సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

అబ్దుల్ కరీంఖాన్



శ్రీసాయిబాబా సంగీత ప్రియులు. ఆయన స్వయంగా తమ కాళ్ళకు గజ్జెలు కట్టుకొని సంత్ తుకారాం, సంత్ కబీర్ వంటి మహాత్ములు రచించిన గీతాలను, అరబ్బీ గేయాలను ఎంతో శ్రావ్యంగా పాడుతూ మనోహరంగా నృత్యం చేసేవారు. బాబా సంగీత ప్రియత్వాన్ని తెలిపే ఒక సన్నివేశం ఇది. ఇందులో లీల, చమత్కారము గోచరించకపోయినా ఇది శ్రీసాయి చరిత్రలోని ఒక ముఖ్య సన్నివేశం.
ఇప్పుడు వివరింపబోయే ఈ అనుభవం తన గానమాధుర్యంతో బాబాను ఆనందపారవశ్యంలో ముంచెత్తిన శ్రీమొరంఖాన్ సాహెబ్ అలియాస్ అబ్దుల్ కరీంఖాన్ అనే ఒక ప్రముఖ సంగీతకారునిది. అతను ఉత్తరప్రదేశ్‌లోని కైరానా గ్రామంలో 1872, నవంబరు 11న జన్మించాడు. వారిది కైరానాలోని సున్నీ సంప్రదాయక కుటుంబం. చిస్తీ సూఫీ సన్యాసులంటే వాళ్ళకు ఎంతో గౌరవభావం. ముఖ్యంగా మధ్య ఆసియా గుండా ప్రయాణం సాగించి రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్‌ ప్రాంతంలో స్థిరపడిన పర్షియన్ సన్యాసి మొయినుద్దీన్ చిస్తీ పట్ల వారికెంతో గౌరవాదరములు. అబ్దుల్ కరీంకు ఇద్దరు తమ్ముళ్ళు, ఒక చెల్లెలు ఉన్నారు. వారు చిన్నతనంనుంచే తమ తండ్రి కాలేఖాన్ వద్ద సంగీతాన్ని అభ్యసించారు. వారంతా తమ జీవితాలను ఆధ్యాత్మిక సూఫీ జానపద సంగీత కళాకారులుగా, సారంగి వాయిద్యకారులుగా ప్రారంభించి తరతరాలుగా వస్తున్న సంగీతాన్ని వృద్ధిలోకి తెచ్చారు.

శ్రీకరీంఖాన్ విద్యాధికుడు, గొప్ప సంగీత విద్వాంసుడు. అతని పాట విన్నవారు బ్రహ్మానందభరితులయ్యేవారు. ఆ మాధుర్యంలో అతను కూడా తాదాత్మ్యం చెందేవాడు. అతనికి పూనాలో ఒక సంగీత పాఠశాల వుండేది. అతను అనేక సంగీత కచేరీలు చేసి ఘన సత్కారాలను పొందాడు. అమల్‌నేరుకి చెందిన శ్రీఅమర్ ప్రతాప్ సేఠ్ ఆహ్వానం మేరకు శ్రీఖాన్‌సాహెబ్ వారి ఇంట రెండుసార్లు కచేరి చేసి అందరి మన్ననలు పొందాడు. 1914లో మూడవసారి కచేరి ఏర్పాటు చేసినప్పుడు ఆ కార్యక్రమానికి హాజరైన శ్రీబాపూసాహెబ్ బూటీ మొదలైన ప్రముఖ సాయిభక్తులు అతనిని శిరిడీ వచ్చి శ్రీసాయిబాబా దర్బారులో కచేరి నిర్వహిస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు.

సహజంగానే సాధుసత్పురుషులపట్ల గౌరవభావమున్న ఖాన్‌సాహెబ్ శిరిడీ వెళ్లి బాబాను దర్శించి, వారికి ప్రణామాలు అర్పించుకోవాలని అనుకున్నాడు. అంతే, అతను మిగిలివున్న తన తదుపరి కార్యక్రమాలను వాయిదా వేసుకొని తన బృందంతో శిరిడీ వెళ్ళాడు. వారంతా తాత్యాకోతేపాటిల్ ఇంటిలో బసచేశారు. సాయంకాలవేళ సాధారణంగా బాబా దర్బారులో భజన జరిగే సమయంలో ఖాన్‌సాహెబ్ కచేరి ఏర్పాటు చేశాడు శ్రీబూటీ. మసీదులో ఒక ప్రక్కగా ఖాన్‌సాహెబ్ బృందమంతా కూర్చొనగా అతను వెళ్లి బాబా దర్శనం చేసుకున్నాడు. తొలి దర్శనంలోనే అతనికి బాబా ఒక అసాధారణ సత్పురుషులన్న భావన కలిగింది. బాబా అతనిని ఆశీర్వదించి కుశలప్రశ్నలు అడిగిన తరువాత తుకారాం వ్రాసిన ఒక మరాఠీ అభంగాన్ని పాడమన్నారు. అతను బాబాకు నమస్కరించి సుస్వరంగా క్రింది అభంగాన్ని ఆలపించాడు.

'హేచి దాన్ దేగా దేవా
తుఝా విసార్ న వ్హావా

గుణ్ గాయీన్ ఆవడీ
హేచి మాఝీ సర్వ జోడీ

న లగే ముక్తి ఆణి సంపదా
సంత్‌సంగ్ దేయీ సదా

తుకామ్హణే గర్భవాసీ
సుఖే ఘాలవే అహ్మాసీ'  

భావం: ‘దేవా! నేను ఎన్నటికీ నిన్ను మరువకుండా ఉండే వరాన్ని ప్రసాదించండి. ప్రేమతో మీ గుణగానాన్ని చేసే భాగ్యాన్ని ప్రసాదించండి. నేను మోక్షాన్నిగానీ, ధనాన్నిగానీ, శ్రేయస్సునుగానీ కోరను. నాకు ఎల్లప్పుడూ సత్పురుషుల సాంగత్యాన్ని అనుగ్రహించండి. అలా అయితేనే మళ్ళీ మళ్ళీ నన్ను ఈ భువికి పంపండి’ అని తుకారాం వేడుకుంటున్నాడు.

ఖాన్‌సాహెబ్‌ పాడుతున్నంతసేపు బాబా కనులు మూసుకొని తన్మయత్వంతో ఎంతో శ్రద్ధగా ఆలకించారు. పాట పూర్తయ్యాక కనులు తెరచి, "ఎంత చక్కగా పాడావు! ప్రసాదించకుండా ఉండటం సాధ్యపడనిదానినే కోరాడు తుకారాం" అని అన్నారు బాబా. ఆరోజు ఆరతి ఆలస్యంగా జరిగింది. తర్వాత ఖాన్‌సాహెబ్‌తో బాబా, "శిరిడీ విడిచి వెళ్ళడానికి తొందరపడకు. నీ కుటుంబం గురించి ఆందోళన చెందకు. అంతా బాగుంటుంది" అని అన్నారు. తరువాత బాబా తాత్యా వైపు తిరిగి, "వీరికి రాజలాంఛనాలతో ఆతిథ్యమివ్వు!" అని అన్నారు.

మరుసటిరోజు ఖాన్‌సాహెబ్‌కి 'తన కూతురు గులాబ్‌కలి ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతిన్నదనీ, వెంటనే ఇంటికి రమ్మనీ' భార్య తారాబాయి వద్ద నుండి టెలిగ్రామ్ వచ్చింది. అతను ఆ టెలిగ్రామ్ తీసుకొని మసీదుకు వెళ్లి బాబా చేతిలో పెట్టాడు. అప్పుడు బాబా అతనికి అభయమిచ్చి, కుటుంబాన్ని శిరిడీకే పిలిపించమన్నారు. అతను బాబా ఆజ్ఞను శిరసావహించాడు. అతని భార్యాబిడ్డలు పది, పదిహేనుమందితో కలిసి శిరిడీ చేరుకున్నారు. మరణించడానికి సిద్ధంగా ఉన్న కూతురును తీసుకొచ్చి బాబా పాదాల చెంత పడుకోబెట్టాడు ఖాన్‌సాహెబ్‌. బాబా తమ చిలిం నుండి కొంత బూడిదను తీసి, దానిని బెల్లం మరియు నీళ్లతో కలిపి అతని కూతురి చేత త్రాగించారు. బాబా అనుగ్రహంతో రెండురోజుల్లో గులాబ్‌కలి కోలుకొని తన కాళ్ళమీద తాను నిలబడగలిగింది. ఖాన్‌సాహెబ్‌ బాబా కృపకు ఎంతగానో సంతోషించి, ఇతర భక్తులనడిగి బాబాకు ఇష్టమైన భజన గీతాల గురించి తెలుసుకొని, వాటిని నేర్చుకొని బాబా ముందు పాడాలని అనుకున్నాడు.

ఖాన్‌సాహెబ్ భార్య శ్రీమతి తారాబాయికి అప్పటివరకు తమకు, తమతోపాటు ఉన్న సుమారు ఇరవైమందికి వండిపెడుతున్న తాత్యా కుటుంబానికి పనులలో సహాయం చేయాలనిపించి శ్రీమతి తాత్యాపాటిల్‌తో, "వంటపనిలో, ఇంటిపనులలో సహాయం చేస్తాన"ని అడిగింది. అందుకు శ్రీమతి పాటిల్ ఆమెతో, "మీకు అలా అనిపించడం సబబే. కానీ మీ అవసరాలు చూసుకోమని బాబా మమ్మల్ని ఆదేశించారు. కాబట్టి మీరు ఏమి తినాలనుకుంటున్నారో అది మాత్రం చెప్పండి, నేను వాటిని చేసిపెడతాను" అని చెప్పింది. ఇక చేసేదిలేక తారాబాయి మౌనంగా ఉండిపోయింది. 

ఏడవరోజు రాత్రి బాబా సమక్షంలో తారాబాయి కొన్ని భజన గీతాలు పాడింది. బాబాతోపాటు అక్కడున్న అందరూ ఎంతో సంతోషించారు. చివరిగా ఆమె ‘ఘాలీన లోటాంగణ’ అనే గీతం పాడి, ఇంటికి తిరిగి వెళ్ళడానికి బాబాను అనుమతి అడిగింది. కానీ బాబా అనుమతినివ్వలేదు. దాంతో, పూనాలో ఉన్న తన సంగీత పాఠశాల గురించి ఖాన్‌సాహెబ్ ఆందోళన చెందుతుంటే బాబా అతనికి అభయమిచ్చారు. పదవరోజున బాబా "రేపు మీరు వెళ్లొచ్చు" అని వాళ్ళకు తిరుగు ప్రయాణానికి అనుమతినిస్తూ, "మీరు వెళ్ళడానికి చాలా ఆతురతగా ఉన్నారు. కానీ పూణే వెళ్లొద్దు. వరహద్ వెళ్ళండి. అక్కడ ప్రత్తిపంట పూర్తిగా పూతకొచ్చింది" అని అన్నారు. అప్పుడు ఖాన్‌సాహెబ్ సంతోషంగా చివరిసారి బాబా సమక్షంలో కొన్ని భజన గీతాలు ఆలపించాడు. ముఖ్యంగా బాబాకి ఇష్టమైనవి.

అతను, 'జే కా రంజలే గాంగలే, త్యాసీ మ్హణే జో ఆపులే' అనే గీతాన్ని, బాబాకు ఎంతో ఇష్టమైన అభంగం - 'ఇస్ తన్ ధన్ కీ కౌన్ బడాయి, దేఖత్ నయనోఁ మే మాటీ మిలాయీ', కానడ రాగంలో "ఆవుర్ పాకుడ్ కామ్! మై లలోనీ అప్నీ రామ్ కో", "కాయా కైసీ దియా" అనే గీతాన్ని పీలు రాగంలోనూ మరియు 'జోగియా' అనే భజన గీతాన్ని శ్రావ్యంగా ఆలపించాడు. రాత్రి ఒంటిగంట దాటాక బాబా అతని గానాన్ని ఆపించి, ప్రేమగా అతని వెన్ను నిమిరి, ఆపై అతని తలమీద తమ అమృతహస్తాన్ని ఉంచి ఆశీర్వదిస్తూ ఒక వెండినాణేన్ని అతనికిచ్చి, "దీన్ని ఖర్చుపెట్టుకోక ఎల్లప్పుడూ నీ జేబులో ఉంచుకో" అని అన్నారు. తరువాత అతని భార్య శ్రీమతి తారాబాయికి బాబా ఐదు రూపాయలిచ్చి, "వీటిని నీ పెట్టెలో భద్రపరుచుకో" అని చెప్పారు. ఆ తరువాత బాబా ఆమె ఒడిలో చాలా పేడాలు వేశారు. పెద్దలు లేదా గురువులు ఒడి నింపడం మహారాష్ట్రలో సంప్రదాయం. దానిని గొప్ప ఆశీర్వాదంగా భావిస్తారు. ఇంకా 12 రొట్టెలు, వెన్న, తెల్ల ఉల్లి చట్నీ శ్రీమతి తాత్యాపాటిల్ చేత వాళ్ళకు ఇప్పించారు బాబా. ఆ రీతిన బాబా శ్రీఖాన్‌సాహెబ్‌ను, అతని కుటుంబాన్ని ఆదరించి, సత్కరించి పంపారు.

10 comments:

  1. Om Sri Sai Ram ��������

    ReplyDelete
  2. Om sai ram baba mamalini kapadu thandri

    ReplyDelete
  3. Om Samardha Sadguru Sree sai Nadhaya Namaha 😊❤🙏🕉🕉🕉🕉🕉

    ReplyDelete
  4. Ohm sainathaya namah🙏🙏🙏🌹🌹🙌

    ReplyDelete
  5. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete
  6. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo