సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 196వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:

  1. ఆలస్యం అయినప్పటికీ బాబా తన బిడ్డల చేయి వదలరు
  2. కేవలం 5 నిమిషాల్లో సమస్యను పరిష్కరించారు బాబా

ఆలస్యం అయినప్పటికీ బాబా తన బిడ్డల చేయి వదలరు

బెంగుళూరు నుండి సాయిభక్తురాలు లక్ష్మిగారు మరో అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

సాయిబంధువులకు నమస్కారములు. ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న బృందానికి నా నమస్కృతులు. నేను అన్నిటికీ సాయిబాబానే నమ్ముతాను. ఇదివరకు నేను పురిటిలో మా మనవడికి వచ్చిన సమస్య నుండి బాబా కాపాడిన అనుభవాన్ని మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరో అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. రెండు సంవత్సరాల క్రిందట మాకు చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. మా అబ్బాయి కొన్ని కారణాల వలన తను చేసే ఉద్యోగానికి రాజీనామా చేయవలసి వచ్చింది. తరువాత ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. తనకి త్వరగా ఉద్యోగం రావాలన్న సంకల్పంతో మా కోడలు నవగురువారవ్రతం ప్రారంభించింది. సాయినాథుని దయవలన 9 వారాల వ్రతం నిరాటంకంగా పూర్తయింది. కానీ బాబా మామీద దయ చూపలేదు. ఉన్న కష్టానికి తోడు మా అబ్బాయి కాలికి ఒక సమస్య వచ్చి, ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. పరిస్థితులు ఎలా ఉన్నా నేను ఎల్లవేళలా బాబానే వేడుకుంటూ ఉండేదాన్ని. చివరికి బాబా మాపై కృప చూపారు. కొద్దిరోజుల తరువాత మా అబ్బాయికి ఆరోగ్యము బాగై, మంచి ఉద్యోగం కూడా దొరికింది. ఇప్పుడు సాయి దయవలన మా అబ్బాయి హాయిగా ఉన్నాడు. కొంచెం ఆలస్యం అయినప్పటికీ బాబా తన బిడ్డల చేయి వదలరు. ఆయనే అందరికీ తల్లి, తండ్రి, గురువు, దైవం. అన్నీ తానై సదా అందరినీ కాపాడుతూ ఉంటారు.

ఓం శ్రీ సాయినాథాయనమః

కేవలం 5 నిమిషాల్లో సమస్యను పరిష్కరించారు బాబా

ఢిల్లీ నుండి ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

సాయిభక్తులందరికీ నా నమస్కారం. బాబా దయతో నేను ఢిల్లీలో ఒక ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్నాను. నేను నాకు జరిగిన అనుభవాన్ని అందరితో పంచుకుంటానని బాబాకు వాగ్దానం చేయనప్పటికీ సాయిదేవుని లీలను పంచుకోకుండా ఉండలేకపోతున్నాను. ఎందుకంటే, ఈ 'ఆధునిక సచ్చరిత్ర' కోసం అనుభవాలను పంచుకోవడం చాలా విలువైన పనిగా నేను భావిస్తున్నాను.

సాయి దయతో నాకు మంచి ఉద్యోగం లభించడంతో నేను ఉంటున్న హాస్టల్ (పిజి-పేయింగ్ గెస్ట్) మారాలని అనుకున్నాను. అయితే ఆ విషయాన్ని 15 రోజుల ముందుగా నేను ఉంటున్న హాస్టల్ యజమానికి చెప్పడం మర్చిపోయాను. నేను రేపు ఖాళీ చేయబోతున్నాననగా ముందురోజు యజమానికి తెలియజేశాను. అతను, "నువ్వు కనీసం 7 రోజుల అద్దె చెల్లించు లేదా నీ స్థానంలో వేరే అమ్మాయిని చూపించి వెళ్ళు" అని చాలా కటువుగా చెప్పాడు. అంటే, నేను అదనంగా 1500 రూపాయలు చెల్లించాల్సిన అవసరం ఏర్పడింది. దాంతో నేను చాలా బాధపడ్డాను. తరువాత నేను అదివరకే వేరే కోరికలకోసం చదువుతున్న శ్రీసాయి సచ్చరిత్ర చదవడం మొదలుపెట్టాను. చదువుతూ నా మనస్సులో, "దయచేసి 1500 రూపాయలు అదనంగా చెల్లించనివ్వకండి బాబా. నా కోరిక నెరవేరితే 150 రూపాయలతో ఆహారాన్ని పేదలకు దానం చేస్తాను" అని బాబాని ప్రార్థించాను. అంతలో హఠాత్తుగా ఎవరో నా గది తలుపు తట్టారు. నాకు తెలియని ఒక అమ్మాయి లోపలికి ప్రవేశించి, "నేను ఇక్కడికి మారాలని అనుకుంటున్నాను. అందువలన నాకు ఈ హాస్టల్ యజమాని నెంబర్ కావాలి" అని అడిగింది. నేను తనకి నా పరిస్థితిని వివరించాను. వెంటనే తను నా బదులు అక్కడ చేరడానికి అంగీకరించింది. అలా నా సమస్య కేవలం 5 నిమిషాల్లో పరిష్కరించబడింది. అది సాయి దయ! "చాలా చాలా ధన్యవాదాలు బాబా!" ఆయన ఎల్లప్పుడూ నాకు సహాయం చేస్తూనే ఉన్నారు. కానీ ఒక సంవత్సరం నుండి నాకున్న ఒక ప్రత్యేక కోరికను మాత్రం ఎందుకు వినడంలేదో తెలియడంలేదు. ఆ విషయమై నేను రోజూ సాయిని ఏడుస్తూ అభ్యర్థిస్తున్నాను. "దేవా! దయచేసి నా ప్రార్థనలను వినండి. నాకు సహాయం చెయ్యండి". 

3 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo