సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1639వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. హృదయపూర్వకమైన ప్రార్థనలకు సహాయం అందించిన బాబా
2. ప్రతిసారీ అండగా ఉండే బాబా

హృదయపూర్వకమైన ప్రార్థనలకు సహాయం అందించిన బాబా

నా పేరు మల్లికార్జునరావు. మాది వైజాగ్. నా భార్య బాబా భక్తురాలైనప్పటికీ ఇటీవల కాలం వరకు నేను బాబాని నమ్మేవాడిని కాదు. ఈమధ్యనే బాబాని నమ్మడం మొదలుపెట్టి మనసులో ఏ కోరిక లేకుండా ఆయన్ని ప్రార్థిస్తున్నాను. 2023, జూలైలో ఒక ముఖ్యమైన ఆఫీసు పని విషయంగా నేను రాంచీ వెళ్లాల్సి వచ్చింది. రాంచీలోని నా గమ్యస్థానానికి ఉదయం 11 గంటలకల్లా చేరుకోవాల్సి ఉన్నందున నేను ముందుగా ఉదయం 7 గంటలకి వైజాగ్‌లో విమానం ఎక్కి హైదరాబాదు చేరుకొని, అక్కడ 9 గంటలకున్న రాంచీ వెళ్ళే విమానాన్ని అందుకోవాలని అనుకున్నాను. అయితే నా ట్రావెల్ సలహాదారుడు, "హైదరాబాద్‌లో విమానం దిగి, తదుపరి విమానం ఎక్కడానికి మధ్య కనీసం 2 గంటల వ్యవధి ఉండాలి. కాబట్టి ముందురోజే వైజాగ్ నుండి బయలుదేరి హైదరాబాదు చేరుకోమ"ని సలహా ఇచ్చాడు. కానీ నేను తనని బలవంతపెట్టి నేను అనుకున్నట్లు అదేరోజు వైజాగ్ నుండి బయలుదేరేలా టిక్కెట్లు బుక్ చేయమని చెప్పాను. తన అలాగే చేసాడు. దురదృష్టవశాత్తూ నేను ప్రయాణమయ్యే రోజు భారీ వర్షం కురవడంతో వైజాగ్ నుండి విమానం 40 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరింది. దాంతో నేను హైదరాబాదులో విమానం అందుతుందనే ఆశ పూర్తిగా కోల్పోయాను. అయితే అది చాలా ముఖ్యమైన బిజినెస్ మీటింగు. నేను ఆ మీటింగ్‌కి హాజరుకాకపోతే నా కంపెనీకి సమస్యలు వచ్చే అవకాశం ఉండటంతోపాటు కంపెనీలో నా విశ్వసనీయతపై ప్రభావం పడే అవకాశముంది. అందువల్ల నేను హృదయపూర్వకంగా, "నాకు సహాయం చేయమ"ని బాబాను ప్రార్థించాను. ఆ సమయంలో బాబాపై ప్రగాఢ విశ్వాసం తప్ప నా మనసులో ఏమీ లేదు. బాబా దయవల్ల నేను హైదరాబాదులో ఉదయం 8:40కి విమానం దిగాను. తదుపరి నేను ఎక్కాల్సిన విమానం 9 గంటలకే ఉన్నందున ఆలస్యం చేయకుండా వెళ్లి సెక్యూరిటీ చెకప్ పూర్తి చేసుకొని బోర్డింగ్ గేట్ దగ్గరకి వెళ్ళాను. ఆశ్చర్యం! విమానం ఇంకా బయలుదేరలేదు. సంతోషంగా వెళ్లి విమానం ఎక్కాను. రాంచీలోని నా గమ్యస్థానానికి చేరుకొని మీటింగ్‌కి హాజరై నా పని పూర్తి చేసుకొని వచ్చాను. ఇంతకాలం నేను బాబా మహిమల గురించి పట్టించుకోలేదుగానీ నా ఈ అనుభవం ద్వారా బాబా మన చుట్టూ ఉన్నారని, హృదయపూర్వకమైన మన ప్రార్థనలను వింటారని, భక్తులకు సహాయం చేస్తారని హృదయపూర్వకంగా విశ్వసిస్తున్నాను.


ప్రతిసారీ అండగా ఉండే బాబా

సాయిభక్తులందరికీ నమస్కారం. నేను ఒక సాయిభక్తురాలిని.  2005లో బాబా నాకు పరిచయమయ్యారు. అప్పటినుండి నేను బాబాని నమ్ముతున్నాను. 2023, మేలో నాకు మెడ భాగంలో థైరాయిడ్ గడ్డ అయింది. డాక్టర్ దగ్గరకి వెళితే, "తప్పనిసరిగా సర్జరీ చేయాలి" అన్నారు. నాకు భయమేసి, "బాబా! ఏదో ఒకటి చేసి సర్జరీ లేకుండా గడ్డ తగ్గేటట్లు చూడు" అని వేడుకొని రోజూ గడ్డపై ఊదీ రాసి, మరికొంత ఊదీ నీళ్లలో కలుపుకొని త్రాగుతూ ఉండేదాన్ని. ఇలా రోజులు గడుస్తుండగా 2023, జూలైలో ఒకరోజు నేను సర్జరీ చేయించుకోడానికి హాస్పిటల్‌కి వెళ్ళాను. అప్పుడు అక్కడ నాకు  బాబా ఫోటో దర్శనమిచ్చింది. అంతకు ముందు నేను రెండుసార్లు ఆ హాస్పిటల్‌కి వెళ్ళాను కానీ, ప్పుడెప్పుడు నేను ఆ ఫోటోను అక్కడ చూడలేదు. వెంటనే నేను బాబాని, "నిజంగా నువ్వు నా దగ్గర ఉంటే ఇంకోసారి కనిపించు బాబా" అని అడిగాను. తరువాత నా పక్కనున్న అమ్మాయి మొబైల్లో బాబా నాకు కనిపించారు. బాబా దయవల్ల సర్జరీ మంచిగా జరిగింది. కానీ తర్వాత నాకు విపరీతమైన దగ్గు రావడం మొదలైంది. అప్పుడు నేను, 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అనే మంత్రం జపించుకున్నాను. రాత్రికల్లా దగ్గు కొంచంగా తగ్గడం మొదలై రెండురోజుల్లో పూర్తిగా తగ్గింది. దగ్గు తగ్గుతూనే నన్ను హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేసారు. హాస్పిటల్ నుండి మా ఇంటికి వెళ్లాలంటే 25 కి.మీ దూరం ప్రయాణం చేయాల్సి ఉండగా దారిలో మా ఇంటికి 5 కిలోమీటర్ల దూరంలో ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల నేను బాబాని, "ఆ చోట ట్రాఫిక్ లేకుండా ఉండేలా చూడమ"ని వేడుకున్నాను. సరిగ్గా ట్రాఫిక్ మొదలయ్యే చోటుకు మేము చేరుకునేసరికి పెద్ద వర్షం వచ్చి చాలా వాహనాలు ఎక్కడివి అక్కడే అగిపోయాయి. దాంతో మేము ట్రాఫిక్‌తో ఇబ్బంది పడకుండా ఇంటికి వచ్చేసాము. సర్జరీకి ముందు డాక్టర్లు 15 రోజులలో నాకు నయమవుతుందని చెప్తే నాకు నమ్మబుద్ధికాక వాళ్ళు అలాగే చెప్తారని, "బాబా! నిజంగా 15 రోజులలో నాకు నయమైతే నా అనుభవాలు బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. బాబా దయవల్ల నిజంగానే నాకు 15 రోజులలో నయమైంది. "ధన్యవాదాలు బాబా. ప్రతిసారీ నాకు ఇంత అండగా ఉండే మీరు ఒక పెద్ద విషయంలో మాత్రం నా కోరిక తీర్చడం లేదు. అది కూడా త్వరగా జరిగేలా అనుగ్రహించండి బాబా".


సాయిభక్తుల అనుభవమాలిక 1638వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబానే దిక్కు
2. సాయి కృప

బాబానే దిక్కు

సాయిబంధువులకు నా నమస్కారాలు. నా పేరు కుమారి. మా అన్నయ్యవాళ్ల పాపకి పుట్టినప్పటినుండి ఆరోగ్యం బాగాలేదు. తరచూ తనకి చాలా ఆరోగ్య సమస్యలు వస్తూ ఉండేవి. గత సంవత్సరంలో ఒకరోజు హఠాత్తుగా తనకి జ్వరం వచ్చి, దాంతోపాటు ఫీట్స్ వచ్చాయి. దాదాపు 30 నిముషాల వరకు తను స్పృహలో లేదు. తనని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాముకానీ, ఆరోజు ఆదివారం అవ్వడం వల్ల  డాక్టర్లు లేరు. అయినప్పటికీ పాపని అడ్మిట్ చేసుకొని నర్స్ చికిత్స చేసింది. తరువాత డాక్టరు వచ్చి, పాపని చూసి, "బ్లడ్ ఇన్ఫెక్షన్ అయింది. ఒక ఐదు రోజులు హాస్పిటల్లో ఉండాల"ని చెప్పారు. ఒకరోజు అంతా పాపని ఐసీయూలో ఉంచారు. మా అన్నయ్య దగ్గర డబ్బులు లేక అప్పు చేసి మరీ ట్రీట్మెంట్ చేయించసాగాడు. బ్లడ్ టెస్ట్ వ్రాస్తే, టెస్టు చేయించాము. రిపోర్టులో ప్రాబ్లం ఏమీ లేదని వచ్చింది. దాంతో ఫీట్స్ వచ్చిన కారణంగా బ్రెయిన్లో ప్రాబ్లం ఉందేమోనని బ్రెయిన్ స్కాన్ వ్రాశారు. అప్పుడు మా అందరికీ భయమేసింది. నేను, "చిన్నపిల్ల బాబా. తన బాధ చూడలేకపోతున్నాను" అని నా బాధంతా బాబాతో చెప్పుకున్నాను. తర్వాత బాబా  మీద భారమేసి బ్రెయిన్ స్కాన్ చేయించారు. బాబా దయవల్ల రిపోర్టు నార్మల్ వచ్చింది. బాబాకి ధన్యవాదాలు చెప్పుకొని, "హాస్పిటల్ బిల్ కట్టడం అన్నయ్యవాళ్లకి కష్టంగా ఉంది బాబా. తొందరగా పాపని ఇంటికి పంపేలా చూడండి. మీ దయతో తను బాగుండాలి బాబా" అని బాబాకి చెప్పుకున్నాను. రెండు రోజుల తర్వాత డాక్టరు, "మళ్లీ టెస్టు చెందాం. రిపోర్టులు నార్మల్ వస్తే ఇంటికి పంపిస్తాం" అన్నారు. నేను, "బాబా! టెస్టు రిపోర్టు నార్మల్ రావాలి. పాపని ఇంటికి పంపించాలి" అని బాబాకి చెప్పుకున్నాను. బాబా దయవల్ల ఆరోజు సాయంత్రం నార్మల్ అని రిపోర్టులు వచ్చాయి. డాక్టరు, "రేపు ఉదయం పంపిస్తాం" అన్నారు. మరుసటిరోజు గురువారం కావడంతో నాకు చాలా సంతోషంగా అనిపించింది. కానీ హాస్పిటల్ బిల్ కట్టడానికి డబ్బులు లేవు. బిల్ కడితేనే పాపని ఇంటికి పంపిస్తారు. మాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ సమయంలో నేను, "ప్లీజ్ బాబా, ఈరోజు ఎలాగైనా ఇంటికి వెళ్ళాలి. డబ్బు సర్దుబాటు అయ్యేలా చేయండి సాయి" అని బాబాని వేడుకున్నాను. బాబా దయవల్ల సాయంత్రం వేరే వాళ్ళు డబ్బు ఇవ్వడంతో పాప ఇంటికి వచ్చేసింది. సాయిబాబాకి చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకున్నాను. "పాప ఆరోగ్యం బాగుండేలా మీరే చూసుకోవాలి బాబా. అమ్మ ఆరోగ్యం కూడా అస్సలు బాగుండట్లేదు. మీరే మాకు దిక్కు బాబా. నా కష్టం మీకు తెలుసు, సహాయం చేయండి బాబా. నాకు మీరు తప్ప ఎవరూ లేరు. నిన్ను నమ్మినవాళ్ళకి ఎప్పుడూ తోడుగా ఉండు బాబా".

ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!!


సాయి కృప

నేను ఒక సాయిభక్తురాలిని. సాయి కృపతో ఈమధ్య మావారికి మంచి ఉద్యోగం వచ్చింది. కానీ మావారు చిన్న విషయాలకే చిరాకు పడి ఉద్యోగం వదిలేస్తుంటారు. ఇంతకు ముందు అలా చాలాసార్లు జరిగింది. ఇప్పుడు సాయి దయతో మళ్ళీ కొత్త ఉద్యోగంలో చేరారు. కానీ ఏదో ఒక విషయంగా మానేస్తానంటారని భయపడ్డాను. నేను భయపడినట్లే ఆఫీసులో ఎవరో ఏదో అన్నారని ఉద్యోగం వదిలేస్తాననడం మళ్ళీ మొదలుపెట్టారు. నాకు చాలా అభద్రతగా అనిపించి, "బాబా! ఈ సమస్య ముగిసిపోయేలా చేయండి. ఆయన ప్రశాంతంగా ఉద్యోగం చేసేలా చూడండి" అని బాబాను ప్రార్థించాను. అంతే, రెండు రోజుల్లో మావారు నార్మల్ అయ్యారు. కానీ నాకు ఎప్పుడూ ఈ టెన్షన్ ఉంటుంది. "బాబా! దయచేసి నాకు సహాయం చేయండి". 

కొన్నాళ్ల క్రితం సర్జరీ అయిన నా కుడిచెవిలో ఈమద్య హఠాత్తుగా నొప్పి మొదలైంది. ఏవో ఇయర్ డ్రాప్స్ వేసుకున్నా 3 రోజులు వరకు తగ్గలేదు. ఇక అప్పుడు, "బాబా! నా చెవి నొప్పి తగ్గితే, మీ అనుగ్రహం బ్లాగు ద్వారా తోటి సాయి భక్తులతో పంచుకుంటాను" అని అనుకున్నాను. విచిత్రంగా అప్పటినుండి చెవినొప్పి పూర్తిగా తగ్గిపోయింది. "నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేసిన మీకు శతకోటి వందనాలు బాబా".


సాయిభక్తుల అనుభవమాలిక 1637వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. నమ్ముకున్న బిడ్డలకు ఏది సరైనదో బాబాకు తప్ప ఇంకెవరికి తెలుస్తుంది
2. ఐఐటి సీటు అనుగ్రహించిన బాబా

నమ్ముకున్న బిడ్డలకు ఏది సరైనదో బాబాకు తప్ప ఇంకెవరికి తెలుస్తుంది

ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!! సాయిభక్తులందరికీ నమస్కారములు. నా పేరు శ్రీలక్ష్మీ. సాయి నా జీవితంలో చేసిన అద్భుతాలు అనేకం. వాటిలో ఒకటి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మా బాబు పదవ తరగతిలో స్కూల్ ఫస్ట్ వచ్చాడు. తనకి ఐఐఐటి చదవాలని కోరిక. అది నాకు ఇష్టం లేదు. ఎందుకంటే, మాకు దూరంగా హాస్టల్లో ఉండి చదువుకోవాలి. అయినప్పటికీ వస్తే వస్తుంది, లేకపోతే లేదని మా బాబు ఐఐఐటికి అప్లై చేశాడు. తర్వాత ఐఐఐటి కాలేజీవాళ్ళు సెలెక్ట్ అయినవాళ్ల లిస్ట్ పెట్టినప్పుడు అందులో మాబాబు పేరు ఉందేమోనని చూస్తే, లేదు. దాంతో మా బాబు, 'నేను మామూలు కాలేజీలో చదవను' అని చాలా బాధపడ్డాడు. "నేను ఐఐఐటిలోనే చదువుతాన"ని పట్టుపట్టాడు. దాంతో మావారు తెలిసినవాళ్ళ ద్వారా అయిన వస్తుందేమోనని ప్రయత్నించసాగారు. నేను మా బాబు బాధ చూడలేక, "బాబా! మీ దయతో మా బాబుకి ఐఐఐటిలో సీటు వేస్తే, మీ అనుగ్రహాన్ని బ్లాగు ద్వారా తోటి సాయిభక్తులతో పంచుకుంటాన"ని సాయిని వేడుకున్నాను. అప్పుడు సాయిబాబా చేసిన అద్భుతం చూడండి!

నేను అలా వేడుకున్న వెంటనే మా బాబు ఫ్రెండ్,  'ఒంగోలు ఐఐఐటిలో సీటు వచ్చిందిగా' అని మెసేజ్ చేసాడు. మా బాబు తన ఫ్రెండ్‌కి సీటు వచ్చిందనుకొని కంగ్రాట్స్ అని విష్ చేశాడు. అందుకు ఆ అబ్బాయి, 'నీకు ఒంగోలు ఐఐఐటిలో సీటు వచ్చిందిగా, కాంగ్రాట్స్' అని విష్ చేస్తూ రిప్లై ఇచ్చాడు. మాకు అర్థం కాలేదు. మా బాబు, 'నాకు సీటు రాలేదు' అని తన ఫ్రెండ్‌తో చెప్పాడు. ఆ అబ్బాయి, 'నీకు సీటు వచ్చింది. నీ పేరు ఒంగోలు క్యాంపస్‌లో చూశాను' అని చెప్పాడు. అప్పుడు మేము మళ్లీ ఒంగోలు ఐఐఐటి క్యాంపస్‌లో వెతికితే మా బాబు పేరు ఉంది. అంతా ఆ సాయి లీలే. మా బాబు చాలా ఆనందపడ్డాడు. అయితే మాకు నూజివీడు క్యాంపస్ దగ్గర. అందువల్ల నేను సాయిని, "నూజివీడు క్యాంపస్‌లో వచ్చేలా దయ చూపండి బాబా" అని అనుకున్నాను. తర్వాత కాలేజీవాళ్ళు క్యాంపస్ చేంజ్ కోసం మెసేజ్ పెట్టారు. మా బాబు నూజివీడు క్యాంపస్‌కి అప్లై చేశాడు. కాని క్యాంపస్ చేంజ్ కాలేదు. మేము కొంత బాధపడినప్పటికీ తప్పనిసరై బాబుని ఒంగోలు క్యాంపస్‌లో జాయిన్ చేశాం. తరువాత నూజివీడు క్యాంపస్‌లో కన్నా ఒంగోలు క్యాంపస్‌లో చదువు బాగుందని తెలిసింది. అందుకే బాబా మా బాబు క్యాంపస్‌ మార్చలేదేమోనని అనిపించింది. ‌‌‍"ధన్యవాదాలు సాయిబాబా. మిమ్మల్నే నమ్ముకున్న మీ బిడ్డలకు ఏది సరైనదో మీకు తప్ప ఇంకెవరికి తెలుస్తుంది బాబా? మీకు శతకోటి వందనాలు. మీ చల్లని దీవెనలు మా అందరిపై ఎల్లప్పుడూ ఇలాగే ఉంచండి బాబా".


ఐఐటి సీటు అనుగ్రహించిన బాబా

అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజాథిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిందానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై!!!

సాయిబాబా పాదపద్మములకు నమస్కారాలు. నా పేరు రాంబాబు. మాది విజయవాడ. మా అబ్బాయి పేరు కృష్ణకౌశిక్. ఇంటర్ రెండవ సంవత్సరం పూర్తిచేసి JEE మెయిన్స్, JEE అడ్వాన్స్‌కు ప్రిపేరు అవుతున్నాడు. నేను ఎప్పుడైనా ఏదైనా పని చేయాలనుకుంటే బాబా ముందు చీటీలు వేసి అడిగి చేస్తాను. మా బాబు చదువు విషయంలో కూడా "బాబుకి ఐఐటి సీటు వస్తుందా బాబా?" అని అడిగి బాబా ఫోటో ముందు చీటీలు వేస్తే, 'వస్తుంది' అని వచ్చింది. నేను 'అదెలా సాధ్యం? బాబు యావరేజ్ స్టూడెంట్ కదా!' అని అనుకున్నాను. కానీ బాబాపై నమ్మకంతో వస్తుందని ఆశగా పరీక్షల వరకు ఎదురుచూసాను. బాబు పరీక్షలు రాసొచ్చి బాగా వ్రాసానని చెప్పాడు. తర్వాత వెలువడిన ఫలితాల్లో మా బాబుకి ఐఐటిలో సీటు వచ్చింది. నాకు తెలుసు, 'ఇది బాబా చేసిన అద్భుతమ'ని. 'ఇది ఆయన ప్రసాదించిన సీటు అని నేను గట్టిగా నమ్ముతున్నాను. "బాబా! ఒక నార్మల్ స్టూడెంట్‌కి ఐఐటిలో సీటు రావడం మీరు చేసిన అద్భుతం తండ్రీ. శతకోటి వందనాలు బాబా. తొందరగా శిరిడీ దర్శించే భాగ్యం మాకు కలిగించు తండ్రీ".


సాయిభక్తుల అనుభవమాలిక 1636వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

'సుపుత్ర ప్రాప్తిరస్తు' అని దీవించినట్లే పుత్రుణ్ణి ప్రసాదించిన సాయి


శ్రీ సాయినాథునికి నా సాష్టాంగ నమస్కారాలు. నేను ఒక సాయిభక్తురాలిని. నేను చిన్న వయసులో ఉన్నప్పటినుండే మా ఇంట్లో సాయిని పూజిస్తుండేవాళ్లు. అందువల్ల సాయి గురించి నాకు చిన్నతనం నుండి తెలుసు. ఆ వయసు నుండే నేను సాయిని నమ్ముకుంటున్నాను. నాకు 2018లో వివాహమైంది. వివాహమైన 8నెలలకి నాకు PCOS సమస్య ఉందని తెలిసి నేను చాలా బాధపడ్డాను. ఆరోజు నుంచి నేను పిల్లల కోసం బాబానే నమ్ముకున్నాను. వేరే ఏ దేవుళ్ళకీ మొక్కలేదు. ఎందుకంటే, అన్ని రూపాలూ సాయివే అని నేను నమ్ముతాను. నేను హోమియోపతి మందులు వాడటం మొదలుపెట్టాను. కానీ నేను 5 సంవత్సరాల వరకు నేను గర్భవతిని కాలేదు. ఇక అప్పుడు నేను అల్లోపతి వైద్యం చేయించుకుందామని హాస్పిటల్‌కి వెళ్లడం మొదలుపెట్టాను. ఒక నెలరోజులకు మా అన్నయ్య నన్ను గురుచరిత్ర చదవమని చెప్పాడు. సరేనని నేను గురుచరిత్ర పారాయణ మొదలుపెట్టాను. మూడవరోజు నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో నేను మా స్నేహితులతో కలిసి శ్రీశైలంలో ఉన్నాను. అక్కడ నేనొక చోట మెట్ల మీద కూర్చుని ఉండగా నా పక్కన ఒక ముస్లిం పండితుడు కూర్చుని ఏవో మంత్రాలు చదవసాగాడు. నేను భయపడి అక్కడ నుంచి లేవబోయాను. ఇంతలో పక్కన ఒక పూజారి కనిపించి, "లేవకు, లేవకు, అక్కడే కూర్చో!" అని చెప్పారు. నేను అలాగే కదలకుండా కూర్చున్నాను. ఇంతలో ఆ ముస్లిం పండితుడు ఒక బ్రాహ్మణుని రూపంలోకి మారి నన్ను చూసి, 'సుపుత్ర ప్రాప్తిరస్తు!' అని దీవించి, "నువ్వు ఒక్కటి అడిగావు. నేను మూడు ఇస్తున్నాను" అని లేచి అక్కడనుంచి బయటకి వెళ్ళారు. బయటకి వెళ్ళగానే ఆయన రూపం మరల మారిపోయింది. ఈసారి ఆయన ఎర్రబట్టలు ధరించి ఉన్నారు, ముఖాన పెద్ద బొట్టు ఉంది. అప్పుడు ఆయన ఏదో అన్నారు(కానీ నాకు అది గుర్తులేదు). అంతటితో ఆ కల ముగిసింది. నేను నిద్రలేచాక కలలో కనిపించిన ఆ ముస్లిం పండితుడు ఖచ్చితంగా సాయే అని నాకు అనిపించింది. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలనంటే, ఆ ముస్లిం పండితుడు ఒక బ్రాహ్మణ పూజారిలా మారిపోయారు. అలా అన్ని మతాల సంప్రదాయాలను తనలో ఇముడ్చుకున్నది మన సాయి మాత్రమే. కనుక వారు ఖచ్చితంగా మన సాయే. అప్పుడు నేను ఎంత ఆనందపడ్డానో మాటల్లో చెప్పలేను.

సరిగ్గా ఆ కల వచ్చిన 6 నెలలకి నేను అల్లోపతి మందులు వాడటం మొదలుపెట్టి 7 నెలల పూర్తైంది. నాకు ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టరు అమెరికా వెళ్లడంతో 8వ నెల ట్రీట్మెంట్ ఆగిపోయింది. సరిగ్గా అప్పుడే తెలిసిన ఒకరి శిరిడీ ప్రయాణం రద్దు అయితే వాళ్ల స్థానంలో నాకు అనుకోకుండా శిరిడీ వెళ్లే అవకాశం వచ్చింది. అప్పటికే నాకు నెలసరి రావాలి, కానీ రాలేదు. శిరిడీ వెళ్లొచ్చాక డాక్టరు దగ్గరకి వెళదామని శిరిడీ వెళ్లి, వచ్చిన వెంటనే హాస్పిటల్‌కి వెళదామని బయలుదేరాను. ఇంటినుంచి బయటకు వెళ్ళగానే మా ఇంటి ఎదురుగా ఉన్న ఆంజనేయస్వామి గుడి వద్ద బాబా పల్లకి కనిపించింది(సాధారణంగా ఆ సమయంలో పల్లకి రాదు). బాబా పల్లకిని చూడగానే నా మనసుకెందుకో హాస్పటల్లో మంచి వార్త వినబోతున్నాననిపించింది. బాబానే నా మనసుకి అలా అనిపించేట్టు చేశారని ఖచ్చితమైన నా నమ్మకం. సరే, నేను హాస్పిటల్‌కి వెళ్ళాక డాక్టర్ టెస్ట్ చేసి నేను గర్భవతినని నిర్ధారించారు. ఆశ్చర్యమేమిటంటే నేను ట్రీట్మెంట్ తీసుకున్న 7 నెలలు నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాలేదు. 8వ నెలలో శిరిడీ వెళ్లి రాగానే కన్ఫర్మ్ అయింది. అంతా బాబా అనుగ్రహం.

5 నెలలో బాబా, మాస్టరుగారు నాకు ఆపరేషన్ చేస్తునట్టు కల వచ్చింది. 8వ నెల చివరిలో డాక్టరు స్కాన్ చేసి నాకు ఉమ్మనీరు తక్కువగా ఉందని చెప్పి, పెరగడానికి ఏదో మెడిసిన్ పాకెట్లు ఇచ్చారు. నేను చాలా భయపడి బాబాను శరణువేడాను. ఆ తర్వాత 3 వారాలకి డాక్టర్ చెక్ చేసి అప్పటికప్పుడే ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఆరోజు అనుకోకుండా గురువారం(2023, జూన్ 15) అయింది. ఆపరేషన్ థియేటర్‌‌లో బాబా ఫోటో దర్శనమిచ్చింది. బాబాని చూడగానే నేను ఆయన్ని స్మరించుకుని నమస్కారం చేసుకున్నాను. ఆపరేషన్ అంతా ప్రశాంతంగా జరిగి నాకు బాబు పుట్టాడు. ఇదంతా కేవలం బాబా అనుగ్రహం వల్లనే సాధ్యమైంది. బాబాను నమ్ముకుంటే మనకి ఏది మంచిదో తప్పకుండా చేస్తారు. కలలో, 'సుపుత్ర ప్రాప్తిరస్తు!' అని దీవించి, "నువ్వు ఒకటి అడిగితే నేను మూడు ఇస్తున్నాను" అన్న బాబా నేను కోరుకున్న సంతానాన్ని అనుగ్రహించి బాబు రూపంలో ఒకటి ఇచ్చారు, మిగతా రెండు ఏమి ఇస్తారో అని ఎదురుచూస్తున్నాను. బాబా వాటిని అనుగ్రహించిన వెంటనే ఆయన అనుగ్రహాన్ని మరల బ్లాగులో పంచుకుంటాను. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


శ్రీనానాసాహెబ్ చందోర్కర్ - మూడవభాగం



ఒకసారి బాబా సద్గురువు యొక్క బాధ్యత గురించి నానాసాహెబ్ చందోర్కర్‌తో ఇలా చెప్పారు, "ఈ రోజుల్లో చాలామంది గురువులుగా మారాలని ఆరాటపడుతున్నారు. కానీ గురువు యొక్క బాధ్యత భారమైనది. గురువు తన శిష్యుడు మోక్షం పొందేవరకు ప్రతి జన్మలో అతనిని అనుసరిస్తూ చివరికి అతన్ని విముక్తుణ్ణి చేయాలి. కేవలం సలహా ఇవ్వడంతో ఎవరూ గురువులు కాలేరు. నేర్చుకున్న దానితో పుష్కలంగా ఉపన్యాసాలు ఇచ్చే వివేకవంతులైన పండితులు చాలామంది ఉన్నారు. అంతమాత్రంతో వాళ్ళు ఆధ్యాత్మిక గురువులుగా మారలేరు. నిజమైన గురువు తన శిష్యుడికి విషయాన్ని బోధించడంతో తృప్తి చెందక, అతడా విషయాన్ని ఎలా ఆచరిస్తున్నాడో జాగ్రత్తగా గమనిస్తుంటాడు. అంతేకాదు, అడుగడుగునా ప్రోత్సహిస్తూ, అవసరమైనప్పుడు సరిదిద్దుతూ, సరైన మార్గంలో నడిపిస్తూ జన్మ జన్మలందు అతని పురోగతిని పర్యవేక్షిస్తాడు" అని. ఈ కారణంగానే సర్వజ్ఞుడైన సాయిబాబా పూర్వజన్మలలో తమతో ఋణానుబంధాన్ని కలిగి ఉన్న వారినందరినీ వివిధ మిషల ద్వారా తమ వైపుకు ఆకర్షించి వారి ఆధ్యాత్మిక పురోగతి విషయంలో శ్రద్ధ వహిస్తున్నారు. ఆయన తమకు శరణాగతి చెంది పూర్తిగా తమపై ఆధారపడే వారి అన్నీ వ్యవహారాల(చిన్న చిన్న విషయాలతో సహా) పట్ల బాధ్యత వహిస్తారని చాలామంది నేటి భక్తులకు కూడా తెలుసు. బాబా యొక్క ఆ శ్రద్ధ, రక్షణ మరియు అన్నీ సమకూర్చడం శరణాగతి చెందడానికి కారణాలు మాత్రమే కాకుండా, శరణాగతి పథంలో కొనసాగడానికి మరియు వారిలో ఐక్యం చెందే దిశగా నడిపించడానికి చాలా ముఖ్యమైన అంశాలు. కాబట్టి బాబా నానాను తమ చెంతకు రప్పించుకొని అతనిపట్ల శ్రద్ధ వహించి ప్రాపంచికంగా అవసరమైన సహాయాన్ని, రక్షణను అందించి తమపట్ల అతనికి విశ్వాసాన్ని స్థిరపరచి తమకు శరణాగతి చెందేలా చేసారు. కానీ కేవలం ప్రాపంచికంగా రక్షణనివ్వడం మాత్రమే సరిపోదు. బాబా పని అతని ఆత్మను రక్షించడం మరియు దాని లక్ష్యాన్ని చేరుకునేలా శిక్షణ ఇవ్వడం. అందువల్ల ప్రాపంచిక విషయాలలో సైతం బాబా జోక్యం, వారి సహాయం చాలా మంచి ఆధ్యాత్మిక ప్రభావాన్ని కలిగి ఉంటాయి. సరే, బాబా ప్రతి చిన్న సందర్భాన్ని ఉపయోగించుకొని నానాకి ఎలా పారమార్థిక ప్రయోజనాన్ని చేకూర్చారో చూద్దాం.


నానాసాహెబ్ చందోర్కర్ చాలా గౌరవప్రదమైన వ్యక్తి. అతనికి పెళ్ళై పిల్లలున్నారు. అతను తన కుటుంబ సంప్రదాయాలను కొనసాగించాల్సిన ఉన్నత స్థానంలో ఉన్నాడు. అతని చదువు, సంస్కారం అతనికి ఆత్మ సంయమనం(ఆత్మ నిగ్రహం), సక్రమ ప్రవర్తన వంటి ఉత్తమ గుణాలు అందించాయి. అతను చాలా చక్కని నడవడి కలిగి ఉండేవాడు. సాధారణంగా చెప్పబడే కామప్రవృత్తి, అసభ్యకరమైన ప్రవర్తన వంటివి లేని వ్యక్తి. అయితే, 'ఎంత గొప్పవారైనా ఎప్పుడో ఒకప్పుడు తప్పు చేయక మానరు' అని ఒక నానుడి. ఒకానొక సందర్భంలో మహల్సాపతి, నానాసాహెబ్, మరికొంతమంది ఇతర భక్తులు మసీదులో బాబా చెంత కూర్చుని ఉన్నారు. ఆ సమయంలో వైజాపూర్‌కి చెందిన ఒక ముస్లిం ధనికుడు తన కుటుంబంతో బాబా దర్శనానికి వచ్చాడు. వాళ్ళు వెంటనే మసీదు మెట్లెక్కి బాబా దర్శనం చేసుకోకుండా కొద్ది దూరంలో నిలబడి, ‘బాబా చెంతనున్న భక్తులు ఎప్పుడు వెళ్ళిపోతారా?’ అని ఎదురు చూడసాగారు. కారణం అతనితో వచ్చిన ఇద్దరు స్త్రీలు బాబా పాదాలపై తమ శిరస్సు ఉంచి నమస్కరించేటప్పుడు తమ బురఖాలు తొలగిస్తే, ఆ సమయంలో తమ ముఖాలను అక్కడున్న హిందువులు చూస్తారని సందేహించారు. వాళ్ల ఇబ్బందిని గ్రహించిన నానా లేచి వెళ్ళిపోబోయాడు. కానీ బాబా అతన్ని వెనక్కి లాగి కూర్చోబెట్టి, "వాళ్ళకి రావాలనుంటే వాళ్ళే వస్తారు. నువ్వు ఇక్కడి నుండి లేచి వెళ్లాల్సిన పని లేదు" అని అన్నారు. దాంతో హిందూ భక్తులు అక్కడ ఉంటుండగానే వాళ్ళు మసీదు మెట్లెక్కి బాబా దర్శనం చేసుకోవాల్సి వచ్చింది. ముందుగా వాళ్ళలో పెద్ద ఆమె తన ముసుగు తొలగించి బాబా దర్శనం చేసుకుంది. అప్పుడు ఏమీ జరగలేదు. తర్వాత చిన్న ఆమె ముసుగు తొలగించి బాబా దర్శనం చేసుకుంది. ఆమె ముఖం చాలా అందంగా వుంది. మెరిసే కనులు, ముఖంలో తేజస్సు, అన్నీ సరైన పాలలో ఉన్న ముఖాకృతి, మొత్తానికి వర్ణింపశక్యంకానీ ఆమె ముఖ సౌందర్యానికి అక్కడున్న అందరూ క్షణకాలం మైమరచిపోయారు. నానాసాహెబ్‌కి తన చూపును ఆమె మీద నుండి మరల్చడానికి చాలా కష్టంగా అనిపించింది. అదే సమయంలో చుట్టూ ఉన్నవారు తనని గమనిస్తారేమోనన్న తత్తరపాటు, అదీకాక బాబా సమక్షంలో ఇలాంటివి తగదని అతను చాలా ఇబ్బందిపడ్డాడు. అయినప్పటికీ అతని కళ్ళు మళ్లీ మళ్లీ ఆ స్త్రీ వైపే మళ్ళసాగాయి. ఇంతలో ఆమె బాబాను దర్శించుకోవడం పూర్తై తిరిగి బురఖా వేసుకుంది. నానా మదిలో, 'ఈ దివ్య సౌందర్యాన్ని చూసే అవకాశం మరోసారి లభిస్తుందా?' అని ఒక ఆలోచన లేచింది. వెంటనే బాబా అతని తొడపై చరిచారు. అతను సిగ్గుతో తలవంచుకున్నాడు. ఆ స్త్రీలు అక్కడ నుంచి వెళ్లిపోయిన తర్వాత బాబా అతనిని, "నేను నిన్ను ఎందుకు కొట్టానో తెలుసా?" అని అడిగారు. నానా తన ఆలోచనలు నీచంగా ఉన్నాయని, మీ సాంగత్యంలో ఉన్నవారికి అటువంటివి తగవని అంగీకరిస్తూ, "మీ పక్కనుండగా నా మనసుని అటువంటి నీచమైన ఆలోచనలు ఎలా కుదిపేశాయి" అని అడిగాడు. దానికి బాబా, "ఎంతైనా నువ్వు మానవుడివి. శరీరం కోరికలతో నిండి ఉంటుంది. ఇంద్రియ విషయాలు సమీపించినప్పుడు అవి చెలరేగుతాయి" అని ఆపై, "రంగురంగుల బాహ్య సౌందర్యంతో కూడిన అందమైన దేవాలయాలెన్ని లేవు? మనం ఆ దేవాలయాలకి వెళ్ళినపుడు బాహ్య సౌందర్యాన్నా, లోనున్న దైవాన్నా ఆరాధిస్తాం? లోనున్న దైవాన్ని చూస్తున్నపుడు ఆలయం యొక్క బాహ్య సౌందర్యాన్ని పట్టించుకుంటామా? దైవం ఆలయాలలో మాత్రమే లేడని గుర్తుంచుకో. ఆయన ప్రతి ప్రాణిలోనూ ఉన్నాడు. కాబట్టి నువ్వు ఒక అందమైన ముఖాన్ని చూసినప్పుడు అది ఒక ఆలయమని, అందంగా ఉన్నా, వికారంగా ఉన్నా లోనున్న జీవాత్మ(విశ్వాత్మ అంశ) భగవంతుని ప్రతిరూపమని గుర్తుంచుకో. ఈ రూపాలు భగవంతుని ఆవిష్కరిస్తాయి. అందాన్ని ఆరాధించడంలో తప్పు లేదు, కానీ ఆ అందాన్ని చూసిన వెంటనే 'ఈ రూపం ఇంత అందంగా ఉంటే, అందులో ఉంటూ దాన్ని సృష్టించిన భగవంతుడు ఇంకెంత అందంగా ఉంటాడు? ఆయన ఎంత గొప్పవాడు?' అన్న ఆలోచన రావాలి. అలా ఆలోచిస్తే ఇకపై నువ్వు బాహ్యమైన ముఖ సౌందర్యానికి మోహపూరితుడవు కావు" అని చెప్పారు. ఇది నానాకిచ్చిన ఉపదేశమే అయిన అతని మనస్సు చాలా స్వచ్ఛమైనది. అతను బాబా మార్గదర్శకత్వంలో స్త్రీ రూపాల పట్ల చాలా గౌరవాన్ని పెంచుకున్నాడు. ఎంతలా అంటే తలుపులు మూసి ఉన్న గదిలో, ఒక అందమైన యువతితో ఏకాంతంగా ఉన్నప్పటికీ స్త్రీపట్ల గౌరవం నిలుపుకొనేంతగా, కనీసం కామంతో కూడిన ఆలోచనలు కూడా లేనంతగా. అందుకు నిదర్శనం ఈక్రింది బన్నుమాయి దర్శన ఉదంతం.

సహజంగానే నానాసాహెబ్ దైవభక్తి గలవాడు. బాబా సాంగత్యంలో అతను మరింత ఎదిగాడు. అతను సాధు, సత్పురుషుల దర్శనం కోసం తపించేవాడు. అహ్మద్‌నగర్ నుండి 50 మైళ్ళ దూరంలో ఉన్న బోడెగావ్ గ్రామంలో బన్నుమాయి అనే 20 ఏళ్ల ముస్లిం యువతి ఉండేది. ఆమె జీవన విధానం మామూలు మనుషుల్లా ఉండేది కాదు. గొప్ప సౌందర్యవతి అయిన ఆమె నిండు యవ్వనంలో స్త్రీలు పాటించాల్సిన కనీస నియమనిబంధనలు పాటించక నగ్నంగా గ్రామం వెలుపల ఉన్న నల్లతుమ్మ, నాగజెముడు, బ్రహ్మజెముడు మొదలైన ముళ్లపొదల్లో సంచరిస్తూ, ఆ ముళ్ళు తన శరీరాన్ని గాయపరుస్తున్నా పట్టించుకోక అక్కడే నివాసం ఉంటుండేది. ఎప్పుడైనా తన తల్లిని చూసేందుకు గ్రామంలోకి వచ్చినా ఎంత తొందరగా గ్రామంలో కనిపించిందో, అంతే వేగంగా కనుమరుగయ్యేది. ఆమె తల్లితో సహా ఎక్కువమంది గ్రామస్థులు ఆమె పిచ్చిదని భావించేవారు. కొంతమంది మాత్రం ఆమె భగవదనుగ్రహం పొందిన అవధూత అని, జ్ఞాని అని గుర్తించారు. నానాసాహెబ్ అహ్మద్‌నగర్ జిల్లా కలెక్టర్ కార్యదర్శిగా ఉన్నప్పుడు ఆమె గురించి విని ఆ మహాసాధ్వి దర్శనం చేసుకోవాలని బలంగా అనుకున్నాడు. అతను శిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకొని తన కోరికను, అది నెరవేర్చుకోవడంలో ఉన్న ఇబ్బందులను బాబాకు విన్నవించి, వారి అనుమతి కోరాడు. అప్పుడు బాబా, "నానా! నువ్వు ఇప్పుడెందుకు ఇతరులు దర్శనం కోసం ఆరాటపడుతున్నావు? నీకు సమస్తమూ ఇక్కడ లేవా?" అని అన్నారు. కానీ అతను మొండి పట్టుపట్టాడు. చివరికి, "వెళ్ళు, నీకు ఆమె దర్శనమవుతుంది" అని అన్నారు బాబా.

నానాసాహెబ్ ఎక్కడికి వెళ్లినా అతని సహోద్యోగి ఖిర్విండికర్ ఎల్లప్పుడూ అతనితోపాటు ఉండేవాడు. నానా అతని ద్వారా ఒక గుడారం, కూర్చునేందుకు ఒక పీఠ, చీర, పసుపు - కుంకుమ, మంగళసూత్రం, స్నానానికి అవసరమైన వస్తువులు, ఆహార పదార్థాలు మొదలైనవన్నీ సమకూర్చి, తర్వాత ఇద్దరూ కలిసి బోడెగావ్‌కు ప్రయాణమయ్యారు. వాళ్ళు ముందుగా ఆ గ్రామంలోని గుడికి వెళ్లారు. అక్కడ విచారించగా బన్నుమాయి గ్రామం వెలుపలున్న అడవుల్లో ఉన్నట్లు తెలిసింది. వెంటనే నానాసాహెబ్ అక్కడికి వెళ్లి ఆమెకోసం వెతకడం ప్రారంభించాడు. అతని అన్వేషణ చాలాసేపు కొనసాగింది. అతని శరీరంలో ముళ్ళు గుచ్చుకున్నాయి. కానీ ఆమె ఆచూకీ మాత్రం తెలియలేదు. ఆమె గురించి ఎవరిని అడిగినా ఎవరూ ఏమీ చెప్పలేదు. పైగా కొంతమంది ‘ఒక యువ ఆఫీసరు ఎప్పుడూ నగ్నంగా సంచరించే ఒక స్త్రీ గురించి ఆరా తీస్తున్నాడ’ని అతనిపై ఆగ్రహించారు. నానా నిరుత్సాహపడి నిరాశతో మనసులో బాబాని తలుచుకొని, "నేను ఆమె దర్శనాన్ని పొందనట్లైతే, 'నాకు దర్శనమవుతుంద'ని చెప్పి మీరు నన్ను ఎందుకు మోసం చేశారు. ఏదేమైనా నాకు ఆమె దర్శనం అయ్యేంతవరకు నేను ఇక్కడి నుండి కదలను. మొండిగా ఇక్కడే ఉంటాను" అని ప్రార్థించి కళ్ళు తెరిచేసరికి ఎదురుగా రోడ్డు మీద బన్నుమాయీ నగ్నంగా నిలబడి ఉంది. ఆమెను చూడగానే అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అతను ఎటువంటి కామ ప్రలోభాలకు లోనుకాకుండా భక్తిభావంతో ఆమెకు సాష్టాంగ నమస్కారం చేశాడు. తర్వాత ఆమె శరీరానికి గుచ్చుకుని ఉన్న ముళ్ళను చూసి వాటిని తీయసాగాడు. కానీ ఆమె అదేమీ పట్టించుకోకుండా ఒక్క క్షణంలో లేచి సమీపంలో ఉన్న పొదల్లోకి వెళ్ళి అదృశ్యమైంది. దాంతో నానా మళ్ళీ కష్టంలో పడ్డాడు. ఎందుకంటే, ఆమె తాను ఏర్పాటు చేసిన గూఢారంలో స్నానం చేసి, ఆమెకోసం తెచ్చిన చీర, నగలు ధరించి, తాను పెట్టిన నైవేద్యం స్వీకరించాలన్నది అతని కోరిక. అలాంటిది ఆమె అలా హఠాత్తుగా వెళ్లిపోయేసరికి నానా తన ఆశలన్నీ వదులుకోబోయాడు. కానీ చివరి క్షణంలో తన మనసుని దృఢం చేసుకొని ఖిర్విండికర్‌ని, “ఇక్కడ ఒక గుడారం వేసి ఒక చిన్న గది ఏర్పాటు చేసి, బన్నుమాయి స్నానానికి అవసరమైన సన్నాహాలు చేయమ"ని చెప్పాడు. వెంటనే ఖిర్వాండికర్ పని ప్రారంభించాడు. గుడారం సిద్ధమయ్యాక తాము తెచ్చిన వస్తువులు ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నప్పుడు రవిక తీసుకురావడం మరిచిపోయానని అతను గుర్తించాడు. సరిగ్గా అప్పుడే ఒక వ్యక్తి అటుగా వస్తూ కనిపించాడు. ఖిర్విండికర్ అతనిని విచారిస్తే, అతనొక టైలర్‌ని, వారంవారం జరిగే సంతకి వెళ్లి వస్తున్నాడని తెలిసి తనకొక రవిక కావాలని అడిగాడు. అందుకు ఆ టైలర్ తన వద్ద ఒక రవిక ఉందని చెప్పి, దాన్ని ఖిర్విండికర్‌కి ఇచ్చాడు. దాంతో అతను అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాడు.

తర్వాత నానాసాహెబ్ బన్నుమాయి రాకకోసం ఎంతగానో ఎదురుచూసాడు. కానీ ఆమె రాలేదు. దాంతో నానా మరోసారి బాబాను ప్రార్థించి కనులు తెరిచి చూసేసరికి తాను ఏర్పాటు చేసిన గుడారంలో స్నానానికి సిద్ధంగా నిలబడి ఉన్న బన్నుమాయీ కనిపించింది. అతను సంతోషించి ఆమె శరీరానికి గుచ్చుకున్న ముళ్ళు తొలగించి, ఆచార పూర్వకంగా ఆమెకి స్నానం చేసి, ఆమె జుట్టు దువ్వి, నూనె రాసి, చీర, రవిక, మంగళసూత్రం ధరింపజేసి, కుంకుమ బొట్టు పెట్టాడు.  తర్వాత ఆమెకు పూజ చేసి, ఆమె చేతిలో నైవేద్యం ఉంచి, దక్షిణ సమర్పించి ఆమె ముందు వంగి నమస్కారం చేశాడు. వెంటనే ఆమె చీర, రవిక, మంగళసూత్రం అన్ని తీసి, అక్కడ విసిరేసి పొదలలోకి వెళ్లి అదృశ్యమైంది. ఇక్కడ జరిగినదంతా చాలా వేగంగా గ్రామంలో వ్యాపించింది. విషయం బన్నుమాయి తల్లికి కూడా చేరింది. ఆమె ఆగ్రహంతో పరుగున నానాసాహెబ్ వద్దకు వచ్చి నా కూతురితో అసభ్యంగా ప్రవర్తించావంటూ అతనిని నిందించడం మొదలుపెట్టింది. నానా తన శాయశక్తులా మొత్తం విషయాన్ని వివరించి చెప్పే ప్రయత్నం చేసాడుగాని ఆమె వినిపించుకోవడానికి సిద్ధంగా లేదు. చివరిగా నానా బన్నుమాయి పూజకోసం తెచ్చిన వస్తువులన్నీ ఆమెకు అప్పగించాడు. వాటిని చూసాక ఆమె విషయం అర్థం చేసుకొని శాంతించింది. కానీ జరిగిన పరిణామాలతో నానాసాహెబ్, ఖిర్విండికర్ మనసులు పాడైపోగా విచారంగా గ్రామంలోని గుడికి తిరిగి వెళ్లారు. వాళ్ళు ఆ రాత్రికి ఆ గుడిలోనే విశ్రమించారు. మరుసటిరోజు తెల్లవారుజామున వాళ్ళు తిరుగు ప్రయాణమవ్వాల్సి ఉండగా నానా, 'తాము బయలుదేరడానికి ముందు బన్నుమాయి మరోసారి దర్శనమిస్తే, అది తనకు ప్రత్యేక ఆశీర్వాదమ'ని తన మనసులో అనుకున్నాడు. తెల్లవారుజామున సుమారు 4-5 గంటల ప్రాంతంలో అతను నిద్ర లేచి చూసేసరికి తలుపులు మూసి ఉన్న గుడి లోపల, తన దిండు వద్ద బన్నుమాయి కూర్చొని దర్శనమిచ్చింది. అతను అమితానందభరితుడై పవిత్రాత్మురాలు, చాలా ఉచ్చస్థితిలో ఉన్న సిద్దురాలైన ఆమె పాదాలపై తన శిరస్సు ఉంచి నమస్కరించాడు. వెంటనే ఆమె అక్కడినుండి పరుగున వెళ్ళిపోయింది. నానాసాహెబ్ తాను కోరికున్నప్పుడల్లా బాబా తనకు ఆమె దర్శనాన్ని అనుగ్రహిస్తున్నారని గుర్తించి ఎంతో ఆనందించాడు. వాస్తవాలలో లోకి వెళితే, బన్నుమాయి ఆ రాత్రి నిద్రపోవడానికి తన తల్లి వద్దకు వచ్చింది. ఆమె తల్లి తెల్లారి లేచేసరికి బన్నుమాయి లేకపోవడంతో తన కూతురుకోసం పలుచోట్ల వెతుకుతూ చివరికి గుడి వద్దకు చేరుకొని విషయం తెలుసుకుంది. విశాల హృదయుడైన నానా ఆమెను తగిన విధంగా సత్కరించి, తిరిగి నగర్‌కు బయలుదేరాడు. ఈ ఉదంతం నానా సాధ్యమైనంతవరకు కామవాంఛను జయించాడనడానికి చాలా మంచి నిదర్శనం.

పంచభూతాలు(గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం) మహాత్ముల నియంత్రణలో ఉంటాయి. బాబా ఎప్పటికప్పుడు ఈ విషయాన్ని నిరూపించారు. ఒకసారి భాగ్‌చంద్‌ మార్వాడీతో బాబా, "అరే, పరుగున వెళ్ళు! నీ పొలంలోని గడ్డివాముకి నిప్పు అంటుకుంది" అన్నారు. వెంటనే భాగ్‌చంద్‌ మార్వాడీ అక్కడికి పరుగున వెళ్లి చూస్తే నిజంగానే తన గడ్డివాముకి నిప్పు అంటుకుని ఉంది. ఎంత ప్రయత్నించినా మంటలను ఆర్పడం అతని వల్ల కాలేదు. ఇంతలో బాబా స్వయంగా అక్కడికి వచ్చారు. ఆయన గాలిలో తమ చేతులు ఆడిస్తూ కొన్ని సైగలు చేసారు. దానితో మంటలు ఆరిపోయాయి. ఆరోజు సాయంత్రం నానాసాహెబ్ చందోర్కర్, మరికొంతమంది భక్తులతో కలిసి బాబా దర్శనార్థం మసీదుకు వచ్చి వారి ముందు సాష్టాంగ నమస్కారం చేసాడు. అప్పుడు బాబా, "నానా! కొంతమంది ఎంత స్వార్థపూరితమైనవారో చూసావా? నేను అతనిని అప్రమత్తం చేయడమే కాకుండా, స్వయంగా వెళ్లి అతని గడ్డివాముకి అంటుకున్న మంటలు ఆర్పి అతనికి జరగబోయే నష్టాన్ని తగ్గించాను. కానీ, అతడు ఇంకనూ, ‘నాదొక గడ్డివాము ధ్వంసం అయిపోయింది, నేను నష్టానికి గురయ్యాను’ అని నన్ను నిందిస్తున్నాడు, జరిగిన నష్టానికి అదే పనిగా ఏడుస్తున్నాడు. లాభనష్టాలు, చావుపుట్టుకలు దైవాధీనాలు. ఈ  విషయాన్ని ప్రజలు ఎలా మరచిపోతారు? 'ఇది నాది - అది నాది' అని చెప్పడంలో ఏమిటి అర్ధం? ఆ గడ్డివాము మార్వాడీదని ఎలా చెప్పవచ్చు? అది గడ్డేకాని అతని శరీరం కూడా కాదు కదా! వాస్తవానికి అది ఎండిన గడ్డికి చెందినది. అది విత్తనాల నుండి సృష్టించబడింది. విత్తనాలు నేలలో నాటుకుంటాయి, మేఘాల నుండి నీరు వచ్చింది, సూర్యరశ్మి వలన పెరిగి పెద్దవయ్యాయి. అంటే భూమి, వర్షం, ఎండల వలన ఆ విత్తనాలు నేలలో నాటుకొని ఎదిగాయి. ఈ మూడు ఆ ఎండుగడ్డి యొక్క నిజమైన యజమానులు. మరి ఈ వ్యక్తి తానే యజమానినని చెప్పుకుంటున్నాడు. నానా! కనీసం నువ్వైనా అతనికి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించు. ఇంతకుముందెప్పుడూ తనది కాని దానిని తనదిగా భావించి అనవసరంగా నష్టం గురించి శోకిస్తూ ఉన్నాడు. భగవంతుడు ఒక చేతితో ఇస్తాడు, మరో చేతితో తీసుకుంటాడు. అందుకే, మనం ఆనందం, బాధలను అనుభవిస్తున్నాము. కానీ, అతను ఇది గ్రహించటం లేదు. ఇది అతని అజ్ఞానం కాదా?" అని అన్నారు. తర్వాత బాబా మార్వాడీ వైపు తిరిగి, "శేట్, వెళ్ళు! ఊదీ తీసుకొని ఇంటికి వెళ్లి ప్రశాంతంగా కూర్చో! కొన్ని ఇతర వాణిజ్య లావాదేవీలలో నీవు డబ్బు సంపాదిస్తావు. దానితో నీ నష్టం పూడుకుంటుంది. చింతించకు" అన్నారు.


మరో సందర్భంలో నానాసాహెబ్ శిరిడీలో బాబా సన్నిధిలో గడుపుతున్నాడు. అప్పుడొకరోజు ఉదయం నానా కలెక్టరును కలవడానికి కోపర్గాఁవ్ వెళ్ళాలనుకున్నాడు. అయితే అతను బయలుదేరేముందు సెలవు తీసుకోవడానికి బాబా వద్దకు వెళితే, "రేపు వెళ్ళు" అన్నారు బాబా. అంటే అప్పుడు వెళ్ళడానికి బాబా అతనికి అనుమతిని ఇవ్వలేదు. నానా కంటే తక్కువ విశ్వాసం ఉన్న వాళ్ళు బాబా మాటను పెడచెవిని పెట్టి బయలదేరేవాళ్ళు. కానీ నానాకి బాబా మీద పూర్తి విశ్వాసం, ఫలితంగా ఇంకో రోజు బాబాతో గడిపే ప్రయోజనం పొందాడు. అతను ఆరోజు శిరిడీలో గడిపి మరుసటిరోజు సెలవు తీసుకోవడానికి బాబా వద్దకు వెళ్ళాడు. అప్పుడు బాబా, "నువ్వు ఇప్పుడు వెళ్లి కలెక్టరుని కలుసుకో" అని అన్నారు. నానా బాబాకు ప్రణామాలర్పించి కోపర్గాఁవ్ వెళ్ళాడు. అతను అక్కడికి చేరాక కార్యాలయ సిబ్బందిని "నిన్న ఏం జరిగింది?" అని విచారించాడు. అప్పుడు వాళ్ళు, "ఈరోజు రావడం లేదు. రేపు వస్తానని కలెక్టరు టెలిగ్రాం పంపారు" అని చెప్పారు. ఆ టెలిగ్రాం కాపీ ఏం బాబాకు చేరలేదు. కానీ వారు తమ అంతర్ జ్ఞానంతో కలెక్టరు రావడం మరుసటిరోజుకు వాయిదా పడిందని తెలుసుకొని నానాకు తన గురువుతో ఇంకొక రోజు సమయం గడిపే ప్రయోజనాన్ని ఇచ్చారు. ఈ విధంగా అత్యంత ముఖ్యమైన అధికారిక విషయాలలో కూడా నానా విశ్వాసం బాబా మాటలను పాటించేలా చేసి ప్రాపంచికంగా మరియు ఆధ్యాత్మికంగా చాలా ప్రయోజనకారి అయింది.

source: లైఫ్ ఆఫ్ సాయిబాబా(రచన: శ్రీబి.వి.నరసింహస్వామి)
 సాయిలీల మ్యాగజైన్స్  - 1986 మరియు 2009.
సాయిబాబా(రచన: శ్రీసాయి శరణానంద)

బాబాస్ వాణి, బాబాస్ అనురాగ్(రచన: విన్నీ చిట్లురి).


 

 


ముందు భాగం కోసం
బాబా పాదుకలు తాకండి.




 

నిర్ధిష్టమైన భాగం కోసం పైన నెంబర్లను తాకితే, ఆ నెంబరుకి సంబంధించిన భాగం ఓపెన్ అవుతుంది.

 


తరువాయి భాగం కోసం
బాబా పాదాలు తాకండి.

 



సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo