సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 205వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. బాబా అనుగ్రహం ఉంటే అన్ని గ్రహాలూ అనుకూలమే!
  2. ఉద్యోగంలో బాబా సహాయం

బాబా అనుగ్రహం ఉంటే అన్ని గ్రహాలూ అనుకూలమే!

నా పేరు తులసీరావు. మాది అనంతపురం. ఈరోజు, “బాబా అనుగ్రహం ఉంటే, అన్ని గ్రహాలూ అనుకూలిస్తాయి” అనే విషయాన్ని నేను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. ఈ బ్లాగును నాకు పరిచయం చేసిన జ్యోతి అక్కకు మరియు ఈ బ్లాగును నిర్వహిస్తున్నవారికి నా నమస్కారాలు. 

మా అమ్మాయి విషయంలో బాబా చేసిన అద్భుతాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. మా అమ్మాయి బి.ఇ. ఆఖరి సంవత్సరం చదువుతోంది. ఆఖరి సంవత్సరంలో కాలేజీలో క్యాంపస్ నియామకాలు జరుగుతాయి కదా! అలానే మా అమ్మాయి చదువుతున్న కాలేజీలో కూడా మే, 2019 నుండి క్యాంపస్ నియామకాలు మొదలయ్యాయి. తను ఎంత ప్రయత్నించినా ఏ కంపెనీలోనూ ఎంపిక కాలేదు. రోజులు గడిచేకొద్దీ తను మానసికంగా బాగా కృంగిపోయింది. నేను మాత్రం మా అమ్మాయితో, “మనకు సమయం వచ్చేవరకు ధైర్యంగా ఉండాలి. ఇలా నిరుత్సాహపడిపోతే ఎలా?” అని ఓదారుస్తుండేదానిని. కానీ తను మాత్రం నా మాటలు వినిపించుకోకుండా, "నా జాతకంలో అసలు ఉద్యోగయోగం ఉందా? ఉంటే, నాకు ఉద్యోగం ఎప్పుడు వస్తుందో పంతుల్ని కనుక్కో!” అని అన్నది. నాకు అవసరం లేదని అనిపిస్తున్నా, తనను నిరాశపరచడం ఇష్టంలేక ఇద్దరు, ముగ్గురు జ్యోతిష్కుల దగ్గర తన జాతకం చూపిస్తే, వాళ్ళు ఆమెకు నవంబరు లేదా డిసెంబరులో ఉద్యోగయోగం ఉందని చెప్పారు. నాకు మాత్రం ఎందుకో తనకు సెప్టెంబరులోనే ఉద్యోగం వస్తుందని దృఢంగా అనిపించింది. నేను, “బాబా! మా అమ్మాయి పడుతున్న బాధను చూడలేకపోతున్నాను. తను త్వరగా మంచి ఉద్యోగంలో ఎంపిక అయ్యేలాగా అనుగ్రహించండి బాబా! తనకు ఉద్యోగం వస్తే ఆ అనుభవాన్ని బ్లాగులో అందరితో పంచుకుంటాను” అని బాబాను వేడుకున్నాను. బాబా అనుగ్రహంతో మా అమ్మాయి సెప్టెంబర్ 10, 2019 ఉద్యోగంలో సెలెక్ట్ అయ్యింది. మా అమ్మాయికి ఉద్యోగాన్ని ప్రసాదించటం ద్వారా, తమ అనుగ్రహం ఉంటే ఏ గ్రహాలూ ఏమీ చేయలేవు అని శ్రీసాయిబాబా మరొకసారి నిరూపించారు. 

త్వరలో మరో అనుభవంతో మీ ముందుకు వస్తానని ఆశిస్తూ... 
జై సాయిరామ్!!!!

ఉద్యోగంలో బాబా సహాయం

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

40 సంవత్సరాల వయసున్న నేను 20 సంవత్సరాలకు పైగా బాబా భక్తురాలిని. నేనొక సాఫ్ట్‌వేర్ సంస్థలో పనిచేస్తున్నాను. నాకు సాఫ్ట్‌వేర్ రంగంలో సుమారు 17 సంవత్సరాల అనుభవం ఉంది. నేను చాలా టీమ్స్ కు లీడ్ గా వ్యవహరిస్తూ మంచి నెట్‌వర్క్ కలిగి ఉన్నాను. ఇక నా అనుభవానికి వస్తే...

పదినెలల క్రితం నేను చేస్తున్న ఉద్యోగాన్ని వదిలిపెట్టమని బాబా నాకు సూచనలిచ్చారు. కానీ సంస్థలో మేనేజరు వైపునుండి నాకు మంచి సహకారం ఉండటం వలన, అక్కడి వాతావరణం కూడా నాకు అనుకూలంగా ఉండటం వలన నేను ఉద్యోగాన్ని వదులుకోవడానికి ఇష్టపడలేదు. అయితే, ఆరునెలలపాటు బాబా నుండి నాకు అలాగే సూచనలు వస్తూ ఉండేవి. నాకేమీ అర్థమయ్యేది కాదు. అయితే కాలం గడుస్తున్నకొద్దీ మా మేనేజరు, నా తోటివారిలో ఒకరు కలిసి ఇతరుల వృత్తిజీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారని, సరైన కారణం లేకుండా వారిని ఉద్యోగం నుండి తొలగిస్తున్నారని నాకు తెలిసింది. ఆ విషయాలు తెలిసి అటువంటి అనైతిక వ్యక్తుల మధ్య ఉండటాన్ని నేను సహించలేకపోయాను. బహుశా అందువలనే ఉద్యోగం వదిలిపెట్టమని బాబా నాకు సూచిస్తున్నారని అర్థం చేసుకున్నాను. అప్పుడు నేను, "ఇప్పుడేమి చేయమంటారో చెప్పండి బాబా" అని సాయిని ప్రార్థించాను. ఆయన నుండి చాలా స్పష్టంగా ఉద్యోగాన్ని వదిలిపెట్టమని సూచనలు వచ్చాయి. వెంటనే నేను బాబా సూచనలు అనుసరించి ఉద్యోగాన్ని వదిలిపెట్టాను. నా చేతిలో వేరే ఉద్యోగం లేదు. ఇద్దరు పిల్లలతో నా పరిస్థితి చాలా కఠినంగా మారుతుందని తెలిసినా బాబానే నమ్ముకున్నాను. బాబా కూడా ఎప్పుడూ నా చేతిని విడిచిపెట్టలేదు. నా నోటీసు వ్యవధి పూర్తయ్యేలోపు ఆయన నాకు మంచి జీతంతో ఉద్యోగాన్నిచ్చి సహాయం చేశారు. నైపుణ్యాలను పెంపొందించుకోవాలని తోటిభక్తులకు చెప్పమని బాబా నాకు సూచించారు. అందరినీ ఆశీర్వదించి, వారికి మార్గనిర్దేశం చేస్తూ, సదా వారికి అండగా ఉండాలని హృదయపూర్వకంగా బాబాను ప్రార్థిస్తున్నాను. 

3 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo