సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

విష్ణుపంత్ బల్వంత్


“ది గ్లోరీ ఆఫ్ శిరిడీసాయి” 14.04.2016 సంచికలో ప్రచురించిన సాయి వైభవం గమనిద్దాము.

హరిశ్చంద్రపితలే కుమారుడికి మూర్ఛవ్యాధి ఏవిధంగా నివారణ అయిందో శ్రీసాయిసచ్చరిత్ర 26వ అధ్యాయంలో వివరింపబడి వుంది. ఆ లీలలో బాబా హరిశ్చంద్రతో, “బాపూ! ఇంతకుముందు నీకు రెండు రూపాయలిచ్చాను. ఇప్పుడు మరో మూడు రూపాయలిస్తున్నాను. వీటిని కూడా వాటితోపాటుగా ఉంచుకుని ప్రతిరోజూ భక్తితో పూజించుకో! అది నీకు ఎంతో మేలు చేస్తుంది” అని చెప్పి ఆశీర్వదించారు. హరిశ్చంద్ర ఇంటికి తిరిగి వచ్చాక, "నేను శిరిడీ వెళ్ళడం ఇదే మొదటిసారి. మరి బాబా నాకు ఇంతకుముందే రెండు రూపాయలిచ్చానని చెప్పారు. ఆయన మాటలు నాకు అర్ధం కాలేదు" అని తన తల్లికి చెప్పాడు. అప్పుడామె, “నాయనా, నీ తండ్రికి స్వామిసమర్థ రెండు రూపాయలిచ్చారు. అదే బాబా అన్న మాటలోని అర్థమ"ని వివరించింది. అతను తన శిరిడీయాత్రకు సంబంధించిన విశేషాలను చెబుతుంటే కుటుంబసభ్యులందరూ చాలా ఆసక్తిగా విన్నారు. వారిలో అతని సోదరుడయిన విష్ణుపంత్ బల్వంత్ కూడా ఉన్నాడు. హరిశ్చంద్ర చెప్పిన విషయాలు వింటూనే అతనికి శిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకోవాలని తీవ్రమైన కోరిక కలిగింది.

విష్ణుపంత్ విల్లేపార్లేలో అనువాదకునిగా పనిచేస్తున్నాడు. అతనెప్పుడూ ఆ పనిఒత్తిడిలోనే ఉండేవాడు. అందువలన అతనికి చాలాకాలంపాటు శిరిడీ వెళ్లడం సాధ్యపడలేదు. చివరికి 1917వ సంవత్సరంలో అతడికి మొదటిసారి శిరిడీ వెళ్లే అవకాశం వచ్చింది. ఎక్కడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. బాబాకు సమర్పించడానికి మామిడిపండ్లు తీసుకోవాలని అనుకున్నాడు. పూర్తిగా పక్వానికి వచ్చిన పండ్లయితే శిరిడీ చేరుకునేసరికి కుళ్ళిపోతాయని, పక్వానికి రాని పండ్లయితే శిరిడీ చేరుకునేసరికి మగ్గుతాయని అతడి ఆలోచన. వాటికోసం వెతుకుతూ పండ్లు అమ్మే బజారంతా తిరిగాడు. చివరికి ఒక పండ్లవర్తకుడి వద్ద మంచి మామిడిపండ్లు కనిపించాయి. అవి ఇంకా పక్వానికి రాలేదు. చూడటానికి చాలా బాగున్నాయి. వెంటనే ఒక బుట్టెడు మామిడిపండ్లు కొని శిరిడీ ప్రయాణమయ్యాడు.

ముందుగా కోపర్‌గాఁవ్ చేరుకుని, అక్కడినుండి శిరిడీకి బయలుదేరాడు. అదే సమయానికి శిరిడీలోని ద్వారకామాయిలో బాబా తమ చుట్టూ ఉన్న భక్తులతో మాట్లాడుతూ ఉన్నారు. అంతలో అకస్మాత్తుగా ద్వారకామాయి అంతా మామిడిపండ్ల సువాసనతో నిండిపోయింది. భక్తులంతా ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ 'మామిడిపండ్లు ఎక్కడ ఉన్నాయా?' అని వెతికారు. అయితే బాబా దానిగురించి ఏమీ మాట్లాడకపోవడంతో భక్తులు కూడా మౌనంగా ఉండిపోయారు. ఇంతలో విష్ణుపంత్ శిరిడీ చేరుకున్నాడు. తన సామాన్లను, మామిడిపండ్ల బుట్టను ఒక గదిలో ఉంచి ధూళిదర్శనానికి బయలుదేరాడు. బాబా అతన్ని చూచి నవ్వుతూ, దగ్గరకు రమ్మని, “నాకోసం ఏం తెచ్చావు? మామిడిపండ్లేవి?” అని అడిగారు. విష్ణుపంత్ కాస్తంత సిగ్గుపడి, “బాబా! మామిడిపండ్లు ఇంకా పక్వానికి రాలేదు. వాటిని గదిలోనే ఉంచాను” అన్నాడు. “వెళ్ళి వాటిని తీసుకురా, నీకు వాటి వాసన రావడం లేదా?” అన్నారు బాబా. వెంటనే విష్ణుపంత్ గదికి వెళ్ళి మామిడిపండ్ల బుట్టను తీసుకువచ్చి బాబా ముందు పెట్టాడు. బుట్ట తెరచి చూసేసరికి మామిడిపండ్లన్నీ మంచిరంగుతో మిలమిలలాడుతూ చక్కగా మగ్గి తినడానికి తయారుగా ఉన్నాయి.

విష్ణుపంత్ శిరిడీలో మూడురోజులు ఆనందంగా గడిపాడు. అతని వద్ద 15 రూపాయలు మాత్రమే మిగిలాయి. తిరుగుప్రయాణానికి అవి సరిపోతాయని అనుకున్నాడు. తిరుగు ప్రయాణమయ్యే రోజున బాబా ఫోటో ఒకటి తీసుకుని, దానిని బాబా చేతికిచ్చి ఆయన స్పృశించిన తరువాత తీసుకుందామని అతను అనుకున్నాడు. అతడు బాబా ఫోటో తీసుకుని ద్వారకామాయికి వెళ్ళి బాబా పిలుపుకోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. బాబా అతన్ని దగ్గరకు రమ్మని సైగచేసి, “భావూ, నాకు 15 రూపాయలు దక్షిణ ఇవ్వు” అని అడిగారు. వెంటనే అతడు తన జేబులో నుంచి 15 రూపాయలు తీసి దక్షిణగా బాబాకు సమర్పించాడు. తరువాత బాబా అతని చేతిలో వున్న ఫోటో గురించి అడిగారు. అతడు ఆనందంతో ఆ ఫోటోను బాబా చేతికిచ్చాడు. బాబా ఆ ఫోటోని క్షణంపాటు తమ హృదయానికి హత్తుకుని, తరువాత ఆ ఫోటోని అతనికిస్తూ తిరుగుప్రయాణానికి అనుమతిని ప్రసాదించారు.

విష్ణుపంత్ పట్టలేని ఆనందంలో ఉన్నప్పటికీ కూడా పెద్ద సంశయంలో పడ్డాడు. 'తన వద్ద ఉన్న 15 రూపాయలు  బాబా దక్షిణగా తీసుకున్నారు. ఇక తనవద్ద ఒక్కపైసా కూడా లేదు. ప్రయాణం ఎలా చెయ్యాలా?' అన్న సందిగ్ధంలో ఉన్నాడు. టాంగాలో వెళ్ళడానికి డబ్బులు లేనందున నడిచే కోపర్‌గాఁవ్ వెళదామని నిశ్చయించుకుని శిరిడీ నుండి బయలుదేరాడు. ఒక అరమైలు దూరం నడిచేసరికి ఒక టాంగా వచ్చి అతని ముందు ఆగింది. టాంగా తోలేవాడు విష్ణుపంత్‌తో, “ఇంత ఎండలో ఎందుకు నడుచుకుంటూ వెళుతున్నారు? మిమ్మల్ని చూస్తే పల్లెటూరివానిలా కనబడటంలేదే?” అన్నాడు. “నేను అనువాదకుడిని. నేను కోపర్‌గాఁవ్ వెళుతున్నాను” అని సమాధానమిచ్చాడు విష్ణుపంత్. అప్పుడు ఆ టాంగావాడు నవ్వుతూ, “రండి, నా బండిలో చోటు ఉంది. నేను మిమ్మల్ని కోపర్‌గాఁవ్ చేరుస్తాను” అన్నాడు. విష్ణుపంత్ హాయిగా ఊపిరి పీల్చుకుని టాంగాలో కూర్చుని కోపర్‌గాఁవ్ చేరుకున్నాడు. టాంగా దిగి సామానంతా దింపుకుని తిరిగి చూసేటప్పటికి టాంగా లేదు, టాంగా తోలేవాడూ లేడు. టాంగా, టాంగాతో సహా తోలేవాడు అంతలోనే మాయమవడంతో అతను ఆశ్చర్యపోయాడు.

తరువాత విష్ణుపంత్ రైల్వేస్టేషన్లోకి వెళ్ళి తనకు తెలిసినవారు ఎవరైనా కనపడతారేమోనని చూశాడు. కానీ ఎవ్వరూ కనపడలేదు. తెలిసున్నవారు కనపడితే టిక్కెట్టుకి డబ్బులు అడుగుదామనుకున్న అతని ఆశ అడియాశ అయింది. రైలు వచ్చేసింది. ఆఖరికి అతడు టిక్కెట్ లేకుండానే రైలెక్కి, దానివల్ల వచ్చే కష్టనష్టాలను భరించడానికి సిధ్ధపడ్డాడు. తరువాతి స్టేషన్లో అతడున్న బోగీలోకి టికెట్ కలెక్టర్ వచ్చాడు. టిక్కెట్ కలెక్టర్ అతనివైపు చూస్తూనే, “నమస్కారం పితలే సాబ్!” అని పలకరించాడు. అయితే విష్ణుపంత్‌కి అతనెవరో గుర్తురాలేదు. "తనని గుర్తుపట్టి పలకరించాడంటే ఖచ్చితంగా టిక్కెట్ చూపించమని అడుగుతాడు, దానితో నేను చాలా ఇబ్బందిపడాల్సి వస్తుంది" అనుకున్నాడు విష్ణుపంత్. కానీ అటువంటిదేమీ జరగలేదు. ఎటువంటి సమస్యా లేకుండా బొంబాయి చేరుకున్నాడు విష్ణుపంత్.

మరుసటిరోజున ఒక పెద్ద కారు అతని ఇంటిముందుకి వచ్చి ఆగింది. సూటు, బూటు వేసుకుని దర్జాగా ఉన్న ఒక పెద్దమనిషి కారు దిగి, “మీరేనా అనువాదకులు విష్ణుపంత్ పితలే?” అని అడిగాడు. విష్ణుపంత్, ”ఇప్పుడు నేను చాలాకష్టంలో పడినట్లున్నాను. ఈయనేమో 'మీరేనా అనువాదకులు?' అని నేరుగా వచ్చి నన్నే అడుగుతున్నాడు. కారణం ఏమైవుంటుంది?" అని చాలా గాభరాపడ్డాడు. ఇంతలో ఆ పెద్దమనిషి, “నేను జే.ఆర్.డి.టాటాని. సహార్ దగ్గర (ఇప్పుడున్న విమానాశ్రయం) స్థలం కొందామనుకుంటున్నాను. నా దగ్గర ఎంతోమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కానీ వారెవ్వరికీ మరాఠీనుండి ఆంగ్లంలోకి, ఆంగ్లంనుండి మరాఠీలోకి తర్జుమా చేయడం రాదు. మీకు రెండుభాషలూ వచ్చని, అనువాదం కూడా చేయగలరని విని వచ్చాను” అన్నాడు. అంతా విని ఆశ్చర్యంతో విష్ణుపంత్ అవునన్నట్లుగా తలవూపాడు. అపుడాయన, “అనువాదకునిగా మీరు నెలకు 35 రూపాయలు మాత్రమే సంపాదించగలరు. మీరు నా దగ్గర పనిచేయడానికి అంగీకరిస్తే మీకు నెలకు 150 రూపాయలు జీతమిస్తాను” అన్నాడు. వెంటనే విష్ణుపంత్, “నేను మీకు అనువాదం చేసిపెడతాను. కానీ నాకు రెండురోజులు సమయం ఇవ్వండి. నా నిర్ణయం చెబుతాను” అన్నాడు. "సరే" అని చెప్పి టాటాగారు వెళ్ళిపోయారు.

విష్ణుపంత్ ఇప్పుడు పెద్ద సందిగ్ధంలో పడ్డాడు. “నేను పెన్షన్, ఇంకా ఇతర సౌకర్యాలు లభించే ఈ ప్రభుత్వ ఉద్యోగం వదిలేశాక ఆ పెద్దమనిషి తన మాట నిలబెట్టుకోలేకపోతే నా పరిస్థితి ఏమిటి? తన పని పూర్తయిన తరువాత ఉద్యోగం నుండి నన్ను తొలగించేస్తే నేనేమవ్వాలి?” ఈ విధమైన ఆలోచనలతో అతనికి ఆ రాత్రి నిద్ర పట్టలేదు. అప్పుడతనికి హఠాత్తుగా, "తను శిరిడీనుండి తిరుగుప్రయాణం అయ్యేటప్పుడు బాబా తన వద్ద మిగిలివున్న 15 రూపాయలు దక్షిణగా తీసేసుకుని, దానిబదులు పదిరెట్లు ఆదాయం చూపిస్తున్నారు" అని తోచింది. రెండురోజుల తరువాత టాటాగారి సెక్రటరీ అతని ఇంటికి వచ్చి ఉద్యోగం ఇస్తున్నట్లుగా నియామకపత్రం ఇచ్చి, "ఉద్యోగం గురించి అన్ని వివరాలు, జీతం, ఇవ్వబడే ఇతర సౌకర్యాలు అన్నీ ఈ పత్రంలో ఉన్నాయ"ని చెప్పాడు. తరువాత పత్రంమీద సూచించిన చోట సంతకం చేయమని చెప్పాడు. బాబా తనను ఆశీర్వదించి ఇచ్చిన ఆయన ఫోటోకి నమస్కరించుకుని ఆ నియామకపత్రంపై సంతకం పెట్టాడు విష్ణుపంత్.

సాయిభక్తులందరూ ఇది చదివిన తరువాత ఒక విషయం గమనించి వుంటారు. విష్ణుపంత్ శిరిడీ వెళ్ళడం అదే మొదటిసారి. బాబా దక్షిణ అడగగానే మరొక ఆలోచన ఏదీ లేకుండా తనవద్ద ఉన్నదంతా బాబాకు సమర్పించేశాడు. 'తిరుగు ప్రయాణానికి ఒక్క పైసా కూడా లేదే, ఎట్లా వెళ్ళాలి?' అన్న విషయం కూడా ఆయన మనసులోకి రాలేదు. శిరిడీనుండి కోపర్‌గాఁవ్‌కి నడుచుకుంటూ వెళ్ళడానికి సిద్ధపడ్డాడే తప్ప, తన పరిస్థితికి ఎక్కడా బాధపడలేదు. ఆయన ప్రయాణానికి ఎటువంటి ఇబ్బందీ కలగకుండా బాబానే చూసుకున్నారు. అతను ఇచ్చిన దక్షిణకి పంత్ భావించినట్లుగానే పదిరెట్ల జీతంతో క్రొత్త ఉద్యోగం వచ్చేలా అనుగ్రహించారు బాబా. బాబాపై అచంచలమైన భక్తి ఉన్నవారికి బాబా ఎప్పుడూ తోడునీడలా ఉంటారు.


Source: ది గ్లోరీ ఆఫ్ శిరిడీసాయి

4 comments:

  1. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete
  2. ఓం సాయిరాం...🌹🙏🏻🌹

    ReplyDelete
  3. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI.. OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo