మొదటినుండి రేగే శాస్త్రగ్రంథాల పఠనానికి ప్రాముఖ్యతనివ్వలేదు. అతను భగవద్గీతను కూడా సక్రమంగా చదవలేదు. అందువలన ధ్యానంలోని వివిధ స్థితులు లేదా చరమస్థితి వంటి వివరాలలోకి వెళ్ళేవాడు కాదు. ఒక గురుపూర్ణిమ పర్వదినాన ఎంతోమంది భక్తులు బాబా దర్శనార్థం వచ్చారు. అటువంటి పవిత్రమైన రోజున బాబా ఆశీస్సులతో సద్గ్రంథాలను తీసుకుంటే పారాయణ ఫలవంతమవుతుందని భక్తుల అభిప్రాయం. కానీ తరచూ బాబా ఎవరిచ్చిన పుస్తకం వారికే తిరిగి ఇవ్వకుండా మరొకరికి ఇస్తుండేవారు. ఆరోజు రేగే దగ్గర తప్ప మిగిలిన భక్తులందరి దగ్గరా పుస్తకాలున్నాయి. అది గమనించిన బాబా పుస్తకాలనుద్దేశించి రేగేతో, “వాళ్ళు ఈ పుస్తకాలలో బ్రహ్మను కనుగొనాలని అనుకుంటున్నారు. కానీ ఈ పుస్తకాలలో ఉండేది భ్రమే! నీ ఆలోచనే సరైనది. నీవు ఈ పుస్తకాలను చదవనక్కరలేదు. నన్ను నీ హృదయంలో నిలుపుకో! బుద్ధిని, మనసును ఏకం చేయి, అది చాలు!” అని అన్నారు. అందువల్ల రేగే ఏ గ్రంథాలూ చదివేవాడు కాదు.
బహుశా 1912వ సంవత్సరంలో వచ్చిన గురుపూర్ణిమనాడు రేగే శిరిడీ వెళ్తూ మన్మాడ్ స్టేషన్లో దిగాడు. శిరిడీ వెళ్లే ప్రతి భక్తుని చేతిలో పూలు, పూలమాలలు ఉన్న బుట్టలున్నాయి. అది గమనించిన అతను, తనకు సర్వమూ అయిన గురువు వద్దకు వెళ్తూ ఒక పూలమాలను తీసుకుని వెళ్లడం మర్చిపోయినందుకు బాధపడ్డాడు. అందరూ శిరిడీ చేరుకుని మసీదుకి వెళ్ళారు. బాబా మెడలో ఎన్నో పూలమాలలున్నాయి. అది చూసి, బాబాకు సమర్పించడానికి తన దగ్గర పూలమాల లేదని మళ్ళీ బాధపడ్డాడు రేగే. అప్పుడు బాబా తమ మెడలో ఉన్న పూలమాలలను పైకెత్తి చూపుతూ, “ఇవన్నీ నీవే!” అని అన్నారు. “అన్నింటినీ మన్నించి, మరిపించి, మురిపించే వారి ప్రేమ, కరుణ ఎంత గొప్పవి!” అని అనుకున్నాడు రేగే. భౌతికంగా ఇచ్చేదానికన్నా హృదయపూర్వకంగా ఇవ్వాలన్న కోరిక ఎన్నోరెట్లు విలువైనదని ఈ సంఘటన నిరూపిస్తున్నది.
అదే సంవత్సరం(1912)లో మరొకసారి రేగే జేబులో వంద రూపాయలతో శిరిడీ వెళ్లి బాబాను దర్శించుకున్నాడు. అప్పుడు బాబా అతనిని రూ.40/- దక్షిణ అడిగారు. అతను వెంటనే సమర్పించాడు. కొంతసేపైన తరువాత మరలా రూ.40/- దక్షిణ అడిగారు బాబా. అతను ఆనందంగా సమర్పించాడు. చివరికి బాబా అతని వద్ద మిగిలిన రూ.20/- లను కూడా దక్షిణగా అడిగారు. అతను ఎటువంటి సంకోచం లేకుండా దానిని కూడా బాబాకు సమర్పించుకున్నాడు. తన వద్ద ఒక్క పైసా కూడా లేకపోయినప్పటికీ, డబ్బంతా బాబాకు దక్షిణగా సమర్పించినందుకు అతను చాలా సంతోషించాడు. కాసేపటికి బాబా మరలా అతనిని పిలిచి దక్షిణ అడిగారు. "నా దగ్గర ఇచ్చేందుకు ఏమీలేద"ని చెప్పాడు రేగే. "నీ వద్ద డబ్బు లేకుంటే ఎవరినైనా అడిగి తెచ్చివ్వు" అని అన్నారు బాబా. అందుకతను అంగీకరించి, "ఎవరి వద్దకు వెళ్ళమంటారో చెప్పండి బాబా. సంతోషంగా వెళ్ళి, వారిని అడుగుతాను" అని అన్నాడు. "శ్యామా వద్దకు వెళ్ళమ"ని చెప్పారు బాబా. దాంతో అతను శ్యామా వద్దకు వెళ్ళి మసీదులో జరిగిన విషయమంతా చెప్పి డబ్బు అడిగాడు. అప్పుడు శ్యామా అతనితో, “నీవు బాబాను సరిగా అర్థం చేసుకోలేదు. బాబాకు డబ్బు గడ్డిపోచతో సమానం. నీ మనస్సు, బుద్ధి, సమయం, ఆత్మలను బాబాకు సమర్పించాలని వారి ఉద్దేశ్యం" అని అన్నాడు.
రేగే మసీదుకు తిరిగి వెళ్లి శ్యామా చెప్పినదంతా బాబాకు వివరించాడు. బాబా చిరునవ్వు నవ్వి, “దీక్షిత్ దగ్గరకు వెళ్ళి అతన్ని అడుగు” అని అన్నారు. అతను దీక్షిత్ వద్దకు వెళ్లి జరిగిన విషయాన్ని, బాబా ఆదేశాన్ని తెలిపాడు. అదంతా విన్న దీక్షిత్, "బాబా మిమ్మల్ని నా దగ్గరకు ఎందుకు పంపించారోనన్నది పరిస్థితుల దృష్ట్యా అర్థం చేసుకుని దాన్ని మీరొక ఉపదేశంగా తీసుకోవాలి" అని అంటూ, "డబ్బు లేకపోవడం, డబ్బు లేదా మరేదైనా యాచించవలసిరావడం అవమానంగా తలచరాదు. యాచించాల్సివస్తే తనకు తాను గొప్పవాడినన్న భావన రాకూడదు" అని చెప్పాడు. రేగే బాబా వద్దకు వెళ్ళి దీక్షిత్ చెప్పినదంతా వివరంగా చెప్పాడు.
బాబా చిరునవ్వు నవ్వి, "నానా వద్దకు వెళ్లి అప్పుగా అడిగి డబ్బులు తీసుకురమ్మ"ని చెప్పారు. వెంటనే నానాసాహెబ్ చందోర్కర్ కోసం ఖండోబా ఆలయానికి వెళ్ళాడు రేగే. అక్కడ ఉపాసనీశాస్త్రితో కలిసి ఆధ్యాత్మిక గ్రంథాల పారాయణ చేస్తున్నాడు నానాసాహెబ్. రేగే మసీదులో జరిగినదంతా నానాతో చెప్పి, బాబా ఆదేశానుసారం డబ్బుకోసం వచ్చినట్లు చెప్పాడు. అంతా విన్న నానాసాహెబ్ లౌక్యంగా, “బాబా దక్షిణ అడిగినప్పుడు మన దగ్గర డబ్బు లేకుంటే ఎంత బాధగా ఉంటుందో నేను ఊహించగలను. అందుకే నేను శిరిడీ వచ్చేటప్పుడు సగం డబ్బు కోపర్గాఁవ్‌లో దాచి ఉంచుతాను. ఇప్పుడు కూడా అలాగే చేశాను. ఇంటినుండి రెండువందల రూపాయలు తీసుకొచ్చి, వంద రూపాయలు కోపర్గాఁవ్‌లో ఉంచి వంద రూపాయలతో శిరిడీ వచ్చాను. బాబా అడిగినప్పుడల్లా దక్షిణ సమర్పిస్తూ, చేతిలో డబ్బు అయిపోగానే కోపర్గాఁవ్ నుండి మిగిలిన డబ్బు తెప్పించుకుంటాను. నువ్వు కూడా ఇలాగే చేస్తుండు" అని చెప్పాడు. రేగే మశీదుకు వెళ్ళి నానా చెప్పినదంతా బాబాతో చెప్పి అక్కడే కూర్చున్నాడు.
నానాకు కబురు పంపించారు బాబా. అతను రాగానే రూ.40/- దక్షిణ అడిగారు. అతను సంతోషంగా బాబా అడిగిన దక్షిణ సమర్పించి వెళ్ళిపోయాడు. మరలా బాబా అతనికి కబురు పంపించి మరో రూ.40/- దక్షిణ అడిగి తీసుకున్నారు. కొద్దిసేపట్లోనే మళ్ళీ అతనిని మసీదుకు పిలిపించి అతని వద్ద మిగిలిన మొత్తాన్ని కూడా దక్షిణగా అడిగి తీసుకున్నారు. నానాసాహెబ్ వెంటనే కోపర్గాఁవ్‌లో దాచిపెట్టిన డబ్బు తీసుకురమ్మని ఒక మనిషిని పంపించాడు. ఆ డబ్బు వచ్చేలోగానే నానాను మళ్ళీ దక్షిణ అడిగారు బాబా. ఇక తన వద్ద డబ్బు లేదని చెప్పవలసివచ్చినందుకు నానా చిన్నబుచ్చుకున్నాడు. ఈ సంఘటన ద్వారా, ‘బాబా అవసరాలన్నీ తీర్చగలమని, వారడిగినవన్నీ ఇవ్వగలమని’ ఎవరైనా అనుకుంటే అది కేవలం భ్రమేనని నానాసాహెబ్‌కి, రేగేకి, ఇంకా అక్కడున్న అందరికీ తెలియజేశారు బాబా. అంతేకాదు, దక్షిణ అడగటాన్ని ఒక్కో భక్తుడు ఒక్కో విధంగా ఎలా అర్థం చేసుకుంటాడో కూడా బాబా ఆ విధంగా తెలియజేశారు.
బాబా దక్షిణ అడగటంలో అంతరార్థం నానా, శ్యామా, దీక్షిత్‌లు చెప్పింది మాత్రం కాదు. బాబా ధనాన్ని, కానుకలను లెక్కచేయరు. వారు తమ భక్తులనుండి కోరుకునేది హృదయపూర్వకమైన ప్రేమ మాత్రమే! "అటువంటి ప్రేమను కలిగి ఉండటమే తన లక్ష్యమని, ఆ విషయం బాబాకు తెలుస"ని రేగే చెప్పాడు.
బాబా తమ భక్తులు రాగద్వేషాలకు లోనుకాకుండా చూసేవారు. ఒకసారి రేగే మసీదులో బాబా సమక్షంలో కూర్చుని ఉండగా ఒక భక్తుడు ఎర్రని అరటిపండ్లు తీసుకొచ్చి బాబాకు సమర్పించాడు. అవంటే ఎంతో ఇష్టమున్న రేగే వాటిలో కొన్ని బాబా తనకు ఇస్తారని ఆశించాడు. అతని మనసులో ఏముందో తెలిసిన బాబా అతనికేసి చూసి ఒక పండు తీసుకుని తొక్క ఒలిచి, గుజ్జుని అక్కడున్న ఇతర భక్తులకు పంచిపెట్టి, తొక్కను రేగేకిచ్చి తినమన్నారు. రెండోసారి, మూడోసారి కూడా బాబా అలాగే చేశారు. గురువుపట్ల తనకున్న ప్రగాఢమైన భక్తి కారణంగా రేగే ఆ తొక్కలన్నీ తినేశాడు. చివరిగా ఒక పండును బాబా తమ చేతిలోకి తీసుకుని అతనికేసి చూసి, “నేను నీకేమీ ఇవ్వలేదా?” అని అంటూ ఆ పండును ఒలిచి కొంచెం తాము కొరికి అదెంతో బాగుందన్నారు. తర్వాత మిగిలిన భాగాన్ని రేగే నోటికందించి కొరకమన్నారు. అలా బాబా ఒక ముక్క, అతనొక ముక్క కొరుకుతూ ఆ పండును పూర్తిచేశారు. ఈ లీల గురించి ఆలోచిస్తే, ఎంతో విలువైన ఆధ్యాత్మిక సూత్రాలు తెలుస్తాయి. మొదట రేగేకు పండ్లను చూడగానే జిహ్వాచాపల్యం కలిగింది. అది ఒక బలహీనత అన్న తలంపు కూడా అతనికి రాలేదు. నామరూపాల వల్ల కలిగిన లౌకిక సుఖభ్రాంతి విడిస్తేగానీ గురుకృప లభించదు. బాగా అలోచించి నామరూపాత్మకమైన ఇంద్రియ విషయాలు నిజంగా సుఖమయములు కావని మొదట ముముక్షువు తెలుసుకోవాలి. అప్పుడుగానీ విషయాల పట్ల వైరాగ్యం కలుగదు. అందుకే సాయి అతనిని భ్రమింపజేసిన అరటితొక్కను మాత్రమే అతనికిచ్చారు. మిగిలిన భక్తులందరికీ లభించినవి మేలైన అరటిపండ్లు మాత్రమే. వాటిని ప్రసాదించినది సద్గురువే కావచ్చుగాక! కానీ భక్తి విశ్వాసాలతో, అచంచలమైన ప్రేమతో ఆయనేమి ప్రసాదించినా సంతోషంగా తీసుకున్న రేగేకు మాత్రం సాయి ప్రసాదం లభించింది, ఆ సద్గురుని ఉచ్చిష్టం లభించింది. బాబా తాముగా తమ భక్తునికి ఉచ్చిష్టాన్ని ప్రసాదించిన సందర్భం మరొకటి లేదు.
ఒకప్పుడు శ్రీ హెచ్.ఎస్.దీక్షిత్ తన స్నేహితుడైన శ్రీ పి.ఆర్.అవస్తేని శిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకోమని చెప్పాడు. అవస్తే తన చిన్నతనంలోనే ఒక స్త్రీని గురువుగా ఆశ్రయించి గురుమంత్రాన్ని స్వీకరించాడు. ఆమె సజీవంగా ఉందో లేదో అతనికి తెలియదు. కానీ దీక్షిత్ చెప్పినట్లు బాబా దర్శనానికి వెళ్లడం గురుద్రోహంగా భావించాడు. అవస్తే ఇండోర్ జిల్లా న్యాయమూర్తిగా ఉండగా రేగే అతని క్రింద సివిల్ న్యాయమూర్తిగా ఉండేవాడు. రేగేకు బాబాతో ఉన్న అనుబంధాన్ని తెలుసుకున్న అవస్తే తన మనస్సులోని సందేహాన్ని రేగేతో చెప్పాడు. అప్పుడు రేగే అతనితో, "బాబా గొప్ప మహాత్ములు, దైవస్వరూపులు. గురువులందరిలో ఉన్న ఆత్మయే వారు. కాబట్టి, మీ గురువులో బాబా ఉన్నారు. శిరిడీ వెళ్తే, బాబాలో మీ గురువు ఉన్నారని మీకు అనుభవమవుతుంది" అని చెప్పాడు. దానితో అతను శిరిడీ వెళ్ళడానికి అంగీకరించి, "1914 క్రిస్మస్ సెలవుల్లో తనను శిరిడీ తీసుకెళ్లమ"ని రేగేతో చెప్పాడు. అయితే ఒక పెద్ద అడ్డంకి ఎదురైంది. అవస్తే చాలా నెమ్మదస్తుడు. అందువలన చాలా పనులు పూర్తికాకుండా ఉండిపోయాయి. అవి పూర్తి చేయకపోతే క్రిస్మస్ సెలవులను వినియోగించుకోరాదని అతనికి ప్రభుత్వం నుండి ఆదేశాలు వచ్చాయి. సెలవులు ఆరంభమవుతూనే అతడు ఆ పెండింగ్ పనులు మొదలుపెట్టాడు. అతను ఆశ్చర్యపోయేలా కొన్ని రోజులలోనే ఆ పనులు పూర్తి చేయగలిగాడు. అది బాబా సహాయానికి సాక్ష్యంగా అతనికి తోచింది.
తరువాత ఒక శుభదినాన రేగే, అవస్తేలు తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. అయితే ఊహించని మరో అవాంతరం వచ్చి పడింది. ఆ సమయంలో యుద్ధం జరుగుతున్న కారణంగా రైళ్లన్నీ సైనికాధికారుల హస్తగతం చేయబడ్డాయి. ఇండోర్ నుండి మన్మాడ్ వెళ్లే మార్గంలో మహౌ కంటోన్మెంట్ స్టేషన్ దాటవలసి ఉంది. ఆ స్టేషన్‌లో సైనికాధికారి రైల్లోని ప్రయాణీకులను దింపి సైనికులను ఎక్కిస్తున్నాడు. అందరితోపాటు రేగే, అవస్తేలు కూడా దిగవలసి వచ్చింది. ఇక శిరిడీయాత్ర ముందుకు సాగదని వారికి అనిపించింది. అయితే చిత్రంగా వాళ్ళు రైలు దిగబోతున్న సమయంలో సైనికాధికారి రైలులోకి వచ్చి, “ఈ బోగీ చిన్నదైనందున మాకు అవసరం లేదు. కాబట్టి మీరు ఈ బోగీలో మీ ప్రయాణాన్ని కొనసాగించవచ్చు” అని చెప్పాడు. బాబా అనుగ్రహంతో అలా అనూహ్యరీతిన వారిద్దరికీ ప్రయాణం కొనసాగించే అవకాశం లభించింది. రేగే ఆ రాత్రంతా 'బాబా, బాబా' అంటూ బాబాను పిలుస్తూ భజన, నామజపం చేస్తూ గడిపాడు. వాళ్ళు శిరిడీ చేరగానే బాబా రేగేను, "నీతో ఉన్న ఈ వెర్రివాడు ఎవరు?" అని అడిగారు. తరువాత బాబా రేగేను చూపుతూ, "ఇతన్ని చూడండి. ఇతనికి ఎవరినైనా వెంట తీసుకొస్తేగానీ తృప్తిలేదు" అంటూ అవస్తే తనతోపాటు ప్రయాణమయ్యేవరకు తాను కూడా శిరిడీ వెళ్లకూడదనుకున్న రేగే మనసులోని ఆలోచనను బాబా ప్రస్తావించారు. ఇంకా, "వాళ్ళు నా బిడ్డలను రైల్లోంచి దింపివేయాలని చూశారు. కానీ నేను ఆ సైనికాధికారితో, 'వీళ్ళు నా బిడ్డలు. వాళ్ళను నా వద్దకు రానివ్వు’ అని చెప్పాను” అన్నారు. మరల రేగేను చూపుతూ, “నాకు రాత్రంతా నిద్ర లేదు. నా పడకచుట్టూ ‘బాబా’, ‘బాబా’ అన్న ఇతడి కేకలే!” అన్నారు. ఈ మాటల ద్వారా బాబా తమ బిడ్డలను ఎల్లవేళలా కనిపెట్టుకుని ఉంటామని, భక్తివిశ్వాసాలతో వారు చేసే ప్రయత్నాలకు అనుకూలంగా వ్యక్తుల మనస్సులను ప్రభావితం చేసేందుకు తమ సర్వశక్తులను వినియోగిస్తామని తెలియజేశారు.
1914లో ఒకసారి రేగే దంపతులు బాబా దర్శనానికి శిరిడీ వెళ్ళారు. అప్పుడు శ్రీమతి రేగే గర్భవతిగా ఉంది. బాబా రేగేను చూడగానే, “నా వరప్రసాదమొకటి మీ వద్దకొచ్చింది" అని అన్నారు. ఆయన చెప్పినది తనకు పుట్టబోయే బిడ్డ గురించేనని రేగే గ్రహించాడు. కొంతకాలానికి శ్రీమతి రేగే ఒక బిడ్డకు జన్మనిచ్చింది. తరువాత రేగే తన బిడ్డను బాబా దర్శనానికి తీసుకుని వెళ్ళాడు. బాబా ప్రేమగా ఆ బిడ్డను ముద్దాడి, “ఈ బిడ్డ నీవాడా? నావాడా?" అని రేగేను అడిగారు. అందుకతను, “మీవాడే బాబా” అన్నాడు. “అయితే వీడిని నావాడిగా నీకు అప్పగిస్తున్నాను, అలానే చూసుకో” అన్నారు బాబా. వారి భావమేమో ఎవరికీ అర్థం కాలేదు. ఒకటిన్నర సంవత్సరం గడిచాక ఆ బిడ్డకు న్యుమోనియా వచ్చింది. వైద్యులు ప్రమాదం తప్పిందని తలచిన సమయంలో అకస్మాత్తుగా బిడ్డకు ప్రమాదించసాగింది. రేగే వెంటనే బిడ్డని పూజగదిలోకి తీసుకువెళ్ళి, బాబా పటం ముందు కూర్చుని, “బాబా, ఈ బిడ్డ మీవాడు. కనుక బిడ్డను తీసుకుని మీలో అతడికి ఆత్మశాంతిని ప్రసాదించండి. స్థూలంగా ఇతడు జన్మించడానికి నిమిత్తమాత్రుడనైనందుకు ఇతడి కర్మను నేను తీసుకుంటాను" అని ప్రార్థించాడు. తర్వాత అతను బిడ్డ తలపై తన చేయి పెట్టగానే, బిడ్డ ఎంతో ఆనందంగా చిరునవ్వొలికించాడు. తక్షణమే మాడు బుసగొట్టిన శబ్దంతో లోపలికి పీల్చుకుపోయినట్లయి బిడ్డ ప్రాణం విడిచాడు. అంటే, బిడ్డ మహాయోగివలె తన బ్రహ్మరంధ్రం గుండా ప్రాణం విడిచాడన్నమాట.
కొద్దినెలల తర్వాత రేగే శిరిడీ వెళ్ళినపుడు బాబా అతనిని చూపిస్తూ ఒక భక్తునితో, “ఇతడెవరు? ఎక్కడుంటాడు?" అన్నారు. ఆ భక్తుడు, “ఇతడు రేగే, ఇండోర్ లో ఉంటాడు" అన్నాడు. బాబా, “కాదు, నువ్వు చెప్పింది సరిగాదు. అతడెప్పుడూ ఇక్కడే ఉంటాడు. నేనెప్పుడూ ఇతని చెంతనే ఉంటాను" అని, మళ్ళీ “ఇతనికి బిడ్డలెవరైనా ఉన్నారా?" అన్నారు. అక్కడున్న భక్తులు, “లేరు బాబా, అతనికున్న ఒక్క బిడ్డా ఇటీవలే చనిపోయాడు” అన్నారు. వెంటనే బాబా, “చనిపోవడమా! కాదు కాదు. ఏం జరిగిందో నేను చెబుతాను. ఆ బిడ్డ నావాడు. ఇతడు నా బిడ్డను పెంచడం మాత్రమే జరిగింది. ఒకరోజు ఇతడు, 'ఈ బిడ్డను శాశ్వతంగా మీవద్దనే ఉంచుకోండి, అతని కర్మను నేననుభవిస్తాను' అన్నాడు. కనుక నేనా బిడ్డను తీసుకుని ఇక్కడ ఉంచుకొన్నాను" అంటూ తమ హృదయం కేసి చూపించి, ''అతడిక్కడే శాశ్వతంగా ఉంటాడు" అన్నారు. అంటే, బాబా ఆ బిడ్డకు మోక్షమనుగ్రహించారన్నమాట. ఈలోగా రేగేకు మమకారం చుట్టుకోకుండా జరుగనున్న దానిని తగురీతిన నిగూఢంగా హెచ్చరించారు బాబా. అలా తమను అంతగా ఆశ్రయించుకున్న రేగే హృదయాన్ని సర్వబంధాల నుండి రక్షించుకుంటూ వచ్చారు బాబా.
బహుశా 1915వ సంవత్సరంలో రేగే శ్రీరామనవమి ఉత్సవాలకు శిరిడీ వెళ్లదలిచాడు. బాబాకు సమర్పించడానికి ఏదైనా కానుక తీసుకుని వెళ్లాలని తలచి అతను ఇండోర్ లోని బట్టల బజారుకు వెళ్ళాడు. అక్కడ ఒకచోట చందేర్ లో తయారైన ఢాకా మస్లిన్ వస్త్రం అతన్ని అమితంగా ఆకర్షించింది. అది 5 అడుగులు చదరంగా ఉండి, చుట్టూ 8 నుంచి 9 అంగుళాల జరీ అంచు అల్లికతో ఎంతో నాజూకుగా ఉంది. అది అతనికి ఎంతగానో నచ్చడంతో 85 రూపాయలు చెల్లించి దాన్ని తీసుకున్నాడు. అదెంత నాజూకుగా ఉందంటే, దానిని మడిచి 6X6X6 అంగుళాల చిన్న ప్యాకెట్లో పెడితే చక్కగా అందులో ఇమిడిపోయింది. అతడు దానిని తీసుకుని శిరిడీ వెళ్ళాడు. దానిని తన చొక్కాలోపల దాచుకుని మసీదుకి వెళ్ళాడు. సాధారణంగా భక్తులు బాబాకు కానుకలు సమర్పించి, వాటిని తిరిగి బాబా ఆశీస్సులతో పొందాలని ఆశించేవారు. కానీ రేగే బాబాపై తనకున్న ప్రేమను ఆయన గుర్తిస్తే(అంటే తనకి, వారికి భేదం లేదన్న తన అభిప్రాయాన్ని గుర్తించినట్లైతే), తానిచ్చిన కానుకను తిరిగి ఇవ్వకుండా ఆయనే ఉంచుకుని ధరించాలని అనుకున్నాడు. భక్తులందరూ తాము తెచ్చిన వస్త్రాలను, శాలువాలను బాబాపై కప్పేవారు. ఆఖరున సేవకులు "ఇది ఎవరిది?" అని అడిగి ఎవరిది వాళ్ళకి ఇచ్చేసేవారు. రేగే బాబాకు నమస్కరిస్తూ, తన వస్త్రాన్ని తనకు తిరిగి ఇవ్వకూడదనే ఉద్దేశ్యంతో చాకచక్యంగా తన ప్యాకెట్టును బాబా గద్దె క్రింద దాచిపెట్టాడు. భక్తులందరూ సమర్పించిన కానుకలు ఎవరివి వారికి తిరిగి ఇవ్వబడ్డాయి. కానీ గద్దెక్రింద రేగే దాచిపెట్టిన ప్యాకెట్టును ఎవరూ గమనించలేదు. అప్పుడు బాబా లేచి నిలబడి, "గద్దెను తీసి దులిపి శుభ్రం చేయండి" అని ఆదేశించారు. గద్దెను తీసినప్పుడు మస్లిన్ వస్త్రమున్న ప్యాకెట్ కనిపించింది. బాబా దానిని తమ చేతిలోకి తీసుకుని, “ఏమిటిది? మస్లినా!” అంటూ దాని మడతలు విప్పి, “నేను దీనిని తిరిగి ఇవ్వను. ఇది నాది” అని అన్నారు. తరువాత దానిని కప్పుకుని రేగే వైపు చూస్తూ, “ఇది కప్పుకుంటే నేను చాలా అందంగా ఉన్నాను కదూ!” అని అడిగారు. బాబా ప్రేమతో తన కానుకను స్వీకరించినందుకు అతను అమితానందభరితుడయ్యాడు. తన అంతరంగంలో బాబా కొలువై ఉన్నారని, వారు తననుండి వేరుకాదని అతను గ్రహించాడు.
Source: http://www.saiamrithadhara.com/mahabhakthas/m.b.rege.html
http://bonjanrao.blogspot.com/2012/10/j-u-s-t-i-c-e-m-b-r-e-g-e.html
Devotees' Experiences of Sri Sai Baba Sri.B.V.Narasimha Swamiji
om sai ram nice to read this leelas.we are knowing lifes of sai devotees.very good
ReplyDeleteOm Sai
ReplyDeleteSri Sai
Jaya Jaya Sai
🙏🙏🙏
🙏🌷🙏ధన్యోస్మి గురుదేవ🙏🌷🙏
ReplyDeleteOm Sai ram
ReplyDeleteOm Sai Ram 🙏🌹🙏
ReplyDeleteఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏
ఓం సాయిరాం...🌹🙏🏻🌹
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDeleteOn sai ram, anta bagundi andaru bagunde la chayandi tandri pls, anni badyatalu me meede unchuthunnanu tandri.
ReplyDeleteOm sai ram, anta bagundi andaru bagunde la chayandi tandri pls, anni badyatalu me meede unchuthunnanu tandri.
ReplyDeleteOm sai ram, baba naaku manchi arogyanni prasadinchandi baba pls, nanna naatho matlade la chayandi aa samasya ni vadilesi, na manasuki Nachakunda yedi jaragakunda chudandi baba pls, ofce lo situations anni bagunde la chayandi tandri pls. Andaru arogyam ga kshamam ga unde la chayandi tandri pls.
ReplyDelete