజూ నేను నీ పేరు తలచుకుంటూ ఉంటాను. నిన్ను ఎప్పుడూ గుర్తుంచుకుంటాను. మరెందుకు ఏడుస్తావు? సరే, ఇప్పుడే వెళ్లి ఆ మొక్కలను నాటు. పాటిల్ పొలం ప్రక్కన ఉన్న మర్రిచెట్టు క్రింద మట్టిని తీసుకొచ్చి, మొక్కలను నాటు. ఆ మట్టి సారవంతమైనది కనుక మొక్కలన్నీ బ్రతుకుతాయి" అని చెప్పారు. 

తరువాత బాబా అతని చేయి పట్టుకొని తమ ప్రక్కన కూర్చోబెట్టుకొని, "నువ్వెందుకు ఏడుస్తున్నావు? మొక్కలు చనిపోతాయని నువ్వు అనుకున్నావు. కానీ నేను వాటిని చావనివ్వను. నేను వాటిని రక్షిస్తాను. నీ కోరిక నెరవేరుతుంది. అల్లా ఉన్నాడు. ఊదీ తీసుకొని వెళ్ళు. ఇక ఆలస్యం చేయకు. మొక్కల వేర్లు ఉదయం వేళల్లో నెలలో సర్దుకోవు. కాబట్టి ఇప్పుడే ఆ పనిచేయి" అని చెప్పారు. తరువాత ఆయన తమ వరదహస్తాన్ని అతని తలపై ఉంచి, ఊదీ అతని నుదుటిపై రాసి, "దృఢమైన నీ విశ్వాసం మెచ్చుకోదగినది. అల్లా నిన్ను రక్షిస్తాడు. అతడే పరమాత్మ" అని ప్రసన్నంగా నవ్వారు. పురందరే చాలా సంతోషించాడు. అతని మనస్సు తృప్తి చెందగా తిరిగి రాధాకృష్ణమాయి ఇంటికి వెళ్లి, ఆమెతో జరిగిందంతా చెప్పాడు. అది విన్న ఆమె, "నేను నీకు చెప్పలేదూ, మంచి జరగబోతుంది, నీ సాయితల్లి నీకోసం తపిస్తుందని?" అని అంది.

తరువాత వాళ్ళు మట్టి తీసుకొని రావడానికి మర్రిచెట్టు వద్దకు వెళ్ళారు. తాత్యా మోరేశ్వర్, దామాజీ మాస్టర్ నేలను త్రవ్వడంలో సహాయం చేశారు. రాధాకృష్ణమాయి, పురందరేలు మొక్కలను నాటే పనిలో నిమగ్నమయ్యారు. ఆ రాత్రంతా వాళ్ళు ఆ పని చేస్తూనే ఉన్నారు. వాళ్ళ పని పూర్తయ్యేసరికి కాకడ ఆరతికి సమయం అయింది. అందరూ స్నానాలు చేసి ఆరతికి వెళ్ళారు. ఆ సమయంలో బాబా కోపంగా ఉండటాన్ని వాళ్ళు గమనించారు. అందువలన ఎవరూ ఏమీ మాట్లాడలేదు. లెండీకి వెళ్లి వచ్చాక బాబా "మొక్కలను పీకిపారేయమ"ని కొండాజీని ఆదేశించారు. రాధాకృష్ణమాయి ఇంటి వాకిట కూర్చొని ఉన్న పురందరేకు ఈ విషయం తెలిసి చాలా కలత చెందాడు. కానీ అలా ఏమీ జరగలేదు. ఎవరూ వాటిని తొలగించలేదు, అవి సురక్షితంగా ఉన్నాయి. అంతేకాదు, (బాబా ఆదేశానికి వ్యతిరేకంగా) నాల్గవరోజు మొక్కలకు నీళ్లు పోసి, వాటిని సంరక్షించడానికి ఒక తోటమాలిని కూడా నియమించారు. బాబా దయవల్ల ఎండిన మొక్కలన్నీ నేలలో బలంగా వేర్లు ఏర్పరచుకొని సజీవంగా ఉన్నాయి. కొద్దిరోజుల్లోనే అవి పుష్పించడం ప్రారంభించాయి. దాంతో బాబా పూజకు పరిమళాలు వెదజల్లే పువ్వులు పుష్కలంగా లభించాయి. పురందరే కోరిక ఈవిధంగా నెరవేరింది!

రుక్మిణీ సమేత విఠలునిగా బాబా దర్శనం: 1913లో పురందరే తన కుటుంబంతో శిరిడీ వెళ్ళాడు. విఠలుని భక్తురాలైన అతని తల్లి పండరిపురం వెళదామని అతడిని ఒత్తిడి చేస్తుండేది. పండరిపురం వెళ్ళడానికి బాబా అనుమతి తీసుకోవాలనుకున్నాడు పురందరే. కానీ అతడు బాబా వద్ద ఆ ప్రస్తావన తీసుకురాకముందే, బాబా తమంతట తాముగా ఆ ప్రస్తావన తీసుకొచ్చి అతని తల్లితో, "అమ్మా! పండరి ఎప్పుడు బయలుదేరుతున్నావు?” అని అడిగారు. తరువాత మశీదులో బాబా ఆమెకు, పురంధరే భార్యకు రుక్మిణీ సమేత విఠలునిగా దర్శనమిచ్చారు. వాళ్ళు ఆనందంతో పులకించిపోయారు. ఆపై పురందరే తల్లి పండరి ప్రయాణం మానుకుంది. కానీ తరువాత కూడా బాబా ఆమెను తరచూ "అమ్మా! పండరి ఎప్పుడు వెళుతున్నావు?” అని అడుగుతుండేవారు. దానికామె, “నా దేవుడిక్కడే ఉన్నాడు. శిరిడీయే నా పండరి” అని జవాబు చెప్పేది.

1915వ సంవత్సరం వర్షాకాలంలో పురందరే భార్య తన పుట్టింట ఒక మగబిడ్డకి జన్మనిచ్చింది. బిడ్డకు శరీరమంతా పొడవాటి వెంట్రుకలు, గోర్లు ఉన్నాయి. ఆ సమయంలో ఆమె తనకు ప్రసూతివాతం వస్తుందేమోనని భయపడసాగింది. సున్నితమైన ఆమె పరిస్థితిని గమనించిన పురందరే కుండపోత వర్షంలో ఆమెని తన సొంత ఇంటికి తీసుకుని వచ్చాడు. బాంద్రకు చెందిన డాక్టర్ ఖడ్‌వాలే ఆమెను పరీక్షించి, "పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. వెంటనే ఆమెను (తన) ఆసుపత్రిలో చేర్పించమ"ని సలహా ఇచ్చాడు. కానీ పురందరే డాక్టర్ మాటను పట్టించుకోలేదు. బాబాపై పూర్తి నమ్మకమున్న అతను, "సాయిబాబా ఆమెను రక్షించాలనుకుంటే, ఇంట్లో చికిత్స చేసినా తనని కాపాడుతారు. కానీ బాబా ఆమెను రక్షించకూడదని నిర్ణయించుకుంటే, ఆసుపత్రిలో చికిత్స చేసినా ఆమె చనిపోతుంది" అని అనుకున్నాడు. అతనికి బాధ, సంతోషం రెండూ సాయిబాబా ప్రసాదాలే. అతడు ఆ స్థాయికి చేరుకున్నాడు. కానీ చుట్టుపక్కల వాళ్లంతా పట్టుబట్టడంతో మరునాటి ఉదయం ఆసుపత్రిలో చేర్చేందుకు అంగీకరించాడు. 

ఆరోజు అర్థరాత్రివేళ కలో, భ్రమో అర్థం కాని ఒక అద్భుతం జరిగింది. బాబా భుజాన జోలె, చేతిలో 'సటకా' ధరించి పురందరే ఇంట్లోకి ప్రవేశించారు. ఎప్పటిలాగే ఆయన కోపంతో అతన్ని తిడుతూ కొట్టడానికి అతని మీదకు పరుగెత్తారు. అతను కూడా పరుగుతీశాడు. అలా ఇద్దరూ పరుగుతీస్తూ పురందరే భార్య నిద్రిస్తున్న గదిలోకి వెళ్లారు. అప్పుడు బాబా తమ పిడికిలినిండా ఊదీ తీసుకుని ఆమె నుదుటిపై రాశారు. ఊదీ చాలా వేడిగా ఉండటంతో ఆమె గట్టిగా అరుస్తూ నిద్ర లేచి, తన మంచం ప్రక్కనే నిలబడి ఉన్న బాబాను చూసింది. ఆమె అరుపు విన్న పురందరే పరుగున ఆమె వద్దకు వచ్చాడు. అప్పుడామె, "ఇక మీరు చింతించకండి. బాబా తమ స్వహస్తాలతో ఊదీని నా నుదుటిపై పెట్టి నా చెంతనే నిలబడి ఉన్నారు. ఇక నేను ఏ ఆసుపత్రికీ వెళ్ళను" అన్నది. ఆ సమయంలో ఆమె చాలా ఆనందంగా ఉంది. అయితే ఆమె చేసిన ఒకే ఒక్క ఫిర్యాదు ఏమిటంటే - ఊదీ చాలా వేడిగా ఉందని, ఆ వేడికి తన నుదురు కాలిందని, అంతేకాదు, తన శరీరమంతా మండుతున్న అనుభూతి కలిగిందని.

మరుసటిరోజు ఉదయం కాకాసాహెబ్ దీక్షిత్, దభోల్కర్ మొదలైన స్నేహితులందరూ శ్రీమతి పురందరేను ఆసుపత్రికి తీసుకువెళ్లడంలో సహాయం చేద్దామని పురందరే ఇంటికి వచ్చారు. పురందరే అర్థరాత్రి జరిగిందంతా చెప్పి, ఆమెను ఆసుపత్రిలో చేర్చే ఆలోచనను మానుకున్నానని చెప్పాడు. దభోల్కర్ అందుకు అంగీకరించక కష్టం కొనితెచ్చుకోవద్దని అన్నాడు. కానీ దీక్షిత్ దభోల్కర్‌ను ఒప్పించాడు. పురందరే నమ్మినట్లు, ఆ సంఘటన కేవలం భ్రమ కాదు. ఎందుకంటే, ఆరోజునుండే ఆమె ఆరోగ్యం మెరుగుపడటం మొదలై కొద్దిరోజుల్లో పూర్తిగా నయమైపోయింది.

తరువాత వచ్చే క్రిస్మస్ సెలవుల్లో పిల్లవానికి బాబా ఆశీస్సులకోసం శిరిడీ వెళ్లాలని ఆ దంపతులు నిర్ణయించుకున్నారు. కానీ మిగతా కుటుంబసభ్యులంతా అదే సమయంలో తమ స్వస్థలానికి వెళ్ళే ఆలోచన చేశారు. దాంతో పురందరేతో సహా అందరూ స్టేషన్‌కు వెళ్లి టిక్కెట్లు కూడా తీసుకున్నారు. రైలు రాకకు ఇంకా ఇరవై నిమిషాలు ఉందనగా అకస్మాత్తుగా పురందరే తన మనసు మార్చుకుని శిరిడీ వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. అతని అత్తగారు తమకు తోడుగా ఉండి స్వస్థలానికి చేర్చిన తరువాత తనకి నచ్చినట్లు వెళ్ళమని చెప్పింది. కానీ బాబాను చూడాలని అతని మనసు ఆరాటపడుతోంది. అందువలన అతను తన నిర్ణయానికే కట్టుబడి వాళ్ళను వెళ్ళమని చెప్పి, తాను మాత్రం కోపర్‌గాఁవ్ రైలుకి టికెట్ తీసుకున్నాడు.

అతను కోపర్‌గాఁవ్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నాక టాంగావాలా హసన్ రాధాకృష్ణమాయి చాలా అనారోగ్యంతో ఉందని, బాబా కూడా అస్వస్థతగా ఉన్నారని సమాచారం ఇచ్చాడు. అది విని అతను చాలా కలత చెంది కన్నీళ్లు పెట్టుకున్నాడు.

పురందరే శిరిడీ చేరుకునేసరికి ఉదయం తొమ్మిది గంటలైంది. అతను నేరుగా ద్వారకామాయికి వెళ్లి, బాబా వద్ద చాలామంది భక్తులు కూర్చొని ఉండటం చూసాడు. అతను మశీదు మెట్లు ఎక్కుతుండగా బాబా చూసి, "భావూ, రా! నిన్నిక్కడ చూసి నాకు ఆనందంగా ఉంది. నేను అనారోగ్యంతో చాలా ఇబ్బంది పడుతున్నాను. నన్ను విడిచిపెట్టి వెళ్ళకు. ఇక్కడే ఉండు. మూడు నాలుగు రోజులుగా నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను. కాకాసాహెబ్‌ను రాధాకృష్ణమాయి ఇంట ఉండమని చెప్పాను. నీవు కూడా అక్కడికి వెళ్ళు, కానీ నా నుండి దూరంగా వెళ్ళకు" అని అన్నారు. బాబా ఆదేశానుసారం పురందరే వెంటనే రాధాకృష్ణమాయీని చూడటానికి వెళ్ళాడు. ఆమె పరిస్థితి బాబా పరిస్థితి కన్నా దారుణంగా ఉంది.

ఆ సమయంలో బాబా తీవ్రమైన ఉబ్బసంతో బాధపడుతూ ఆయాసంతో శ్వాస కూడా సరిగా తీసుకోలేకపోతున్నారు. ఆయన ఆహారం తీసుకోవడం మానివేసినందున చాలా బలహీనంగా ఉన్నారు. అయినప్పటికీ  ఆయన దినచర్యలో ఏ మార్పూ లేదు. ఇద్దరు ముగ్గురి సహాయం తీసుకుంటేగానీ నడవలేని స్థితిలో కూడా ఆయన ఎప్పటిలాగే భిక్ష కోసం వెళ్తున్నారు. ఆ స్థితిలో బాబాను చూసి పురందరే కన్నీటిపర్యంతమై, "బాబా, మిమ్మల్ని నేను నా వీపుపై మోసుకొని తీసుకొని వెళ్తాను" అని అన్నాడు. “అరె భావూ, ఎందుకు ఏడుస్తున్నావు?” అని అడిగారు బాబా. అందుకతను, “మిమ్మల్ని ఈ స్థితిలో చూడలేకపోతున్నాను బాబా” అన్నాడు. బాబా అతనిని ఓదారుస్తూ, “భయపడకు. మూడు నాలుగు రోజులలో నేను కోలుకుంటాను. అల్లా నాకు ఈ వ్యాధిని ఇచ్చారు. వారు ఇచ్చిన దాన్ని నేను స్వీకరించాలి. వారే మళ్ళీ దీనిని తగ్గిస్తారు. మంచి, చెడు కాలాలు ఒకటి తరువాత ఒకటి వస్తూనే ఉంటాయి. దానికి భయపడటమెందుకు? నువ్వు ఏడవకు! గత రెండు మూడు రోజులుగా నువ్వే జ్ఞాపకం వస్తున్నావు. అందుకే నిన్ను రమ్మంటూ జాబు వ్రాయమని కాకాతో చెప్పాను” అన్నారు బాబా. నిజానికి అతను వ్రాసేలోపే మళ్ళీ బాబా, “అతనే వస్తున్నాడు, జాబు వ్రాయనవసరం లేదు" అని అన్నారు.

అప్పుడు పురందరే రాధాకృష్ణమాయి అనారోగ్యానికి మందేదైనా ఇవ్వమని బాబాను అడిగాడు. బాబా "ఆమె కోలుకుంటుంది" అని చెప్పారు. కానీ మరుసటిరోజుకి ఆమె ఆరోగ్యం ఇంకా దిగజారిపోవడంతో అతడు మళ్ళీ బాబా వద్దకు వెళ్ళాడు. అప్పుడు బాబా మందు తయారుచేసి అతనికి ఇచ్చారు. ఆ తరువాత నడవలేని స్థితిలో కూడా బాబా లేచి నిచ్చెన సాయంతో రాధాకృష్ణమాయి ఇంటిపైకి వెళ్లి, "ఎవరైనా నాకు సహాయం చెయ్యండి, నాకు సహాయం చెయ్యండి. నేను ఇక్కడినుండి బయటపడలేకపోతున్నాను" అని అరవడం ప్రారంభించారు. అక్కడే ఉన్న తాత్యా, "నేను మీకు సహాయం చేస్తాను. దానికి బదులుగా మీరు నాకు ఏమిస్తారు?" అని అడిగాడు. "పది రూపాయలిస్తాను" అని బదులిచ్చారు బాబా. అతడు, "కానీ అసలు మీరెందుకు పైకి వెళ్ళారు?" అని అడిగాడు. అప్పుడు బాబా, "ఎందుకంటే, కొంతమంది నాపై దాడిచేసి చంపాలని అనుకుంటున్నారు. అందుకే నేను భయపడి పైకి ఎక్కాను" అని అన్నారు. తరువాత బాబా అక్కడినుండి దిగడానికి ప్రయత్నిస్తుండగా ఒకతను వచ్చి వారిని ఎత్తుకొని క్రిందికి తీసుకొచ్చాడు. బాబా అతనికి మూడు నాలుగు రూపాయలిచ్చి, “మనము ఎవరి కష్టాన్నీ ఉచితంగా పొందకూడదు” అని భక్తులతో చెప్పారు. ఈ సంఘటన తరువాత రాధాకృష్ణమాయి ఆరోగ్యం కుదుటపడింది.

పురందరే 1915 డిసెంబర్ 25 నుండి 1916 జనవరి 14 వరకు సెలవుపై శిరిడీలో ఉండాల్సి వచ్చింది. ఆ సెలవు రోజులకు అతనికి ఎలాంటి జీతం రాదు. కానీ ప్రతిసారీ బాబా, "నా ఆరోగ్యం బాగాలేదు. నువ్వు నన్ను వదలి వెళ్లవద్దు. నువ్వు భయపడకు. అల్లా అంతా చూసుకుంటారు. ఆయన కంటే ఎవ్వరూ గొప్పవారు కాదు" అని అంటూ అతనిని వెళ్లనివ్వలేదు. తరువాత అతను ముంబాయి వెళ్లి తన విధుల్లో చేరాడు. అతను ఆశ్చర్యపోయేలా శిరిడీలో ఉన్న రోజులకు సెలవు ఆమోదింపబడటమే కాకుండా పూర్తి జీతం కూడా ఇచ్చారు. 

కొద్దిరోజుల తరువాత అతడు తన భార్య, ఏడునెలల బిడ్డతో శిరిడీ వెళ్ళాడు. అప్పుడు బాబా పరిహాసంగా ఇతరులతో, "మీకు తెలుసా! భావూ చాలాకాలంగా నన్ను వెతుకుతున్నాడు. చివరికి నన్ను చేరుకున్నాడు" అని అన్నారు. బాబా మాటలు ఎప్పుడూ నిగూఢంగా ఉంటాయి. బహుశా పైమాటల ద్వారా బాబా పురందరే యొక్క పూర్వజన్మ గురించి, అతనితో తమకు గల అనుబంధం గురించి చెప్పి ఉండవచ్చు.

పురందరే కుమారుడు అందరూ అశుభంగా భావించే మూలా నక్షత్రంలో జన్మించాడు. అతని శ్రేయోభిలాషులు బిడ్డ శ్రేయస్సు కోసం శాంతి హోమం జరిపించమని పురందరేకు సలహా ఇచ్చారు. కానీ పురందరే వారి సలహాలను లక్ష్యపెట్టలేదు. దానితో వారిలో ఒకరు బాబాతో, "బాబా! పురందరే ఎవరి మాటా వినడం లేదు. మీరైనా అతనికి శాంతి హోమం జరిపించమని చెప్పండి" అని అన్నాడు. బాబా అతనితో, "భావూ, నేనుండగా పురందరే వేరే వాళ్ళ సలహా తీసుకోవాల్సిన అవసరం ఏముంది? అతడు ఒక విలక్షణమైన వ్యక్తి. అతను సర్వత్రా నన్నే దర్శిస్తూ ఉంటాడు. మీరు అతడిని ఒక వెర్రివాడని అనుకోవచ్చు. కానీ, అది అతనికి నాపై ఉండే విశ్వాసానికి నిదర్శనం. అంతా నేను చూసుకుంటాను. అతడిని ఎలాంటి శాంతులు చేయమని బలవంతపెట్టవద్దు" అన్నారు. పురందరేకు బాబానే సర్వస్వం, దైవము, ఈశ్వరుడు.

Amrosia in Shirdi & Baba's Runaanubandh by vinny chittluri.

 


ముందు భాగం 

కోసం

బాబా పాదుకలు తాకండి.



 

నిర్ధిష్టమైన భాగం కోసం పైన నెంబర్లను తాకితే, ఆ నెంబరుకి సంబంధించిన భాగం ఓపెన్ అవుతుంది.

 


తరువాయి భాగం కోసం

బాబా పాదాలు తాకండి.

 


2 comments:

  1. Om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya Jaya sai, om sai sri sai Jaya Jaya Jaya sai 🙏🙏🙏🙏

    ReplyDelete
  2. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo