సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 208వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. కేవలం సాయికృప వలన మాత్రమే నా జీవితంలో అన్నీ జరుగుతున్నాయి
  2. నిందను చెరిపేసిన సాయి

కేవలం సాయికృప వలన మాత్రమే నా జీవితంలో అన్నీ జరుగుతున్నాయి

ఓం శ్రీ సాయిరాం! ఈ బ్లాగ్ నిర్వహించేవారిలోనూ, ఈ మహత్యాన్ని చదువుతున్నవారిలోనూ మరియు అంతటా వ్యాపించివున్న శ్రీసాయినాథ మహారాజుకు నా సాష్టాంగ ప్రణామాలు. నా పేరు కృష్ణ. నేను మచిలీపట్నం నివాసిని. సాయినాథుడు నాకు పరాత్పర గురువు. ఆయన నా జీవితంలో ఎన్నో మహత్యాలు చూపించారు. ఆయన ప్రసాదించిన ఎన్నో అనుభవాల్లోనుంచి ఈమధ్యకాలంలో జరిగినటువంటి ఈ అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను.

శ్రీ సాయినాథుడు అనుమతించడంతో ఈ సంవత్సరం (2019) బాబా పుణ్యతిథికి శిరిడీ వెళ్లాలని ముందుగానే టిక్కెట్లు బుక్ చేసుకున్నాను. సరిగ్గా నవరాత్రులు మొదలయ్యే ముందురోజు మా అమ్మగారు దగ్గు, జ్వరంతో అస్వస్థతకు గురయ్యారు. రోజులు గడుస్తూ పుణ్యతిథి సమీపిస్తున్నా అమ్మకి స్వస్థత చేకూరలేదు. పరిస్థితి అలా ఉన్నప్పటికీ నేను ఆ సాయినాథుడిపై ఉన్న నమ్మకంతో ఎలాగైనా శిరిడీ చేరుకుంటానని ధైర్యంగా ఉన్నాను. కేవలం ఆ సాయినాథుని కృపవలన మాత్రమే నేను ధైర్యంగా ఉన్నానని నాకు తెలుసు. ఎందుకంటే, ఇదివరకు నేను ఇలా ఉండేవాడిని కాదు. అమ్మ ఆరోగ్యం ఏ కాస్త బాగలేకపోయినా ఎంతో భయపడిపోయేవాడిని, ఆందోళనతో బాధపడుతూ ఉండేవాడిని. అలాంటిది సాయినాథుడు నాలో చాలా మార్పు తీసుకొచ్చారు. శిరిడీకి బయలుదేరటానికి ఇంకా ఒకరోజు మిగిలివుంది. మా ఇంట్లో నాతోపాటు అమ్మ, అత్త ఉంటారు. ఇద్దరూ పెద్దవారే. ఇలాంటి సమయంలో వాళ్ళని వదిలి శిరిడీ బయలుదేరాలా, వద్దా అనే మీమాంసలో పడ్డాను. ఆశ్చర్యంగా ఆ రాత్రి అమ్మకు జ్వరం తగ్గి కొద్దిగా స్వస్థత చేకూరింది. మరునాడు అమ్మ లేచికూర్చుని తన పనులు తను చేసుకోవడం మొదలుపెట్టారు. అంతేకాక అమ్మ, “నువ్వు ధైర్యంగా శిరిడీ వెళ్లిరా!” అని చెప్పారు. ఇక నేను సంతోషంగా శిరిడీకి బయలుదేరాను. సరిగ్గా శిరిడీ బయలుదేరేరోజుకే అమ్మకి స్వస్థత చేకూరడం కేవలం సాయినాథుని అనుగ్రహమేనని నాకు బాగా తెలుసు. శిరిడీ చేరుకున్న తర్వాత బాబా దర్శనం చాలా బాగా అయింది. అయితే అమ్మకి మరలా కొద్దిగా జ్వరం వచ్చింది. కానీ అమ్మ చాలా ఉత్సాహంగాను, ధైర్యంగాను నాతో ఫోనులో మాట్లాడుతూ, “నాకు ఏమీ ఫరవాలేదు, నువ్వు ధైర్యంగా ఉండు, ఆనందంగా బాబాను దర్శించుకో!” అని చెప్పేది. నేను శిరిడీలో ఉన్నా ఆ సాయినాథుడు నా స్నేహితుల రూపంలో అమ్మకు సేవ చేస్తూ, నేను శిరిడీ నుంచి తిరిగి వచ్చేదాకా మా అమ్మని కనిపెట్టుకుని ఉన్నారు. ఏది ఏమైనా నా బాబా దయవల్ల నేను శిరిడీలో ధైర్యంగా ఉంటూ చక్కటి దర్శనం చేసుకున్నాను. నేను శిరిడీ నుంచి తిరిగొచ్చిన వారంరోజుల్లో అమ్మకు సంపూర్ణ స్వస్థత చేకూరింది. తరువాత మెల్లగా అమ్మ, అత్త మరలా సాయినాథుని మందిరానికి వెళ్తూ, బాబా సేవ చేసుకుంటున్నారు. నిజానికి చాలా దారుణంగా ఉన్నటువంటి మా కర్మలను కేవలం చిన్న చిన్న వాటితో సాయినాథుడు పూర్తిగా తీసేస్తున్నారని నాకనిపిస్తుంది. కేవలం ఆయన దయవల్లే అమ్మ, అత్త, నేను సంతోషంగా జీవించగలుగుతున్నామన్నది పరమసత్యం. మా చెల్లెలు కూడా ఆయన దయవల్లే వివాహమై సుఖంగా ఉంటోంది. నా జీవితంలో ప్రతిదీ ఆయన నాకు పెట్టిన భిక్షే. ఈ నెలాఖరుకు నేను, అమ్మ, అత్త కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి రూపంలో ఉన్నటువంటి సాయినాథుని దర్శించుకోవడానికి బయలుదేరుతున్నాము. ఆయన మాకు చక్కటి దర్శనాన్నిచ్చి తిరుమలయాత్రను మా చేత దిగ్విజయంగా పూర్తి చేయిస్తారు.

సర్వం శ్రీ సాయినాథ చరణారవిందార్పణమస్తు!

నిందను చెరిపేసిన సాయి

ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

నేను మహాపారాయణ - 653 రాగిణి సాయి గ్రూపులో ఉన్నాను. మంచైనా, చెడైనా ప్రతి సందర్భంలో నాతో ఉన్నందుకు ముందుగా సాయికి నా ధన్యవాదాలు. "కోటి కోటి ప్రణామాలు దేవా! నేను ఎల్లప్పుడూ మీ దివ్య పాదకమలాల వద్ద ఉండాలని కోరుకుంటున్నాను".

శివరాత్రిరోజు అర్థరాత్రి 11.45కి మా అత్తగారు నాకు ఫోన్ చేసి, "నా ఆభరణాలను పర్సులో పెట్టి గోద్రేజ్ అల్మరాలో చీరల మధ్య ఉంచాను. నేను రెండుసార్లు ఆ చోట వెతికాను. కానీ అవి దొరకలేదు. ఇటీవల నువ్వు వచ్చినప్పుడు నా గోద్రేజ్ అల్మరాను ఉపయోగించుకున్నావు కదా! నువ్వేమైనా ఆ ఆభరణాలను వేరే చోట పెట్టావా?" అని అడిగారు. నేను, "వాటిని చూడను కూడా చూడలేద"ని చెప్పాను. కానీ ఆమె నా మాట వినలేదు. పైగా నేనే వాటిని ఎక్కడో పెట్టానని నేరుగా నన్ను నిందించింది. ఆ విషయాలన్నీ ఆలోచిస్తూ ఆ రాత్రి నేను సరిగ్గా నిద్రపోలేకపోయాను. "బాబా! నేను ఆ ఆభరణాలను చూడలేదని మీకు తెలుసు. నా ఆభరణాలు కూడా మా అత్తగారి వద్దనే ఉన్నాయని కూడా మీకు తెలుసు. దయచేసి నాకు సహాయం చేయండి" అని బాబాను ప్రార్థించాను. ఉదయం లేచాక మళ్ళీ, "బాబా! ఈరోజు సాయంత్రానికల్లా అందరిముందు దోషిలా ఉండకుండా నన్ను మీరే కాపాడాలి" అని ఏడుస్తూ బాబాను ప్రార్థించాను. తరువాత, 'అవును' లేదా 'లేదు' అని బాబా ముందు చీటీలు వేశాను. అందులో 'అవును' అని వచ్చింది. దానితో ఆభరణాలకు సంబంధించి నాకు ఖచ్చితంగా శుభవార్త వస్తుందని ధృవీకరించుకున్నాను. రోజంతా నేను ఏడుస్తూ బాబాను, "నాకు ఎందుకిలా జరిగింది? నేను చూడలేదని చెప్పినా కూడా ఆమె నన్ను ఎందుకిలా దోషిని చేసి మాట్లాడుతుంది?" అని చాలాసార్లు ప్రశ్నించాను. "సానుకూల వార్త వస్తే నా అనుభవాన్ని పంచుకుంటాన"ని నేను బాబాకు వాగ్దానం కూడా చేశాను. చివరికి ఆరోజు సాయంత్రం మా మామగారు నా భర్తకి ఫోన్ చేసి, "పర్సుతో సహా ఆభరణాలన్నీ వేరే చోట దొరికాయి. వాటిని నేనో, మీ అమ్మనో అక్కడికి మార్చి ఉండొచ్చు" అని చెప్పారు. "ఎలా మీకు కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలియడం లేదు బాబా. నాకు నోటమాట రావడం లేదు. మీకు అంతా తెలుసు". ఈరోజు బాబా దయ ఆశీర్వాదాల వల్ల మాత్రమే నేను నాపై నింద లేకుండా ఉన్నాను. 

2 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo