ఈ భాగంలో అనుభవాలు:
- బాబాపై భారం వేసి నిశ్చింతగా ఉంటే, బాబా అనుగ్రహానికి లేదు కొదవ
- బాబా ఊదీతో తగ్గిన గొంతునొప్పి, విరోచనాలు
హైదరాబాదు నుండి ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తమకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.
ఓం సాయిరాం! ఈ బ్లాగ్ నిర్వహిస్తున్నవారికి నా ధన్యవాదాలు. గత కొన్ని సంవత్సరాలుగా నేను బాబా భక్తురాలిని. నిజానికి నా చిన్నతనంలోనే నాకు బాబా గురించి తెలుసు, కానీ అజ్ఞానంతో బాబా వైపు అడుగులు వేయలేకపోయాను. బాబా ప్రవేశంతో కొన్ని సంవత్సరాలుగా నా జీవితం గొప్పగా మారిపోయింది. ఎలా అంటే, ముఖ్యమైన పని ప్రారంభించేముందు బాబా ముందు చీటీలు వేసి బాబా అనుమతి తీసుకునే విధంగా. నా జీవితంలో బాబా నాకు ప్రసాదించిన అనుభవాలను కొన్నిటిని మీతో పంచుకోవాలనుకుంటున్నాను.
మొదటి అనుభవం:
చాలామంది భక్తులు శ్రీసాయిసచ్చరిత్ర పారాయణ వల్ల వాళ్లకు ఎంతో మంచి జరిగిందని ఈ బ్లాగులో పంచుకున్నారు. ఆ అనుభవాలను చదివి నేను కూడా సచ్చరిత్ర పారాయణ చెయ్యాలనుకున్నాను. కానీ నాకు సచ్చరిత్ర ఎక్కడా లభించలేదు. ఒకరోజు మావారి ఫ్రెండ్ శిరిడీ వెళ్లారని తెలిసి మా కోసం సచ్చరిత్ర తీసుకురావలసిందిగా కోరాము. కానీ వారు అప్పటికే తిరుగు ప్రయాణానికి రైల్వేస్టేషనుకి చేరుకున్నామని చెప్పారు. నేను చాలా నిరాశచెందాను. అప్పుడు బాబా ఒక అద్భుతం చేశారు. మరుసటిరోజు మావారి ఫ్రెండ్ తమ దగ్గర రెండు సచ్చరిత్ర పుస్తకాలు ఉన్నాయని, ఒక పుస్తకాన్ని తీసుకొచ్చి మావారికి ఇచ్చారు. బాబానే ఆ గ్రంథం రూపంలో మా ఇంటికి వచ్చారని ఎంతో ఆనందించాను. కొన్ని రోజుల తర్వాత నేను ‘నవ గురువారం వ్రతం’ ప్రారంభించాను. మూడు వారాలు పూర్తయిన తరువాత ఒకరోజు మా బాబుకి కాలు ఫ్రాక్చర్ అయ్యింది. నేను చాలా నిరాశపడ్డాను. ఒకానొక సందర్భంలో బాబాను నిందించాను కూడా. వ్రతం పూర్తయ్యేసరికి మా కుటుంబం చాలా ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి రావటంతో మేము చాలా కృంగిపోయాం. మానసికంగానూ, ఆర్థికంగానూ చాలా కష్టాలు ఎదుర్కొన్నాము. ఈ క్రమంలో బాబా నుంచి నాకు వచ్చిన సూచన ఏమిటంటే, ‘బాబా నన్ను పరీక్షిస్తున్నారు’ అని. ఆ తరువాత బాబా దయవల్ల ఒక్కొక్క సమస్య తీరుతూ వచ్చింది. కానీ కొంతకాలం తరువాత మరొక పెద్ద సమస్య మా జీవితంలోకి వచ్చింది. అదేమిటంటే, మావారు చేస్తున్న ప్రాజెక్టు గడువు ముగిసి తను బెంచ్ మీదకు వెళ్లే పరిస్థితి వచ్చింది. మూడు నెలల్లోపు వేరే ప్రాజెక్టు వస్తే సరేసరి, లేదంటే ఉద్యోగమే పోతోంది. ఈ క్రమంలో మాకు చాలా ప్రాజెక్టుల నుంచి ఫోన్ కాల్స్ వచ్చేవి. కానీ, ఏ ప్రాజెక్టులోకీ మావారిని తీసుకోలేదు. ఇలా మూడు నెలలు గడిచింది. ఈ సమయంలో మేము బాబాపై పూర్తి విశ్వాసం ఉంచాము. ‘అంతా బాబానే చూసుకుంటారు’ అనే దృఢనిశ్చయంతో ఉన్నాము. మూడు నెలల తర్వాత మావారి సహోద్యోగులను ఉద్యోగాల నుంచి తొలగించారు. మావారికి మాత్రం మరో మూడు నెలలు గడువు పొడిగించారు. ఇదంతా బాబా చేసిన అద్భుతమేనని నేను మనస్పూర్తిగా నమ్ముతున్నాను. మావారు బాబాపై భారం వేసి ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టారు. కానీ, ఎటువంటి ఫలితం కనిపించలేదు. ఆరు నెలల గడువు ముగుస్తుండటంతో మేం బాబానే నమ్ముకొని బాబా పైనే భారం వేసి అంతా బాబాకు వదిలేశాము. మా తండ్రి, మా దైవం, మా గురువైన సాయినాథుడు మా జీవితంలో ఒక గొప్ప అద్భుతాన్ని చేశారు. అదేమిటంటే, మావారికి మేనేజర్ స్థాయి ఉద్యోగం వచ్చింది. అది కూడా ఆరు నెలలుగా సాధ్యం కానిది కేవలం ఒకే ఒక్క రోజులో. గొప్ప విషయం ఏమిటంటే, పది రోజుల్లో ఉద్యోగమే పోయే పరిస్థితులనుండి మేనేజర్ స్థాయికి చేరుకోవటం. అది కేవలం బాబా చేసిన అద్భుతమే. “ధన్యవాదాలు బాబా! లవ్ యు బాబా!”
ఉద్యోగం వచ్చిన తర్వాత ఇంకొక సమస్య వచ్చింది. ఆఫీసు నుండి లాప్‌టాప్ తీసుకోవాలి. లాక్‌డౌన్ వలన లాప్‌టాప్ ఇవ్వటానికి రెండు నెలల సమయం పడుతుందని చెప్పారు. కానీ బాబా దయవలన కేవలం పది రోజుల్లోనే మాకు లాప్‌టాప్ వచ్చింది. తర్వాత కొద్ది రోజులకి తెలిసిన విషయం ఏమిటంటే, మావారికి వచ్చిన ఉద్యోగం కోసం చాలామంది ప్రయత్నించారని. కానీ ఎటువంటి ప్రయత్నం లేకుండా ఆ ఉద్యోగం మావారికి రావటం కేవలం బాబా అనుగ్రహమే. సాయిబంధువులందరికీ నేను తెలియజేసేది ఏమిటంటే, ఎవరైతే శ్రద్ధగా, నిజాయితీగా బాబా పైన పూర్తి భక్తి, ప్రేమ, విశ్వాసాలు నిలుపుతారో అటువంటివారిని బాబా ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటారు. బాబా మనకు జీవితంలో సూచనలు ఇస్తూ ఉంటారు, కానీ మనం కొన్నిసార్లు వాటిని అవివేకంతో గమనించము. బాబా తన భక్తులకు ఏది మంచిదో, ఏది ఎప్పుడు అవసరమో అప్పుడు దానిని ఇస్తూ ఉంటారు, అప్పటివరకూ మనం సబూరితో ఉండాలి. ఎటువంటి కష్టం వచ్చినా బాబాపై భారం వేసి నిశ్చింతగా ఉంటే అంతా బాబానే చూసుకుంటారు.
బాబా ఊదీతో తగ్గిన గొంతునొప్పి, విరోచనాలు
సాయిభక్తుడు రాజశేఖర్ గారు తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.
ఓం సాయిరాం! నా పేరు రాజశేఖర్ రెడ్డి. నేను సాయినాథునికి చాలా చిన్న భక్తుడిని. బాబా నాకు ప్రసాదించిన అనుభవాన్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. ముందుగా ఈ బ్లాగ్ నిర్వహిస్తున్నవారికి నా నమస్కారాలు. 2020, మార్చి 11వ తేదీన నాకు, నా భార్యకు విపరీతంగా విరేచనాలు కావడం మొదలయ్యాయి. దానితో పాటు గొంతునొప్పి కూడా ప్రారంభమైంది. మేము చాలా భయపడిపోయాము. ఎందుకంటే, ఇవి కరోనా రోజులు కదా. దాంతో ఆరోజు రాత్రి బాబాను ప్రార్థించి, బాబాను నమ్ముకొని ఊదీని నీళ్ళలో కలుపుకుని నేను, నా భార్య త్రాగాము. మరుసటిరోజు ఉదయానికల్లా బాబా అనుగ్రహంతో మా గొంతునొప్పి, విరేచనాలు తగ్గిపోయాయి. మేమిద్దరం ఎంతో సంతోషంతో బాబా పాదపద్మాలకు నమస్కరించుకొని మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాము. “మమ్మల్ని, మా పిల్లల్ని దీవించండి బాబా!” ఈ బ్లాగ్ నిర్వహిస్తున్నవారికి మరొక్కసారి నా నమస్కారాలు.
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
Jai sairam
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteఓం సాయి రామ్ 🙏🌹🙏
ReplyDeleteఓం శ్రీ సాయినాథాయ నమః!🙏
ఓం ఆరోగ్య క్షేమదాయ నమః!🙏
రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
ReplyDeleteఓం సాయిరాం...🌹🙏🏻🌹
ReplyDelete