- 'మనకు బాబా ఉన్నారు'
- వర్షాన్ని అపి గమ్యాన్ని చేర్చిన బాబా
'మనకు బాబా ఉన్నారు'
సాయిమహారాజుకి పాదాభివందనాలు. ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా నమస్కారాలు. ముందుగా, ఈ అనుభవాలను ఇంత ఆలస్యంగా పంచుకుంటున్నందుకు నన్ను క్షమించమని బాబాను వేడుకుంటున్నాను. ఈమధ్య మేము ‘బాబా పంపిన పని’ మీద (క్రొత్త ఇల్లు కొనుగోలు చేసే పని) యు.ఎస్.ఏ. లో మేముండే స్టేట్ నుండి వేరే స్టేట్‌కి వెళ్ళవలసి వచ్చింది. ‘బాబా పంపిన పని’ అని ఎందుకన్నానంటే, బాబా ఆజ్ఞ లేకుండా మనం కదలలేము కదా! "అలా అనడం తప్పయితే నన్ను క్షమించండి బాబా". కానీ, ఇప్పుడున్న కరోనా పరిస్థితుల్లో ప్రయాణం చేయాలంటే భయం. పైగా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు. చివరికి తప్పనిసరిగా వెళ్ళాలని నిర్ణయించుకున్న తరువాత, “బాబా! అంతా మీదే భారం తండ్రీ. మీ దయవల్ల ఏ ఇబ్బందీ లేకుండా పని పూర్తయి, క్షేమంగా ఇంటికి తిరిగి వస్తే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను” అని బాబాకు చెప్పుకుని ప్రయాణమైనాము. వెళ్ళాల్సిన స్టేట్‌కి చేరుకున్నాక, కరోనా కారణంగా హోటల్లో ఉండటం ఇష్టం లేక 5 రోజుల కోసం ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నాము. అక్కడినుండే క్రొత్త ఇంటిని చూడటానికి వెళ్ళాం. బాబా అనుగ్రహం వల్ల అంతా బాగా జరిగింది. చాలా ఆనందంగా అక్కడ అన్ని చూసుకొని ఇంటికి తిరిగి వచ్చాము. ఇంటికి వచ్చాక కేవలం రెండు రోజులు మాత్రమే పిల్లలకు దూరంగా ఉన్నాము. బాబా దయవల్ల మాకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఎదురవలేదు. బాబా ఉండగా భయమేల?
మరో అనుభవం:
ఆ స్టేట్‌లో ఇంటిని కొనుగోలు చేసే పనులన్నీ చూసుకుని అక్కడినుంచి బయలుదేరేరోజు మావారు స్నానం చేసి వచ్చి తన మెడలోని బంగారు గొలుసు కనిపించడం లేదని అన్నారు. నేను వెంటనే బాబాకు నమస్కరించుకుని, “బాబా! ప్రయాణానికి సమయం దగ్గరపడుతోంది. త్వరగా గొలుసు కనిపించేలా చేయి బాబా. నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను” అని అనుకున్నాను. ఎందుకంటే, ఒకవేళ ఆ ఇంట్లో గొలుసు కనిపించకపోతే అంతకుముందురోజు ఇంటి పనిమీద బయట తిరిగినప్పుడు ఎక్కడో పడిపోయివుండవచ్చు. అదే జరిగితే గొలుసు మాకు దొరికే అవకాశం ఉండదు. అంతేకాదు, ఒకవేళ గొలుసు ఆ ఇంట్లోనే పడిపోయినా, మేము ఆ ఇంటిని వదిలి వచ్చిన తరువాత ఆ ఇంటికి ఎవరు వస్తారో తెలియదు కదా. ఒకప్రక్క ఫ్లైట్ టైం కూడా అయిపోతోంది. అందువల్ల బాబాను తలచుకుంటూ, పరుపు, దుప్పట్లు అన్నీ విదిలించి చూశాము, ఇల్లంతా వెతికాము. గొలుసు కనపడలేదు. అంతా వెతికిన తరువాత హాలులోకి వచ్చి చూస్తే సోఫా ప్రక్కనే గొలుసు కనిపించింది. బాబాను ప్రార్థించిన పది నిమిషాలకే గొలుసు కనపడింది. ఇది బాబా మహిమ కాకపోతే మరేమిటి? బాబా చూపిన లీలకు ఎంతో ఆనందంతో బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను.
మా కుటుంబంలో ఎవరికి కాస్త నలతగా ఉన్నా, ఆఖరికి దగ్గు వచ్చినా, తుమ్ము వచ్చినా సరే అందరమూ బాబా ఊదీనే ధరిస్తున్నాము. 2020, మార్చి నెలలో కరోనా వ్యాపించినప్పటినుండి బయటకు వెళ్ళాలంటే ఎంతో భయపడుతున్నాము. తప్పనిసరిగా బయటకు వెళ్ళాలంటే బాబా అనుమతి కోరి వెళ్తున్నాము. “బాబా! నా అనుభవాన్ని పంచుకోవటంలో ఏదైనా మరచిపోతే నన్ను క్షమించండి”.
కొంతకాలం క్రింతం ఒకతను మాకు కొంత పొలం అమ్మాడు. మేము అతనికి డబ్బంతా ఇచ్చిన తరువాత, “ఇప్పుడు రేట్లు పెరిగాయి, ఆ పొలాన్ని నేను మీకు ఇవ్వను” అని పొలాన్ని మాకు అప్పజెప్పకుండా మమ్మల్ని ఎంతో బాధపెడుతున్నాడు. అతని మనసు మార్చి ఈ సమస్యను పరిష్కరించమని బాబాను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. బాబా దయవల్ల అతను మాకు పొలాన్ని స్వాధీనం చేస్తే ఆ అనుభవాన్ని కూడా మన సాయి మహరాజ్ సన్నిధి బ్లాగులో పంచుకుంటానని బాబాతో చెప్పుకున్నాను. బాబా తలచుకుంటే అతని మనసు మారడం ఎంతసేపు? అందుకే ఇంకా ఆ పొలం మాకు స్వాధీనం కానప్పటికీ ముందుగానే మీతో పంచుకుంటున్నాను. సాటి సాయిబంధువులకు చిన్న మనవి - దయచేసి మీరందరూ కూడా ఈ విషయంలో మాకోసం బాబాను ప్రార్థించండి. బాబా ఆశీస్సులతో పాటు మీ అందరి దీవెనలు కూడా మాకు కావాలి.
“బాబా! మేము ఈ నెలలో అమెరికా నుండి ఇండియా రావాలి. ఏ ఇబ్బందీ లేకుండా అందరం ఆనందంగా ఇండియాకు వచ్చేలా అనుగ్రహించండి. మీరు మాకు అండగా ఉండగా మాకు భయం లేదు. కానీ, మానవులం కదా, మమ్మల్ని చల్లగా చూడమని నిన్ను ప్రార్థిస్తూనే ఉంటాము”. తన పిల్లలు ఏది ఎన్నిసార్లు అడిగినా బాబా చిరునవ్వుతో చూసుకుంటారు. ఏది చెయ్యాలన్నా ‘మనకు బాబా ఉన్నారు, అన్నీ ఆయనే ఒక కుటుంబ పెద్దగా చూస్తార’ని ఆశ. ఇప్పటివరకు అందరూ శ్రద్ధగా నా అనుభవాలను చదివినందుకు మీకు నా ధన్యవాదాలు.
బాబాకు ప్రేమపూర్వక పాదాభివందనాలతో...
వర్షాన్ని అపి గమ్యాన్ని చేర్చిన బాబా
పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు తనకు బాబా ప్రసాదించిన ఒక అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.
నేను బాబాను నమ్ముకున్న ఒక సాధారణ భక్తురాలిని. నా అనుభవాన్ని మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. ఒకరోజు మేము బైక్ మీద కాకినాడ వెళ్తున్నాము. మేము బయలుదేరినప్పుడు వాతావరణం బాగుంది. కానీ బై-పాస్ రోడ్డులోకి వచ్చేసరికి హఠాత్తుగా వర్షం మొదలైంది. అక్కడ ఒక్క షెల్టర్ కూడా లేదు, జనసంచారమూ లేదు. వెంటనే నేను, "బాబా! నువ్వే దిక్కు. ఇక్కడ ఆగటానికి ఎటువంటి షెల్టర్లూ లేవు. దయచేసి మీ చేతులతో ఈ వర్షాన్ని ఆపండి" అని ప్రార్థించాను. అద్భుతం! ఒక మీటరు దూరం వెళ్లేసరికి వర్షం లేదు. అసలు అక్కడ వర్షం పడిన జాడ కూడా లేదు. బాబా మమ్మల్ని క్షేమంగా మా గమ్యానికి చేర్చారు. "థాంక్యూ సో మచ్ బాబా. మేము ఎల్లప్పుడూ మిమ్మల్నే నమ్మి, మీ పాదాలకు సర్వస్య శరణాగతి చేస్తాము".
ఓం సాయిరాం!
Om sai ram
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
595 days
ReplyDeletesairam
Om sairam
ReplyDeleteజై సాయిరాం! జై గురుదత్త!
ReplyDeleteOm sai ram baba mummy ki manchiga cheyi thandri sainatha
ReplyDelete