సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 187వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవం:
  • సప్తాహపారాయణతో చవిచూసిన శ్రీసాయి సర్వశక్తిమత్వం.

తమిళనాడులోని హోసూరు నుండి సాయిభక్తుడు ఎస్.ఎన్.రాగుల్ తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

జై గురు సాయిరామ్! నేను శ్రీ సాయిబాబాకు అంకిత భక్తుడిని. శ్రీసాయి సర్వశక్తిమత్వానికి సంబంధించిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను.

2007వ సంవత్సరంలో విదేశాలలో ఉన్న నా సోదరి గర్భవతిగా ఉంది. ప్రసవానికి ముందు, తరువాత మా అమ్మగారు తనకి తోడుగా ఉండి జాగ్రత్తగా చూసుకోవాలని తను ఆశపడింది. అయితే మా అమ్మగారికి అదే మొదటిసారి విదేశీ ప్రయాణం కావడంతో ఆమె మానసికంగా తనని తాను సిద్ధపరచుకున్నారు. కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ప్రసవానంతరం అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్యాకింగ్ పై దృష్టి పెట్టాము. కానీ ఒక సమస్య వచ్చి పడింది. అదేమిటంటే, ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి విదేశాలకు ప్రయాణమవ్వాలంటే వారికి 'నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్(ఎన్‌ఓసి)' తప్పనిసరి. మా అమ్మ తమిళనాడు రాష్ట్రప్రభుత్వ న్యాయవ్యవస్థలో పనిచేస్తున్నారు. కాబట్టి డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్(డిఎం) సంతకం చేస్తే సరిపోతుందన్నదే మాకు తెలుసు. కానీ మాకు తెలియని విషయమేమిటంటే, ఎన్‌ఓసి పై హైకోర్టు న్యాయమూర్తి సంతకం చేయవలసివుంటుందని. ఇక రాష్ట్ర న్యాయవ్యవస్థ పనితీరు చాలా నిదానంగా ఉంటుందని అందరికీ తెలిసిందే.

డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ సంతకమయ్యాక ఎన్‌ఓసి హైకోర్టుకి పంపబడింది. రెండువారాలు గడిచినా మాకు దానిగురించి ఎటువంటి సమాచారం లేదు. అది వస్తేనే మేము వీసా కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు చూస్తే ఒకటిన్నర నెల వ్యవధి మాత్రమే మాకు ఉండటంతో ఏమి చేయాలో మాకు అర్థం కాలేదు. న్యాయవ్యవస్థలోనే పని చేస్తున్న మా నాన్నగారు తనకి తెలిసిన నెట్‌వర్క్ ద్వారా ఎన్‌ఓసి హైకోర్టు కార్యాలయానికి చేరుకుందని, కానీ సంతకం పొందడానికి మరో 3 నెలల సమయం పట్టవచ్చని తెలుసుకున్నారు. ఆ లెక్కన చూస్తే నా సోదరి ప్రసవమైన 4వ నెలకు గాని అమ్మ యు.ఎస్ చేరుకోలేదు. దాంతో అక్కడ నా సోదరి, ఇక్కడ మేము చాలా చాలా ఆందోళనచెందాము. ఆ స్థితిలో అమ్మ తనకింకా 5 సంవత్సరాల సర్వీస్ ఉన్నప్పటికీ ఉద్యోగానికి రాజీనామా చేయాలన్న ఆలోచనలో పడింది. కానీ ఆమె తన పూర్తి సర్వీసు పూర్తిచేసి పదవీవిరమణ చేస్తేనే తనకి పెన్షన్ ప్రయోజనాలు పూర్తిగా లభిస్తాయి. అటువంటి సందిగ్ధ పరిస్థితులలో మా జీవితాలలో శ్రీసాయి మిరాకిల్ జరగడానికి బీజం పడింది.

మా ఇలవేల్పు తిరుమల వెంకటాచలపతి. మేము ప్రతిరోజూ విష్ణుసహస్రనామం చదువుతాము. లక్ష్మీ దేవతకు, వెంకటాచలపతికి పవిత్రమైన రోజైన ఒక బుధవారంనాడు నా సోదరి స్నేహితురాలు మా ఇంటికి వచ్చింది. ఆమె శ్రీసాయికి గొప్ప భక్తురాలు. అమ్మ మాటల మధ్య ఆమెతో మా పరిస్థితి గురించి చెప్పింది. ఆమె సచ్చరిత్ర సప్తాహపారాయణ చేయమని చెప్పింది. అమ్మ వెంటనే పారాయణ చేయడానికి ఉత్సుకత చూపింది. అయితే నాకు, నాన్నకు దేవుడిపై విశ్వాసమున్నప్పటికీ, సాధారణంగా మాకు అద్భుతాలపై నమ్మకం లేదు. ఆ 7 రోజుల పఠనాన్ని మేము నమ్మకపోయినా, అమ్మ కోరుకున్నట్లు చేయడానికి మేము అభ్యంతరం చెప్పలేదు. మేము టౌనులో ఉన్న సాయిమందిరం నుండి ఒక స్నేహితుని సహాయంతో సచ్చరిత్ర పుస్తకాన్ని తీసుకున్నాము. మరుసటిరోజే గురువారం కావడంతో అమ్మ సప్తాహపారాయణ ప్రారంభించింది. ఆమె ఎంతో భక్తిభావంతో పారాయణ చేస్తుండేది. 

అదలా ఉంటే, ఒకవైపు నాన్న తనకి తెలిసిన మార్గాల ద్వారా ఎన్ఓసి పై సంతకం చేయించడానికి ప్రయత్నిస్తుంటే, మరోవైపు నేను నా సోదరి సహాయార్థం అమ్మకంటే ముందు మా అత్తను యు.ఎస్ పంపడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈలోగా 7 రోజులు గడిచాయి. అమ్మ బుధవారంనాడు తన సప్తాహపారాయణ పూర్తి చేసింది. గురువారంనాడు ఆమె శ్రీసాయి ముందు నిలబడి చెప్పలేని ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె బాబాతో, "బాబా! నేను వాగ్దానం చేసినట్లు మీ జీవితచరిత్ర పారాయణ చేశాను. మీరు మీ భక్తులకు చాలా అద్భుతాలు చేసి చూపించారు. దయచేసి మీ దయను నాపై కూడా ప్రసరింపజేయండి" అని ఆర్తిగా ప్రార్థించింది. తరువాత బాబాకు తమిళంలో ఆరతిచ్చి, ప్రసాదం పంచిపెట్టింది. అదంతా చూస్తున్న మాకు పిచ్చిగా అనిపించింది. తరువాత అమ్మ తన డ్యూటీకి వెళ్ళింది. మధ్యాహ్నం 12 గంటలకు నాన్నకు తనకు తెలిసిన వాళ్ళనుండి ఫోన్ వచ్చింది. హఠాత్తుగా ఆ రోజున హైకోర్టు న్యాయమూర్తి తన క్యాబిన్ కి నడుచుకుంటూ వచ్చి చాలా ఫైళ్లను జల్లెడపట్టారట. ఆ ప్రక్రియలో మా అమ్మ ఫైలు కూడా తీసి సంతకం చేసి పంపించారట. అత్యంత ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, అతను తన క్యాబిన్ నుండి బయలుదేరేముందు డిస్పాచ్ చేయబడ్డ ఏకైక ఫైల్ మా అమ్మది మాత్రమే! ఈ వార్త మాకు తెలిశాక పట్టలేని ఆనందంతో అమ్మ తన కార్యాలయం నుండి ఇంటికి చేరుకుంది, నేను నా కాలేజీ(చెన్నైలో) నుంచి ఇంటికి (హోసూర్‌) చేరుకున్నాను. మేము ముగ్గురం శ్రీసాయి ముందు మ్రోకరిల్లి ఆయన సర్వశక్తిమత్వాన్ని అంగీకరించి, ఆయన సేవకు మా పూర్తి సంసిద్ధతను వ్యక్తపరచాము. ఆరోజునుండి, "మా కుటుంబమంటే మేము ముగ్గురం కాదు, సాయితో కలిపి నలుగురం" అని అనుకున్నాము. ఇప్పుడు నా భార్య, కూతురితో కలిపి ఆరుగురం. 

సాయిభక్తులలో ప్రతి ఒక్కరూ మన సాయిపై పూర్తి నమ్మకం కలిగి ఉండండి. ఆయన ఉండగా దేనిగురించీ ఆందోళన చెందవలసిన పనిలేదని నేను విన్నవించుకుంటున్నాను. ఆయన సర్వశక్తిమంతుడు. మన జీవితంలో ఏదైనా జరుగుతుందంటే, మన మేలు కోసమే అది జరగాలని ఆయన ఆశిస్తున్నారని అర్థం. అవి మనల్ని బలోపేతం చేయడానికి ఉపయోగపడతాయి. మన సద్గురు సాయి మననుండి కోరుకునే శ్రద్ధ, సబూరీ అను రెండు నాణేలను(లక్షణాలను) అలవరుచుకుందాం.

జై గురు సాయిరామ్!
-ఎస్.యన్.రాగుల్.

6 comments:

  1. గుడ్ సాయి అనేక రూపాలలో తన తేజోమయా శక్తి కనబరుస్తుంటారు.సాయి.ఓం శ్రీ సాయి నాథయా చరణం శరణం....Baba is sadguruvu.

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo