సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

బాబా భికాజీని ఆశీర్వదించిన లీల.


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

బాబా భికాజీని ఆశీర్వదించిన లీల.

బాబా అనుగ్రహం భికాజీ హరి రిస్బూద్ మీద ఎంత గొప్పగా ఉందంటే, బాబా యొక్క ఈ మాటలను బట్టి అంచనా వేయవచ్చు: "అరే అన్నా! నేను మీ ఇంటికి వచ్చి ఉంటాను".

ఆసక్తికరమైన ఆ లీలను ముంబాయిలో నివసిస్తున్న భికాజీ మనుమడు అనిల్ నారాయణ్ రిస్బూద్ ఇలా వివరించారు:

"మా తాతగారు ఆధ్యాత్మిక వైద్యులు (వైద్), రాయగఢ్ జిల్లాలోని 'పేణ్' లో నివాసం ఉండేవారు. ఆయన ఆర్థిక పరిస్థితి అస్థిరంగా ఉండటంతో తరచూ రోగుల చికిత్స నిమిత్తం ముంబాయి వెళ్తుండేవారు. దాదాపు ప్రతినెలా అక్కడికి వెళ్ళి, వారం, అంతకన్నా ఎక్కువ రోజులు అక్కడే ఉండేవారు. అలా ముంబాయి వెళ్ళినప్పుడే ఆయన బాబా దైవత్వం గురించి విని, 1916వ సంవత్సరంలో శిరిడీ వెళ్లి, బాబా దర్శనం చేసుకుని, పేదరికంవల్ల తను పడుతున్న దురవస్థను విన్నవించుకోవాలని అనుకున్నాడు. అనుకున్నట్లుగానే శిరిడీ చేరి, బాబా దర్శనం కోసం ద్వారకామాయికి వెళ్ళాడు. ఆ సమయంలో బాబా భయంకరమైన కోపంతో ఉన్నారు. బాబా శాంతించిన తరువాత ఆయన పాదాలమీద పడాలని భికాజీ అనుకుని ధర్మశాలకు తిరిగివచ్చి, భోజనం చేసి నిద్రపోయాడు. కాసేపటికి బాబా కలలో దర్శనమిచ్చి, "నీవు నిద్రపోవడానికి ఇక్కడకు వచ్చావా? లేక నన్ను కలవడానికా?" అని అడిగారు. అందుకు భికాజీ, "దేవా! మిమల్ని కలవడానికి నేను వచ్చినప్పుడు మీరు కోపంగా ఉన్నారు. అందువలన నేను భయపడి తిరిగి వచ్చేసాను" అని చెప్పాడు. మళ్ళీ బాబా, "నేను నీ పేరు పెట్టి నిన్ను ఏమైనా అన్నానా?" అని అన్నారు. తక్షణమే భికాజీకి మెలకువ వచ్చి, బాబా వద్దకు వెళ్ళి ఆయన ముందు సాగిలపడ్డాడు. కొన్ని క్షణాల తరువాత బాబా, "అరె అన్నా! నేను నీ బిడ్డగా మీ ఇంటికి వచ్చి ఉంటాను. ఈ మాట గుర్తుపెట్టుకో అన్నా!  నాకు శ్రీపాద అని పేరు పెట్టు!" అని అద్భుతమైన పదాలు పలికారు. ఆ సమయంలో భికాజీ భార్య 6 నెలల గర్భవతి. ఆ మరుసటిరోజే భికాజీ తిరిగి ఇల్లు చేరుకున్నాడు.

తరువాత భికాజీ భార్య ఒక గురువారంనాటి ఉదయం సుమారు 7 గంటల సమయంలో ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఆమె ప్రసవిస్తున్న సమయంలో భికాజీ తన ఇంటి గుమ్మం వద్ద నిల్చొని ఉండగా, ఒక ఫకీరు వీధిలో వెళ్తూ ఉన్నారు. ఆ ఫకీరు తీక్షణంగా అతని ఇంటివైపు చూస్తున్నాడు, కాని భికాజీ ఫకీరును అంతగా గమనించలేదు. బాబా సూచించిన ప్రకారమే మగబిడ్డ పుట్టాడు. బిడ్డకు శ్రీపాద అని పేరు పెట్టారు. అయితే ఆ పిల్లవాడికి మెడమీద ఒక విశేషమైన పుట్టుమచ్చ ఉంది. అది మూడు పోగుల గొలుసులాగా ఉండి, మధ్యలో తులసి ఆకు ఆకారంలో లాకెట్టు ఉన్నట్లుగా ఉంది.

శ్రీపాద అందంగా ఉండేవాడు. 5 సం౹౹ వయస్సు వచ్చేసరికి తల్లిదండ్రులు ఉపనయనం చేయాలని నిర్ణయించారు. ఆరోజు రాత్రి బాబా భికాజీకి కలలో కనిపించి పదే పదే ఇలా చెప్పారు: "ఇక నేను వెళ్ళిపోతున్నాను, నీ నుంచి నాకేమీ అక్కరలేదు" అని. అప్పడు భికాజీ, "నేను మా ఇంటికి రమ్మని పిలవడానికి మీ దగ్గరకు వచ్చానా? మరి అలాంటప్పుడు మీరు రావడం, పోవడం అన్న ప్రశ్న ఎలా వస్తుంది?" అని అడిగాడు. బహుశా ఉపనయనం చేయాలన్న ఆలోచనను బాబా ఆమోదించలేదేమో, ఎందుకంటే అతడు స్వామి దత్తాత్రేయుని అవతారం, ఏ కారణం చేతనో ఉపనయనం ఆగిపోయింది. మళ్ళీ ఆ కుర్రవాడికి 8 సంవత్సరాల వయస్సున్నప్పుడు ఉపనయనం విషయం తలెత్తింది. అప్పడు కూడా ఏవో కారణాలతో తండ్రి కొంతకాలం తరువాత చేద్దామని నిర్ణయించాడు.

తరువాత ఒకసారి శ్రీపాద అడవిలోకి వెళ్ళినప్పుడు ఒక ముల్లు అతని పాదంలో గుచ్చుకుని ధనుర్వాతానికి దారితీసింది. వైద్యులు చికిత్స చేసినా గుణం కనపడలేదు. ఒక గురువారంనాటి తెల్లవారుఝామున భికాజీకి కలలో బాబా కనిపించి, "నేనిప్పుడు వెళ్ళిపోతున్నాను. ఇక మీదట నేనుండలేను. అల్లా నిన్ను అనుగ్రహిస్తాడు" అని చెప్పారు. వెంటనే భికాజీ మంచం మీద నుంచి దిగి, ఇంటి గుమ్మం వద్ద నిలుచున్నాడు. ఆ క్షణాన ఒక ఫకీరు తీక్షణంగా ఇంటివైపు చూస్తూ వెళ్ళిపోతున్నాడు. అకస్మాత్తుగా భికాజీకి శ్రీపాద పుట్టినప్పుడు ఇదే ఫకీరు ఇంటిముందు నడుచుకుంటూ వెళ్ళిన సంగతి గుర్తుకువచ్చింది. వెంటనే భికాజీ పరిగెత్తుకుంటూ శ్రీపాద నిద్రిస్తున్న చోటుకు వెళ్లి చూసాడు. కానీ పాపం అప్పటికే అతను మరణించాడు​. శ్రీపాద ప్రపంచంలోకి వచ్చింది గురువారం ఉదయం 7 గం||లకు, మళ్ళీ అదే గురువారం అదే సమయానికి చనిపోయాడు. పైగా అతను పుట్టేటప్పుడు, చనిపోయేటప్పుడు అదే ఫకీరు ఇంటివైపు తీక్షణంగా చూస్తూ నడుచుకుంటూ వెళ్ళాడు. ఈ రెండింటికి సంబంధం ఏమిటనేది అగోచరమైన విషయం. ఆ ఫకీరు ఆ తరువాత ఎవ్వరికీ, ఎక్కడా కనపడలేదు".

చివరిగా అనిల్ నారాయణ రిస్బూద్, "బాబా మా ఇంటిలోకి శ్రీపాద రూపంలో వచ్చారు, మా ఇంటిని పవిత్రం చేసారు. తరువాత కూడా ఆయన అనుగ్రహం, దయ మా మీద కురిపిస్తూనే ఉన్నారు" అని చెప్పారు.

సోర్స్: శ్రీ సాయిలీల పత్రిక, డిసెంబర్ 1989.
Baba's Divine Manifestations. రచన: విన్నీ చిట్లూరి.

4 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo