సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 628వ భాగం.....



ఈ భాగంలో అనుభవాలు:
  1. బాబా అనుగ్రహం వల్ల నెరవేరిన సొంత ఇంటి కల
  2. మా చెల్లిని రక్షించిన బాబా
  3. కొన్ని కోరికలు బాబా ద్వారానే నెరవేరుతాయి

సాయిభక్తులందరికీ నమస్కారాలు. నా పేరు అనిల్ కుమార్. నా జీవితంలో బాబా నాకు ఎన్నో మహిమలు చూపించారు. బాబా దయవల్ల జరిగిన రెండు ముఖ్యమైన అనుభవాలను ఇప్పుడు మీతో పంచుకోబోతున్నాను.

మొదటి అనుభవం:

  • బాబా అనుగ్రహం వల్ల నెరవేరిన సొంత ఇంటి కల 

మేము బెంగళూరులో ఇల్లు కొనుక్కుందామని ప్రయత్నాలు చేస్తుండగా తెలిసినవాళ్ళ ద్వారా ఒక ఫ్లాట్ అమ్మకానికి వచ్చింది. ఆ ఫ్లాట్ తీసుకోవడానికి మేము నిర్ణయించుకున్నాము. కానీ, అన్నీ కుదిరి ఫ్లాట్ తీసుకుందామనుకునేలోపు అది కాస్తా మా చేజారిపోయింది. దానితో ఒక్కసారిగా నేను, నా భార్య ఎంతో దిగులుచెందాము. ఆ తరువాత మేమిద్దరం సొంతిల్లు ప్రసాదించమని బాబాను ప్రార్థించి, సాయి నవగురువారవ్రతం చేద్దామని నిశ్చయించుకున్నాము. నవగురువారవ్రతం ప్రారంభించిన 4వ గురువారం తరువాత మా స్నేహితుడు సూచించిన ఒక అపార్ట్మెంట్ చూడటానికి వెళ్ళాము. కానీ, అది మాకు నచ్చలేదు. అయితే, అక్కడికి వెళ్ళే త్రోవలో మేము వేరే అపార్ట్మెంట్ చూశాము. అది మాకు బాగా నచ్చింది. లీగల్గా కూడా ఎటువంటి సమస్యలూ లేవు. బాబాను ప్రార్థించుకుని ఆ ఫ్లాట్ని మేము కొనుక్కున్నాము. ఫ్లాట్ కి అడ్వాన్స్ ఇవ్వడం దగ్గర నుండి ఫైనల్ పేమెంట్ వరకు అన్ని విషయాలూ గురువారంరోజున జరిగేలా బాబా ఆశీర్వదించారు. ఈ విధంగా మాకు బాగా నచ్చిన ఇంటిని అందుబాటు ధరలో లభించేలా బాబా అనుగ్రహించారు. ఈ అనుభవం ద్వారా బాబాపై మా నమ్మకం మరింత బలపడింది.

రెండవ అనుభవం:

  • మా చెల్లిని రక్షించిన బాబా

నవంబరు 6వ తేదీన మా చెల్లి ఆఫీసులో ఉన్నప్పుడు తనకు కాళ్లు చేతులు నొప్పిపుట్టడం మొదలైంది. ఇంటికి వచ్చిన తరువాత నొప్పులు ఇంకా తీవ్రమయ్యాయి. కాళ్ళు, చేతుల నొప్పులతో బాధపడుతున్న మా చెల్లిని చూసి మా అమ్మానాన్నలు చాలా భయపడిపోయి నాకు చెప్పారు. నేను వెంటనే మా చెల్లిని కాపాడమని బాబాను మనసారా ప్రార్థించాను. నా భార్య కూడా మా చెల్లి నొప్పులను తగ్గించమని బాబాను ప్రార్థించి, 108 రూపాయలు దక్షిణ సమర్పిస్తామని బాబాకు మ్రొక్కుకుంది. తరువాత చికిత్స కోసం మా చెల్లిని మా బావగారు ఒక డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళారు. కరోనా పరీక్ష చేస్తే తప్ప చికిత్స చేయడం కుదరదని డాక్టర్ చెప్పటంతో మా అమ్మానాన్నలు ఇంకా భయపడ్డారు. మా బావగారు వాళ్ళకు ధైర్యం చెప్పి తనే దగ్గరుండి మా చెల్లికి కరోనా పరీక్ష చేయించారు. రిజల్ట్ రావడానికి ఒక రోజు పడుతుందని చెప్పారు. మేమంతా చాలా ఆందోళన చెందాము. మా చెల్లికి కరోనా పరీక్షలో నెగిటివ్ వస్తే ఈ బ్లాగ్ ద్వారా తోటి సాయిభక్తులతో నా అనుభవాన్ని పంచుకుంటానని బాబాకు మ్రొక్కుకున్నాను. మేము కోరుకున్నట్టే మా చెల్లికి కరోనా నెగటివ్ అని మా బావగారి స్నేహితుని ద్వారా మాకు ముందుగానే తెలిసింది. తనకు వచ్చింది డెంగ్యూ జ్వరం అని పరీక్షలో తేలింది. దాంతో మా చెల్లి ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకుంటూ మందులు వాడటం మొదలుపెట్టింది. ప్రార్థించిన వెంటనే మా బాధను తెలుసుకుని మా చెల్లిని కాపాడి, తద్వారా నా తల్లితండ్రులను కూడా రక్షించిన నా సాయికి కొన్ని కోట్ల నమస్సులు.


కొన్ని కోరికలు బాబా ద్వారానే నెరవేరుతాయి

సాయిభక్తురాలు అంజలి తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.

అందరికీ నమస్తే! బాబా దయ అందరిమీదా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి నా నమస్కారములు. నా పేరు అంజలి. ఈమధ్య నాకు జరిగిన అనుభవాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను.

సుమారు ఎనిమిది సంవత్సరాల నుండి నాకు ఒకే ఒక్క బంగారు గాజు ఉంది. మరికొన్ని బంగారు గాజులు తీసుకుందామని ఎంతగా అనుకున్నప్పటికీ నా కోరిక నెరవేరలేదు. గత నెలలో నేను బాబాను, "బాబా! ఎన్నో ఏళ్లుగా నేను ఉద్యోగం చేస్తున్నప్పటికీ నాకు ఒకే ఒక్క బంగారు గాజు ఉంది. దగ్గరలో నా మరదలి పెళ్లి ఉంది. ఆ పెళ్లి సమయానికల్లా నాకు ఎలాగైనా నాలుగు గాజులు కొనిపెట్టమ"ని అర్థించాను. కానీ బాబా అనుగ్రహించలేదు. 'సరేలే, బాబా ప్రణాళిక వేరే ఉండి ఉంటుంది. ఏది ఎప్పుడు ఎలా చేయాలో ఆయనకు తెలుసు' అని నేనింక ఊరుకున్నాను. పెళ్లి నుండి వచ్చాక ఒకరోజు హఠాత్తుగా మావారు, "ఎప్పటినుండో బంగారు గాజులు కావాలని అడుగుతున్నావు కదా! చిట్ తక్కువకు వస్తే, ఆ డబ్బులతో గాజులు కొనుక్కో!" అన్నారు. ఇక బాబా అనుగ్రహం చూడండి. మేము అనుకున్నంతలోనే చిట్ తక్కువకు వచ్చింది. నాకు కావలసిన డబ్బులు సమకూరాయి. ఆ డబ్బులతో నవంబరు 11న బాబా నాకు బంగారు గాజులు ప్రసాదించారు. నిజానికి మా మరదలి పెళ్లికి ముందు బాబా వాటిని నాకివ్వకపోవడమే మంచిదైంది. అప్పటి పరిస్థితులు ఇక్కడ వివరించలేనుగానీ, జరగనున్న పరిణామాలు బాబాకి తెలుసు గనక ఎప్పుడు వాటిని నాకు ఇవ్వాలో అప్పుడే ఇచ్చి అనుగ్రహించారు. 'బాబాని ఇలా కూడా అడుగుతారా?' అని ఎవరికైనా అనిపించవచ్చు. కానీ, నేను దాదాపు 17 సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్నాను. అయినా నాలుగు బంగారు గాజులు కొనుక్కోలేకపోయాను. కొన్ని కోరికలు ఉంటాయి, మనమెంతగా ప్రయత్నించినా అవి నెరవేరవు. అలాంటివి బాబా ద్వారానే నెరవేరుతాయి. "బాబా! ఎంతోకాలంగా ఉన్న నా కోరికను తీర్చినందుకు నా కృతజ్ఞతలు. నా తోడు, నీడ అన్నీ నీవే బాబా".

మరో చిన్న అనుభవం:

నేను ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నాను. ఈమధ్య ఒకరోజు మా ఆఫీసులోని ఒక గదికి విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. అసలు సమస్య ఏమిటో ఎవరికీ అర్థం కాలేదు. స్థానిక ఎలక్ట్రీషియన్‌ను సబ్‌స్టేషన్‌కి తీసుకుని రాకూడదు. ఇక ఆ సమస్యను ఎలా పరిష్కరించాలో అర్థం కాలేదు. సమస్య ఏదైనా నిస్సహాయస్థితిలో భక్తులందరికీ బాబానే తోడు! అందుచేత నేను బాబాని సహాయం చేయమని వేడుకుని, సమస్య పరిష్కారమైతే బ్లాగులో నా అనుభవాన్ని పంచుకుంటానని చెప్పుకున్నాను. పరిష్కారమవడమే కష్టం అనుకున్న సమస్య బాబా దయవలన కొద్దిసేపట్లోనే పరిష్కారమైంది. "బాబా! మీకు మాటిచ్చినట్లు నా అనుభవాన్ని పంచుకోవడంలో ఆలస్యం చేసినందుకు నన్ను క్షమించండి".

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!



7 comments:

  1. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

    ReplyDelete
  2. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  3. జై సాయిరాం! జై గురుదత్త!

    ReplyDelete
  4. Baba pleaseeee amma ki problem cure cheyi thandri, santosh annamu tine laga cheyi thandri sai sai sai

    ReplyDelete
  5. Baba nenu mimmalni adigina daneki naku parishkaram chupinchandi . Avidangachupisthe na anubavam me block lo share chesta. Sairam.

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo