సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 298వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. బాబా అత్యంత కరుణామయులు
  2. సాయే నా రక్షకుడు

బాబా అత్యంత కరుణామయులు

సాయిభక్తుడు ప్రేమ్‌చంద్ పట్నాయక్ తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి. 
ఈ సృష్టిని సృష్టించిన దైవస్వరూపం శ్రీ సాయినాథుడు. 
సాయిని నమ్మినచో సర్వకష్టాలు దూరం. 
సాయి నామస్మరణం సుఖశాంతికి మార్గం.
సాయి విభూతి భవరోగాలకు ఔషధం. 

"సాయిబాబా! మీ లీలలు ఎలా వర్ణించాలో నాకు అర్థం కావడం లేదు. మీరు దయామయులు. సాయిప్రభో! ఆపద సంభవించనున్న ప్రతి సందర్భంలో మీరు నన్ను కాపాడి కంటిరెప్పలా కాచుకుంటూ వస్తున్నారు. మీరు నాకు రక్షణనిచ్చిన ఒక సంఘటనను ఈ బ్లాగు ద్వారా సాయిభక్తులతో పంచుకోబోతున్నాను. ఇదే నేను మొదటిసారి మీరు ఇచ్చిన అనుభవాన్ని పంచుకోవడం. కాబట్టి నేను దీన్ని సరిగా వ్రాయగలిగేలా అనుగ్రహించండి".

ఈ సంఘటన విజయనగరంలో జరిగింది. 2019, అక్టోబరు 20, ఆదివారంనాడు నా సోదరిని ట్రైన్ ఎక్కించడానికి విజయనగరం రైల్వేస్టేషనుకు నేను, నా సోదరి బైకు మీద బయలుదేరాము. మేము స్టేషన్ చేరుకునేసరికి రైలు వెళ్లిపోవడంతో చేసేదిలేక తిరిగి మేము ఇంటికి బయలుదేరబోతుండగా ఒక వ్యక్తి బైకు మీద స్పీడుగా వచ్చి మా బైకును గుద్దేసాడు. బైకుపై వున్న నా సోదరి ఎగిరి నేలపై పడింది. బైక్ ఇంజనుకున్న షిఫ్ట్‌గార్డ్ రేకు నా ఎడమకాలి మడమ భాగంలో 5 అంగుళాల లోపలకి చొచ్చుకుపోయి ఆ ప్రాంతమంతా రక్తంతో తడిసిపోయింది. నా సోదరికి ఏమైందోనన్న కంగారులో నేను నా కాలికైన గాయాన్ని గమనించడంలేదు. ఆ విషయం క్రిందపడ్డ నా సోదరి చెప్పేంతవరకూ నాకు తెలియలేదు. వెంటనే నా స్నేహితులకు ఫోన్ చేశాను. వెంటనే నా స్నేహితులిద్దరు వచ్చారు. వాళ్లలో ఒకరు నా సోదరిని ఇంటికి తీసుకెళ్లి దించాడు. మరో స్నేహితుడు నన్ను హాస్పిటల్‌కి తీసుకెళ్లాడు. నేను బాధతో, భయంతో మార్గమంతా నా తండ్రి సాయినాథుని స్మరిస్తూ ఉన్నాను. ఆరోజు ఆదివారం కావడంవల్ల హాస్పిటల్లో డాక్టర్ లేరు. అయితే నా స్నేహితునికి ఆ డాక్టరు బాగా పరిచయస్తుడు కావడంతో తను వెంటనే డాక్టరుకి ఫోన్ చేసి మాట్లాడాడు. ఆ డాక్టరు నా గాయాన్ని ఫోటో తీసి వాట్సాప్‌లో పంపమన్నారు. నా స్నేహితుడు అలాగే చేశాడు. డాక్టర్ అది చూసి ఎక్స్-రే తీయించమన్నారు. ఎక్స్-రే అనేసరికి నేను భయంతో మళ్ళీ సాయిని స్మరించడం మొదలుపెట్టి, ఎక్స్-రే తీసున్నంతసేపు స్మరిస్తూనే ఉన్నాను. అంతలో ఆ డాక్టరు రానే వచ్చారు. డాక్టర్ ఎక్స్-రే రిపోర్ట్ చూసి, "ఎముక విరగలేదు, కానీ ఒకసారి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించ"మన్నారు. ఇంతలో నా సహోద్యోగి కూడా అక్కడికి వచ్చారు. తనే నన్ను స్కానింగ్ చేయించడానికి తీసుకువెళ్లారు. అప్పుడు కూడా నేను నా సాయిని స్మరిస్తూ గడిపాను. స్కానింగులో కూడా కాలి మడమ ఎముకకేమీ కాలేదు, కండ మాత్రమే  కట్ అయింది అని చెప్పారు. బాబా దయవల్ల నేను సేఫ్ జోన్‌లో వున్నాను. ఆ తరువాత డాక్టర్ నా గాయానికి 7 కుట్లు వేసి, మూడు వారాలు ఎటూ కదలకుండా పూర్తి బెడ్ రెస్టు తీసుకోమని చెప్పారు. దాంతో నేను మందులు వాడుతూ ఎటూ కదలలేని పరిస్థితిలో ఉండేవాడిని. నాలుగున్నర ఏళ్ళ మా అబ్బాయి ప్రతిరోజూ రాత్రి నా కాలి కట్టుపై బాబా విభూతి అద్దుతుండేవాడు. అద్భుతం! డాక్టర్ చెప్పిన మూడు వారాలు పూర్తికాకముందే, గాయపడ్డ 15 రోజులకి నేను డ్రెస్సింగ్ చేయించుకోవడానికి వెళ్లేసరికి నా కాలి గాయం పూర్తిగా నయమైపోయింది. అది చూసి డాక్టరు ఆశ్చర్యపోయాడు. "ఈ ప్రాంతంలో అయిన గాయం నయం కావడం చాలా కష్టం, అలాంటిది మీ విషయంలో చాలా తొందరగా నయమైంది" అని అన్నారు. సాయిబాబా కృపవల్లనే నేను ఇంత తొందరగా కోలుకున్నాను. ఇదే విధంగా బాబా చాలాసార్లు నన్ను కాపాడారు. బాబా అత్యంత కరుణామయులు. "చాలా చాలా ధన్యవాదాలు సాయితండ్రీ. ఎల్లవేళలా ఇలాగే నాపై, నా కుటుంబంపై మీ చల్లని కృప చూపండి".

సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

సాయే నా రక్షకుడు

ఒక అజ్ఞాత సాయిభక్తుడు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నాడు:

పలికినప్పుడు ప్రశాంతంగా అనిపించే ఏకైక నామం - 'జై సాయిరామ్'. మనం సాయిని పిలిచినప్పుడల్లా ఆయన మనతో ఏదో ఒక రూపంలో ఉంటారు. "మీ పాదాల చెంతనున్న పువ్వులలో నన్ను ఒకడిగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు సాయీ!" ఇక నా అనుభవానికి వస్తే...

ఒకరోజు నేను వడదెబ్బకు గురయ్యాను. భరించలేని కడుపునొప్పితో శరీరం పూర్తిగా నిర్జలీకరణమైంది. నేను కొన్ని మందులు, లిక్విడ్స్ తీసుకున్నాను కానీ ఏమీ ప్రయోజనం కనపడక చాలా చాలా బాధ అనుభవించాను. కొంతసేపటికి నేను బాబా ఊదీ యొక్క అద్భుత లీలలను జ్ఞాపకం చేసుకున్నాను. వెంటనే నేను ఎనర్జీ డ్రింక్ (మన బాబా ఊదీ కలిపిన నీళ్లు) త్రాగి, "సమస్య నుండి ఉపశమనం కలిగించమ"ని బాబాను ప్రార్థించాను. గంటలోపల నాకు ఉపశమనం లభించి మంచి అనుభూతి కలిగింది. మన సమస్య పెద్దదైనా, చిన్నదైనా ఒకసారి సాయిని విశ్వాసంతో ప్రార్థిస్తే, మనల్ని రక్షించడానికి ఆయన ఎప్పుడూ ఉంటారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా!".

source:http://www.shirdisaibabaexperiences.org/2019/10/shirdi-sai-baba-miracles-part-2503.html


2 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo