సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

నా పిల్లలపై బాబా ఆశీస్సులు


ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

నేను చాలా సంవత్సరాలుగా బాబా భక్తురాలిని. ఎప్పుడైనా మనసులో ఆందోళనగా ఉన్నా, మార్గం కనబడకపోయినా, సాటి సాయిభక్తుల అనుభవాలను బ్లాగులో చదవడం వలన తిరిగి మనసులో విశ్వాసం సంతరించుకుంటుంది. బాబా ఉన్నారు, ఆయన సరైన మార్గంలో నడిపిస్తారు అనే ధైర్యం కలుగుతుంది. నేనిప్పుడు రెండు అనుభవాలను మీతో పంచుకుంటాను.

మొదటి అనుభవం:

బాబా కృపవలన మా అమ్మాయి చాలా తెలివైనది. తను సి.ఏ. చేసింది. మొదటి సంవత్సరంలోని సబ్జెక్టులన్నీ మొదటి యత్నంలోనే తను పూర్తి చేసింది. అయితే  చివరి సంవత్సరం కఠినమైనది కావడంతో తను ఒకే సబ్జెక్టులో రెండుసార్లు ఫెయిల్ అయింది. మళ్లీ ఆ పరీక్షల కోసం సిద్ధమవుతున్న సమయంలో తను మహాపారాయణ గ్రూపులో చేరింది. తన పారాయణ 36(3+6=9)వ అధ్యాయంతో మొదలైంది. అదేవారంలో తన హాల్ టికెట్ వచ్చింది. హాల్ టికెట్ నెంబరులోని సంఖ్యల మొత్తం కూడా 9. దాంతో అది బాబా ఇస్తున్న శుభసూచకంగా తను భావించి ఈసారి పరీక్షలో ఉత్తీర్ణురాలిని అవుతానని చాలా సంతోషించింది. తను పరీక్షకు వెళుతున్నప్పుడు కూడా చాలా చోట్ల బాబా దర్శనమిచ్చారు. తను పరీక్షలన్నీ బాగా వ్రాసింది. రేపు పరీక్షా ఫలితాలు వస్తాయనగా ముందురోజు రాత్రి తనకి కలలో బాబా నవ్వుతూ దర్శనమిచ్చారు.  ఆ దర్శనంతో తనలో ఉన్న భయం, ఆందోళన ఎగిరిపోయాయి. కానీ పరీక్షా ఫలితాలు చూసి తన గుండె బద్దలైపోయింది. ఎప్పటిలాగే తను ఆ ఒక్క సబ్జెక్టులోనే మళ్ళీ ఫెయిల్ అయింది. దాంతో బాబా ఇన్ని శుభసంకేతాలిచ్చిన తర్వాత కూడా ఇలా అయిందేమిటని తను చాలా క్రుంగిపోయింది. ఆ సమయంలో బాబా వేరే మార్గం చూపించారు. తను రీ-వాల్యుయేషన్ కి దరఖాస్తు చేసుకుంది. సాధారణంగా రీ-వాల్యుయేషన్ ఫలితాలు రావడానికి నెలరోజులు పడుతుంది. తోటి విద్యార్థులందరికీ వారివారి రీ-వాల్యుయేషన్ రిజల్ట్స్ వస్తున్నప్పటికీ తన విషయంలో మాత్రం చాలా ఆలస్యమైంది. దాదాపు నెల 15 రోజులు గడిచిపోయాయి. ఇక రాదేమో అని తను ఆశ వదులుకుని మళ్లీ పరీక్షకు ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టింది. అయితే బాబా కృప చూపించారు. ఒకరోజు తన ఇన్‌స్టిట్యూట్ నుంచి 'తను అన్ని సబ్జక్టులలో పాస్ అయింద'ని ఫోన్ వచ్చింది. ఇక తన ఆనందానికి అవధుల్లేవు. తరువాత తను మంచి మంచి ఆర్గనైజేషన్లలో జాబ్ కోసం ప్రయత్నించింది. కాల్స్ వస్తున్నా, ఇంటర్వ్యూలు జరుగుతున్నప్పటికీ ఉద్యోగం మాత్రం వచ్చేది కాదు.  ఇలా ఉండగా ఒకరోజు తను ఇంటర్వ్యూకి వెళ్తూ, "బాబా ఈ ఉద్యోగం ఎలాగైనా నాకు రావాల్సిందే" అని ప్రార్థించింది. తన ప్రార్థన బాబా విన్నారు. మంచి శాలరీతో తనకా ఉద్యోగం వచ్చింది.

రెండవ అనుభవం:

ఇక్కడ మా అమ్మాయి పై సమస్యలు ఎదుర్కొంటున్న సమయంలోనే మా అబ్బాయి కూడా కొన్ని సమస్యలను ఎదుర్కొన్నాడు. తను కాన్పూర్ ఐఐటీ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. నాలుగేళ్ల ఉద్యోగ అనుభవంతో యూఎస్ లో మాస్టర్స్ చేయడానికి వెళ్ళాడు. తను ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటుంటే, మొదట్లో అంతా సానుకూలంగా ఉండేది, కానీ చివరకు వచ్చేసరికి ప్రతికూలంగా జరిగేది. తనకన్నా తక్కువ క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్లకి కూడా ఉద్యోగాలు వచ్చి తనకి మాత్రం రాకపోయేసరికి తను చాలా ఆందోళనపడుతుండేవాడు. ఇద్దరు పిల్లల విషయంలో ఇలా జరుగుతుండటంతో నేను బాగా చలించిపోయాను. చాలాసార్లు బాబాపట్ల ఉన్న విశ్వాసం కూడా ఊగిసలాడేది. కానీ మన ప్రియమైన దయగల బాబా నా చేయి విడిచిపెట్టలేదు. బాబాకు నిజాయితీతో కూడుకున్న ప్రార్థన చాలు అని తెలిసినప్పటికీ నేను నా మనఃశాంతి కోసం మహాపారాయణ, స్తవనమంజరి పారాయణ, ప్రేయర్ గ్రూపులతో చేరి, రోజూ, "బాబా! నా పిల్లలపై మీ ఆశీస్సులు కురిపించండి" అని ప్రార్థిస్తూ ఉండేదాన్ని. చివరికి బాబా చల్లని ఆశీస్సులు కురిపించారు. మా అబ్బాయి గ్రాడ్యుయేషన్ పూర్తయ్యే సమయానికి బాబా రెండు ఉద్యోగ అవకాశాలు తన చేతిలో పెట్టారు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా!" మనమంతా సాయి బిడ్డలం. ఆయనెప్పుడూ మనల్ని కంటికి రెప్పలా కాపాడుతూనే ఉంటారు. ఆయనకు ఏదీ అసాధ్యం కాదు. కాబట్టి ఆయన పట్ల పూర్తి విశ్వాసంతో మీ భారాన్ని ఆయనపై వేసి శరణాగతి చెందండి. అంతా ఆయన చూసుకుంటారు.

2 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo