సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 194వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:
  1. దయగల సాయి నా మనోభీష్టాన్ని నెరవేర్చారు
  2. బాబా దర్శనం

దయగల సాయి నా మనోభీష్టాన్ని నెరవేర్చారు

బెంగళూరునుండి ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

నేను చిన్నప్పటినుండి సాయిబాబా భక్తురాలినైనప్పటికీ ప్రెగ్నెంట్ గా ఉన్న సమయంలో బాబాకు చాలా దగ్గరయ్యాను. వివాహమైన చాలా సంవత్సరాల వరకు నేను ప్రెగ్నెంట్ కాలేదు. ఐ.వి.ఫ్ ప్రక్రియ ద్వారా ప్రయత్నించినప్పటికీ అదృష్టం కలిసిరాలేదు. చివరికి బాబా దయతో 6 సంవత్సరాల తరువాత గర్భం దాల్చాను. నా ఆనందానికి అవధుల్లేవు. కానీ నా ఆనందం ఎక్కువకాలం నిలవలేదు. ఎందుకంటే మా రెండు కుటుంబాల(పేరెంట్స్&అత్తమామలు) మధ్య చాలా అపార్థాలు చోటుచేసుకోవడంతో ఎవరినో ఒకరిని ఎంచుకోవాల్సిన పరిస్థితి నాకు ఏర్పడింది. వారందరినీ ఒకేలా ప్రేమించే నాకు ఎవరినో ఒకరిని ఎన్నుకోవడం అంటే చాలా కష్టమైన పని. దాంతో నేను చాలా ఒత్తిడికి గురయ్యాను. ఆ సమయంలో నాకు ఉద్యోగం కూడా లేకపోవడంతో సమస్యల గురించి పదేపదే ఆలోచిస్తూ బాబా ముందు ఏడుస్తూ ఉండేదాన్ని. అటువంటి స్థితిలో సాయిభక్తుల అనుభవాలతో ఉన్న హేతల్ గారి ఇంగ్లీష్ వెబ్‌సైట్‌ నా దృష్టిలో పడింది. తద్వారా నేను క్వశ్చన్&ఆన్సర్ వెబ్‌సైట్ గురించి, నవగురువార వ్రతం గురించి తెలుసుకున్నాను. వెబ్‌సైట్ ద్వారా ఆయన నాతో మాట్లాడుతున్నట్లుగా, 'ప్రతిదీ నెమ్మదిగా సర్దుకుంటుంద'ని సూచనలిస్తున్నట్లుగా నాకు అనిపించింది. దాంతో నా మనస్సుకు కాస్త ధైర్యం చేకూరింది. అయితే ఎన్ని సమస్యలున్నా బాబా దయవల్ల నా ప్రెగ్నెన్సీ మాత్రం సమస్యలు లేకుండా గడిచేది. అదే సమయంలో నేను నవగురువార వ్రతం చేయాలని ఆలోచించాను. కానీ మా ఇంటికి దగ్గరలో సాయి మందిరం లేనందున ఆఫీసు పనిలో బిజీగా ఉండే నా భర్తను ప్రతి గురువారం మందిరానికి తీసుకెళ్లమని నేను అడగలేను. అందువలన వ్రతం సక్రమంగా చేయలేనేమోనని వ్రతాన్ని వాయిదా వేస్తూ వచ్చాను. అయితే నా ప్రెగ్నెన్సీ చివరి త్రైమాసికంలో బాబా వ్రతాన్ని మొదలుపెట్టేలా చేసారు. అది పూర్తిగా బాబా నిర్ణయమే. వ్రతం సమయంలో నేను వ్రతంలో చెప్పినట్లు ఉపవాసం ఉండలేదు. ప్రతి గురువారం మందిరానికి వెళ్ళలేదుగాని, ప్రతివారం సాయి సచ్చరిత్ర చదివి బాబాకు పువ్వులు, దక్షిణ సమర్పించేదాన్ని. నేను నియమానుసారం వ్రతం చేయకపోయినా బాబా నా ప్రార్థనలను అంగీకరించారు. నిజం చెప్పాలంటే బాబా మననుండి కోరుకునేది ప్రేమనే. అయినా ఉపవాసం అనేది బాబాకు నచ్చని విషయం. ఆ విషయాన్ని ఆయన సచ్చరిత్రలో స్పష్టంగా చెప్పారు.

నా డెలివరీ డేట్ జనవరి 9 అని డాక్టర్లు చెప్పారు. అయితే మా వాళ్లంతా డిసెంబర్‌ చివరిలో డెలివరీ చేయించుకోమని ఒత్తిడి చేసారు. ఆ విషయమై నేను విచారంగా ఉన్న సమయంలో వ్రతం చేస్తున్న ఒక సాయిభక్తుని అనుభవం గురించి నేను చదివాను. తను తన ఉద్యాపనను జనవరి 1న చేయబోతున్నట్లుగా చెప్పారు. ఆ అనుభవం చదివాక నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే నా 9వ గురువారం కూడా జనవరి 1న వస్తుంది. వెంటనే, "బాబా! నూతన సంవత్సరంలో నన్ను పండంటి బిడ్డతో ఆశీర్వదించండ"ని బాబాను ప్రార్థించాను. తరువాత సరదాగా బాబాతో, "జనవరి 1న నాకు బిడ్డనివ్వండి" అని కూడా అన్నాను. నేను సరదాగానే అన్నప్పటికీ నేను కోరుకున్నట్లుగానే బాబా ఆశీర్వదించారు. నేను జనవరి 1, గురువారంనాడు ఆడపిల్లకి జన్మనిచ్చాను. ఆరోజు వైకుంఠ ఏకాదశి కూడా. డెలివరీ సమయంలో బాబా నాతోనే ఉన్నారు. ఆయన నా బాధను తీసుకుని నాకెంతో సహాయం చేశారు. డెలివరీ తరువాత నా సమస్యలన్నీ పరిష్కరించబడ్డాయి. నా కుటుంబసభ్యులంతా మళ్ళీ ఒక్కటయ్యారు. నేను ఇంతకన్నా బాబాను ఏమి అడగగలను? ఆయన నా సర్వస్వం. ఒక్కోసారి మన సమస్యలు తీరడానికి సమయం పట్టవచ్చు, కానీ బాబా మన అంచనాలకు మించి ఎక్కువ ఇస్తారు. కాబట్టి ఆయనను పూర్తిగా విశ్వసించి మనం మన చింతలన్నింటినీ ఆయనకు వదిలేసే ప్రయత్నం చేయాలి.

బాబా దర్శనం

సాయి భక్తుడు చంద్రశేఖర్ ఇటీవల విజయదశమి ముందురోజు వాళ్ళ పాపకు బాబా ఇచ్చిన అద్భుతమైన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

నేను, నా అర్ధాంగి, మా 11ఏళ్ళ పాప సుజి(సత్య సృజన) కలిసి విజయదశమికి శిరిడీ వెళ్ళాము. సోమవారం(2019 అక్టోబర్ 7) ఉదయానికి శిరిడీ చేరుకున్నాము. మధ్యాహ్న భోజనానంతరం సమాధి మందిరానికి వెళ్లి బాబాదర్శనం చేసుకున్నాము. బాబా మాకు చక్కటి దర్శనాన్ని ప్రసాదించారు. ఆనందంగా బయటకు వచ్చి లెండివనానికి వెళ్ళాం. అక్కడ రావిచెట్టు వద్ద దీపాలు పెట్టేచోట మాపాప 'తనకు బాబా పాదాలు, శ్యాం సుందర్ గుర్రం తలతో బాబా దర్శనం ఇచ్చార'ని చెప్పింది. మేము చూస్తే, మాకేమి కన్పించలేదు. తనకు మాత్రమే కన్పించారు. ఇది నాఅదృష్టం అని నాబిడ్డ మిక్కిలి సంతోషించింది. తరువాత మేము చావడికి వెళ్ళాము. అక్కడ నాబిడ్డకు సాక్షాత్తూ బాబా దర్శనం ఇచ్చారు. తాను తన రెండు చేతులు పైకెత్తి నమస్కారం చేసుకుని చూసేసరికి బాబా మరి కన్పించలేదు. ఈ విధంగా బాబా నాబిడ్డను అశీర్వదించినందుకు మాకు చాలాచాలా ఆనందంగా ఉంది.

సాయిరామ్.....

6 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo