సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

దేహాతీతుడు విదేహుడైన వేళ!


అది 1918వ సంవత్సరం. అక్టోబరు 15వ తేది. మంగళవారం. విజయదశమి పర్వదినం. మధ్యాహ్నం సుమారు రెండు గంటలవుతోంది. చాంద్రమానాన్ని అనుసరించి దశమి ఘడియలు దాటి, ఏకాదశి ఘడియలు ప్రవేశించాయి. శ్రీసాయిబాబా మహాసమాధిగతులయ్యారు!

రాష్ట్రం నలుమూలలకు ఆ వార్త దావానలంలా వ్యాపించింది. సాయిభక్తుల గుండెల్లో బడబానలం బద్దలైంది. ఆనందకందమైన శ్రీసాయి దివ్యమంగళరూపాన్ని పరవశంతో కన్నులారంగ చూస్తూ ఆనందభాష్పాలు రాల్చిన కన్నులు, బాబా యొక్క భౌతికకాయం ఇక కనుమరుగైందనే సరికి, శోకాశ్రువులతో నిండిపోయాయి. వారి ఎదనుండి ఎగిసిపడుతున్న సాయి మమతల మధురస్మృతులు ఆ జ్ఞాపకాల ఆవేగపు ఒరిపిడి నుండి, “ఆ రోజులు మరిక తిరిగిరావు!" అనే వేడి నిట్టూర్పు, ఆ నిట్టూర్పు నిండించిన ఏదో శూన్యతాభావం. ఆ భావానికి అర్థంగా అలుముకుంటున్న అభద్రతాభావం.... ఏదో అంతుపట్టని నిస్సహాయత! - నిస్తేజత! స్థబ్దత!...

దేహ త్యాగానికి ముందు నా కిక్కడ (మసీదులో) ఏం బాగాలేదు నన్ను బూటీ వాడికి తీసుకుపోండి! అక్కడ నాకు పెద్ద పెద్దవాళ్ళు సేవలు చేస్తారు అన్నారు బాబా. దాన్ని బాబా తమ దేహాన్ని బూటీవాడాలో సమాధి చెయ్యమని చేసిన ఆదేశంగా భావించారు భక్తులు. బూటీ వాడాలో మురళీధర విగ్రహ ప్రతిష్ఠకు కేటాయించిన జాగాలో గుంట త్రవ్వడం మొదలైన పనులు ప్రారంభించారు.

తండోపతండాలుగా ప్రజలు బాబా దర్శనానికి రాసాగారు. అందరూ సందర్శించుకోవడానికి వీలుగా ఆ సద్గురునాథుని పవిత్ర పార్థివదేహాన్ని మసీదులో కూర్చుండబెట్టారు. విపరీతమైన రద్దీ. ఆ దేహాతీతుని భౌతికదేహాన్ని  చివరిసారిగా సాక్షాత్కరించుకొనే భాగ్యాన్ని పొందేందుకు ఒక్కొక్కరు ఐదారు గంటలు వేచి వుండవలసి వచ్చిందట.

ఇంతలో బాబాను ఎక్కడ ఎలా సమాధి చెయ్యాలి అనే విషయంలో వివాదం బయలుదేరింది. దేహత్యాగానికి ముందు, "నన్ను దగ్దీ (బూటీ) వాడాకు తీసుకుపొండి!” అని బాబా అన్న మాట, తమ దేహాన్ని బూటీవాడాలో సమాధి చెయ్యమని బాబా ఇచ్చిన ఆదేశంగా భావించి చాలామంది భక్తులు బాబా దేహాన్ని బూటీవాడాలో సమాధి చేయాలని నిశ్చయించారు. అయితే, శిరిడీ గ్రామంలోని కొందరు వృద్ధులు, బాబా ముసల్మాననే భావనతోనో, లేదా ఊరిమధ్య సమాధి వుండటమేమిటనే ఛాందసమూఢవిశ్వాసాల వల్లనో, బాబా దేహాన్ని ఊరి బయట శ్మశానంలో సమాధి చెయ్యాలని వాదించారు. శ్రీ అమీర్ శక్కర్ వంటి చాలామంది ముస్లిం సాయిభక్తులు కూడా బాబా దేహాన్ని ఇస్లాం మత సాంప్రదాయానుసారం ఖబరిస్తాన్ (స్మశానం) లో ఆరుబయట సమాధిచేసి, దానిపై గోరీ కట్టాలని పట్టుబట్టారు. 

బూటీవాడా శ్రీగోపాల్ రావ్ బూటీ స్వంత ఆస్తి గనుక, ముందు ముందు భవిష్యత్తులో ముస్లిములను సమాధిమందిరంలోనికి ప్రవేశించేందుకు అడ్డుకోవచ్చనేది వారి భయం. మొదట షామా కూడా బాబాను బూటీవాడాలో సమాధి చెయ్యటానికి వ్యతిరేకించాడు! తాత్యాకోతే పాటిల్ అభిమతం మాత్రం బాబా దేహాన్ని బూటీవాడాలో సమాధి చెయ్యాలని. కానీ, ఆయన తీవ్ర అనారోగ్యంతో మంచం దిగలేకున్నాడు. అందువల్ల శ్రీతాత్యా తన ఆప్తమిత్రుడైన శ్రీరామచంద్రపాటిల్ను పిలచి, తమ దేహాన్ని బూటీవాడాలో సమాధి చెయ్యడం బాబా అభిమతమనీ, అందువల్ల ఎలాగైనా బాబా ఆదేశాన్ని అమలుపర్చేలా చూడమని కోరాడు.

శిరిడీ గ్రామస్తులలో చాలామంది, ముఖ్యంగా యువకులు, బాబా దేహాన్నిబూటీవాడాలోనే సమాధిచెయ్యాలని వాదించారు. ఆ వర్గానికి శ్రీరామచంద్రపాటిల్ నాయకత్వం వహించాడు. శ్రీరామచంద్రపాటిల్ పక్షాన శ్రీయుతులు బయ్యాజీ పాటిల్ కోతే, బప్పాజీ లక్ష్మణ్ రత్నపార్ఖి, బాలాజీ పిలాజీ గురవ్, సంతాజీ భివసన్ షెల్కే, వామనరావు మాన్ కోజీ గోండ్కర్, మార్తాండ్ భగత్ సోనార్, తాత్యా తుకారామ్ పాటిల్ షిండే, నివృత్తి హనుమంత్ గోండ్కర్, అప్పా బహీర్ గోండ్కర్, భావాడు దులబ్ భిల్ల్, సఖరాం రాంజీ కోతే, దాదా మహదూ - గోండ్కర్, తుకారాం భారకూ మహర్, యాదవ్ రఘునాధ షిండేలాంటి యువకులు నిలిచారు. బాబాను ఎక్కడ సమాధి చెయ్యాలి అన్న అంశంపై వాదోపవాదాలు, తర్జనభర్జనలు తీవ్రమయ్యాయి. గ్రామం రెండు వర్గాలుగా చీలిపోయింది.

సాయంత్రానికి రహతానుండి ఫౌజుదారు (పోలీసు సబ్ ఇన్‌స్పెక్టరు) వచ్చాడు. శిరిడీ గ్రామ పోలీసుపటేల్ (మునసబు) సంతాజీ పాటిల్ షెల్కె ఆధ్వర్యంలో పంచనామా జరిగింది. బాబాకు వారసులెవ్వరూ లేకపోవడం చేత బాబాకు చెందిన వస్తువులనన్నింటినీ ప్రభుత్వ ఖాతాలో జమ చెయ్యాలని నిర్ణయించడం జరిగింది. కానీ, బాబాను ఎక్కడ సమాధి చెయ్యాలన్న అంశంపై వివాదం మాత్రం పరిష్కారం కాలేదు. మంగళవారం రాత్రంతా హెూరా హోరీగా వాదచర్చలు జరిగాయి.

ఇక తెల్లవారితే బుధవారమనగా, షామా మేనమామయైన లక్ష్మణ్ మామా జోషీకి బాబా స్వప్నంలో కనిపించి, “త్వరగా లే! బాపూసాహెబ్ జోగ్ నేను మరణించాననుకొంటున్నాడు. అందువల్ల అతడు ఆరతి ఇవ్వడానికి రాడు. నీవు వచ్చి కాకడ ఆరతి ఇవ్వు!” అని ఆదేశించారు. బాబా ఆ స్వప్నంలో చెప్పినట్లే ప్రతిరోజు బాబాకు ఆరతులు నిర్వహించే జోగ్ ఆ ఉదయం కాకడ ఆరతి ఇవ్వడానికి రాలేదు! మసీదులో ఉన్న మౌల్వీలు ఎంత అభ్యంతరం పెడుతున్నా లెక్క చెయ్యకుండా లక్ష్మణ్ జోషీ బాబాకు కాకడ ఆరతి చేసి వెళ్ళిపోయాడు. ఆ విషయం తెలిసి జోగ్  మధ్యాహ్న ఆరతికి యధా ప్రకారం వచ్చాడు.

బుధవారం ఉదయం కోపర్‌గాం నుండి మామల్త్ దార్ (తాసిల్‌దార్), బొంబాయి నుండి అమీర్‌భాయి తదితరులందరూ వచ్చారు. బాబాను ఎక్కడ సమాధి చెయ్యాలనే విషయంలో ఒక పరిష్కారం కుదరకపోగా, ఊరిలోని ఇరువర్గాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ పరిస్థితుల్లో మామల్తదారు ఎన్నికద్వారా నిర్ణయించడానికి సంతకాల సేకరణకు ఆదేశించాడు. ఓటింగులో 1503 సంతకాలు బూటీవాడాలో సమాధి చెయ్యాలనే నిర్ణయానికి, 730 సంతకాలు ఊరి బయట స్మశానంలో సమాధి చెయ్యాలనే నిర్ణయానికి వచ్చాయి. మెజారిటీ అభిప్రాయం బాబా దేహాన్ని బూటీవాడాలో సమాధి చెయ్యడానికి వచ్చినా, ఆ అంశం పెద్ద ఎత్తున గ్రామంలో తగాదాలకు, మతద్వేషానికి కారణమై శాంతిభద్రతల సమస్యగా పరిణమిస్తుందేమోననే భయంతో మామల్తదారు ఇరువర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదిరితే తప్ప తానే నిర్ణయం తీసుకోలేనని, లేకపోతే ఈ విషయంలో జిల్లా కలెక్టరుతో సంప్రదించవలసిందేనని అన్నాడు. జిల్లా కలెక్టరుతో సంప్రదించడానికి శ్రీకాకాసాహెబ్ దీక్షిత్ స్వయంగా అహ్మద్‌నగర్ బయలుదేరాడు. శ్రీదీక్షిత్‌కు ప్రభుత్వాధికారులతో ఉన్న పరిచయం- పరపతి, కార్యసాధనలో ఆయన సామర్థ్యం అందరూ ఎరిగినదే. శ్రీదీక్షిత్ కనుక జిల్లా కలెక్టరును కలిస్తే జరుగబోయేదేమిటో ఊహించిన (బాబా దేహాన్ని ఖబరిస్థాన్‌లో సమాధి చెయ్యాలని వాదించే వర్గానికి చెందిన) భక్తులు రాజీ ప్రయత్నాలకు అంగీకరించారు. ఆ ఒప్పందం ప్రకారం బాబాను ఇస్లాం మతాచారం ప్రకారం పెట్టెలో పడుకొనబెట్టి సమాధి చెయ్యాలని, సమాధి మందిరంలోకి, మసీదులోకి మహ్మదీయులు వచ్చి ఆరాధించడానికి ఏ ఆటంకం ఉండకూడదనే  షరతులపై బాబా భౌతికకాయాన్ని బూటీవాడాలోనే సమాధి చెయ్యడానికి ఏకాభిప్రాయం కుదిరింది. ఈ వ్యవహారమంతా ముగిసేసరికి బుధవారం మధ్యాహ్నమైంది.
వివాదం పరిష్కారమైన వెంటనే బాబా భౌతికకాయానికి స్నానం చేయించి, నాలుగు చక్రాల బండిలో కూర్చుండబెట్టి పైన అర్థచంద్రాకృతిలో ఒక చంద్రప్రభను ('ఆర్చి') ఏర్పాటుచేసి, గుర్రం, పల్లకి మొ॥న హంగులతో పెద్ద ఎత్తున గ్రామమంతా ఊరేగించి బూటీవాడలో ఉంచారు. బుధవారం మధ్యాహ్నం శ్రీబాపూసాహెబ్ జోగ్  మసీదులో బాబాకు ఆరతి ఇచ్చి తాను మామూలుగా నిత్యం చేసేవిధంగా బాబా చేతివేళ్లు తెరచి బాబా చేతిలో దక్షిణ వుంచి మళ్ళీ బాబా పిడికిలి మూసాడు. బాబా సమాధియై అప్పటికి సుమారు 21 గంటలయింది. అయినా బాబా చేతివేళ్ళు ఏ మాత్రం బిగుసుకుపోకుండా చాలా సులువుగా తెరిపిస్తే తెరుచుకొని, మళ్ళీ మూసేస్తే మూసుకున్నాయి! బాబా దేహత్యాగం చేసిన తరువాత బూటీవాడలో సమాధి చెయ్యడానికి సుమారు 26 గంటలు పట్టింది. ఇన్ని గంటలున్నా బాబా దేహం బిగిసిపోవడం జరుగలేదు. నిద్రపోతున్న వారి అవయవాల మాదిరి సులభంగా వంగుతున్నాయి! భక్తులు ఏ మాత్రం శ్రమలేకుండా బాబా 'కఫ్నీ' కూడా విప్పివేయగలిగారు.

బాబా సమాధిని పలకతో కప్పివేయడానికి ముందే సమాధిలో బాబా సటకా, చిలుం, సూది - దారపువుండలు, పూవులు, సుగంధ ద్రవ్యాలు సమర్పించారు. బాబా వద్ద (సుమారు పన్నెండు అంగుళాల పొడవు, తొమ్మిది అంగుళాల వెడల్పు, మూడంగుళాల మందంగల) ఒక పెద్ద ఇటుకరాయి వుండేది. దాన్ని ఆయన కూర్చున్నప్పుడు చేతిక్రింద, పరుండే సమయంలో తలదిండుగా వాడేవారు. ఆ ఇటుక బాబాయొక్క గురుప్రసాదమని కొందరు భక్తులు భావించేవారు. (అయితే, బాబా ఎప్పుడూ అది తమ గురుప్రసాదమని స్పష్టంగా చెప్పినట్లు నిర్దుష్టమైన ఆధారాలు లేవు.) బాబా సమాధి అవడానికి కొన్నిరోజుల ముందు మాధవ్ ఫస్లే అనే భక్తుడు మసీదు శుభ్రం చేస్తుండగా పొరపాటున చేతినుండి జారి క్రిందపడి రెండు ముక్కలయింది. (మహల్సాపతి ఒకనాడు ఆ ఇటుకను బాబా చేతికందిస్తుండగా, పొరపాటున చేయిజారి క్రింద పడి రెండు ముక్కలయిందని మరో కథనం.) ఆ సమయంలో బాబా మసీదులో లేరు. ఆయన తిరిగి వచ్చి ఇటుక పగిలిపోయివుండటం చూస్తే ఎంతో ఉగ్రులవుతారని భక్తులు భయపడ్డారు. కానీ, మసీదుకు తిరిగివచ్చిన బాబా, ఆ విరిగిన ఇటుకను చూసి ఏమాత్రం ఆగ్రహం వ్యక్తం చెయ్యలేదు. నిర్లిప్తంగా ఆ ఇటుక ముక్కలను చేతిలోకి తీసుకొని కంటనీరు తిరుగుతుండగా, “అయిపోయింది! పూర్తయిపోయింది! ఈ జన్మలో యీ ఇటుకతో వున్న సంబంధం తీరిపోయింది. ఇక వెళ్ళక తప్పదు!" ('సేవట్ ఝాలా ఆతా సర్వచ్ ఆటూప్‌లే. జన్మాచి ఖరీ సోబతీణ్ సేవటీ గోలీచ్. ఆతా ఆపణ్‌హీ గోలీ పాహిజే. అప్పణ్ వీట్ సోన్యాచా తారెనే నీట్ జుల్‌వూన్ బంధన్ ఘేవు!") అన్నారు. బాబా విచారం చూచి, ఆ పగిలిన ఇటుకను వెండితోగాని, బంగారంతోగాని అతికించి ఇస్తానన్నాడు శ్రీబూటీ. కాని బాబా అనుమతించలేదు. అయితే బాబా భౌతికకాయాన్ని సమాధి చేసేటప్పుడు భక్తులు ఆ ఇటుకను వెండితీగతో చుట్టి అతికించి బాబా తలక్రింద వుంచారు.

బాబా వద్ద పైన పేర్కొన్న ఇటుకే కాక ఒక పాతగుడ్డసంచి కూడా వుండేది. ఎవర్ని బాబా దాన్ని ముట్టుకోనిచ్చేవారు కాదు. అందువల్ల దానిలో ఏం వస్తువులుండేవో ఎవరికి తెలియదు. బాబా మహాసమాధి అనంతరం భక్తులు ఆ గుడ్డసంచిని విప్పి చూస్తే, అందులో కాశీనాధ్ షింపీ ఎప్పుడో బాబాకు సమర్పించిన జీర్ణావస్థ లోనున్న ఓ ఆకుపచ్చ కఫ్నీ, టోపీ వున్నాయి. బాబా వాటిని అంత అపురూపంగా ఎందుకు దాచుకున్నారో ఎవ్వరికీ అంతుబట్టే విషయం కాదు. ఆ కఫ్నీ, టోపీని యథాతధంగా ఆ సంచిలోనే పెట్టి, ఆ సంచిని కూడా సమాధిలో ఉంచారు. ఈ తంతు అంతా ముగిసి సమాధి మూసివేసేసరికి బుధవారం సాయంత్రం సుమారు నాలుగు గంటలయింది.

బాబా భౌతికకాయాన్ని సమాధి మందిరంలో దర్శనార్థం ఉంచినప్పుడు బాబా నోటి వెంట కొంచెం రక్తం వచ్చిందట! ఇది వైద్యశాస్త్రరీత్యా అపూర్వమైన విషయం. అయినా, ప్రేగులను వెడల గ్రక్కి శుభ్రం చేసుకోవడం, ఖండయోగం మొదలైన అసాధారణ యోగప్రక్రియలేగాక, 33 సంవత్సరాల క్రిందట మూడురోజుల పాటు మరణించి కూడా మేల్కొన్న శ్రీసాయికి సామాన్య ప్రకృతి ధర్మాలు వర్తించకపోవడంలో ఆశ్చర్యం లేదు.

బాబా సమాధియైన మరుసటిరోజు అంటే బుధవారం తెల్లవారుఝామున అప్పుడు పండరీపూరులో వున్న శ్రీదాసగణు మహరాజ్‌కు బాబా స్వప్నంలో దర్శనమిచ్చి, “మసీదు కూలిపోయింది. నూనె వర్తకులు నన్నెంతో వేధించారు. అందుకే అక్కడనుంచి వెళ్ళిపోతున్నాను. ఈ విషయం చెప్పడానికే వచ్చాను. నీవు వెంటనే వచ్చి నా సమాధిని పూలతో కప్పు” అన్నారు. తెల్లవారగానే బాబా సమాధియైన వార్త శిరిడీ నుండి అందింది. దాసగణు హుటాహుటిన తన శిష్యబృందంతో శిరిడీ చేరి సమాధిని పూలతో కప్పాడు. శిరిడీలో నామసంకీర్తన, అన్నసంతర్పణ జరిపించాడు.
బాబా దేహత్యాగం చేయగానే నానావలీ పెద్దఎత్తున విలపిస్తూ "మామా, నీవు లేకుండా నేను బ్రతుకలేను. నేనూ నీతో వచ్చేస్తాను!" అని అంటూ, అన్నపానీయాలు మానివేసి, బాబా సమాధియైన 13వ రోజున తానూ దేహత్యాగం చేసాడు.

బాబా సమాధియైన కొంతకాలం తరువాత ఒక 'ఇమాం' ఇద్దరు పిల్లలను బాబా సమాధివద్ద బలి ఇవ్వడానికి యత్నిస్తుండగా సమయానికి తాత్యాకోతేపాటిల్, రామచంద్రపాటిల్ పోయి అతణ్ణి వారించి పంపివేశారట. ఈ విషయాన్ని శ్రీ గోఖలే అనే సాయిభక్తుడు తన మరాటీ గ్రంథంలో పేర్కొన్నాడు. 

మొదటి రోజుల్లో వారానికి ఒక్కరోజు మాత్రమే సమాధికి అభిషేకం (స్నానం) చేసేవారు. అప్పట్లో ఆ సేవ ప్రధానంగా శ్రీ అబ్దుల్‌బాబా నిర్వహించేవారు. బాబా మహాసమాధియైన వెంటనే కమలాకర్ దీక్షిత్ అనే వ్యక్తిని బాబా నిత్యపూజాదికాలకు శ్రీబూటీ నియమించాడు. కానీ, అతను కొద్దిరోజులు మాత్రమే పనిచేసి, ఆ పైన సకోరి వెళ్ళి శ్రీఉపాసనీబాబా ఆశ్రమంలో స్థిరపడ్డాడు. బాబా సశరీరులుగా వుండగా బాబా ఆరతులు నిర్వహిస్తుండిన శ్రీ బాపూసాహెబ్ జోగ్ కూడా బాబా సమాధియైన కొన్ని నెలలకు సన్యాసం పుచ్చుకొని, సకోరిలో నివాసం ఏర్పరచుకొన్నాడు.

1918 నుండి 1922 వరకు శిరిడీ సందర్శించే భక్తులు చాలా తక్కువ సంఖ్యలో ఉండేవారు. శ్రీకాకాసాహెబ్ దీక్షిత్ చొరవతో శ్రీసాయిబాబా సంస్థాన్, శిరిడీ పేర ఒక ట్రస్టు ఏర్పాటు చెయ్యబడింది. మొదటి రోజులలో సాయిబాబా సంస్థాన్ వ్యయం నెలకు రూ.250/- నుండి రూ.300/- ల మధ్య మాత్రమే ఉండేది. ఈనాడు అదే కొన్ని కోట్ల రూపాయలకు చేరుకొన్నది. 1918 నుండి 1954 వరకు సమాధిపై శ్రీసాయిబాబా ఫోటో మాత్రమే ఉండేది. 1954వ సంవత్సరం అక్టోబరు 7వ తేది, గురువారం, విజయదశమినాడు శ్రీబాలాజీ వసంత తాలిం అనే శిల్పి చెక్కిన అద్భుతమైన పాలరాతి విగ్రహాన్ని సమాధి మందిరంలో ప్రతిష్ఠించడం జరిగింది. 

ఏది నిజమయిన విజయదశమి?

ప్రేమ-మమత-సమతలకు ప్రతిరూపమైన శ్రీసాయిప్రబోధపథంలో ముందుకు సాగనీయకుండా అడ్డుపడే బూజుపట్టిన ఆచారవ్యవహారాల పట్ల, కులమతజాతి వివక్షతల పట్ల, మనకుండే మూర్ఖమైన మూఢవిశ్వాసమే మనలోని మహిషతత్త్వం. ఆ మూఢాచారాలను సమాజంలో ప్రచారం చేసే శక్తులే ఆ మహిషతత్త్వం మూర్తీభవించిన మహిషాసురులు. మన ఆధ్యాత్మిక పురోగమనానికి నిరోధమయిన ఈ మహిషతత్త్వాన్ని ఒక రూపంలో నిర్మూలిస్తే అది మరో రూపంలో తలెత్తుతూనే ఉంటుంది - మహిషాసురుని రక్తపు బొట్టులోనుండి మరో మహిషాసురుడు పుట్టి విజృంభించినట్లుగా! మనలోని త్రికరణాలను ఏకం చేసి ఒక మహిషాసురమర్దన శక్తిగా రూపొందింపజేసుకొని, సాయిభక్తి, వివేకము, నిష్ట-సబూరీలనే ఆయుధాలతో పోరినపుడే ఆ మహిషాసురమర్దనం జరుగుతుంది. అది జరిగిననాడే మనకు నిజమయిన విజయదశమి!

- శ్రీబాబూజీ

ఈ ఆర్టికల్ యొక్క యూట్యూబ్ లింక్ కూడా క్రింద ఇస్తున్నాము. వీక్షించండి.

Sources: సాయిపథం - ప్రధమ సంపుటము.


1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo