సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

ఇమాంభాయ్ చోటేఖాన్




శ్రీసాయిబాబా భక్తుడైన ఇమాంభాయ్ చోటేఖాన్ ఔరంగాబాద్ జిల్లాలోని వజాపూర్ నివాసి. అతనికి, అతని మేనత్తకి (అత్తగారు కూడా) మధ్య చాలా రోజులుగా ఒక భూ వివాదం పరిష్కారం కాకుండా ఉంది. పైగా అతని ఉద్యోగంలో కూడా చిక్కులొచ్చాయి. ఈ రెండు సమస్యల విషయంగా అతను నాందేడులోని ‘దర్వేష్ షా’ అనే ఫకీరుని ఆశ్రయించాడు. ఆ ఫకీరు అతనితో, "సాయిబాబా దర్శనానికి వెళ్ళమ"ని చెప్పి, వారు గొప్ప మహాత్ములని తెలిపే మార్గం కూడా చెప్పాడు. చాటుగా బాబా వెనుకకు జరిగి మనసులో ఖురాన్‌లోని ఒక మంత్రం వల్లిస్తే, ఆయన వెనక్కి తిరిగి అతనిని పలకరిస్తారని, ఆయన పైకమిస్తే తీసుకోవద్దని చెప్పాడు. 

దాంతో చోటేఖాన్ 1910వ సంవత్సరంలో మొదటిసారి సాయిబాబా దర్శనానికి శిరిడీ వెళ్ళాడు. ఆ సమయంలో దీక్షిత్‌వాడా నిర్మాణం జరుగుతోంది. అతను శిరిడీ చేరేసరికి గోండ్కర్ ఇంటి సమీపంలో ఉన్న సందులో బాబా నిలుచుని ఉన్నారు. బాబా వద్ద మద్రాసుకి చెందిన విజయానందస్వామి నిలబడి ఉన్నాడు. ఒక స్త్రీ బాబాకు నమస్కరిస్తోంది. దర్వేష్ షా చెప్పినట్లే చోటేఖాన్ బాబా వెనుక నిలబడి ఖురాన్‌లోని మొదటి అధ్యాయాన్ని పఠించబోయాడు. అతను 'బిస్మిల్లా!' అని మొదలుపెట్టగానే బాబా ఒక్కసారిగా వెనక్కి తిరిగి ఆవేశంతో, "ఎవరు నీవు? నువ్వేదో నా తండ్రివైనట్లు నన్నేదో అడగడానికి ఎందుకు వచ్చావు?" అని అతనిని తిట్టిపోశారు. అతను భయపడిపోయాడు. బాబా అర్థంకాని రీతిలో ఏదో మాట్లాడుతూ మసీదుకు వెళ్లారు. ఆ మాటలు చోటేఖాన్‌కి అర్థం కాలేదు. బాబా అనుమతి లేకుండా అతను మసీదులోకి ప్రవేశించలేక మసీదు ముంగిటనే కూర్చున్నాడు. రెండురోజుల వరకు బాబా అతనికి మసీదులోకి ప్రవేశించటానికి అనుమతి ఇవ్వలేదు. మూడవరోజు కాకాదీక్షిత్ తదితరులు అతని తరఫున మధ్యవర్తిత్వం చేశారు. దీక్షిత్ చోటేఖాన్‌ను చూపిస్తూ, ‘బాబా! అతను మీ బిడ్డడే కదా! అతనిపై మీకు కోపమెందుకు?" అని అన్నాడు. అందుకు బాబా, "వాడు నా బిడ్డ అంటావా? అతను ఒక టీచరుని కొట్టాడు" అని అన్నారు. నిజమే! అతను నిజాం రాష్ట్రంలో ఒక పోలీసు. ఒక నేరపరిశోధనలో సత్వర సమాచారం ఇవ్వనందున అతనొక క్రైస్తవ టీచరుని కొడితే, అతను ఒళ్ళంతా రక్తం కారి స్పృహతప్పి పడిపోయాడు. అతనికి శిక్ష తప్పాలంటే ఉద్యోగం వదిలి పారిపొమ్మని మామలతదారు సలహా ఇచ్చాడు. దాంతో అతను ఉద్యోగానికి రాజీనామా చేసి నిజాం రాష్ట్రాన్ని వదిలి పారిపోయాడు. కానీ న్యాయవిచారణ జరిగి తనకు శిక్షపడవచ్చని అతను భయపడ్డాడు. ఆ భయమే అతను బాబాను దర్శించడానికి గల కారణం.

దీక్షిత్ బాబాతో మాట్లాడినప్పటికీ చోటేఖాన్ భయపడి మసీదులోకి వెళ్ళలేదు. రెండు, మూడు రోజుల తరువాత, బడేబాబా కుమారుడు కాశిం, జోగ్, దీక్షిత్‌లు చోటేఖాన్‌ను మసీదు లోపలికి తీసుకుని వెళ్లారు. అతను బాబా దర్శనం చేసుకోగా, బాబా అతని శిరస్సుపై తమ హస్తాన్ని ఉంచి, "భయపడకు. భగవంతుడే యజమాని, విచారణ ఏమీ ఉండబోదు" అని అభయమిచ్చారు. తరువాత అతను సుమారు రెండు నెలలు శిరిడీలోనే ఉండిపోయాడు. ఒకరోజు బాబా, "నువ్వు సంతోషంగా తిరిగి వెళ్ళు. నీకున్న భూ వివాదం పరిష్కారమవుతుంది. నీ బంధువులందరూ నీతో సఖ్యంగా మెలుగుతారు!" అని ఆశీర్వదించారు. తన సమస్య గురించి చెప్పకముందే బాబా అలా చెప్పేసరికి అతను ఆశ్చర్యపోయాడు. బాబా ఆజ్ఞానుసారం అతను ఇంటికి తిరిగి వెళ్ళాడు. తన అత్తగారిపై కోర్టులో దావా వేశాడు. ఆ కేసు ఏడు సంవత్సరాల పాటు నడిచి చివరకు అతని భూములు అతని స్వాధీనమయ్యాయి.

రెండవసారి చోటేఖాన్ శిరిడీ వెళ్ళినప్పుడు మహల్సాపతి, మావిసీబాయిలు బాబా చెంత ఉన్నారు. అతను మసీదు లోపలికి వెళ్ళగానే బాబా మావిసీతో, "జనం నా మాట వినరు. దుష్టులు దూరంగా వెళ్లి బాధపడతారు. ముల్లువలన గాయమై తల్లిదండ్రులలో ఒకరిని కోల్పోతారు" అని అన్నారు. బాబా మాటలు అతనికేమీ అర్థం కాలేదు. అతను బాబా అనుమతి లేకుండానే తిరిగి వెళ్ళిపోయాడు. అతను ఇల్లు చేరిన రెండురోజుల తరువాత, అతని తల్లి కట్టెలు సేకరించడానికి వెళ్ళినప్పుడు ఆమె పాదాలలో ఒక ముల్లు గుచ్చుకుంది. అది సెప్టిక్ అయి కాలు బాగా వాచిపోయి పది రోజుల్లో ఆమె మరణించింది. బాబా మావిసీతో అన్న మాటలకు అర్థం అప్పుడు అతనికి బోధపడింది.

ఉద్యోగం లేని కారణంగా తల్లి ఉత్తరక్రియలు జరిపేందుకు చోటేఖాన్ వద్ద డబ్బులు లేవు. ఆ డబ్బులు బాబా ఇస్తారనే ఆశతో తల్లి మరణించిన నాల్గవ రోజున అతను మూడవసారి శిరిడీ వెళ్ళాడు. అతను సుమారు 34 రోజులు శిరిడీలో ఉన్నాడు. ఒకరోజు అతను బాబా సమక్షంలో ఉన్నప్పుడు బాబా మావిసీతో, "తప్పనిసరిగా ఊదీ తీసుకుని సెలవు తీసుకోవాలి" అని అన్నారు. ఆ మాటలు విన్న అతను 'తిరిగి వెళ్లేందుకు బాబా తనకు అనుమతిస్తున్నార'ని అనుకున్నాడు. ఎందుకంటే, ఒకరిని ఉద్దేశించి మరొకరితో పరోక్షంగా చెప్పడం బాబా పద్ధతి. మరుసటిరోజు ఉదయం అతను బాబా వద్దకు వెళ్ళగానే, ఆయన ఊదీనిస్తూ, "ఇంటి గుమ్మం దగ్గర ఒక వృద్ధురాలు నిలబడి ఉంటుంది. ఆమె ఏదో ఇస్తుంది, దాన్ని ఉపయోగించి కార్యక్రమాన్ని జరిపించాలి. అతిథులు వచ్చారు. వారితో కలిసి విందు ఆరగించాలి" అని అన్నారు. ఆ సమయంలో అతను బాబా మాటలను అర్థం చేసుకోలేకపోయాడు. తరువాత అతను తన తల్లి నలభయ్యవరోజు కార్యక్రమాన్ని జరిపించడానికి ఇంటికి వెళ్లగా, వృద్ధురాలైన (కీర్తిశేషులు) కాజీగారి భార్య ఇంటి గుమ్మం వద్ద నిలబడి ఉంది. ఆమె ప్రేమతో 50 రూపాయలు అతని చేతిలో పెట్టి, “కార్యక్రమాన్ని జరిపించు" అని చెప్పింది. 

అతను ఇంట్లో లేని సమయంలో కార్యక్రమం కోసమని అతని నలుగురు అక్కచెల్లెళ్ళు తమ భర్తలతో కలిసి తన ఇంటికి వచ్చి ఉన్నారు. బాబా చెప్పిన అతిథులు వాళ్లే. తమపై ఆధారపడ్డ భక్తుడు చోటేఖాన్ కష్టం తెలిసిన బాబా కార్యక్రమానికి కావలసిన నిధులు సమకూర్చి అతనికి సహాయం చేశారు. నాలుగవసారి అతను శిరిడీ సందర్శించినప్పుడు బాబా అతనితో, “గులాబ్ మీ ఇంటికి వచ్చాడు" అని అన్నారు. అతను తిరిగి ఇంటికి వెళ్లి చూస్తే, తన భార్య ఒక మగపిల్లవాడికి జన్మనిచ్చి ఉంది. బాబా 'గులాబ్' అని చెప్పింది ఆ బిడ్డ గురించే అని తలచి, బిడ్డకి ‘గులాబ్’ అని పేరు పెట్టారు.

తరువాత ఒకసారి చోటేఖాన్ శిరిడీ వెళ్ళినప్పుడు తిరుగు ప్రయాణానికి అనుమతి అడిగితే, బాబా తమ అనుమతిని నిరాకరిస్తూ, "ప్రజలు వెళ్లకూడదు. వెళితే తుఫానులొస్తాయి, అగ్నిగోళాలు (పిడుగులు) వర్షిస్తాయి, తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతాయి" అని అన్నారు. ఆ మాటలు తననుద్దేశించినవిగా కాక ఏదో సాధారణ ధోరణిలో బాబా చెప్పినట్లు అతనికి అనిపించింది. దాంతో, తిరిగి వెళ్ళాలనే ఆతృతలో ఉన్న అతను బాబా అనుమతి లేకుండానే శిరిడీ విడిచాడు. అతను నడుస్తూ, చిన్న చిన్నగా పరుగులు తీస్తూ గంటకు 5 మైళ్ళ వేగంతో ప్రయాణం సాగించాడు. సాయంత్రం గం. 5.50 ని.లకి శిరిడీకి 12 మైళ్ళ దూరంలో ఉన్న 'వారి' నది ఒడ్డుకు చేరుకున్నాడు. నది ఒడ్డున నడక సాగిస్తూ సురళ గ్రామం చేరుకునేసరికి సూర్యస్తమయమైంది. ఆ గ్రామపాటిల్ అతనితో, "వెళ్లవద్దు. ఆకాశం మేఘావృతమై ఉంది. వర్షం వచ్చే సూచన కనిపిస్తోంది. వెళితే అవస్థల పాలవుతావు" అని హెచ్చరించాడు. కానీ చోటేఖాన్, "ఇక్కడికి మా గ్రామం నాలుగు మైళ్ళ దూరంలోనే ఉంది. కాబట్టి నేను వెళ్ళిపోతాను" అని ముందుకుసాగాడు. అతను మూడు మైళ్ళ దూరం నడిచేసరికి ఉరుములు, మెరుపులతో పెద్ద తుఫాను మొదలైంది. అతని ముందున్న పెద్ద రావిచెట్టుపై పిడుగుపడి, భీకరమైన శబ్దంతో చెట్టు రెండుగా చీలి మండసాగింది. పిడుగుపడినప్పుడు మిరుమిట్లుగొలిపే మెరుపు మెరిసింది. ఆ కాంతిని చూడలేక చోటేఖాన్ తల వెనుకకు తిప్పుకున్నాడు. అక్కడ బాబా ఉన్నారు. ఆయన వెనుక రెండు చిన్న కుక్కలు కూడా ఉన్నాయి. అతను నమస్కరించగానే బాబా అదృశ్యమయ్యారు. అతను తన ప్రయాణాన్ని కొనసాగించాడు. అతని గ్రామానికి సమీపంలో ఒక నది ఉంది. దాన్ని దాటే అతను తన గ్రామానికి చేరుకోవాలి. ఆ నది లోతెంతో సరైన అవగాహన లేకనే అతను నదిలో దిగాడు. మోకాలిలోతు నీళ్లలో నడుచుకుంటూ అవతలి ఒడ్డుకు చేరుకుని యథాలాపంగా వెనక్కి తిరిగి చూసి విభ్రాంతి చెందాడు. కారణం, నీరు రెండు గట్లను తాకుతూ పొంగి ప్రవహిస్తోంది. నదిలోతు కనీసం ఇరవై అడుగులు ఉంటుంది. అంత లోతైన ప్రవాహాన్ని ఎలా దాటగలిగానా అని అతను విస్తుపోయాడు. మొత్తానికి అతను సురక్షితంగా ఇంటికి చేరుకున్నాడు. "తుఫానులొస్తాయి, అగ్నిగోళాలు (పిడుగులు) వర్షిస్తాయి, ఇబ్బందులు ఎదురవుతాయి" అన్న బాబా మాటలు సత్యమైనప్పటికీ ఆయన అతని వెంటే ఉండి రక్షణనిచ్చారు.

1918లో (బాబా సమాధి చెందడానికి కొన్ని నెలల ముందు) ఒకరోజు రాత్రి ఎనిమిది గంటల సమయంలో బాబా అప్పాభిల్‌తో, "నాలుగు కోళ్ళు తీసుకునిరా, అతిథులు వస్తున్నారు!” అన్నారు. ఆ వచ్చే అతిథులు ఎవరోనని చోటేఖాన్ ఆశ్చర్యపోయాడు. ఆ రాత్రి అతను మసీదులో తెరవెనుక దాగి మెలకువగా ఉన్నాడు. రాత్రి 2 గంటల తరువాత అడుగు పైగా వ్యాసమున్న ఒక పెద్ద అగ్నిగోళం మసీదులోనికి దూసుకువచ్చింది. అది పడమర దిక్కునున్న నింబారు(గూడు) వద్ద కాసేపు నిలిచి, తరువాత మసీదు పైకప్పుకెగసి ఛిన్నాభిన్నమై అసంఖ్యాకమైన తునకలు మసీదంతా ఆవరించాయి. అప్పుడు మసీదు మిరుమిట్లుగొలిపే కాంతితో నిండిపోయింది. ఆ కాంతిని చూడలేక అతను కళ్ళు మూసుకుని తల దించుకున్నాడు. అతనితో ఉన్న అప్పాభిల్ కూడా అలాగే చేశాడు. అప్పుడు బాబా ధుని వద్దకు వెళ్లి, వంచి ఉన్న తమ మెడపై సట్కా కొనను ఉంచి అరబిక్‌లో పది పదిహేను నిమిషాలపాటు ఏదో ఉచ్ఛరించారు. బాబా ధుని వద్దకు వెళ్ళగానే మసీదును ఆవరించి ఉన్న కాంతి అదృశ్యమైంది.

బాబా మరుసటి ఉదయం అప్పాభిల్ చేత నాలుగు కోళ్లు తెప్పించి, వాటి మాంసంతో వంటకం తయారుచేయించారు. మంటపం దగ్గరున్న పొయ్యిపై బాబా పోళీలు తయారుచేశారు. తరువాత బడేబాబా కొడుకు కాశింకి బాబా కొన్ని పోళీలు, మాంసం పెట్టి అతనితో, "నువ్వు ఔరంగాబాద్ వెళ్లి శంషుద్దీన్‌మియా ఫకీరును దర్శించి, ఈ 250 రూపాయలు వారికిచ్చి, ‘మౌలూ (దేవుని స్తుతిస్తూ పాడే పాటలు), కవ్వాలి (తాళాలు వాయిస్తూ సాధువుల గురించి పాడే పాటలు), న్యాస్(అన్నసంతర్పణ) జరిపించమ'ని చెప్పు. తరువాత బన్నేమియా ఫకీరు వద్దకు వెళ్లి, నేనిచ్చే పూలమాల వారి మెడలో వేసి వారితో, 'తొమ్మిదవరోజు అల్లా వెలిగించిన దీపాన్ని ఆయనే తీసుకుంటారు. ఆయన దయ అలా ఉన్నది (నవ్ దిన్, నవ్ తారిఖ్, అల్లామియానే అప్నా దునియా లేగయా, మర్జీ అల్లాకీ)’ అని చెప్పు” అని 250 రూపాయలను, చేమంతి పూలమాలను ఇచ్చారు. కాశిం ‘ఆ ప్రదేశాలు తనకి క్రొత్త’ అని చెప్పాడు. బాబా అతనితోపాటు వెళ్ళమని చోటేఖాన్‌కి చెప్పారు.

బాబా ఆదేశానుసారం చోటేఖాన్, కాశిం, అతని సేవకుడు అమీర్ కలిసి ప్రయాణమై మధ్యాహ్నం మూడు గంటలకి ఔరంగాబాద్ స్టేషనుకి చేరుకున్నారు. శంషుద్దీన్ ఫకీరు స్టేషనుకి వచ్చి, "సాయి ఫకీరు వద్ద నుంచి వచ్చిన అతిథులు ఎవరు?" అని విచారిస్తున్నారు. ఆయన చోటేఖాన్‌కి అదివరకే తెలుసు. ముగ్గురూ వెళ్లి ఆయనకు నమస్కరించారు. శిరిడీలో బాబా వాళ్ళకిచ్చిన ఆదేశాలన్నింటినీ శంషుద్దీన్ పొల్లుపోకుండా చెప్పి, వాళ్ళని కోటలో ఉన్న తన ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టారు. అప్పుడు వాళ్ళు బాబా ఇచ్చిన 250 రూపాయలను ఆయనకిచ్చారు. ఆయన ఎంతోమందిని ఆహ్వానించి న్యాస్ (అన్నసంతర్పణ) చేశారు. తరువాత మౌలూ, కవ్వాలి జరిపించారు. ఆ రాత్రికి బాబా చెప్పిన పనులన్నీ పూర్తయ్యాయి.

చోటేఖాన్, కాశిం, అమీర్‌లు ముగ్గురూ మరుసటిరోజు ఉదయం బన్నేమియా ఇంటికి చేరుకున్నారు. అక్కడ బన్నేమియా ఒక చేయి పైకెత్తి, మరో చేయి క్రిందకి పెట్టి నిలబడి ఉన్నారు. అక్కడున్న అరబ్బులు చోటేఖాన్, అతని స్నేహితులతో బన్నేమియా దగ్గరకు వెళ్లవద్దనీ, వెళితే వారు ఉగ్రులవుతారనీ చెప్పారు. దాదాపు గంటసేపు వేచి ఉన్న తరువాత చోటేఖాన్ ధైర్యం తెచ్చుకుని, బన్నేమియాను సమీపించి, బాబా ఇచ్చిన పూలమాలను వారి మెడలో వేశాడు. అప్పుడు బన్నేమియా పైకెత్తి ఉన్న తన చేతిని క్రిందకు దించారు. బాబా చెప్పిన మాటలను అతనితో చెప్పాడు చోటేఖాన్. అది విని బన్నేమియా తదేకంగా ఆకాశంకేసి చూస్తూ ఉండిపోయారు. వారి కళ్ళనుండి కన్నీళ్ళు కారసాగాయి. ఈ ప్రపంచం నుండి సాయి నిష్క్రమించే సమయం ఆసన్నమైందని వారు బాధపడ్డారు. తరువాత చోటేఖాన్, అతని స్నేహితులు బన్నేమియా వద్ద సెలవు తీసుకుని తిరిగి శిరిడీ వచ్చారు. సరిగ్గా నాలుగు నెలల తరువాత, తొమ్మిదవ నెల, తొమ్మిదవరోజున బాబా మహాసమాధి చెందారు.

1936లో గులాబ్‌ వివాహ విషయంగా చోటేఖాన్‌కి మళ్ళీ డబ్బు అవసరమైంది. ఆ కారణంగా అతను శిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకుని, ఆ రాత్రి మసీదులో వారి సన్నిధిలో నిద్రించాడు. కలలో అతనికి బాబా దర్శనమిచ్చి ఆశీర్వదిస్తూ, "పూనా వెళ్లినట్లైతే నువ్వు లబ్ది పొందుతావు" అని చెప్పారు. దాంతో అతను పూనాకు బయలుదేరాడు. అక్కడ తీవ్రమైన మొలల వ్యాధితో బాధపడుతున్న లడ్కర్ అనే వ్యక్తి అతన్ని కలిశాడు. చోటేఖాన్ అతనితో తనకు ఒక సాధువు (సాయిబాబా) చేసే వైద్యం తెలుసనీ, దానితో మొలలు నయమవుతాయనీ చెప్పాడు. ఆ మందు తనకివ్వమని అతను అడిగాడు. చోటేఖాన్ మందు తయారుచేసి అతనికిచ్చాడు. దాంతో అతనికి ఉపశమనం లభించింది. తరువాత అతను పూనాలో జరిగే గుర్రపుపందేలకు వెళ్లి ఒక గుర్రంపై కొంత సొమ్ము పెట్టుబడి పెట్టాడు. ఆ గుర్రం గెలిచి అతనికి 1,100 రూపాయలు వచ్చాయి. అందులోనుండి అతను చోటేఖాన్‌కు 700 రూపాయలు ఇచ్చాడు. ఆ డబ్బుతో గులాబ్ వివాహం జరిపించాడు చోటేఖాన్.

1936వ సంవత్సరంలోనే ఒకరాత్రి చోటేఖాన్, మాధవ్‌ఫస్లే మసీదులో నిద్రిస్తున్నారు. మధ్యరాత్రిలో “మాథో, లే! నేను లఘుశంక తీర్చుకోవాలి” అని మాధవ్‌ను లేపుతున్నట్లు బాబా స్వరం చోటేఖాన్‌కి వినిపించింది. కానీ మాధవ్ గాఢనిద్రలో ఉండి లేవలేదు. ఉదయం లేచి చూస్తే, బాబా మామూలుగా కూర్చునే చోటుకి ప్రక్కనే ఒక గుంటలో నీళ్ళు ఉన్నాయి. అవి సువాసన వెదజల్లుతున్నాయి. చోటేఖాన్ రాత్రి విన్న బాబా మాటల దృష్ట్యా వారక్కడ మూత్రవిసర్జన చేశారని అర్థమవుతుంది. అది సువాసన వెదజల్లడమే అద్భుతం!

ఇమాంభాయ్ చోటేఖాన్ చెప్పిన కొన్ని వివరాలు తరువాయి భాగంలో:

  

 తరువాయి భాగం కోసం బాబా పాదాలు తాకండి.

source : http://saiamrithadhara.com/mahabhakthas/chote_khan.html
devotee’s experience of saibaba by b.vi. narasimha swamy.

5 comments:

  1. 🙏🌺🙏ఓం సాయిరాం🙏🌺🙏

    ReplyDelete
  2. Om Sai
    Sri Sai
    Jaya Jaya Sai
    🙏🙏🙏

    ReplyDelete
  3. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete
  4. Om Sree Sachidhananda Samarda Sadguru Sai Nadhaya Namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo