సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

శ్రీనానాసాహెబ్ చందోర్కర్ - రెండవభాగం



బాబా పలు సందర్భాల్లో తామే దైవమని, అంటే దేవుణ్ణి తెలుసుకున్నామని(ఆత్మసాక్షాత్కారం పొందామని) లేదా తమ వ్యక్తిత్వాన్ని నిరాకార బ్రహ్మంలో మాత్రమే కాకుండా హరి, లక్ష్మీనారాయణుడు మొదలైన వివిధ పేర్లతో పిలవబడే దేవతామూర్తులలో విలీనం చేశామని చెప్పారు. ఆయన, "మై అల్లాహు", "నేను లక్ష్మీనారాయణుడ"ను మొదలైన పర్యాయపదాలు తరచూ ఉపయోగించినప్పటికీ వారికి నామ రూపాలతో ప్రమేయం లేకుండా దైవమంటే ఒక్కడే(మనలో చాలామంది నామరూపాలు బట్టి భగవంతునిలో భేదాలు గట్టిగా నమ్ముతాము). లక్ష్మీనారాయణుని గుణగణాలు, శక్తులు మొదలైనవి ఏమిటి? లక్ష్మీనారాయణుడు అంటే మహా విష్ణు రూపం లేదా నామమని అందరికీ తెలుసు. అయితే మహావిష్ణువు అంటే సృష్టి, లయ ఇతర అంశాలుగా ఉన్నప్పటికీ పరమేశ్వరుడు/పరబ్రహ్మం యొక్క రక్షణనిచ్చే అంశం. కాబట్టి, లక్ష్మీనారాయణునిగా బాబా అవతార కార్యం- భక్తులు ఏ పరిస్థితుల్లో, ఎక్కడున్నా సర్వవేళలా రక్షణనివ్వడం. బాబా పలు సందర్భాల్లో, "నన్ను ప్రేమించే వారిపై నా దృష్టి ఎప్పుడూ ఉంటుంది. మీరు ఏం చేసినా, ఎక్కడున్నా, మీరు చేసే ప్రతిదీ నాకు ఎప్పుడూ తెలుస్తుందని గుర్తుంచుకోండి", "ఎవరైతే నన్ను ధ్యానిస్తుంటారో, నా నామాన్ని స్మరిస్తూ, నా లీలలను గానం చేస్తుంటారో వారు నేనుగా మారిపోతారు, వారి కర్మ నశిస్తుంది. నేను ఎల్లప్పుడూ వారి చెంత నిలబడి ఉంటాను" అని చెప్పేవారు. ఇది దైవత్వం(సర్వజ్ఞత్వం, సర్వవ్యాపకత్వం, సర్వశక్తిమత్వం మరియు దయ)కాక ఇంకేమిటి?


గురువు ఆధ్వర్యంలో శిష్యుడు ఆధ్యాత్మికంగా పురోగతి చెందాలంటే ముందుగా అవసరమైనది విశ్వాసం. అయినా శిష్యుని అర్హతలు చెప్పడానికి మనం దాసబోధ లేదా ఇతర ప్రామాణిక రచనల అధ్యయనం చేయాల్సిన అవసరం లేదు. బాబా స్వయంగా ముఖ్యమైన అర్హతలని చెప్పిన లేదా నొక్కివక్కాణించిన వాటిని గమనిస్తే సరిపోతుంది. బాబా చెప్పిన అర్హతలలో మొట్టమొదటిది నిష్ఠ(పూర్ణ విశ్వాసం), రెండవది సబూరీ(సంతోషంతో కూడుకున్న సహనం). శిష్యుడు గురువు అన్ని దివ్యశక్తులు కలిగి ఉన్నారని, ముఖ్యంగా తనపట్ల ఆయనకు దివ్యకరుణ, ప్రేమలు ఉన్నాయన్న నమ్మకం పొందాలి. కాబట్టి బాబా నానాసాహెబ్‌ని పిలవడమే కాకుండా తమ దివ్య స్వభావం(దైవత్వం), అతనిపట్ల తమకున్న వ్యక్తిగత ఆసక్తి లేదా అతనితో తమకున్న అనుబంధాలతో అతనిని ఆకట్టుకొని అతని ఆధ్యాత్మిక ప్రయాణం సరైన రీతిలో మొదలయ్యేందుకు అవసరమైనదంతా చేయాల్సి వచ్చింది. 


ప్లేగు వ్యాధికి టీకా వేయించుకున్న అనుభవం తర్వాత, నానాసాహెబ్ బాబా సాధారణ ఫకీర్ కాదని, వారిలో ఏదో తెలియని ప్రత్యేక(తేజస్సు) ప్రకాశం ఉందని గ్రహించాడు. అందువల్ల అతనికి బాబాపై కాస్త విశ్వాసం కుదిరి తరచూ బాబా దర్శనార్థం శిరిడీ వెళ్లాలనే ఆలోచన మొదలై ప్రతి పదిహేను రోజులకు శిరిడీకి సమీపంలో విడిది చేసేటప్పుడు మరియు వీలైతే వారాంతాల్లో అతను బాబా వద్దకు వెళ్లి వారి సహవాసంలో గడుపుతుండేవాడు. క్రమంగా బాబా గొప్పతనం నానాకు అర్ధమైంది. బాబా చేసే అద్భుతాలను, వారి శక్తులను  చూసి అతను ముగ్ధుడయ్యాడు. అతనికి తెలియకనే బాబా అతని హృదయాన్ని తమ ఆధీనం చేసుకున్నారు. అతనికి బాబాపై విశ్వాసం స్థిరమైంది. ఆవిధంగా బాబా చందోర్కర్‌లో విశ్వాసం అనే విత్తనాన్ని నాటి ప్రేమపూర్వకమైన తమ సంరక్షణ, జాగురూకతలతో కూడుకున్న తాజా అనుభవాల ద్వారా ఆ మొక్కకు నిరంతరం నీరు పోస్తూ అతని ప్రాపంచిక, పారమార్థిక విషయాలలో ఎలా సహాయం చేసారో ఒక దాని తర్వాత ఒకటి చూద్దాం.


హరిశ్చంద్రగుట్టపై నానా దాహార్తిని తీర్చిన బాబా


మానవుని అవసరాల జాబితాలో అత్యంత సాధారణం మరియు స్వల్పం అయిన విషయాలు త్రాగడానికి నీరు, తినడానికి ఆహారం. కానీ అవే కొన్ని సందర్భాలలో అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంటాయి. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో నీరు లేదా ఆహారం అందితే అది దైవ సహాయంగా భావిస్తాం. అటువంటి సహాయాన్ని ఒక విచిత్రమైన పరిస్థితిలో బాబా నానాసాహెబ్‌కి చేసారు. సనాతన హిందువైన ఛందోర్కర్‌కి ఆధ్యాత్మిక భావాలు ఎక్కువగా ఉండేవి. దేవాలయాలు, అచటి దేవీ దేవతల దర్శనాల కోసం అతని మనసెప్పుడూ ఆరాటపడుతుండేది. అతను స్థూలకాయుడైనప్పటికీ కొండలు, గుట్టలపై ఉండే దేవాలయాలు సైతం దర్శించాలని ఆతృతపడేవాడు. శిరిడీ నుండి నలభై మైళ్ళ దూరంలో ఉన్న ప్రసిద్ధ హరిశ్చంద్రగఢ్ కొండపై ఒక దేవీ ఆలయం ఉంది. ఆ కొండ మరి ఎత్తుగా లేకపోయినప్పటికీ నిటారుగా, కిందనుంచి పైవరకు చెట్టుచేమ లేకుండా రాళ్లు రప్పలతో నిండి ఉంటుంది, జనసంచారం అస్సలు కనిపించదు, త్రాగడానికి నీరు, నిలువ నీడ ఉండవు. అటువంటి కొండెక్కి దైవ దర్శనం చేసుకోదలచి చందోర్కర్ వృత్తిరీత్యా అహ్మద్‌నగర్‌ కలెక్టర్ కార్యదర్శిగా ఉన్నప్పుడు తన కార్యాలయ సిబ్బందితో కలిసి మండువేసవిలో వెళ్లాలని అనుకున్నాడు. అతని సహోద్యోగులలో ఖిర్విండికర్(శేరిస్తదార్-గుమస్తా లేదా రిజిస్ట్రార్) చాలా మర్యాదస్తుడు, ఏదైనా ముక్కుసూటిగా చెప్పే వ్యక్తి. అతను, "నానాసాహెబ్! దయచేసి నేను ఇలా చెప్తున్నందుకు మన్నించండి! కానీ ఇవి వేసవి రోజులు. హరిశ్చంద్రగఢ్ నిటారైనా కొండ, అటువంటి కొండ ఎక్కడం చాలా ప్రయాసతో కూడుకున్నది. దారిలో చుక్క నీరు కూడా దొరకదు. అందువల్ల మన ప్రయాణం ప్రస్తుతానికి వాయిదా వేయడం మంచిదని నా సలహా" అని నానాసాహెబ్‌తో అన్నాడు. కానీ నానాసాహెబ్ అతను చెప్పిన దానికి ఒప్పుకోక ముందుగా అనుకున్న ప్రణాళిక ప్రకారమే హరిశ్చంద్రగఢ్ వెళ్లాలని నిర్ణయించుకొని ముందుగా అనుకున్న రోజున తన సహోద్యోగులతో కలిసి హరిశ్చంద్రగఢ్ వెళ్ళాడు. అందరూ కలిసి కొండ ఎక్కడం ప్రారంభించి ఎలాగోలా సగం కొండ ఎక్కేసరికి మధ్యాహ్నం అయింది. ఎండ తీవ్రతకి నానా గొంతు ఎండిపోయింది, ఇంకా అలసట వల్ల అతను ఒక్క అడుగు కూడా వేయలేని స్థితికి చేరుకున్నాడు. అతను పక్కనే ఉన్న ఖిర్విండికర్‌ను నీళ్లు కావాలని అడిగాడు. అతను, మిగితా సహోద్యోగులు సమీపంలో ఎక్కడైనా నీళ్లు దొరుకుతాయేమోనని చూసారుగాని దరిదాపుల్లో ఎక్కడా నీటి జాడ కనిపించలేదు. కనీసం నీళ్లు ఎక్కడ దొరుకుతాయో చెప్పే మనిషి జాడ కూడా కనపడలేదు. అప్పుడు ఖిర్విండికర్ నానాతో, "ఇదంతా రాళ్లు రప్పలు ఉన్న కొండ ప్రాంతం. సమీపంలో ఎక్కడా నీటి జాడ లేదు" అని అన్నాడు. మిగిలిన సహోద్యోగులు, "అక్కడక్కడ విశ్రాంతి తీసుకుంటూ నెమ్మదిగా కొండెక్కమ"ని అన్నారు. కానీ నానా, "నీరు తాగకుండా ఒక్క అడుగు అయినా ముందుకు వేసే శక్తి నాకు లేదు" అని అన్నాడు. ఖిర్విండికర్, "పోనీ, కిందకి దిగి పోదామా?" అని అన్నాడు. "అది కూడా నా వల్ల కాద"ని నానా పక్కనే ఉన్న ఒక బండ మీద కూలబడి, "బాబా ఇక్కడ ఉండి ఉంటే, ఆయన నా దాహం తీర్చడానికి ఖచ్చితంగా నీళ్ళు ఇచ్చేవారు" అని అన్నాడు. ఆ మాట విన్న ఖిర్విండికర్,  "ఉంటే, గింటే అనుకోవడం వల్ల ఉపయోగం లేదు. బాబా ఇక్కడ లేరు. ఆయన ఇక్కడుంటే ఏం జరుగుతుందో ఆలోచించి ఏం లాభం?" అని అన్నాడు. అతనికి మామూలుగా రక్తమాంసాలతో కూడిన కళ్ళు, స్థూల బుద్ధి మాత్రమే ఉన్నాయి కాబట్టి అతను విశ్వాసంతో కూడిన దృష్టితో చూడలేకపోయాడు. అతనికి అలాంటి దృష్ఠే ఉంటే, 'హరిశ్చంద్రగఢ్ కొండ మీదే కాదు, అంతటా బాబా ఉనికిని' గుర్తించగలిగేవాడు. అయితే అతని కంటే నానా కొంచెం మెరుగైన స్థితిలో ఉన్నాడు. అతనికి బాబాపట్ల ఉన్న విశ్వాసం వల్లనే 'రాళ్ళు రప్పలు ఉన్న కొండ మీద కూడా బాబా తనను రక్షించగలరనే' ఆలోచన వచ్చింది. కానీ, 'బాబా అక్కడ ఉన్నారని, తనకి నీరు అందిస్తారని' అతనికి ఖచ్చితంగా అనిపించలేదు. ఏదేమైనా నానాకొచ్చిన ఆ ఆలోచన చాలా బలంగా ఉంది. ఒకవేళ అది అంత బలంగా లేకపోయినా ఆ చిన్ని ఆలోచన బాబాకి చేరి తక్షణ ప్రభావాన్ని చూపుతుంది. ఆ ప్రభావాన్ని హరిశ్చంద్రగుట్ట మీద ఉన్న నానాగానీ, ఖిర్విండికర్‌గానీ చూడలేరు. కాబట్టి నానాకొచ్చిన ఆ ఆలోచనే ఒక స్విచ్‌లా పనిచేసి చమత్కారంగా పరిస్థితిని మలుపు తిప్పి అతనిని ఎలా కాపాడిందో తెలుసుకొనే ముందు భౌతికంగా బాబా ఉన్న శిరిడీలో ఏం జరిగిందో చూద్దాం.


హరిశ్చంద్రగఢ్ కొండపై నానా, "బాబా ఇక్కడ ఉండి ఉంటే, ఆయన నా దాహం తీర్చడానికి ఖచ్చితంగా నీళ్ళు ఇచ్చేవారు" అని అనుకున్న మరుక్షణంలో శిరిడీలో ఉన్న బాబా తమ దగ్గరున్న మాధవరావు దేష్పాండే మరియు మరికొంతమంది భక్తులతో, "నానాకి చాలా దాహంగా ఉంది. మనం అతనికి దోసెడు నీళ్ళు ఇవ్వోద్దా?" అని అన్నారు. బాబా సర్వాంతర్యామి. ఆయన దృష్టికి అన్ని ప్రదేశాలు, అన్ని కాలాలు గోచరిస్తాయి, ఆయన ప్రతిదీ చూడగలరు, వినగలరు. కానీ అటువంటి దృష్టి లేని ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు ఆశ్చర్యంగా, 'ఇక్కడ లేని నానా దాహం గురించి బాబా ఎందుకు మాట్లాడుతున్నారు? అయినా కలెక్టరుసాహెబ్ చిట్నిస్ దాహంతో ఉంటే దోసెడు నీళ్లేమిటి లీటర్ల కొద్దీ నీళ్ళు చాలామంది తక్షణం తెచ్చిపెడతారు. మరి బాబా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు?' అని అనుకున్నారు. వాళ్ళు బాబా మాటల్లోని ఆంతర్యాన్ని గ్రహించలేకపోయారు. బాబా కూడా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పదలచుకోలేదు. కానీ హరిశ్చంద్రగుట్టపై జరిగింది బాబా మాటలకు అర్థాన్ని వివరిస్తుంది. కాబట్టి హరిశ్చంద్రగుట్ట మీద ఏం జరిగిందో గమనిద్దాం.

 

నానా బాబాను తలుచుకున్న కొద్దిసేపటికి ఒక బిల్లుడు(కొండజాతివాడు) తలపై కట్టెల మోపుతో కొండ దిగుతూ నానా, అతని సహోద్యోగుల వైపుగా రావడం కనిపించింది. నానా అతన్ని పలకరించి, "నాకు దాహంగా ఉంది. త్రాగడానికి కొంచెం నీళ్లు దొరుకుతాయా?" అని అడిగాడు. నానా సహచరులు 'ఈ బ్రహ్మణ చిట్నిస్ అంటరాని వ్యక్తిగా పరిగణించే తక్కువ కులం వాడిని పలకరించి మరీ నీళ్ళు అడుగుతున్నాడేంటి?' అని ఆశ్చర్యపోయారు. కానీ అవసరానికి ధర్మశాస్త్రాలు తెలియవు. అసలు విషయానికి వస్తే, ఆ బిల్లుని సమాధానం కూడా అంతే ఆశ్చర్యాన్ని కలిగించింది. అతను, "ఏమిటీ! మీకు నీళ్ళు కావాలా? మీరు ఏ బండమీద అయితే కూర్చుని వున్నారో ఆ బండ కింద నీళ్ళు ఉన్నాయి" అని చెప్పాడు. వెంటనే నానా ఆ బండ మీద నుంచి పక్కకి జరిగితే అతని సహోద్యోగులు ఆ బండని పైకి లేపారు. అద్బుతం! అక్కడ ఒక మనిషి దాహం తీర్చడానికి సరిపడా చాలా స్వచ్ఛంగా, చల్లగా ఉన్న దోసెడు నీళ్లు ఉన్నాయి. నానా ఆ నీళ్లు తాగి తన దాహం తీర్చుకుని కృతజ్ఞతలు చెపుదామని ఆ బిల్లుని కోసం చూస్తే, అతనెక్కడా కనిపించలేదు. అతను నిశ్శబ్దంగా అదృశ్యమయ్యాడని గ్రహించిన నానా తన సహోద్యోగులతో, "నా బాబా చేసిన అద్భుతం చూడండి. ఆయన కూర్చున్న చోటనే నాకు నీళ్లు అందించారు. దానికోసం నేను ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం రాలేదు" అని అన్నాడు. ఆ అద్భుతానికి వాళ్లంతా ప్రత్యేక్ష సాక్షులు. తరువాత అందరూ కలిసి కొండ పైకెక్కి దేవీ దర్శనం చేసుకొని కిందకి దిగొచ్చి తమ యాత్రను పూర్తిచేశారు.


కొన్నిరోజుల తర్వాత ఛందోర్కర్ శిరిడీ వెళ్ళాడు. అతను ద్వారకామాయిలోకి అడుగుపెడుతూనే(హరిశ్చంద్రగుట్ట మీద అతనికి జరిగిన అనుభవం గురించి ఎవరికీ చెప్పకముందే) బాబా, "నానా! నువ్వు దాహంగా ఉన్నప్పుడు నేను నీకు నీళ్ళు ఇచ్చాను. నువ్వు ఆ నీళ్లు త్రాగావా?" అని అడిగారు. అది విని ఆనందాశ్చర్యాలతో నానా కళ్ళు విప్పారాయి. 'బాబా గురించిన తన ఆలోచనే ప్రార్థనగా పనిచేసిందని, ఫలితంగా బిల్లుడు కనిపించడం, నీరు ఎక్కడ ఉందో చూపడం, నీరు ఉండే అవకాశమే లేని బండపై నీరు కనిపించడం అంతా బాబా అనుగ్రహమేన'ని అతను భావించాడు. అదంతా ఎలా చేశారో, బాబాకి మాత్రమే తెలుసుకానీ నానాకి తన భావన సరైనదేనని తర్వాత శిరిడీలోని భక్తుల ద్వారా అతనికి నిర్ధారణ అయింది. మాధవరావు దేష్పాండే అతనితో, "పది, పదిహేను రోజుల క్రితం మీరు ఏదైనా సమస్యలో ఉన్నారా?" అని అడిగాడు. అప్పుడు నానా హరిశ్చంద్రగుట్ట మీద తనకి జరిగిన అనుభవం గురించి చెప్పాడు. భక్తులందరూ ఆశ్చర్యపోతూ, "అదేరోజు, అదే సమయంలో, 'నానాకి చాలా దాహంగా ఉంది. మనము అతనికి దోసెడు నీళ్ళు ఇవ్వోద్దా?' అని బాబా అన్నార"ని చెప్పారు. దాంతో నానాకి 'బాబా దయామయులు, సర్వాంతర్యామి, బండరాయి కింది నీటిని మరియు ఆ నీటిని సరైన సమయంలో చూపే వ్యక్తి కాగల సర్వశక్తిమంతులు, వారు దైవమే' అని అర్థమై బాబాని ఎంతగానో కొనియాడాడు. రోజురోజుకి బాబాపట్ల అతనికి విశ్వాసం వృద్ధి చెంద సాగింది.


అయితే, మనలో చాలామందికి సంబంధించిన దురదృష్టకరమైన వాస్తవమేమిటంటే, చాలామంది విద్యావంతుల మనసులు ప్రతిదీ అనుమానించి ఒక వ్యక్తికి జరిగిన అనుభవాన్ని అందరికీ ఎలా వర్తింపజేస్తారని తర్కిస్తుంటాయి. ఆ తర్కవేత్తలకు నానా అభిప్రాయం చాలా బలహీనంగా కనిపించవచ్చు. వాళ్ళు ఒక వ్యక్తిగత ఉదాహరణ అందరికీ వర్తిస్తుందన్న హామీ ఇవ్వదని, అలాంటి ప్రతిపాదనను నిరూపించలేదని వ్యాఖ్యానిస్తారు. వాళ్లకు ఎప్పటికప్పుడు అనుమానాలు ఉత్పన్నమావుతూనే ఉంటాయి. బాబా సహాయానికి సంబంధించి 150 అనుభవాలు పొందిన తర్వాత కూడా 151వ సారి సహాయం పొందినప్పుడు 'ఇది కాకతాళీయంగా జరిగిందా? బాబా సహాయమా?'' అనే నీచమైన ఆలోచన అంత తేలికగా వదిలిపెట్టదు. అదృష్టవశాత్తూ బాబా అనుగ్రహం వల్ల మనలో చాలామందికి విశ్వాసమనే ఆధారం కొంతైన ఉంది, కాబట్టి మనం క్రమంగా సందేహిస్తూ, సందేహిస్తూ ఉండే ధోరణిని శాశ్వతంగా దూరం చేసుకుంటాము. అలా కాకుంటే, మనం 'సమస్యాత్మలం' అవుతాము. అనగా మన స్వభావంలో సందేహం అనేది స్థిర లక్షణంగా మారి సంశయించడం సహజ ప్రవృత్తి అయిపోతుంది.


అజ్ఞశ్చాశ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి।

నాయం లోకోఽస్తి న పరో న సుఖం సంశయాత్మనః।।


భగవద్గీత 4వ అధ్యాయంలోని ఈ 40వ శ్లోకంలో 'సంశయాత్మా వినశ్యతి' అంటే సందేహిస్తూ, సందేహిస్తూ అనంతంగా సాగిపోయే ఆ ప్రవాహంలో మనిషి నశించిపోతాడు అని. భౌతిక శరీరానికి సంబంధించినంతవరకు 'నశించిపోవడం' అంటే 'చనిపోవడం' అని అనుకుంటాం, కానీ దాని అర్థం అది కాదు. ఎవరికైతే విశ్వాసం లేదో వాళ్ళు చచ్చిపోయినట్లే, విశ్వాసం లేని మనిషి శ్వాసిస్తున్న శవం. మామూలు ప్రాపంచిక విషయాలలో కూడా దేనినైనా విశ్వసించే మన సామర్థ్యం ఎంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుందో మనం ఈ క్రింది ఉదాహరణ ద్వారా తెలుసుకోవచ్చు. కొత్త ప్రదేశంలో రైల్వేస్టేషన్‌కు చేరుకోవడానికి మనం దారిలో ఒక అరడజను చోట్ల స్టేషన్‌కు వెళ్లే దారి అడిగి, సమాధానాన్ని పొందుతాం. కానీ ప్రతి సమాధానాన్ని సరైనదో, కాదో అని సందేహిస్తుంటాం. అలాంటప్పుడు మనమెప్పుడూ సమయానికి స్టేషన్ చేరుకొని రైలు అందుకోలేము. ఇదే 'సంశయాత్మా వినశ్యతి' అన్న దానికి అర్థం. అదృష్టవశాత్తూ నానా 'సంశయాత్మ' కాదు, అతను శ్రాద్ధాత్మ.


శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః।

జ్ఞానం లబ్ధ్వా పరామ్ శాంతిమచిరేణాధిగచ్ఛతి।।


ఇది భగవద్గీత 4వ అధ్యాయంలోని 40వ శ్లోకం. దీనర్థం విశ్వాసం ఉన్న వ్యక్తి జ్ఞానం పొందుతాడు, తన ఇంద్రియాలను నియంత్రించి తద్వారా మనసును సమర్థవంతంగా ఆ జ్ఞానంపై నిలిపి, అదే తన జీవిత లక్ష్యంగా భావించి విజ్ఞానాన్ని, ఆపై తొందరలోనే పరమశాంతిని పొందుతాడు. ఇది నానా విషయంలో స్పష్టమైన అన్వయం. అతనికి సంశయించే స్వభావం తక్కువగా ఉన్నందున అతను సందేహాలతో తర్కంలో పడలేదు. అతని వరకు అతని ఆలోచనే సహాయం కోసం ప్రార్థన అయి విషమ పరిస్థితుల్లో తన ప్రాణాలు కాపాడటానికి అవసరమైన నీళ్లు అందించింది. కాబట్టి బాబా తన ఆలోచనకు ప్రతిస్పందించారనడంలో అతనికి ఏ సందేహమూ లేదు. అందువలన అతనికి బాబాపట్ల విశ్వాసం కుదిరి ఇంకా ఇంకా వృద్ధి చెందుతూ బాబాకు మానవాతీత శక్తులున్నాయని, వారిది మానవాతీత ప్రేమ అని, వారు తాము ప్రేమించేవారి, తమతో అనుబంధమున్నవారి అవసరాలను మనవాతీతంగా తీర్చగలరని నానాకి నమ్మకం దృఢమైంది. తద్వారా బాబా నిజంగా భగవంతుడని, తన ప్రాపంచిక, ఆధ్యాత్మిక అవసరాలన్నింటికీ బాధ్యత వహించడానికి ఆయన చాలా చక్కగా సరిపోతారని అతను తెలుసుకొన్నాడు. దాంతో అతను సాయి గురుదేవునికి శరణాగతి(ప్రపత్తి) చెందడానికి, వారి ఆదేశానుసారం నిస్సంకోచంగా తనను తాను సమర్పించుకోవడానికి సంసిద్ధుడయ్యాడు. తద్వారా తనకి ఎటువంటి హాని జరగదని, అంతా మంచే జరుగుతుందని ఖచ్చితమైన అభయం లభించి, బాబా అనుగ్రహం వల్ల మరింత జ్ఞానాన్ని పొంది అన్ని ఆధ్యాత్మిక సాధనాల లక్ష్యమైన పరమశాంతి వైపుగా త్వరితగతిన అభివృద్ధి చెందసాగాడు.


తండ్రి గురువు బ్రాహ్మణుడు – కొడుకు గురువు ముస్లిం - చూడదగ్గ వింత దృశ్యం:

 

నానాసాహెబ్ తండ్రి కవాడ్ సఖారామ్ మహారాజ్ వద్దకు వెళ్తుంటే నానాసాహెబ్ శిరిడీలోని బాబా వద్దకు వెళ్తుండేవాడు. సఖారామ్ మహారాజ్ బ్రాహ్మణుడు అయితే బాబా ముస్లిం(ఆ రోజుల్లో దాదాపు అందరూ అలానే భావించేవారు). ఈ రెండు విషయాలను ఎలా సమన్వయం చేసుకోవాలి? అయితే నానాసాహెబ్ అప్పటికి చిన్నవాడు ఏమీ కాదు, బిఏ పట్టభద్రుడై ఉద్యోగం చేస్తున్నాడు. ఒకానొక సమయంలో నానాసాహెబ్ చందోర్కర్ తండ్రి గోవిందరావు ఏదో కారణం చేత ముస్లింలతో విరోధించి, ‘ఈ రోజు నుండి ఏ ముస్లిం ఇంటికి వెళ్ళకూడదని, తమ ఇంటికి ముస్లింలను రానివ్వకూడదని’ నిర్ణయం తీసుకున్నాడు. అదే సమయంలో నానా సెలవు మీద కళ్యాణ్ వచ్చాడు. ఇంటికి వెళ్ళగానే తన తండ్రి నిర్ణయం నానాకి తెలిసింది. అతనికి కళ్యాణ్‌లో చాలామంది ముస్లిం స్నేహితులున్నారు. అదీకాక అజ్ఞాన జనులు బాబాని ఆ రోజుల్లో ముస్లింగానే భావించేవారు. అందువల్ల నానా ఎటూ తోచిన స్థితిలో పడ్డాడు. అతని మనసు చాలా అశాంతికి గురైంది. తప్పనిసరైతే ముస్లింలందరితో సంబంధాలు తెంచుకోవడానికి సిద్దమేకానీ, బాబాతో అనుబంధాన్ని వదులుకోవడం నానాకి అస్సలు ఇష్టం లేదు. అదే సమయంలో తన తండ్రి నిర్ణయాన్ని ధిక్కరించడం కూడా అతనికి ఇష్టం లేదు. అటువంటి సందిగ్ధ స్థితిలో నానా ఎంతో మానసిక సంఘర్షణకి గురై చివరికి ఎటూ తేల్చుకోలేక తన తండ్రితో మాట్లాడాలనుకొని నెమ్మదిగా తన తండ్రిని, “నేను ముస్లింల దగ్గరకి వెళ్ళకూడదా?” అని అడిగాడు. అందుకు అతని తండ్రి, “నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళు. కానీ వాళ్ళని మన ఇంటికి తీసుకొని రావద్దు” అని అన్నాడు. అప్పుడు నానా, “మంచిది” అని బాబాతో తనకున్న ప్రత్యేక అనుబంధం గురించి చెప్పి, “నేను శిరిడీలోని సాయిబాబా దగ్గరకు వెళ్తాను. బాబా ముస్లిం కాబట్టి ఆయన దగ్గరకు వెళ్ళకూడదా?” అని అడిగాడు. అతని తండ్రి, “నువ్వు ఆయన దగ్గరకి వెళ్ళు. సఖారాం మహారాజ్ నాకు గురువైనట్లే సాయిబాబా నీ గురువు. కాబట్టి ఆయన ముస్లిం అయినా కూడా నువ్వు వెనుకాడకుండా ఆయనని దర్శిస్తూ ఉండు" అని చెప్పాడు. అది విని 'బాబా చాలా చమత్కారంగా తన తండ్రి మనసుని మార్చేసి, వారి దర్శనానికి నాకు ఎటువంటి ఆటంకం లేకుండా చేసార'ని నానాసాహెబ్ సంతోషంతో పొంగిపోయాడు, అతని కళ్ళు ఆనందబాష్పాలతో నిండిపోయాయి. సమస్యను శాంతియుతంగా పరిష్కరించిన బాబాకి మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకున్నాడు.


source: లైఫ్ ఆఫ్ సాయిబాబా(రచన: శ్రీబి.వి.నరసింహస్వామి)
 సాయిలీల మ్యాగజైన్స్  - 1986 మరియు 2009.
సాయిబాబా(రచన: శ్రీసాయి శరణానంద)

బాబాస్ వాణి, బాబాస్ అనురాగ్(రచన: విన్నీ చిట్లురి).




 


ముందు భాగం కోసం
బాబా పాదుకలు తాకండి.




 

నిర్ధిష్టమైన భాగం కోసం పైన నెంబర్లను తాకితే, ఆ నెంబరుకి సంబంధించిన భాగం ఓపెన్ అవుతుంది.

 


తరువాయి భాగం కోసం
బాబా పాదాలు తాకండి.

 


9 comments:

  1. ఓం సాయి రామ్ ఈ రోజు శుభ గురువారం బాబా నాకు ఒక సాయం చేయండి.నేను ఈ రోజున మీ ఆశీస్సులతో కొత్త డాక్టర్ దగ్గరికి వెడుతున్నాను.నా వెంట వుండి నాకు సహాయం చేయండి.నాకు మనశ్శాంతిని యివ్వడం.ఈ జన్మ కి మీ కు రుణం పడి వుంటాను

    ReplyDelete
  2. Om sairam 🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  3. ఓం సాయిరామ్

    ReplyDelete
  4. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  5. Baba, bless my children and fulfill their wishes in education. Give me good health.

    ReplyDelete
  6. Omsaisri Sai Jai Sai 🙏🙏🙏🙏🙏🙏🙏 kapadu Tandri 🙏🙏🙏🙏

    ReplyDelete
  7. ఓం శ్రీ సాయి రామ్ సమర్థ గురు సచ్చిదానంద సాయినాథ్ మహారాజ్ కి జై

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo