సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సపత్నేకర్ల శిరిడీయాత్ర



శ్రీసాయిని సశరీరులుగా దర్శించిన పుణ్యమూర్తి శ్రీమతి పార్వతీబాయి సపత్నేకర్‌తో జరిపిన ఇంటర్వ్యూ సారాంశం!

ఉత్సుకత గొలిపే ఆ అంశాలు నింబాల్కర్ అను భక్తుని ద్వారా శ్రీసాయి మనకెలా అందించారో గమనిస్తే ఆశ్చర్యపడక తప్పదు! పూనా వాస్తవ్యుడు, సాయిభక్తుడు అయిన లెఫ్టినెంట్ కల్నల్ ఎం.బి.నింబాల్కర్ (రిటైర్డ్)గారు సాయిసచ్చరిత్ర 48వ అధ్యాయంలో వివరించబడిన సపత్నేకర్ కుటుంబీకులు పూనాలోనే వుంటున్నారని తన స్నేహితుల ద్వారా విన్నాడు. వారి అడ్రసు ఫోను డైరక్టరీ ద్వారా తెలిసికొని తే.13.9.1983న వారింటికెళ్ళి వారితో సంభాషించాడు. అది సపత్నేకర్ మూడవ కూమారుడైన దినకర్ ఇల్లు. శ్రీసాయిబాబా ఆశీస్సులతో పుట్టిన మొదటి కుమారుడు మురళీధర్ కూడా పూనాలోనే వుంటున్నాడని, తన తల్లి పార్వతీబాయి తనతోనే వుంటుందని దినకర్ చెప్పాడు. ఇది విని నింబాల్కర్ అమితంగా సంతోషించాడు. ఎందుకంటే శ్రీమతి సపత్నేకర్ అంతవరకు జీవించి ఉండివుంటుందని అతనూహించలేదు. శ్రీసాయిని సశరీరులుగా దర్శించి సేవించుకున్న  శ్రీమతి సపత్నేకర్‌ను కలుసుకోబోతున్నందుకు అతనెంతో ఆనందించాడు. అది తనకు శ్రీసాయి కల్పించిన దివ్య అవకాశంగా భావించాడు. అప్పుడు శ్రీమతి పార్వతీబాయి సపత్నేకర్ వయస్సు 88 సంవత్సరాలు. నింబాల్కర్ అడిగిన ప్రశ్నలన్నింటికీ ఆమె చక్కగా జవాబులు చెప్పింది. అంతేగాకుండా, శ్రీసాయిబాబాతో తన అనుభవాల గురించి తానే స్వయంగా ఈ క్రింది విధంగా వివరించింది.

నాకు వివాహమైనప్పుడు నా వయస్సు పదమూడు సంవత్సరాలు. నా భర్త (శ్రీమహదేవ్ వామన్ సపత్నేకర్) వయస్సు 33 సంవత్సరాలు. నాది ద్వితీయం. మావారి మొదటి భార్య, కుమారుడు గొంతుకు సంబంధించిన వ్యాధితో మరణించారు. మా అత్తమామలు మాథేగాంలో ఉండేవారు. నా భర్త మాత్రం అప్పటి జిల్లా కేంద్రమయిన అక్కల్‌కోటలో న్యాయవాదిగా పనిచేస్తూ ఉండేవారు. మావారు తన ఒక్కగానొక్క కుమారుడు మరణించినందుకు నిరంతరం చింతిస్తూ వుండేవారు. పైపెచ్చు నాకు వివాహమైన నాలుగైదు సంవత్సరాల వరకు సంతానం కలగలేదు. అందువల్ల నిరాశా నిస్పృహలతో నిర్లిప్తంగా కాలం గడిపేవారు. తన జీవితమే వృధా అని తలుస్తుండేవారు. అప్పుడు మా మామగారు మావారిని శిరిడీలో ఉన్న సాయిబాబాను దర్శించమని, ఆయన దగ్గర వారికి తప్పక మనఃశాంతి దొరుకుతుందని సలహా ఇచ్చారు. మేము శ్రీసాయిని గురించి మావారి స్నేహితుడు, సహాధ్యాయి అయిన షేవడే నుండి ఎన్నోసార్లు విన్నాము. కానీ మావారికి సాయిబాబాపై నమ్మకం లేనందువల్ల శిరిడీ వెళ్ళడానికి ఇష్టపడలేదు. కానీ, తండ్రిగారి ఆజ్ఞను ఉల్లంఘించలేక తన తమ్ముడు పండితరావుతో కలిసి 1913లో శిరిడీ వెళ్ళారు. వెళ్ళేముందు నన్ను మా అత్తగారింట్లో (మాథేగాం) విడిచి వెళ్ళారు. నాకు శ్రీసాయిని దర్శించాలనే కోరిక ఎప్పటినుండో వుంది. కానీ, ఆ కాలంలో భర్త ముందు నిలబడగలగడమే గగనం, ఇక మనస్సులోని కోరిక వెల్లడి చేయడం అసంభవం. అందువల్ల నా కోరికను వెలిబుచ్చలేకపోయాను.

మావారు శిరిడీ వెళ్ళినపుడు ఒకరోజు రాత్రి నేను, నా తోడికోడలు గదిలో పడుకొని నిద్రపోతున్నాం. అప్పుడు నాకొక స్వప్నం వచ్చింది. నా ముందొక మెరుపు మెరిసినట్లైంది. ఇంట్లో ఒక బొట్టైనా నీరు లేదని గుర్తొచ్చి కడవ తీసికొని కాస్త దూరంలో నున్న లక్కడ్‌షా బావికి బయలుదేరాను. ఆ కాలంలో ఇంటికోడళ్ళు ఒంటరిగా బయటికి వెళ్ళకూడదు. అందువల్ల మా మామగారు కోర్టునుండి ఇంటికి తిరిగి వచ్చేలోపల నీళ్ళు తేవాలని త్వరత్వరగా నడుస్తున్నాను. నేను బావిని సమీపించాను. అక్కడ తలకు గుడ్డ కట్టుకొని కఫ్నీ ధరించిన ఫకీరు నిలబడి వున్నాడు. అతను నా దగ్గరకొచ్చి “అమ్మాయీ, ఎందుకు శ్రమపడతావు? నేను నీ కుండను స్వచ్ఛమైన నీటితో నింపుతాను!” అన్నాడు. అతని మనస్సులో ఏదో చెడుతలంపు ఉందనుకొని భయపడ్డాను. ఇంతలో అతను సిగ్గువిడిచి నాముందే కఫ్నీ పైకెత్తి మూత్రవిసర్జనకు కూర్చున్నాడు. దీనితో నా సందేహం బలపడింది. అతడేదో నాపై అత్యాచారం చెయ్యబోతున్నట్లు భ్రమించి ఇంటివైపు పరుగుతీశాను. అతను నన్ను వెంబడించాడు. “అమ్మాయీ! పారిపోకు. నీవు తర్వాత విచారిస్తావు. నేను నీకొకటి ఇవ్వదలచి ఇక్కడికి వచ్చాను” అని చెబుతూ వెంబడిస్తున్నాడు. నేను భయంతో ఇల్లు చేరి గడియ పెట్టుకున్నాను. అతను ఇంటిముందు నిలబడి కిటికీలోనుండి చిన్న చిన్న రాళ్ళను విసురుతున్నాడు. “నేను నీకొకటి ఇవ్వదలచానమ్మాయీ!” అని అరుస్తూనే ఉన్నాడు. నాకు ఏమి చేయాలో తోచక పెద్దగా అరవడానికి ప్రయత్నించాను. అప్పుడు నా కల కరిగిపోయి మెలకువ వచ్చింది. ప్రక్కనే నా తోడికోడలు నిద్రపోతోంది. ఆమెను లేపి టైం ఎంతయిందని అడిగాను. ఆమె లేచి, “ఏమక్కా నిద్రపట్టడంలేదా?” అని అడిగింది.

మరుసటి ఉదయం నా కల విషయం మా అత్తగారికి చెప్తున్నాను. ప్రక్కగదిలో నుండి మా మామగారు ఇది విని, మా దగ్గరకొచ్చి కల మొత్తం వివరించమని నన్నడిగారు. వివరించిన తర్వాత, సాయిబాబా నా కలలోకి రావడం నా అదృష్టమని, వారు నాకేదో మంచి చేయాలని సంకల్పించినట్లు తోస్తుందని చెప్పారు. ఇంతలో మావారు శిరిడీ నుండి వచ్చి అన్ని విషయాలు చెప్పారు. మావారు శిరిడీవెళ్ళి బాబాను సమీపించి కాళ్ళకు నమస్కరించేందుకు వంగారట. బాబా అకస్మాత్తుగా, “చల్ హఠ్” (వెళ్ళిపో) అని పెద్దగా అరిచి బయటికి గెంటారట. ఎంత బలంగా నెట్టారంటే, ఆ తోపుకు వారి తలపాగా దూరంగా పడిపోయిందట. మావారు బాధపడి బయటికి వచ్చేశారట. తర్వాత రెండు మూడురోజులు శిరిడీలోనే వుండి ఇతర సాయిభక్తుల సహాయంతో సాయిబాబాను దర్శించుకోవాలని ప్రయత్నించారట. కానీ బాబా వీరిని చూస్తూనే “చల్ హఠ్” అని పెద్దగా అరిచేవారట. ఇక వారి దర్శనం లభించడం దుర్లభమని గ్రహించి నిరాశా నిస్పృహలతో మాథేగాం తిరిగి వచ్చేశారు. అనవసరంగా తనను శిరిడీ పంపినందుకు తన తండ్రిపై కోపం ప్రకటించారు.

మరుసటిరోజు మా మామగారు నా కల విషయం మావారికి చెప్పి నన్ను వెంటబెట్టుకొని మళ్ళీ శిరిడీ వెళ్ళమని ఆదేశించారు. మావారు, నాకు మొదటినుండి శిరిడీ వెళ్ళాలని కోరిక వుందని, అదే ఆలాపనగా నిద్రించినందువల్ల ఆ కల వచ్చిందేకానీ దానిలో ప్రత్యేకతేమీ లేదని చెప్పారు. అంతేగాకుండా, మళ్ళీ శిరిడీ వెళ్ళి సాయిబాబా చేత అవమానించబడటం తనకిష్టం లేదని కూడా చెప్పారు. కానీ, మా మామగారు దీనికొప్పుకోలేదు. “సాయిబాబా నిన్ను అవమానించారంటే అది నీలోనే ఏదో దోషముండి వుంటుంది. నీ భార్యకు వచ్చిన కలను ఒక శుభసూచకంగా భావించి ఆమెను తప్పక శిరిడీ తీసుకెళ్ళు. నీకు మంచి జరుగుతుంది. మీతోబాటు పెద్ద కోడలిని (ఆమెకు ఆడసంతానమేగానీ మగసంతానం లేదు) కూడా తీసుకెళ్ళు” అని ఆజ్ఞాపించారు. ఇక మావారికి తప్పలేదు.

మేము ముగ్గురం శిరిడీ వెళ్ళాము. శ్రీసాయిబాబా లెండీతోట నుండి తిరిగి వస్తున్నారు. వారిని చూచి నేను సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయాను. ఎందుకంటే, నా కలలో కనిపించిన ఫకీరుకు, వారికి కించిత్తు కూడా తేడా లేదు. బాబా నన్ను చూచిన వెంటనే తమ కడుపు పట్టుకొని, “అమ్మా, కడుపునొప్పి! నడుమునొప్పి!!” అంటూ బాధతో మెలికలు తిరిగిపోయారు. నేను కంగారుపడి బాబాకేమయిందని ఆదుర్దాగా అడిగాను. అప్పుడు అక్కడున్న భక్తులు భయపడవలసిన అవసరమేమీ లేదని, వారు భక్తుల బాధలు స్వీకరించి అనుభవించేటప్పుడు అలాగే ప్రవర్తిస్తూ వుంటారని, అలా అనుభవించినప్పుడు ఆ భక్తుల బాధలు నివారణైపోతాయని చెప్పారు. నేను ఆశ్చర్యపోయాను. బాబా నిజంగానే బాధను అనుభవిస్తున్నట్లు అభినయించడం గుర్తొచ్చి నవ్వుకున్నాను. కానీ నేనప్పుడు ఒక విషయం గుర్తించలేకపోయాను. నన్ను ఎన్నో రోజులనుండి బాధిస్తున్న కడుపునొప్పి, నడుమునొప్పి బాబాను దర్శించినప్పటి నుండి తిరిగి రాలేదని రెండు మూడు నెలల తర్వాతగానీ తెలుసుకోలేకపోయాను. బాబా నా కడుపునొప్పిని, నడుమునొప్పిని తాము అనుభవించి నివారణ చేశారని తెలుసుకొని మళ్ళీ కదిలిపోయాను. వారు నాపై చూపిన కరుణకు వారికి  కృతజ్ఞతలర్పించుకున్నాను. వారి అభినయాన్ని చూసి నవ్వినందుకు పశ్చాత్తాపపడ్డాను.

ఆ రోజు బాబా మసీదులో ఆసీనులయ్యాక మేము వారిని దర్శించడానికి పూలు, పండ్లు, ఇతర కానుకలను తీసుకుని మసీదుకెళ్ళాము. ముందు నా భర్త, వెనుకగా నేను బాబా ముందుకెళ్ళాం. బాబా నా భర్తను చూచిన వెంటనే ఇంతకుముందువలె “చల్ హఠ్” (బయటికి వెళ్ళిపో) అని పెద్దగా అరిచారు. నా భర్త చిన్నబుచ్చుకొని బాధతో వెళ్ళిపోయారు. తర్వాత నా వంతు. నేను ముందుకు వెళ్ళి బాబా పాదాలపై నా శిరస్సునుంచి నమస్కరించాను. బాబా చేతినిండా ఊదీ తీసుకొని, నా శిరస్సుపై పోసి, వారి చేతిని నా తలపై ఉంచి, “తీసుకో! ఒకటి, రెండు, మూడు, నాలుగు! నీకెన్ని కావాలో అన్ని!” అన్నారు. నేను పరవశించి నన్ను నేనే మరిచిపోయాను. కానీ నా భర్త విచారంతో క్రుంగిపోయారు. శిరిడీకి వచ్చిన భక్తులందరూ బాబాను దర్శించి వారి ఆశీస్సులు పొందుతున్నారు. తనకు మాత్రం “చల్ హఠ్” అనేదే ఆశీర్వాదమయ్యింది. ఆయన తీవ్రంగా ఆలోచించడం ప్రారంభించారు. అకస్మాత్తుగా తనకు సాయిపై భక్తివిశ్వాసాలు లేకపోవడమే దానికి కారణమని ఆయనకి తట్టింది. తను న్యాయవిద్యార్థిగా ఉన్నప్పుడు తన సహవిద్యార్థి షేవడే సాయిబాబా మహిమల గురించి చెప్పినప్పుడు అతనిని, బాబాను పరిహసించి చులకనగా మాట్లాడిన విషయం కూడా అప్పుడు గుర్తుకొచ్చింది. ఆయన హృదయపూర్వకంగా పశ్చాత్తాపం చెందారు. బాబా అనుగ్రహం, ఆశీస్సులు పొందేంతవరకు శిరిడీ విడిచి వెళ్ళకూడదని గట్టిగా నిర్ణయం తీసుకున్నారు. 

కొద్దిరోజులకు మావారికొక మంచి అవకాశం లభించింది. బాబా ఒక మధ్యాహ్నం మసీదులో ఒంటరిగా కూర్చొనివుండటం గమనించి, వెంటనే వారి వద్దకు వెళ్ళి వారి పాదాలు గట్టిగా పట్టుకొని హృదయవిదారకంగా శోకించారు. తనొక అజ్ఞానాంధుడనని, తన తప్పులన్నీ మన్నించి తనను కరుణించమని దీనంగా వేడుకున్నారు. బాబా కరుణించారు. నా భర్త శిరస్సుపై వారి అభయహస్తముంచి ఆశీర్వదించి, ప్రక్కనే కూర్చొనమని చెప్పారు. ఇంతలో గొర్రెలకాపరి ఒకామె మసీదుకొచ్చి బాబా పాదాలొత్తుతూ కూర్చుంది. బాబా ఆమెకొక కథ చెప్పారు. ఆశ్చర్యం! ఆ కథంతా నా భర్త ఆత్మకథే! బాబా సర్వజ్ఞతకు మావారు ఆశ్చర్యపోయారు. తర్వాత బాబా ఆమెతో మావారిని చూపించి, “ఈ పెద్దమనిషి తన కొడుకును నేను చంపానంటున్నాడు! లోకుల బిడ్డలను నేను చంపుతానా? వీడెందుకిక్కడికి వచ్చి ఏడుస్తాడు? వీడి భార్య గర్భంలో నేను మరొక కొడుకును ప్రవేశపెడతాను! వీడినిక వెళ్ళమని చెప్పు!” అన్నారు. నా భర్త సంతోషంతో తలమునకలైనారు. బాబాకు వంగివంగి నమస్కరిస్తూ మసీదు విడిచి మేముంటున్న బసకు వచ్చారు.

మసీదులో జరిగిన విషయాలన్నీ మాతో చెప్పారు. బాబా కరుణాసముద్రుడనీ, వారొక సిద్ధపురుషుడని చెబుతూ మధ్యాహ్నఆరతికి సిద్ధపడమని చెప్పారు. బాబాకు నైవేద్యంగా పూరన్ పోళీలను (పూర్ణం పెట్టిన తీపి చపాతీలు) తయారుచెయ్యమని కూడా ఆదేశించారు. కానీ, అక్కడున్న పూజారి ఒకరు పూరన్ పోళీలకు బదులు హల్వా చేస్తే బావుంటుందని సలహా ఇచ్చారు. అతని సలహా మేరకు మేము హల్వా తయారుచేసి పళ్ళెంలో పెట్టుకొని మసీదుకు తీసుకెళ్ళాం. ఆరతి అయిన తర్వాత భక్తులు నైవేద్యం పళ్ళాలన్నీ బాబా ముందుంచారు. హల్వా వున్న మా పళ్ళెం బాబా ముందుగా లేదు, కాస్త దూరంగా వుంది. అయినప్పటికీ బాబా వంగి మా పళ్ళెంలోని హల్వా చేతినిండా తీసుకొని తిన్నారు. ఇది చూచిన మా ఆనందానికి అవధులు లేవు. బాబా మాపై చూపిన ప్రత్యేకమైన అభిమానానికి వారికి కృతజ్ఞతలు చెప్పుకున్నాము.

మరునాడు గురువారం చావడి ఉత్సవం జరిగింది. అది చూడవలసిందేగానీ చెప్పనలవి కాదు. ఎంత రమణీయంగానూ, కన్నులపండువగానూ ఉందనుకున్నారు? భక్తులు చిరుతలు, తాళాలు, మృదంగం, మద్దెల మొదలైన వాద్యాలు పట్టుకొని భజన చేసుకొంటూ ముందు నడిచేవారు. వారి వెనుక అలంకరించిన వెండిపల్లకి వెళ్ళేది. దాని వెనుక బాబా తమ భక్తులతో నడుస్తూ వెళ్ళేవారు. ఒక భక్తుడు వారికి ఛత్రం పట్టేవాడు. మరికొందరు చామరాలు వీస్తుండేవారు. బాబా ఎప్పుడూ పల్లకిలో కూర్చుండేవారు కాదట. భక్తులు వారినెప్పుడైనా బలవంతంగా ఎత్తుకొని పల్లకిలో కూర్చోబెట్టేవారట. కానీ కూర్చోబెట్టిన మరుక్షణం పల్లకిలో అదృశ్యులై వెనుక నడుస్తూ కనిపించేవారట, భక్తులు పరవశంతో నృత్యం చేస్తున్నప్పుడు బాబా కూడా వారిననుసరించేవారు. వారు ఒక అడుగు ముందుకు, ఒక అడుగు వెనుకకు వేస్తూ వాద్యాలకనుగుణంగా నృత్యం చేసే తీరు అద్భుతంగా ఉండేది. ఒక అనుభవజ్ఞుడైన నృత్యకారుడు చేసినట్లే వుండేది. అది ఇప్పటికీ నా స్మృతిపథంలో మెదులుతూనే ఉంది. చావడి ఉత్సవమప్పుడు వారి తేజస్సు చూడవలసిందేగానీ చెప్పశక్యం కాదు. పండరీపురంలో పాండురంగని చుట్టూ వున్న కాంతివలయం బాబా చుట్టూ చూసి నేను ఆశ్చర్యపోయాను.

చావడి ఉత్సవం జరిగిన మరుసటిరోజు మేము మాథేగాం తిరిగి వెళ్ళదలచాము. మేము బాబా అనుమతి తీసుకోవడానికి మసీదుకు బయలుదేరుతున్నప్పుడు మావారు, “నేను బాబాకు దక్షిణగా ఒక రూపాయి ఇవ్వదలిచాను. వారు మళ్ళీ అడిగితే మరొక్క రూపాయి ఇస్తాను. ఇంకా అడిగితే ఇస్తాను, కానీ నా దగ్గరున్న డబ్బంతా అయిపోతుంది. అప్పుడు నా బంగారు ఉంగారం, నీ బంగారు గాజులు అమ్మవలసివస్తుంది!” అన్నారు. మేము మసీదుకెళ్ళి బాబాకు భక్తితో నమస్కరించి ఇంటికి వెళ్ళడానికి అనుమతించమని ప్రార్థించాము. బాబా అనుమతిస్తూ, దక్షిణ అడిగారు. మావారు ఒక రూపాయి సమర్పించారు. తర్వాత బాబా మరొక రూపాయి ఇవ్వమని అడిగారు. మావారు సమర్పిస్తే అది తీసుకుని, “ఇంతకన్నా ఎక్కువ అడగనులే! ఎందుకంటే, నీ బంగారు ఉంగరం, నీ భార్య గాజులు అమ్మవలసి వస్తుందికదా?” అన్నారు. ఇది విని నా భర్త నిర్ఘాంతపోయారు. బాబా సర్వాంతర్యామిత్వానికి ముగ్ధులయ్యారు. ఇది మావారికి బాబాపై ఏర్పడిన భక్తి విశ్వాసాలు స్థిరపడటానికి ఎంతగానో దోహదపడింది. బాబాపై మావారికి మిగిలివున్న శంకలు, సందేహాలు కూడా మాయమయ్యాయి. 

తర్వాత ఒక సంవత్సరానికి, అంటే 1915లో మా మొదటి కుమారుడు మురళీధర్ పుట్టాడు. వాడికి 8 నెలలున్నప్పుడు వాడిని తీసుకుని శిరిడీ వెళ్ళి బాబాను దర్శించాము. తర్వాత మరిద్దరు కుమారులు కలిగారు. భాస్కర్, దినకర్. వారిని కూడ శిరిడీ తీసుకెళ్ళి బాబాను దర్శించాము. ఒక సంఘటన నాకు బాగా గుర్తుంది. దినకర్‌కు రెండు, మూడు నెలల వయస్సప్పుడు వాడిని తీసుకెళ్ళి బాబా పాదాలముందుంచాను. బాబా వాడినెత్తుకుని విసురుగా పైకి ఎగురవేశారు. మా గుండెలవిసిపోయాయి. కానీ వాడికేమీ కాలేదు. ప్రక్కనే కూర్చున్న భక్తుడొకడు వాడిని పట్టుకొని మాకప్పగించారు. ఆ భక్తుడు పట్టుకుంటాడని బాబాకు ముందే తెలుసేమో? లేకుంటే బిడ్డను పైకెగురవేసి తిరిగి పట్టుకోడానికే ప్రయత్నించకుండా మెదలకుండా వుండిపోగలరా? మొత్తం మాకు ఎనిమిదిమంది కుమారులు, ఒక కుమార్తె కలిగారు. అప్పుడుగానీ మొదటిసారి నేను శిరిడీ వెళ్ళినపుడు బాబా నాకు ప్రసాదించిన వరం, “తీసుకో! ఒకటి, రెండు, మూడు, నాలుగు. నీకెన్ని కావాలో అన్ని!” లోని అంతరార్థం బోధపడలేదు. నాకెంతమంది సంతానం కావాలో అంతమందిని ప్రసాదించారు బాబా.

మావారికి కూడా బాబాపై ఏర్పడిన భక్తివిశ్వాసాలు క్రమంగా దృఢపడినాయి. వారి అచంచల భక్తివిశ్వాసాలకు ఈక్రింది సంఘటనే తార్కాణం! మా రెండవ కుమారుడు భాస్కర్ పదేండ్ల వయస్సులో మరణించాడు. మావారు ఇదివరకులాగా క్రుంగిపోలేదు. అంతా బాబా సంకల్పం అని సరిపెట్టుకున్నారు. అంతేగాక, తన బిడ్డలనందరినీ పూజాగదికి తీసుకెళ్ళి వారిని బాబా పటం ముందుకు త్రోసి, “బాబా! కావాలంటే వీరినందరినీ తీసుకువెళ్ళండి. అప్పుడు కూడా మీ పాదాలపైనున్న భక్తివిశ్వాసాలు కించిత్తైనా సడలవు!” అని అన్నారు.

శ్రీమతి పార్వతీబాయి సపత్నేకర్ పైవిధంగా తన స్వానుభవాన్ని చెప్పి ముగించింది. తర్వాత నింబాల్కర్‌గారు దినకర్ సపత్నేకర్‌ను ఇంటర్వ్యూ చేశారు. వారి కుటుంబీకులు ‘సపత్నే’ అను గ్రామానికి చెందినవారు. అందుకే వారు సపత్నేకరులయ్యారు. తర్వాత వీరు తాలూకా పట్టణమైన మాథేగాంకు తరలివెళ్ళి అక్కడే స్థిరపడ్డారు. వీరి కుటుంబవృత్తి న్యాయవాదవృత్తి. తన తాత న్యాయవాది. తండ్రి మహదేవ్ వామన్ సపత్నేకర్ అక్కల్‌కోటలో ప్రముఖ న్యాయవాదిగా పేరుగాంచి బాగా డబ్బు గడించాడు. దినకర్ తన తండ్రిని గురించి ఆసక్తికరమైన మరో విషయం కూడా చెప్పాడు. తన తండ్రి మొదటనుండి దత్తస్వామి భక్తుడని, గాణ్గాపూర్ తరచూ వెళుతుండేవారని, ఒకసారి అక్కడే తన భార్య, కొడుకు చనిపోయిన తర్వాత జీవితం మీద విరక్తి చెంది, నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించారని, దత్తుడే ఆయనను కాపాడి అక్కల్‌కోట వెళ్ళమని ఆదేశించారని చెప్పాడు. తర్వాత 1913లో శ్రీసాయిబాబా ఆయననాకర్షించి వారి భక్తులుగా చేసుకున్నారని చెప్పాడు. తాను మహారాష్ట్ర స్టేట్ సర్వీసులో జడ్జిగా రిటైరయ్యానని, తన వయస్సు 68 సంవత్సరాలని దినకర్ చెప్పాడు.

ఇక్కడ మరొక్క విషయం ప్రస్తావించవలసి వుంది. నింబాల్కర్‌గారు శ్రీమతి పార్వతీబాయిని 13.9.83న ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూ జరిగిన ఒకటిన్నర నెలలకు, అంటే 30.10.83న ఆమె తన అంతిమశ్వాస విడిచింది.

సోర్స్: సాయిపథం - ప్రధమ సంపుటము

7 comments:

  1. 🙏🙏🙏 Om srisairam Om srisairam Om srisairam thankyou sister.

    ReplyDelete
  2. Om Sai
    Sri Sai
    Jaya Jaya Sai
    🙏🙏🙏

    ReplyDelete
  3. 🙏💐🙏 ఓం సాయిరాం

    ReplyDelete
  4. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete
  5. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo