- “నా భక్తులను ఎన్నటికీ విస్మరించను, వేయి చేతులు చాచి ఆదుకుంటాను”
- పుట్టినరోజున బాబా అనుగ్రహం
“నా భక్తులను ఎన్నటికీ విస్మరించను, వేయి చేతులు చాచి ఆదుకుంటాను”
విశాఖపట్నం నుండి సాయిభక్తుడు శ్రీ లక్ష్మీనారాయణ తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.
అనంతకోటి సాయిభక్తులకు నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. సాయి మహరాజ్ సన్నిధి బ్లాగ్ నిర్వాహకులకు శతకోటి వందనాలు. నా పేరు కాళీపట్నపు లక్ష్మీనారాయణ. మాది విశాఖపట్నం. ఉదయాన్నే లేవగానే ఈ బ్లాగులో సాయిభక్తుల అనుభవాల కొరకు నా కళ్ళు వెతుకుతాయి. వారి అనుభవాలు చదివి అవి నా జీవితానికి దగ్గరగా ఉన్నాయన్న ఆనందాన్ని పొందుతాను. నేను ఇదివరలో నా అనుభవాన్ని మీతో పంచుకున్నాను. అనారోగ్యంతో బాధపడుతున్న నాకు ఉపశమనం కలిగితే బ్లాగులో పంచుకుంటానని అనుకున్నాను. ఆ అనుభవంతోనూ, మరొక అనుభవంతోనూ ఇప్పుడు మీ ముందుకు వస్తున్నాను.
ఆగస్టు 18వ తారీఖున రాత్రి 11 గంటల వరకు మాతో సరదాగా గడిపిన మా అమ్మగారు హఠాత్తుగా ఒక గంటలో గుండెనొప్పితో మరణించారు. అమ్మ మరణం నా కుటుంబం మొత్తాన్ని కలచివేసింది. కొండంత అండగా వుండే అమ్మ హఠాన్మరణాన్ని నేను తట్టుకోలేకపోయాను. అమ్మను చూడటానికి వచ్చిన బంధువులతో ఇల్లంతా నిండిపోయింది. అసలే కరోనా సమయం, పైగా మాది చిన్న ఇల్లు. అలాగే సర్దుకుని కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. అంతలో మా అమ్మాయికి గొంతు నొప్పి, జ్వరం వచ్చింది. హాస్పిటల్కి తీసుకెళితే డాక్టర్ పరీక్షించి ఇన్ఫెక్షన్ అని చెప్పి ఏవో మందులు ఇచ్చారు. కానీ మూడు రోజులైనా తగ్గలేదు. మరలా హాస్పిటల్కి తీసుకెళితే డాక్టర్కి అనుమానం వచ్చి కోవిడ్ టెస్ట్ చేయించమన్నారు. అందరం భయపడ్డాం. మా అమ్మాయికి కోవిడ్ టెస్ట్ చేయించి ఒక గదిని పూర్తిగా తనకే కేటాయించి బాబా మీద భారం వేశాం. పదవరోజున మా అమ్మ ధర్మోదకాలు. మా అమ్మాయి కూడా వచ్చి ఆఖరుసారిగా తర్పణాలు వదులుతానని పేచీ పెట్టింది. వద్దని ఎంత చెప్పినా వినలేదు. బాబానే చూసుకుంటాడని చెప్పి తన మాటకు అంగీకరించాను. కార్యక్రమం పూర్తయిన వెంటనే ఫోనుకి హాస్పిటల్ నుంచి మేసేజ్ వచ్చింది, మా అమ్మాయికి కోవిడ్ నెగిటివ్ అని. బాబా ఆ విధంగా మమ్మల్నందరినీ కాపాడినందుకు మనసులోనే బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను.
ఒక పది సంవత్సరాల క్రితం నాకు ఆసనంలో పగుళ్లు (అనల్ ఫిషర్) వచ్చింది. అప్పుడు హోమియోపతి మందు వాడితే తగ్గింది. మరలా ఆ వ్యాధి ఇప్పుడు తిరగబెట్టింది. హోమియోపతి మందులు వాడినా తగ్గలేదు. హాస్పిటల్కి వెళ్ళి డాక్టరుకి చూపించుకుంటే ఐదు రోజుల కోర్సు వాడమని ఏవో మందులు ఇచ్చారు. నాలుగు రోజులు గడిచాయి, ఆ మందుల వల్ల ఏమాత్రం గుణం కనిపించలేదు. రెండు రోజులు రాత్రివేళల్లో నరకయాతన పడ్డాను. తొమ్మిది రకాల మందులను గంట గంటకి వాడినప్పటికీ ఫలితం లేదు. నన్ను అడుగడుగునా నడిపిస్తున్న నా బాబా కూడా ముఖం చాటేశారనిపించింది. ఒకరోజు రాత్రి బాధను తట్టుకోలేక నా బాబాను విమర్శించాను. అంతలోనే మరలా బుద్ధి తెచ్చుకొని బాబాను తలచుకొని ఊదీని నుదుటన ధరించి, మరికొంత ఊదీని నీళ్ళలో కలుపుకొని త్రాగాను. బాబా అనుగ్రహంతో ఈ వ్యాధి తగ్గితే నా అనుభవాన్ని ఈ బ్లాగులో పంచుకుంటానని అనుకున్నాను. ఏ తెల్లవారుఝామునో కొద్దిగా నిద్రపట్టింది. ఉదయాన్నే లేచి ఫోన్ చూడగానే, “నా భక్తులను ఎన్నటికీ విస్మరించను, వేయి చేతులు చాచి ఆదుకుంటాను” అనే మెసేజ్ వచ్చింది. అది చూసి నాకు నోట మాట రాలేదు. ఆనందభాష్పాలు జాలువారుతుండగా ముందురోజు రాత్రి బాబాను విమర్శించినందుకు సిగ్గుతో తలదించుకున్నాను. మందులు పనిచేశాయో లేక ఊదీ మహిమో గానీ వ్యాధి కూడా తగ్గుముఖం పట్టింది. మనసారా ‘సాయీ’ అని పిలిస్తే ‘ఓయీ’ అని పలుకుతారు మన బాబా. మనం సహనం కోల్పోకుండా ఉండాలి. నా జీవితంలో ఎన్నో ఆటుపోట్లు వచ్చాయి. అన్నిటికీ నేను బాబానే శరణు కోరుతాను. అన్నిటికీ బాబా పరిష్కారం చూపుతూనే ఉన్నారు. కానీ నేనే మూర్ఖుడిని. బాబా లీలలను తెలుసుకోలేకపోతున్నాను. “నన్ను క్షమించండి బాబా!”
గోధుమపిండి చల్లి శిరిడీని కలరా బారినుండి కాపాడినట్లుగా ఈ కరోనా బారినుండి ప్రపంచాన్ని బాబా ఒక్కరే కాపాడగలరు. నా పాపాన్ని కడిగేసుకోవడానికి నన్ను శిరిడీ రప్పించుకొని నాకు ఆ దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకునే భాగ్యాన్ని కలుగజేయాలని బాబాను మనసారా కోరుకుంటూ..
శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
సర్వం శ్రీ సాయినాథ చరణారవింద సమర్పణమస్తు!
పుట్టినరోజున బాబా అనుగ్రహం
సాయిభక్తురాలు చండీశివప్రియ తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.
ఓం శ్రీ సాయీశ్వరాయ నమ:. ముందుగా, సాయినాథుని మార్గంలో ‘సాయి మహరాజ్ సన్నిధి’ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. సాయి భక్తజనులకు నా నమస్కారాలు. నా పేరు చండీశివప్రియ. నేను సాయినాథుని భక్తురాలిని. నా జీవితంలో బాబా చాలా మహిమలు చూపారు. వాటిలో ఒకదానిని ఈ బ్లాగ్ ద్వారా మీతో పంచుకుంటున్నాను.
ప్రతి సంవత్సరం నా పుట్టినరోజుకి నేను మా కుటుంబంతో కలిసి అమ్మవారి గుడికి వెళ్ళేదాన్ని. కానీ ఈసారి నేను ఒక్కదాన్నే బాబా గుడికి వెళ్ళాలని అనుకున్నాను. గుడికి బయలుదేరేముందు నేను బాబా చిత్రపటం వద్దకు వెళ్ళి బాబాకు నమస్కరించుకుని, “బాబా! నేను ఈరోజు నీ దగ్గరకు వస్తున్నాను. మీరు నాకు ఏదైనా కానుక ఇవ్వాలి, ఈరోజు నా పుట్టినరోజు కదా!” అని చెప్పుకున్నాను. తరువాత నేను బాబా గుడికి వెళ్ళాను. బాబా దర్శనం చేసుకునే లైన్లో నిలబడి ఉన్నప్పుడు నా వెనకాల ఉన్న ఎవరో ఒక తాతగారు నా పేరు అడిగారు. నేను చెప్పాను. ఆ తరువాత బాబా దర్శనం చేసుకుని బయటకు వస్తుంటే ఆ తాతగారు నన్ను ఆగమని చెప్పి, తన బ్యాగులో నుంచి ఒక చాక్లెట్ తీసి నా చేతికి ఇచ్చారు. నా ఆనందానికి అవధులు లేవు. బాబానే స్వయంగా నాకు చాక్లెట్ ఇస్తున్నట్లుగా భావించి ఎంతో సంతోషంగా ఆ చాక్లెట్ తీసుకున్నాను. అంతేకాదు, సాధారణంగా ఆ గుడిలో ఎప్పుడూ అర్చన చేయరు. కానీ ఈసారి నా గోత్రనామాలు తెలుసుకొని మరీ నా పేరున బాబాకు అర్చన చేశారు. నా పుట్టినరోజున బాబా నన్ను ఇలా అనుగ్రహించినందుకు ఎంతో ఆనందిస్తూ మనసారా బాబాకు కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను.
నేను 5వ తరగతి చదివేటప్పుడు మా నాన్నగారు నాకు బహుకరించిన హృదయాకారం లాకెట్ ద్వారా బాబా నా వద్దకు వచ్చారు. ఆ తరువాత నాకు ఏమి కావాలన్నా అన్ని ఆ లాకెట్లో ఉన్న బాబాతో చెప్పుకునేదాన్ని. అవన్నీ ఖచ్చితంగా తీరేవి. కానీ ఆ లాకెట్ ఇప్పుడు నా దగ్గర లేదు, ఎక్కడో పోగొట్టుకున్నాను. ఆ తరువాత చాలా జరిగాయి. ఇప్పుడు నేను నా స్వశక్తితో జీవించాలని కోరుకుంటున్నాను. బాబా అనుగ్రహంతో నా కోరిక తీరిన వెంటనే మళ్ళీ మీ ముందుకు వచ్చి ఆ అనుభవాన్ని పంచుకుంటాను. అంతేకాదు, ‘సిల్వర్ కాయిన్’ ద్వారా బాబా మళ్ళీ నా దగ్గరకు ఎలా వచ్చారో, నన్ను ఎలా అనుగ్రహించారో అనే విషయాలు కూడా మీతో పంచుకుంటాను. బాబా తప్పకుండా మనల్ని ఆపదలనుంచి కాపాడుతారు. మనం ఎల్లప్పుడూ బాబా పట్ల శ్రద్ధ, సబూరీలతో ఉండాలి. బాబాకు నా పాదాభివందనాలు.
Jai sairam
ReplyDeleteJai sairam
ReplyDeleteJai Sairam!Jai Gurudatta!
ReplyDeleteOm sai ram baba amma ki problem cure ayyela chudu baba pleaseeee baba
ReplyDeleteశ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
567 days
ReplyDeleteSairam
OM SRI SACHIDHANAMDHA SAMARDHA SATHDGURU SAINATHAYA NAMAH..Om Sai Ram
ReplyDelete